Friday, 15 January 2016

నిశ్శబ్దం బద్దలైంది!!! ( రోమిలా థాపర్ ఇంటర్వ్యూ)


రోమిలా థాపర్ ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీ చరిత్ర విభాగంలో గౌరవ అధ్యాపకురాలు. ఆమె బ్రిటిష్ అకాడమీలో పరిశోధకురాలు కూడా. 2008లో ఆమె అమెరికా గ్రంధాలయ సంస్థ నుండి ప్రతిష్టాపకమైన క్లుగే బహుమతి యిచ్చారు. నోబెల్ అవార్డు పరిగణలోకి తీసుకోని చరిత్ర లాంటి అంశాలలో అమెరికా గ్రంధాలయ సంస్థ  జీవిత సాఫల్యత అవార్డును యిచ్చి ఆమెను గౌరవించింది.


http://www.ndtv.com/video/player/the-buck-stops-here/violent-fringe-groups-are-terrorists-call-them-that-romila-thapar-to-ndtv/386987?hp&video-featured
రొమిలా థాపర్ ఎన్డిటివీకి యిచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్య అంశాలు. _______________________________________________                                                
పరిచయ కర్త : మీ పుస్తకంలో ఒక చోట... గొంతుకలు వినిపించాల్సిన సమయాల్లో- నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అని  ఉంది. మీరింత నిరాశగా   ఉన్నారా? బుద్దిజీవులు ఆగ్రహం చూపించడంలో విఫలమయ్యారని మీ ఉద్దేశ్యమా?
రోమిలా: ఈ పుస్తకం(ది పబ్లిక్ ఇంటలెక్చువల్ ఇన్ ఇండియా) నిరుడు రాసినది, అప్పుడు ఈ ‘నిశ్శబ్దం’ మరింత చిక్కగా ఉండేది. ఐతే గత కొద్ది వారాలుగా సాగుతున్న విషయాలు ఆశాజనకంగా ఉన్నాయి. నిశ్శబ్దం బద్దలైందని మాత్రం రూడి గా చెప్పవచ్చు. 
మేధావుల కొరత మనకు  ఏనాడూ లేదు, కానీ ‘వాసిని మార్చేటంత శక్తి గల రాశి’ అనదగ్గ  క్రిటికల్ మాస్ గా వారు రూపొందాలి. అలా వారు సామూహికంగా వ్యక్తీకరించుకునెందుకు తగిన వేదిక మాత్రం ఉండడం లేదు. ఆలోటు తీరే దిశగా అడుగులు పడుతున్నాయని భావిస్తున్నాను.
ప.క: ఈ రచయితలు సాహిత్య అకాడెమీ అన్న సంస్థను వ్యతిరేకిస్తున్నారు కానీ ప్రభుత్వాన్ని కాదని కొంతమంది అభిప్రాయం. మీరేమంటారు?
రో:  సాహిత్య అకాడెమి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా మారాలనే అభిలాష చాలా మందికి ఉంది. అది ఒక్కటే కాదు, చారిత్ర్రక పరిశోధనా సంస్థ, సాంఘిక శాస్త్ర పరిశోధనా సంస్థ, ఐఐటిలు, ఐఐఎంలు .. ఇలాంటి కీలకమైన సంస్థలు స్వయం పాలనాధికారంతో ఉండాలని పదేళ్ళక్రితమే మేమంతా గట్టిగా వాదించాం. కానీ ఏమీ జరగలేదు. అవి ఈనాటికీ ప్రభుత్వం చెప్పుచేతల్లోనే ఉన్నాయి. కనుక సాహిత్య అకాడెమి నిర్ణయాలను నిరసించడమంటే, ప్రభుత్వ ధోరణులను వ్యతిరేకించడమే అనడంలో సందేహం లేదు. 
ప.క: భావప్రకటనా స్వేచ్చ అందరితో పాటూ రచయితలకూ ఉంది కానీ, పురస్కారం వెనక్కివ్వడమంటే భారత రాజ్యాన్నిఅగౌరవపరచడం అని కొంతమంది అంటున్నారు. ఈరచయితల చర్యను రాజ్య ధిక్కారం కింద పరిగణించే వారికి  మీరేం చెప్తారు?
రో: అది సరి కాదు, ప్రభుత్వమూ. రాజ్యం ఒకటే అనుకోడం తప్పు. ఈ రచయితలూ నిర్వహిస్తున్నది- సమాజంలోని పరిస్థితులపై ఆందోళన తప్ప రాజ్య ధిక్కారం ఎంతమాత్రమూ కాదు. ఒక మంచి ప్రభుత్వ పాలన ఇటువంటి దుస్థితిని నివారించి ఉండేది అనే విషయం మనం గ్రహించాలి.
ప.క: విద్యా సంస్థలనుండీ, తోటి విద్యావేత్తల పురస్కారాలు తప్ప స్వీకరించనని మీరు నిర్ణయించుకున్నారు, రెండు సార్లు పద్మ పురస్కారాలను కూడా నిరాకరించారు. మరి మీ దృష్టిలో అవార్డుల తిరస్కారం దేనికి సంకేతం?
 పద్మ పురస్కారాలతో సహా ఈ అవార్డులన్నీ పేరుకు మాత్రమే రాజ్య పురస్కారాలు, ఆచరణ లో వీటిని మనం ప్రభుత్వ గుర్తింపుల కింద మార్చేసాం. ఉదాహరణకు నాలాటి వారికి  బిజేపీ ప్రభుత్వమూ పద్మ పురస్కారం ఇవ్వబోదని మనం ఖచ్చితంగా ఊహించవచ్చు. రాజ్యమూ, ప్రభుత్వమూ – వీటి మధ్య విభజన మన సమాజం పాటించడం లేదు అన్న విషయం స్పష్టం గా తెలుస్తోంది కదా. 
ప.క: ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకదిశలో ఒక ప్రశ్నవేస్తాను. ప్రజల మీద అమితమైన ప్రభావం చూపే సోషల్ మీడియా వంటి అంశాలు ఈనాడు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. మరి ఈ నేపధ్యంలో ‘పబ్లిక్ ఇంటలేక్చువల్’ కు అసలు మనం ఎంత పాటి ప్రాధాన్యత నీయవచ్చు?
రో: పబ్లిక్ ఇంటలేక్చువల్’ (ప్రజా మేధావి) అని ఎవరిని అంటాం అంటే ....
మొదటి అర్హత  ...తానెన్నుకున్నరంగంలో నిష్ణాతుడై, తోటివారి గౌరవాన్ని  పొందుతున్నవాడు, ఆ కారణం చేత జరుగుతున్న విషయాలపై తన అభిప్రాయాలనుసాధికారంగా నిరూపించ గలిగినవాడు. రెండవది మానవహక్కుల పట్లా, సాంఘిక న్యాయం పట్లా నిబద్ధత కలిగిన వ్యక్తి. పై రెండు లక్షణాలూ కలిగిన బుద్దిజీవినే నేనుపబ్లిక్ ఇంటలేక్చువల్’ అని అంటున్నాను. అతను వర్తమాన విషయాలను అర్ధం చేసుకుని, సామాన్యుడికి అర్ధం అయ్యేలా వివరిస్తాడు.
ఇప్పుడు ‘బీఫ్ తినడం’ అనే ఒక్క అంశం .. సాంఘికపరమైన, కులపరమైన అనేక చిన్న చిన్న అంశాల సమాహారం. బీఫ్ ఎగుమతి, మాంసం కొట్టే పని, తోలు పనీ అలా ఎన్నో జీవనోపాధులు దానిలో ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నదేమిటంటే, ప్రతీ ఒక్క విషయాన్నీ రాజకీయపు నిర్ణయంగానే, రాజకీయ పార్టీల కోణం నుండి మాత్రమే  మనం చూడడానికి అలవాటు పడిపోతున్నాం. వేరే కోణాలూ, పార్శాలు కూడా ఉంటాయని తెలియజెప్పి, వాటిని ప్రజలకు పరిచయం చేసే అవసరం చాలా ఉంది. ఆ పనినే  ‘పబ్లిక్ ఇంటలేక్చువల్’ చెయ్యాలని నేను భావిస్తున్నాను.
ప.క: కానీ మీరనే రాజకీయపు ‘రొద’ లో పబ్లిక్ ఇంటలేక్చువల్’ చెప్పే వాస్తవాలు ఎవరికి వినిపిస్తాయి? గోవధా, గోమాంస భక్షణ రెండూ మన ప్రాచీన చరిత్రలో ఉన్నాయని, ఇంతక్రితం కూడా కొంతమంది చరిత్రపరిశోధకులు తమ  ఇంటర్వ్యూ లలో చెప్పారు. కానీ ఆ మాటను బీజేపియే కాదు, మరే పార్టీ కూడా చెవిన పెట్టదు. బీఫ్ మీద బాన్ ను మొదట మేమే ప్రతిపాదిం చాం అని దిగ్విజయ్ సింగ్ సగర్వంగా ప్రకటిస్తున్నాడు కదా?

రో: మీ మీడియా వారు రాజకీయ పక్షాల నడిగాం అంటున్నారు సరే, మరి సామాన్య పౌరుడిని అదే ప్రశ్న అడిగారా? బీఫ్ తినడం గురించి అతనేమనుకుంటున్నాడో వరసగా  ప్రోగ్రాములు మీడియా ప్రసారం చేసిందా?
 ప్రభుత్వ స్థాయిలో ఒక బాన్ అమలు జరిగిందీ అంటే వివిధ దిశల్లో దానికి అనుసంధానమై వచ్చే పర్యవసానాల జాబితా చాలా విస్తృతంగా ఉంటుంది. ఆ బాన్ తాకిడికి గురయ్యేది ఎవరెవరని పరిశీలనలు జరగాలి. ‘మీరు బాన్ ని సమర్ధిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారా’ అని కాదు ప్రశ్నలు రావలసినది . చర్చలతో, వివరణలతో ప్రజాభిప్రాయాన్ని నిర్మాణమ్  జరగాలి. ఆ పనిలో  మీడియా సహాయం తో ‘పబ్లిక్ ఇంటలేక్చువల్’ గురుతర బాధ్యతను నిర్వహించగలడు.   
ప.క: ఆ పాత్ర ను ‘పబ్లిక్ ఇంటలేక్చువల్’  ఏ రకమైన భయం లేకుండా నిర్వహించే పరిస్థితులు ఉన్నాయంటారా? మీ వరకూ మీరు చాలా వ్యతిరేక ప్రచారానికి గురయ్యారు కదా, మీరు ఏదైనా చెప్పేందుకు ఇప్పుడు సంకోచిస్తారా?
రో: ఆ రకమైన భయాలకు నేనెప్పుడో స్వస్తి చెప్పాను, నేను స్త్రీ ననే కారణం చేతనూ, నా భావాల మీద వ్యతిరేకతతోనూ చాలా ద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, కానీ నా వ్యక్తిగత నిర్ణయం భావ ప్రకటనే.
అది పక్కన పెడితే, నిన్న జరిగిన (కులకర్ణి పై పెయింట్ పోసిన) సంఘటన దుస్సహమైనది. అటువంటి చర్యలకు పాల్పడిన వారిని తగినట్టూ శిక్షించడం లేదు. ఈ రకమైన చర్యల పూర్తి అర్ధం అంచనా కట్టలేక పోవడం వల్ల ప్రజలు కూడా దీనికి తగిన వ్యతిరేకత చూపడం లేదు.
పుస్తకపు ఆవిష్కరణ మధ్యలో ఆగిపోలేదు, అది ఒక చిన్న విజయమే కానీ ఈ పెయింట్ ఉదంతపు పూర్వాపరాలపై  విమర్శ జరగాలి. శివసేన, బీజేపీ రెండూ మిత్ర పక్షాలుగా ఉండేవి కదా, మరి ఇప్పుడు బీజేపీ సమర్ధన ఎటుంది? భద్రతా ఏర్పాట్లు జరిగినప్పటికీ ఇంత అవాంతరం ఎలా సంభవించింది? భద్రతా దళాలు ఎవరి పక్షాన ఉన్నారు? ఇటువంటి ప్రశ్నలెన్నో ఉత్పన్నం ఔతాయి. అన్నిటి కంటే ముఖ్యమైన విషయం, మన దేశాని కొక విదేశాంగ విధానం ఉంటుంది. ఎలాటి పరిస్థితుల్లోనూ, ఒక కనీస స్థాయి సంబంధాన్ని మన పొరుగు దేశంతో మన దేశం నిలబెట్టుకునే తీరాలి. ఆ విషయం ప్రజలకు స్పష్టంగా తెలియజెప్పాలి. 
ప.క: సిక్కుల ఊచకోత జరిగినప్పుడు ఎందుకు అవార్డు తిరస్కరించలేదని నయనతారా సెహగల్ పై విమర్శలు వస్తున్నాయి. బహుశా ఆమె ఎమర్జేన్సిని కూడా ఖండించిన విషయం వారికి తెలిసి ఉండదు. కానీ గతంలో కూడా ఖండిన్చవలసిన పరిస్తితులు వచ్చాయన్నది వాస్తవమే కదా? అప్పటి కంటే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా వేరు అని మీరు భావిస్తున్నారు?   
రో: రెండిటి చారిత్రక సందర్భాలు భిన్నమైనవి. ఎమర్జెన్సీని కూడా ఎవరి ధోరణిలో వారు ఖండించాం. ప్రజాస్వామిక వాది అయిన ఇందిరాగాంధీ చేసిన ఒక తప్పిదంగా ఎమర్జెన్సి ఆమెకు  అనిపించింది, కానీ ప్రస్తుత పరిస్థితి ఆమెకు నియంతృత్వ పాలనగా కనిపిస్తోంది.
ప.క: అదే కారణంతో బీజేపీ ఆమె తిరస్కరణను రాజకీయ చర్యగా అభివర్ణిస్తోంది. స్వప్నదాస్ గుప్త, ఆమె నిరసన మోదీ వ్యతిరేకత నుండి పుట్టినదని వ్యాఖ్యానిస్తున్నారు. మీరేమంటారు? 
రో: లేదు, ఆ వ్యాఖ్య నిరాధారమైనది. మీరొకప్పుడు ఎందుకు ఆందోళన జరపలేదని వ్యక్తుల మీద నెపం వెయ్యడం సహేతుకం కాదు, పరిస్తితులను సందర్భానుసారం విశ్లేషించుకోవాలి.
మన సంఘానికి అప్రజాస్వామికత’ కన్నా కూడా పెద్ద ముప్పు ఒకటి పొంచి ఉంది. ‘మత అసహనం’ ఈనాడు తీవ్రవాద ధోరణులను సంతరించుకుని, ప్రస్తుత సమాజాన్ని అధికారీకృత రాజ్యంగా మార్చేసే పని లో ఉంది. ‘అభివృద్ధి’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీలో, పైకి కనిపించని విచ్చిన్న శక్తులు- టెర్రరిస్ట్ ల రూపం తీసుకున్నాయి.
ప.క: వారిని టెర్రరిస్ట్ లని అంటున్నారా! ఎందుచేత?
రో: వారు అదే పని చేస్తున్నారు. మనుషుల ముఖాలపై పెయింట్ పూయడం, హత్యలు చెయ్యడం, ప్రజలను భయభ్రాంతులను చెయ్యడం - ఈ పనులు చేసేవారు టెర్రరిస్ట్ లే.
ప.క: శివసేన చేసిన పనులను సమర్ధించలేము కానీ అది ఎన్నికలలో ప్రజల వోట్లు సంపాదించిన పార్టీ కదా... టెర్రరిస్ట్ అనడం సమంజసమేనా?
రో: నేను మొత్తం పార్టీని టెర్రరిస్ట్ లనడం లేదు. అలాగే బీజేపీ విషయం కూడా, మొత్తం టెర్రరిస్ట్ లనడం నా ఉద్దేశం కాదు, కానీ దానితో పొత్తు పెట్టుకున్న కొన్ని సమూహాలూ, సంఘాలూ ఉన్నాయి.
ప.క: దాబోల్కర్, కాల్బుర్గీ ఉదంతాలకు కారణమని విచారణ జరుగుతున్న ‘సనాతన సంస్థ’ వంటివనా మీ అభిప్రాయం?
రో: ఔను, ఇస్లామిక ఛత్రం లో కొన్ని సంస్థలను టెర్రరిస్ట్ లంటాం కదా, వారిలాగే వీరూ చంపడం, ప్రజల జీవితాలకు ఆటంకాలు కలుగజేయడం... ఇటువంటి పనులకే పాల్పడుతున్నారు. ప్రజల వేషధారణలో, తినే తిండి విషయంలో, వారి రాకపోకల్లో అనవసరపు జోక్యం కలిగించుకుంటున్నారు. వారిని ఇక చెదురు మదురు భావాల గుంపులూ, తీవ్ర భావాల అల్పసంఖ్యాకులూ అని అనుకోకూడదు,
ఈ సంఘాలు, ఒక ప్రత్యేక తరహా రాజకీయ వ్యవస్థను పట్టుకుని వేలాడే విచ్చిన్న శక్తులు. వాటి భావజాలాలనూ, కార్యకలాపాలనూ గుర్తింఛి, సరైన పేరుతొ వాటిని పిలిచే సమయం ఆసన్నమైంది. అవి ప్రభుత్వాలను తోసిరాజని తామే పాలక నిర్ణయాలు చేస్తూ ఉంటే మనము వాటిని అనుమతిస్తామా? ఈ పాలన కోసమేనా మీకు వోటు వేసినది అని ప్రభుత్వాన్ని నిలదీసి ఈ శక్తులను అడ్డుకుంటామా? 
ఇంకా తరువాత జరిగిన చర్చలో ‘చరిత్రరచన’ చుట్టూ అల్లుకుంటున్న వివాదాల ప్రసక్తి రాగా, రోమిలా ఇచ్చిన  వివరణ లో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:
1818 లో జేమ్స్ మిల్ “ది హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా” అనే పుస్తకం లో భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ కాలాలు గా విడగొట్టాడు, హిందూ ముస్లిము లెల్లప్పుడూ వైరులు గానే ఉండేవారనీ, బ్రిటిష్ వారు వచ్చి శాంతి స్థాపన చేసి వీరిని రక్షించినట్టుగా ఆ పుస్తకంలో ఆయన రాసాడు. ఆ వలసవాదపు ప్రతిపాదనలనే ఆనాటి నుండీ ఈనాటి వరకూ ముస్లిం వేర్పాటు వాదులూ, హిందూ రాష్ట్ర నిర్మాణ వాదులూ  కొనసాగిస్తున్నారు.
చరిత్రను తప్పుగా అందించడం వలన వచ్చే అనేక ప్రమాదాలలో ఇది ఒకటి మాత్రమే. పూర్వం ‘చరిత్ర’ అంటే ‘ఇండాలజీ’ (భారతదేశానికి సంబంధించిన విషయాలు) అనే అర్ధం లో వాడేవారు. గత యాభై ఏళ్లగా చరిత్రను సాంఘిక శాస్త్రాలలో భాగం గా మారిన తర్వాత దాని పరిధి విస్తృతమయిన్ది. పాత కథల్లోని పాక్షిక సత్యాల గురించి చరిత్ర చర్చించడం కొంతమందికి కంటగింపుగా ఉంది. అందుకే ‘చరిత్ర రచన’ను  ఒక ప్రముఖ వ్యూహంగా మేధావులు గుర్తిస్తున్నారు.      

