Tuesday 17 May 2016

'స్వాప్నికుడి మరణా'నికి కారణాలేమిటి?

స్వతంత్రంగా ఆలోచించినందుకూ, ఆలోచించినది ప్రకటించినందుకూ, ప్రకటించినది ఆచరించినందుకూ రోహిత్ ను ఒంటరి ని చేసి హింసించాం. పోరాడే ఇచ్చనశించగా, నక్షత్రాల వైపు పయనమై పోయేలా చేశాం.

మరణ వాంగ్మూలాన్ని ఎలాటి కరుడు కట్టిన న్యాయస్తానాలైనా అతి పవిత్రంగా భావిస్తాయని విన్నాను. మనం మాత్రం, అతని తుది లేఖ చదివాక కూడా ప్రశ్నలు లేవనెత్తగలిగిన మేధావులం. వెళ్లిపోయిన రోహిత్ వెనక్కు వచ్చి మన కుసంస్కారాన్ని చక్కదిద్దలేడు కానీ రోహిత్ కు జన్మనిచ్చి, అతని మరణం అర్ధరహితం కాకుండా కాపాడేందుకు అతని సహచరులతో శిబిరం లో కూర్చున్న ఆ రాధికమన కేమైనా నేర్పగలుగుతుందేమో... ఒకసారి ఆమె జీవితాన్ని పరికిద్దాం.

రాధికకు ఏడాది వయస్సప్పుడు తల్లిదండ్రుల నుండి వేరు చేసారామెను. జీతం బత్తెం లేని శ్రామికురాలై ఆ ఇంట మెలిగిందామె. పద్నాలుగేళ్ళ పసివయసులో, ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, పెళ్లి అనే బండ తల కెత్తారు. ఇరవై కూడా నిండక ముందే ముగ్గురు పిల్లలు పుట్టడమూ, భర్తఅనే వ్యక్తి జీవితం లోంచి తొలగిపోవడమూ కూడా జరిగి పోయాయి. బతుకు అనే గాయం కాస్త మాన్పు పట్టిందనే సమయానికి పండంటి కొడుకును పొట్టను పెట్టుకుంది ఈ సమాజం.
రోహిత్ మరణానంతరం రాధికకు మనం కలిగించగలిగే ఉపశాంతి ఆమె కులం గురించిన చర్చలే ఐనట్టయితే సరే, అవే చేద్దాం. రిజర్వేషన్ల ప్రాతిపదిక ఏమిటో ఒక్క సారి గుర్తు చేసుకుందాం.

శతాబ్దాల తరబడి కొందరి జీవితాలు హెచ్చు సౌకర్యాలతో గడిచేందుకు, మరెందరి జీవితాలనో తరతరాలుగా దుర్భరం చేసిన ఒక దుష్ట సంప్రదాయాన్ని గుర్తించాం. మనుషులందరికీ సమానమైన సాంఘిక, ఆర్ధిక, రాజకీయ అవకాశాలు ఉండాలని నమ్మేం. ఆ సమానత్వాన్ని సాధించడానికే రిజర్వేషన్లన్నాం. ఔనా?
మరి - ఒక పేద దళిత స్త్రీగా జీవితం లోని ప్రతీ ఒక్క మజిలీ లోనూ తనకు జరుగుతున్న అన్యాయానికి ఎదురీది నిలిచిన ఈ రాధిక కంటే అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం వహించగలిగినది ఎవరు? ఆమె కన్నా, ఆమె సంతానం కన్నా రిజర్వేషన్లకు అర్హులెవరు?

అయ్యో! కన్న కొడుకు చావు ఏ తల్లి కైనా దుర్భరమే అంటూ సానుభూతి వాక్యాలు పలకడానికి మన సమాజానికి ఏమీ అభ్యంతరం ఉండదు. అందుకేనేమో 'మనవి వాడి పారేసిన భావాలు' అన్నాడు రోహిత్. నిజమే. లేకుంటే ... తన బిడ్డ మరణానికి 'నష్ట పరిహారం' జవాబు కాదనీ, ఆ మరణానికి బాధ్యులు ఎవరనీ నిలదీసే రాధిక గొంతులోని న్యాయాన్నివినలేమా మనం?
ఆ కొడుకు జీవించి ఉండగానే -
తన ఆత్మ తన శరీరానికి ఎడమై పోతోందని తల్లడిల్లిపోయాడనీ,
ప్రేమభావన అతని హృదయాన్ని అను నిత్యం గాయపరుస్తూనే ఉన్నదనీ,
భరించలేని వేదన అతని జీవితాన్ని అలుముకుందనీ తెలిసాక ఆ స్త్రీ మనసు చేసే ఆర్తనాదానికి స్పందించే సౌకుమార్యంమనకు ఉండకపోయిందా?
పిల్లల తో పాటూ తానూ చదివి పరీక్షలకు కూర్చున్న ఆమె పఠనాసక్తినీ, జ్ఞాన పిపాసనూ చూసి గర్వపడలేమా మనం?
కుట్టుపని చేసి తన రెక్కల కష్టంతో పిల్లలను సాకిన ఆమె శ్రమశక్తి విలువను అంచనా కట్టే ప్రయత్నం చెయ్యక పోయామా మనం?
తన కులం మనిషి కాదన్న కారణం చూపిస్తూ తనని హింసించిన వాడిని వదిలిపెట్టి జీవించే ఆమె స్వశక్తి మీద కొండంత గౌరవం కలగక పోయిందా మనకు?
కొడుకు దూరమైనందుకు కుప్పకూలి పోకుండా, నిలిచి రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నది. అందుకే కదా ఆమె గతాన్నీ, కులాన్నీ రచ్చకెక్కించేదీ, ఆమె గొంతును వినపడకుండా చేయాలనుకునేదీనూ.
దీనిని మనం గుర్తించ గలిగిన్నాడు తన జన్మమే ఒక ప్రాణాంతక ప్రమాదంఅని రోహిత్ రాసిన వాక్యం మనకు శూలంలా గుచ్చుకోక మానదు. అప్పుడు, ఆ తల్లి కష్టాలను తానూ పంచుకుని, ఆమెకు జరిగిన అవమానాలకు తానూ కించపడి, వాటిని అధిగమించి, తన మేధోశక్తితో స్కాలర్షిప్ప్లు సంపాదించి ఆమెకు చేదోడు వాదోడు గా ఎదిగి నిలిచిన రోహిత్ చరిత్ర మనకు ఇంకా బాగా అర్ధం అవుతుంది.
రాజకీయాల పొగలో చూపు మసక బారి, ముఠాకోరుల అబద్ధాల వల్ల హృదయాలు బండ బారిన మనతో, తనకు గోచరమౌతున్నఖాళీతనంగురించి వివరించలేక రోహిత్ శాశ్వతంగా తన నోరు నోక్కేసుకున్నాడు.
చనిపోయే క్షణాల్లో కూడా న్యాయాన్యాయాలను గురించీ, విజ్ఞాన సిద్ధాంతాల గురించీ వివేచన చేసాడు. మిత్రుల కారుణ్యాన్నీ, వారి బాగోగుల గురించీ తలపోసాడు తప్ప తన దుస్తితికి బాధ్యులైన వారి పేరు సైతం తన 'తుది లేఖ'లో రాయలేదు. వ్యక్తి స్థాయిలో వారు కలిగించిన నష్టం కంటే, వ్యవస్థ లో భాగంగా మారి వారు చేసే హింసనూ, పీడననూ స్వయంగా అనుభవించాడు కనకేనేనేమో.
దళితుడై నందు కంటే, ‘ప్రశ్నించే నేరంచేసినందుకే బహిష్కార శిక్ష విధించింది రాజ్యం అతనికి. అది అతని విచారధార లోని విశిష్టత కు రుజువు అని గుర్తించాలి మనం ఇకనైనా.
అతని మరణ వాంగ్మూలాన్ని చదివిన తర్వాత కూడా...
సామ్య వాదమంటే ధనికులను ద్వేషించడం అనీ,
దళిత వాదమంటే అగ్రవర్ణాల మీద ద్వేషం అనీ,
స్త్రీ వాదమంటే పురుషులను ద్వేషించడం అనీ ... ... ... నమ్ముతూనే ఉండిపోదామా? రోహిత్ గుర్తించిన సత్యాన్ని మనమూ గుర్తించ వద్దా? వ్యవస్థ లో పాతుకుపోయిన వివక్షా, దానికి అనుగుణమైన భావజాలమూ - వాటిని పాటించే మనుషుల కంటే కూడా శక్తివంతమైనవనీ, అతి ప్రమాదకరమైనవనీ తెలుసుకోవద్దా ఇకనైనా?
అతని లేఖను చదివి, స్పందించిన వారు గుర్తించాల్సినదీ, పోరాడవలసినదీ అతని మరణానికి కారణమైన ఈ వ్యవస్థ తోనే, అది సరఫరా చేసే భావజాలం తోనే, వ్యక్తులను గుంపులుగా తయారు చేసే దాని కుట్రలతోనే.

