Sunday, 10 April 2016

ఓల్గా రచనల్లో 'స్వేచ్చ'


ఓల్గా గారితో... 


ఈ వ్యాసపు తొలి రూపం,  నా మాటల్లోhttps://www.youtube.com/watch?v=x9Bo3FtdVOg


ఓల్గా గారు స్త్రీవాదాన్ని సిద్ధాంత స్థాయిలో స్థిరపరిచే విధం గా చేసిన కృషీ, ఆమె సాహిత్యానికి చేసిన దోహదమూ- ఈ విషయాల గురించి సమాలోచన చెయ్యడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. మనల్ని గురించి మనం తెలుసుకోడానికి తన కథల ద్వారా ఒక పద్ధతిని ఇవ్వాలనుకున్నానని ఆమె ‘రాజకీయ కథల’ ముందుమాట లో రాసేరు. ఒక పాఠకురాలిగా ఆమె రచనలలో నేను గమనించిన విషయాలూ, వాటిని అర్ధం చేసుకునే క్రమంలో రేకెత్తిన ఆలోచనలనూ చర్చించే ప్రయత్నమిది.


స్త్రీవాదం అంటే పురుష ద్వేషంగా అర్ధం చేసుకోడం అనే ధోరణిని చాలా మందిలో గమనిస్తున్నాను. పురుషుడు స్త్రీని చిన్నబుచ్చడం, అణచి ఉంచడం – అతని స్వభావం లోనే ఉంటుంది అని నమ్మేటంతగా కథలూ, కవిత్వాలూ రావడం, పాఠకుల అభిప్రాయాలలో, ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ కూడా అటువంటి అవగాహనలు వెల్లడికావడం - ఈ సందర్భం లో నేను ప్రస్తావిస్తున్నాను. దానికి తగ్గట్టు గానే, స్త్రీ పట్ల వివక్ష చూపే పోస్టులనూ, స్త్రీ ద్వేషం వెళ్లగక్కే జోకులనూ, కామెంట్ లనూ కూడా గుర్తు పడుతున్నాను. స్త్రీ పురుషులిద్దరి మధ్యా దూరాలు పెరిగి పోతుండడం విస్మయ పరుస్తోంది. ఈ పరస్పర ద్వేషానికి అంతెక్కడ? ఈ ప్రవాహం లో కొట్టుకుపోకుండా, ఈ వరవడి ని ఎలా అర్ధం చేసుకోవాలి? సాహిత్యం దానికి ఎలా సహకరించగలదు? అనే ప్రశ్నలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఓల్గా గారి రచనలను చదువుతూ ఉంటే, నాకు ఒక విషయం స్పష్టమౌతూ వచ్చింది, ధైర్యాన్నీ ఇచ్చింది. అది - ఈ దూరాలకూ, వైరాలకూ మూలకారణమైన సమాజ భావజాలాల పాత్ర పట్ల ఉండే అవగాహన. 

ఓల్గా ‘సోషలిస్ట్ ఫెమినిస్ట్’ దృక్పధం తో సామాజిక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన కారణంగా, వ్యవస్థ స్వరూపాన్ని ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి ప్రభావం నుండి బయట పడాలని ప్రయత్నిస్తున్న పాత్రల రూపకల్పన ద్వారా మనకి మార్గ నిర్దేశం చెయ్యగలుగుతున్నారు అనిపించింది. ఆమె రచనల్లో, స్త్రీ దురవస్తలకు కారణమని పురుషుడిని దూషించే ఆవేశం కాక – స్త్రీ పురుషులిద్దరి పరిస్తితుల్నీ పరిశీలించి, సరిపోలుస్తూ, ఈ వివక్షకు కారణమైన ఆర్ధిక, రాజకీయ మూలాల గురించి ఆలోచింపచేసే లక్షణం కనిపించింది. 

వ్యవస్థ లో ప్రచారం అయ్యే భావజాలం - స్త్రీ పురుషుల పాత్రలను ఇలా ఉండాలని నిర్దేశిస్తుంది అని ఆమె రాస్తారు. అది మరింత స్పష్టంగా నాకు విముక్త కథల్లో రాముడూ, సీత పాత్రల అంతరంగ చిత్రణ లో కూడా వ్యక్తమైంది. రాజు ఇలా కనిపించాలి, రాజు భార్య గురించి ప్రజలు ఇలా చెప్పుకోవాలి ... ఇది ఎక్కడా రాసి ఉండని రాజ్యాంగం. ఈ భావాల ప్రాసంగికత రాజరికాలకే పరిమితమా అనే విషయాన్ని లోతుగా పరిశీలించాలి. పబ్లిక్ ఇమేజ్ అని మనం ఈనాడు లొంగిపోతున్న భావజాలాలకూ, త్రేతాయుగం నాటి రాముడి భయాలకూ ఏమాత్రం భేదం ఉంది అని కూడా ఆలోచించుకో వలసి ఉంది. వ్యక్తులు వారి కేది హితమో వారు గుర్తించకుండా అడ్డు పడుతున్న శక్తులను విశదీకరించే క్రమం లో స్వేచ్చకు నిర్వచనమూ, ప్రయోజనమూ, లక్ష్యమూ ఓల్గా రచనలలో వెల్లడి అయ్యాయని భావిస్తున్నాను. 

