Showing posts with label ఆంధ్రజ్యోతి. Show all posts
Showing posts with label ఆంధ్రజ్యోతి. Show all posts

Tuesday, 11 January 2022

ఆవేశం నుండి చైతన్యం దాకా : కారా

 "2016లో ఒకసారి మాటల్లో కారా మాస్టారి కథలు నాకు చాలా ఇష్టం!" అన్నారు Rama Sundari.

"చిన్నప్పుడు నాన్న (PRJ Pantulu) 'యజ్ఞం', 'రాగమయి' - చదివి వినిపించడం గుర్తుంది, అప్పుడూ, అటు తర్వాతా కూడా చదివాను కానీ #KaRa సాహిత్యం నాకంతగా అర్ధం కాలేదండీ" అన్నాను.
"మరో సారి చదవండి, మాస్టారి కథల మీద సారంగలో వ్యాసాలు రాసాం మేం, అవి పంపుతాను, చదివి చూడండి" అన్నారు.
ఆమె రాసిన 'హింస' కథ మీద వ్యాసం - చదవడం మొదలు పెట్టేను. ఒక్కసారిగా వయసు పెరిగిన అనుభూతి.
ఆ వ్యాసాలన్నిటినీ పుస్తకరూపం లోకి తేడానికి Vivina Murthyగారితో చేసిన చర్చల ఫలితంగా మరి కాస్త ఎదుగుదల.
Bammidi Jagadheeswararao గారితో నా ఆలోచనలు వ్యక్తం చేస్తూ, ఆయన స్పందనల ద్వారా కొంత స్పష్టత తెచ్చుకునేదాన్ని.
ఒకనాడు నాకేదో సరికొత్తగా స్ఫురించిందనిపించింది. విద్యుత్తు ప్రవహిస్తోందనిపించింది ఒక్కసారిగా. జరిగింది ఒక్క క్షణంలోనే - కాని ఆ మెరిసిందానిని అక్షరీకరించడంలో రెండేళ్లు పట్టింది.
మాస్టారికి Kalipatnapu Subba Rao గారు చూపిస్తారని, #KaRa కు చదవగలిగే ఆరోగ్యం ఉండాలనీ ఆశ.
రెండు వేర్వేరు వ్యాసాల్లో:
26 ఆగస్టున #వివిధలో,