రోహిత్ వేసిన ప్రశ్నలకు జవాబు దొరికేదాకా అతని మరణాన్ని మనం స్మరిస్తూనే ఉండాలి.







Monday 16 May 2016

అనురాధ గాంధీ

 

 “అను జీవితం అనేక మార్గాలలో పయనిస్తూ వచ్చింది. స్కూలు లోనే ‘అను’ చురుకుగా ఉండేది, దాని వెనుక ఆమె ఇంటిలోని ప్రగతిశీలక ప్రజాస్వామిక వాతావరణం పాత్ర చాలా ఉన్నదని చెప్పుకోవచ్చు. కాలేజీ రోజుల్లో విద్యార్ధి ఉద్యమాల్లో పాల్గొని నాయకత్వం వహించేది. ఎమర్జెన్సీ అనంతరం, అప్పటికి లెక్చరర్ గా పని చేస్తున్నఅను దేశం లోని మానవహక్కుల ఉద్యమాలకు తలలో నాలిక అయింది. 1980 ల్లో నాగపూరుకు చేరుకున్నాక, ‘అను’ పేరు - నాగపూరు/విదర్భ సాంస్కృతిక విప్లవోద్యమానికి ‘చిరునామా’ గా మారింది. అక్కడ సోషియాలజీ ప్రొఫెసర్ గా ఉన్నత విద్యను బోధించడంతో పాటూ, యుద్ధ సన్నద్ధురాలైన ట్రేడ్ యూనియన్ నాయకురాలిగా ప్రముఖ పాత్ర పోషించింది. కార్మిక ఉద్యమాలను నడపడం, స్వయంగా అనేక సార్లు జైలు శిక్ష ననుభవించడం కూడా జరిగాయి. ఆ ప్రాంతం లో స్త్రీల ఉద్యమాలకు కూడా ఆమె నీడగా నిలిచింది.  వీటిలో గుర్తుంచుకోదగ్గ విషయం ఒకటి - లెక్చెరర్లూ, విద్యార్ధులూ, లాయర్లూ, విదర్భ ప్రాంతపు ఉద్యమకారులూ – ఇటువంటి మేధావి వర్గం మీద ఆమె వ్యక్తిత్వం చూపిన ప్రభావం ఇంతింతని చెప్పలేం. అయితే అన్నిటి కంటే ముఖ్యమైన అంశం - విదర్భ దళితుల పోరాటానికి ఆమె అందించిన సహకారం.”  
(కొబాద్ గాంధీ తీహార్ జైలు నుండీ రాసిన ఉత్తరం లో తన ప్రియ సఖి, సహచరి ఐన అనురాధ గాంధీ గురించి ఇలా రాసుకున్నాడు.)
    “...కానీ అనురాధ సంగతే వేరు”
అనురాధ గాంధీని ఎరిగిన వారంతా అనే మాట ఇది. ఆమె ఎవరెవరి జీవితాలను స్పృశించిందో వారందరూ ఏకగ్రీవంగా నమ్మే మాట ఇది.   
12 ఏప్రిల్ 2008 న ముంబాయ్ లోని ఒక హాస్పిటల్లోమలేరియా తో మరణించింది. బహుశా ఝార్ఖండ్ అడవుల్లో ఆదివాసీ మహిళలకు స్టడీ క్లాస్ లు నిర్వహిస్తున్న కాలంలో ఆ విషజ్వరం ఆమెకు సోకి ఉంటుంది. మన పవిత్ర ప్రజాస్వామ్యం, ఆమెను ఒక మావోయిస్ట్ లీడర్ గా మాత్రమే చూస్తుంది గనక ఆమెను అరెస్టు చేయనూ గలదు, అనేక వందల మందికి పట్టించిన గతే ఆమెకూ పట్టించి, నకిలీ ‘ఎన్ కౌంటర్’ పేరుతో చంపనూగలదు మరి. ఈ ‘తీవ్రవాది’, ఒళ్ళు పేలిపోయే జ్వరంతో రక్త పరీక్ష చేయించుకునేందుకు ఒక హాస్పిటల్ కు వెళ్లింది కానీ అక్కడ డాక్టరుకు ఇచ్చిన వివరాల్లో తన పేరూ, ఫోను నంబరు నకిలీవి ఇచ్చింది. ఆ కారణం చేత, ఆమె రక్తంలో ప్రాణాంతకమైన మలేరియా ఫాల్సిపేరం దొరికిందన్న వార్త ఆ డాక్టరు ఆమెకు అందజేయనే లేకపోయాడు. ఆమె అంగాలొకోటొకటిగా పని చెయ్యడం మానేశాయి. 11 ఏప్రిల్ న ఆమెను హాస్పిటల్లో చేర్చే సరికే పరిస్థితి చెయ్యిదాటి పోయింది. నిష్కారణం గా ఆమెను మనం పోగొట్టుకున్నట్టయింది.                      
మరణించే నాటికి ఆమె వయస్సు 54 ఏళ్ళు, అందులో 30ఏళ్ళకి పైన నిబద్ద విప్లవకారిణి గా అజ్ఞాతం లోనే గడిచింది.   
ఆమె జీవించి ఉండగా నాకామెను కలిసే అదృష్టం లేకపోయింది, కానీ ఆమె సంస్మరణ సభకు హాజరవగలిగాను. అప్పుడు గ్రహించాను – ఆమె ఎందరికో ఆరాధనీయంగా నిలిచింది, కానీ అంత కంటే ఎక్కువగా మరెందరి ప్రేమాభిమానాలనూ చూరగొంది అని. ఆమెను తెలిసిన వారు ఆమె ‘త్యాగా’లను పదేపదే ప్రస్తావిస్తూ ఉంటే నాకు కొద్దిగా ఆశ్చర్యం కలుగుతోంది. వారి ఉద్దేశం - మధ్యతరగతి జీవితం ఇవ్వగలిగిన సౌకర్యాలూ, భద్రతా – వీటిని వదిలి మౌలిక రాజకీయాల్లోకి ఆమె రావడం గురించి అయి ఉంటుంది. నాకయితే అనురాధ - తుచ్చతనీ, అనాసక్తతనీ జీవితం లోంచి తోసిపడేసి, వాటి స్థానం లో నిర్విచారంగా తన ఆశల్నీ, కలల్నీ నిలుపుకోగలిగిన ధీశాలి అని అనిపిస్తుంది.  ప్రజలకి ‘సేవ’ చేయ్యడం, ‘పుణ్యం’ సంపాదించడం వంటివి కాదు ఆమె ఆశయాలు. పరమాద్భుతంగా జీవించిందామె, అతి కఠినమైన జీవనం కానీ సాఫల్యం చెందిన జీవితం.                
ఆమె తరంలోని మిగిలిన వారి లాగే, చిన్న వయస్సు లోనే అనురాధ మీద కూడా వెస్ట్ బెంగాల్ లోని నక్సలైట్ ఉద్యమపు భావజాలం బలమైన ముద్ర  వేసింది. 1970 ల్లో ఎల్ఫిన్స్టన్ కాలేజీ లో ఉండగా మహారాష్ట్ర గ్రామాలలో ఆమె చూసిన ‘కరువు’ అనురాధను అతలాకుతలం చేసింది. ఆ కరువు పీడితుల ఆకలీ, నిస్సహాయతా ఆమెను విప్లవ రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా చేసేయి. ముంబాయి విల్సన్ కాలేజీ లో లెక్చెరర్ గా ఉద్యోగ జీవితం మొదలయ్యింది, కానీ 1982 కల్లా నాగపూర్ కు చేరింది. కొన్ని సంవత్సరాల పాటు - నాగపూరు, చంద్రపూరు, అమరావతి, జబల్పూరు, యావత్మల్ – ఈ ప్రాంతాల్లో భవననిర్మాణ కూలీలూ, బొగ్గు గనుల కార్మికులూ – ఈ నిరుపేదలను కూడగట్టుకుని ఆమె పనిచేసింది. అది ఆమెలో దళిత ఉద్యమానికి సంబంధించిన అవగాహనను పెంచింది. 