స్త్రీల అంతరంగాల చిత్రణ: 

స్త్రీ మీద జరిగే భౌతికమైన అణచివేతలూ, ఊపిరాడకుండా చేసే కట్టుబాట్లూ, సమాజం లోని వివక్షా, ఇవన్నీ స్వయం నిరూపకాలు. ఏదో ఒక మేరకు వాటిని గుర్తించగలుగుతున్నారు. వాటిపై పోరాటానికి కొంత వరకూ అడుగులూ పడుతున్నాయి. కానీ స్త్రీ అంతరంగాన్ని శాసించే శక్తుల్ని గురించి వర్ణించి చెప్పడం – ఓల్గా రచనల్లో నేను ప్రత్యేకంగా గమనించిన విషయం. ఆ శక్తులు, ఆమే రాసినట్టూ, “చాలా సంక్లిష్టమై, అర్ధం చేసుకోవటానికి వీలు లేనంత అందమైన, బిగువైన అల్లికతో బిగించబడినవి.” ఉదాహరణకు ‘వెలుతురు లోకి’ కథలో ఉన్నతోద్యోగంలో ఉన్నాకూడా, స్వేచ్చలేని పరిస్థితి ఎలా ఉంటుందనేది సరస్వతి జీవితంలో మనకు కనిపిస్తుంది. 'తనకు రాబోయే ఉద్యోగం మూలంగా తనను అనుమానించే హక్కు ఉందని తన చేత నమ్మించాడ'ని భర్త సంగతి చెప్తుంది. ఉద్యోగం లో చేరాక ఎంత లంచానికి ఎవరికి ఏ పని చేసిపెట్టాలో నిర్ణయం అతనిదైతే, సంతకం మాత్రమే ఆమెది. ఒక తోలుబొమ్మ లాగా ఆడుతుందామే అతని చేతిలో. భర్త చేసే పీడనలో అతని స్వలాభం, ఒక ప్రణాళికా సాధారణ దృష్టికి సైతం తెలుస్తూనే ఉంటుంది. సరస్వతి కూడా గుర్తిస్తుంది. 

కానీ, ఆమె చుట్టూ ఉండే మనుషులు అసంకల్పితంగా చేసే కట్టడి ఎలా ఉంటుందో ఈ కథలో వ్యక్తమయ్యింది అనిపించింది. అది తనను ఎదిరించే తన కింది ఉద్యోగి, అనిల్ ‘చూపులో తన మీద అసహ్యం ఎంత స్పష్టంగా కనపడిందో' గుర్తించిన తర్వాతే సరస్వతికీ స్పష్టమౌతుంది. 
ఆమె అంతరంగాన్నిలా ఆవిష్కరిస్తారు: అమ్మ, నాన్న ప్రేమగా, అపురూపంగా చూస్తారు. భర్త అధికారికంగా, గర్వంగా చూస్తాడు. ఒకోసారి నిరసన, చులకన కనబడతాయి అతని చూపుల్లో. బంధువులు, పరిచయస్తులూ అడ్మిరేషన్ తో నన్నాచూస్తారు. అసూయ గానన్నా చూస్తారు. కింది ఉద్యోగులు జాలిగానూ, భయంగానూ చూస్తారు. పై అధికారులు మనసులో ఏమున్నా గౌరవంగానే చూస్తారు. అసహ్యపడుతూ చూడరు. 
అద్దంలో తన ప్రతిబింబమే తనను అసహ్యించుకునేది. అనుక్షణం తన అంతరాత్మే తనను అసహ్యించుకునేది. 

ఈ భయం, గౌరవం, అపురూపం, ప్రేమా, జాలీ, అసూయా ... ఇవన్నీ ఆమెను ఏదోలా కట్టడి చేస్తున్న భావాలే. తానున్న పరిస్తితికి ... అసహ్యం మాత్రమే ఆమె తన పట్ల తాను ఫీల్ అయ్యేది. ఆ అసహ్యం అనే భావన గురించి లోతుగా పరామర్శించవలసి ఉంది అనుకుంటున్నాను. సరస్వతికి అసహ్యం ఎందుకు? తాను చేయవలసినది, చేయగలిగినది చేయలేకపోతున్నందుకు. అదే అసహ్యం అనిల్ కళ్ళలో కనిపిస్తుంది. అంటే ఆమె శక్తిసామర్ధ్యాలను అతను గుర్తించాడు. ఆమె పట్ల అతను చూపిన శ్రద్ధ ఆమెను విముక్తం చేసింది అనిపించింది. 

స్త్రీవాదం ఎత్తి చూపించే ఆ ‘సమాజపు ఒత్తిడి’ ని ఆకళింపు చేసుకుని ఆలోచిస్తే ... అది పురుషులను కూడా స్వతంత్రంగా ఆలోచించనివ్వదని మనం తేలికగా గుర్తుపట్టవచ్చు. అలా కాకుండా స్త్రీ పురుషులు స్వేచ్చా స్వాతంత్ర్యాలు కోల్పోకుండా జీవించే మార్గాన్ని అన్వేషించే ఒక స్త్రీని మనం ‘ప్రయోగం’ కథలో చూస్తాం. 