Wednesday, 6 January 2016

"నేను జితేందర్ భార్య రేఖను, చర్మకారుల కులానికి చెందినదానిని!"


      హర్యానా దళిత పిల్లల సజీవ దహనం పై నిజనిర్ధారణ.                                     హర్యానా రాష్ట్రంలో, ఫరీదాబాదు జిల్లాకు చెందిన, సున్పెద్ గ్రామంలో ఒక దళిత కుటుంబం మీద ప్రాణాంతకమైన దాడి జరిగింది. ఇద్దరు చిన్న పిల్లలు సజీవదహనం అయ్యారు. తీవ్ర దుఃఖావేశం కలిగించిన ఈ సంఘటన జరిగిన తరువాత జాతీయ దళిత మానవ హక్కుల ప్రచారకమిటీ మరియు జాతీయ దళిత న్యాయ పోరాటం కలిసి నిర్వహించిన నిజనిర్ధారణ రిపోర్టు

సున్పెద్ లో, 2015అక్టోబర్ 19న, జాగరణ (ఒక భజన వంటిది) జరిగినది. దాల్చంద్ కుమారుడు జితేందర్, జితేందర్ భార్య రేఖా, వారి ఇద్దరి పిల్లలతో ఆ జాగరణకు వెళ్లి, అచ్చట నుండి త్వరగా ఇంటికి వచ్చారు. కిటికీకి పక్కనున్న మంచం మీద నిద్రకు ఒరిగారు. కిటికీ తెరిచి ఉన్నది. తెల్లవారుజామున 2:30కి, ఘాటైన పెట్రోలు వాసనతో జితేందర్ మేలుకున్నాడు. కిటికీ బయట నించున్న మనుషులు కుటుంబసభ్యుల మీద పెట్రోల్ పోయడం కనిపించింది. అతను భార్యను లేపేటంత లోపే మంటలు చుట్టుముట్టాయి. మంటలను తప్పించుకునే వీలు లేకుండా గదికి ఉన్న రెండు ద్వారాల తలుపులూ బిగించి ఉన్నాయి. జితేందర్, రేఖల పది నెలల వయసు కూతురు దివ్యా, సంవత్సరంన్నర వయస్సున్న కొడుకు వైభవ్ మంటలలో చిక్కుకుని మరణించారు.

కొన్నివార్తా సంస్థలు, ఆ పిల్లలు డెబ్భై శాతం పైన కాలిన గాయాలతో మరణించారన్నవిషయం చెబ్తున్నాయి. 

వారి తల్లి రేఖ సఫ్ దర్జంగ్ ఆసుపత్రిలో ఇప్పటికీ విషమస్థితిలోనే ఉంది. వారి తండ్రి జితేందర్ చేతుల పైన కాలిన గాయాలతో, ఆసుపత్రి నుండి బయటపడి ఫరీదాబాదులోని సున్పేడ్ గ్రామంలో ఉన్నాడు.
ప్రస్తుత సంఘటన గురించిన వివరాలలోకి వెళ్ళే ముందు ఆ కుటుంబం గురించీ, గ్రామ పరిసరాలకు సంబంధించీ –సాంఘిక, ఆర్ధిక, రాజకీయ భూమికలను పరిశీలించడం ఆవశ్యక మౌతున్నది. అప్పుడే, ఈ దళిత కుటుంబం సున్పెద్ గ్రామంలో జీవించేందుకు వీలు లేకుండా చేసిన పరిస్థితుల పూర్తి సమాహారాన్ని మనం అర్ధం చేసుకోగలం.
ఈ సంఘటన కు ‘రెండు కుటుంబాల కలహం’ కారణమనీ, కుల ప్రసక్తి లేదనీ - కొన్ని వార్తాసంస్థలూ, క్షత్రియ, బ్రాహ్మణ, రాజపుత్రుల కూటమి ఐన మహాపంచాయత్ పేర్కొన్టున్నాయి. మేము సున్పెద్ గ్రామంలో రాజపుత్రుల నిస్సందేహమైన ఆధిపత్యాన్ని గమనించాక, ఈ కథనాలు పూర్తిగా అబద్ధమని తేలాయి. కనక ఈ పోరాటం - సమానుల మధ్య జరుగుతున్నది కాదూ, కుల ప్రమేయం లేనిది కూడా కాదు!
హర్యానాలో, ప్రీత్ల నియోజకవర్గానికి చెందిన ఫరీదాబాదులో ఈ సున్పెద్ గ్రామం ఉంది. దానిలో 250కి పైగా రాజపుత్ర కుటుంబాలూ, 15 వాల్మీకి కుటుంబాలూ, 80 చర్మకారుల కుటుంబాలూ, ఇంకా మరికొన్ని ఇతర కులాల కుటుంబాలూ ఉన్నాయి. గ్రామంలో అత్యధిక భూభాగం రాజపుత్ర కుటుంబాలకు చెందినదీ లేదా వారి ఆధీనంలో ఉన్నదీ. ప్రభుత్వ సంస్థల్లో కూడా వారి మాటే చెల్లుబడి అయ్యే పరిస్థితి. పాఠశాలలూ, కాలేజీలూ, బాంకులూ మొదలైన ఆధునిక సౌకర్యాలున్న ప్రాంతమిది. ఫరీదాబాదు నగరానికి సమీపంలో ఉండడం గ్రామం మీదా, దాని రూపురేఖల మీదా ప్రభావం చూపింది. నగర వాతావరణానికి తగ్గట్టూ గ్రామం మారుతూ వస్తున్నట్టు తెలుస్తోంది.
జితేందర్, అతని కుటుంబమూ చర్మకారుల కులానికి చెందిన వారు. వారు తమ కృషితోనూ, పట్టుదలతోనూ, విద్యార్జన చేయగలిగారు, ఆర్ధికంగా కొంత నిలదొక్కుకో గలిగారు. ఉదాహరణకు జితేందర్ ఒక క్లినిక్ లో కాపౌండర్ గా పనిచేసేవాడు. జితేందర్ బంధువు జగ్మల్ 2010లో సర్పంచ్ గా ఎన్నికైయ్యాడు. ఆ కుటుంబానికి చెందిన వారిలో ఇంజనీర్లూ, అడ్వకేట్లూ, ప్రభుత్వోద్యోగులూ ఉన్నారు. జితేందర్ బంధువు హిర్దేశ్ చెప్పిన ప్రకారం, “మేము బాగా బతకడం వారికి అసూయ కలిగించింది, మాలో ఒకరు సర్పంచ్, డాక్టర్, ఇంజనీరు కావడాన్ని చూసి వారు ఓర్చలేకపోయారు.”
చిత్త కుమారుడు బల్వంత్ నిందితుడు, సున్పెద్ గ్రామపు వాడు, ఆధిపత్యం కలిగిన రాజపుత్రుల కుటుంబానికి చెందినవాడు. అతని భార్య రాజన్, మహిళలకు కేటాయింఛిన సీటుపై , 2005-10 వరకూ సర్పంచ్ గా ఉంది, కానీ భార్య వెనుక నిలబడి బల్వంత్ చక్రం తిప్పేవాడు.
జితేందర్ బంధువు, వేదప్రకాష్ కుమారుడు జగ్మల్ 2010లో సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. అతని పదవీకాలంలో గ్రామం ఎన్నో మార్పులను చూసింది. కాంక్రీటు రోడ్లు, గొట్టాల్లో నీళ్ళు, విద్యుత్తూ వంటి సదుపాయాలు వచ్చేట్టు చేసాడు. అనేక మంది రాజపుత్రులు కూడా జగ్మల్ పని చేస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చెయ్యడం, సహకారాన్ని అందించారు. నిజనిర్ధారణ సంఘం వారు మాట్లాడిన స్త్రీలలో ఒక రాజపుత్ర మహిళ ఈ విషయం సత్యమేనని 
సాక్ష్యం చెప్పింది. 