చెప్పింది చదువుకునేందుకు వీలుగా ఒక్క దగ్గరే రాస్తున్నాను.
👇 - - - - - - - - - - - - - - - - - - - - -👇
సమాజ చరిత్రకూ, సమాజ చలనానికీ మధ్య ఉండేటటువంటి సంబంధం గుర్తించినటువంటి అతికొద్ది మంది రచయితల్లో కారా ఒకరని కేతు విశ్వనాధరెడ్డి అంటారు. సమాజ సమగ్ర స్వరూపాన్ని దర్శించే ప్రయత్నమే కారా మాస్టారి కథల లక్ష్యం. కలం పట్టిన తొలిరోజుల్లో – మధ్యతరగతి జీవుల గురించీ, వారి అనుభూతుల గురించే ఎక్కువగా రాసేరు.
అందరికీ చెందే వనరులని, కొందరు చేజిక్కించుకుంటున్న వైనం కంట పడ్డాక, ఆదోపిడీని – వ్యవస్థీకృతం, ఆమోదయోగ్యం – చేసుకోడానికే పీడన సాగుతోందని తెలిసాక - ఆయన రాసిన ఏకథా ఆ సత్యాన్ని విస్మరించలేదు.
కథనపు ప్రత్యేకత :
పీడనని మాత్రమే చిత్రీకరించే కథలు కోకొల్లలు – అలా రాయడం ఆయనకు సమ్మతం కాదు. అది ఏ రూపంలో జరుగుతోందో, ఎవరి ద్వారా జరుగుతోందో, దానిని అనుభవిస్తున్న వారి జీవితాలలో మార్పులేమిటో, దానికి ఎదురెళ్లేవారెవరో – పరిశీలించి తనకొక అవగాహన ఏర్పడింది అనుకున్నాకే దానిని కథావస్తువుగా స్వీకరిస్తారు. అందుకే ‘చెప్పేందుకు విషయాలున్నా చెప్పడానికి అవి నా అలవికి రావాలి’ అంటారొకచోట. నిజమైన వర్గ శత్రువుల అంతర్ బహిస్వరూపాలు ముందుగా తాను గుర్తించి తన కధల్లో వాటిని ఆవిష్కరించడం ఆయన లక్ష్యం.
ఆయన చూపు ననుసరించి మనం సమాజాన్ని కలయజూస్తే - నేలబారు జనపు జీవితాల్లో రాజుకుంటున్న సంఘర్షణ మనకు కనిపిస్తుంది. నీటి కోసం, నిప్పు కోసం, కూలి కోసం, పని చేసుకుని తినే హక్కుకోసం, గొరవంగా బ్రతికే హక్కు కోసం ఘర్షణ పడుతున్న సమూహాల నుండి పాత్రలనెంచుకుని, వారిపై లెన్స్ నుంచి వారి అంతరంగ దర్శనం చేయించడం ఈ కథల్లో మనం చూస్తాం. తాను తయారుచేసిన వస్తువు మీద తనకు హక్కుందని చిన్నకొడుకు ప్రకటించడం తీర్పు కథాంశం.
గౌరవంగా పని చేసే హక్కును నిలబెట్టుకోడం కోసం - వారానికొక సెలవు కావాలని పనిమనిషి అంకాలు నిలదీయడం ఆదివారం కథాంశం. అసహాయురాల్ని చేసి, స్వంత యింటిలో తన అక్కను తలదాచుకోనీకుండా చేసిన సమాజపు క్రౌర్యం, అది ఎనిమిదేళ్ల సంగిని పెట్టిన హింసా, పర్యవసానంగా కనిపించని శత్రువు మీద పోరాటానికి సిద్ధమైన సంగి ఆవేశమూ – హింస కథలో చూస్తాం.
రాత్రంతా ఒకే పక్క మీద జంటగా గడపాలనేది ఎందరికో తీరని కల. డబ్బులు సమకూర్చుకుని, కనీసం ఒక్క రాత్రి భార్యతో ఏకాంతాన్ని అనుభవించాలని - రూం కోసం వెతుకుతాడు నూకరాజు. తోటి మనుషుల నుంచి కనీస మర్యాద ఆశించడమే అతని సంఘర్షణ. కేపిటలిజం ఫలితమైన మొబిలిటీ బెట్వీన్ ద క్లాసెస్ కనిపించినా నో రూం లో లాడ్జిని ఇప్పటి ఫైవ్ స్టార్ హోటళ్లతో పోలిస్తే మనకి వాస్తవం బోధపడుతుంది. కులవివక్ష నక్కి కూచున్న అనేకానేక సామాజిక కోణాలలో ఒక చీకటి మూల నోరూం కథ.
పగలంతా కూలి పనికెళ్లి, సాయంత్రం ఏపూట దినవెచ్చాలు ఆ పూట తెచ్చుకునే జీవితాలు మాలపేటలోని సన్ని వంటి వారివి. ఆమె కూలి డబ్బుల మీద ఆశ వల్ల కలహం పెంచుకున్న అమ్మ, అత్త – నిజానికి పోరాడేది ‘బతుకు భయం’ తోనే. తమ బతుకుల పగ్గాలు తమ చేతిలో లేవన్న నిజం నిర్వీర్యం చేస్తుంటే సన్ని, ఆమె భర్త – పడే పెనుగులాట ఆర్తి కథ.
కాటు వేసే శత్రువు కనబడితే - అది దూరింది తన ఇంటిలో కాకున్నా – మట్టుపెట్టడం తన ధర్మం అని నమ్మి, ఆపోరాటంలో - ప్రాణభయం మీద విజయం సాధించిన సత్తెయ్య గాథ. లోకమంతా తన ఇల్లేనని భావించగలిగిన, లోకోత్తరుల కథ భయం.
తమ శ్రమకు తగిన ఫలితాన్నివ్వమని యాజమాన్యంతో చేసే పోరాటమొక వైపైతే, శాంతి పేరిట - వారు గొంతెత్తడాన్ని సైతం అణచివేసే ప్రభుత్వ యంత్రాంగంతో చేసే పోరాటం మరొకవైపు –కనిపిస్తుంది శాంతి కథలో. బతికినంతకాలం చలితో పోరాడి, చచ్చాక ‘ నాయిన్నాళ్ల సలీ కాష్టమ్మీనైనా కాలిపోవాల’ – అనేది నారమ్మ. ఆమె శవాన్ని కాల్చేందుకు కట్టెలు తేలేక అలమటించే కుటుంబాన్ని చూస్తాం చావు కథలో.
తాగడానికి నీరు లేని గ్రామస్థులందరి చేతా మహజర్లు రాయించి, ఊరికి కుళాయి తెప్పిస్తాడు రావుగారు. ఫలితం – రోజు కొక్క గంట వచ్చే వీధి కొళాయి ముందు మొత్తం ఊరిజనం, ఇల్లూ తోటా తడుపుకునే సదుపాయం ఏర్పాటు చేసుకున్న రావుగారూను. ఒక్క బిందె నీళ్ల కోసం, మానాభిమానాలు చంపుకుని మరీ రావుగారింటి గేటు దగ్గర చేసే యుద్ధం జీవధార కథ.
ఒక్కొక్క కథా ఒక్కొక్క జీవిత శకలానికి ప్రతిబింబం అన్న మాట నిజమే అయినా కూడా సమగ్రంగా అవన్నీ కలిపి ఇచ్చే అవగాహన కూడా ప్రత్యేకించి తెలుసుకోవలసిన విషయం. ఒక కథను అర్ధం చేసుకోడానికి వేరే కథలు సహాయపడతాయి. ఇంకోలా చెప్పాలంటే ... ఒక కథను చదివి గ్రహించిన దాని కంటే మొత్తం ఈ కథలన్నీ చదివిన తర్వాత అదే కథలోంచి గ్రహించగలిగే సారం మరింత ఎక్కువ.
భావజాలాల పై ప్రశ్న:
ఒక తరంలో దోచుకోడం, అణచి ఉంచడం, తమ స్వంత బలంతో సాగించే అపకారం. అది తరతరాలుగా సాగడానికీ, జనం ప్రవర్తనని శాశ్వతంగా శాసించేందుకు - ఏర్పరిచిన – పీడనకి తోడ్పడే భావజాలాలని – గుర్తించడం రచయితగా తన బాధ్యత అని కారా భావిస్తారు. అందుకే ఆయన కథల్లోని పాత్రలు – తమచుట్టూ జరుగుతున్న మోసం చూసి ప్రచారంలో ఉన్న నీతుల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి. ఉదాహరణకి – తీర్పు కథలో రెండో కొడుకు మేనత్తతో - పంచిన వాళ్లు పాపాన పోతారని సామెత నువ్వే చెప్పేవు కదా, నువ్వు పెద్దదానివి, నిన్ను నరకానికి పంపడం ఇష్టం లేదు, అందుకే ఆపాపమేదో నేనే మూటగట్టుకుంటున్నాను అంటూ తానే పంపకం చేస్తాడు. అలాగే ఆదివారం కథలో పనిమనిషి అంకాలు గురించి ఇంటావిడ కోడలు పాత్రతో – “ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేయడం నేర్చిన మనిషి, మనసులో విషయం దాచి మసిపూసి మారేడు కాయ చెయ్యడంలో మాకన్నా రెండాకులు ఎక్కువ చదివింది” అనిపిస్తారు. యజ్ఞం కథలో సీతారాముడు – “ఏరి కంటి క్కనపడకండా నువ్వేం సేస్తన్నావో – అదే పని నలుగురికీ కనపడేటట్టు నానూ సేసేను” అని తన కొడుకు శవాన్ని చూపిస్తాడు. ఆ మాటకి అర్ధం – ఒకరి జీవనభృతి లాక్కోడమంటే వారి భవిష్యత్తరాలని హత్య చెయ్యడమే అని.
శాంతి కాముకులు:
దొంగిలించే దాని కన్నా దోచితే చిక్కేది ఎక్కువని తెలుసుకుని కొందరూ, అవేవీ తెలియకుండానే జన్మసిద్ధంగా అందిన వనరుల వల్ల ఇంకొందరూ – ఈ ఆర్ధిక చట్రంలో సౌకర్యవంతమైన స్థానాలలో చేరతారు. వారికి పోరాటాలంటే చెప్పరాని కంపరం. వారి గురించి శాంతి కథలో ఇలా చెప్తారు – “స్వేచ్ఛగా మసలడానికో ఇల్లూ, కట్టేందుకు ఖరీదైన గుడ్డా, అమిరిన వాళ్లందరికీ శాంతి కావాలి.
ఇవన్నీ అవరకపోయినా, వాటిని ఆర్జించుకునే అవకాశం దొరికిన వాళ్లకి దాన్నుపయోగించుకుని పెరగడానికి శాంతి చాలా అవసరం.
ఈ తక్కువ కాలంలోనే అందిపుచ్చుకున్న అవకాశాల్తో అవలీలగా ఆస్థులు సంపాదించుకున్న పెద్దలకు తామే కాక తమ తరువాతి తరాలు కూడా నిష్పూచీగా నిరాటంకంగా అనుభవించేందుకు సుస్థిరమైన శాంతి తప్పకుండా కావాలి. కాని దురదృష్టమేమిటంటే ఈదేశంలో అలాటివాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు.” అందుకే కథలన్నిటిలోనూ ఒక ఇనెవిటబిలిటీ ఉంటుంది – పోరాటం వారికెలా తప్పనిసరౌతోందో విప్పి చూపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆకథలు.
ఎవరో రెచ్చగొడితేనో లేక మరెవరో చేయిస్తేనో పోరాటాలు జరుగుతాయని మనలో చాలా మంది భావన. కానీ కారా చూసిన సత్యం అది కాదు. అజ్ఞానంతోనో, మరి నిషాతోనో కళ్లుమూసుకుపోయినప్పుడు తప్ప – ప్రపంచంలో ఘర్షణ లేని శాంతి దొరకదు – అని ఖండితంగా చెప్తాడు శాంతి కథలో కథకుడు. ఈ విషయం కారా కథామాలికలకు ఒక దారం వంటిది.
సంపద ఒక చోట కూడి పడి ఉన్నంత కాలం తమ జీవనావసరాల కోసం – ప్రజలకు ఆ సంపద వైపు అడుగు వెయ్యడం తప్పనిసరే. దాని వల్ల అలజడి రేగి – సంపదల ధర్మకర్తలు - భయపెట్టినా, బెదిరించినా, శాంతి పన్నాలు వల్లించినా- ఆ ప్రజలు సంపద పై తమ హక్కును ప్రకటించక తప్పదు.
చావు కథలో సీతయ్య ఇలా అంటాడు: “బతికున్న మనిషైతే నీదీ నాదీను, చచ్చిన శవం ఊరందరిదీనూ.
మరి దానిక్కర్రలు కావాల, నిన్నూ నిన్నూ అందర్నడిగినాం, మీరెవ్వరివ్వలేదు. అవి ఉంటే గాని నాగ్గడవదు. అవక్కడున్నాయి. అందుకని తెచ్చినాను. నువ్వు నామీద కేసే ఎట్టు, పోలీసులకే అప్పసెప్పు, కాదని నన్నురి దీసీసినా – అయినా నాకవుసరమైతే నాను తేకమానను.”
అలాగే జీవధార కథ ముగింపులో కథకుడు ఇలా అంటాడు: “ కసురుకున్నా విసుక్కున్నా కుక్కల్నీ పోలీసుల్నీ చూపి భయపెట్టినా లేనివారు కలవారి నిబ్బంది పెట్టక వల్లకాదు.”
అయితే మరి శాంతి కాముకుల మాటల్లో, చేతల్లో ఒక రైటియస్‌నెస్ (ధర్మాత్ములమన్న నమ్మకం) ఉంటుంది. అప్రజ్ఞాతం, యజ్ఞం, కథల్లో – సూరప్పడూ, శ్రీరాములు నాయుడూ ఆ కోవకు చెందిన వాళ్లు. నలుపూ తెలుపులకి అలవాటుపడిన పాఠకులకి వారి సంక్లిష్టత చప్పున అర్ధంకాదు. వారి పాత్ర చిత్రీకరణని లోతుగా పరామర్శిస్తే - దోచుకోబడే వారికే కాదు, దోచుకునేవారి క్కూడా ఛాయిస్ ఉండదనే – అనే కీలక విషయం మనం అర్ధం చేసుకోగలుగుతాం. ఈ వ్యవస్థలో వారి పాత్ర ఏమిటో, వారి హద్దు లేమిటో స్పష్టంగా తెలియజెప్పే వాక్యం – యజ్ఞం లోనే ఉంది - ఆళ్లకి ఆళ్లు సేసుకోలేని మంచిని నువ్వు సేసినంతకాలఁవే నీ రాజ్జెం. లాబీయింగ్‌లు జరిగేది ఎవరి కోసమో, జరిపేది ఎవరో తెలిసిన పాఠకులకి ‘ఆళ్లు’ ఎవరో, ఆ ‘మంచి’ ఏమిటో సులభంగా అర్ధమౌతుంది. ఆ అంశాన్ని మరో చోట ఇలా వివరిస్తారు – ‘ప్రభుత్వాల మనుగడ పెంట మనుషుల చేతుల్లోనూ, పెద్ద మనుషుల ధన ప్రాణ మానాలు ఆ ప్రభుత్వం చేతిలోనూ చిక్కుకున్నాయి.’ ప్రజాస్వామ్యపు బలమూ, బలహీనతా ఈ వాక్యంలోనే ఉన్నాయి తెలుసుకోగలిగితే.