1990 ల్లో, స్క్లేరోసిస్ అనే కండరాల వ్యాధి తో బాధపడుతూ కూడా, బస్తర్ గ్రామానికి వెళ్లి, దండకారణ్యాల్లో ‘పి ఎల్ జీ యే’ People’s Liberation Guerilla Army లో మూడేళ్ళు పనిచేసింది. అక్కడ ఉన్న ఒక అసాధారణ మహిళా నిర్మాణం, బహుశా దేశం లోని అతి పెద్ద ఫెమినిస్ట్ నిర్మాణం అనొచ్చు దాన్ని. 90,000 కు పైగా సభ్యులు ఉన్న (KAMS) ‘క్రాంతికారి ఆదివాసి మహిళా సంఘటనం’ తో కలిసి - దానిని  శక్తివంతం చేసేందుకూ, విస్తరింప చేసేందుకూ అనురాధ కృషి చేసింది. ఈ KAMS భారతదేశం దాచి ఉంచే రహస్యాలలో ఒకటి అనుకుంటా. అనురాధ ఎప్పుడూ అనేది – దండకారణ్యం లో పీపుల్స్ వార్ (సీపీ ఐ –మావోయిస్ట్) గెరిల్లా వీరులతో గడిపిన ఆ మూడేళ్ళూ ఆమెకు అత్యంత సాఫల్యం కలిగించిన సంవత్సరాలని. ఆమె మరణించిన ఒక రెండేళ్ళ తర్వాత ఆ ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు, స్త్రీల గురించీ, సాయుధ పోరాటాల గురించీ నా ఆలోచనలను తరచి చూసుకున్నాను. తెలిసీ తెలియక ఏర్పరుచుకున్న నా అభిప్రాయాలను వదిలి, KAMS గురించి అనురాధ వెలిబుచ్చిన ఆనందాశ్చర్యాలను నేనూ పంచుకున్నాను.
అవంతి అనే మారుపేరుతో రాసిన వ్యాసాల సంకలనం లో అనురాధ ఇలా అంటుంది:
మార్చి 8 దగ్గర పడుతోంది, నూతన శతాబ్దపు తొలి వెలుగులో, స్త్రీ ల పక్షాన్న గణనీయమైన అభివృద్ది జరుగుతోంది. మధ్య భారతపు మారుమూల అరణ్యాల్లోనూ, మైదానాల్లోనూ, ఆంధ్రప్రదేశపు కుగ్రామాల్లోనూ, ఆ రాష్ట్ర గిరిజనుల కొండప్రాంతాల్లోనూ, బీహారు, ఝార్ఖండు అడవులూ, మైదానాల్లోనూ – స్త్రీలు సంఘటిత మౌతున్నారు, ఫ్యూడల్  పితృస్వామ్యపు సంకెళ్ళు చేదించి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించెండుకై ఏకత్రితమౌతున్నారు. దేశం లోని గ్రామీణ ప్రాంతపు ఆడ రైతు కూలీలు పాల్గొని సాగించే స్త్రీల విముక్తి ఉద్యమం ఇది. అణగారుతున్న రైతాంగం, పీపుల్స్ వార్ విప్లవ నాయకత్వంలో చేస్తున్న పోరాటం.  కొన్ని సంవత్సరాలుగా మార్చి8 వేడుకలు జరుపుకునేందుకు వేలాది స్త్రీలు చుట్టుపక్కల వందలాది గ్రామాల నుండి  వస్తూ ఉన్నారు. నారాయణపూర్ వంటి చిన్న టౌనులో ‘ప్రపంచ సుందరి’ అందాల పోటీలను వ్యతిరేకించడం; తెహసీలు టౌనుల గుండా, బస్తర్ కుగ్రామాల బజార్ల గుండా - పిల్లలకు విద్యాసదుపాయాలు కల్పించమంటూ ‘మార్చ్’ లు సాగించేందుకు - వారి పిల్లాపాపలతో సహా, స్త్రీలందరూ కూడడం జరుగుతోంది. రేప్ కేసులను ప్రతిఘటిస్తూ రోడ్లను అడ్డుకుంటున్నారు. సారా అమ్మకాలను ఆపివేయమని పోలీసులను నిలదీస్తున్నారు.   తరతరాల నుండీ వారి కి సంక్రమిస్తున్న బానిస సంకెళ్ళను వదుల్చుకుని, ‘పీడితుల సైన్యం’ లో అడుగుపెట్టి వందలాది యువతులు గెరిల్లా యోధులు గా మారుతున్నారు. ఆకుపచ్చ టోపీల పై ఎర్రని నక్షత్రాన్ని ధరించి, భుజాలపై రైఫిళ్లు పట్టుకుని ఆత్మవిశ్వాసం తో తోణికిస లాడుతున్నారు. పితృస్వామ్యాన్ని కూలదోయ్యాలంటే - ఆధిపత్య వర్గాల మీదా, భూస్వామ్య వర్గాల మీదా, వలస పాలనా వర్గాల మీదా పోరాటం తప్పనిసరి అని అర్ధం చేసుకుని దానిని సాధించడానికి సైనిక శిక్షణ పొందుతున్నారు. ఆ బలం తో ప్రపంచం లోనే మూడవ పెద్ద దోపిడీ వర్గపు సైన్యాన్ని ఎదుర్కునేందుకు సంసిద్దులౌతున్నారు. కటిక పేదస్త్రీలలో కలుగుతున్న సాంఘిక రాజకీయ జాగృతి ఇది. బూర్జువా మీడియా చూడదల్చుకోని విషయం కదా – అందుకే ఈ ఘట్టాలు టీవీ కెమెరాల జిగజిగ లకు దూరంగా చోటుచేసుకుంటున్నాయి. విప్లవ పోరాటాల కారణంగా గ్రామీణ నిరు పేద వర్గాల జీవితాలలో జరుగుతున్న రూపాంతరాలకు, వికాసానికీ గుర్తులు ఇవి.   

