Saturday 31 August 2019

బీజేపీతో దేశానికి పెను ప్ర‌మాదం

https://kolimi.org/%e0%b0%ac%e0%b1%80%e0%b0%9c%e0%b1%87%e0%b0%aa%e0%b1%80%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%86%e0%b0%a8%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b0%82/


అరుంధతీ రాయ్ 2002 లో ఇలా రాసింది: “ఈ దేశంలో నువ్వొక కసాయివాడివీ, ఊచకోతలు జరిపేవాడివీ అయి ఉండి, దానికి తోడు రాజకీయనాయకుడవయ్యే అవకాశం నీకు లభిస్తే – ఇక వెనకడుగు వేసే పనే లేదని నువ్వు ఆశించవచ్చు.”
2002 ఏంటీ ముస్లిం మతకల్లోలాలలో 1000 మందికి పైగా ప్రజలు మరణించారు. ఆ హత్యలకు సంబంధముందనే ఆరోపణకు గురైన – అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి , నరేంద్రమోదీని ఉద్దేశించి – రాయ్ ఆమాటలు రాసింది. మోదీ తాను నిర్దోషినని -(చాలా మంది దృష్టిలో అది నిజం కాకపోయినా కూడా) – చెప్తూ వచ్చారు. కాని, అతని భవిష్యత్తు గురించి రాయ్ వేసిన అంచనా తూచా తప్పకుండా జరిగింది. మోదీ భారతీయ జనతా పార్టీ – మొండిగా పంపే హిందూ ఆధిక్యత అనే సందేశాన్ని నిర్లజ్జగా పంపి, భారీవిజయం సాధించిన మొన్నటి ఎన్నికల తర్వాత, ఆయన రెండోసారి ప్రధాన మంత్రి అవుతున్నారు. ఎప్పటి కంటే ఎక్కువ శక్తివంతులైనారు.
“ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్యం”. గర్వంగా చెప్పుకునే ఆ పదప్రయోగాన్ని ఆమె బెదురు చిహ్నాల (scare quotes) మధ్య ఉంచి రాస్తుంది. భారతదేశం – ఒకే సమయంలో అనేక శతాబ్దాలలో జీవిస్తోంది. ఆ విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే దేశాన్ని పీడిస్తున్న సమస్యల రూపాన్ని గమనించాలి. సంప్రదాయం, కుల వ్యవస్థ, ఏ రోజుకారోజు బలం పుంజుకుంటూ కేపిటలిజం సృష్టించే అస్తవ్యస్తత – ఇవన్నీ – వేర్వేరు కాలాంతరాలలోకి వేళ్లూనిన సమస్యలు. ఈ వైరుధ్యాలన్నీ మోదీలో మూర్తీభవించి ఉన్నాయి. ఒక ‘టీ’ అమ్మి జీవించిన ఒకప్పటి కుర్రవాడు ఇప్పుడు 16,000 డాలర్ల ఖరీదు సూట్లు వేసుకుంటాడు. అటువంటి ఉదంతాల సహాయంతో – ఏక కాలంలో స్వయంసిద్ధతకూ, ఆకాంక్షకూ (authentic and aspirational) ప్రతినిధిగా, తేజోవంతమైన హిందూ పునరుజ్జీవనం, నవీన ఉదారవాద ఆర్ధిక సంస్కరణలకి రెంటికీ ఏక చిహ్నంగా మోదీ తనను తాను ఆవిష్కరించుకుంటున్నాడు.
1997లో తొట్టతొలి నవల – ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్‌’ తోనే మేన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అరుంధతీ రాయ్, ఫిక్షన్‌లో విశ్వవిఖ్యాతి సాధించినప్పటికీ, ఆమే ఒక చోట అన్నట్టూ – ‘ఓ పుస్తకం రాసిన అందమైన స్త్రీ’ గా మిగిలిపోడం ఆమెకు సమ్మతం కాదు. పాశ్చాత్య మీడియా దృష్టిలో 21వ శతాబ్ధపు ఇండియా – ఒక ఆధునిక దేశం, వృద్ధి చెందుతున్న దేశం. ఆ దేశానికి సాంస్కృతిక ప్రతినిధిగా ఎదగాలన్న కోరికా లేదు ఆమెకు. ఈనాడు రాయ్ ఫిక్షన్‌ తో సమానంగా తన రాజకీయ దృక్పధానికి కూడా అంత పేరూ పొందింది. ఆమె మీద ఒకసారి దేశద్రోహనేరం మోపబడింది. ఇండియాలోని అరణ్యాలలో మావోయిస్టులను కలిసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ ఉద్యమాలకి తన సంఘీభావం ద్వారా వారికి సహాయపడింది. ఆమె వ్యాసాల సంకలనం – ‘మై సెడీషియస్ హార్ట్’ , వెయ్యి పేజీలకు పైగా ఉన్న పుస్తకం – జూన్‌లో రాబోతోంది.
ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న రాయ్ రెండవ నవల – ‘The Ministry of Utmost Happiness’ – (2017)లో మోదీ పేరైతే వినిపించలేదు. కాని అతని ఆశయం అయిన ‘హిందూ రాజ్యం’ – పుస్తకాన్ని వెంటాడుతుంది. ఆమె అంటుంది – “నేను చెప్పకూడదేమో, కాని ఒక నవలకు శత్రువు ఉంటుందని అనుకుంటే – ఈ నవలలో ఆ శత్రువు మోదీ హిందూత్వ భావజాలం – ‘ఒక జాతి, ఒక మతం, ఒక భాష’ అనే నినాదం.”
ఎలక్షన్ల అనంతరం, రాయ్‌తో ‘ది న్యూ రిపబ్లిక్’ పత్రిక కోసం జర్నలిస్ట్ సామ్యూల్ అర్ల్ (Samuel Earle) ఈమెయిల్ ద్వారా మాట్లాడి తీసుకున్న – ఈ ఇంటర్వ్యూ – స్పష్టత, శైలి మెరుగయ్యేలా కొద్దిగా ఎడిట్ చేశాం.
 ప్రపంచంలోనూ, మీ రాతలోనూ ఎన్నో మార్పులు వచ్చి ఉంటాయి, మారకుండా ఉన్నది మాత్రం – మీ రచనలో కనబడుతూ వచ్చే మోడీ భయంకర స్వరూపం. అతని అధికారం అనే “ట్రాజెడీ” మీరూహించినట్లే నడిచిందా లేక ఆయన నాయకత్వం ఎక్కడన్నా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసిందా?
మోదీ మొదటి పదవీకాలంలో జరిగిన వాటిలో- నేనూహించినవీ, ఊహించనివీ కూడా ఉన్నాయి. బీజేపీ వెన్నుదన్ను, ఫాసిస్ట్ నమూనా అయిన ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌’ – భారతదేశాన్ని హిందూరాజ్యంగా ప్రకటించింది. దాని అనుంగు అనుచరుడైన మోదీ ఎలా ప్రవర్తిస్తాడని ఊహించానో అలాగే ప్రవర్తించాడు. ముస్లిం సమూహాలపై దాడి, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులను దుష్టులన్నట్టు చిత్రీకరించడం, దళితుల అణచివేతతో పాటు వారి ఆకాంక్షలను సైతం స్వంతం చేసుకోడానికి దళితులను హైందవీకరించడం – నా ఊహలన్నీ తూచా తప్పకుండా అక్షరం పొల్లుపోకుండా అమలయ్యాయి. ఎలక్షన్లకి సరిగ్గా ముందు – ఉగ్రవాది దాడి / యుద్ధం కూడా ఊహించాను (పుస్తకంలో సైతం రాసాను). పెద్ద కార్పొరేషన్‌లను ఆలింగనం, ప్రైవేటీకరణకి ప్రోద్బలం – ఇవి ఊహించాను. కాని రాత్రికి రాత్రి 90శాతం భారత కరెన్సీని ఇల్లీగల్‌గా ప్రకటించిన డిమోనిటైజేషన్‌ లాటి చర్యని మాత్రం ఊహించలేకపోయాను. ప్రజలని చాలా పెద్దదెబ్బ కొట్టింది అయితే పెద్ద సంఖ్యలో అతనికి వోట్ చెయ్యడానికి మాత్రం అది ఆటంకం అవలేదు.
ఇంతకు మునుపు కంటే పెద్ద ఎత్తున దేవతాస్వరూపం లాగా పూజలందుకుంటూ మోదీ మళ్లీ వచ్చాడు. ఇదొక ఆసక్తికరమైన మనస్తత్వం. బాధను దిగమింగి, అదే సౌఖ్యమనుకోడం దేని కోసం? అని ప్రశ్నిస్తే “దేశం” కోసమని సమాధానం. ఇది భీతిగొలిపే విజయం. కులాలు, వర్గాలు, ప్రాంతాలు, తెగలు – ఇదీ అదీ అని కాక – అన్నిటా వ్యాపించిన వోటర్లు అందించిన విజయం.
వేలాది ప్రజలు తన పేరును ఉచ్ఛరిస్తూ ఉండగా అతను చేసిన విజయోత్సవపు ఉపన్యాసంలో రెండు జడిపించే విషయాలు ఉన్నాయి- ఒకటి, 2019 ఎలక్షన్ – సెక్యులరిజం అన్న పదాన్ని అధికారికంగా ఉపసంహరించిందని. ఒక్క రాజకీయ పార్టీ కూడా సెక్యులర్ అన్న పతాకం కింద ప్రచారం సాగించే ధైర్యం చెయ్యలేదని – అతను గుర్తుచేసాడు. అతనన్నదానిలో అణుమాత్రం అబద్ధం లేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి, ముస్లిం అన్న పదాన్ని పలకడానికి కూడా భయం. ముస్లిం ప్రియులమని పేరు వస్తుందని. అంచేత లించింగ్, ముస్లింల సామూహిక హత్యలు – ఇవన్నీ గాలికి కొట్టుకుపోయాయి. మెజారిటేరియనిజం, హిందూజాతీయవాదం – ప్రస్తుతం గెలుపును కైవసం చేసుకున్నాయి.