ఈకుట్రలూ, దోపిడీలూ జరిగే పద్ధతిని తెలుసుకోకనే నిరు పేద వర్గాలు – నీరుకూ, నిప్పుకూ, గూడుకూ, చివరికి శారీరక అవసరాలకు కూడా మొహం వాచిపోయిన సమూహాలు ... వారిలో వారే పోటీలు పడుతూ – తలోదారీ పడుతున్నారని, వారికి అసలు నిజం చూపడమే సాహిత్యకారుల కర్తవ్యమనీ కారా నమ్ముతారు. వారిలో ఐక్యత ఎందుకు లోపిస్తుందో ఆర్తి కథలో చర్చిస్తారు. నేలబారు జనం గురించి చాలా మంది కుండే తేలిక అభిప్రాయం నాయుడు మాటల్లో వినిపిస్తుంది. “తొత్తు కొడుకులు వొళ్లు కొవ్వెక్కి తెగ బలిసున్నారు. కన్నూ మిన్నూ కానక కొట్టుక సస్తున్నారు”. దానికి నారాయుడు – పొలాల్లో కూలి పనికెళ్లినా, చిన్న బంజరు ముక్కమీద పని చేసుకున్నా, పట్నానికెళ్లి సంపాదించినా – ఏది చేసినా తిండికి చాలని తమ సంపాదనల గురించి వివరించి - ‘అదుగో ఆ కడుపు గోలల్లో పుట్టింది బాబూ ఈ మంటంతా’ అంటాడు.
తన జీవితకాలంలోనే – కొందరు ధనవంతులవడం, మరి కొందరి సంపాదనలు పడిపోతున్న – ఈ నిష్పత్తి - చావు కథలో తాత కూడా గుర్తిస్తాడు – “ఒకడు నెగిసేసరికి 100 మంది, పది మంది నెగిస్తే యేల కొద్దీ రాలతన్నారు – జనం.” ఆ లేచేవారిలో ఒకరో అరో తన వాడున్నా – (జనం తాలూకు అజ్ఞానం మీదా, ఆకలి మీదా – ఆ రెంటి బాధా లేని వాళ్లలో – తన ప్రభావం ద్వారా నాటిన దురాశ మీదా ... బతికే వ్యవస్థ కనక) ... “మన్లో సూడగల తొత్తుకొడుకెవడేనుంటే, మన్నాడే ఆల్లల్లో కలిసిపోతున్నాడ’’ న్న తాత మాటలు నిజమే అన్పిస్తాయి.
ఈ నిరాశాజనక స్థితిలో రచయితల కర్తవ్యం గురించి కారా కొక స్పష్టమైన అభిప్రాయముంది - ఒక ప్రశ్నకి సమాధానమిస్తూ - సమకాలీన పోరాటాల ఫలితంగా (దళిత రాజకీయాలు, ఫెమినిస్ట్ ధోరణులు) వారిపై జరుగుతున్న అణచివేత, పీడనల గురించిన స్పృహ ఈ రెండు వర్గాలలోనూ చైతన్యంగా పరిణమిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సామాజిక విప్లవాల గురించి చదివే వాళ్ల అవగాహననీ, స్పృహను, చైతన్యాన్నీ, నిబద్ధతను, నిమగ్నతను ఏ దశ నుండి ఏ మేరకు పెంచేదైనా – విప్లవ కథేనని ఆయన నమ్మకం.
ఏ సందర్భాల్లో ప్రజలు ఏకమౌతారన్న ప్రశ్నకి – చావు కథలో అప్పారావు మాటల్లో మనకి జవాబు స్ఫురిస్తుంది. అవుసరం, నిజంగా నీకవుసరం కావాల, అదుంటే అప్పుడే అనుమానాలూ ఉండవు, ఇన్ని డొంకతిరుగుళ్లూ ఉండవు. అలాగే జీవధార కథలో “ఒలే రాండర్రా! ఇక్కడీల్లు కుక్కల్ని ఉసిగొలుపుతారట!” అన్న సత్యవతి పొలికేక విన్న ఆడవాళ్లు “ఇక్కడ నీళ్లిస్తారు” అన్నట్లు అర్ధం చేసుకున్నారేమో పోటీలు - పోటీలు పరుగులెడుతున్నారని రాస్తారు. ప్రజల నిజమైన అవసరాలను గుర్తించిన నినాదాలతో ప్రజలు గొంతు కలుపుతారని అనిపిస్తుంది.
అసమాన బలాల మధ్య పోరాటం:
ఇందాక చెప్పుకున్నట్టు – కొన్ని పాత్రలు తప్పనిసరి అయి పోరాటం గనక చేస్తాయి గనక అసమాన బలాల మధ్య పోరాటం కారా కథల్లో ప్రముఖంగా కనిపిస్తుంది( ఉదా. వధ, వీరుడు మహావీరడులో అక్షరాలా యుద్దమైతే, శాంతి, జీవధార వంటి వాటిలో వనరుల కోసం, హక్కుల కోసం పోరాటం). గెలవగలనన్న నమ్మకంతో కాక తలపడక తప్పదన్న స్పృహతో చేసే పోరాటాల వర్ణన ఉంటుంది వాటిలో.
ప్రత్యర్ధి బలాన్ని అర్ధం చేసుకున్న పాత్రల నుంచి మనకి వాస్తవం తెలుస్తుంది. బలం అంటే అంగ బలమో అర్ధ బలమో మాత్రమే కాదని. నోరూంలో మేస్త్రీ తన స్కిల్, దానితో తయారైన యజమాని మేడ – ఈ రెంటినీ పోలుస్తూ - ఇలా అంటాడు- ఆడి సొత్తు ఆడు నీకందకండా దాయగలడు. నువ్వలా దాయలేవు. పనోడితో వచ్చిన సావే అది.
సమిష్టి జీవితాల పెద్ద కేన్వాసును తీసుకున్నప్పటికీ - మొత్తంగా కలిపి చూసినప్పుడు - పోరాడే వ్యక్తుల చిత్రీకరణలో కొన్ని రంగులు ప్రస్ఫుటంగా కనిపించడం గమనించవలసిన విషయం, సంఘర్షణకి లోనౌతున్న పాత్రల మానసిక అవస్థల్లో రకరకాల స్థాయిలు కారా కథల్లో మనకి ఎదురౌతుంటాయి. చాలా చోట్ల రచయిత పాత్రల్లోని ఉద్రేకపు భావన ఏ స్ధాయిలో ఉందో వివరిస్తూ ఉంటారు. ఏం జరుగుతోందో తెలియని ఆరాటం, కష్టాలను ఓర్చుకోలేక ఆక్రోశం, దానికి కారణమైన మనుషులను చూసి ఆవేశం - కనిపిస్తాయి. ముఖ్యంగా బలమైన శత్రువుతో తలపడేట్టు చేసేది ఆవేశమే.
ఆవేశం:
ఈ సందర్భంలో ఆవేశం గురించి కారా అవగాహన ఏమిటన్నది అప్పుడప్పుడు ఆయన చెప్పిన మాటల్లో – ‘ఆవేశం గొప్ప చోదకశక్తి. మనుషుల్లో మందిలో జాతుల్లో ధైర్యం సాహసం తెగువ త్యాగం లాంటి సుగుణాలన్నిటి వెనకా ఉండేది ఆవేశమే.’ పోరాటాలను ఇంత నిశితంగా పరిశీలించి, రికార్డు చేసిన కథలని చదివేక – పాత్ర ఎమోషన్ల వర్ణన ద్వారా, ఆయన దర్శించిన జీవిత సత్యమేదో మనకి అందిస్తున్నారని నాకు తోచింది. ఆవేశం ఉద్రేకపు స్థాయిని దాటితే గాని పోరాటంలో విజయం సాధించలేమని కారా అనుకుంటారేమో. ఉదాహరణకి తీర్పులో మోసాన్ని గ్రహించిన రెండో వాడి గురించి ఇలా రాస్తారు– ‘వాడి పెదవులు ఎంత ఆపుకున్నా ఆగక వణుకుతున్నాయి. అలా వణకడం వాడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు.’ వధ, వీరడు – మహావీరడు కథల్లో కూడా ఆవేశానికి లోనై పోరాటం సాగించడం అనేది ఓటమి వైపు అడుగుపడినట్టు సూచించడమూ కనపడుతుంది.
బలవంతుడికి ఉండే ధీమా వల్ల వాడి ధోరణి ఎలా ఉంటుందో ఈ వర్ణన చూస్తే తెలుస్తుంది. ఉదాహరణ - వధలో వాలి. ‘పోరులో వాలి ఆయాసపడడు, ఎదిరిని దెబ్బ తీయడానికి ఉద్రేక పడడు. ఎదిరి మీది మీదికి వస్తే ఆవేశపడిపోడు. వెనవెనక్కు అడుగు వెయ్యడానికి సిగ్గు పడిపోడు ... మళ్లీ ఆవేశపడి వచ్చేవరకూ వేచి ఉంటాడు.’
దానికి విరుద్ధంగా సుగ్రీవుడు – ‘అడవుల పట్టిన వాడు, అష్టకష్టాలు పడుతున్న వాడు, అన్యాయాలను తలంచుకుని ఆవేశపడేవాడు’
ఒక అంశం నాకు కారా కథల్లో చాలా ఆసక్తికరంగా తోచింది – విజయానికీ, ఉద్రేకానికీ ఏదో తకరారున్నట్టు అనిపించింది. విజయాన్ని సాధించిన పాత్రలన్నీ ఉద్రేకాన్ని అదుపులోకి తెచ్చుకుని ప్రవర్తించడం కనిపించింది. అది ఒక దగ్గర మొండి ధైర్యంతో తిరగబడడమైనా, క్రమశిక్షణతో తమ ప్రణాళికను అమలు జరుపుకోడమైనా, సాహసంతో సంఘద్రోహులను సంహరించబూనడమైనా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడమైనా. ఒక చైతన్యంతో స్వయంనిర్ణయాధికారాన్ని రీయిన్ ఫోర్స్ చేయడం కనిపిస్తుంది.
పోరాటం తప్పనిసరి అని తెలుసుకున్న పాత్రలను వారి అవగాహనల ప్రకారం ఒక స్కేలు మీద చేరిస్తే - నిర్లిప్తంగా తమకొచ్చిన కష్టాలన్నిటినీ తన వారికి కథల్లా వల్లించి చెప్పే చావు తాత ఒక చివర ఉంటే, తమ హక్కును నిక్కచ్చిగా అడగ్గలిగే ఆదివారం అంకాలూ, తీర్పు రెండో కొడుకూ... ఆ స్కేలు మీద మరి కాస్త ముందు నుంటారు. తనపర భేదమే పట్టించుకోని సత్తెయ్య (భయం) – పూర్తి పరిణతితో స్కేలుకు రెండో చివర నుంటాడు. అతని చరిత్ర చెపుతూ - తన భయం ఎలా పోయిందో, ఏ చైతన్యం అందుకు కారణమో గ్రహించగలిగే వూహ సత్తెయ్యకి లేదు అని వివరిస్తారు. అలాగే మరణపు అంచును ముట్టి వచ్చిన సుగ్రీవుడి విషయం – ‘ఏ తలపులు ఆవే(దే)శాలనిచ్చి ఆశలు వానికి జీవం పోశాయో తెలియదు.’
మూమెంట్ కేప్చర్:
పాము గురించి భయపడేవారికి సత్తెయ్య ఇలా చెప్తాడు - అదెప్పుడో కాటేస్తుందో యెయ్యదో. దాని బయ్యం మనిషిని తినేస్తుంటది పురుగు నాగ. ఎదురు తిరిగితే ఏటీ నేదు. నీ సెయ్యే పైని.
పాత్రలు ఆవేశం నుంచి చైతన్యం వైపు చేసే ప్రయాణంలో – అవి పొందే భయాన్ని కూడా మనం గుర్తించగలం. తర్వాత భయాన్ని దాటే ఒక ప్రత్యేక క్షణపు ప్రసక్తి వస్తుంది. ఆ క్షణాన్ని చాలా స్పష్టంగా పట్టుకుని మనకందిస్తారు కారా. ‘సత్యవతికి భయానికి బదులు రోషం పుట్టింది’ (జీవధార); ‘అక్కడి భయంకరమైన నిశ్శబ్దం కానీ, స్మశానాల్లోని ఆ ప్రశాంతత కానీ ఆమెని భయపెట్టలేదు’ (హింస); ‘ప్రాణం పోవడమంటే ఏమిటో తెలిసిన సుగ్రీవునకు ప్రాణభయం పోయింది.’ (వధ)
సత్యవతిలోనూ, సంగిలోనూ, సుగ్రీవుడిలోనూ, భయం అవధులు దాటాక ... దాని పై స్దాయికి వాళ్లు చేరుకోడం చూస్తాం. వీరంతా సామాన్యులే. కానీ పరిస్థితులు వారిని ఆ దిశగా తోసాక, వారిలోని అసాధారణ జీవశక్తి వారిని భయాన్ని జయించే స్ధాయిలో ప్రవేశపెడుతుంది.
చైతన్యం:
మన చుట్టూ జరుగుతున్న పోరాటాలను గమనిస్తే – ఆవేశమే ఎక్కువగా కనిపిస్తుందంటే తప్పు కాదేమో. మొదలవ్వాలిసింది దానితోనే కానీ కొనసాగాలంటే మాత్రం దాని తర్వాత స్థాయికి చేర్చాల్సి ఉంటుంది. అంతిమంగా విజయం చేకూర్చేది చైతన్యమే.
తనకు జరిగిన అన్యాయానికి ఒక మనిషి వ్యక్తిగతంగా కారణం కాదని తెలిసిన మీదట ఏది అసలైన కారణమో తెలుసుకున్నఅనుభవం (జ్ఞానం) మీద దానితో తరవాతి అడుగు ఎటు పడాలో నిర్ణయించుకుని, తనకే కాక తనవారిక్కూడా – సాయపడగలిగేదే చైతన్యం.