కానీ ఈ స్త్రీల విప్లవ ఉద్యమం ఏదో రాత్రికి రాత్రి ఉద్భవించినదో, మరేదో ప్రచారపు ఉద్రుతాల వల్ల గాలిలో తేలుతూ వచ్చినదో కాదు. సాయుధ పోరాటాలు వ్యాప్తి చెందడం తో పాటే స్త్రీల పోరాటాలు కూడా విస్తరించాయి. ఈ పోరాటాలకి సంబంధించి ప్రజల్లో ప్రవేశపెట్టిన అభిప్రాయాలు అపోహలేననీ, వాస్తవం వేరే ఉందనీ మనం గ్రహించాలి. అదేమిటంటే - 1980 ల్లో ఫ్యూడల్ పీడనకు వ్యతిరేకంగా దేశం లోని పలుప్రాంతాల్లో కమ్యూనిస్ట్ విప్లవ శక్తులు ప్రారంభించిన విప్లవ పోరాటాలు – ఈ రైతు మహిళలు పోరాటాలు సాగించేందుకూ, తమ హక్కుల కోసం ఉద్యమించెందుకూ – వారిలో తగిన ధైర్యాన్ని కలిగించాయి. పీడితులలో కెల్లా పీడితులూ, సొంతంగా చిన్న ముక్క భూమి కూడా లేని రైతుకూలీలూ – వీరెవరికీ ఈ సమాజంలో గుర్తింపూ, గొంతుకా లేవు, కనీసం వారికి పేర్లు కూడా లేవు. అటువంటి అట్టడుగు వర్గపు స్త్రీలంతా వారి గ్రామాల్లో మహిళా కార్యక్రమాలను నిర్మించుకున్నారు, గెరిల్లా సైనికులూ అయ్యారు. అంటే, దీని సాయుధపోరాటాలతో పాటూ, స్త్రీల సంఘటిత రూపాలూ బలపడ్డాయని అర్ధం. అలా సంభవించిన ఈ మహిళా ఉద్యమం దేశం లోకెల్లా అతి శక్తివంతమైనదిగా రూపుదిద్దుకుంది. కానీ దానికి ప్రచారం ఇవ్వకపోవడమూ, నిరాదరించడమూ జరుగుతోంది. అది ఆధిపత్య వర్గాల కుట్ర అని మనం గ్రహించాల్సి ఉంది. అది ఈ ఉద్యమానికి సంబంధించిన వార్తలను గుర్తించకపోవడమే కాదు సాధ్యమైనంత కాలం తొక్కి పెట్టి ఉంచుతుంది కూడా.

Friday 13 May 2016

సహజీవన సౌందర్యం - 1 (జానకి విముక్తి)





ఇప్పుడున్న సమాజంలో స్త్రీల కేవైనా సమస్యలున్నాయా లేవాఉంటే అవి ఏమిటిఈనాడు స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉన్నాయిఅవి ఎలా మారాలి – అనే విషయాలు స్త్రీ పురుషులకు తెల్పడమే ఈ నవల ఉద్దేశ్యం – అని జానకి విముక్తి’ గురించి చెప్తారు రంగనాయకమ్మగారు.    