సునంద – ఒక పరిణత మనస్కురాలు. నరేంద్ర మాటల్లో చెప్పాలంటే, 
ఆమె - స్థిరంగా, ధైర్యంగా, శాంతంగా ఉంటుంది. దేనినీ దాచాలని గానీ, ప్రదర్శించాలని గానీ ప్రయత్నించదు. సహజమైన, బిడియం లేని స్వేచ్చా ప్రవృత్తి
ఆమె ఉత్తరాన్ని వర్ణిస్తూ ... అక్షరాలు ‘సునంద ప్రవర్తనలా అందంగా, స్వేచ్చగా, అదే సమయంలో ఒక క్రమంలో పరుచుకుని ఉన్నాయి’ అనే వాక్యం మనకు ఆమె వ్యక్తిత్వాన్ని సరిగ్గా పరిచయం చేస్తుంది. 

చలం తన ‘స్త్రీ’ ముందుమాట లో ఇలా రాస్తారు: 
స్వతంత్ర దేవత కలకత్తా కాళీ కన్నా భయంకరమైనది. నిరంతరమూ సుఖనైవేద్యాన్నీ, అశ్రు అభిషేకాన్నీ కోరుతుంది. ఆమె ను చివరిదాకా ఆరాధించగల జవసత్వాలున్న వాళ్ళు అరుదు. చాలా మంది తమ ప్రత్యెక కష్టం లోంచి తప్పించుకునే స్వతంత్రాన్నే గాని, జీవితంలో ఆ దేవతను భరించలేరు.” అయితే సునంద ఆ కోవకు చెందినది కాదు. తిరుగుబాటు చేసి, తండ్రి అదుపాజ్ఞ ల్లోంచి బయటకొచ్చి చిన్న ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంది. ఆ ఇంటి నుండి బయట పడడం అన్న దగ్గర ఆగిపోకుండా జీవితాంతం నిలిచేటటువంటిది, ఆమె స్వేచ్చాభిలాష. ఆమె సాంగత్యం కోరుకుంటాడు కానీ నరేంద్ర సహచరుడు కాలేకపోతాడు.పురుషుల పై ఒత్తిడి : 

వ్యవస్థలో ప్రచారం అయ్యే భావజాలం స్త్రీలనే కాదు, పురుషులను కూడా తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటాయి. స్త్రీ పురుషుల నిరువురినీ ప్రతిస్పర్ధుల కింద తయారు చేస్తుంటాయి. నరేంద్రకు పెద్దలు కుదిర్చిన సంధ్యతో పెళ్లి ఔతుంది. నరకప్రాయమైన సంసారంగా పరిణమిస్తుంది, విడిపోతారు. సునంద మాత్రమే తనకు తగిన భార్య కాగలదు అనే ఆశ తో ఆమెకు మళ్ళీ చేరువవ్వాలనుకుంటే ఆమె అతనికి ఆ అర్హత లేదని స్పష్టంగా తెల్చిచెప్తుంది. ఎందుకంటే నరేంద్ర వంటి వారికి వారి జీవితాల కంటే సమాజం వీరి జీవితాల గురించి చేసే వ్యాఖ్యానాలే ముఖ్యం. 
శ్రీశ్రీ వారిని గురించే అనుకుంటా ఇలా రాసారు: “నిశ్చల నిశ్చితాలు మీవి. మంచిని గురించి, మర్యాద, మప్పితం గురించి, నడతా, నాణ్యం, విలువల విషయం నిశ్చల నిశ్చితాలు మీవి.” అందుకే ఒక ప్రయోగం లా తన జీవితాన్ని శ్రద్ధగా పరిశోధిస్తున్న సునంద అతనికి అర్ధం కాదు. 

నరేంద్ర భార్య సంధ్య పాత్రకు తోటి స్త్రీలతో ఉండే వైరభావాన్ని కథలో గమనించవచ్చు. ఒకే పురుషుడి ప్రాపకం కోసం ఆడవారు వివిధ స్థాయిల్లో, విభిన్న పాత్రల్లో పోటీపడడం అనేది, సంధ్య వంటి వారిలో అభద్రతా భావానికి పునాది ఔతుంది. దాని వల్ల తనకు తాను తప్ప మిగిలిన స్త్రీలందరూ శత్రువుల్లా కనిపిస్తూ ఉంటారు. సంధ్య సమస్య అటువంటిదేనని, ఆమెను ఎప్పుడూ కలవకపోయినా, మాట్లాడక పోయినా సునంద అర్ధం చేసుకో గలుగుతుంది. విముక్త లో మరింత వివరంగా కనిపించే ఈ ‘సహానుభూతి’, స్త్రీల మధ్య ఆ సాలిడారిటీ అనే భావం బీజరూపంలో నాకు ఇక్కడ కనపడింది. విముక్త ముందు మాటలో ఆ సహకారభావం తనకు ప్రీతి పాత్రమైన భావం అని ఓల్గా చెప్తారు. 

కానీ ఐరనీ ఏమిటంటే, భర్త అయిన నరేంద్రకు సంధ్య పట్ల సానుభూతి చూపడం సాధ్యం కాదు అనిపిస్తుంది. కారణం వారు అసమానమైన కుటుంబ బంధనాలలో చిక్కుకుని ఉండడం. కనక వారు ఒకరికొకరు శత్రువుల్లా, ప్రతిద్వందుల్లా కనపడడం కాకతాళీయం కాదు.