పోరాటపు పరిధిలో చైతన్యాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు - వ్యక్తిగత స్ధాయిలో – సర్వసహజమైన ఉద్వేగాలూ, ఉద్రేకాలూ, భయాలూ – మనిషిని మరింత బలహీనుణ్నిగా చేస్తూ ఉంటాయి, సామూహిక స్థాయిలో లక్ష్యాన్ని విస్మరించేలా చేస్తాయి. చైతన్యం పొందిన -మనిషి - కోపాన్నీ, భయాన్నీ జయించుతూ అప్రమత్తుడై పోరాడగలుగుతాడు, సమూహం –శక్తుల్ని ఏకీకృతం చేసుకుని ఐకమత్యంతో పోరాటాలను కొనసాగించగలుగుతుంది
------------------------------
జనవాక్యం:
వర్తమానంలో జరుగుతున్న ఏ విషయం గురించైనా- చుట్టూ ఉన్న జనం ఏమనుకుంటున్నారనేది- జనవాక్యం. అది ఏ కాలంలోనూ అతి ముఖ్యమైన అంశమే. ఈ ఇంటర్నెట్‌ యుగంలో దాని ప్రాసంగికత ఊహాతీతమైన స్థాయికి పెరిగిపోయింది. ప్రజలకి తమ వాదం వినిపించే ప్రయత్నాలూ, మరే పక్షపు స్వరమూ వినిపించకుండా చేసే ప్రచారాలూ, వారిని తమవైపు తిప్పుకునే వ్యూహాలూ- ఒకరితో ఒకరు తలపడే పక్షాలన్నీ- తమ శక్తి మేరకు చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కాళీపట్నం రామారావు (కారా) రచనల్ని చదవడం ఉపయోగకరం. ఎందుకంటే-సమాజంలో నిత్యం, విడివిడిగా, రకరకాల రూపాల్లో సాగుతోన్న పోరాటాలు కారా కథలకి- ముడిసరుకుగా కనిపిస్తుంది. ‘వధ’, ‘వీరుడు మహావీరడు’లో ప్రత్యక్షంగానూ, ‘శాంతి’, ‘జీవధార’ల్లో- జీవితావసరం గానూ, ‘భయం’లో ప్రతీకాత్మకంగానూ- పోరాటం కనపడుతుంది.
పోరాటం జరిగిన చోటల్లా మూడు భాగాలుంటాయి. పోరాటం సాగించే రెండు ప్రధాన భాగాలైతే, తక్కిన ప్రపంచం- రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌, మూడో భాగంగా ఉంటుంది. ఆ భాగం- తనను తాను తటస్థమనే భావించు కుంటుంది. కానీ నిజానికి అది ఎటోవైపు చేరుతూనే ఉంటుంది. తటస్థ పక్షం ఏవైపు మొగ్గుతోంది, దాని మద్దతు ఎవరికి లభిస్తోంది-అనే అంశాలు సమాజపు రూపురేఖలను నిర్ణయిస్తాయి. కారా కథా నిర్మాణంలో- ఈ మూడో విభాగపు నడవడిని గమనించడం, వర్ణించడం- ఒక ప్రత్యేకతని సంతరిచుకుంటుంది. తమ మధ్య జరుగుతున్న పోరాటాల పట్ల ప్రజల స్పందనను కారా అనేక కోణాల నుంచి చాలా కథలలో చిత్రించారు. మూడో పక్షానికీ- పోరాటానికీ ఉండే సంబంధం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానాన్ని ఆయన కథల్లోంచి రాబట్టే ప్రయత్నం చేస్తాను.
బలం ఉన్న జీవాలు బలహీనమైనవాటిని ఓడించడం- ప్రకృతి సహజం. అడవి దానికే అలవాటు పడి ఉంటుంది. దానికి విరుద్ధంగా జరిగితే అడవి స్పందన ఎలా ఉంటుందో ‘వధ’లో ప్రతీకాత్మకంగా వర్ణిస్తారు: ‘‘(వాలి సుగ్రీవుణ్ని చావగొడుతున్న) అంతవరకూ తమ నడిబొడ్డున జరుగుతున్న ఆ పోరాటాన్ని నిక్కి నిక్కి నిటారుగా, ఏ వంకకూ తలల చివరలైనా ఊపకుండా అతినిర్లిప్తతతో చూస్తూ ఉండిన మహావృక్షాలన్నీ (రాముడు వాలిమీద బాణం వేసిన) క్షణంలో శివమెత్తినట్లు- మొదళ్లను సైతం కదుపుకుని ఊగిపోతూ హోరుహోరుమంటున్నాయి. ఆ అదటుకి అరణ్యంలో ఉండే క్రూర సత్వాలన్నీ పిచ్చెత్తినట్టు బొబ్బరిస్తూ అరణ్యమల్లా పరుగులు తీసాయి. వాటిని చూచి, ప్రాణభయంతో సాధుసత్వాలు విరిగి బెదిరి కలవరపడి కల్లోలమై కలసి పరుగులు పెట్టాయి.’’
వన్య జీవనంలోనే కాదు, సంఘజీవనంలో కూడా దీనికి అన్వయం కుదుర్చుకోవడం- చాలా సులభం. మూడోముక్క- జనం- పోరాటాలకూ తమకూ ఏ సంబంధమూ లేదనుకుంటూ చోద్యం చూసే పార్టీ. కానీ దాని ఆమోదం- సర్వసాధారణంగా బలవంతులవైపే ఉండడం అందరం గమనించే విషయమే.
కేవలం ప్రజల ఆమోదం కోసం కాక, తమ పక్షంలోని న్యాయాన్ని వారి ముందుకు తెచ్చి, వారి సహాయాన్ని అపేక్షించే ప్రయత్నాలూ జరుగుతాయి. కానీ వాటిలో నూటికో కోటికో ఒకటే ప్రజలని తాకుతాయి. అలాటి వాటిని సైతం పక్కదారి పట్టించగల వైనాల గురించిన చర్చ ఉంటుంది- ‘వీరుడు మహావీరడు’ కథలో. ‘వధ’లో రాముడు బలహీను డైన సుగ్రీవుడి పక్షానచేరి వాలిని కూల్చితే, ఇందులో మాత్రం కొత్తపేట శాండో ‘‘తంతున్న అల్లిపురం వస్తాదుని వదిలేసి- తాపులు తింటున్న’’ గంజిపేట రౌడీ ఎముకలు విరుస్తాడు. అంతవరకూ గంజిపేట రౌడీ వైపు సింపతీతో ఉన్న జనం రెచ్చిపోయి అతని మీద తలో చెయ్యి వేసే పరిస్థితి వస్తుంది. ప్రజాభిప్రాయాన్ని చిటికెలో (ఏ)మార్చగల కొత్తపేట శాండో ద్వారా ప్రజల విచక్షణ మీద వ్యంగ్య విమర్శ చేస్తాడు కథకుడు: ‘‘అవును గురూ అలాటోళ్లు, ఏటనుకుంటారంటే, జనం జూస్తూ అన్నేయాలు జరగనిస్తారా అనుకుంటారు. అనుకుని- న్యాయం ధర్మం- అని పెద్ద పెద్ద కబుర్లతో చిక్కుల్లో పడతారు. పడి ఒకళ్లకి తెద్దునా, అందరికీ తెద్దునా అని క్రైసీసులు సృష్టిస్తారు. ఒక్కసారి జనం సంగతేంటో తెలిస్తే మరింకెప్పుడూ అలాటి ఎర్రి కుట్టి ఏషాలెయ్యడు.’’
ప్రత్యక్షంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలు బలహీనుడిని ఒంటరిని చేసిన కథ ఇదైతే, ‘యజ్ఞం’ కథలో అది దండలో దారంలా దాగి ఉంటుంది. తనకి జరిగిన అన్యాయాన్ని వివరించడానికి మూడు రోజుల పాటు ప్రయత్నిస్తాడు అప్పల్నాయుడు. కానీ ప్రయోజనం ఉండదు. ప్రజల సానుభూతిని అర్థించేవారికి అది దొరుకుతుందని గాని, దొరికినా అది ఉపకరిస్తుందని గాని చెప్పలేం. ఏ పరువు కోసం మాట తప్పని వాడినని అతను నిరూపించదల్చుకున్నాడో- ఆ ప్రజామోదాన్ని కథకుడు చీదరించుకుంటాడు: ‘‘అప్పల్రాముడు, అతని సంతతీ- భూమినమ్మేందుకు పత్రాల వేలి ముద్రలు పెట్టడం అంతా అయ్యాక- జనం సానుభూతి రాముడి వంక ప్రవహిస్తోంది. దేనికా ప్రవాహం మురుగు నీరు దాని కన్నా నయం.’’
ఇంచుమించు అలాటి అవగాహనే ఆదివారం కథలో అంకాలుది కూడా. తన హక్కు దక్కించుకోడానికెంతైనా దృఢంగా నిలబడుతుంది. శ్రమ విలువతో పోలిస్తే- ఆమె దృష్టిలో పరువు గుడ్డి గవ్వ పాటీ చెయ్యదు. అందుకే- రెండు రూపాయలెక్కువ పుచ్చుకునైనా సరే, ఆదివారం నాడు మాత్రం పనిలోకి వచ్చి- చుట్టాలు పక్కాలలో తన పరువు నిలబెట్టమని యజమానురాలంటే- ‘‘అంకాలు పక పక నవ్వింది. నవ్వుతూ నవ్వుతూ నా వంక తిరిగి ఆ నవ్వుతోనే- ‘సూడమ్మా యీ యమ్మ మాటలు! దాసీ ముండన్నేనట- యీ యమ్మ పరువు నిలబెట్టాలట!’ అంది. ఆ పరువేపాటిదో చూడన్నట్టు, అందుకా ఆ రెండు రూపాయలన్నట్టు.’’
పరువూ, ప్రజామోదాన్ని లెక్కచెయ్యనివారి సంగతి వదిలేస్తే- ప్రజల మద్దతు కోరే వారికైనా అది లభించొద్దా? ఇక తటస్థ వర్గం ఎప్పటికీ బలవంతుల వైపే మొగ్గుతూ ఉంటుందా? తన కన్నా బలవంతుడైన ప్రత్యర్థితో పోరాటం చెయ్యడమూ తప్పక, చుట్టూ చూస్తూ ఉన్న ప్రజలు సైతం, ఆ బలవంతుడి పక్షమే అవుతూ ఉంటే- నిస్సహాయంగా నేల కూలడమే బలహీనుడి వంతా? కారా కథల్లో కనిపించే వాస్తవం ఇదేనా లేక మరేదైనా పార్శ్వం ఉందా?
ఈ ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే ముందు ఒక మౌలిక ప్రశ్నని వేసుకోవాలి. అదేమిటంటే- పోరాటాలలో ఉన్నవారు- జనం పట్ల- ఏ వైఖరి అవలంబించవలసి ఉంది? దానికి సంపూర్ణమైన సమాధానం- ‘భయం’ కథలో సత్యం పాత్రలో దొరుకుతుంది. సత్యం చిన్నప్పుడే తన శత్రువును గుర్తించి జీవితమంతా పోరాడుతూనే ఉంటాడు. ఆ శత్రువు పేరు- భయం. తనలాగే తన తోటి వారందరిలోనూ భయం ఉందని గుర్తిస్తాడు. తనని ఆదుకోవడానికి వచ్చినవారికే- సహాయం చెయ్యడానికి వెరిచే వ్యక్తి సుబ్బాయమ్మ. ఆమె వంటి వారి స్వార్థానికి కారణం కూడా భయమేనని తెలుసు అతనికి. తన పర భేదాన్ని గుర్తించని విశ్వకుటుంబీకుడౌతాడు.
పోరాటంలో అలిసిపోయి కూలిపోతాడేమో కాని ఓడిపోడు. తనకోసం భార్యని ‘‘ఏడనియ్యడమ్మా! దాన్ని ఏణ్నియ్యడు! దాన్నే కాదు ఎవళూ ఏడవొద్దంటాడు,’’ అన్న వాక్యం వెనకాల ప్రజల నుంచి సానుభూతిని కోరని అతని విశ్వాసం కనిపిస్తుంది.
సత్యంవంటి నాయకులు తన సహచరులకి జ్ఞానం అందించ గలుగుతారు. జీవితం మనిషిలో మార్పు తెస్తుంది. అందుకు అనుభవం కారణం అవుతుంది అంటారు కారా. ఆనాటిదాకా- నిత్యం చూసే మందే, మందలోని పశువులే- కొత్తగా కనపడడం మొదలౌతుంది గురువులికి. లోగుట్లు కనిపెట్టగల విద్య పట్టుబడుతుంది- సత్యంతో జరిగిన అనుభవం కారణంగా.
ఎలాటి అన్యాయాలు తమ మధ్య జరిగినా పట్టనట్టుండే జనాన్నే కారా కథల్లో చూసిన మనకి,- ‘భయం’ కథలోని జనవాక్యం పూర్తిగా భిన్నంగా వినిపిస్తుంది. ‘‘ ‘...బతికిన్నాడూ, సచ్చిన్నాడూ బయఁవెరగడు మనిషి, పాఁవుమీద పగపట్టిన్నాడే, పేణాలమీద ఆశ ఒగ్గుకున్నాడు... అంసలాగ బతికిందికి ఆర్నెల్లు సాలు! ఉంటాం, నువ్వూ నేనూ. ఎంత కాలఁవైనా ఒక్కటే...’- జనం ఎన్నెన్నో విధాల చెప్పుకుంటున్నారు.’’ సత్యం పోరాటం పట్ల ప్రజల స్పందన మన ప్రశ్నలెన్నిటికో జవాబులు దొరికే దారి చూపిస్తుంది.
సమాజంలో పోరాటాలు ఏయే కారణాల వల్ల మొదలౌతాయో, వాటి ఫలితాలెలా ఉన్నాయో, అవి ప్రజలమీద ఎలాటి ప్రభావాన్ని మిగిల్చాయో- దగ్గరనుంచి పరిశీలించి- ఆ పరిశీలనా సారాన్ని ఒక్కో కథగా మలిచినట్ట నిపిస్తుంది. పోరాటాలని వర్ణించేటప్పుడు- ప్రత్యర్థుల హావభావాలనీ, తద్వారా మానసిక స్థాయిలనీ తెలియజేయడం కారా కథల ప్రత్యేకత. ఆవేశంతో పోరాడుతున్నవారు ఓటమివైపూ, ఆవేశాన్ని అదుపు చేసుకున్న వాడు గెలుపువైపూ అడుగు వేస్తున్నట్టు కథలలో చాలాసార్లు కనిపించడం యాదృచ్ఛికం కాదు. భయం మీద విజయం సాధించి, ఆవేశపు తదుపరి స్థాయి చైతన్యాన్ని చేరినవారే పోరాటాల దిశ మార్చగలుగుతారు. ప్రజలలో సహానుభూతినే కాక ధైర్యాన్ని కూడా నింపగలుగుతారు. వారిలో పోరాటాలపట్ల సంఘీభావం కలగాలంటే- ఎటువంటి కార్యాచరణ ఉండాలో దానికి సత్యం పాత్ర నమూనాగా కనిపిస్తుంది.