మార్పులను గుర్తించి, అతని దీక్షకు మెప్పుదలగా 2010-11లో అతనికి “ఉత్తమ సర్పంచ్ పురస్కారం” అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతి మీదుగా లభించింది. జగ్మల్ ఎన్నికల్లో విజయం సాధించడం, గ్రామంలోని అధికారపు తారతమ్యాలను కదలబార్చింది. రాజపుత్రులలో, ముఖ్యంగా బల్వంత్ కుటుంబం వారిలో ద్వేషాన్నీ, అభద్రతనూ రగిల్చింది. జగ్మల్ రాజకీయపు ప్రాముఖ్యాన్ని చూసి బల్వంత్ ఆందోళనకు లోనయ్యాడు.
2014 సంఘటన
బల్వంత్ భార్యకు ఎదురుగా నిలబడి జగ్మల్ పదవి లోకి వచ్చే ముందూ, వచ్చాకా ఉన్న రాజకీయపు సంబంధాలలోనూ, పైకి వచ్చేఅవకాశాలు పెరగడంలోనూ – ఈ ప్రస్తుత సంఘటనకు మూలాలు ఉన్నాయి.
2014 అక్టోబర్ లో రాజపుత్రులు, జితేందర్ కుటుంబపు స్త్రీలు పొలాల్లో ఉండగా, వారి చిత్రాలు తీసారు. దళిత కుటుంబాల స్త్రీలను అడ్డుపెట్టుకుని వారి కుటుంబాలను రాజపుత్రులు హేళన చేసారు, సమాజంలో తలెత్తు కోలేకుండా అవమాన పరిచారు. 2014 అక్టోబర్ 5న, ఆ చిత్రాలు దళితుల కుటుంబంలో ఒకరికి చూపించారు. ఆ చిత్రాలను నాశనం చేసేందుకై మొబైలును లాక్కొని, కాలువలో పారేయ్యడం జరిగింది. ఆ పెనుగులాట ముఠా తగాదాగా మారింది, ఎముకలు విరిగీ, తలలు పగిలీ, ఇరు పక్షాల వారికీ తీవ్ర గాయాలయ్యాయి. బల్వంత్ కుటుంబం వారైన, తులారాం కుమారుడు మోహనలాల్ అలియాస్ పప్పు, రంభుసింగ్ కుమారుడు ఇంద్రస్ అలియాస్ పప్పీ, పొహపి సింగ్ కుమారుడు భరత్ పాల్ (అందరూ రాజపుత్ర కుటుంబాలకు చెందిన వారే) – వీరు ముగ్గురూ గాయాల కారణంగా మరణించారు.
కానీ, అభియోగి (జితేందర్) కుటుంబ సభ్యుల ప్రకారం, పోలీసులు పూర్తికేసును విచారణ చెయ్యలేదు. రాజపుత్రుల కంప్లైంటును అనుసరించి దళిత కుటుంబాల పై కేసు పెట్టారు, విచారణ ఏకపక్షంగా నిర్వహించారు, వెనువెంటనే 11మంది జితేందర్ కుటుంబ సభ్యులను అరెస్టు చెయ్యడం జరిగిపోయింది. ఆ సమయంలో అక్కడ లేనేలేని సర్పంచ్ జగ్మల్ ని కూడా అరెస్టు చేసారు. ఆ సంఘటన జరిగిననాడు, జనోలి కి చెందిన ఎమ్మెల్యే రఘుబీర్ తెతియాతో కలిసి జగ్మల్ రాజకీయ ప్రచారంలో పాల్గొన్నాడు. 21 గ్రామాల సర్పంచులు, ఎమ్మెల్యేతో సహా ఆ విషయానికి సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్న విషయం, జితేందర్ కుటుంబం వారు గుర్తు చేస్తున్నారు. అంతేకాక ఆ ప్రచారానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఎఫ్ ఐ ఆర్ లో నమోదైన మరో కుటుంబ సభ్యుడు దల్బీర్ సింగ్ భార్యతో ఆ సమయంలో నర్సింగ్ హోంలో ఉన్నాడు. వారి వద్ద ఆ నర్సింగ్ హోం రికార్డులు కూడా ఉన్నాయి. వారిని ఐపీసీ 148, 149, 302, 323, 324 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వారిలో 9మంది ఇప్పటికీ జైలు లోనే మగ్గుతున్నారు (ఇద్దరు స్త్రీలు ఆరేడు నెలలు జైలులో గడిపాక బెయిల్ మీద విడుదలయ్యారు) క్లుప్తంగా చెప్పాలంటే, ఒక సంవత్సరం నుండీ, సంపాదించి కుటుంబాన్ని పోషించే మగ కుటుంబ సభ్యులు జైలులో ఉండగా, ఆడవారూ, పిల్లలూ మాత్రమే గ్రామంలో మిగిలారు.
2014, అక్టోబర్ 6నాడు బల్వంత్, అతని అనుచరులూ కలిసి జితేందర్ కుటుంబ సభ్యులు జైలులో ఉన్న అదును చూసి, వారి ఇంటినుండి నగలనూ, డబ్బునూ దోచుకున్నారు. రాజపుత్రులు నిప్పంటించగా, 5 ఇళ్ళకు పైగా కాలిపోయాయి. బల్వంత్ మరియు అతని అనుచరులు కలిసి జితేందర్ ను ఊరు వదలిపొమ్మని బెదిరించారు. జితేందర్ పోలీసుల రక్షణ కోరినా వారు ఏమీ చర్య తీసుకోలేదు. జితేందర్, భార్యా పిల్లలు, రేఖ అత్త బ్రిజేష్ వంటి జితేందర్ బంధువులూ, ఆ బెదిరింపుల కారణం గానూ, పోలీసులు ఏ చర్యా తీసుకోని కారణం గానూ ఊరు వదిలిపెట్టి పోవలసి వచ్చింది. వారు మూడు నెలలకు పైగా గ్రామం విడిచి పెట్టారు. ఊరు విడిచిన కుటుంబ సభ్యులు వెనుకబడ్డ తరగతుల వారి సంక్షేమం కొరకు ఏర్పడిన జాతీయ సంస్థను ఆశ్రయించారు. బల్వంత్ మరియు అతని అనుచరులు చేసిన బెదిరింపుల గురించి ఫిర్యాదు చేసారు. ఆ సంస్థ, జితేందర్ కు పోలీసు రక్షణ కల్పించమని ఆజ్ఞాపించింది. మొదట్లో 10-15 మంది పోలీసు కానిస్టేబుళ్లను నియమించారు. జితేందర్, రేఖ, వారి పిల్లలూ, బ్రిజేష్ (రేఖ అత్త) మూడు నెలల తర్వాత 14 జనవరి 2015 న గ్రామానికి తిరిగి వచ్చారు. కానిస్టేబుళ్ల సంఖ్యను క్రమంగా తగ్గించారు. వారి రక్షణ నిమిత్తం వచ్చిన పోలీసులు రాజపుత్రుల ఇళ్ళలో టీలు తాగుతూ ఉండేవారనీ, దళిత కుటుంబాల సంగతులు వారి కెప్పటికప్పుడు చేరవేస్తూ ఉండేవారనీ –జితెన్దర్ కుటుంబం ఆరోపణ చేస్తోంది.
సాంఘికమైన, ఆర్ధికమైన వెలి (ఒత్తిడి)
వీరు తిరిగి వచ్చిన పిదప, ఆధిపత్యం నెరిపే రాజపుత్రులు ఈ కుటుంబం పై సాంఘిక, ఆర్ధికమైన వెలిని విధించారు. జితేందర్ మేనల్లుడైన హ్రితేష్ కథనం ప్రకారం, ఆ సాంఘిక వెలి – వారికి పాలు వంటి నిత్యావసర వస్తువులను సైతం గ్రామంలో కొనుక్కోలేని స్థితిని కల్పించిందని తెలుస్తోంది. వారెప్పుడు వీధుల్లో నడిచినా, పొలాల్లోకి పోయినా వారిమీద రాజపుత్రులు కులం పేరెత్తి తిట్టే వారని దళిత కుటుంబం రూఢీగా చెప్తూ ఉన్నది, దాని వలన వారు సాంఘికంగానూ, మానసికంగానూ తీవ్ర ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. సాంఘిక వెలి కారణంగా, అతి తక్కువ రాకపోకలు జరిగేవి, అది ఈ కుటుంబాన్ని నిరంతరంగా ఏకాకుల్ని చేసింది. గదుల్లో మగ్గి విసిగి వేసారిపోయామని ఆ స్త్రీలు పేర్కొంటున్నారు.
కుటుంబ సభ్యులు కోపంతోనూ, శోకం తోనూ పదేపదే “ సర్వనాశనమై పోయింది!!” అని ఒకే మాట అంటున్నారు. సుఖం, శాంతి, సంపదా అంతా తుడిచిపెట్టుకుని పోయింది. పిల్లలు బళ్ళకు కూడా వెళ్ళడం లేదు. రాజపుత్రులు వారిని ‘శూన్యం’ చేసి వదిలారని, హిర్తేష్ , మరియు అతని తండ్రి గుర్తు చేస్తున్నారు.
 
న్యాయమూ, కోర్టులూ అందుబాటులో లేకపోవడం
ఈ సాంఘిక పరమైన వెలి వలన కలిగిన మరో పరిణామం - చట్టసహాయపు ద్వారాలను పూర్తిగా మూసుకుపోవటం. క్రిమినల్ లాయర్ కెకె మీనన్ వంటి చాలా మంది లాయర్లను తమ కేసు(2014 అక్టోబర్ సంఘటన) వాదించమని సహాయం అర్ధించారు. కానీ వారందరినీ బల్వంత్, అతని కుటుంబమూ, మరియు ఫరీదాబాదు జిల్లా కోర్టులోని రాజపుత్ర సముదాయమూ కలిసి అదిలించి బెదిరించారు. నిందితుల్లో ఒకడూ, బల్వంత్ మేనల్లుడు ఐన ఆదేల్, ఫరీదాబాదు జిల్లా కోర్టులో లాయర్ కావడం చేత ఈ బెదిరింపులకు కొంత బలం ఉండి ఉంటుంది. అతని పలుకుబడితో, కేసు ముందుకు సాగకుండా ఆటంకపరిచే విధంగా లాయర్లను ప్రయోగిస్తున్నాడనే వార్తలు ఉన్నాయి, కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. ఫరీదాబాదు జిల్లా కోర్టుల్లో లాయర్లలో అత్యధికులు రాజపుత్రులేనని జితేందర్ కుటుంబం ఈ సందర్భంగా గుర్తుచేస్తోంది. అడ్వకేట్ల సంఘాన్ని కూడా వారే నియంత్రిస్తున్నారు. వారి లాయరు మాట్లాడేందుకు లేవగానే అతని మీద తిట్లవర్షం కురుస్తుందనీ, అలా అతని నోరు నొక్కేస్తున్నారనీ జితేందర్ బంధువులు చెప్తున్నారు. అదంతా జడ్జీ ముందే జరుగుతుందనీ చెప్తున్నారు. “ఇరవై వేలకోసం ఏ లాయరు ఆ తిట్లు సహిస్తాడు?” అని వారు ప్రశ్నిస్తున్నారు.
తమ కేసును హర్యానా నుండి చండీగడ్ కో, డిల్లీకో బదిలీ చెయ్యమని అర్ధిస్తూ - సుప్రీం కోర్టులోనూ, చండీగడ్ హైకోర్టులోనూ కూడా అడ్వకేటు ఎకె సింగు ద్వారా పిటిషను పెట్టారు.
ఇటువంటి సాంఘిక ఆర్ధిక అరాచకత్వం, చట్టపరిధిలోకి చొచ్చుకుపోయిన దౌర్జన్యం – ఇటువంటి దొంగదెబ్బల నేపధ్యంలో- రాజపుత్రులు జితేందర్నీ, అతని కుటుంబాన్నీ నిప్పంటించడం దివ్య, వైభవ్ ల మరణానికి దారితీసింది.
పిల్లలు మంటల్లో కాలి మరణించిన సంఘటన
ఈ సంఘటనకు కొద్ది రోజుల ముందు, బల్వంత్ మరియు అతని కుటుంబ సభ్యులూ జితేందర్ కుటుంబపు స్త్రీలను బెదిరించారు. 2015 అక్టోబర్6న, జితేందర్ భార్య రేఖ బల్లభ్ గడ్ పోలీసు స్టేషన్కు వెళ్లి వారిపై ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసింది. కానీ, పోలీసు కమీషనర్ సుభాష్ యాదవ్ ‘ముగ్గురు రాజపుత్ర వ్యక్తులు క్రితం సంవత్సరం చనిపోయారు, మీలో ఎవ్వరైనా చనిపోతే చెప్పండి’ అంటూ రేఖ ఫిర్యాదును నమోదు చేసేందుకు తిరస్కరించాడు.
బల్లభ్ గడ పోలీసు స్టేషను లోని స్టేషను హౌసు ఆఫీసరును ఉద్దేశించి రేఖ రాసి ఇచ్చిన ఫిర్యాదుకు అనువాదము:
అయ్యా,
నేను జితేందర్ భార్య రేఖను, సున్పెద్ గ్రామ నివాసిని, చర్మకారుల కులానికి చెందినదానిని. 

2014 అక్టోబర్ 5న, బలోపేతులైన రాజపుత్రులు మా దుకాణానికి వచ్చి ఒక మొబైలు ఫోను విషయంలో గొడవ పడ్డారు. ఆ గొడవ విషమించి ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆ రాజపుత్రులు మా కుటుంబం వారే వారిని హత్య చేసారని ఆరోపించారు. పదకొండు మంది మా కుటుంబ సభ్యులు జైలు పాలయ్యారు. ఆ సమయంలో రాజపుత్రులు మా ఇళ్ళమీద పడి దోచుకున్నారు. మేము ఊరొదిలి పారిపోవలసి వచ్చింది. మూడు నెలల తర్వాతే 2015 జనవరి 14 నే, మేము మా ఇళ్ళకు తిరిగి చేరుకోగలిగాము. పోలీసుల రక్షణ ఉన్నప్పటికీ, రాజపుత్రులు మమ్మల్ని కులాల పేరెత్తి నిందించేవారు. 2015 అక్టోబర్ 4నా, 5నా,ఈ రాజపుత్రులు మా ఇంటికి వచ్చి “చర్మకారులారా, నీచ జన్ములారా, చూసుకోండి, మేము మిమ్మల్ని ఈ ఊరిలో ఉండనివ్వం!” అని దుర్భాష లాడారు. మా అత్తగారు, లేటు దాల్చంద్ భార్య ఐన శాంతాదేవి, వారిని గుర్తు పట్టింది. వారు – భరత్ పాల్ కుమారుడు ఆకాష్, కిల్లు కుమారుడు సూరజ్, పొహపి కుమారుడు నైనిహాల్,
రంభు సింగ్ కుమారుడు దేశరాజు, తులసి రామ్ కుమారుడు కిల్లు. వీరందరూ పోలీసుల రక్షణను లెక్కచేయక మా ఇళ్ళలోకి చొరపడ్డారు. మా ప్రాణాలూ, ఆస్తులూ ప్రమాదంలో ఉన్నాయి. దయచేసి మీరు ఈ విషయాన్ని పరిచీలించి, తగిన చర్య తీసుకోగలరు.
తేదీ : 05-10-2015
ఈ దళిత కుటుంబం వారి ఆస్తులకూ, ప్రాణాలకూ నష్టం వాటిల్లబోతోందని భయపడుతున్నట్టు ఈ లేఖ లో స్పష్టంగా రాసి ఉంది. కానీ పోలీసులు వారి ఫిర్యాదులను ఖాతరు చెయ్యలేదు.
ముఖ్య నిర్ధారణలు
1. పై సంఘటనలు సున్పేధ్ లోనూ, ఫరీదాబాదులోనూ దళిత కుటుంబాల పైన ఎప్పటినుండో జరుగుతున్న విషాదకర సంఘటనల కొనసాగింపు మాత్రమే. అంతే కాకుండా ఇది రాజపుత్రులు దళితుల మీద కొనసాగుస్తున్న వ్యవస్తీకృత హింస.