ధనిక స్వామ్యం వల్ల పీడనకు గురయ్యే శ్రామిక, కర్షక వర్గాల స్త్రీలూ; కుల దౌర్జన్యాలకు గురౌతున్న దళిత స్త్రీలూ; మెజారిటీ వర్గాల దోపిడీకీ లేదంటే నిర్లక్ష్యానికీ గురయ్యే గిరిజన, ఆదివాసీ స్త్రీలూ; మతం, సంప్రదాయం కలిసి గొంతు నొక్కేస్తుంటే ఉక్కిరిబిక్కిరౌతున్న మైనారిటీ వర్గాల స్త్రీలూ – మన చుట్టూ ఉన్నారు. ఇలా స్త్రీల దుస్థితి ఎన్నో రూపాలతో ఈనాడు మన ముందు విలయతాండవం చేస్తోంది. అయితే వీటన్నిటికీ భౌతిక, రాజకీయ, ఆర్ధిక కారణాలను మనం గుర్తించగలం. వ్యవస్థలోని ఏయే మార్పులతో ఈ సమస్యలు పరిష్కారమవగలవో ఆ చర్యలను ఊహించనూ గలం. 
అయితే ... వీటన్నిటితో పాటూ, పేదా గొప్పా అన్న భేదం లేకుండా అన్ని తరగతుల స్త్రీలనీ అణచి ఉంచే వ్యవస్థ స్వరూపం – పితృస్వామ్యం. అన్ని వర్గాల లోనూ అంతర్లీనంగా ప్రవహించే భావజాలమూ, ఈ వికృత రూపాలన్నిటి విషస్వభావం అనదగ్గది ఈ పురుషస్వామ్యం. అది మానవుల అంతరంగాలను ఏ మేరకు కలుషితం చేసి, వారి జీవితాలను ఛిన్నాభిన్నం చెయ్యగలదో మనకు ‘మధ్యతరగతి వారి’ జీవితాలలో స్పష్టంగా కనిపిస్తుంది.  

విద్యావంతులై ఉండీ, కొద్దో గొప్పో సంపాదించుకుని పొట్ట పోషించుకోగలిగీ, పుట్టింటి సహకారం ఏదో మేరకు ఉన్న స్త్రీలు కూడా స్వేచ్చగా, స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవించలేక పోతున్నారన్నది వాస్తవం. దీనికి కారణాలేమిటనీ, పరిష్కారమేమిటనీ ఆలోచించే వారందరూ చదవాల్సిన పుస్తకం ‘జానకి విముక్తి’. 
తెలిసినవారికే మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు - తెలియని వారికీ, కొత్త వారికీ ‘విముక్తి సిద్ధాంతం’ గా మార్క్సిజాన్ని నిరూపణ చేయించాలన్న పూనిక కనిపిస్తుంది రంగనాయకమ్మ గారి శైలిలో. మార్క్సిజం పట్ల కొంత అవగాహన ఉన్నవారూ, లేక ఏదో ఒక ఉద్యమ నేపధ్యం ఉన్నవారూ – వీరికే కాక స్త్రీ సమస్యల పట్ల సానుభూతితో ఆలోచించే తటస్థ వర్గానికి సైతం మార్క్సిజం స్వరూప స్వభావాలను అర్ధం చేయించే ప్రయత్నం జరిగింది ఈ నవలలో.


జానకి పాత్ర విశిష్టత:
కథగా చెప్పుకోవలసి వస్తే – జానకి జీవితం – తన కుటుంబానికో, ఊరికో ఆపద రాగా అడ్డునిలిచి పోరాడిన వ్యక్తి ఉద్విగ్నచరిత్రం కాదు; దోపిడీకీ, దౌర్జన్యాలకూ తలొగ్గలేక తిరగబడిన వీరగాధ కాదు; బానిస బ్రతుకు దుర్భరమై పోగా స్వేచ్చా వాయువులు పీల్చేందుకై సమాజ భావజాలానికి ఎదురీది నిలిచిన వ్యక్తి విలక్షణ గాధ కాదు, విప్లవోద్యమాల్లో పాల్గొని త్యాగాలతో నిండిన జీవనం సాగించిన వ్యక్తి సాహస గాధ కాదు. జానకి కేవలమూ ఒక సగటు స్త్రీ, పైన చెప్పుకున్న అసాధారణ పరిస్థితు లేవీ ఎదురవ్వని ఒక సాధారణ మధ్యతరగతి స్త్రీ. చెప్పాలంటే ఇది ఈ నవలకుండే ఒక ప్రత్యేకత కూడా.
రంగనాయకమ్మగారి మాటల్లో జానకి  ...  స్వేచ్చ అనీహక్కులనీ ఆమె ఎన్నడూ ఆలోచించలేదు. రోజులు ‘శాంతం గా’ గడిస్తే చాలనుకుంది. హక్కులే శాంతిని ప్రసాదిస్తాయని తెలియని జానక్కిప్రతీ రాత్రీప్రతీ పగలూ దీర్ఘ విచారంతో గడుస్తున్నాయి.                  
జానకి కందిన అసాధారణ సిద్ధాంత జ్ఞానం ఆమెకూ, ఆమె వంటి సాధారణ స్త్రీలకూ ఎలా విముక్తి కలిగించగలదో విశదీకరించే కథ ఇది. ఎందుకంటే పైపైన చూస్తే - తప్పించుకోలేని విపత్కర పరిస్థితులేమీ ఉండవు జానకి జీవితంలో. భర్త వెంకట్రావుతో నరకప్రాయమైన ఆ కాపురం ఆమె ఎందుకు వదులు కోదని మనం ప్రశ్నించుకుంటే, జవాబు అంత సులభంగా దొరకదు. కూటికీ, గూడుకూ లోపం వస్తుందన్న భయం లేదు, వెనక్కి పట్టి లాగే పిల్లల బాధ్యతా లేదు; అన్నిటి కన్నా ముఖ్యమైన విషయం, అభిమానంగా ఆసరా ఇచ్చే అన్న ‘సత్యం’ ఉన్నాడామెకు. భౌతిక పరిస్థితుల దృష్ట్యా- ఎన్నో విధాలుగా సగటు మధ్యతరగతి మహిళ కు ప్రాతినిధ్యం వహించగలిగిన పాత్ర జానకిది.
సమకాలీన సమాజంలో స్త్రీల పరిస్థితిని అర్ధం చేసుకునేందుకు జానకి పాత్రలోని సామాన్య లక్షణాలనూ, ప్రత్యేక లక్షణాలనూ నిశితంగా గమనించాలి. శతాబ్దాలుగా స్త్రీల మనస్తత్వాల్లో ఇంకుతూ వస్తున్న సిగ్గూ, బిడియమూ, సంకోచమూ, బెరుకూ, మగవారి కంటే తాము తక్కువని నమ్మే న్యూనతా భావమూ - ఇటువంటి లక్షణాలన్నీ జానకిలోనూ చోటు చేసుకుని ఉంటాయి.

శుచీ, శుభ్రతా, సౌమ్యతా, స్నేహశీలతా, తోటి వారి పట్ల సానుభూతీ, మాట పడకుండా తన ప్రవర్తనను దిద్దుకోవాలన్న వివేకమూ, డబ్బు కంటే ప్రేమాభిమానాలే విలువైనవని నమ్మే ఆదర్శ భావాలూ – ఇవన్నీఆమె వ్యక్తిత్వం లోని ప్రత్యేకతలు. 
పాత వాసనలను వదలగొట్టుకునే ప్రయత్నం కొనసాగించడం, తనకు సహజంగా అబ్బిన సద్గుణాలన్నీ పూర్తిగా వికసించగలిగే నూతన ప్రపంచం వైపు జానకి అడుగు పడడం - ఇదే ఆమె కథకు ముగింపు.