Thursday, 23 August 2018

మైనారిటీ హక్కులా ... అవెందుకు?


మైనారిటీ హక్కులా ... అవెందుకు?
అనగనగా ... ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం – దుస్తుల తయారీకి పేరుమోసింది. వాటి ఎగుమతి వల్ల రాజ్యానికి చాలా ఆదాయం వచ్చేది. దర్జీ పని ఆపౌరులకి ప్రధాన వృత్తి. ఇలా ఉండగా దేశంలో తిరుగుబాటు జరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఒక పద్ధతి ప్రకారం పరిపాలన జరగాలని, కొన్ని నియమాలూ, సూత్రాలు రాసుకున్నారు. పౌరులందరికీ సమాన హక్కులూ, సమానావకాశాలూ ఉండాలనుకుని, వివరాలు సేకరించారు. రాజ్యంలో కుట్టుమిషన్‌లన్నీ కుడి చేతి వాటం. అయితే జనాభాలో కనీసం పది శాతం వరకూ ఎడమ చేతి వాటం ఉన్న వారని లెక్కల్లో తెలిసింది. వారికి కూడా జీవనోపాధికి సరైన అవకాశం దొరకాలంటే - కొన్ని ఏర్పాట్లు అవసరం అనుకున్నారు. ఎ.చే.వా. వారికోసం ఎడమ చేతి వాటపు మిషన్లుండాలి. వారికి ప్రత్యేకించి శిక్షణా స్థలాలుండాలి. ఎ.చే.వా. కుట్టుమిషన్ల - తయారీ కోసం, శిక్షణ కోసం, అమ్మకం కోసం ప్రచారం చేసుకునే హక్కు కల్పించింది. ఇవేవీ - కు.చే.వా. మీద నిర్లక్ష్యంతో కాదు, సంఖ్యాబలం వల్ల వారికి దొరికే సౌకర్యాలని, సంఖ్యలో తక్కువైన ఎ.చే.వా. వారికి కూడా కల్పించేందుకే. ఆహక్కుల నుపయోగించుకుని, ఎ.చే.వా. వారి తలసరి ఆదాయం పెరిగితే - కు.చే.వా. వారి ఆదాయం తగ్గకపోగా - మొత్తం దేశాదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. 
మైనారిటీ హక్కులెందుకనే ప్రశ్నకి జవాబు ఇంత సరళమా? చూద్దాం. 
మన రాజ్యాంగం మైనారిటీ సమూహాల కోసం ఏం హక్కులిచ్చింది? మూడు, (a) విద్యా సంస్థల్ని నడుపుకోడానికి (Article 30); (b) వారి భాష, లిపి, సంస్కృతిని రక్షించుకోడానికి (Article 29); (c) మత సంబంధమైన కార్యకలాపాలని నడుపుకోడానికి (Article 26). మెజారిటీ/మైనారిటీ సంస్కృతులని మన కథలోని కుడి/ఎడమ వాటాలతో పోల్చి చూసుకుంటే – కథలో అందరికీ లాభం కలుగుతోంది కదా, నిజ జీవితంలో ఆహక్కుల పట్ల కొంత వ్యతిరేకత ఎందుకు వ్యక్తమౌతోంది? అసలు - ఆ పోలిక సరైనదేనా అనే ప్రశ్న వస్తుంది. ఇంకా లోతుగా వెళ్తే, విద్య, భాష, సంస్కృతి వరకూ సరే గానీ ‘మతం’ – ‘జీవనోపాధి’ వంటి నిత్యావసరమా అనే ప్రశ్న ఉండనే ఉంది.