2. అక్టోబర్ ఐదు సంఘటన తరువాత దళిత కుటుంబం యిచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ ఐ ఆర్ పోలీసులు కట్టలేదు.

3. అదే రోజు రాజపుత్రులు యిచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు కట్టి పదకొండు మంది దళితులను జైలుకు పంపారు. అందులో ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు.

4. ఫరీదాబాదు జిల్లా కోర్టులో ఉన్న న్యాయవాదులు దళితుల కేసు వాదించటానికి సిద్ధంగా లేకపోవటం వలన ఢిల్లీ నుండి కౌన్సిల్ ను తీసుకొని రావాల్సి వచ్చింది. ఆ అడ్వకేటు తన వాదనలు వినిపించటానికి అనుమతి ఇవ్వలేదు. అంటే దళిత కుటుంబానికి స్వేచ్ఛగా కేసు నడుపుకొనే హక్కు, న్యాయ హక్కు తిరస్కరించారు.

5. అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం కేసును హర్యానాకు వెలుపలకి (చండీగర్) బదిలీ చేయమని సుప్రీం కోర్టును వేడుకోవాల్సి వచ్చింది.

6. 2014 అక్టోబర్ తరువాత దళిత కుటుంబం గ్రామాన్ని వదిలి భయంతో కకావికలై మూడు నెలలు బయటకు పోవాల్సి వచ్చింది.

7. మొదట ఏడుగురు పోలీసులను వారికి రక్షణగా నియమించి క్రమంగా వారి సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. అక్టోబర్ 19న ఈ భయంకర ఘటన జరిగినపుడు జితేందర్ ఇంటి వద్ద ఒక్క కానిస్టేబుల్ కూడా లేదు.

8. గత సంవత్సరకాలం నుండి పోలీసు అధికారులు స్పష్టమైన నిర్లక్ష్యాన్ని ఈ కేసు సందర్భంగా ప్రదర్శించారు.

9. ఇంత ఘోరం జరిగిన తరువాత కూడా రాజపుత్రుల మీద ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ యాక్టులోని సెక్షన్లు 3 (1) (x), 3 (2) (iii), 3 (2) (iv), 3 (2) (v), and 3 (1) (xv) లను పెట్టలేదు.

Friday, 1 January 2016

"అభ్యుదయ ప్రేమలు" - స్త్రీ ప్రేమ స్వేచ్చ పై రంగనాయకమ్మ గారి భావాలుఇదుగో...
'మాతృక'
జనవరి సంచికలో...


అభ్యుదయ ప్రేమలు’ అనే పేరుతొ రంగనాయకమ్మ గారి కొత్త పుస్తకం వచ్చింది. అందులో మొదటి రెండు కథలూ ‘ఆధునిక’ స్త్రీ స్వేచ్చపై ఆమె చేసిన వ్యాఖ్యానాల్లాగా కనిపించాయి. ఈ సందర్భంగా - రంగనాయకమ్మ గారి పూర్వ రచనల్లో విరివిగా కనిపించే ప్రేమా, స్వేచ్చా, ఆత్మగౌరవమూ అనే భావాలూ; అవి మూడూ కలిసి చేసే స్త్రీ పురుష సహజీవనం పై ఆమె అభిప్రాయాలూ – వీటిని గుర్తు చేసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.       

ఒక కుటుంబంగా జీవించాలనుకునే జంట మధ్య తప్పనిసరిగా ఉండవలసినవి ఒకరి పట్ల మరొకరికి ‘అనన్య’ మైన ప్రేమానురాగాలు. అవే కాక తమ సంస్కారాల్లో కొంత సమాన స్థాయి కూడా జీవిత సహచరుల మధ్య ఉండాలి. భావసారూప్యం లేనివారితో స్నేహాలే నిలుపుకోడం కష్టం, ఇక సంసారమా దుఃఖ భాజనమే!  

‘ప్రేమరాహిత్యం’- దాని కారణంగా వివాహబంధం తెగిపోవడం - అన్న సమస్యకు పరిష్కారం దొరకలేదు సరికదా, ఆ సమస్యతో ముడిపడిన  స్వేచ్చా ప్రణయం(ఓపెన్ మారేజ్) అనే కొత్త ధోరణి ఒకటి సమకాలీన సమాజంలో ప్రచారం లోకి వస్తోంది. దాని మంచిచెడ్డలు విచారించే ప్రయత్నం రంగనాయకమ్మగారు తమ ఇటీవలి రచనల్లో చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. 

వివాహేతర సంబంధాలు సహజీవనానికి విషతుల్యాలన్న విషయం ఏనాడో అందరూ ఒప్పుకున్నదే. ఏలోటూ తెలియకుండా చేసుకుంటున్న కాపురం ఒక నమ్మకద్రోహంతో ఎలా మొదలంటా కూలిపోయిందో 1995 ప్రాంతాల్లో వచ్చిన ‘ప్రేమ కన్నా మధురమైనది’ లో రంగనాయకమ్మ గారు వర్ణిస్తారు. అనర్హుడని తెలియక తన విలువైన ప్రేమను అర్పించి, విషయం తెలుసుకుని ‘ఆత్మగౌరవం’ అమూల్యమైనదని ‘రమ’ గుర్తించే కథ ఈ నవలికలో చిత్రితమౌతుంది.

జీవితాలను వెలిగించే ప్రేమానుభూతిని  పొందిన ఒక సున్నిత స్వభావురాలు రమ. తనదీ, తన భర్త రమణదీ ‘అజరామరమైన’ ప్రేమ అని నమ్ముతుంది. ‘బ్రతుకంతా ప్రతి నిముషం పాట లాగ సాగాలి, ప్రియా ప్రియా ‘ అని పదేపదే పాడుకుంటూ ఉంటుంది.

రమకూ, జయకూ ఉన్న స్నేహాన్ని రమణ అలుసుగా తీసుకుని  “మీరంటే నాకు చాలా ప్రేమ, మీ స్నేహితురాలికి మీరంటే ఎంత ప్రేమో మీకు తెలీదు, కావాలంటే మీకోసం నన్ను కూడా ఇచ్చేస్తుంది... ... ...మీరిద్దరూ అక్కచెల్లెళ్ళ లాగా ఎందుకుండకూడదు? మీ ఊరు రమ్మంటారా చెప్పండి?” అని జయతో అవాకులూ చెవాకులూ మాట్లాడతాడు. జయ నిర్ఘాంతపోతుంది. 
చెప్పాలా వద్దా అని ఎంతో సేపు మధనపడి చివరకు జయ ఆ విషయం రమతో చెప్తుంది. రమ కుప్పకూలిపోతుంది. ప్రేమ ద్రోహం అనే ఆయుధం తో, నమ్మక ద్రోహం అనే అఘాతం తగిలిన రమ ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని జయ తల్లడిల్లిపోతుంది. రమని ఎలా ఓదార్చాలి అని జయకు ఒకటే ఆలోచన, ఒకటే ఆరాటం
అంత జరిగాక కూడా - ద్రోహానికి తలపడ్డ మనిషి తనను చూసుకుని తను సిగ్గు పడకుండా ఉండగలడా... ... ... పశ్చాత్తాపం తో దగ్ధమై పోకుండా ఉండగలడా అని ఏమూలో రమకు ఇంకా సందేహమే. “ఏం  చెప్పగలడు? ఏం చెప్పగలడు?” అని రాత్రింబవళ్ళు రమణ ఇవ్వబోయే సంజాయిషీ గురించి ఊహిస్తూ ఉంటుంది.
కానీ రమణ తప్పు ఒప్పుకోకుండా బుకాయించబోవడం చూసి రమకు గుండె రాయి అయిపోతుంది. అది అతను క్షణికావేశంలో చేసిన తప్పు కాదనీఅతనికి తన ప్రేమను పొందే అర్హత లేనే లేదనీ ఆమెకు రూఢి ఔతుంది. రమణ చేసిన ద్రోహాన్నితట్టుకు నిలబడితన జీవితం తన  ప్రేమ కంటే విలువైనది అని రమ గ్రహించడమే కథకు ముగింపు.

ప్రేమే ‘మధురమైనది’ కదా,
దాని కన్నా ‘మధురమైనది’ ఇంకేదో ఉందా?  అనే ప్రశ్నవేసి...
ఆ పోలిక అవసరమైనప్పుడు,
ప్రేమ కన్నా మధురమైనది వేరొకటి ఉంది,
అది – ‘ఆత్మగౌరవం’ అని రచయిత్రి స్పష్టం చేస్తారు ఈ కథలో.

ఒకళ్ళమీద ఒకళ్ళకి అణు మాత్రం సందేహాలు రాని స్నేహం, ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ఊహల్లో కూడా ద్రోహం జరగని స్నేహం అని రమకూ, జయకూ ఉన్న బాంధవ్యాన్ని రంగనాయకమ్మగారు వర్ణిస్తే – అటువంటి బంధమే కదా స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని పటిష్టం చేసేది అని నాకనిపించింది. అదే స్త్రీ పురుషుల సహజీవనానికి పునాది కావలసి ఉంది. స్త్రీ  పురుషుల స్వేచ్చా సమానతలకూఆత్మగౌరవాలకూ లోటు రానివ్వనిదీఆచరణయోగ్యమైనదీ - ఐన వివేచన నాకు ఆమె రచనల్లో కనిపిస్తుంది.   

అయితే రమణను వదిలేసేందుకు రమ నిర్ణయానికి రాకముందూ, వచ్చాకా - ఆమెకు కలిగే అపరిమితమైన మనః క్లేశాన్ని మనం తక్కువ చెయ్యలేం. దానికి కారణం నిష్కల్మషమైన ప్రేమే అని మనం అర్ధం చేసుకోగలం. కానీ సౌకర్యవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయి, ఆ కారణంగా భర్తలు చేసే అవమానాలను సహిస్తూ సద్దుబాట్లు చేసుకునే స్త్రీలు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారు. వివాహేతర సంబంధాల్లోని మార్పులతో  కొత్త తరం ఎటువంటి రాజీల కొస్తోందో 1999 లో వచ్చిన మురళీ వాళ్ళమ్మ’ కథలో విశ్లేషించారు.

“అసంతృప్తిని ప్రకటించవలసిన కోడలే మెతకతనం చూపుతోందీ ... కోడల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు కానీ కొడుకు తనను మాత్రం పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడూ – కందకు లేని దురద కత్తిపీట కెందుకు లె”మ్మని సాధారణంగా చాలా మంది పెద్దవాళ్ళు జోక్యం చేసుకోరు. కానీ తల్లి అయిన రుక్మిణి అలా అనుకోదు! తనకెం దుకని ఊరుకోదు. స్వేచ్చాస్వాతంత్ర్యాలకూ, స్వాభిమానానికీ ప్రతీకగానూ, ఆధునిక మహిళకు చక్కటి నమూనాగానూ అనిపించే రుక్మిణి కోణం నుండి కథను చెప్పి- ఈ వైవాహిక సమస్యల పరిష్కారం లో కుటుంబ సభ్యుల పాత్రను మనకు  సూచిస్తున్నారనిపించింది.

రుక్మిణి ఆర్ధికంగా స్వతంత్రురాలు కాకపోయినప్పటికీ తన భర్త వేరే స్త్రీ తో సంబంధం పెట్టుకుంటే, భరిస్తూ కూర్చోదు, పదమూడేళ్ళ కొడుకు మురళిని తీసుకుని తెగించి ఇల్లు వదలి వస్తుంది. కుట్టుపని చేసుకుని ఇల్లు గడుపుకుంటుంది.
ఆనాటి నుండీ కొడుక్కి తల్లీ, తల్లికి కొడుకూ ఆధారం. వారిరువురి వ్యక్తిత్వాల గురించీ ఇలా ఉంటుంది. ఎన్ని లోట్లు ఉన్నాఎన్ని అవసరాలు ఉన్నాఎక్కడికక్కడ సరిపెట్టుకోవడమే ఆనందం గా రెండో ఆలోచన లేకుండా కాలం గడిపారు. తమ బతుకు తము బతకడమే తమ లక్ష్యం అయినట్టుతమ లక్ష్యమే తమ జీవితం అయినట్టుఅన్ని ఇబ్బందులనీ ఓర్చుకుంటూ కాలం గడిపారు.                   

పెద్దవాడయినాక మురళి, రజనీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. క్రమేణా, నిప్పుకు చెద పట్టినట్టు అతని ప్రవర్తనలో మార్పులు రావడం రుక్మిణి దృష్టి లోకొస్తుంది.
పెళ్ళైన మొదట్లో ప్రతీరోజూ రాత్రిపూట కలిసి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తినేవారు.
రజని ఏదైనా నవల చదువుతోంటే తను పడుకుని సంతోషంగా వినేవాడు.
కాస్సేపు తను కలెక్టు చేసిన పాటలన్నీ వేసి వినిపించేవాడు.
రజనితో మాట్లాడడానికి తహతహ లాడుతున్నట్టు ఉండేవాడు.  ఎలా మారాడో... ఎప్పుడు మారాడో... అని రుక్మిణి మనసు పరితపిస్తుంది.
“మొగవాళ్ళు ఇల్లు పట్టకుండా తిరుగుతోంటే ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసాచూసి చూసి మనసు విరిగి కాస్త తీరిగ్గా మాట్లాడే మొగాళ్ళ మీద మనసు పెట్టుకుంటారు. ఒక రోజున ఇంట్లోంచి బయటకు పోతారు అని మురళిని తల్లి ఒకసారి మందలిస్తుంది కూడా.
రజని ఏం కష్టపెట్టుకుంటుందో అని రుక్మిణికి ఒకటే దిగులు! ఆ అమ్మాయికిఏం జరుగుతోన్నా కోపం తెచ్చుకోడమే తెలీనట్టు ఉంటుంది

ఈ చిరాకులన్నీ ఒక ఎత్తైతేమురళీ ఆఫీసులో పనిచేసే శ్రీలత అనే అమ్మాయితో అతనికి పెరుగుతున్న సాన్నిహిత్యం మరో ఎత్తై రుక్మిణిని చాలా ఇబ్బంది పెడుతూఉంటుంది.  అతనికి రజనీ అంటే లక్ష్యం లేకపోడంశ్రీలత మీదఆసక్తి ఉండడం రుక్మిణి కనిపెడుతూ ఉంటుంది.