మార్క్సిజం లక్ష్యం ‘శ్రామిక వర్గ రాజకీయాధికారం’ మాత్రమే అన్న పాక్షిక దృష్టిని తొలగించి, ఒక సంపూర్ణ జీవన విధానం అని నిరూపిస్తూ, జానకి ప్రపంచం క్రమంగా విశాలమవడం మనకు కనిపిస్తుంది. మూఢనమ్మకాలను వొదిలి పెట్టడం, కులాల సంకుచిత దృష్టిని అధిగమించడం, ‘శ్రమ’ విలువను గుర్తించి గౌరవించడం, ఆర్ధిక స్వాతంత్ర్యం సంపాదించడం, ఆడంబరాలను తిరస్కరించడం వంటి అనేక మార్పులు - ఆ నూతన జీవన సరళి లో భాగాలని జానకి కథ వల్ల మనకు అర్ధమౌతుంది.             

పురుషాహంకారమంతా కలిపి ముద్దచేసి, దానికి పురుష రూపమిస్తే తయారయేది వెంకట్రావు పాత్రా, స్త్రీ రూపం అతని తల్లీను. నవలలో ‘వెంకట్రావు’లంటూ అదొక జాతిలా పిలవడం అక్కడక్కడా కనిపిస్తుంది; అలాగే అతని తల్లి విషయం లో కూడా, పేరు చెప్పకుండా ‘అత్త’ అని మాత్రమే సంబోధించడంలో – ఈ పాత్రలు వాస్తవ వ్యక్తులని కాక ‘ప్రతీక’లనే భావం వస్తుంది. నిత్యం మనం లోకంలో చూసే వ్యక్తుల్లో ‘పురుషాధిక్యతా భావం’ వివిధ మోతాదుల్లో ఉండొచ్చు గాక, వీరిద్దరి  పాత్రల వర్ణనా, చిత్రీకరణా చదివేక మాత్రం, ఆ అవలక్షణాలు ఏ రూపం లో కనిపించినా మనం గుర్తుపట్టగలం అనిపిస్తుంది. 



భావజాలం మహిమ:
సమాజంలో ప్రచారం అయ్యే భావాలు - పీడన సాగించే బలవంతులనే కాదు, పీడనకు గురయ్యే బలహీనులను కూడా తమ వశం చేసుకుంటాయి. చిన్నతనం నుంచీ సంస్కారవంతుడైన తండ్రి దగ్గర స్వచ్చమైన భావాలతో సంతోషంగా పెరిగిన జానకి – అత్తవారిల్లు చేరి వారి మాటలే మాట్లాడ్డం చూసి సత్యం నిర్ఘాంతపోతాడు. తన పిన్నత్తగారి కూతురు పెళ్లి మాటల సందర్భంలో - మూర్తి గారు మన కులమేనాకులం కాకపోతే మాత్రం వీళ్ళు ఒప్పుకోరు.” అంటుంది జానకి. జానక్కీజానకి అత్తకీ తేడా నశించింది – ఆ క్షణంలో సత్యం మనసులో  అని రాస్తారు.

అలాగే మరో సందర్భంలో రైలు ప్రయాణమప్పుడు ఒక తోటి ప్రయాణీకుణ్ణి మంచినీళ్ళడిగి తాగి, మళ్ళీ అలా 'స్వతంత్రించడం' తప్పని భావించి జానకి తనను తానే నిందించుకుంటుంది:   
వెంకట్రావు సంగతి సరేజానక్కి కూడా తను చేసిన పని మర్యాద గల పని కాదనిపించింది. ... ఎంత పాడు పని చేశానా ... అని చాలా దిగులేసింది. సిగ్గేసింది. భర్త మొహం మళ్ళీ చూడాలంటే భయమేసింది - అని రాస్తారు. ఇలా తనకే తెలియని బానిసత్వంలో జానకి కూరుకుపోయి ఉంటుంది.

ఆమె ఉన్న దీనస్థితి ఆమె కంటే ఎక్కువగా అన్న సత్యాన్ని కదిలిస్తుంది. 'ఎక్కణ్ణించి వచ్చిందో అంత పిరికితనంమాటమాటకీ భయపడుతుంది. మహా నిరుత్సాహంగా చూస్తుంది.' అంటూ తన స్నేహితుడు, కమ్యూనిస్ట్ మూర్తితో సత్యం చెప్పుకు బాధ పడతాడు. జానకి అలా ఏడుస్తూ మొత్తుకుంటూ ఉంటే తనకే చైతన్యం రావాలని ఊరుకోవాల్సిందేనా?అలా వీల్లేదని సత్యం, వెంకట్రావు బారి నుండి కాపాడి జానకిని తీసుకుపోతాడు. నీ కృషి మీదాఉత్సాహం మీదానీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది జానకీ!” అంటూ చదువుకోమని ఆమెను ప్రోత్సహిస్తాడు.    

కానీ జానక్కి పెద్ద బరువు ఏదో తన మీద పడ్డట్టుగా అయింది ... నాలుగేళ్ల చదువు! ఉద్యోగం! కృషి!
ఏమీ ఉత్సాహం లేదు లోపల. దానికి కారణం ఇలా రాస్తారు. “భర్త లేనిసంసారం లేనిపిల్లలు లేని మోడుబతుకుపాడు బతుకు కళ్ళకు కడుతుంది- ఆమెకు” . జానకి కుండిన ప్రాపంచిక దృక్పధం ప్రకారం స్త్రీ జీవితంలో అవే అతి ముఖ్యమైన విషయాలు మరి. తాను ఇల్లు వదలి రావడం మంచిపని కాదేమో అన్న సందేహం ఆమెను పీడిస్తూ ఉంటుంది.    
అటువంటి బలహీన సమయంలో, వెంకట్రావు రాకా, అతని కల్లబొల్లి కబుర్లూ ఆమెను మళ్ళీ పాత జీవితంలోకి జారుకునేలా చేస్తాయి.