అతను అన్న రెండో మాట – దిగువ కులాలకు ‘ప్రాతినిధ్యం’ వహిస్తున్నామ’ని చెప్పుకునే పార్టీలను చిత్తుగా ఓడించింది కనుక బీజేపీ “కులాన్ని” జయించిందని. రెండే కులాలు మిగిలాయట ఇప్పుడు – పేదవారూ, పేదరికాన్ని పోగొట్టేందుకు పాటుపడేవారూ నట. అంటే సాంఘికపరంగా, బీజేపీ శత్రువును చూపించి పబ్బంగడుపుకుంటుంది. కాని, ఆర్ధికపరంగా, శత్రువులే లేరన్నమాట. తొమ్మిది మంది వ్యక్తులు కలిసి, దిగువనున్న 500 మిలియన్ల మంది ఉమ్మడి సంపదనీ – తమ గుప్పిటిలో ఉంచుకున్న ఈదేశంలో – ధనవంతులు సాధుపుంగవులన్నమాట. ఇది అమితంగా భయపెట్టే దృక్పథం. తిరిగి ఎన్నుకోబడి, దైవాంశసంభూతుడి స్థాయిని చేరుకుని, నిరుపేదలకు ఎంగిలి మెతుకులు విదిలించి, ఆకలితో మాడుతున్న గ్రామాల్లోని కుటుంబాలకు గేస్ సిలిండర్ ఇచ్చి, వందలవేల సంఖ్యలో ఋణభారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకి 2000 రూపాయలు (30 డాలర్లు) ఇచ్చి, మిలియన్ల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువకుల చేతికి ద్వేషపూరిత భావజాలమనే మారణాయుధాన్నిచ్చి – ఈ సమస్యకి కారణమైన ఆర్ధిక విధానాలనే కొనసాగించేందుకు మోదీ అధికారం సంపాదించుకున్నాడు.
పేదలూ, పేదరికాన్ని పారద్రోలాలనుకునేవారూ తప్ప వేరే కులాలే లేవని ప్రకటించడం ద్వారా – దళితుల మార్గదర్శి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సైతం సాధించని ‘కులనిర్మూలనాన్ని’ – తనూ, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి సాధించేసాం అని చెప్పడమన్న మాట. ఇది చాలా కలతపెట్టే వాక్యం. ఎందుకంటే, అంబేద్కర్ చెప్పినట్టూ, హిందూమతం అంటేనే కులం. ఆర్‌ఎస్‌ఎస్ – బీజేపీ చేసినదేమిటంటే – కులాన్ని మరింత ధృఢపరచడం – కుల విభజనల్ని వాడుకోడం, కులాలకీ, ఉపకులాలకీ మధ్యనున్న భౌతిక పరమైన వైరుధ్యాలను ఉపయోగించుకుని– ఒకదానితో మరొకదానిని ఢీకొట్టించి– అతి నిపుణతతో ఎత్తులు వేసి లాభం పొందడం.
 రాజకీయ కేంద్రాన్ని ఆయన తన ఇమేజిలో విజయవంతంగా పునర్నిర్వచించాడని అనిపిస్తోంది. ఇది ఇప్పుడు “నూతన సాధారణం (new normal).”-దీనిని ఎదుర్కునేందుకేవన్నా కొత్త మార్గాలు కనిపిస్తున్నాయా?
తను ఎన్నికైన కొద్ది రోజుల తర్వాత, అంతర్జాతీయ ప్రెస్ ఘాటైన విమర్శలు చేసిన నేపథ్యంలో, మోదీ ఒక ఉపన్యాసం చేసాడు. అందులో మైనారిటీలకు రక్షణ కల్పిస్తానని, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాననీ చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే, ఆ ప్రకటన – ముందురోజు తానన్న మాటలకీ, తన సీనియర్ సహచరులన్న మాటలకీ కూడా పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ రకమైన స్వప్రయోజన పరాయణత్వం – పూర్తిగా ఆర్‌ఎస్‌ఎస్ తరహా చిట్కా. చిత్రమైన విషయం అదే, మోదీని దేవుడిలా పైకెత్తడం అనే ప్రక్రియ – బీజేపీని ఒక పార్టీగా మసకబార్చుతోంది. దాని వద్ద రాశులు పోసి ఉన్న సంపద, దాని పార్టీ యంత్రాంగం – చక్రవర్తిని సింహాసనం మీద ప్రతిష్టించడానికి వినియోగపడ్డాయి. మోదీ బయోపిక్ అనే హాస్యాస్పదమైన ‘పురాణకథా’చిత్రం, పూర్తి అబద్ధాలతో – విడుదలైంది. అది అతని దైవీకరణకి తోడ్పడుతుందనడంలో సందేహమే అవసరం లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా, నేననుకోడం అయితే – మోదీ చక్రవర్తిగా ఉండేది, ఆర్‌ఎస్‌ఎస్ అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకున్నంతసేపే.
ఆర్‌ఎస్‌ఎస్- శాసనం ఇప్పుడు నూతన సాధారణం, (new normal) దీనిని ఎలా ఎదుర్కోవచ్చని అడిగారు కదా, ఉత్తరభారతంలో ప్రస్తుతం, దాదాపు అన్ని రాజకీయపార్టీలూ చితికిపోయాయి. కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది, కమ్యూనిస్ట్‌లు కూలిపోయారు. దళిత బహుజనుల కోసం పెట్టిన పార్టీలమని అనే పార్టీలన్నీ సుమారుగా చెల్లాచెదురయ్యాయి. మొత్తం మీద అన్ని ప్రతిపక్ష పార్టీలూ అల్పత్వం తోనూ, అహంకారంతోనూ ప్రవర్తించి, ఒక దాని బలాన్ని మరొకటి తగ్గించుకుంటూ వచ్చాయి. ఈలోగా కొంపకూలిపోయింది. పార్టీలు ఇప్పటికైనా తమని తాము సీరియస్ ప్రశ్నలు వేసుకుని, ఆత్మవిమర్శ చేసుకుంటాయని ఆశిద్దాం.
ఆర్‌ఎస్‌ఎస్ దగ్గర – 600,000 మందికి పైగా క్రమశిక్షణ కలిగిన, దండిగా శిక్షణ పొందిన కేడర్ సిద్ధంగా ఉంది. తక్కినవారికి – కార్యకర్తల బలం దాదాపు శూన్యం. వారందరి దగ్గరా కలిపితే వచ్చే మొత్తం ధనానికి 20రెట్లు ధనం బీజేపీ దగ్గర ఉంది. వచ్చేసారి అది 50 రెట్లు అవుతుందేమో. ఇండియాలో ఎలక్షన్లంటే ఏమిటో – మనందరికీ తెలిసిన సత్యమే. డబ్బు; కళ్లు మిరమిట్లు గొలిపే తమాషాలు; మెయిన్ స్ట్రీం ఇంకా సోషల్ మీడియాల మీద పట్టు! ఈమూడిటి శక్తీ అనూహ్యం. ఎలక్షన్ క‌మిష‌న్‌తో సహా, దేశంలోని ప్రతీ వ్యవస్థనీ ఇవి తమకి కావలసినట్టూ ఆడించగలిగే పరిస్థితి – బహుశా ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు కూడా వాటి చేతిలోనే ఉన్నాయేమో. ఆ డబ్బుతో వాళ్లు వేలాది ఐటి నిపుణులని, డేటా విశ్లేషకులనీ కొనగలిగేరు. సోషల్ మీడియా ఏక్టివిస్ట్‌లతో, వేల కొద్దీ వాట్సాప్ గ్రూపులని నడిపి – వాటిలోకి ఒక ప్రణాళిక ప్రకారం తయారుచేసిన సమాచారాన్ని పంపడం. అంతే కాక, ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క సమూహాన్నీ, కులాన్నీ, ప్రాంతాన్నీ, వర్గాన్నీ, చివరికి ప్రతీ ఒక్క వోటింగ్ బూత్‌నీ వదలకుండా లెక్కలోకి తీసుకుని, వాటికి తగినట్టూ ఆ సమాచారాన్ని సవరించి మరీ ప్రసారం చేసారన్నది నమ్మశక్యం కాని నిజం.
ఆ అపార ధనరాశి శక్తి ఊహాతీతం. తాను అమ్మాలని నిర్ణయించుకున్న వస్తువును దేనినైనా సరే – నిస్సందేహంగా విక్రయించగలదు. ఇప్పుడు అమ్మబడుతున్న ఆ వస్తువు ఎంత విషపూరితమైనదంటే – దాని వల్ల కొత్త మహమ్మారి వ్యాపించింది.
అవసరమైన విషయం ఏదీ – వాతావరణంలో మార్పు, ముంచుకొస్తున్న ఆర్ధిక సంకటం, ఆరోగ్యం, విద్యా – ఒక్కటంటే ఒక్కటి కూడా – ప్రచారంలో చోటు చేసుకోలేదు. వినిపించిందల్లా ఏమిటంటే – తలమునకలయ్యే విషపూరిత మధ్యయుగాల మూర్ఖత్వం. దీనిని మనం న్యాయమైన ఎన్నికలని ఎలా అనగలం? ఫెరారీ కారుకీ, కొన్ని సైకిళ్లకీ మధ్య జరిగిన రేసులాటిదిది. అందులో దానికీ ఏమీ అసహజమైన విషయమే కనిపించనట్టు – ఫెరారి గెలుపు కోసం మీడియా కేరింతలు. ఇప్పుడు ఆ ఫెరారీ అద్భుత ప్రదర్శనకి దానిని పొగడ్తలలో ముంచెత్తుతోంది. సైకిళ్లు మరీ నీరసంగా పరిగెట్టాయని వాటిని వెక్కిరిస్తోంది.
అయితే, ఈ నిర్మాణాన్ని ప్రశ్నించేందుకు మిగిలిన మార్గాలు ఏవన్నది ప్రశ్న. ఈ ప్రజాస్వామ్యానంతరపు ప్రథమ రూపంలో ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీలూ – ఈ ధనభారంతో నిలిచి, ద్వేషంతో నడిచే భయంకర యంత్రాన్ని ఎదుర్కోలేవు. ప్రజల ఆవేశం ఏదో ఒక రోజు ఈ యంత్రాన్ని నేలకూల్చగలదని నా విశ్వాసం. నేను మాట్లాడేది విప్లవం గురించి కాదు. తిరుగుబాటు గురించి. ఎన్‌జీవో చేతుల్లో కీలుబొమ్మలు కాని సాంఘిక ఉద్యమాల పునరాగమనం గురించి మాట్లాడుతున్నాను. దాని రాక అనివార్యం. తప్పకుండా వచ్చి తీరుతుంది. దాని నుండి ఉత్పన్నమైన శక్తితో – నియంత్రణకి లొంగని ఒక నూతన ప్రతిపక్షం ఏర్పడుతుంది. మనం ఒక కొత్త ఆట, ఇలా మోసంలో కూరుకుపోని కొత్త ఆట మొదలుపెట్టాలి. ప్రజాస్వామ్యపు ఉత్తమ ప్రదర్శన అని కొనియాడబడుతున్న భారతదేశపు ఈ ఎలక్షన్ – సరిగ్గా దానికి విరుద్ధం. ప్రజాస్వామ్యం అనే పదాన్ని చేస్తున్న ఎగతాళి.
● బీజేపీ విజయం – బ్రిటన్, అమెరికా, బ్రెజిల్ లలో ఏర్పడిన జాతీయతా విక్షోభంలో భాగం గానే కనిపిస్తోందా?
ఔను, ఇదీ ఆ ప్రకోపాలలోకే జమ ఔతుందని నేను భావిస్తాను. అయితే ఇండియాలో ఈ ‘మహత్వపూర్ణ క్షణం’ దిశగా ఆర్‌ఎస్‌ఎస్ చిత్తశుద్ధితో 95 సంవత్సరాలుగా నడుస్తూ వచ్చింది. దానివల్ల – మరే ఫాషిస్ట్‌లకీ, శ్వేతజాతి శ్రేష్టతావాదులకూ లేని – పటిష్టమైన వ్యవస్థలు దానికున్నాయి.