ఆఫీసు పని మీద శ్రీలత తో మురళి వేరే ఊరు వెళ్తాడు. అతని వద్ద నుండి ఫోన్ వస్తుందివ్యవహారం శృతి మించుతోం దనిపించాక ‘నువ్వేమన్నావూ’ అని రుక్మిణి రజనీని కనుక్కుంటుంది. “ఏమన్నాఅంటేమురళి గురించి నేనేదో అనుమానపడుతున్నానని అనుకుంటాడని రజనీ భయపడుతుంది.

కానీ ఆ ధోరణిని రుక్మిణి సమర్ధించదు. రజనికి అనుమానాలు లేకపోతే అది ఆ అమ్మాయి బుద్ధిలేనితనం! – లేకపోతే సిగ్గుమాలినతనం! ఏదైతేనేం?  అని రుక్మిణి అనుకుంటుంది.  
అందుకే ఆమె కొడుకూ, కోడళ్ళిద్దరి తోనూ మాట్లాడుతుంది.   
“మురళీ! మీనాన్న మనకి చేసిన ద్రోహమే నువ్వు రజనీకి చేస్తున్నావు.
మీ నాన్న లాంటి వాడికివేరే కాపరం పెట్టినా తప్పేం లేదు. నీకు కొంచెం సరదాగా తిరిగితే తప్పేం లేదు! ఈ తప్పొప్పులు మీరే నిర్ణయించుకుంటే కాదు. ఆ కష్టం కట్టుకున్నవాళ్ళకి తెలుస్తుంది.”

కోడలికి అవసరమైతే తాను అండగా ఉంటానని ధైర్యం చెప్తుంది. కానీ వారు అలాగే కొనసాగాలనుకుంటే మాత్రం తను వారితో ఉండబోనని స్పష్టం చేస్తుంది.
“... ... ... పెద్దపదవిలో ఉన్నవాడు కదా? అతని సరదాలు అతనికి ఉంటాయి. నీ కోపతాపాలతో అతని కాళ్ళకి బంధం కాకూడదు. ఆ ఒక్క స్వేచ్చా అతని కిచ్చేస్తే...నీకోసం అతను ఎన్ని వస్తువులన్నా కొంటాడు.
అందుకే నువ్వు ఇంత అణకువగా ఉంటున్నట్టు ఉన్నావు” అని పదునైన వ్యంగ్యంతో రజనీని నిలదీస్తుందిసూటిగా వారు చేస్తున్న తప్పును వారికి ఎత్తి చూపిస్తుంది.    
భర్తను ఎదిరించి బతికింది బిడ్డలతో రాజీ పడడానికా అని ప్రశ్నిస్తుంది.
తప్పు చేసేవాడు తనకెంతో ఆప్తుడైన కొడుకే అయినా ఎదిరించి, తన ఆత్మగౌరవాన్ని నిలుపుకున్నస్త్రీ గా ‘మురళీ వాళ్ళమ్మ’ రుక్మిణి మన ముందు నిలుస్తుంది. 

కథ లోనైతే రుక్మిణి చెప్పిన హితం మురళీ, రజనీలకి పశ్చాత్తాపం కలిగించినట్టే కనిపిస్తుంది. కానీ నిజ జీవితాల్లో స్త్రీ పురుషుల ఆలోచనలు వేరే మార్గం పడుతున్నాయి. అవి ఎవరి చేత్తో వారి కళ్ళే పొడుచుకుంటున్న ట్టుండడం రంగనాయకమ్మగారు గమనించారనుకోవచ్చు. స్త్రీ పురుష కుటుంబ సంబంధాలను ధ్వంసం చేసే అసలైన నీచ విషయం, వ్యభిచారాలే. అవి పురుషాధిక్యత నుంచి పుట్టుకు వచ్చే నేరాలే. ఆ నేరాలు, భర్తలవి అయినా, భార్యలవి అయినా అవి కుటుంబ శాంతి సౌఖ్యాల్నీ, బిడ్డల అనురాగ పెంపకాల్నీధ్వంసం చేసే నేరాలే  అని ఆమె రాస్తారు.

మగవాడు వేరొక ఆమెతో సంబంధం పెట్టుకుంటే, అదే పని ఆడది కూడా చేసి ‘సమానత్వపు హక్కు’ను వినియోగించుకోవాలనీ, అదే తగిన ప్రతిచర్య అనీ ఈరోజుల్లో కొందరి వాదం. ఆ వాదానికి పరిణామాలెలా ఉంటాయో, దాని వల్ల వచ్చే నష్టాలెంత దారుణంగా ఉండబోతాయో ‘అభ్యుదయ ప్రేమలు’ కథలో చిత్రిస్తారు.
అదే వాదాన్ని నమ్మి ఆచరించిన పద్మ పాత్ర తనకు కనువిప్పు కలిగాక ఇలా అంటుంది. “మనం స్వేచ్చ అనుకున్నదంతా మనకీ, మన బిడ్డలకీ విషంతో సమానం... నిజానికి మనం చేసిందేమిటో తెలుసా? మొగవాళ్ళ స్వేచ్చను రెట్టింపు చేశాం! వాళ్ళు మన బిడ్డల బాధ్యతలను పట్టించుకోకుండా తప్పుకోడానికి, వాళ్ళ మార్గం సుగమం చేశాం!
సమానత్వం అంటే, మంచి వాళ్ళతోనో, చెడ్డ వాళ్ళ తోనో? మనకి తెలివి లేదు! అని పద్మ వాపోతుంది.      
ఆ కథలో ఏ ఒక్క సంభాషణా తర్కవిరుద్దంగా ఉండకపోవడం గమనించాల్సిన విషయం. అతిశయోక్తుల్లా కొందరికి కనపడినా అందులో చిత్రించిన పరిస్థితుల సంభావ్యతను కాదనలేం.

ఈ సమానత్వపు వాదం ఇంకాస్త ముందుకు పోయి ‘స్త్రీ ప్రేమ స్వేచ్చ సిద్ధాంతం’ నిలువెల్లా ఉన్న ‘సంతలక్ష్మి’ గా తయారైన వైనం రెండవ కథ లో ఉంటుంది. స్త్రీ పురుషులు ‘ఒకరికి ఒకరే’ అన్న పట్టుబందీ ఏమిటని సంతలక్ష్మి ప్రశ్న. ‘ఆ శారీరక సంబంధాలు’ డబ్బు కోసం పెట్టుకున్నవి కావు గనక వాటిని వ్యభిచారాలు అనకూడదని ఆమె సమర్ధింపు.

అటువంటి భావాలను సమర్ధించే వారందరూ కూడి పెట్టుకున్న సంఘం ‘లోగుట్టు’ గురించి ఇలా ఉంటుంది: ఆ బృందం ఒక స్వచ్చంద సంస్థగా కూడా పెట్టుబడిదారులు ఇచ్చే డబ్బుతో, స్త్రీలను అభివృద్ధి చేసే చర్చలతో, మీటింగుల కార్యక్రమాలు, ఫైవ్ స్టార్ హోటళ్ళలో జరుపుతూ ఉంటుంది. పెట్టుబడిదారులు పంపే డబ్బుతో ఒక ఆఫీసూ, ఆ ఆఫీసులో ఆడ క్లర్కులూ, అన్ని ఏర్పాట్లూ ఉంటాయి.

ఆ సంతలక్ష్మిని ‘పెళ్ళాడి’ ఆమె తన పద్ధతి మార్చుకోకపోయినా కూడా ఆమెను వదలలేక(?) తన ఆత్మగౌరవానికి తిలోదకాలిచ్చిన చంద్రం మనకో ప్రశ్నార్ధకంగా కనిపిస్తాడు.
సమాజంలో ఈ విషయాలను గురించి చర్చించేవారిని - సమాజానికి నైతిక నిఘాదారు(మోరల్ పోలీసు)  లంటూ స్వేచ్చాప్రణయ వాదులు ఈసడించడం వింటూ ఉంటాం.

స్త్రీ పురుషుల ప్రణయ సంబంధం ఒక కుటుంబపు రూపం దాల్చాక, ఆ కుటుంబ సభ్యుల శ్రేయస్సు ఆ జంటను అంటి పెట్టుకుని ఉంటుందని మనకు తెలిసిన విషయమే. ‘మా ఇష్టం మాద’ని స్పష్టంగా చెప్పే  ‘సంతలక్ష్ము’లకు ఎవరూ ఏదీ చెప్పి ఒప్పించలేరు. కానీ సమాజమంతా వారి తోటే నిండి ఉండదనీ,  ఏది తప్పు?ఏది ఒప్పు? అని విచారించే వారు కూడా ఉంటారనీ మనం అర్ధం చేసుకోవాలి. వారిని ఉద్దేశించి, ఇటువంటి సమకాలీన భావాల బాగోగులనూ, అసంబద్ధతలనూ కూలంకషంగా చర్చిస్తున్న ఈ కథలకు మంచి ప్రయోజనం ఉంటుందని నా నమ్మకం.      

వేశ్యావృత్తి ని మన సాహిత్యం ఎలా చిత్రించింది?http://eemaata.com/em/issues/201601/8149.html?allinonepage=1