ఆ పరిస్తితికి కారణం గమనించిన వ్యక్తి కనుక సునంద ఒకరు మనకి లొంగి ఉండే పరిస్థితే అశాంతికి మూలకారణ మని తెలిసిన వ్యక్తి కోసం వెతుకుతున్నాను అంటుంది. సునంద స్త్రీల నెలా అర్ధం చేసుకుంటుందో, పురుషుల పరిస్తితీ అంతగానే విశ్లేషించుకుంటుంది. వారిలో “చాలా మంది నిజంగా వట్టి బలహీనులు, పిరికి వాళ్ళు” అని జాలి పడుతుంది. స్వేచ్చ విలువ తెలియని మనుషుల దగ్గర స్వేచ్చగా మసలటం సాధ్యం కాదని – మీకూ తెలియదు అని ఎత్తిచూపిస్తుంది. తన కందిన జ్ఞానం – అతనికి కూడా కొత్త దృష్టి నివ్వాలనీ, శక్తి నివ్వాలనీ గాఢమ్ గా కోరుకుంటుంది. 

ఆ స్వేచ్చ పరిధిని మరింత విస్తృతం చేసుకుని సమకాలీన సమాజానికి అన్వయించుకుంటే ... 

స్వేచ్చ, స్నేహం : 

మనుషులను స్త్రీలు, పురుషులుగా, హిందువులూ, హైందవేతరులుగా, రక రకాల వర్ణాలూ జాతులూ ప్రాంతాలూ, తెగలూ... ఇలా మరొకరూ మరోకరిగా విడగొట్టి, “ఇదుగో ఇదీ సమాజంలో మీ స్థానం, మీ పాత్ర, - ఇదుగో ఇలా మాట్లాడండి, ఇలా ప్రతిస్పందించండి, ఇలా ఆలోచించండి” అంటూ మనకు నిబంధనలు నిరంతరం అందుతూ ఉంటాయి. మనం ఫీల్ అవ్వాల్సినదేదో - కొన్ని మూసలు తయారు చేసి పెట్టి సమాజం ఉంచుతోంది. 

వాటిని అధిగమిస్తే గానీ మనుషులతో నిజమైన సంబంధాలు ఏర్పడవు అని అనిపిస్తుంది. రాజకీయ కథల ముందుమాట లో చెప్పినట్టూ, ఎవరో చెప్పి ఉంచిన భావజాలం ప్రకారం కాకుండా, తమ అనుభవాల ఆధారంగా అర్ధం చేసుకునే ప్రయత్నం - చెయ్యడానికి మనకు స్వేచ్చ కావాలి. ఆ నేపధ్యంలో, స్నేహం కథ లోని ఆ వాక్యం -“స్వేచ్ఛ లేనిదే స్నేహం లేదు. స్నేహం లేనిదే స్వేచ్చకు అర్ధం లేదు. మనుషుల మధ్య మరింత స్నేహపూరిత వాతావరణం సృష్టించడానికే గదూ స్వేచ్చ” చదివాక నిజమే కదా స్నేహంగా ప్రేమగా ఉండే స్వేచ్చను రోజురోజుకూ పోగొట్టుకుంటున్నాం అనిపించింది.స్వేచ్చ అంటే ? 

జీవితానికి అర్ధం, పరమార్ధం ఏమిటా అని ప్రశ్న వేసుకుంటే, నన్ను చాలా ప్రభావితం చేసిన ఒక మౌలిక భావనను ‘స్వేచ్చ’ నవల ముందుమాట లో వోల్గా ఇలా చెప్పారు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసరమైన విషయాలను మనం గుర్తించడమే స్వేచ్చ. 

దాని ప్రకారం ఆలోచిస్తే, స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తికీ, వారి జీవితానికీ – ప్రత్యేకంగా ఉంటుంది, దానిని ఎవరికి వారే తెలుసుకోవాలిసి ఉంటుంది. ఉదా: ‘భిన్న సందర్భాలు’ కథలోలీలా, సుభద్ర. వారిలో ఒకరికి గర్భం ధరించడానికి స్వేచ్చ లేకపోతే, రెండోవారికి పిల్లలు వద్దనుకునే స్వేచ్చ ఉండదు. కనుక స్వేచ్చకు ఎవరి ప్రమాణం, ఎవరి పరిభాషా వారిది. 

లక్ష్యం : 

స్వేచ్చకు ఆటంకాలు బయటా, లోపలా కూడా ఉంటాయి. స్వేచ్చ అంత తేలిగ్గా ఒక గడప దాటి ఇంకో గడపలో కాలు పెట్టినంత మాత్రాన దొరికేది కాదని కూడా ఓల్గా రాస్తారు. తనలోకి తాను ఒంగి చూసుకుని, ప్రపంచాన్ని తన అనుభవం తో తరచి చూసుకోవాలి. అలా నిర్విరామ కృషి తోనే స్వేచ్చ నిలబెట్టుకోగలం. 

బైట ఉన్న పరిస్తితుల కన్న, తన చుట్టూ ఉన్న వాతావరణం నించి కన్నా స్వతంత్రమూ, శాంతీ హృదయం లోపల పలికి వచ్చినప్పుడే స్థిరంగా నిలుస్తాయి అని! - అంటారు చలం. ‘విముక్త’ లోని సీత పాత్ర మనకు ఆ మార్గాన్ని అన్వేషిస్తున్నట్టు తోచింది. 