● 2009లో మీ వ్యాసాల సంకలనాన్ని, “హేతువుకు అతీతమైన ఆశను అభ్యాసం చేసేవారికి” అంకితం చేసారు. ఆశకు హేతువుకు మధ్య నున్న సంబంధం ఎలా ఉందనిపిస్తోంది ఇప్పుడు? వాటి పునర్ మిలనం జరిగే సూచనలేవన్నా కనిపిస్తున్నాయా?
ఎలక్షన్ సన్నాహ సమయంలో ఈ సూత్రాన్ని నేను పాటించాను. దాదాపు నిపుణులందరి భవిష్యవాణిలోనూ -బీజేపీ విజయమే (ఇంత మెజారిటీ కాదనుకోండి) వినిపించింది. మేం ‘ప్రజల’నాడిని సరిగ్గా పట్టుకోగలిగేమని చెప్పుకోడం ఉద్దేశమై ఉంటుంది. మనని చుట్టుముట్టి ఉన్న దానిని తెలుసుకోడం ఏమంత ఘనకార్యం?
నేనూ, నావంటి మరి కొందరూ మాత్రం బీజేపీ ఓడిపోతుందని అన్నాం. నేనైతే పబ్లిక్‌గా చెప్పాను, ఎందుకంటే ఆ ‘ఫలితపు నిశ్చయత’ (certainty of the outcome)కు చిల్లు పొడవడం ఆవశ్యకం. బీజేపీ గెలుస్తుందని పబ్లిక్‌గా ప్రకటించిన వారిలో దాని ప్రభంజనాన్ని చూసి జడుసుకున్న వారూ ఉన్నారు. కానీ ఆ దీనాలాపాలు మరింత ప్రచారానికీ, ఫలితపు అనివార్యతకీ – దోహదం చేసాయి. కనక హేతువుకు అతీతమైన ఆశను అభ్యాసం చేసే కొందరం – ప్రతిపక్షాలే గెలుస్తాయని, వారి మధ్య రహస్య ఒడంబడికలు జరిగేయనీ, తెలివైన వ్యూహాలున్నాయనీ మొండిగా వాదించాం, పట్టుబట్టేం. గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ పీడకలను ఎదిరించి తెలివిలోకి తేగలిగినది – కేవలం ఈ రకమైన పిచ్చి ఆశ మాత్రమే. కనక – ఔను, హేతువుకు అతీతమైన ఆశ – కావాలి. దానితో పాటు హేతువుతో సంబంధంలేని ధిక్కారం కూడా కావాలి.
 ఇండియా మానసిక స్థితి – నానాటికీ – సైనికమయమౌతోంది, ఎన్నికల ప్రచారంలో మోదీ ఆ సెంటిమెంట్‌ని వాడుకోడంలో మోదీ ఏలోటు చెయ్యలేదు – సైన్యంతో తనను కలుపుకుని మాట్లాడడం, పొంచిఉన్న “దేశ శత్రువుల” పట్ల ప్రజల భయాందోళనలను రెచ్చగొట్టడం – అన్నీ చూసాం. “దేశద్రోహం గుండెల్లో దాగిఉందని” పేరు పడిన రచయితకి ప్రత్యేకించి ఇలాటి వాతావరణంలో ఎలాటి స్థానం ఉంది?
హా! స్వల్ప స్థానం అంటాను నన్నడిగితే. అత్యంత ప్రమాదకరంగా మారిన స్థానం కూడా. పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందంటే… హిందూ జాతీయవాదాన్ని వ్యతిరేకించినవారు సైతం, ఇప్పుడు రకరకాల పేర్లతో ప్రచారమయ్యే ‘మెరుగైన’ హైందవాన్నీ, ‘మెరుగైన’ జాతీయతా వాదాన్నీ బలహీనంగా ప్రతిపాదిస్తున్నారు. మన మెదళ్లని కుదించి, జాతీయ పతాకంలో చుట్టచుట్టేసాం. దాడి జరగబోయేది, మేధావుల మీదే కాదు. మేధస్సు యొక్క ప్రతి ఒక్క రూపం మీదా అది భీభత్సంగా ఉండబోతోంది. రాజకీయనాయకులూ, కార్పొరేట్ సియీవోలూ, వారికి సేవలందించే మీడియా భాగ‌స్తులూ – ఊహాతీతమైన సంపదతో వీరంతా మిలియనీర్లూ, బిలియనీర్లూ అయిఉండగా – విద్యార్ధులనీ, ప్రొఫెసర్లనీ, రచయితలనీ, స్వతంత్ర పాత్రికేయులనీ – elitist “ఏంటీ నేషనల్స్” అని ముద్ర వేసి వెంటాడతారు.
‘కులీనం’ (Elite) అనేది పడికట్టుపదంగా మారింది. సగటు మేధస్సుకి కాస్త పైన ఆలోచించగలిగిన, స్వప్రయోజన కాంక్ష కాస్త తక్కువగా ఉన్న ప్రతీ ఒక్కరినీ ఉద్దేశించి వాడబడుతోంది ఆపదం. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా, జనరల్ సెక్రటరీ రాం మాధవ్ దాపరికంలేకుండా సూటిగా బెదిరింపులు జారీచేసారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిననాటి రాత్రి, విజయవేదిక మీద నుంచీ ఇచ్చాడు. మరునాటి వార్తాపత్రికలో రాం మాధవ్ “సత్యమే నాయకుడు (The Leader is the Truth),” అనే కోలంరాసేడు. “దేశంలోని బౌద్ధిక వ్యవస్థల మీదా, పాలసీ రంగాలలోనూ – ‘ఉండాల్సిన కంటే ఎక్కువ మోతాదులో’ పట్టు చిక్కించుకున్న సూడో లౌకిక/ఉదారవాదుల ముఠాలు ఇంకా అక్కడక్కడా మిగిలి ఉన్నాయనీ, వారందరినీ సాంస్కృతిక బౌద్ధిక రంగాలనుంచి తరిమేయాలనీ” అంటున్నాడు రాం మాధవ్. ముసుగులేని ఫాషిస్ట్ మాటలవి. అనాదిగా వింటూ వస్తున్నాం. ఈ రెండో టెర్మ్‌లో, వారు అయిదేళ్ల క్రితం మొదలుపెట్టిన నిజమైన విద్యనూ, విజ్ఞానాన్నీ, ఆలోచననీ, కళనీ అన్నిటికీ తెరదించే పనిని పూర్తి చేస్తారు. విశ్వవిద్యాలయాల మీదా, మేధస్సు మీదా దురాక్రమణ పొంచి ఉంది.
● కొంతమంది, మీ “కళ”నీ, మీ“క్రియాశీలత”నీ వేరు చేసి, విడివిడిగా మీకు ఆపాదిస్తారు. అలాటి విభజనను ఎప్పుడూ నిరాకరిస్తూ – కేవలం రచయిత అనే మాట సరిపోతుందని అంటు వచ్చారు మీరు. రచయిత పరిమితిని నిర్దేశించే – ఈ నిర్బంధం, ప్రపంచంతో సీరియస్‌గా, క్రియాశీలకంగా వ్యవహరించడమనేది – రచయిత పని కాదని చెప్తుంది. ఈ ధోరణి ఇండియాలో బలంగా కనిపిస్తోందా మీకు?
లేదు. నిజానికి యూరప్ అమెరికాలలో ఎక్కువ కనిపించింది నాకు. చూసాను. ఒక రకమైన సంతృప్తితో కూడిన ఉదాసీనత (smug complacency) అది. ఇక అడిగేందుకు ఏమీ ప్రశ్నలు మిగలలేదని వారి నిర్ధారణ. తక్కిన ప్రపంచానికి ఉండతగిన ఉన్నతాశయం అల్లా తమని అనుకరించగలగడమేనని వారి ధృఢ విశ్వాసం. అయితే అది కొద్దికొద్దిగా మారుతోంది. అస్థిరత చోటు చేసుకుంటోంది. మహా భయాలు ఉత్పన్నమౌతున్నాయి. పెద్ద ప్రశ్నలు మళ్లీ అడిగే వేళయ్యింది. మొత్తం ప్రపంచం గిరగిర తిరుగుతూ కిందా మీదా ఔతున్న ఈ సమయంలో కళ, సాహిత్యం – దానిని ప్రతిబింబించక తీరదు.
 భాష, దాని బహుళతలూ, సాధ్యాసాధ్యతలూ, దాని రాజకీయ విపరీతాలూ అన్నిటితోనూ కలిపి – విశాలార్ధంలో తీసుకుంటే – మీ భావనాప్రపంచంలో అది కేంద్రస్థానం ఏర్పరుచుకుంది. దానికి కారణం ఏమిటంటారు? జాతీయవాదులందరూ నినదించే “ఒకే జాతి, ఒకేభాష, ఒకే మతం”—అనే హిందూత్వ సిద్ధాంతానికి అది మీ ప్రతిస్పందనా లేక కేవలం భాష – రచయిత కర్మభూమి కావడం చేతనా?
ఈ బహుళతా, క్లిష్టతా ఈ దేశపు భూమిలో సహజసిద్ధంగా ఉన్నాయి. రచయితగా నేను దానిని చూసి మురుస్తూ ఉంటాను. హిందూ జాతీయవాదుల “ఒకే జాతి, ఒకేభాష, ఒకే మతం” సిద్ధాంతాన్ని వింటే నవ్వొస్తుంది. ఇక్కడ వారి నినాదం – “ హిందీ, హిందూ, హిందుస్తాన్” లో మూడు పదాలూ కూడా నిజానికి పర్షియన్‌వి.
సరే. సీరియస్‌ విషయాని కొస్తే మాట్లాడే భాషలు 780. అందులోనూ వాటిలో 20 రాజ్యాంగం గుర్తింపు పొందిన భాషలు. అలాటి ఒక భూభాగంలో ఇది ఎంతటి హింసాత్మక సిద్ధాంతం కాగలదో ఊహించగలరా?
ఇంకా ఇక్కడ – “ఇంగ్లిష్‌ మాట్లాడే కులీనులు!” అని ఒకరినొకరు(ఇంగ్లిష్‌) నిందించుకునే ‘ఇంగ్లిష్‌ మాట్లాడే’ కులీనులు ఉన్నారు.
‘ఇంగ్లిష్‌ మాట్లాడని’ అగ్రకులాల కులీనులున్నారు. వారి సంగతెలా ఉంటుందంటే – తమ పిల్లలని వారు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకి పంపుతారు. అయితే ఇంగ్లిష్‌ నేర్చుకుంటేనే తప్ప, బాగుపడే అవకాశాలు లేని పేదవారికి మాత్రం ఆ భాషను నేర్చుకునే హక్కును నిరాకరిస్తారు.
● చివరగా, మీ జీవిత పయనంలో, ఎన్నో మాధ్యమాలలో మిమ్మల్ని మీరు అభివ్యక్తం చేసుకున్నారు. ఫిక్షన్, సినిమా, నాటకం, వార్తల చేరవేత, వ్యాసాలు, ఇంకా నటన, ఆర్కిటెక్చర్ – వీటన్నిటిలో ఏ రూపం, ఏ అమరిక (సెట్టింగ్), ఏ కాలం, ఏ ప్రదేశం – మీ వ్యావృత్తికి అతి సహజమైందని తోచింది?
నేనొక కథకురాలిని. నా ఆలోచనలు కూడా కథల రూపంలోనే ఉంటాయి. కథలే నా స్వగృహం, స్వస్థానం. వాటినే ప్రేమిస్తాను.