నిజమే, ఆదాయం లాగా మతవిశ్వాసాలన్నవి కొలవగలిగే వస్తువు కాదు మరి, ఆ లాభనష్టాలని బేరీజు ఏమని వెయ్యగలం? మతాన్ని నమ్మని వారికి మతస్వేచ్ఛ వీసమెత్తు విలువ కూడా చెయ్యకపోవచ్చు. కానీ ఒక దిలీప్ – అల్లా రఖా రెహమాన్‌గా మారి, నా సంగీతానికి ప్రేరణ – ఇస్లామే అంటే కాదని ఎవరైనా ఎందుకనాలి? ‘కాచర్ ఇన్ ద రై’ అనే పుస్తకంతో సంచలనం రేపి, స్టేటస్ కోని ప్రశ్నించడం ప్రధాన తత్వంగా రచనలు సాగించిన 20వ శతాబ్ది అమెరికన్ రచయిత – జెడి సాలింజర్ – తాను అద్వైత వేదాంతానికి అనుయాయినంటే – ఎవరైనా ఏమంటారు? ఎవరి నమ్మకాలు వారి ఇష్టం అని తప్ప.
సరే, వ్యక్తిగతమైన మత స్వేచ్ఛ వరకూ అర్ధముంది, సామూహికపరమైన వెసులుబాట్లు ఎందుకు? మత ప్రచారాలు సమాజానికి అవసరమా అనిపిస్తుంది. కానీ ఆప్రశ్న ఇప్పటిది కాదు. మతానికి మనమిచ్చే విలువ ఏమిటన్నది రాజ్యాంగం రాసుకున్నప్పుడే నిశ్చయమైపోయింది. ‘సెక్యులర్’ అనే పదానికి – ‘పాశ్చాత్య సమాజాలలోలాగా, రాజ్యాన్ని మతం నుంచి వేరుచేసి చూడడం’ – అన్న భావన కాక – ‘అన్ని మతాలనీ సమానంగా గౌరవించడం’ అనే అర్ధం చెప్పుకున్నాం. మతానికి దూరంగా ఉండడం – అనేది కాక – ‘అన్ని మతాలకూ సమానావకాశాలు ఇవ్వడం’ అనేదే – మన విధానం అయ్యింది. ఆదిశలో కొంత దూరం వచ్చాక - ఇప్పుడు కేవలం మైనారిటీ మతాలని మాత్రమే ఆప్రశ్న వెయ్యడం తర్కబద్ధం కాదు. 
మనమే కాదు, ప్రజాస్వామ్య భావాలు పచ్చి పచ్చిగా ఉన్న కాలం గనక పాకిస్థాన్ రూపశిల్పి జిన్నా కూడా – వారి రాజ్యాంగ నిర్మాణ సభని ఉద్దేశించి ఇలా మాట్లాడేడు. “… మీరంతా స్వేచ్ఛగా గుళ్లకైనా, మసీదులకైనా మరే ఆరాధనా స్థలాలకైనా వెళ్లవచ్చు. మీరే మతానికి చెందినవారన్నదానితో రాజ్యానికి ఏమీ సంబంధం లేదు ... ఇక నుండీ హిందువులు హిందువులు కారు, ముస్లిములు ముస్లిములు కారు, మత పరమైన అర్ధంలో కాదు గాని రాజకీయ అర్ధంలో వారు కేవలం పాకిస్థాన్ రాజ్యపౌరులు మాత్రమే.” (జిన్నా 1947)
‘మాటలు కోటలు దాటి ఏం ప్రయోజనం, చేతల్లో లేక పోయాక’ - అని నిట్టూర్చి లాభంలేదు. అవి రెండూ ఒక దాన్ని మరొకటి ప్రభావితం చేసుకుంటాయి. మాటలకంత ప్రాముఖ్యం లేదనుకుంటే సెక్యులర్ అనే మాట తొలగించాలనే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది ఇప్పుడు? మైనారిటీ హక్కులన్న మాట వింటేనే మధ్యతరగతికి అంత చిరాకు వస్తోంది? విఐపీ క్యూలో వెళ్లేవారి మీద మామూలు క్యూలోని జనానికి కలిగే అసూయ వంటిది – మెజారిటీలో ఎలా నాటుకుంది? కనక మాటల కున్న ప్రాముఖ్యతని గుర్తిస్తే, గుసగుసలాడుకోడం కాక వాటిని బహిరంగంగా చెప్పడం, చర్చించడమే ఆరోగ్యకరం అని తేలుతుంది.
మత విశ్వాసాలూ, ప్రచారాలని పట్టించుకోని న్యూట్రల్ ప్రజలకి కూడా – న్యాయ పాలనలో తరతమ భేదాలున్నాయని, ‘పర్సనల్ లా’ పేరున ఇస్లాం మతస్థులకు ప్రత్యేక విచారణ చేస్తున్నారని విమర్శ ఉంది. బహుభార్యత్వం, విడాకుల విషయాలు వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. షాబానో కేసులో – భరణం విషయమై – సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు – స్త్రీల పక్షాన ఉండిందనీ; కానీ ఇస్లాం వివాహ చట్టం దానిని సమ్మతించదని – ముస్లిం ఫండమెంటలిస్ట్‌లు పట్టుపట్టడం వల్ల, రాజీవ్ గాంధీ ప్రభుత్వం తోసిపుచ్చిందన్న విషయం - వారందరూ గుర్తు చేసుకుంటారు. ఈ సమస్యకి పరిష్కారం యుసిసి, యూనిఫార్మ్ సివిల్ కోడ్ (పౌరులందరికీ ఒకే చట్టం) - అని భావిస్తారు. 
అయితే రాజకీయంగా ఆ డిమాండ్ ఏ పక్షంవారు చేస్తున్నారన్న దాని మీద, వారి ఉద్దేశాల మీద - దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఆ స్త్రీల కన్యాయం జరిగినందుకు కాక, ఆ పురుషులకి ఉన్న అదనపు సౌకర్యం మాకెందుకు లేదని ప్రశ్నించేవారు గానీ ఆ యూసిసి డిమాండ్ వెనక ఉన్నట్టైతే - మేలు జరక్కపోగా కీడు జరిగేను. ఎందుకంటే – స్త్రీలకి అన్యాయం చేసే చట్టాలు కేవలం ఇస్లాం వివాహ చట్టాల్లోనే కాదు, అన్ని పర్సనల్ లాల్లోనూ రకరకాలుగా ఉన్నాయి. ఆ అసమానతల పట్ల స్త్రీవాదులు ఎప్పటి నుండో మాట్లాడుతున్నారు. ఉదాహరణకి – హిందూ వివాహ చట్టం ప్రకారం – భార్యకి దత్తత తెచ్చుకునే స్వేచ్ఛా లేదు, ఇచ్చే స్వతంత్రమూ లేదు. అసలు వైదిక మతాచారపు తతంగం జరపకపోతే వివాహానికి చట్టబద్ధతే లేదు. 
ఈ ఆధునిక భావాలను చర్చించడం, అర్ధం చేసుకోడం దాకా కాదు, కనీసం గుర్తించడానికి కూడా ఒప్పుకోని హిందూ మత ఆధిక్యవాదులు – యూసిసి అమలుజరగాలని కోరుకోడంలో అర్ధమేమిటి? వారి దృష్టిలో హిందూ లా సర్వోన్నతమైంది కనక – దానినే సర్వ మతస్తులూ పాటించాలని వారి కోరిక. తినే తిండి మీద ఆంక్షలు విధించి, జీవనోపాధి మీద దెబ్బకొట్టి, మైనారిటీ వివాహచట్టాలని మార్చాలని మాట్లాడితే – ఆ సమూహాలకి చెందిన స్త్రీలు కూడా – ఆ వాదనని విశ్వసించలేరు. అన్ని లోపాలనూ ఆధిగమించే వివాహచట్టాలు – తయారవాలంటే, బాధితులైన స్త్రీలు పాల్గొంటేనే జరుగుతుంది. వారి నేతృత్వంలో సవరణలు జరగాలి. 
ఒక వాదనని సమర్ధించే ముందు, పూర్వాపరాలు విచారించుకోవాలి. సంక్షేమ సంస్థల్లోకీ – రాజకీయ ఎజెండాలు చొరబడుతోన్న కాలం కనక ఒకటికి రెండు సార్లు వాటి కార్యాచరణని తరచి చూసుకోవాలి. ఉదాహరణకి, చర్చిల్లో కన్ఫెషన్ అనే ఆచారం వల్ల ఆడవారి మీద లైంగికదోపిడీ జరిగే ఆస్కారం పెరుగుతోందనీ, కనక కన్ఫెషన్ను నిషేధించాలనీ – ‘నేషనల్ కమిషన్ ఫర్ విమెన్’ ఈ మధ్య రికమెండ్ చేసింది. దాని మీద స్వామి అగ్నివేశ్ స్పందన గమనిస్తే దృష్టికోణంలో సమగ్రత ఉండాలని మనకి అర్ధమౌతుంది. రాంపాల్, ఆసారాం, రాంరహీం వంటి నేరస్థులను కూడా కమిషన్ అదే విధంగా ఖండించాలని ఆయన కోరడం – వెనక ఉన్న కారణం అదే. అసమానతల పట్ల విమర్శ – ఒక సమూహాన్ని గురి చేసి ఉంటే, అది తాత్కాలిక రాజకీయ లబ్ధిని ఇస్తుందేమో కానీ శాశ్వత పరిష్కారాలని సూచించదు. 
మైనారిటీ హక్కులు – మెజారిటీవారికి నష్టం చెయ్యవని నమ్ముతూ, యూసిసి అనేది మైనారిటీలకి నష్టం కలిగించని రీతిలో, వారి సమ్మతి సహకారాలతో తయారవ్వాలని కోరుకోవాలి. 

Tuesday, 2 May 2017

మూలింటామె - పై రెండు వ్యాసాలు






 మూలింటామెలో పిల్లుల ముచ్చట:

అరుదైన కథా వస్తువుకు తోడుగా యదార్ధ చిత్రణా, సహజ స్వభావాలతో చరించే పాత్రలూ, రసాలూరే సంభాషణలూ కలిసి పఠనీయతను పెంచితే రచన విజయవంతం అయినట్టే. అదొక పార్శ్వమైతే, మూలింటామెనవల అభిశంసలకూ, సాహిత్య వివాదాలకూ చోటు కల్పించడం కూడా రచనలో ఉన్న భావతీవ్రతకే నిదర్శనం. పైపైన చదివితే, రచయిత స్త్రీల నైతిక వర్తనాన్ని అవహేళన చేస్తున్నారనో, వారి లైంగికతను గురించి అనాలోచిత వ్యాఖ్యానం చేస్తున్నారనో, వివక్షను వ్యవస్థలో భాగంగా చేస్తున్నారనో అపోహ కలిగే ప్రమాదమున్నమాట వాస్తవం. అందుకే అయ్యుంటుంది సుమారు రెండేళ్ళ క్రితం నవల వచ్చినప్పటి నుండీ అటు ప్రశంసలూ, ఇటు విమర్శలూ కూడా పెద్ద ఎత్తునే కురిసాయి.

వాటన్నిటినీ పక్కన పెట్టి, ఒక రచనను సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే - రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో, అది ఎంత వరకూ రచన నుండీ వ్యక్త పరచబడిందో అంచనా కట్టుకోవాలి. కథ యొక్క అర్ధం రచయిత సృష్టించిన కల్పిత ప్రపంచానికీ, కథకు బయట ఉన్న వాస్తవ ప్రపంచానికీ మధ్య ఉన్న సంబంధంలో ఉంటుంది. కథ అర్ధం కావడమంటే సంబంధం అర్ధం కావడమే అని వల్లంపాటి చెప్తారు. నామిని ఉద్దేశాన్ని తెలుసుకోడానికి మూలింటామెలో పిల్లుల ముచ్చట ముఖ్యమైన ఆధారం. ముందు యధాలాపంగా వినిపించే  పిల్లుల ప్రస్తావన, కధనానికి కీలకంగా మారి - అంతకంతకూ తాత్విక స్థాయిని చేరుకుంటుంది.
పిల్లిని చంపడమనే ప్రతీకను వాడి రెండు వేర్వేరు సందర్భాల్లో అతి స్పష్టంగా ఒకే విషయాన్ని చెప్తారు. మూలింటామె చెప్పే కథలో ఒకడిలా అంటాడు: నేను కూనీ జేసి వొక మనిసిని చంపినానే గానీ పిల్లిని చంపలేదే! నేనేం తప్పు జేసినానని? ... నా వొరకూ నాకు పిల్లిని చంపితే పాతకం గానీ మనిసిని చంపితే పాతకం కాదు దొరా!”  అసంబద్ధంగా తోచే వాక్యాన్ని అర్ధం చేసుకోవాలంటే ఒక్క సారి టూకీగా మూలింటామె కథ చెప్పుకోవాలి.

మనవరాల్నే కోడలిగా చేసుకున్న మూలింటామెకి ఆమె పెంచుకునే పిల్లులే ప్రాణం. ఇంట్లో పారాడే పసిబిడ్డలతో సమానం ఆమెకవి. శుక్రవారం సాయంత్రం మనవరాలు, కొనమ్మి- ఇల్లూ, వాకిల్నీ, ఉన్న ఊరినీ, సంసారాన్నీ, అయిదారేళ్ళు మించని కన్నబిడ్డల్నీ సైతం వదిలి కట్టుబట్టలతో వెళిపోతుంది. మాదిగ కులానికి చెందిన  కళాయిలు పోసే అరవతనితో వెళిపోయిందని తెలిసి, మూలింటామె కూతురు నడిపమ్మి, ఆమెను వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ కొనమ్మి తిరిగి రాదు.
తక్కువ కులపు వ్యక్తితో పోయిందనిఊరూ, వాడా ఒక్కటై మూలింటి వారిని కాకుల్లా పొడుచుకు తింటూండగాఅగ్నికి ఆజ్యం తోడైనట్టు భీమవరం నుంచి మూలింటామె అక్క ఎర్రక్క రంగం లోకి దిగుతుంది. ఎర్రక్క సారధ్యంలో ఆమె తోటికోడలు మనవరాలు వసంతతో నారాయుడికి రెండోపెళ్లి చేస్తుంది నడిపమ్మి. ఇదంతా మొదటి భాగమైతేపెళ్ళై వచ్చీ రావడం తోనే వసంత మూలింటిని సమూలంగా కుదిపేసిన వైనం రెండో భాగం.

మూలింటి కొచ్చిన రెండు కష్టాల తారతమ్యాలనూ వివరించడమే నవల ఎత్తుగడ. మూలింటి కోడళ్ళిద్దరూ నారాయుడి విషయంలో మోనోగమీ సూత్రాన్ని అతిక్రమించిన వారే అని స్పష్టం చేసాక, కోణం లోంచీ మూలింటినీ, ఊర్లోని మనుషుల నడవడినీవిశ్లేషించే ప్రయత్నం జరుగుతుంది నవలలో. నీతీ, న్యాయం, బలహీనతలూఇలాటి అమూర్త (abstract) అంశాలను వివరించేందుకుఒకలాగే కనిపించే వాటిని తీసుకోడం, పోల్చి చూపడం ఒక పద్ధతి. ఒక తప్పునూ, దాని పరిణామాలనూ పరామర్శ చేసేందుకు, దానిని మరో సందర్భంలో సెట్ చేసి, కాంట్రాస్ట్ చూపడమనే శిల్పాన్నిశారద రాసిన రక్తస్పర్శ (1963)” కథలోనూ చూస్తాం. కథలో తన నైతిక వర్తనాన్ని ప్రశ్నించిన తమ్ముడు ప్రసాదానికి నేను ఎవర్నీ ఆత్మహత్యల పాలు చెయ్యలేదు, ఎవరినీ మోసం చెయ్యలేదు. కానీ నీ మూలంగా ఒక నిండు ప్రాణం బావిలో పడి విలవిలా తన్నుకుని చచ్చిందిఅని అనసూయ తమ ఇద్దరి తప్పులలో ఉన్న భేదాన్ని ఎత్తి చూపిస్తుంది.  