వెనక్కి తిరిగి వచ్చాక వెంకట్రావు తనను వంచించాడని మరోసారి అర్ధమై కుంగిపోతూ ఉంటుంది. అతి నైరాశ్యం లో ఉండగా జానకి చూసిన ‘ఒక పతివ్రత’ సినీమా, అది ఆమెలో రేకెత్తించిన ఆలోచనలూ మనల్ని విస్తుపోయేలా చేస్తాయి. సినీమాలో పతివ్రతను చూసి - జానక్కి శరీరం పులకరించింది. ఆ ఇల్లాలు తానే అయినట్టూ, తనకే అన్ని సద్గుణాలూ ఉన్నట్టూ, తనకే అంత కీర్తీ, స్వర్గమూ ప్రాప్తించినట్టూ ఊహల్లో తేలింది. మరింత వినయంతో, ప్రేమతో సేవ చేసి భర్తనూ, అత్తనూ మెప్పించాలని నిశ్చయించుకుంటుంది. 
ఈ సంఘటన గురించి చదివిన తర్వాత, కళారూపాలు మనుషులకు చెయ్యగలిగే చేటు ఎంత శక్తివంతమో, దానిని ఎదుర్కోవాలంటే ఏ విధమైన ప్రయత్నాలు చేయవలసి ఉంటుందో – అనేది మనమందరం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం అనిపిస్తుంది. అలాటి విషానికి విరుగుడా అన్నట్టు సత్యం భావాల ప్రభావమూ, అతని ద్వారా మూర్తి  సిద్ధాంత చైతన్యమూ జానక్కి అందుతూ ఉంటాయి. 

  
చైతన్యం

సత్యం రాసే ఉత్తరాలూ, పంపే పుస్తకాలూ ఆమెలో కొద్ది కొద్దిగా మార్పును తీసుకువస్తాయి. చలం 'మైదానం' లో ఉన్నఎవరితోటీ చనువుగా ఉండనీని, చివరికి తనతో కూడా, నా పెనిమిటి ...” అనే వాక్యం చదవగానే తన కాపరం గురించి చలానికి ఎలా తెలిసి ఉంటుందా అని తెల్లబోతుంది కూడా. ఎందుకంటే ఆమె భర్త భార్యని ఎవరి తోటీ చనువుగా ఉండనివ్వక పోతే పర్వాలేదు. తనతో కూడా ఉండనివ్వడు. పుస్తకాల లోని భావాలను తన జీవితం తో అన్వయించుకునే ప్రయత్నం చేస్తుంది. జానకిలో జ్ఞానం పెరిగిన కొద్దీ ఆమెలో ప్రశ్నలు అధికం ఔతాయి. తన జీవితం మీద అసంతృప్తి పెరుగుతుంది.

ఆమె మనస్థితి గురించి ఇలా రాస్తారు: జానకి అనుభవాలు ఆమె అమాయకత్వాన్ని సహించడం లేదు. భ్రమలకీ, మౌనాలకీ జీవితంలో చోటు లేదని హెచ్చరిస్తున్నాయి. శాశ్వత శత్రుత్వంతో రాజీ సాగదని తేల్చి చెపుతున్నాయి.    

కానీ ఇంకా ఊగిసలాడుతూ ఉన్న జానకి మనసు - కోపం వెంకట్రావు బలహీనత అని భావించి సరిపెట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తుంది. అతను చేసే పెత్తనాన్ని ఒక వ్యక్తిగత దుర్గుణంగా మాత్రమే చూడడం ఎంత దారుణమైన పొరపాటో తెలిసివచ్చి, ఆమెకు ఒక్కసారిగా కనువిప్పయ్యే సందర్భం ఒకటి వస్తుంది.

మెత్తని మాటా, సుతి మెత్తని మనసూ, పరిశుభ్రమైన పనీ ఆమెకు సహజ లక్షణాలు. ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన వ్యక్తి సైతం, మనసు కనిపెట్టి జానకి ప్రేమగా చేసే పరిచర్య లకు కృతజ్ఞుడౌతాడు. అవన్నీ తన ప్రతాపమేనని నమ్మే వెంకట్రావు మాత్రం “అది నడుపుకునే వాణ్ని బట్టి ఉంటుందిఅని బీరాలు పలుకుతాడు.రౌతు కొద్దీ గుర్రం” – అన్నవెంకట్రావు మాట శూలంలా గుచ్చుకుని జానకి విలవిల లాడుతుంది. మళ్ళీ మామూలు మనిషి అవలేకపోతుంది. కాలితో తన్నినప్పుడు కూడా ఆమె మనసుకి ఇంత క్షోభ కలగలేదు. కోపంలో వివేకం పోయి ఆ పని చేసాడులే అనిపించింది. కానీ ఈమాట ఎంతో మామూలుగా నవ్వుతూ అన్నాడే అని పదేపదే తల్చుకుంటుంది, తన ఓర్మిని తనే చీదరించుకుంటుంది.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం - మనుషులు ప్రకటిస్తున్న ఈ తుచ్చ భావాలను ఒక ‘వ్యక్తి’ స్థాయిని దాటి సమాజమంతటికీ సంబంధించిన విషయంగా అర్ధం చేసుకోవలసి ఉంది. మనిషిని జంతువుతో పోల్చడం, ఆమెకు సహజసిద్ధమైన దయా, కరుణా వంటి లక్షణాలను గుర్తించక పోవడం, పైపెచ్చు తన ‘అజమాయిషీ’ వల్లనే ఆమె ‘నడవడి’ సరిగ్గా ఉంటుందనే వాదమూ పురుషాధిక్యత ప్రభావాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తాయి.   

అటువంటి విశ్వాసాలను నిలువునిపాదం నింపుకున్న వెంకట్రావు గురించి ఇలా తేల్చేస్తారు: పై నించి తిరుగబాట్లు వొచ్చిపడి అతన్ని ముంచెత్త వలసిందే గానీ, అతని లోపల నించి జరిగే హృదయ పరివర్తన ఎన్నటికీ శూన్యం!  కనక అతని నుంచి విడిపోవడమే శాశ్వత పరిష్కారమని తెలుస్తుంది.  

      
ఉద్యమకారుల పాత్ర:
ఈ నవలలోని మరో విశేషం – స్త్రీల సమస్య, సమాజంలోని మిగిలిన సమస్యలతో ఎలా పెనవేసుకుపోయి ఉంటుందో చెప్పే రచనా సంవిధానం. జానకి సమస్యకు సంబంధించిన ప్రతీ ఒక్క అంశాన్నీ, సమాజాన్ని విప్లవమార్గం పట్టించేందుకు జరగాల్సిన ప్రయత్నాలతో అనుసంధానం చేయించి చెప్తారు. కమ్యూనిస్ట్ మూర్తికీ, ఔత్సాహికుడు సత్యానికీ మధ్య జరిగే సంభాషణల్లో ఉద్యమకారుల బాధ్యతల గురించీ, ప్రజల చైతన్యం గురించీ చర్చిస్తారు.
'ఎవరి చైతన్యాన్ని బట్టి వారి సమస్యలు పరిష్కారమౌతాయి. ఒక వ్యక్తివిషయం అయినా అంతే, ఒక వర్గం విషయం అయినా అంతే. ఒకరి సమస్యల్ని ఇంకొకరు పరిష్కరించ లేరు' అని మూర్తి సత్యాన్ని హెచ్చరిస్తాడు. ఎవరికి అన్యాయం జరుగుతోందో వాళ్ళే దాన్ని గ్రహించుకుని, దాన్ని తిరస్కరించడానికి వాళ్ళే సిద్ధంగా ఉండాలి కదా?  అని మూర్తి అనడం- సమస్యల్లో చిక్కుకున్న ప్రతీ ఒక్కరికీ వర్తించే మౌలిక సూత్రంగా అర్ధం చెప్పుకోవచ్చు.