Thursday 15 August 2019

తక్షణ అనువాదం - live translation

2017 జూన్ లో ప్రగతిశీల మహిళా సంఘం - 7వ మహాసభలకి, ప్రధాన వక్తగా తీస్తా సెతల్వాడ్ వచ్చారు. ఆమె ఆంగ్ల ఉపన్యాసానికి నా తెలుగు అనువాదం.



మొదటి భాగం:

https://www.youtube.com/watch?v=460ctYLuET0



 రెండవ భాగం:

https://www.youtube.com/watch?v=mOaz-UDsWtY&t=1s

Sunday 11 August 2019

దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడమే బీజేపీ అంతిమ లక్ష్యం : రోమిల్లా థాపర్




రోమిల్లా థాపర్ భారతదేశ చరిత్రకారుల్లో అగ్రగణ్యురాలు. ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో 1970 నుండి 1991 వరకు హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేసి, పదవీ విరమణ తర్వాత అదే విశ్వవిద్యాలయంలో ఎమరిటస్ ప్రొఫెసర్ గా ఉన్నారు. థాపర్ తన 87 ఏండ్ల వయస్సులో సైతం ప్రజా మేధావిగా రచనలు చేయడమే కాకుండా ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తున్నారు. తన పరిశోధనలో మతవాద చరిత్రను తిరస్కరిస్తూ శాస్త్రీయ దృక్పథంతో సామాజిక, సాంస్కృతిక, పురావస్తు ఆధారాలతో ప్రాచీన భారతీయ చరిత్రకు సరికొత్త వ్యాఖ్యానం చేశారు. మార్క్సిస్ట్ చరిత్రకారిణిగా చరిత్ర పరిశోధనా పద్ధతుల మీద ఎంతో కృషి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అకడమిక్ పురస్కారాలు పొందారు. భారత ప్రభుత్వం రెండు సార్లు ప్రకటించిన పద్మభూషన్ అవార్డును తిరస్కరించారు. రాజ్యం ఇచ్చే ఏ అవార్డునూ తీసుకోనని ప్రకటించి తన నిబద్ధతను చాటుకున్నారు.
2019 ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 15 న రోమిల్లా థాపర్‌ను ఓ టి.వి చానెల్ కోసం కరణ్ థాపర్ చేసిన ఇంటర్వ్యూ. 
Published in KOLIMI web magazine in June 2019.