అయితే అలా కష్టపడి సాధించి, నిలబెట్టుకొంటున్న స్వేచ్చకు లక్ష్యం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే ఓల్గా తన ‘స్వేచ్చ’ నవల లో ఇలా రాస్తారు. “నా స్వేచ్చకు ఒక అర్ధం ఉండాలి. ఆ అర్ధం కోసం అన్వేషించడమే నా పని” అనే అరుణ పాత్ర దానికి తన చుట్టూ ఉండే సమాజంలో తన జీవితపు ప్రయోజనం వెతుక్కుంటుంది. మరొకరికి ఇంకో దానిలో దొరకవచ్చు. కనక ఆ అన్వేషణ ఎవరికి వారు సాగించుకోవాలి అని ఓల్గా భావిస్తున్నారని అనిపించింది.

ఈ సందర్భంలో, స్త్రీ స్వేచ్చను కాంక్షించిన చలం వాక్యం: తనకి రావాలసిన హక్కుల కన్నా, తను నెరవేర్చవలసిన బాధ్యతల పైన దృష్టిని నిలపాలి స్త్రీ’ ఇది మనకు కొత్తవెలుగు చూపిస్తుంది. స్త్రీకి ఉండే బాధ్యత, కుటుంబం పట్ల మాత్రమే అని యుగయుగాలుగా అందరి విశ్వాసం ఈనాటి దాకా కూడా. కానీ స్త్రీ తన పట్లా, తను జీవిస్తున్న సమాజం పట్లా తన బాధ్యతను గుర్తించే కొత్తచూపుని అలవరచుకోవాలి అని గుర్తించే సమయం వచ్చింది. 


__________________________________________________________

Friday, 1 April 2016

మహిషాసురుడిని మాట్లాడుతున్నా    
కొద్ది రోజులై, దుర్గ - మహిషుల కథ, ఇంతకు ముందెన్నడూ లేనంత ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందూ సంస్కృతిలో జన్మించిన వారందరికీ తెలిసిన కథే. పరమతస్థులైన భారతీయులు సైతం అంతో, ఇంతో విన్న కథే అనడానికి వీలుంది.
నవరాత్రి సంబరాల్లో, మహిషుడిని చంపుతున్న దుర్గ మూర్తిని చూస్తే, విదేశీయులకైనా స్థూలంగా అర్ధమవ్వగల విషయమే ఇది. మరి ఈనాడు కొత్తగా చర్చించుకునే అవసరం ఎందుకు వచ్చింది? దాని పూర్వాపరాలను తెలుసుకుని, జరుగుతున్న పరిణామాల లాభనష్టాలను అంచనా కట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంది.
మహిషుడు మూలవాసుల రాజనీ, ఆర్యులు అతనిని యుద్ధంలో ఓడించలేక ‘దుర్గ’ అనే స్త్రీనినియోగించేరనీ, మోసం చేసి మహిషుని మట్టుబెట్టేరనీ ఒక కథనం (నరేటివ్) వినికిడి లోకి వచ్చింది. మహిషుడి ‘వీరమరణా’న్ని సంస్మరించుకుంటున్నారనీ, దుర్గను అవమానిస్తున్నారన్న వార్త – భారత పార్లమెంటులో, గౌ. మంత్రిగారి నోటి వెంటే సామాన్య పౌరులందరికీ తెలిసింది. దీని మీద విస్మయం, ఆగ్రహం, సానుభూతి, చిరాకూ వగైరా పరస్పర విరుద్ధ ప్రతిస్పందనలు బహిర్గత మౌతున్నాయి.
అసహనం మినహా మరో ఆలోచన రానివ్వని ఆవేశపరులను పక్కన పెడితే, ఏ ఛాన్దసవర్గానికీ చెందని తటస్థ పౌరులు సైతం ఈ ప్రత్యామ్నాయ కథనాల పట్ల తమ అసంతృప్తిని ప్రకటించడం కనిపిస్తోంది. అసంఖ్యాకులు తరతరాలుగా వింటూ వస్తున్న కథను తిరగరాస్తున్న ఈ విపరీత ధోరణుల వల్ల విద్వేషాలు రాజుకుంటాయని కొందరు మేధావుల అభ్యంతరం. వారి వాదాన్ని కొంచెం వివరంగా అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
దుర్గను తల్లిగా తలిచి, తమ కష్టాలను తీర్చేందుకై ఆమె అవతారం దాల్చిందని విశ్వసించే సంప్రదాయం ఉంది. ఆర్య దురహంకారాన్ని ఏ కోశానా సమర్ధించని వారిలో, దుర్గను మంచికి ప్రతీకగా, మహిషాసుర వధను కేవలం చెడు మీద మంచి సాధించిన విజయంగా పరిగణించి, దుర్గ పూజల్లో పాల్గొనే ప్రజలూ ఉన్నారు.