ప్రజల కోసం పనిచేసే వారు ప్రజలతో వ్యవహరించాల్సిన తీరుతెన్నుల గురించి వివరిస్తారు. ఉద్యమకారుల చైతన్యం వల్ల ప్రజలకు ధైర్యం రావాలి గానీ, ప్రజాపీడకులను భయపెట్టి ఉద్యమకారులు ప్రజలను ‘రక్షించాల’ను కోకూడదనే అర్ధంలో జానకి గురించి ఇలా రాస్తారు: జానకి వెనకాల మనమందరం దన్నుగా ఉన్నామన్న ధైర్యం జానక్కి కలగాలి గానీ, ఆ భర్తా, అత్తా మనల్ని చూసిభయపడాలని మనం అనుకోకూడదు. అది అడ్డదారి.

అయితే ఆ సమస్యలకు కారణం తెలిసి, వాటి నుండి బయట పడే మార్గం చూపించి సహాయపడాలనుకునే సత్యం వంటి వారి పాత్ర - ఏమిటనే ప్రశ్న వస్తుంది. జానకి జీవితం గురించి జానకే ఆలోచించుకునేటట్టు చెయ్యడమే నీ పని ... మనకు నిజంగా జానకి కష్టాలు పోవాలని ఉంటే, జానక్కి జ్ఞానం కలిగించే ప్రయత్నాలన్నీ చేస్తాం. మన కృషిని బట్టీ కూడా జానక్కి వివేకం కలగడం, కలక్క పోవడం ఉంటుంది. అని జవాబిస్తారు. ఉద్యమాలను నడిపించే వారి బాధ్యత అదేనని, దానికే వారు కృషి చెయ్యాలనీ అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే అంత జ్ఞానం వచ్చిన్నాడే ఆమెకు విముక్తి! అని స్పష్టంగా తేల్చి చెప్తారు.

ఆ కృషి ఎలా సాగాలో, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలోకూడా ఇలా చెప్తారు :ప్రజల చైతన్య స్థాయిని బట్టి మాత్రమే వారి పోరాటరూపం ఉంటుంది. ప్రజల సమస్యల మీద పని చేసే టప్పుడు, ముందు ఆ ప్రజల చైతన్యస్థాయిని దృష్టిలోకి తీసుకుంటాం.
దానికి ఉదాహరణగా, జానకి సమస్యల నేపధ్యంలో వివరిస్తారు. జానకి వెంకట్రావు నిజస్వరూపం పూర్తిగా గుర్తించలేని సందర్భంలో, అతన్ని విడిచిపెట్టమని ఆమెకు సలహాఇవ్వడం  ఆ దశలో నిరుపయోగమైనదనీ, ఆమె సమస్యల పరిష్కారానికి అంచెలంచెలుగా సహకరించాలని మూర్తి సత్యానికి సలహా ఇస్తాడు.

చిన్న చిన్న అడుగుల్లో విజయం సాధిస్తే, ప్రజలకు పోరాటంలో విశ్వాసం కుదురుతుందనీ, ఆ రకమైన ప్రణాళికలను రూపొందించి, ప్రజలకందించి వారిని ఉద్యమమార్గంలో నడపాలన్న ధ్వని ఇక్కడ వినిపిస్తుంది. ఆ పనులు ఎలాటివై ఉంటే సరైన ఫలితాలనివ్వగలవో జానకి పరంగా ఇలా రాస్తారు: తను ఏ విషయాలకి చాలా ఇబ్బంది పడుతోందో వాటిని వదిలించుకోడం అయితే జానక్కి కూడా ఇష్టంగానే ఉంటుంది. అందుకోసం అయితే తప్పకుండా పట్టుదలగా ఉంటుంది. కాబట్టి ఆమె తక్షణ సమస్యల మీదే ఆమెను ఎడ్యుకేట్చెయ్యడం ప్రారంభించాలి.   



విముక్తి
జానకి వెంకట్రావు ఇంటి నుండి బయట పడడమే ఆమెకు విముక్తి అయితే అది ఆమె మూర్తి వెనక బయలుదేరి అన్న సత్యం ఇంటికి చేరడంతోనే కథ ముగిసిపోవచ్చు. కానీ సంపూర్ణంగా విముక్తి చెందడం అంటే ఏమిటో ఇలా వివరిస్తారు. 
భర్త ఎలాటి వాడైనా భర్త తోడిదే లోకం అని జానక్కి గతంలో ఉన్న భావాలు మారడం, ఆమె స్వతంత్రంగా ఆలోచించగలగడం, భర్త పట్ల ఉన్న మానసిక బానిసత్వాన్ని విడిచి పెట్టడం, ‘స్త్రీ బానిసత్వంఅనే దాన్ని తన వ్యక్తిగత విషయంగా కాక స్త్రీ లోకానికంతటికీ సంబంధించిన సమస్యగా అర్ధం చేసుకోవడం, సమాజంలో జరగవలసిన విప్లవకరమైన మార్పులకు సహకరించడమే తన జీవితాదర్శంగా ఎంచుకోవడం ఆ రకంగా ఆమె భావాలు అంత ఉన్నత స్థాయి వరకూ అభివృద్ధి చెందడంఇవన్నీ ‘విముక్తి’ లోని వివిధ దశలని అనిపిస్తుంది.

1970లో పదవ తరగతి మాత్రమే చదివి పదహారేళ్ళకు పెళ్ళై వచ్చేసిన జానక్కీ, ఇప్పటి సగటు మధ్యతరగతి  స్త్రీకీ ఏపాటి తేడా వచ్చిందో, సమకాలీన సమాజంలో జానకి కథ ప్రాసంగికత ఏ విధంగా ఉంటుందో విశ్లేషించుకోవలసి ఉంది. నవలలో చర్చించిన అనేక స్త్రీ పాత్రల స్వరూప స్వభావాలూ, వారితో జానకి సంబంధ బాంధవ్యాలూ కూడా మనకు జానకి విముక్తిని అర్ధం చేసుకోడంలో సహాయ పడగలవు.         (ఇంకా ఉంది)