సాహిత్యంలో వేశ్యా వృత్తి

నళినీ జమీలా అనే సెక్స్ వర్కర్ వేశ్యల సమస్యలపై సమాజపు దృష్టి ప్రసరించే నిమిత్తం, తమకు న్యాయం కావాలంటూ కొన్నేళ్ళ క్రితం తన ఆత్మ కథను ప్రచురించారు. సమకాలీన సమాజంలో ఆమె ఎదుర్కొన్న కష్టనష్టాలు, సాగించిన పోరాటాలు కేవలం ఆమె ఒక్కరివే కావు. వేశ్యా వ్యవస్థలో భాగాలైన అనేక మంది స్త్రీలు ఆమె కథలోని చేదు అనుభవాలకు ప్రత్యక్ష సాక్షులు. వ్యక్తిగత అనుభవాల నేపధ్యంతో ఆమె తన ఆత్మకథలో వెలిబుచ్చిన అభిప్రాయాలపై చర్చగా కాక, వేశ్యావృత్తి సమస్య సామాజిక సమస్య అని భావించి, వారి జీవిత చిత్రణ మన సాహిత్యంలో ఏవిధంగా జరుగుతూ వచ్చిందో జరిపే విశ్లేషణ దిశగా ఈ వ్యాసరచనకు పూనుకుంటున్నాను.
ఇందుకు కారణం ఏమిటంటే, ఎవరి కథ వారే చెప్పుకోవడం స్వాగతించవలసిన పరిణామమే కానీ అదే అత్యంత ప్రామాణికం అని పూర్తిగా నమ్మలేం. ఈ సందర్భంలో కుటుంబరావుగారి ముడి సరుకు అనే కథ లోని ఒక వాక్యం గుర్తొస్తోంది. ఒక పాత్ర, ‘నన్నుగురించి నేను చెప్పుకోగలిగితే నువ్వు దేనికి!’ అని రచయితతో అంటుంది. అంటే సమస్యలో చిక్కుకుని ఉన్న వారు, తమ పరిస్థితి గురించి వస్తునిష్టతతో విశ్లేషించుకోడం పూర్తిగా సాధ్యం కాదు అని కొ.కు. అభిప్రాయం కావచ్చు. దానికి కళ సహయకారి కాగలదు. జీవితం కన్నా కళలు ఒక మెట్టు ముందుండి, భావికి సంకేతాలుగా ఉంటాయి. కళాకారులు సామాన్యుల జీవితాలను వారి కంటే లోతుగా గమనించి కళాసృష్టి చెయ్యగలరని ప్రజల నమ్మకం. అందుకే తన ఆత్మకథలో నళినీ లేవనెత్తిన ప్రశ్నల మూలాలను, మన ఆధునిక తెలుగు సాహిత్యపు పుటల్లో పరిశీలన చేసేందుకూ, ఆ రచయితల సామాజిక దృక్పథాల వెలుగులో చర్చించేందుకూ ప్రయత్నించాలన్నది ఈ వ్యాసానికి సంకల్పం అయ్యింది.
సమాజాన్ని చూసే విధానం, సమాజాన్ని గురించి ఉండే అవగాహన – వీటిని మనం సామాజిక దృక్పథం అని నిర్వచించుకుని, ఆ నిర్వచనంతో వేర్వేరు కాలాలకు చెందిన రచయితల సామాజిక దృక్పథాలను ఆ సమాజ పరిస్థితుల నేపధ్యంలో విశ్లేషణ చేసుకోవచ్చు. తటస్థ చరిత్ర లాగే తటస్థ సాహిత్యం కూడా ఉండదు. జీవితం లోని ప్రతీ సంఘటన, చూసేవారిని బట్టి వేరు వేరు అంతరార్ధంతో కనిపిస్తుంది. ఈ వైవిధ్యాన్ని – సాహిత్యకారుడు కాచి, వడపోసి, నిగ్గు దేల్చి ఏ దృక్పథం లోంచి ఆ సంఘటనల్లోని సత్యాన్ని లోకానికి వ్యక్తం చెయ్యాలో నిర్ణయించుకుంటాడు. అది అతని సామాజిక దృక్పథం ఔతుంది. ఆధునిక నవలకూ, నాటకానికీ, కథకూ, కవితకూ మూలపురుషులైన వీరేశలింగం, గురజాడలు ఒక నిశ్చితమైన సామాజిక దృక్పథం తోనే కలం పట్టారు. అలాగే తరువాతి తరాలలోనూ రచయితలు, సమాజపు నమ్మకాలకూ, జీవిత సత్యాలకూ ఉండే అంతరాలను వారి సాహిత్యంలో ఎత్తి చూపించారు, వారి దృక్పథాలు వారు జీవించిన సమాజాల విశ్వాసాలకంటే ఎంత భిన్నంగా ఉన్నవో గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని తరాల లోనూ, సమాజంలో వేశ్యల స్థానం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి, ఒక విలక్షణకోణంలో వేశ్యలను దర్శించి వారి పాత్రపోషణ కావించిన రచయిత లున్నారు. వారి రచనలలో వెల్లడయ్యే వారి దృక్పథాన్ని పరిశీలిస్తే వేశ్యావ్యవస్థను మరింత వివరంగా అర్ధం చేసుకోవచ్చు.
ప్రాచీన సాహిత్యంలో, వేశ్యలతో సహవాసం దోషమనీ, ధర్మార్ధాలకు హాని కలుగుతుందనీ, అది మనిషిని పతనం చేస్తుందనీ మన పూర్వులు ఏకకంఠంతో చెప్తూ వచ్చారు. ‘మనుధర్మ శాస్త్రకర్తలు, వేశ్యాప్రియులు పంక్తి బాహ్యులనీ, వారికి రాజసభ లందు కొలువు లీయరాదనీ విధించి యున్నారు,’ అని వీరేశలింగం మనకు గుర్తు చేస్తారు. 1890ల తర్వాత భారతీయ సమాజంలో దేవదాసీలను నిషేధించాలంటూ ఏంటి నాచ్ ఉద్యమం మొదలయ్యింది. దాని ఆవశ్యకతను, తెలుగు సమాజపు నేపధ్యంలో కందుకూరి తన ప్రహసనాల్లో చిత్రించారు. ‘పూర్వకాలంలో ముసుగు వేసుకుని రెండో కంటి వాడికి తెలియకుండా వేశ్య ఇంటికి వెళ్ళేవారూ, ఈ కాలంలో అందరూ చూస్తే మరింత గౌరవమని భావించి, బాహాటంగా పట్టపగలే పదిమందిని వెంటపెట్టుకుని మరీ వేశ్యల ఇంటికి వెళ్తున్నారు. వేశ్యా సాంగత్యం సమాజంలో ప్రతిష్టాకారణమౌతోంది’ అంటూ గ్రంధాలలో రాసి ఉన్న ఆదర్శాలకూ, వాస్తవంగా సమాజం లో ప్రచారమౌతున్న భావాలకూ కనిపిస్తున్న ఈ వ్యత్యాసాన్ని వీరేశలింగం తీవ్రంగా ఖండించారు. ఆనాటి సమాజం పాటిస్తున్న – కన్యాశుల్కం, వృద్ధులకు చిన్నపిల్లలను కట్టబెట్టడం వంటి అనేక దురాచారాలతో బాటు, వేశ్యలనూ, వారి పోషకులనూ, వేశ్యావృత్తి సమర్ధకులనూ ఆయన చీల్చి చెండాడారు.
కందుకూరి వీరేశలింగం ఏంటీ నాచ్. కానీ వారిని వేశ్యల శ్రేయస్సుకు విరోధిగా కాక వారికి మెరుగైన జీవితం కోరిన సంస్కర్తగా మనం అర్ధం చేసుకోవాలి. ‘వివాహమాడి పతివ్రతలు కాదగిన వేశ్యలను జారిణులనుగా చెయ్యడమౌట చేత అది వేశ్యలకు కూడా ద్రోహమే,’ అని ఆ వృత్తి లోని దోషాన్ని ఆయన సరిగ్గా గుర్తించారు; వేశ్య దయనీయ జీవితాన్ని సానుభూతితో పరిశీలించారు. ‘కొంచెము వయసు జారిన తోడనే విటపురుషులు తమ్ము విడిచి యవలకు జారగా, గడించిన సొమ్ము వ్యాధుల కింద వ్యయపడగా, వెనుకటి సంగీతనాద మిప్పుడు రోదననినాదముగా మారగా, ముప్పది సంవత్సరముల ప్రాయముననే దేహము చెడిపోయి తిండికి లేక తమ పాపఫలమ నుభవించుచూ, రోగముల చేత బాధ పడుచూ – ఇట్టి కులవృత్తి నంగీకరించిన యీ దేశము యొక్క యపకీర్తి మూర్తీభవించి యీ రీతిని బహురూపముల మెలుగుచున్నదో యన అభాగ్యదేవతల వలె నెల్లెడ దిరుగుచుందురు.’ అని వారి దుస్థితిని కళ్ళకు కట్టినట్టు సమాజానికి చూపించారు.
వేశ్యలను వినోద సాధనాలుగా ఆమోదించే రివాజు సమాజంలో అనాదిగా ఉండేది. రూపకాల లోని స్త్రీ పాత్రలను పోషించడానికి బ్రహ్మదేవుడు అప్సరసలను సృష్టించినట్లు నాట్యశాస్త్రంలో (200BC -200AD) భరతుడు పేర్కొంటాడు. అలాటి తరతరాల సమాజపు నమ్మకాలను ఎదిరించి, వీరేశలింగం తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి సారి వేశ్యజాతిని భగవంతుడి సృష్టిలో భాగంగా కాక, సమాజంలోని ఒక జాడ్యానికి రూపంగా చూపారు. ఆయన దృక్పథం సమకాలీన సమాజస్వభావానికి భిన్నంగా, ప్రగతిశీలకంగా ఉండడం గమనించాల్సిన విషయం. అది తరువాత వారందరికీ కొత్త వెలుగు చూపింది.
1910లో గురజాడ అప్పారావు కన్యాశుల్కం లోని మధురవాణి పాత్ర వేశ్య అయి ఉండీ తాను ఏంటీ నాచ్ నని చెప్పుకోవడం ఒక విశేషం. వీరేశలింగంగారి భావజాలాన్ని అనుభవసారంగా గ్రహించి, ఆమోదించిన వ్యక్తిగా మధురవాణి పాత్రను అర్ధం చేసుకోవచ్చు. ‘నేను అక్షరాలా యాంటీ నాచ్‌నే, వివేకలేశం వున్నవారు ఎవరు యాంటీ నాచ్ కారండి?’ అని మధురవాణి అనడమే దానికి సాక్ష్యం. కానీ గురజాడకు వేశ్యల పట్ల ఉండే దృక్పథాన్ని మరింత తరచి చూడవలసిన అవసరముంది. సంస్కరణ వాదమంటే గౌరవమున్నా, ‘వేశ్యలను చూడమనీ, మాట్లాడమనీ, తాకమనీ’ ప్రకటించే సంస్కర్తల పట్ల గురజాడకు అభ్యంతరాలున్నట్టు మనకు ఆయన రచనల్లో తెలియవస్తుంది. వేశ్యలను పెళ్లి పేరంటాలకు పిలవకుంటే వారెట్లా బతకాలనీ, వారు గిరీశం వంటి కుక్కల పొత్తుకే తగుదురా, సౌజన్యారావు వంటి సత్పురుషులను చూడడానికి కూడా వీలవదా అనీ, వారు విద్యాబుద్ధులు నేరిస్తే సౌజన్యారావు వంటి వారు వారిని పెళ్లాడుదురా, అనీ మధురవాణి అనేక సందేహాలు వ్యక్తం చెయ్యడం దీనికి తార్కాణం.
వేశ్యల ధనదాహాన్నీ, వారి వల్ల కలిగిన కుటుంబ సంతాపాలనూ చిత్రించిన చింతామణి వంటి అనేక నాటకాలు తెలుగు వారికి చిర పరిచితాలే. వేశ్యలనే కాదు, వేశ్యామాతలను కసిదీరా తిట్టి ప్రేక్షకులకు ఆనందం కలిగించిన సన్నివేశాలు ఆ నాటకాలలో ఉండేవి. కానీ ఆ దుర్మార్గం వృత్తిలో ఉందనీ, వ్యక్తుల్లో కాదనీ గుర్తించి, వేశ్యలలో ఆరాధ్యులున్నారని చెప్పగలిగిన క్రాంతదర్శి గురజాడ. వృత్తి ధర్మానికీ, తన ప్రవృత్తికీ ఉన్న వైరుధ్యం కరటకశాస్త్రి స్నేహితుడై ఉండి కూడా గుర్తించనందుకు మధురవాణి నొచ్చుకుంటుంది. ‘వృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట్ల ద్రవ్యాకర్షణ చేస్తాను గానీ, మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలచారా? మీ తోడబుట్టుకి ప్రమాదం వచ్చినప్పుడు నేను డబ్బుకి ఆశిస్తానా?’ అని ఆమె అంటుంది.
స్వార్ధవర్తనం మరింతగా సమాజంలో పెరిగి, అన్ని రంగాల్లోనూ వచ్చిన నైతిక పతనమై, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కలుపుమొక్కలు (1935) కథలో దుర్గంధంగా మనకు పడుతుంది. ఆ కథలో, సబ్ కలెక్టరూ, ప్రెసిడెంటూ, ప్రెసిడెంటు గుమస్తా, బ్రాహ్మడూ మొదలైన మర్యాదస్తుల పాత్రలందరూ కలుపు మొక్కలే. బహుశా అందరూ కలుపుమొక్క అని భావించే వేశ్య శేషాచలం మాత్రమే ఈ కథలో కలుపుమొక్క కాని పాత్ర.
శ్రీపాద వారిదే మరొక రచన వడ్లగింజలు అనే కథ. చదరంగం ఆటలో అసమానప్రతిభావంతుడు శంకరప్ప రాజుగారితో ఆడి గెలవడం కథాంశం. దాని రచనాకాలం 1941 అయినా కథా కాలం మరింత వెనక్కి జరిగినట్టు ఆయన నేపధ్యం ద్వారా సూచిస్తారు. ఈ కథలో శాస్త్రిగారి చిన్నచిన్న వ్యాఖ్యానాలతో వేశ్యల జీవితాలలోని కళా వైదగ్ధ్యాన్ని ఊహించే ప్రయత్నం చెయ్యవచ్చు. తన గతాన్ని రాజు వద్ద ప్రస్తావిస్తూ స్వయంగా శంకరప్ప ఇలా చెప్పుకుంటాడు. చంద్రవదన అని మా వూళ్ళో వొక వేశ్య, ఆమె మా నాయనగారి దగ్గిర కావ్య నాటకాలంకార గ్రంధాలు నాతో పాటూ క్షుణ్ణంగా చదివింది. భ్రాతృ ప్రేమతో పెంచి నన్నామె చదరంగంలో ప్రవేశపెట్టి దిద్దింది, అని తన చెల్లెలు అంటూ చంద్రవదనకు కృతజ్ఞత చెప్పుకుంటాడు.
తరవాతి పాత్ర అలివేణిది. ఆమె తన నృత్య పాటవంతో పెద్దాపురపు సంస్థానానికి ప్రతిష్ట చేకూర్చిన కళాకారిణి. శంకరప్ప ప్రజ్ఞ అన్నా, అతని వ్యక్తిత్వమన్నా ఆమెకు అంతులేని ఆరాధన. రాజసభలో, శంకరప్ప సమక్షంలో అలివేణి అద్భుత నాట్య ప్రదర్శనకు అందరూ స్థాణువులైపోతారు. ‘ఎదుట కూచుని మహా విద్వాంసుడు చూస్తున్నాడన్న ఉత్సాహంతో అలివేణి ఇవాళ వొళ్ళు మరిచిపోయింది’ అని ఒకరంటే, ‘అదీ సంగతి, కోట్లిచ్చినా కళాశీలిక లాంటి ఆవేశం కలగదు మరి!’ అని మరొక రనుకుంటారు. ‘వేశ్యల కళకు ప్రేరణ డబ్బే’ అన్న లోకపు నమ్మకపు నేపధ్యంలో, కళాకారులకు మాత్రమే అర్ధమయ్యే ఆ కళావేశాన్ని, మైమరుపునూ వేశ్య అలివేణిలో దర్శించిన రచయిత చూపు మనకు కొత్త కోణాలను పరిచయం చేస్తుంది.