అదే కాక, ఒకనాడు ప్రబలంగా ఉండిన మాతృస్వామ్య వ్యవస్థకు ‘శక్తి ఆరాధన’ ఒక అవశేషంగా అని భావించే వారూ ఉన్నారు. మరి ఇటువంటి వారందరూ ‘దుర్గ’ను ఒక కుట్రలో భాగంగా చెప్పే కథ గురించి ఏ విధంగా స్పందించవలసి ఉంటుంది? అన్నినరేటివ్ లూ, ఖచ్చితమైన ఆధారాలతో, రుజువులతో చరిత్ర పుట ల్లోకి ఎక్కని సుదూర కాలానికి చెందిన కథనాలే. వీటిలో ఏది నిజం? ఏది అభూత కల్పన? ఎవరిది మోసం? ఎవరి వైపున ఉంది న్యాయం? ఇలాటి ప్రశ్న లుదయించి సామాన్య పౌరులను ఇబ్బంది పెట్టే మాట వాస్తవమే.

కానీ, నిజానికి మనం వేసుకోవలసిన ప్రశ్నలు ఇవేవి కానే కావని నా అభిప్రాయం. ఇది మరెక్కడా జరగని ‘ప్రత్యెక’ సంఘటనగానో, ఒక వింత పరిణామంగానో భావించడమే మన ఈ గందరగోళానికీ, అది కలిగించే అసహనానికి అసలు కారణం. సాంస్కృతిక పరిశోధకుల ప్రకారం పూర్వీకుల ఊహలు, ఆరాధనలు కాలక్రమంలో దివ్య గాధలుగా మారడం ఒక సర్వ సాధారణ విషయం. ఆ క్రమంలో - ఒకే కథకు ఒకటి కంటే ఎక్కువ కథనాలు ఏర్పడే ‘వైనం’ మన సంస్కృతిలో చాలా సందర్భాల్లో కనబడుతుంది.

తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు ‘నా రచనా నేపధ్యం’ వ్యాసంలో సామాజిక అంశాలనూ,సాంస్కృతిక కథనాలనూ కలిపి చర్చిస్తారు. లింగ వివక్షను తొలిసారి గమనించానని చెప్తూ స్వయంగా ఆయన చిన్ననాడు విన్న ‘ఈదమ్మ కొలుపు’ కథాగానాన్నిఉదహరిస్తారు. మాంధాత అనే రాజు స్త్రీ అల్పమైనదని నమ్మి, తాను స్త్రీగర్భాన కాక, తండ్రి కడుపు చీల్చుకుని పుడతాడట. అటు తరువాత కూడా ‘ఈదమ్మ’(విధి) అధికారాన్ని అంగీకరించక ఆమె తో తలపడతాడట, అష్ట కష్టాలూ పడతాడట.ఆ కథను అలా ఉంచితే, ఒక ముప్పై నలభై ఏళ్ల కాల పరిమితిలో ఒక జానపద కథారూపమైన ‘ఈదమ్మ కథ’ రేడియోకి వచ్చేసరికి ‘మాంధాత కథ’ గా మారిందని రఘోత్తమరెడ్డిగారు చేసిన పరిశీలన మనకు చాలా విలువైన సమాచారం అందిస్తుంది. కథ ఎవరి పరంగా చెప్తున్నారో ఆ అంశం కూడా గుర్తించాల్సిన సంగతేనని తెలియజేస్తుంది. దుర్గ పరంగా చెప్పిన కథకూ, మహిషుని పరంగా చెప్పిన కథకూ ఉండే భేదాలను అర్ధం చేసుకోవాలంటే – ఆ కథనాలు ఎవరికి, ఎవరి ద్వారా, ఏ రూపాన, ఏ కారణాన రూపొందిన కథలో గుర్తించాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని విశదంగా పరిశీలించాలంటే ఎన్నో ఉదాహరణలు మన పురాణాల్లోనే మనకు దొరుకుతాయి.
ప్రాచీన కాలం లోని భారతదేశ చరిత్రను గమనిస్తే, వైదికమతం లో పేరుకుపోయిన కర్మకాండలకూ, జంతుబలులకూ, కుల వివక్షకూ – వ్యతిరేక స్వరం పలుకుతూ బౌద్ధ మతం ఉద్భవించి, ఒక దశలో ఉద్ధృతంగా ఉండి, క్రమేణా సన్నగిలిందని మనకు తెలిసిన విషయమే. తరువాతి కాలంలో బుద్ధుడిని విష్ణువు అవతారంగా చెప్పే ఆసక్తికరమైన కథ ఒకటి లింగ పురాణంలో ఉంది. అది ఈ సందర్భంలో ఒక నూతన దృష్టికోణాన్ని అందింస్తుందని నా నమ్మకం.కాశీకి రాజైన దివోదాసును బ్రహ్మ ధర్మపాలన చేసి భూమండలాన్ని రక్షించమని కోరాడట. దానికి దివోదాసు ఒప్పుకున్నాడు కానీ ఒక షరతు పెట్టేడట. దాని ప్రకారం దేవతలూ, నాగులూ మొదలైన వారందరూ భూమి మీద ఉండకుండా తమ స్వస్తానాలకు వెనుదిరిగి పోయారట. ధర్మం సంగతి సరే గానీ, శివుడికి మాత్రం తన కత్యంత ప్రియమైన కాశీ నగరాన్ని విడిచి పెట్టి ఉండడం దుస్సహం అయిపోయిందట. దివోదాసును ఓడించేందుకు ఉపాయంగా, విష్ణువు బుద్ధుడిగా అవతారం దాల్చాడట, తన బోధలతో ప్రజలను వైదిక ధర్మానికి విముఖుల్ని చేసాడట. ప్రజలు అధర్మ వర్తనులవడం చేత రాజు దివోదాసు శక్తిహీనుడయ్యాడనీ, తద్వారా భూమిపై దేవతల ప్రాబల్యం పెరిగిందనీ కథ.
ఈ కథను విన్న బౌద్ధులు, “హన్నా! మా బుద్ధ భగవానుని బోధలు విని ప్రజలు ధర్మభ్రష్టులయ్యా రంటారా?” అని మండిపడితే అది సమంజసమవుతుందా? ఈ కథను ఒక చారిత్రక నేపధ్యంలో అర్ధం చేసుకోవడమే సరైన పద్ధతి. ఒక కీలకమైన దశలో బౌద్ధం పట్ల వైదిక మతాని కుండిన వైఖరి -ఈ కథ మనకందించే సమాచారం.ఆ మాట కొస్తే జాతక కథల్లోనూ, జైనుల గాధలలోనూ –బోధిసత్వులూ, జైన తీర్తంకరులూ హిందూ దేవీ దేవతలను ఓడించడమూ, లేదా బుద్ది చెప్పడమూ వంటి కథ లనేకం ఉన్నాయి. వాటన్నిటినీ విభిన్న మత విశ్వాసాలకు చెందిన భావజాలాల mutual interaction గా గుర్తించాలని సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం.
ఇటువంటి విరుద్ధ కథనాలు, భారతదేశం లోనే కాదు. విశ్వ సంస్కృతిలో కూడా భాగాలే. ఉదాహరణకు, సమీప గతానికే చెందిన క్రైస్తవ మతానికొస్తే – ఏసు యూదుల సామ్రాజ్యానికి రాజు అనీ, అతనికి భార్యా, పిల్లలూ ఉన్నారనీ, రోమ్ మహాసామ్రాజ్య సింహాసనానికి ఏసుక్రీస్తు సంతానం వారసులనీ, అది వారికి అందకుండా చేసేందుకు జరిగిన కుట్రలో చర్చికి కూడా భాగస్వామ్యం ఉన్నదనీ చెప్పే కథనాలు యూరప్ లో మధ్య యుగాల్లోనే బహుళ ప్రచారం లోకి వచ్చాయి. వాటిని నమ్మిన వారిలో డావించీ వంటి మేధావులు కూడా ఉన్నారని ప్రతీతి.
ఈ కథనాల్లోని సత్యం ఏదైనప్పటికీ – చరిత్ర గతిలో చోటు చేసుకున్న మార్పులు, ఆనాటి సాంస్కృతిక అంశాలను ఎంతగా ప్రభావితం చేయగలవో మనకి ఈ ఉదంతాలు స్పష్టం చెయ్యగలవు.
చరిత్ర నెప్పుడూ విజేతలే రాస్తారని అనడం వెనక ఒక తిరుగులేని చారిత్రక సత్యముంది. పాలకులు గెలుచుకున్న రాజ్యాన్ని భద్రంగా నిలబెట్టడానికి ఉపయోగపడే ఆలోచనలూ, ఆశలూ, విశ్వాసాలూ ప్రజల సాంస్కృతిక దృక్పధంలో భాగం కావడం అనివార్యం. మనకు తరతరాలుగా అందిన గాధలన్నిటి వెనకా వాటిని కథలుగా మలిచినవారి దృక్కోణం విధిగా ఉండి తీరుతుంది. ఈ నిజాన్ని గుర్తించి మరుగున పడి ఉన్నకథలకు వేదిక కల్పించడం ప్రజాస్వామ్య వాదుల కర్తవ్యం.
విస్తృతమైన ప్రచారం లో లేని ఎన్నో కథలు ఆ కాలపు వాస్తవాలను తమలో నింపుకున్న భిన్నవర్గాల, జాతుల చరిత్రలు. అవి వారి పూర్వీకుల నుండి వారి కందినవైనా, ఈనాడు వాటిని మనందరి సమిష్టి జ్ఞానసంపదలో భాగమని మనం గుర్తించవలసి ఉంది. మనం నమ్ముతూ వచ్చిన విలువలను ప్రశ్నించినంత మాత్రాన, వారిని చీదరించుకోవడం, ఆ కథనాల పట్ల శత్రువైఖరిని పాటించడం అసంగతం. ఇలాటి ఆల్టర్నేట్ నెరేటివ్లు (ప్రత్యామ్నాయ కథనాలు) మన కందించే చరిత్ర శకలాలు ఏమిటా అని విశ్లేషించుకోవాలి. వాటిని ఆకళింపు చేసుకునేందుకు, ఒక నిర్దిష్టమైన ఆలోచనా క్రమాన్ని, సమాజం అలవరుచుకోవలసి ఉంది.
ఆ కొత్తచూపు తో ప్రస్తుత విషయం ‘దుర్గ, మహిషుల కథ’ ను పునః పరిశీలన చేద్దాం. బహుజనులు వెలుగు లోకి తెచ్చిన కథ ప్రకారం, మహిషుడు అసురుల రాజు, అతన్ని చంపేందుకు దుర్గను దేవతలు పంపేరు, ఆమె మహిషుడితో తొమ్మిది రాత్రులూ గడిపి, నమ్మించి, పదవ రోజున అతన్ని చంపేసింది.