కరణ్ థాపర్: మోదీ ప్రభుత్వం మీద మీ అంచనా, మీ అభిప్రాయం క్లుప్తంగా చెప్తారా?
రోమిల్లా థాపర్‌: గడిచిన ఇన్నేళ్లలోకీ – ఇవి అత్యంత ప్రధానమైన ఎన్నికలని చెప్పుకోవాలి. ప్రతీ ఎన్నికలప్పుడూ, ఇలా అనడం పరిపాటే గాని నా ఉద్దేశంలో ఒక మూడు అతి కీలకమైన ఎన్నికలున్నాయి. ఒకటి: వయోజన వోటింగు ద్వారా ప్రజాస్వామ్యాన్ని స్థాపించుకున్న మొట్టమొదటి ఎన్నికలు. రెండోది: భారత పౌరులు – నియంతృత్వాన్ని మొగ్గలోనే తుంచివేసిన 1977 ఎన్నికలు. ఇక మూడోది: అంతే ముఖ్యమైనవి – ఈ ఎన్నికలు. ఎందుకంటే – ఈ అయిదేళ్లూ మనని నడిపించుకుంటూ తీసుకొచ్చి ఏ స్థలానికి చేర్చారో – అది – ఇప్పుడు మన కళ్ల ముందుంది. మన ఎంపిక హిందూ రాజ్యమా?లేక సెక్యులర్ ప్రజాస్వామ్యమా?అనేది తేల్చుకోవాలి. మనకున్నవి ఈ రెండే గత్యంతరాలని ఈ అయిదు సంవత్సరాలనీ పరిశీలిస్తే తెలుస్తుంది.
కరణ్: అయితే ఈ అయిదేళ్లలోనూ మీకేవేం కనిపిస్తున్నాయి?
రోమిల్లా: మూడు రకాల కార్యక్రమాలని నేను గమనించాను.
  1. ఈ అంశం ప్రజలందరికీ తెలిసినదే, చాలా విస్తృతంగా చర్చించబడింది కూడా. ఆర్ధికరంగ సంబంధమైన – ఈ అంశంలో – డీమానిటైజేషన్, వ్యవసాయరంగం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ, నిరుద్యోగం – ఇవన్నీ ఉన్నాయి. 
    వాగ్దానం చేసిన వేవీ ప్రజలకి ఇవ్వలేదు – కళ్ల ముందు కనపడుతూ ఉందది. వారి వైఫల్యాలలో ఇది పెద్ద భాగం. ఆసక్తికరంగా తోచేదేమిటంటే – ఉపన్యాసాలలో ఈ ‘ఆర్ధిక అభివృద్ధి’ అనే ఊసే ఎత్తకపోవడం. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ – ‘నువ్వంటే నువ్వ’ని నిందారోపణలే తప్ప ఆర్ధిక విధానాల చర్చ చేయడం – ఎక్కడా వినపడలేదు.
  2. హిందుత్వ కార్యక్రమాలు – ఘర్ వాపసీ, లవ్ జిహాద్ వంటివి – ఒక స్థాయి దాటేక పని చెయ్యలేదు. ఇక్కడ విషయమేమిటంటే… ఒకరి మతాన్ని మార్చి హిందువుని చెయ్యగలవు – కానీ కులం సంగతేచేస్తావు… దాని తోటే నువ్వు పుడతావు – అక్కడ క్రైసిస్ ఎదురయింది వీరికి. 
    మనుషుల్లో భీతాహం కలిగించడంలో మాత్రం విజయం సాధించారు. గోరక్షక్ కార్యక్రమాలూ, బీఫ్ తినడం, కసాయి దుకాణాల మీద నిఘాలూ – వీటితో మైనారిటీలను దూరం చెయ్యగలిగేరు – ఆమేరకి వారు గెలిచారనే చెప్పాలి.
  3. పెద్దగా చర్చల్లోకి రాని అంశం, నావంటి వారికి ఆందోళన కలిగించే విషయం – భావ వ్యక్తీకరణ మీద అమలౌతున్న నిర్బంధం. సామాన్య పౌరుల అరెస్టులూ; విద్యావేత్తలు, లాయర్లు, కవులు, రచయితలు – వీరిని ఉద్యమకారులని నిందించడం; సరైన విచారణ, సాక్ష్యాలు లేకుండా జైళ్లలో పెట్టడం – ఇదంతా ఒక ఎత్తైతే, పుస్తకాల ముద్రణ, సినిమాల సెన్సారింగ్ లో చొరబడి – అక్కడ కూడా – నిర్బంధాన్ని పెంచుకుంటూ పోడం – మరొక ఎత్తు. 
    అన్నిటి కంటే తీవ్రమైనది – విద్యారంగానికి సంబంధించిన సంస్థలని – నేలమట్టం చేసేందుకు సాగుతున్న ప్రయత్నం.
కరణ్: రెండు విషయాల్లో మోదీ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసానని నమ్ముతోంది. ఒకటి మచ్చలేని పరిపాలన – దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు రఫైల్ గురించి ప్రశ్నలు వినిపిస్తున్నాయనుకోండి కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి, నేరం జరిగిందని నిర్వివాదంగా నిరూపించగల రుజువులో, డబ్బు మార్పిడి జాడలో – ఏవీ కనపడ్డం లేదు. మోదీ పర్యవేక్షణలో – 2జీ, కోల్గేట్, ఆగస్టా వేస్ట్ లేండ్, కామన్వెల్త్ లాటి – ఏ స్కాం లూ – బయటికి రాలేదు. మరి ఇంతకు ముందు వాటి కంటే – ‘ఇది అవినీతిరహిత ప్రభుత్వం’ – అనొచ్చంటారా?
రోమిల్లా: చెప్పడం కష్టం. ఎంచేతంటే –ఇలాటి విషయాల్లో అకస్మాత్తుగా ఏదో ఒకటి బయటపడుతూ ఉంటుంది, అంతవరకూ మనం సరిగా ఉన్నదనుకున్నది – ‘కాదు’ అని తేలుతూ ఉంటుంది. ఈరకమైన లోపాయికారీ లావాదేవీల లక్షణమే అది కదా. ప్రభుత్వం ఎంత నీతివంతమైనదో తర్వాత మాట్లాడదాం. డీమానిటైజేషన్ అవినీతిని అరికట్టివేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది కదా?
కరణ్: మరి అవినీతి అంతమవలేదా?
రోమిల్లా: లేదు. ఎంచేతనంటే అవినీతి ఎంతో కాలంగా పాతుకుపోయింది, ఉన్నత పదవులలో కూర్చున్న రాజకీయనాయకులూ, కార్పోరేట్లూ – వీటన్నిటిలోనూ ఉంది.
కరణ్: అవును, పెద్ద చిట్టాల కరప్షన్ అంటాం…
రోమిల్లా: కరెక్ట్. అది పోవాలని ఆశించడం ప్రస్తుత పరిస్థితుల్లో – గొంతెమ్మ కోరికే, దానిని పక్కన పెడదాం.
అయితే నేను మాట్లాడేది – నిత్య జీవితంలో ఎదురయ్యే అవినీతి గురించి. అది తగ్గకపోగా, ఇంకా ఎక్కువైందని తెలుస్తోంది. ఒక సాధారణ వ్యక్తి దైనందిన కార్యకలాపాల కోసం – టికెట్‌లో, కూపన్‌లో, ఐడెంటిటీ కార్డో – ఇలాటి పనులు వేటి కోసమైనా వెళ్లవలసి వచ్చిందనుకోండి – ప్రభుత్వోద్యోగుల కవనీ, పోలీసుల కవనీ – డబ్బు చెల్లించాల్సిందే. ఆరకంగా చెప్పాలంటే – అవినీతి మరింత పెరిగింది.
కరణ్: మోదీ గర్వంగా చెప్పుకునే రెండో అంశం – తను వాగ్దానము చేసినట్టే – దృఢమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వాన్ని అందించానన్నది. మరి అయిదేళ్ల అనంతరం – ఆయన దృఢంగా, నిర్ణయాత్మకంగా ఉన్నారంటారా, లేదంటే – ఆ లక్షణాలు మరి కాస్త మోతాదు మించి – అధికార నిరూపణగానూ, ఒక్కొక్కసారి నిరంకుశంగానూ – వ్యవహరించారా?
రోమిల్లా: మంచి ప్రభుత్వం అనే దాని కుండాల్సిన మౌలిక లక్షణాలని మోదీ అసలు పట్టించుకోనే లేదని నా అభిప్రాయం. ఆయన దృష్టి కేవలం స్వంత గొప్పని చూపుకోడం మీదనే. వ్యక్తిగత ప్రచారకుడిగానే ఆయన కనిపిస్తున్నాడు. ఆమాట కొస్తే ఏ రాజకీయనాయకుడైనా అలాగే ఉంటాడు. అయితే ఆ ప్రచారం ఏ స్థాయికి తీసుకెళుతున్నారో – చూడాలి.
ఒక సాదాసీదా విషయం చెప్తాను చూడండి. మన దగ్గర ఒక స్పష్టమైనదీ, ఇదీ అని నిర్వచించి చెప్పగలిగిన విదేశాంగ విధానం అంటూ ఉందా? మన దగ్గరున్నదల్లా ఏమిటంటే – మోదీ గారు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అక్కడి ప్రధానులనీ, ప్రెసిడెంట్‌లనీ ఆలింగనం చేసుకుంటున్న ఫోటోగ్రాఫ్‌లు మాత్రమే. మన చుట్టూ ఉన్న దేశాలలోని వివిధ అంశాలతో మన సంబంధాలెలా ఉన్నాయో, ఆ ఫోటోల నుంచి ఏమన్నా తెలుస్తుందా?
కరణ్: కేవలం తన వ్యక్తిగత అభివృద్ధే మోదీ విదేశాంగ విధానమని, కీలకమైన అంశాల పట్ల వ్యూహాత్మక అవగాహన లేదని మీ అభిప్రాయం – అవునా?రోమిల్లా: అవును.
కరణ్: మోదీ ప్రభుత్వం భారతీయ విద్యారంగం మీద చూపిస్తున్న ప్రభావం గురించి చాలా మంది విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెఎన్‌యూ పట్లా, ICHR (Indian Council of Historical Research), ICSSR (Indian Council of Social Science Research) – ఇలాటి సంస్థల పట్లా – ప్రభుత్వ వ్యవహరణని దేశవ్యాప్తంగా వారంతా ఎత్తిచూపుతున్నారు. మీకూ ఉందా ఆ ఆందోళన?రోమిల్లా: తప్పకుండా ఉంది. చెప్పాలంటే – ఒక సాధారణ విద్యావేత్తకుండే కంటే – మరింత ఎక్కువ స్థాయిలో ఉన్నాయి నా భయాలు. సంస్థల నిర్మాణమనే బృహత్కార్యాన్ని దగ్గర నుండీ చూసిన దానిని – తమ నిబద్ధతనీ, శక్తియుక్తులనీ, ప్రయత్నాన్ని – దానికి ధారపోసిన వారిని చూసినదానిని. ఇప్పుడా సంస్థలు డొల్లలవడం, క్రమంగా ముక్కలవడం చూస్తున్నాను. అయితే – ఎందుకు జరుగుతోంది ఇలా? దేని కోసం వీరు విద్యావిధానాల్లో జోక్యం చేసుకుంటున్నారు? అన్న ప్రశ్న వేసుకున్నాను.
కరణ్: ఏం జవాబు దొరికింది?
రోమిల్లా: ఇదంతా – దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలన్న – ఆర్‌.ఎస్‌.ఎస్. బిజేపీల అంతిమ లక్ష్యసాధనలో భాగమే. ఈ దేశం – హిందూ రాజ్యం అయి తీరాలన్నది వారి ఆశయమని వారు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
కరణ్: తమ హిందూ రాజ్య భావజాలపు వ్యాప్తి కోసం విద్యా సంస్థల స్వయం ప్రతిపత్తిని క్షీణింపచేస్తున్నారన్న మాట…?