కొనమ్మి ఇల్లొదిలి పోవడం వల్ల మూలింటికి కలిగిన ఘాతం చిన్నదేమీ కాదు. నామిని మాటల్లో చెప్పాలంటే తెల్లారి గూడా శేరు పాలిచ్చిన పాల గొడ్డు సందేళ కంతా దొమ్మరోగం తగిలి కడుపు వుబ్బేస్కుని చచ్చిపోతే ఎట్టుండాదో అట్టుండాది. అయినా సరే, మూలింటామె పోయే ముందు ఆఖరు మాటగా నా మనవరాలు మొగుణ్నొదిలేసింది. అంతే గాని మియాం మియాం అంటూ నీ కాళ్ళ కాడా నా కాళ్ళ కాడా చుట్టక లాడే పిల్లిని చంపలేదే! అని అంటుంది. దాని మర్మాన్ని కనుక్కోవాలంటే వసంత చంపిన పిల్లుల వైనం తెలుసుకోవాలి.    
 

పనిడిసి పని చెయ్యడంలో ఇక్లామార్కురాలు వసంత. నారాయుడితో పెళ్ళయ్యాక చంద్రారెడ్డి అనే పొరుగూరి వ్యక్తితో బహిరంగంగా సంబంధం పెట్టుకుని ఒక బిడ్డని కంటుంది. అతని ట్రాక్టరు ఎక్కి చుట్టు పక్క ఊళ్లలో పనులు చక్కబెట్టుకుంటూ చక్రం తిప్పుతుంది. మూలింటి చుట్టూ, కయ్యల చుట్టూ ఉండే మొత్తం చెట్లన్నిటినీ ఒక్కసారి కొట్టించి అమ్మేస్తుంది. డబ్బుతో ఇంటి ముందు కిరాణా కొట్టు పెడుతుంది. చీరలూ, రవికలూ అమ్ముతుంది. చీటీలు వేస్తుంది. పక్క ఊళ్లలో తండల్ వ్యాపారం చేస్తుంది. స్థిరాస్తిని చరాస్తిగా మార్చుకుని, మదుపు పెట్టి రకరకాలుగా ఊరివారి జీవితాలను అదుపు చేయగల శక్తీ వీలూ చిక్కించుకుంటుంది. ఇందులోని చిత్రమేమిటంటే ఆమె నోరెత్తి అడగాల్సిన అవసరం కూడా లేకుండా ప్రజలు వాళ్ళంతట వాళ్ళే  ఆమెకు మద్దతు నివ్వడానికీ, సహాయ పడడానికీ  పోటీలు పడుతూండడం!

ఈమధ్య కార్ల కంపెనీ వాళ్ళదొక అడ్వర్టయిజ్ మెంట్ వస్తోంది. అపుడే పుట్టిన తన బిడ్డను చేతిలోకి తీసుకుంటాడు తండ్రి. కళ్ళల్లో ఆనందం. తర్వాత వెళ్లి కొత్త కారును నడపడానికి కూర్చుంటాడు. అదే అనిర్వచనీయమైన అనుభూతిట! మనుషుల మనసును వారికి తెలియకుండానే తాకగలిగే సెంటిమెంట్లను ఏరుకోడం, వాటిని వాడుకుని తమ అమ్మకాలు పెంచుకోవడం ఆధునిక వ్యాపారానికి ప్రాధమిక సూత్రం అని అందరికీ తెలిసిందే. పనికి స్వయంగా సెంటిమెంట్ లుండే అవసరం లేదు. ఒక గాట నుండిన దాపటెద్దునూ, వలపటెద్దునూ వేరు చేసి వేడుక చూడకూడదనే అతి పురాతనమైన సెంటిమెంటును కూడా లెక్కించకుండా, రెండు ముసలి ఎద్దులనూ చెరో ఊళ్లోనూ అమ్మేసిన ప్రాక్టికాలిటీ వసంతది. కానీ అదే వసంత సమయానుకూలంగా చంద్రారెడ్డినీ, నారాయుడ్నీ కలిపి అన్నాదమ్ముల సెంటిమెంటునూ; ఎర్రక్కనూ, మూలింటామెనూ కలిపి అక్కాచెల్లెళ్ళ సెంటిమెంటునూ పండించాలనుకోడం, ముదిగారం కురిపించడం చూస్తే, మన వాణిజ్య ప్రకటనలను తయారు చేసే మేధావులకే వసంత పాఠాలు చెప్పగలదని తేలుతుంది.

వీటన్నిటి కంటే ఆమె వీరవిహారం చూడాల్సింది నారాయుడి మీద. మూలింటి పేరే అంగిడిల్లుగా మారిపోయినట్టు నారాయుడి అస్తిత్వాన్నే నామరూపాలు లేకుండా మార్చేస్తుంది. చెట్టూ, పుట్టా, గొడ్డూ, గోదా సర్వం అమ్ముకుని తనకంటూ పని లేకుండా చేసుకోడం, మోటార్ సైకిల్ మీద వసూళ్లు చేసుకు రావడం; భార్య మరో సంబంధం పెట్టుకోడానికి నిరాకరించక పోవడం; ముగ్గురూ కలిసి ఇంట్లో మద్యం తాగడంఇలాంటివన్నీ అతని స్వవిషయాలు గానో, అనివార్యంగా ఏర్పడుతున్న సమాజ పరిణామాల్లో భాగంగానో జమ కట్టుకోవచ్చేమోఅవి నారాయుడు తాను స్వచ్చందంగా నిర్ణయించుకున్నవైతే!

corrupt చెయ్యడం వసంత వ్యూహమనడంలో సందేహం లేదు, విషయంలో నారాయుడికీ పిల్లులకీ సామ్యం కనిపిస్తుంది. మూలింటామె పెంచిన పిల్లులు వసంత పెట్టే కోడి మాంసం వాసనకు తోకూపుకుని ఆమె చుట్టూ తిరిగినట్టే, నారాయణ వసంతకు దాసానుదాసుడై పోతాడుకొనమ్మి నారాయుడ్ని వదిలెయ్యడం 'మనిషిని చంపడం అయితే, వసంత చేసిన పని పిల్లిని చంపడం! ఒకడి అసమర్ధతను ఆసరాగా తీసుకుని, వాడి జీవితాన్ని స్వాయత్తం(take over) చేసుకుని, వాడిని తన ఉపకరణం (tool)గా మార్చుకోవడం. దానినే నామిని పిల్లిని చంపిన పాతకంగా వర్ణించేది. నారాయుడు కానీ, మరెవరైనా కానీ వ్యతిరేకత చూపనంత కాలం పాతకం - ‘నేరం అనే రూపం తీసుకోదు
       
పిల్లి పిల్లల్ని చంపడం మూలింటామెను నిర్బంధించడమే (coercion). అంతవరకూ ప్రతీకాత్మకంగా ఉన్న పాతకంవాస్తవంగా మారడమన్నది రచయితకు తాను దర్శించిన జీవితసత్యం మీద ఉన్న అవగాహనను సూచిస్తుంది.

మార్పు యొక్క సూక్ష్మరూపం అనేది - నలుగురితో పాటూ మారే వారిని వందమందిని చూసినా తెలియరానిది, మార్పుకు తలొగ్గక ఎదురు నిలిచిన వారి చరిత్రలోమనకు వేయింతలు విచ్చుకుని కనిపిస్తుందిఎదిరించే వారు లేనంత కాలం, అన్యాయం దాని అసలు రూపంతో బయటకు వచ్చే అవసరమే లేదు. మన ఇష్టంతో, మన వేలితో మన కన్నే పొడుచుకోవడంఒక సహజ పరిణామమని మనల్నేనమ్మించెయ్యగలదు. అలాటి వసంత జైత్రయాత్రకు ఎదురైన ఒకే ఒక్క ఆటంకంమూలింటామె. మూలింటామె అలయన్సును పొందే ప్రయత్నాలు వికటించాక, గత్యంతరం లేకనే వసంత  చాణక్యంక్రైం రూపం తీసుకుందిస్వంత లాభమంటే  లెక్కలేని (eccentricity) తిక్కలేవో ఉన్నవారే బలవంతపు అభివృద్ది వాదులకు కొరుకుడు పడరని నామిని చెప్పక చెప్తున్నారు! మూలింటామె వ్యక్తిగత అనుభవానికున్న విశిష్ట సామాజిక కోణం యిది. ఆమె కథ నవలగా మారదగ్గ కథ అయ్యేదందుకే.      
      __________________________________________________
నెత్తవ గల తల్లి మూలింటి మొదుటామె:
“పుస్తకం, వనితా, విత్తం పరహస్త గతం గతం
“ఇంటి కోడళ్ళు తిన్నా కోళ్ళు తిన్నా వృధాగా పోదు.”  
“రౌతు కొద్దీ గుర్రం!
ఈ వాక్యాల్లో అంతర్లీనంగా ఒక భావజాలం ఉంది. ఆడవాళ్ళను పెంపుడు జంతువుల్లా, కదిలే ఆస్తిలాగా చూడ్డం అనేది వాడుక భాషలోంచీ తొంగి చూస్తున్న సందర్భాలు ఇవి. విడివిడి వ్యక్తుల అనుభూతుల్లో, ప్రత్యక్ష – పరోక్ష అనుభవాల్లో సంతరించుకున్న సమాచారాన్ని అందరికీ  అందుబాటులోకి తెచ్చే సాధనంగా భాష వ్యవహరిస్తుంది. ‘మూలింటామె’  లోని భాషను ఈ కోణం లోంచి పరిశీలిస్తే సమాజంలోని స్త్రీల స్థానం గురించిన సమాచారం మనకు చాలా దొరుకుతుంది. దానికి కారణం - నవలను రాసిన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు తాను చూసిన ప్రపంచాన్నీ, అందులోని మనుషులనూ, వారి అంతరంగాలనూ - యధాతధంగా రికార్డు చేసి మనకందించడమే.  