మహిషుడు మోసపోయి మరణించిన రోజు కనుక ‘అసురులు’
దుర్గాపూజను చూడరు, అతనికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, వారి పూర్వీకులను పూజించుకుంటారు. ఈకథను చట్ట సభలో ఉటంకించినదీ, దానిని పరిగణిస్తున్న వారందరినీ ‘భ్రష్ట మనస్కుల’నేదీ ప్రజల మధ్య విభేదాలు పెంచడానికీ, రాజకీయమైన లబ్ది పొందడానికే అని నా నిశ్చయం. అయినప్పటికీ, ఈ ప్రచారం వల్ల జరిగిన అనేక పరిణామాల్లో, ఒక మంచి జరిగిందని మాత్రం అనిపిస్తోంది - అదేమిటంటే, ‘అసురులు’ అనే పేరు తో ప్రాచీనమైన తెగ ఒకటి ఉందన్న విషయం యావద్భారతదేశానికీ తెలిసింది.
ఈశాన్య భారతంలో అసుర జాతి ఇప్పటికీ ఉనికిలో ఉన్నది. వారు నాగరికత తెలియని గిరిజనులు. మహిషాసురుడు తమ దేవుడిగా వారు కొలుస్తారు. ప్రస్తుతం 10,000 మంది మాత్రమే ఈ జాతి వాళ్ళుఉనికిలో ఉన్నారు. బీహార్, జార్ఖండ్, బెంగాల్ ఇతర ఈశాన్య రాష్ట్రాలలో నివసిస్తున్నారు. అసురజాతి అంతరించిపోతున్న జాతిగా భారత ప్రభుత్వం ప్రకటించింది. వారిలో 7,000 మంది వరకుమాట్లాడే వారి సొంత భాష అంతరించడం ఖాయం అని యునెస్కో ప్రకటించింది. వారి ఇతిహాసాలను వీలైనంత సమగ్రంగా main stream సంస్కృతిలో అంతర్భాగం చేసే ‘కార్యం’ మన తక్షణ కర్తవ్యం. ఈ సందర్భంలో శ్రీశ్రీ దేశచరిత్ర ల్లోని పంక్తులను ఒక్క సారి స్మరించుకోవాల్సి ఉంది.


ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పుడు !
దాచేస్తే దాగని సత్యం .

ఈ సందర్భంగా, దాదాపు వైదిక మత మంత ప్రాచీనమైన జైన మత సంప్రదాయాన్ని ఒక్కసారి స్పశించడం సముచితంగా ఉంటుందనిపిస్తోంది. జైనుల తత్వ వివేచనలో ఒక అత్యద్భుతమైన అంశం ‘నయవాదం’.దాని ప్రకారం ఏ ప్రతిపాదన అయినా ఒక పరిమితార్ధం లోనే తప్ప, అన్ని అర్దాలలోనూ నిజం కాదు. కనుక అది పాక్షిక సత్యమనీ, సాపేక్ష సత్యమనీ చెప్తారు. అది ఏనాడూ సంపూర్ణ సత్యంలో ఒక భాగం మాత్రమే. ఈ పరిమితిని అర్ధం చేసుకున్నందు వల్ల తాము నమ్మినదే సత్యమనీ, సమగ్రమనీ అహంకరించే ధోరణిని మనం వదులుకోగలం. ఎన్ని విభిన్న కథనాలు సమాజం లో ప్రచారం లోకి వస్తే, ఆ సమాజం అంత పరిణతి చెందుతోందని, సత్యానికి అంత దగ్గరౌతున్నామనీ అర్ధం చేసుకోవచ్చు.
సంస్క్రు తార్ధం ఏమైనప్పటికీ, ఇతిహాసాలంటే తెలుగు భాష వాడుకలో చరిత్రా, కల్పనా కలిసిన రూపంగా అర్ధం చేసుకుంటాం. కనుక మనకు తెలిసిన కథనాలే పరమ సత్యాలనే ధోరణిని వదులుకుంటే, విభిన్న కథనాల ద్వారా చరిత్ర సంబంధించిన విభిన్న పార్శ్వాలతో పరిచయం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఆ చర్చకు అవసరమయ్యే మానసిక పరిణతిని అలవరుచుకుందాం.

రాజహంసలు పాలూ, నీరూ కలిసిన మిశ్రమం లో పాలను వేరు చేసి తీసుకోగలవని అంటూ ఉంటారు. ఎవరెంత రెచ్చగొట్టినా, మనం మాత్రం మన సమతౌల్యాన్ని కోల్పోకుండా – రాజహంసల్లాగా ‘మిత్’ అనే చట్రంలో బిగించి ఉన్న ‘చరిత్ర’ను గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఈ కథనాల వెనుక మూల కారణమేదైనా, మనం చేపట్ట వలసిన కార్యం అన్నిటినీ నిష్పక్షపాతంగా సమీక్షించడం... వాటి నుండి అవసరమైన గుణపాఠాలను నేర్చుకోవడం.