రోమిల్లా: ఔను, అసలు ఈ హిందూ రాజ్యమనే భావజాలాన్ని కాస్త వివరించనీయండి – ఈ సిద్ధాంతం మొట్ట మొదటి సారిగా -1930లో రూపుదిద్దుకుంది. రెండు అంశాలపై ఇది ఆధారపడి ఉంది. ఒకటి వలసవాదపు భావజాలం – అది మీకు జేమ్స్ మిల్ 1818లో రాసిన పుస్తకం (The History of British India) లో కనిపిస్తుంది. దానిలో అతను భారతదేశ చరిత్రని – హిందూ, ముస్లిం, బ్రిటిష్ అనే మూడు దశలుగా విభజిస్తాడు. భారతదేశం -హిందూ, ముస్లిం అనే రెండు జాతులతో ఉన్నదనీ, అవెప్పుడూ ఒక దానితో ఒకటి కలహించుకుంటూనే ఉన్నవనీ – అతని వాదన. అదే రెండు జాతుల సిద్ధాంతం – ఈ హిందూ రాజ్యమనే ఆలోచనకి – ఖచ్చితంగా, సంపూర్ణంగా, నిస్సందేహంగా – అదే భూమిక.
కరణ్: మీ దృష్టిలో – బీజేపీ భావజాలానికి కూడా అదే భూమిక…
రోమిల్లా: ఔను. ఆర్‌.ఎస్‌.ఎస్. ని ప్రభావితం చేసే రెండో అంశం – అది అతి చేరువ సంపర్కంలో ఉంచుకునే యూరోపియన్ ఫాసిజం. వారి నాయకులు – ముస్సోలినీని, ఇటాలియన్ ఫాసిస్ట్ లనీ ఆరాధిస్తామని – చెప్పేరు, ఆర్‌.ఎస్‌.ఎస్. ని ఆ దిశగా పటిష్టం చేస్తామని పుస్తకాల్లో కూడా రాసేరు. (నవ్వుతూ) అందుకే ఆ సంస్థ అంత క్రమశిక్షణతో ఉండి ఉంటుంది.
కరణ్: ఆ నేపథ్యంలో – టెక్స్ట్ పుస్తకాలలో చేస్తున్న మార్పుల గురించి మీరేం చెప్తారు -ఎంచేతంటే – ఆ విషయాలని ప్రెస్ కూడా లేవనెత్తింది, కానీ – మీవంటి విద్యావేత్తలకి అది మరింత ఆందోళనకరంగా ఉండి ఉంటుంది, చెప్పండి – మీరెందుకు దానిని వ్యతిరేకిస్తున్నారు?
రోమిల్లా: ఎందుకంటే – అది ప్రాధమికం కనక. టెక్స్ట్ పుస్తకాలలో మార్పులు చెయ్యడమంటే – అందులోనూ చరిత్ర టెక్స్ట్ పుస్తకాలని – (నాకవి మరీ ముఖ్యం) మార్చగలిగామంటే – దేశాన్ని హిందురాజ్యంగా మార్చాలనే – భావజాలాన్ని సమర్ధించుకోగలమని అర్దం. పూర్తిగా – అది చరిత్ర మీద ఆధారపడి ఉన్న అంశం – అదెలాగో చెప్తాను వినండి మరి.
హిందూ రాజ్యపు ప్రధాన లక్షణం ఇలా ఉంటుంది – దాని ప్రాధమిక పౌరులు – హిందువులు. మరి హిందువు ఎవరంటే – వారి నిర్వచనం ప్రకారం – ఆ వ్యక్తి పూర్వీకులు భారతదేశంలో పుట్టి ఉండాలి, అతని మతం కూడా భారతదేశంలో పుట్టినదై ఉండాలి. అంటే – ఆ నిర్వచనం – ముస్లింలనీ, క్రిస్టియన్లనీ, పార్సీ తదితరులందరినీ – బయట పడేస్తుంది.
కరణ్: అంటే టెక్స్ట్ పుస్తకాలలో చేస్తున్న సవరణలు, మార్పులు, చేర్పులు – వీటి ఉద్దేశం – వారి హిందూ రాజ్యపు భావజాలానికి సిద్ధాంత భూమికని తయారు చేయడం అన్న మాట…
రోమిల్లా: ఔనంతే. మీకు కొన్ని ఉదాహరణలిచ్చేదా
కరణ్: ఇవ్వండి
రోమిల్లా: కొంత కాలమై – ఇక్కడ ఒక పెద్ద చర్చ జరుగుతోంది – ఆర్యుల గురించి. (ఇక్కడ ఆర్యులన్న పదానికి అర్ధం దగ్గర కూడా భేదం ఉంది గమనించాలి. చరిత్రకారులు ఆర్య పదాన్ని అనేది ఒక జాతినామంగా గుర్తించరు, ఆర్య భాష మాట్లాడే వారిని ఉద్దేశించి ఆ పదం వాడతారు)
సరే, అది పక్కన పెడితే, వారి వాదన- ఆర్యులు అందరూ భారతదేశంలోనే పుట్టారని. ఎందుకంటే – హైందవానికి మూలం వైదిక మతం, అది బయట నుంచి వచ్చే ఆస్కారమే లేదు, దేశం లోపలే పుట్టి ఉండాలి. మరి ఇదంతా – భాషాశాస్త్ర పరంగా, పురావస్తుశాస్త్ర పరంగా లభిస్తున్న సాక్ష్యాధారాలకి – విరుద్ధంగా ఉంది. ఈ మధ్యే జన్యుశాస్త్ర పరమైన అనేక ఆధారాలు కూడా అనేకం దొరికాయి – అవి కూడా వారి సిద్ధాంతానికి విరుద్ధంగానే ఉన్నాయి.
వాటన్నిటినీ వారు కొట్టి పడేస్తున్నారు. వారి వాదననే కొనసాగిస్తున్నారు…
కరణ్: ఇదంతా – ఆర్యులు ఇక్కడి వారేనని ప్రపంచానికీ, వారికీ కూడా రుజువు చేసేందుకన్న మాట. వాస్తవాల ననుసరించి సిద్ధాంతాన్ని నిర్మించుకునే దానికి బదులు – వారి సిద్ధాంతానికి అనువుగా ఉండే వాస్తవాలని మార్చాలన్న ప్రయత్నం చేస్తున్నారన్న మాట.
రోమిల్లా: ఔను, ఇప్పుడు మరొక ఉదాహరణ చూడండి. కుతుబ్ మినార్‌ని – సముద్రగుప్తుడు నిర్మించాడని చెప్తున్నారు. అంటే 700 -800సంవత్సరాల వెనక్కి తీసికెళుతున్నారు – కుతుబ్ నిర్మాణ కాలాన్ని. దానికి ఏ సాక్ష్యాధారాలూ లేవు. ఏ గుడి మీదనైతే కుతుబ్ పునర్నిర్మాణం జరిగిందని అంటున్నారో – ఆ గుడి సైతం – గుప్తుల కాలానికి చెందినది కాదు, స్పష్టంగా – మధ్య యుగాలకి చెందినదని తెలుస్తూ ఉంది.
కరణ్: అంటే ఆ వాదన మొత్తం – నిరర్ధక ప్రసంగమన్న మాట.
రోమిల్లా: ఔను, పూర్తిగా అంతే.
కరణ్: అయితే ఇక మరే ఉదాహరణలూ అక్కరలేదు, మీ పాయింట్‌ని పూర్తిగా నిరూపించేరు కనక, ఈ సమస్య కున్న మరో కోణం గురించి చర్చించాలనుకుంటున్నాను. ఈ ప్రభుత్వం – జవాహర్లాలాల్ నెహ్రూ యూనివర్సిటీ మీద ఉపయోగిస్తున్న విధానాల గురించి, దాని చిత్రీకరణ గురించి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీకది బాగా తెలిసినది, కన్నయ్యా కుమార్, ఒమర్ ఖాలిద్ వంటి జెఎన్‌యూ విద్యార్థులనుద్దేశించి , అరుణ్ జైట్లీ, నరేంద్ర మోదీలు – టుక్‌డే టుక్‌డే (ముక్కల ముక్కల) గేంగ్ అని కొత్త పేరు కనిపెట్టి పిలుస్తున్నారు. మోది ప్రభుత్వం జెఎన్‌యూ ని అతివాద వామపక్ష భావాలకి స్థావరం అని నమ్ముతోంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? 50 సంవత్సరాలక్కడ మీరక్కడ బోధన చేసారు. ఈప్రచారంతో మీరేకీభవిస్తారా?
రోమిల్లా: ఎంత మాత్రమూ లేదు, ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం చేసే చిత్రీకరణ, నిరాధారమైన ఆరోపణ. జెఎన్‌యూ మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడేముందు, దాని నిర్మాణం, నేపథ్యం గురించి కొంత చెప్పాల్సి ఉంది.
మేము జెఎన్‌యూని మొదలుపెట్టినపుడు – నేను దాని 6గురు వ్యవస్థాపక ప్రొఫెసర్‌లలో ఒకరిని – మేము 3 లక్ష్యాలని ప్రధానంగా మాముందుంచుకున్నాం.
  1. అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందిన సంస్థగా అది ఉండాలి – దాని కోసం, విద్యా విషయకంగా అది అత్యున్నత స్థాయిలో ఉండడం తప్పనిసరి. మేమాశించినట్టే, అది అత్యున్నత స్థాయిని చేరింది.
  2. అక్కడ – ప్రతీ ఒక్క అంశమూ, అది ఎటువంటిదైనా సరే – చర్చించగలిగే సౌలభ్యం ఉండాలి. అది క్లాస్ రూం లోపల కానివ్వండి, బయట కానివ్వండి, ఢాబా కానివ్వండి – ఏదైనా సరే – నిర్భయంగా చర్చించుకునే వేదిక అవ్వాలి.
  3. విద్యార్ధులని చేర్చుకునే విధానంలో కూడా మాకొక స్పష్టమైన ప్రణాళిక ఉంది. సాంఘికంగా – పైనుంచి, కింద దాకా – అన్ని స్థాయిలకు చెందినవారిలోంచి – ఎంపిక చెయ్యాలన్నది మా విధానం. ఎంత వైవిధ్యభరితమైన ఆవరణాల నుంచి, జీవిత నేపథ్యాల నుంచి – విద్యార్ధులను ఎంపిక చేసుకుంటే – అంత మేధావులు లభించే సంభావ్యత ఉందని – నూతన విద్యా శాస్త్ర సిద్ధాంతం సూచిస్తుంది. 
    ఒకసారి ఎన్‌డియే -1, మేం రాసిన టెక్స్ట్ పుస్తకాలని నిందించింది, మేము ఏంటీ ఇండియన్లమనీ, ఏంటీ హిందులమనీ – దాడి చేసింది. నన్ను విద్యారంగపు ఉగ్రవాది నంది, (నవ్వుతూ) నాకు చాలా వినోదం కలిగించిందనుకోండి, ఆ బిరుదు. 
    అయితే ఎన్‌డియే -2 దాడి మరింత పకడ్బందీగా ఉంది. అది కేవలం జెఎన్‌యూనొక్కదానినే కాదు – సాంఘిక శాస్త్రాల బోధన పటిష్టంగా ఉన్న అన్ని సంస్థల మీదా దాడి చేయడం మొదలుపెట్టింది. ఎందుకు
    సాంఘిక శాస్త్రాలు ఏం చేస్తాయి సంఘాన్ని ప్రశ్నించడం నేర్పుతాయి, సమకాలీన సంఘటనలని విశ్లేషించడం నేర్పుతాయి, సమాధానాలని అన్వేషించడం నేర్పుతాయి.
కరణ్: అవన్నీ – ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయా?
రోమిల్లా: అవన్నీ – ప్రభుత్వానికి ఇబ్బందికరమే. అదీ, నిరంకుశ పాలన సాగించాలనుకునే, దేశాన్ని సమూలంగా మార్చే ఉద్దేశంతో ఉన్న ఏ ప్రభుత్వాన్నైనా – అవి – ఇబ్బంది పెడతాయి.
కరణ్: అవి ప్రత్యేకించి ఈ ప్రభుత్వానికి మౌలికమైన ఆటంకాలు కలిగిస్తున్నాయా, దాని హిందూ రాజ్యపు ఆశయానికి ఇవి ప్రశ్నిస్తున్నాయా?
రోమిల్లా: నిస్సందేహంగా. మేము హిందూ రాజ్యమన్న భావజాలానికి ఎప్పుడూ వ్యతిరేకమే.
కరణ్: ఈ ఆరోపణకి – మోదీ ప్రభుత్వపు ప్రతిస్పందన ఎలా ఉంటుందో నేనూహించి చెప్తాను – వాళ్లు జెఎన్‌యూలో గానీ, ఐసిహెచ్ఆర్ లోగానీ – చేసినది, ఇంతకు ముందు ప్రభుత్వాలు కూడా చేసిన కార్యక్రమమే, వారి భావజాలాన్ని పంచుకునే వారికీ, సమర్ధకులికీ – వెసులుబాటు కల్పించడం ప్రతీ ప్రభుత్వానికీ పరిపాటే. 
కానీ, ఇప్పుడు తేడా ఏమిటంటే, ఇప్పుడు అందులో చేరుతున్నవారి సిద్ధాంతాలు, మీ సిద్ధాంతాలూ – ఉత్తర దక్షిణ ధృవాలు. ఆ కారణంగా మీవంటి వారంతా, నిర్లక్ష్యం చెయ్యబడ్డామని భావించి, చిరమరలాడుతున్నారని – అందుకే విమర్శిస్తున్నారని వారంటారు…