డబ్బుతో కొనలేని అంశాలను చిత్రించే అటువంటిదే మరో ప్రయత్నం 1940లలో వచ్చిన కుటుంబరావుగారి కథ, నీకేం కావాలి? లోని కస్తూరి పాత్ర. వేశ్య అయి ఉండీ, డబ్బుకు ఆశ పడని ఆమెలో ఒక మంచితనాన్ని ఊహిస్తాడు కథకుడు. ఆమెను, ఆ గాట్లోంచి ఎత్తి ఇంకో గాట్లో వేసి, సంస్కరించాలనీ, ప్రేమ మీదా, నీతి మీదా అభిమానం పుట్టించాలనీ అతని ప్రయత్నం. మధురవాణి చర్చించిన వేశ్యా వివాహపు సాధ్యాసాధ్యాలను మనం ఈ కథలో చూడవచ్చు. ఎటువంటి ఆడదైనా, తన ఆర్ధిక సమస్యల భారం మోసే మగవాణ్ని – ఎటువంటి వాడైనా సరే, ప్రేమించకుండా ఉండలేదు అని కథకుడి ధైర్యం. అది సమాజం లోని చాలా మంది నమ్మకం కూడా. కానీ కస్తూరి ప్రేమ అమ్మకానికి దొరకనిదని రచయిత మనకు స్పష్టం చేస్తారు. తనను అదుపు చేసే వారిని, బంగారమిచ్చినా కస్తూరి తన గడప తొక్కనీదు. తోటి స్త్రీ లతో పోల్చుకుని తనను తాను తక్కువ చేసుకోదు. ‘ఎవరి గొప్ప వారిదీ’ అంటుంది. తనని గాని, తన వృత్తిని గాని హేళన చేస్తే సహిస్తుంది నిందిస్తే సహించదు – ఆమె ఆత్మాభిమానం అటువంటిది. ఆమెతో సాన్నిహిత్యం పెరిగాక, అతని దురభిమానం పటాపంచలై పోతుంది. ఎట్టకేలకు ఆమె ప్రేమను సంపాదించుకుంటాడు. తన యింటికి వచ్చి ఉండమని ఆహ్వానిస్తాడు. ఆమె తిరస్కరిస్తుంది. ప్రేమబంధానికి కట్టుపడుతుంది కానీ దాని కోసం తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టదు. వృత్తి మానేసేటందుకు మనస్ఫూర్తి గా సమ్మతిస్తుంది. తన ఇంట్లో తానుంటాననీ, అతన్నే వచ్చి తన ఇంట్లో ఉండమనీ కోరుతుంది. నీకేం కావాలి? అన్న ప్రశ్నకు సమాధానంగా, ‘నీ మీద ప్రేమ ఉండి, నేనంటే ఇష్టం లేనివాళ్ళను తెచ్చి పెట్టకు, అంత కంటే నా కింకేమీ అక్కర్లేదు,’ అని చెప్తుంది. ధన ప్రలోభాలకీ, సంస్కరణ వాదాలకీ ప్రేమ అతీతమైనదనీ, ఆ ప్రేమ కంటే కూడా అపురూపమైనది ఆత్మగౌరవమనీ ఈ కధలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆదర్శాలు మనసును మొద్దు బార్చడం బహుశా గురజాడ లాగే కొ.కు. కూడా తన కాలపు సమాజంలో గమనించారనుకోవచ్చు.
సంస్కారాల్లో మౌలికమైన మార్పు రాని వారికి ఆదర్శం వట్టి నోటి మాటగా మిగులుతుందనీ, అటువంటి వారి మనసు సమాజపు ద్వంద్వనీతినే అనుసరిస్తుందనీ, వారు పేరుకే విశాల హృదయులనీ మనకు చూపించే కథ పతితులు (1949.) సంస్కరణ వాదం వేళ్ళూనిందని నమ్మే కాలంలో వచ్చిన గోపీచంద్‌గారి ఈ కథ, ఆరంభశూరులు వేశ్యాకులంలో జన్మించిన వారిని వివాహమాడి వారికి చేసే మేలు కంటే కీడే ఎక్కువని హెచ్చరిస్తుంది. ఇందులో నాయిక, ‘ఒకరి కోసం నీతిగా ఉండం, మన కోసం మనమే ఉండాల’ని నమ్మే వివేకం గలిగిన స్త్రీ. భోగం కులంలో జన్మించిన కారణం చేత సంఘం ఆమె పట్ల అవలంబించిన భేదభావమూ, నడిసముద్రంలో వదిలేసిన భర్త మోసమూ, దానికి కుంగిపోక కుట్టుపని చేసుకుని తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకున్న ఆమె ధీరగుణమూ మనకు ఈ కథలో ఆనాటి సమాజపు వాస్తవాలుగా గోపీచంద్ చిత్రించారు. కథానాయిక అక్క పాత్ర నీకేం కావాలి? కథ లోని కస్తూరి పాత్ర లాగానే సంసార స్త్రీల అతిశయానికి చిరాకు పడుతుంది, సమాజం పట్ల ధిక్కారస్వరాన్ని వినిపిస్తుంది.
ఆర్ధిక స్వాతంత్ర్యం స్త్రీకి లేకపోవడాన్ని కుటుంబరావు, గోపీచందుల కంటే ముందే కలం పట్టిన చలం గుర్తించారు. పైగా ఆ అస్వతంత్రతనూ, దాస్య భావాలనూ చూసి మురిసే వారిని ఆయన గర్హించాడు. 1925 లోనే చలం తన స్త్రీ అన్న పుస్తకంలో ఇలా అంటారు: ‘తను ప్రతి దినమూ, నాల్గణాలు సంపాయించుకునే స్త్రీ, దేహమమ్ముకునే వేశ్య – సమస్తాభరణాలతో బనారసు చీరెలతో, కులుకుతూ ధర్మ భర్త పక్కన పదిమంది బిడ్డలతో, గుర్రపు బండిలో పోయే పుణ్యస్త్రీ కన్న పవిత్రురాలూ, స్వతంత్రురాలూ.’ లోకం ఆమోదించనిదీ, లోకం జాగ్రత్తగా కప్పిపెట్టుకున్నదీ బయట పెట్టడం ఆయన రచనల లక్ష్యం.
సంసార స్త్రీ కంటే నయమనే మాట కొంత వరకూ నిజమే కానీ చలం ఊహించినంత స్వతంత్రత వేశ్యా వృత్తిలో కూడా లేదేమో అనిపిస్తుంది. వేశ్యల జీవనాలనూ, నిర్వహణనూ సమాజంలో పెద్దమనుషులుగా చెలామణీ అయ్యే కొందరు నడుపుతూ ఉండేవారు. కందుకూరి కాలంలో సమాజం ప్రోనాచ్, ఏంటి నాచ్ లుగా చీలి పోయింది. ప్రోనాచ్ లని మనం గుర్తించే వారిలో కొన్ని వాదాలను క్లుప్తంగా ఇలా చెప్పుకోవచ్చు.
దేవదాసీలు దేవుని సేవకు అంకితమైన కళాకారులనీ, వారి జీవనోపాధిని తొలగించి వారిని వ్యభిచారులుగా మార్చవద్దనీ వాదించి, వీరేశలింగం గారిని ప్రతిఘటించిన వారిని ప్రోనాచ్ లలో ముందు పేర్కొనాల్సి ఉంటుంది. వారిలో కర్నాటక సంగీత విద్వాంసురాలైన బెంగుళూరు నాగరత్నమ్మ వంటి ప్రసిద్ధులు కూడా ఉన్నారు. కానీ ఏంటి నాచ్ ఉద్యమానికి రాజ్య సహకారం కూడా తోడవడం చేత ప్రోనాచ్ వారి ఈ వాదం నిలదొక్కుకో లేకపోయింది అని మనకు తెలుస్తోంది. మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథల్లో దేవదాసీల గురించీ, వేశ్యావృత్తి గురించీ ఒక భిన్నమైన దృక్పథం కనిపిస్తుంది. శంకరమంచి సత్యం తమ అమరావతి కథలలో దేవదాసీల ప్రాభవాలనూ, జీవితాలనూ మన కళ్ళ ముందుంచారు. పందిరిపట్టిమంచం కథలో చిన ముత్తెం నిస్వార్ధ ప్రణయం కథాంశం.
వేశ్యల జాతి అనాదిగా నృత్యగానాలతో అలరించడానికే ఉన్నదనీ, అది కులవృత్తిగా కలవారు దానినే అవలంబించాలనీ, పెళ్లిపేరంటాలలో వేశ్యలు తిరుగాడితే శుభమనీ, వారిని ఆదరించడం కళాపోషణ అనీ కొందరు అభిప్రాయ పడేవారు. ఇంకొందరు ‘బోగం వారు లేకపోతే సంసార్లు అందరూ చెడిపోతారు’ అంటారని కందుకూరి వారి వేశ్యాభిమానపు బండారం తమ ప్రహసనాల్లో బయటపెట్టారు. వేశ్యా వృత్తిని అంటి పెట్టుకుని బ్రతకడం – వేశ్యలతో మేజువాణీ లను చేయించడం, ఆ బృందాలను నడపడం వంటి పనులు చేసే వారి గురించిన చిత్రణ కూడా కందుకూరి సాహిత్యంలో మనకు లభిస్తుంది. ‘వేశ్యలకు యెంత జనవశ్యం ఉన్నదో వేశ్యల మూలంగా ఆయనకూ అంత జనవశ్యం ఉన్నది,’ అని అటువంటి వారికి సమాజంలో ఉండే పలుకుబడికి కారణాలను విశదీకరిస్తారు. వేశ్యావృత్తి సమర్ధకులకు ఒక ఉదాహరణ మనకు కరటక శాస్త్రి వంటి వారి రూపంలో కన్యాశుల్కంలో కూడా కనిపిస్తుంది. కాపు మనిషినై పుట్టినా బాగుండునని అనుకుంటున్న మధురవాణి విరక్తి అర్ధం కాని కరటక శాస్త్రి ఆమె వంటి ‘వేశ్యా శిఖామణి లేకపోతే భగవంతుడి సృష్టికే లోప’మంటూ మెరమెచ్చు మాటలు చెప్తాడు. అలాటి మాటలు విని విని ప్రాణం విసిగి ఉంటుంది, సృష్టి సంగతికేం గానీ చిక్కులలో మీకు లోపం వస్తుంది లెమ్మని అతని స్వార్ధ ప్రయోజనాలను మధురవాణి బయట పెడుతుంది.
కన్యాశుల్కం నాటకంలో గురజాడ మధురవాణిని స్త్రీజాతికి మకుటాయమానంగా తీర్చిదిద్దినది ఎంత వాస్తవమో, ఆ పాత్రలో అంతర్లీనంగా వృత్తి పట్ల ఆమెకు కలుగుతున్న విరక్తీ, కుటుంబ జీవనం సాగించాలన్న ఆమె కాంక్షనూ అంతే ఆర్తితో చిత్రించారన్నది వాస్తవం. శ్రీపాద వారి వడ్లగింజలు కథలో కళాకోవిదుల జీవితాలతో పాటూ, శంకరప్ప మనసు కలిచేసి అతని ఆటను పాడు జేయడానికి ముగ్గురు వేశ్యలు నియామకం కావడం మనం చూడవలసిన చేదు వాస్తవం. వేశ్యల పాటి స్వతంత్రత కుటుంబ స్త్రీలకు లేదని చలం, కుటుంబరావు ఆవేదన వ్యక్తం చేసిన మాట నిజమే కానీ ప్రేమ బంధమే స్త్రీ పురుష శరీర సంపర్కానికి ప్రాతిపదిక కావాలని వారు కూడా స్పష్టం చేసి ఉన్నారు. ‘భార్యలూ ఉండాలి, వేశ్యలూ ఉండాలి’ అని కోరే పురుషుల సంస్కారాన్ని అసహ్యించుకుంటారు గోపీచంద్.
1947లో దేవదాసి ఆక్ట్ వచ్చి ఆ కులవృత్తి రద్దయిన తర్వాత, పేదరికంతో పాటూ, తోటి స్త్రీల అసూయా ద్వేషాలకూ, పోలీసుల జులుంకీ, ఊరి పెద్దల నిరసనకూ గురై దేవదాసీల జీవితాలెలా అస్తవ్యస్తమయ్యాయో తెలియజేసే ఉమామహేశ్వరరావు గారి కథ – నోరు గల్ల ఆడది (2010) ప్రోనాచ్ వారు హెచ్చరించిన విధంగానే ఆనాడు దేవదాసీల పునరావాసాల్లో అన్యాయం జరిగిందని మనకు తెలియజేస్తుంది.ఈనాటికీ సమాజపు అంచుల లోని కొందరు స్త్రీలు వ్యభిచారం చేసి పొట్ట పోసుకుంటున్నారన్నది వాస్తవం. సంస్కరణ వాదం ఆ కాలపు సమాజం లో చైతన్యం తెచ్చిన మాట నిజమే అయినా సమస్య లోతుల్లోకి అది వెళ్ళలేకపోయింది. ప్రస్తుతం ఆవృత్తి వారసత్వంగా అందకపోయినా, వారసత్వంగా అందే పేదరికం ఆ స్త్రీలను చాలా సులభంగా అటు వైపు తోస్తుంది. ‘కమర్షియల్ సివిలైజేషను’ అని రావిశాస్త్రిగారు పిలిచిన స్వాతంత్ర్యానంతరపు భారతంలో వేశ్యావ్యవస్థ కొత్త రూపం తెచ్చుకుంది. కులవృత్తి అనే ఆచ్చాదన తొలిగిపోయాక, నియమిత వెల లేని వస్తువూ, తనని తానే అమ్ముకోవాల్సిన వస్తువుగా శరీరసౌఖ్యం అందించే పరికరంగా స్త్రీ శరీరం మారిన విధానం నగ్నంగా మన కళ్ళ ముందుకొచ్చింది. అలా ‘అమూల్యమైన దానికి మూల్యం నిర్ణయించే’ పాపానికి ఆవేదన చెందుతూ 1949లో వచ్చిన కథ, రావిశాస్త్రి గారి విలువలు.
స్త్రీ తన శరీరాన్ని గతిలేక అమ్ముకుంటుంటే, చట్టం ఆమెకు రక్షణ కల్పించక పోగా, ‘టేరిబుల్ న్యూసెన్సు అనీ, కమ్చీతో కొట్టాలనీ’ పోలీసులు సాగించే జులుం, 1961లో రావిశాస్త్రి గారిని ఆరు సారా కథల్లో ఒకటైన న్యాయం అనే కథ రాసేందుకు ప్రేరేపించింది. నూకరాజు కంపెనీ నుంచి ఆమెను కొందరు షిప్పు లోంచి దిగిన ముష్కరులు ఒక రాత్రికని కొనుక్కుంటారు. తాగించి, క్రూర జంతువుల్లా హింసించి, పోలీసు స్టేషను ముందు ఒళ్ళు తెలియని ఆమెను నగ్నంగా పడేసి పోతారు. పోలీసులు కబురు పెడితే కంపెనీ ఓనరు బట్టలు మాత్రం పంపి ఊరుకుంటాడు. పోలీసులు ఆమెపై న్యూసెన్సు కేసు పెడతారు. జడ్జీ ఆమెను నేరం చేసేవా? అని అడిగితే కేసు ఒప్పేసుకుంటానండీ అని జవాబు ఇస్తుంది. ‘ఈ పన్లు చేసుకోడం వారి బతుకు, వారిని పట్టుకోడం మా బతుకు, ఏ బతుకు బతికే వారు ఆ బతుకు బతకాలి కదా’ అని వేదాంతం చెప్పే హెడ్డు మాటలకు గుండెలు పగిలి ఆ స్త్రీ మెజిస్ట్రేటు ముందు ‘నా కొద్దీ బతుకు, నన్ను చంపేయండి’ అంటూ విలపించే సన్నివేశం ఆ వృత్తి లోని ఘోరాన్ని ఎలుగెత్తి చాటుతోంది.