రోమిల్లా: లేదు లేదు, నేనూ, నాతోటి వారెవరూ – ఈ ప్రభుత్వ కమిటీలూ – ఇలాటి గురించి పట్టించేకోము. మా జీవితమంతా ఒకే విశ్వాసంతో ఉన్నాం – శాస్త్రానికి ఔన్నత్యం సమకూరేది – స్వయంప్రతిపత్తి కల వ్యక్తుల పర్యవేక్షణలోనే అని ఎప్పుడూ చెప్తున్నాం.
జెఎన్‌యూ స్థాపించబడినప్పటి నాటి నుండీ – లిబరలిజం, మార్క్సిజం -వీటి గురించి బహిరంగంగా చర్చలు సాగించగల ఏకైక విశ్వవిద్యాలయంగా పేరు పొందింది.
కరణ్: భిన్నాభిప్రాయాల మీదా, విరోధ భావజాలం మీదా, ఇప్పటి ప్రభుత్వం – దేశద్రోహంగా భావించే అంశాల మీదా కూడా… ఔనా?
రోమిల్లా: ఔను, ఏమిటా అంశాలు ఎకనామిక్స్, సోషియాలజీ, ఏంత్రోపాలజీ – ఇవేగా
కరణ్: అవేనా మోదీ ప్రభుత్వానికి చిర్రెత్తించేవి?
రోమిల్లా: అవును, వారికెందుకంత చిరాకంటే – అవి వారికసలు కొరుకుడు పడని శాస్త్రాలు. వాటిలో – ఉన్నత స్థాయి విద్యావేత్తలు లేరు వారికి.
కరణ్: అందుకని వారికి బెదురు కలుగుతుందా?
రోమిల్లా: అంతే అనుకోవాలి, ఎందుకంటే ఒక్క జెఎన్‌యూతోనే కాదు, జాదవ్ పూర్‌లోనూ, హైదరాబాద్ లోనూ, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లోనూ – దేశమంతటా… ఇదే పరిస్థితి.
కరణ్: అయితే ఒక మాట చెప్పండి – ఈ అయిదేళ్ల పాలన – భారతీయ విద్యారంగం మీద ఎలాటి ప్రభావం చూపించింది?
రోమిల్లా: వారికి సర్వసాధారణమైన ఒక ప్రక్రియ నుపయోగించి – విజయవంతంగా విద్యారంగాన్ని ఛిన్నాభిన్నం చేయగలిగారు. అదేమిటంటే – చొరబాటు చర్య. ఎక్కడైనా ఒక పదవి లేదా ఉద్యోగం ఖాళీ అయితే దానిలో వారి మనుషులని నింపడం. విషాదకరమైన విషయమేమిటంటే – అందులో చాలా భాగం – శాస్త్రపరంగా హీన ప్రమాణాలు కలవారే. కారణమేమిటంటే – వారు మేధోపరమైన సవాళ్లను ఎదుర్కుని నిలబడిన వారు కాకపోవడమే…
కరణ్: మేధో పరంగా తక్కువ తరగతి వారిని, కేవలం తమ సమర్ధకులన్న కారణంగా తక్కువ యోగ్యత కలవారిని తీసుకొస్తున్నారా?
రోమిల్లా: ఔను, ఆ కారణంగా సంస్థల ప్రమాణాలు క్రమేణా పడిపోతున్నాయి.
కరణ్: అంటే మేధోపరమైన నష్టానికి గురౌతున్నాయన్న మాట.
రోమిల్లా: ఔను. జెఎన్‌యూ వంటి సంస్థలో – విద్యార్థులూ, అధ్యాపకులూ – అనే అంగాలు కలిసి నిలబడి పోరాడకపోతే జరిగే పరిణామాలను – ఊహించుకోడానికే భయం వేస్తుంది. జెఎన్‌యూ తన మేధోపరమైన హక్కులను పరిరక్షించుకునే ప్రయత్నం చెయ్యకపోతే – ఒక హీన ప్రమాణాలు కల సంస్థగా మారిపోతుంది.
కరణ్: జెఎన్‌యూ అస్థిత్వాని కున్న అతి ముఖ్య ప్రయోజనం (French: raison d’être) మీదనే ముట్టడి జరగబోతోందన్న మాట.
రోమిల్లా: జరగబోడం కాదు – ముట్టడి జరుగుతోంది.
కరణ్: అయితే మరో ప్రశ్న, ఈ ఎన్నిల ప్రచారాల పరిణామం, అసలు ఎన్నికల ఫలితాలూ – ఎలా ఉండబోతున్నాయో తెలియదు కానీ, మరో సారి మోదీ ప్రభుత్వం వస్తే, భారతీయ విద్యారంగం పరిస్థితి ఎలా ఉంటుందని మీ అంచనా?
రోమిల్లా: విద్యారంగానికి తెర పడిపోయినట్టే. ఎందుకలా అంటున్నానంటే –కోర్సులలోనూ, రీడింగ్ లిస్ట్‌ల్లోనూ జోక్యం చేసుకోడం – ఇప్పటికే- ఎక్కువైంది. ఏ కాన్ఫరెన్స్‌కి వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాలి. అంతేకాదు – బయట నుంచి ఎవరిని ఆహ్వానించాలన్నా కూడా అనుమతి తీసుకోవాలి. సాధారణంగా అనుమతి దొరకదు.
అంతెందుకు జెఎన్‌యూలోనే, కృష్ణా భరద్వాజ్, సుప్రసిద్ధ ఆర్ధిక శాస్త్ర పండితురాలు, జెఎన్‌యూ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు – ఆమె ఉపన్యాసాల పరంపర ప్రతీ ఏడూ ఉంటుంది. ఆమె లెక్చర్లు పెట్టుకోడానికి కూడా – అనుమతి కోరాలి.
కరణ్: (ఆశ్చర్యంగా) ఎవరినుంచి?
రోమిల్లా: అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి. వాటికి నిరుడు లెక్చర్ హాల్‌లో పెట్టుకోడానికి అనుమతి దొరక్క – కేంపస్ గ్రౌండ్స్‌లో పెట్టుకున్నాం – విద్యార్ధులందరూ పూర్తిగా హాజరు.
కరణ్: మీరనేది – అడ్మినిస్ట్రేషన్ – వైస్ ఛాన్సలర్ అని నేననుకుంటున్నాను, ఆయన ప్రభుత్వం లోని ఎవరి ఆదేశాల మేరకో పని చేస్తూ – మీకు అనుమతిని నిరాకరిస్తున్నారంటారా?
రోమిల్లా: నాకు తెలీదు, ఎక్కడ నుంచి ఎవరి ఆదేశాలో. నా ఉద్దేశంలో – యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత దాని కిందే ఉండాలి.
కరణ్: ఇలా ఇంతకు ముందెప్పుడైనా, పూర్వపు ప్రభుత్వాల హయాంలో జరిగిందా?
రోమిల్లా: ఎప్పుడూ జరగలేదు. అలాటిది జరగడానికి ఆస్కారమే లేదు, మేము మా స్వయం ప్రతిపత్తిని – రక్షించుకోడంలో ఎప్పుడూ వెనకడుగు వెయ్యలేదు.
కరణ్: మునుపు రక్షించుకునే వారిమంటున్నారు – ప్రభుత్వాన్ని ఎదురెళ్లి నిలిచే శక్తి – మీవంటి అధ్యాపకులలోనూ, విద్యార్ధి నాయకులలోనూ – క్రమేపీ తగ్గుతోందనిపిస్తోందా?
రోమిల్లా: తగ్గడం అనను ఇప్పటికీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకునే అధ్యాపకులనేకులున్నారు. కానీ – వృత్తి నిర్వహణలో, బాధ్యతల మధ్య – వ్యక్తులు అలిసిపోతారు. సరే కానిమ్మని – వదిలేసే సందర్బాలుంటాయి.
కరణ్: నిజమే, ఆఖరుగా – మన చుట్టూతా ఇప్పుడు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా ఉంది కదా, దాని గురించి నా ప్రశ్న. తన పని తీరుని చూపించో, సాధించిన విజయాల బలం మీదనో కాక, పాకిస్థాన్ గురించిన భయమూ, కాకుంటే ఆందోళనా కలిగించడం, తద్వారా తానే రక్షకుడినన్న నమ్మకం కలిగించడం – ఇది మోదీ శైలి అని – చాలా మంది విశ్వసిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు?
రోమిల్లా: అలాగే కనిపిస్తోంది – జరుగుతున్న అసంగతాలని చూస్తుంటే… అమిత్ షా – సిటిజన్ బిల్ చదవడం, అందులో పౌరులంటే – హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు -అని చదవడం, అప్పుడెవరో – గుర్తు చెయ్యడం -ఇంకా వేరే వారు కూడా ఉన్నారని.
ఇవన్నీ వలసవాద భావజాలంలో పాతుకుపోయిన ఆలోచనలు – హిందువులంటే వీరని బ్రిటిష్ వాళ్లు నిర్వచించారు,– దానినే పట్టుకు వేలాడుతున్నారు వీళ్లు… వెనక్కి పోడం కదా ఇది…
కరణ్: మీ అభిప్రాయం ప్రకారం భారతదేశానికి ఏది తగినది? మోదీ నాయకత్వంలోని మెజారిటీ ప్రభుత్వమా లేక… ప్రధానమంత్రి ఎవరో ఇంకా తేల్చి చెప్పలేమనుకోండి అప్పుడే… సంకీర్ణ ప్రభుత్వమా… దేనిని కోరుకుంటారు?
రోమిల్లా: రెండోదాన్నే ఎంచుకుంటాను… ఏనాడైనా సరే. ఉపఖండానికి ప్రాతినిధ్యం వహించగలిగే – ఆదిశగా ఆలోచించే, పనిచేసే – సంకీర్ణ ప్రభుత్వం కావాలి.
కేంద్రం – పరిధి… ఈరెండు భౌగోళిక పదాలకి ఇప్పటి రాజకీయాల్లో చాలా ప్రాసంగికత వచ్చింది. వాటి గురించి కాస్త వివరించాలనుకుంటున్నాను.
జరుగుతున్నదేమిటంటే – కేంద్రపు నిర్ణాయక శక్తి – నానాటికీ – కొద్దిపాటి మంది ఉన్న గుంపు – చేతిలోకి పోతోంది. వారు – గంగాతీరపు లోయ మధ్య ప్రాంతానికే దాని అస్తిత్వాన్ని పరిమితం చేస్తున్నారు – అంటే హిందీ మాట్లాడే, హిందూ దేవతలని ఆరాధించే ప్రజల వరకే.
సరే, వారే – అనుకుందాం, నష్టం లేదు, కాని ఆ అస్తిత్వాన్ని – పరిధి మీద ఉన్న అనేక అస్తిత్వాలతో సమానంగా, వాటిలో ఒకటిగా మాత్రమే ఉంచండి. దానినే కేంద్రంగా, అతి ప్రధానమైనదానిగా మార్చకండి.
లేదంటే, పెద్ద దేశాలన్నిటికీ వచ్చే శాశ్వత సమస్యలే మనకీ వస్తాయి. పరిధికి – దాని సాంస్కృతిక అస్తిత్వం కోసం పెనుగులాట తప్పనిసరి ఔతుంది. కేంద్రప్రాంతానికీ, పరిధి మీద ఉన్న ప్రాంతాలకీ – సంఘర్షణ ఏర్పడుతుంది.
అందుకే పరిధి ప్రాంతాల పట్ల మరింత శ్రద్ధ చూపించాల్సి ఉంది.
కరణ్: కేంద్రంలో – 272 సీట్ల మెజారిటీ కల బలమైన నిర్ణయాత్మకమైన ప్రభుత్వం కన్నా బలహీనమైన ప్రభుత్వమే – భారతదేశానికి శ్రేష్టమని మీరు నమ్ముతున్నారా అదేనా మీరనేది?
రోమిల్లా: దానిని బలహీన ప్రభుత్వం అనను… సమాఖ్యలా ఆలోచించే (federally minded) ప్రభుత్వం అంటాను. అది కేంద్రాన్ని మాత్రమే కాక దేశపు సమస్తాన్ని – దృష్టిలో ఉంచుకోవాలి. కేంద్రమే బలోపేతమై, నియంత్రిస్తున్న- ఇప్పటి పరిస్థితికి భిన్నంగా ఉండాలి – ఆ ప్రభుత్వం.
కరణ్: సరే, భిన్నంగా ఉండాలంటున్నారు – ప్రతిపక్షపు ఉమ్మడి పనితీరు మీకు సంతృప్తినిచ్చిందా?
రోమిల్లా: లేదు, వాళ్లు కలిసి రావడంలోనూ, ఒప్పందం కుదుర్చుకోడం లోనూ, ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోడం లోనూ – ఇంకా చాలా చేసి ఉండాల్సింది. సరే, ఇపుడు మేనిఫెస్టో తెచ్చారు, ఎలాగైతేనేం – దానిలో ఒక కార్యక్రమమూ ఉంది – కానీ ఇంకా చాలా ముందే తీసుకురావలసింది, ఇంకా వివరంగా తయారుచెయ్యవలసింది.
దేశంలో ఈనాడు నాకు కనిపించే అతి పెద్ద సమస్య – ఆశయ లోపం, అవగాహన లోపం (lack of vision)
కరణ్: ప్రభుత్వానికీ, ప్రతిపక్షాలకీ – ఇరు పక్షాల వారికీనా?
రోమిల్లా: అబ్బే – లేదు, ప్రభుత్వానికి ఉంది – నిశ్చయమైన ఆశయం. హిందు రాజ్యం – మెజారిటీ వాద బీజేపీ నాయకత్వం – ఆ దిశగా పని చేస్తుంది. లేని దల్లా – ప్రతిపక్షాలకే.
నాకు మాటిమాటికీ నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి – 1950ల్లో – అప్పుడే నేను భారత పౌరురాలి నయిన కొత్తల్లో – మాకెంతో అక్కర ఉండేది – ఎలాటి సమాజం లో జీవించాలి, దానిని ఎలా నిర్మించుకోవాలి, వర్తమాన సమాజం – ఏ దిశగా రూపుదిద్దుకుంటోంది – అనే దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్లం. అలాటి అవగాహన, ఆశయం -ఈనాడు కనపడడం లేదు.
ఈ ఎన్నికల కారణంగానైనా – ఏదో ఒక ఆశయం – మన ముందు కొస్తుంది అని ఒక చిన్న ఆశ.
కరణ్: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు అర్హుడేనా? మీ అభిప్రాయం ఏమిటి?
రోమిల్లా: అతను ఏం చేసాడని అతని గురించి చెప్పగలం
కరణ్: పోనీ, అతని గురించి విన్నదాని, చూసినదాని ప్రకారం…
రోమిల్లా: అతని సలహాదారులెవరు? అతనే విధానాలను అనుసరిస్తాడు? అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. అతనే కాదు.. ప్రతిపక్షాలకి చెందిన వారెవరైనా ప్రధానమంత్రి అవచ్చు. మమతా బెనర్జీ , లేదా మాయావతి – ఎవరైనా సరే. వారి కొక స్పష్టమైన విజన్ ఉండాలి. సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలి? అనేదాని గురించి అక్కడికి తీసుకెళ్లేందుకు వారికి సరైన సలహాదారులుండాలి.

Friday 12 July 2019

రక్షక కవచాలు


Published in  Matruka, May 2019



20 మందికి పైగా విద్యార్ధుల ఆత్మహత్య – ఒక్క సారి ఉలిక్కిపడే వార్త. నిజమే –  అలా అని ఇది హఠాత్ పరిణామమా అంటే – కానే కాదు. ప్రతీ సంవత్సరం – ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ కలిపి - 100 మందికి పైగా జూనియర్ కాలేజీ విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత మందికి గుర్తుందో తెలీదు కానీ  నిన్న కాక మొన్న 2017లో, కేవలం సెప్టెంబర్ – అక్టోబర్ నెలల మధ్యలో – 50కి పైగా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారని లెక్క తెలిసింది. 
భరించలేనంత దుర్గంధం - గుప్పున ఇప్పుడు ముఖం మీద కొట్టినట్టౌతోంది కానీ – అది కుళ్లడం మొదలై చాలా కాలమైంది. 2001లోనే - విద్యార్ధుల ఆత్మహత్యల ఉదంతాలను మీడియా బయటపెట్టగా –  అప్పటి విద్యామంత్రి ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ హెడ్ - ప్రొఫెసర్ నీరద రెడ్డి  -
మనుషులని హైజాక్ చేసి కాన్సంట్రేషన్ కేంపుల్లో పెట్టినట్టున్నాయి జూనియర్ కాలేజీలు!!’ – అని తమ నివేదికలో హెచ్చరించారు. పరిస్థితిని మెరుగు పరచడానికి తాము చేసిన సూచనల్లో ఒక్కటి కూడా - ఈనాటికీ పాటించబడలేదని ఆమె చెప్పడం గమనించాల్సిన విషయం.  
మన విద్యా వ్యవస్థలోని భారీ వైఫల్యాన్ని అర్ధం చేసుకుంటూనే – ఆత్మహత్యను దానికదే పెను సమస్యగా గుర్తించవలసి ఉంది. 2004లోనే - యుద్ధాలు, హత్యల కంటే – ఆత్మహత్యల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారని రూఢి అయింది. నానాటికీ ఆసంఖ్య పెరుగుతోనే ఉంది.  ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ అతి పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారింది. 10 సెప్టెంబర్ – ఆత్మహత్యలని నిరోధించే దినం అని ప్రపంచారోగ్య సంస్థ WHO - నిర్ణయించింది. దానికి మానసిక, సామాజిక శాస్త్రజ్ఞులతో సర్వేలూ, పరిశోధనలూ, కార్యక్రమాల రూపకల్పనలూ – ఇవన్నీ చాలా సాగుతున్నాయి. వాటన్నిటిలోంచీ బయటపడిన ఒక సత్యం ఉంది. అది - మనం తెలుసుకోవలసినదీ, నమ్మి ఆచరించదగ్గదీను. అదేమిటంటే – ఈ ఆత్మహత్యలన్నీ – ప్రతీ ఒక్కటీ – మనం నివారించగలిగినవే అని. దాని కోసం నిపుణులంతా ఏకగ్రీవంగా అంగీకరించిన మార్గాలు రెండున్నాయి:
అవి – 1.
self-esteem, వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం; 2. social connectedness, వారిని సమాజంతో ముడివేసే బంధాలని పునరుద్ధరించడం.        
ఆ రిపోర్టులోనే మరో ఆందోళన కలిగించే విషయం బయటపడింది. ఆత్మహత్యల గణాంకాల రేటు వ్యక్తుల వయసుతో పాటు పెరగడం సాధారణం. కానీ ఆ ధోరణులు, 15 -25 వయోపరిమితి వారి మధ్య విపరీతంగా పెరగడం కనిపించింది. ప్రత్యేకించి యువత మీద, అదీ మన దేశంలో అయితే - విద్యార్ధుల మీద, పోటీ అనేది మోయలేని బరువుగా మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
దీని పరిష్కారం సామాజికంగానే జరగాలి. ఆటలూ, వాటి కోసం క్రీడాస్థలాలూ, డిబేటింగ్ సొసైటీలూ, సైన్స్ ప్రదర్శనలూ, లిటరరీ క్లబ్బులూ, విద్యార్ధి సంఘాలూ, వాటి ఎన్నికలూ, మోడల్ పార్లమెంట్లూ, ఎక్స్ కర్షన్లూ, స్టడీ టూర్లూ – ఇవన్నీ విద్యకి సంబంధించిన పదజాలమేనని – తల్లిదండ్రులూ, టీచర్లే మరిచిపోయారు. వాటన్నిటి మధ్యా పెరిగిన పిల్లలు – ప్రశ్నించే కుతూహలంతో, ఆటుపోట్లని ఎదుర్కునే స్థైర్యంతో, భవిష్యత్తు మీద ఆశలతో, కలలు నిండిన కళ్లతో – దృఢంగా ఎదుగుతారు. అవన్నీ విద్యార్ధికి కనీస అవసరాలని పెద్దవారికే తెలియదు.  ఇక వాటి కోసం విద్యా సంస్థలని నిలదీసేదెవరు? అవేవీ లేకుండా స్కూళ్లు వారినెలా వంచిస్తున్నాయో – పిల్లలే కనుక్కుని తిరగబడతారేమో ... మరి. ఆలోటును గుర్తిస్తూనే, అది పూడ్చుకునే లోగా – మనం పిల్లల కోసం – ఏం చెయ్యగలమో చూడాలి.   
          ***************                                 ****************         
ప్రతి ఒక్కరి జీవితం, దేనికదే ప్రత్యేకం, అయినా ఆత్మహత్యకి తలపడిన వారందరి మానసిక స్థితిలోనూ ఒక ఉమ్మడి అంశం ఉంటుంది – అదే – ఓటమి, తాము వ్యర్ధులమన్న భావం. వ్యక్తిత్వం పూర్తిగా  రూపొందని వయసులో న్యూనత ఒకసారి వారిలో చేరిందంటే –  రోజురోజుకీ వారిపై దాని పట్టు బిగుస్తూ ఉంటుంది.  ఈ నేపథ్యంలో, తీవ్రమైన ఒత్తిడికి గురైన పిల్లలు మానసికంగా ఒంటరులై నలుగుతూ ఉంటారు. తమ ఆప్తులకు కూడా మనసులోని మాట చెప్పుకోలేరు. భరించలేని నిరాశా, నిస్పృహలు ఆవరించిన క్షణంలో – ఆత్మహత్య వారికి ఒక విడుదలగా తోస్తుంది.
కేవలం తల్లిదండ్రులే కాకుండా, కుటుంబ సభ్యులూ, టీచర్లూ, బంధువులూ, స్నేహితులూ, ఇరుగుపొరుగువారూ, పరిచయస్థులూ – ఇలా  ఏ స్థాయిలోనైనా – మనం చెయ్యగలిగేది ఎంతో కొంత ఉంది. నదిలో నీరు కలుషితమై పోయి వ్యాధులు ప్రబలుతూంటే – ఇళ్లలో మనుషులకి కుండల మీద మూత లుంచుకోండి, తినే ముందు చేతులు కడుక్కోండి – అని ఇచ్చే సలహాల్లా  ఇవి కనిపించినా – మన పిల్లల జీవితాల సమస్య కనక – మనకు చేతనైనంతా - తక్షణమే చేసుకుతీరాలి, తప్పదు. 
మనందరిలోనూ కొద్దో గొప్పో ఉంటూ మన ప్రవర్తనపై ప్రభావం చూపే అంశం ఒకటి ఉంది - అదేమిటంటే షేమ్!  సిగ్గు కాదది, న్యూనత. మన మనసులో ఉన్నది బయటపెట్టుకోడానికి సంకోచిస్తాం, మన నిజం నలుగురూ మెచ్చరేమో అన్న భయం వల్ల. అదే పిల్లలకీ నేర్పిస్తాం. ఇబ్బందికరమైన విషయాన్ని బయటకి చెప్పకూడదని మనకి తెలియకుండానే వారికి సూచిస్తూ ఉంటాం. అలా కాకుండా మనసులో ఉన్నది నిర్భయంగా మాట్లాడగలగడం ఒక అలవాటుగా మారాలి. ఓటమి అన్నది సిగ్గు పడి దాచుకోవలసిన  విషయం కాదని, పెద్దవాళ్లు తమ నిత్యజీవితంలోని సాధారణ సంఘటనలలో వారికి ఆచరించి చూపాలి.
          *************                                         ***************    
విజయం సాధించాలనే కోరిక, తన చుట్టూ ఉన్న పది మంది లోకీ తానే గొప్పవాడినని పించుకోవాలన్న తపన – నానాటికీ శృతిమించుతూండడం కనిపిస్తూనే ఉంది. దాని మంచి చెడ్డల చర్చ లోకి పోకుండా, ప్రాక్టికల్‌గా ఆలోచించి చూస్తే – సామాన్య ప్రజలందరికీ - చదువుకుని ఉపాధి సంపాదించుకోడం తప్పనిసరి. దాని కోసం పరిశ్రమ చెయ్యడమూ తప్పనిసరే. దానిని మనం కాదనలేం. కాని ఆ పరిశ్రమలోని హెచ్చుతగ్గుల మీదనో, దొరికే ఫలితాల మీదనో – వారికి అందే ప్రేమాదరాలు ఆధారపడతాయని – వారికి ఏనాడూ అనిపించకూడదు.     
కుటుంబంలో ఒక సభ్యునిగా, దోస్తుల మధ్య ఒక దోస్తుగా, తమని ప్రేమించే బంధాలున్నాయని వారికి అనిపించాలి. కేవలం గెలుపుల కోసం పరుగులే జీవితం అనిపించకుండా, చిన్న చిన్న ఆనందాలని కలిసి ఆస్వాదించడం ఒక అలవాటుగా మారాలి.  చిట్టి పొట్టి సహాయాలతోనో, ఆటలతోనో, పాటలతోనో, అవేవీ కాకపోతే ఒక జోకు చెప్పి నవ్వించడం ద్వారానో – వారెంత ఆనందం పంచుతున్నారో – పిల్లలకి  మనం తెలియజేస్తూ ఉండాలి. వారు తమ జీవితాల్లో ఉండడం ద్వారా ఎంత నిండుదనం తెస్తున్నారో వారికి తెలిసేలా ప్రవర్తించాలి. వారి అభిరుచులకీ, అభిప్రాయాలకీ, వాటి ప్రకటనకీ – ప్రతిస్పందిస్తూ ఉండాలి. చుట్టు పక్కల జీవిస్తున్న మనుషులతో వారిని సంబంధం ఏర్పరుచుకొనేలా ప్రోత్సహించాలి. సమూహాలలో తమ ఉనికికొక విలువ ఉందని వారికి నిస్సందేహంగా తెలియాలి.
అయితే ఒక్క విషయం – ఈ ప్రేమానందాలూ, సహానుభూతులూ – జీవిత పోరాటంలో ఎదురైన ఓటములని మర్చపోయేందుకు ప్రత్యామ్నాయాలు కాదు. జీవితం అంటేనే సుఖ దుఃఖాల సమాహారం. మంచి విషయాలు చెడ్డవాటిని అవతలికి తోసేయవు. అలాగే చెడ్డ విషయాలు – మంచి విషయాల వల్ల కలిగే ఆనందాన్ని పోగొట్టవు. కాకపోతే ఒత్తిడికి గురైన వారికి  ఓటమి తప్ప మరేదీ కనిపించని ప్రమాదం ఉంది. దానిని నివారించేందుకు – వారిలో కలుగుతున్న ఒత్తిడిని వారు ఏరోజు కారోజే – బయటకి చెప్పుకునే అవకాశం మనం కల్పించాలి. ఏ మనిషికైనా తోటి మనుషులే రక్షక కవచాలు! ఓటమి వల్ల జీవితమే వృధా అని పిల్లలకి అనిపించిన రోజున సభ్య సమాజంలో భాగమైన మనమందరం  నేరస్థులం అవుతాం.