1969లో వచ్చిన కాళీపట్నం రామారావుగారి కథ, హింస – పదేళ్లకు మించని సంగి కోణం నుండి వ్యభిచారుల కుటుంబాల వ్యధనూ, నిస్సహాయతనూ చిత్రిస్తుంది. సంగి తల్లి ఆవాల జగ్గమ్మ, తన పెద్ద కూతురు పైడమ్మకు పాతూరి గొల్లల సంబంధం చేసింది. అత్త వారు ఆమెను పొగాకు పనులకు పంపేరు. పొగాకు పందిళ్ళలో చెడిపోయి, కాపురమూ చెడి, భయపడి పైడమ్మ పట్నం పోయింది. మొదట మోసానికి లొంగిన మనిషి బలవంతానికి పడిపోయింది. ఆ పడ్డం, పడ్డం దిగజారి దిగజారి సబ్బారపు సంజీవమ్మ కంపెనీలో తేలింది. వ్యభిచారంలో దిగబడిపోయిన అప్పను ఇక పైకి లాగలేమని తీర్పునిస్తుంది బంధుగణం. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది తల్లి, కనబడని శత్రువు మీద యుద్ధం ప్రకటిస్తుంది చెల్లి. జరగవలసిన దానికీ, జరిగిన దానికీ మధ్య ఉన్న అగాధాన్ని చూపించడం కారా గారి శిల్పం. కులవృత్తిని రూపుమాపామని ఒక వైపు చెబుతూ, మరోవైపు కుటుంబపు తోడూ నీడా లేకుండా ఒక అమానవీయమైన వాతావరణాన్ని కృత్రిమంగా తయారు చేసి, దురదృష్టం కొద్దీ దానిలో చిక్కుకున్నవారిని దానిలోనే మగ్గమని చేతులు దులుపుకుంటున్న సమాజానికి, అది సాగిస్తున్న హింసను అద్దం లో చూపించడం – రామారావు గారి దృక్పథంగా మనకు కనిపిస్తుంది. అటువంటి దురదృష్టవంతులను తిరగబడమని ఉద్బోధించడమే ఆయన ఆశయం.
పైడమ్మ జీవితమే కథాంశం అయినా నోరులేని పాత్రలా ఆమె కేవలం సాక్షిగా మిగిలి ఉంటుంది. ఆ మూగ బాధకు ప్రతిస్పందన యిదా అన్నట్టూ నోరు గల్ల ఆడది కథ లోని స్వర్ణ ఏటికి ఎదురీదుతుంది. ‘ఆ నోరు బెట్టుకోకపోతే యీ వూళ్ళో నిలవనీడుణ్ణా ఆ యమ్మికి? యీ పొద్దుటికి గూడా ఆయమ్మి మానంగా బతకతా వుండాదంటే ఆ నోటివల్లనే గదా నాయినా…’ అంటూ అవ్వ స్వర్ణక్క గురించి చెప్పిన మాటలు సమాజాన్ని ఎదుర్కునే తరుణోపాయం లాగా కనిపిస్తాయి.
1969లో వచ్చిన రంగనాయకమ్మ గారి అంధకారంలో అనే నవల వేశ్యల దుర్భర జీవితాలను వివరంగా చిత్రీకరించింది. అప్ప చెల్లెళ్ళ నిస్సహాయత హింస కథలో మనకు కారా వారు చూపిస్తే, ఈ నవలలో, అక్కా తమ్ముళ్ళ మధ్య తలవని తలంపుగా జరిగిన ముఖాముఖీ మనను నిశ్చేష్టులను చేస్తుంది. రాజేశ్వరి తల్లిపోయాక, సవతి తండ్రి తనపై చేసిన దురాగతం వల్ల పట్నం వచ్చి వ్యభిచారం పాలౌతుంది. పద్దెనిమిదేళ్ళ సవతి తమ్ముడు రమణ బ్రోతల్ హౌస్ లోకి వస్తాడు. అక్కడ అక్కను గుర్తించి తల ఎత్తలేకపోతాడు. ‘ఎంత పాపం తప్పిందక్కా’ అని ఏడుస్తున్న తమ్ముడికి బుద్ధి చెప్తూ ‘నేనేనా అక్కని? ఇక్కడి ఆడవాళ్ళందరూ అక్కలూ చెల్లెళ్ళూ కారా? అదంతా పాపం కాదా?’ అని అడిగే రాజేశ్వరి ప్రశ్నకు సమాజమే సమాధానం చెప్పాలి. వారి జీవన స్థితి గతులపై రచయిత ఆవేదననూ, దృక్పధాన్నీ ఈ వాక్యంలో మనం అర్ధం చేసుకోవచ్చు: ‘రోడ్డు పక్క కంపుకొట్టే యూరిన్ దొడ్డిలా, శారీరక కామాన్ని నివారించుకునే మరుగు దొడ్డి ఆ బ్రోతల్ హౌస్!’
1975-78 మధ్య వచ్చిన పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారి కథల్లో కటిక పేదరికం కారణంగా ఆ వృత్తికి చిక్కుకున్న స్త్రీలు మనకి తెలియని వారి చరిత్రలు వివరిస్తారు. చీకటి అనే కథలో కనీసం ఒక పావలా అప్పు దొరికితే కాసిని టీనీళ్లు తాగుదామని ఆరాటపడుతున్న సావిత్రి జీవితం కంటిక్కడుతుంది. తల్లి కాయకష్టం చేసి ఆమెను పెంచింది కానీ సావిత్రికి ఈ శాపగ్రస్త జీవితం తప్పించలేకపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం కనుక కర్ఫ్యూ రోజుల్లో పైసా సంపాదన దొరక్క ఆకలికి మలమల మాడి పది రూపాయలు అప్పు తీసుకుంటుంది. వడ్డీగా ఆమె శరీరం శిథిలమైపోతున్నా ఆ అప్పు మాత్రం అలాగే ఉండడమనేది, ఆ వృత్తిలో ఉండేవారి జీవితాలకు ప్రతీకగా తోస్తుంది. ‘తనకు పాపపు బ్రతుకిచ్చిన దేవుడు పైనుండి వసూలు చేస్తున్న వడ్డీ లాంటి చీకటి’ అనే వాక్యం సమాజం వీరి నుండి అనాదిగా వసూలు చేస్తున్న అధర్మ వడ్డీని మనకు గుర్తు చేస్తుంది. మరో కథ, సతీ సావిత్రి, వేశ్యల వృత్తి లోని పరాధీనతకు చరమ సీమలను చూపిస్తుంది. ఏ ‘కంపెనీ’ లోనూ చేరకుండా తన ఒళ్లమ్ముకున్న డబ్బు తాను తిందామనుకోవడమే పేరాశ ఔతుంది ఈ సావిత్రికి. ఒక పసిబిడ్డ తల్లిగా కనిపిస్తే, కాస్త సులభంగా వృత్తి చేసుకోవచ్చని ఊహిస్తుంది. ఐదు నెలల పసికందు తల్లికి తనింటిలో ఆశ్రయమిస్తుంది. ఆ బిడ్డను రాత్రిపూట ఎత్తుకుని రోడ్డెక్కుతూ ఉంటుంది. దురదృష్టం! ఒకనాడు ఆ పసిగుడ్డుతో సహా దొరికిపోతుంది. లాకప్‌లో బిడ్డ ఆకలితో రాత్రంతా గగ్గోలు పెడుతుంది, కన్నతల్లి కాదు కనక పాలివ్వలేని అసహాయతతో సావిత్రి కుమిలిపోతుంది. ఓడిపోయి మాణిక్యం కింద వృత్తి చేసుకు బ్రతికేందుకు ఒప్పుకుంటుంది, అప్పుడు మాణిక్యం జరిమానా చెల్లించి ఆమెను బయట పడేస్తుంది. అతి కష్టం మీద పసిబిడ్డను ప్రాణాలతో తల్లికి ఒప్పచెప్పిన సావిత్రికి తన దురదృష్టం తలుచుకుని ఏడుపు పొంగుకొస్తుంది.
వేశ్యల దుస్థితి ఇలా దిగజారుతూనే ఉండగా, ఈ శతాబ్దారంభంలో ఎయిడ్స్ మహమ్మారి వీరి జీవితాలను అతలాకుతలం చేసింది. ఈ పరిణామాన్ని, దాని పర్యవసానాలనూ 2001లో కుప్పిలి పద్మ, కొత్తచావు అనే కథలో వర్ణించారు. వేశ్యల దుస్థితికి అసలు కారణాలు – అవకాశవాదుల దురాశ, ఆకలి, దరిద్రం, చట్టం పేరుతో జరిగే హింస; వీటితో – మందు లేని ఎయిడ్స్ వ్యాధిని పోల్చడం చాలా సరైన ఉపమానమనిపిస్తుంది. దారిద్ర్యం కొందరికి ఆ వృత్తిని తప్పనిసరిగా చేస్తే, వారితో బిజినెస్ నడిపే కంపెనీలు దాని నుండి బయట పడాలనుకునే వారిని అడ్డుకోడం ఈ కథలో మనం చూస్తాం. సమాజం మీది తిరుగుబాటు ధోరణీ, అంతటి వ్యాధి పైబడినా బ్రతుకు మీది తీపితో వేశ్యాగృహం లోంచి బయటపడాలని వారి ప్రయత్నం లోని ఆశావాదమూ – ఈ కథలోని ప్రత్యేకతలు.
మానవ సమాజంలో – ఆకలి కన్నా, అధిక శ్రమ కన్నా, నిరుద్యోగం కన్నా, కులం కన్నా, అన్నిరకాల దురంతాల కన్నా – అతి క్రూరమైన, అతి నీచమైన దురంతం వ్యభిచారం. వేశ్యావృత్తి అలాగే కలకాలం వర్ధిల్లాలనే కోరుకునేవారు సమాజంలో ఈనాటికీ ఉండనే ఉన్నారు. వ్యభిచరించడమనేది ప్రజల స్వంత విషయమని వీరి వాదం. దానికి వీలు కల్పించే వేశ్యా వృత్తి కూడా అన్ని వృత్తుల వంటిదేనని వీరి నమ్మకం. కొందరు సమ్మతించి ఆ వృత్తిలో ప్రవేశిస్తే సమాజం వారిని నీచంగా చూడడం అన్యాయమనీ, దానికి మిగిలిన వృత్తులతో సమానమైన గౌరవం కల్పించాలనేది ఆధునికమైన వేశ్యావృత్తి సానుభూతిపరుల లక్షణమని చెప్పుకోవచ్చు.
కానీ దీనిలో ఉన్నవారు అత్యధిక శాతం నిరుపేదలనీ, మరొక దారి దొరక్క కొందరూ, ఎదురు తిరగడానికి ధైర్యం చాలక ఆ వృత్తిని మోస్తున్నవారు మరికొందరూ, పారిపోయే ప్రయత్నాలు ఫలించక అణచివేతకు గురౌతూ ఇంకొందరూ – ఈ వృత్తిని సాగిస్తున్నారనీ, తమ ఇష్టంతో వారక్కడ జీవించడం లేదనీ ఈ సాహిత్య కారులు భావిస్తున్నట్టు అనిపిస్తోంది. ఆకలికి ఆగలేని పసివాడు ఎంగిలాకుల్లోంచి అన్నం ఏరుకోబోతూ ఉంటే, ఒక కుక్క అతని చేతిలో నుండి ఆ అన్నం లాక్కోబోయే చందంగా పోలీసులూ, గూండాలూ వేశ్యలను వేధిస్తున్నారన్నది అందరూ ఏకగ్రీవంగా అంగీకరించే వాస్తవం. కానీ ఎంగిలాకులు ఏరుకునే దుస్థితిలో తమను ఉంచుతున్నందుకు సమాజం బాధ్యత వహించాలని పోరాటం సాగించే బదులు, కుక్కలు లేకుండా పోతే మాకంతకంటే ఇంకేమీ అక్కరలేదనే వాదం ఎంత తెలివి మాలినదో, ఈ ఆధునిక సానుభూతి ధోరణులు అంత ప్రమాదకరం.
వాస్తవంగా ఎదురయ్యే సమస్యలను పుస్తకాలు ఏం తీరుస్తాయన్న సంశయం కొంతమందికి కలగవచ్చు. మనుషుల జీవితాల లోని వాస్తవ సంఘర్షణ వెనుక నైతిక, ధార్మిక సమస్యలు విధిగా ఉంటాయి. అవి ఎంత ఎక్కువగా చర్చ లోకి వస్తే సమస్యా పరిష్కారానికి అంత దగ్గరౌతాం. ‘వ్యభిచారం అనేది కుట్టు పనీ, నేతపనీ, వడ్రంగం వంటి వృత్తే ఐతే, ఆ వృత్తుల్లాగే ఇది కూడా సమాజానికి ఎప్పుడూ కావాలి. కానీ సెక్స్ అనేది శరీర ధర్మం. శరీర ధర్మాలేవీ శ్రమలు కావు, వృత్తిగా కనపడే ప్రతీదీ వృత్తి కాదు,’ అని ఈ సమస్య పై రంగనాయకమ్మ తమ అభిప్రాయం చెప్తారు.
వేశ్యావృత్తిలో ఉన్న వారి పట్ల సానుభూతినీ, వారి వ్యక్తిత్వం పట్ల గౌరవాన్నీ ప్రకటించిన రచయితలు తమ కాలం లోని ప్రజా బాహుళ్యపు విశ్వాసాలకు భిన్నమైన దృక్పథాలతో రచనలు సాగించారు. వీరందరూ ఇటువంటి ప్రత్యేక వ్యక్తిత్వంతో సృష్టించిన వేశ్యల పాత్రల ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే అసహజమైన వృత్తిని సమాజం వారిపై రుద్దింది కానీ సహజసిద్ధమైన వారి విలక్షణతలను రూపు మాపలేకపోయింది అని. మానవత్వానికీ, న్యాయవర్తనానికీ, ఆత్మగౌరవానికీ, కళాభిమానానికీ ప్రతీకలుగా వేశ్యలను కొందరు దర్శిస్తే, ఆ చీకటిరాజ్యంలో చిక్కుకుని వెలుగు లోకి వచ్చే అవకాశం కోసం వారి ఆరాటాన్నీ, పోరాటాన్నీ మరి కొందరు చిత్రించారు. ఈనాడు వ్యభిచారం మునుపటి కంటే మరింత భయంకరమైన పరిస్థితులను కల్పిస్తూ ఉంటే, సమస్య మరింత క్లిష్టమైపోయి, వేశ్యలు వారి కథ వారే చెప్పుకున్న సందర్భంలో ఈ రచయితల స్పందనను మరొక్కసారి పరామర్శించవలసిన అవసరం ఉంది.
సెక్స్‌ని అమ్మే, కొనే పరిస్థితులు సమాజంలో పోతేగానీ ఈ సమస్య పూర్తిగా సమసిపోదు. ముందు ముందు అలాటి స్వప్నం సిద్ధించిన నాడు ఈ వృత్తిని తప్పనిసరై చేసుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవచ్చు. కానీ అంతవరకూ ఆ వలయంలో చిక్కుకుని బయట పడాలనుకునే వారికి తగిన పునరావాసమూ, వృత్తిని తప్పనిసరియై సాగిస్తున్నవారికి తగిన సామాజికన్యాయమూ అందాలనేదే ఈ సాహిత్యకారుల ఆకాంక్ష అని మనం అర్ధం చేసుకోవాలి.
[ఈ వ్యాసపు సంక్షిప్త రూపం డిసెంబర్ 7, 2015 ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురించబడింది ]-సం.https://www.andhrajyothy.com/artical?SID=180876
[ఈ వ్యాసపు తొలి రూపం - నా మాటల్లో ఇక్కడ వినొచ్చు]
 
https://www.youtube.com/watch?time_continue=9&v=eNaEyvlF-Wg