మూలింటామె కథ చదువుతూంటే ఆడవారి పట్లా, నిమ్నవర్ణాల పట్లా  వ్యక్తమౌతున్న వివక్షను చూసి కొందరికి సందేహం రావొచ్చు, యిది కొన్ని వందల ఏళ్ల క్రితం కథ కాదు కదా అని. ఎందుకంటే  కుల మత జాతి లింగాలకు అతీతమైన రాజ్యాంగం మనది, రాసుకుని అరవై ఏళ్లయ్యింది కూడా. కాగితాల మీద రాసి ఉన్న హక్కులు ప్రజల జీవితాల్లో, భావజాలాల్లో ఏపాటి మార్పును తీసుకు రాగలిగాయో మనకు అద్దంలో పెట్టి చూపించగలదు ఈనవల. ఈనాటికీ, దేశంలోని అన్ని పల్లెటూళ్ల లోనూ చిన్నాపెద్దా తేడాలతో వివక్ష పాతుకుపోయి ఉందని గుర్తించి కథలోకి వెళ్లాలి, లేదంటే నవల అర్ధమే కాకపోవచ్చు. “నీ మొగుడు చేసిన బాకీలకి కూలికి పొయ్ చెల్లబెట్టే దానికి నీకు మున్నూటరవై రోజులూ చాలవే పాపం” అన్న కొనమ్మి మాటలు తలుచుకుంటుంది గురివి. కటిక పేదరికానికి తోడు కులం కూడా వారినెలా అణచివేతకు గురిచేస్తుందో మాల గురవమ్మ మాటల్లో తెలుస్తుంది. “... తలగొట్టేసి వొకటి సగంగా గొలుస్తారే గానీ మాలదానికి చేతికి కుంచమిచ్చి కొలుచుకోమంటారా” అన్న ప్రశ్నలో బడుగు వర్గాల వాస్తవస్థితి కళ్ళకు కడుతుంది.

అలాటి సమాజంలో ఉంటూ కూడా, ఆ విలువలకు భిన్నమైన లక్షణాలతో ఉన్న మూలింటామె కథ యిది. ఊరిలో ఒక మూలగా విశాలమైన ఆవరణతో ఉన్న ఇల్లు కుంచమమ్మది. ఇద్దరు పిల్లలు నారాయణ నాయుడూ, మొగిలమ్మానూ. వాళ్ళు పసివారుగా ఉన్నప్పుడే  ఆమె భర్త పోయాడు.  మొగిలమ్మకు పెళ్ళయినా, ఆమె కూడా భర్తను పోగొట్టుకుని, పసిబిడ్డ రూపావతిని తీసుకుని పుట్టింటికే చేరుతుంది. రూపావతి పెద్దయ్యాక ఆమెని తన అన్న నారాయుడికిచ్చి పెళ్లి చేస్తుంది మొగిలమ్మి. మూలింటిలో ఉండే మూడు తరాల స్త్రీలనీ మొదుటమ్మీ, నడిపమ్మీ, కొనమ్మిగా పిలుస్తారు ఊరిలో వాళ్ళు. మూలింటామె మనవరాలి కిద్దరు పిల్లలు. అయిదారేళ్ళ వయసున్న ఆ మునిమనుమల తోనూ, పెంచుకుంటున్న పిల్లులతోనూ నిశ్చింతగా మూలింటామె జీవితం సాగుతూ ఉంటుంది.  

ఉన్నట్టుండి ఒకనాడు, గిన్నెలకు కళాయిలు పోసే అరవ మాదిగతన్ని కావాలనుకుని కట్టుగుడ్డలతో రూపావతి ఇల్లు వదిలిపోవడం, ఊరు ఊకుమ్మడిగా మూలింటి మీద విరుచుకు పడడం, నారాయుడికి వసంతతో రెండో పెళ్ళీ వరసగా జరిగిపోతాయి. అత్తగార్ని తనకు అస్మదీయురాల్ని చేసుకోవాలని వసంత పెళ్ళైన రెండో రోజు నుండే ప్రయత్నాలు సాగిస్తుంది. మూలింటామె తప్ప మిగిలిన వారంతా ఆమెకు వశ్యులే.

                ***                      ***                       ***

అన్ని కులాలూ సమానమేననీ, స్త్రీ పురుషులు సమానమేనని నమ్మే ‘చైతన్యం’ మూలింటామె పాత్రకు లేక పోయినా, ఈ వివక్షల కతీతంగా మనుషులను ప్రేమించగల మానవత్వం ఆమె ప్రత్యేకత. పాతకాలపు భావాల్లో ఉన్న మనిషే కానీ కరుణనూ, దయనూ నింపి ఆమెను నామిని సృష్టించారనిపిస్తుంది. ఈ గుండాంలో తాడు తెంపేసిన ముండ మోపులు దీపిం కింద చలవ బెట్టాల్సొస్తా వుండాది అని ఆమె బాధపడుతున్న మాట నిజం. అయినా తన కొడుకును వదిలి వెళ్ళిపోయిన మనవరాల్ని కడుపులోనూ, నోట్లోనూ పెట్టుకుంటుంది. ‘కళాయోడు కూడా మనోడే గదా, వోడు బాగుంటేనే గదా వోడి దగ్గరుండే మన బిడ్డి బాగుండేది’ అనుకోగలిగే పెద్దమనసు.

రచయిత తనకు పాత్రను గురించి ఉన్న అభిప్రాయాన్ని పాఠకుడికి కూడా కలిగించడానికి అనేక శిల్ప పద్ధతుల ద్వారా ప్రయత్నిస్తుంటాడు. అలాటిదే మూలింటామెకున్న పిల్లుల పిచ్చి. మునిమనవలతో సమానంగానో, ఇంకా చెప్పాలంటే కొంచెం ఎక్కువగానో ఉన్నట్టు తోస్తుంది ఆమె మక్కువ. బిడ్డ లిద్దరినీ కన్న రోజుల్లో వక్కాకు నమిలే అలవాటు ఉండేదట. భర్త పోయాక,  పిల్లుల్ని చేరదీసినాక మళ్ళా వక్కాకు జోలికి పోలా, వక్కాపొవ్వాక్కు పెట్టే రూకతో కోడిగుడ్డో, వుప్పుచేపో తీస్కుంటే పిల్లులు పిరింగా తింటాయనిపించి. వారానికోసారైనా పిల్లులకు నీసు పెట్టడం కోసం   వక్కాకు నమిలే అలవాటును కూడా ఆమె మానుకుంటుంది.

తనకు లాభం కలిగించగలిగిన వాటిని మాత్రమే ప్రేమించేవారున్న ప్రపంచంలో, ఏ మాత్రం తిరిగి ఉపయోగపడని వాటిని – ప్రేమించడం అనేది ఒక రకమైన ఉన్మాదం లాగా కనపడుతుంది. భూమి మీదా, చెట్టూ పుట్ట మీదా ఆమెకున్న బంధానికీ, దురదృష్టవంతుల పట్ల ఆమె ‘నెత్తవ’కూ – ఆ ‘పిల్లుల పిచ్చి’ ఒక ప్రతీకగా భావించవచ్చు.

వసంత ముందు నుంచీ ఆలోచించుకు వచ్చిందో, లేక నారాయుడి మెతకతనం ఆమె నందుకు పురిగొల్పిందో తెలీదు కానీ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. చెట్లన్నిటినీ కొట్టించి అమ్మేస్తుంది, ఆ డబ్బుతో రకరకాల వ్యాపారం చేస్తుంది. నిస్సంకోచంగా పరాయి మగవారితో సంబంధాలు పెట్టుకుంటుంది. ఊరంతటికీ నాయకురాలౌతుంది.
         
             ***                             ***                               ***

కథను టూకీగా చెప్పుకున్నా - ఒక విషయం స్పష్టం అవుతూ వస్తుంది. మూలింటి కోడళ్ళిద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నవాళ్ళే. వారిలో ఒకరి మీద ఊరు కత్తి కట్టడం, మరొకరిని నెత్తిన పెట్టుకోడం ఎందుకు జరిగిందన్నది ప్రశ్న. దాని గురించిన  చర్చ నవలలో జరుగుతుంది.

నిమ్న కులం వ్యక్తి  అగ్రవర్ణం స్త్రీని చేసుకున్నాడన్న ద్వేషం ఊరివారికి ఉండనే ఉంది. అది స్పష్టంగా ఊళ్ళో జనాల నోటి వెంట వినిపిస్తూ ఉంటుంది. కులమన్నది ఆ మనుషుల నరనరాల్లో జీర్ణించుకు పోయి ఉంది. ప్రేమనీ, గౌరవాన్నీ వర్ణించుకోవాలన్నా, ఆ ఉపమానం కూడా కులంతో కలగలసి ఉండడం మన దౌర్భాగ్యం. ‘బాపనోళ్ళ బిడ్డి మాదిరిగా చూసుకుంటిమి గదే!’ అని మనవరాల్ని తలుచుకుంటున్న మూలింటామె ఏడుపులో నామిని ఆ కోణాన్నిచూపిస్తారు. దానితో పాటూ కొనమ్మి కుటుంబం మీద ఊరివారి వైరాన్ని గమనించాలి. స్త్రీని ఒక గొడ్డులా భావించి, ఆమెను అదుపు చెయ్యనందుకు ఆ స్త్రీ కుటుంబాన్ని శిక్షించాలన్న వాదన సైతం వినిపిస్తుంది.
నీ గాట్లో దొంగ కూలిపొయ్ న గొడ్డొకటుందనుకో. నువ్వేం చెయ్యాల? మంచి పగ్గమేసి గుంజకు కట్టేయ్యాల. అట్ట గాకుండా నువ్వు కట్టెయ్య కుండా దాన్ని కొట్టాంలో యిడిసి పెట్టేసినావనుకో ఆ దొంగ గొడ్డు ఏం జేస్తిన్ది? పొట్ట కరుకు మిందుండే వరి మళ్ళో పడి సపాయిగా తొక్కి మేసేస్తింది. తప్పు దొంగ గొడ్డుదా, దాన్ని కట్టేయ్యనోడిదా?” అని ఊరి పంచాయితీలో మొలకమ్మ మాట్లాడడం అతిశయోక్తిగా కొంతమందికి తోచినా సమాజంలో ఆ ధోరణి ఉందని గుర్తించక తప్పదు.

ఆ పంచాయితీ దృశ్యాన్ని నామిని వర్ణించిన తీరులో స్త్రీల ఆలోచనలు సంకుచితంగా ఉండడానికీ , వారి ప్రవర్తనకీ మధ్య ఒక సంబంధం కనిపిస్తుంది. ‘మొగోళ్లందరూ గుడి చుట్టూ బండ రాళ్ల మిందా కుచ్చోనుంటే ‘ఆడవి’ మాత్రం యిండ్ల గోడలకు యీపు లానించుకోని, మూతుల మింద చేతులేస్కోని నిలబడుకోనుండాయి.’ ఆడవాళ్ళు అనకుండా ఆడవి అనడంలో అసంకల్పితంగా మనుషుల బదులు జంతువులు స్ఫురణకి రావడంతో – పరిస్థితి ఎంత అవమానకరంగా ఉందో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.   

కులం, లింగం - ఈ రెండు వివక్షలూ కాక ‘స్త్రీల నైతికత’కు సంబంధించి మొలకమ్మ నోటి వెంట ఒక దారుణమైన వాస్తవాన్ని వినిపిస్తారు నామిని. స్త్రీ తనంతట తాను, తన శరీరం కోసమో, మనసు కోసమో – శారీరక సంబంధం పెట్టుకుంటే అది పాపం అని సమాజం ఖండిస్తుంది. కానీ ఆ సంబంధం - తన స్వలాభానికో, తన వారికి లాభం చేకూర్చడానికో  పెట్టుకుంటే మాత్రం – సమాజం ఆ ‘తప్పు’ను కప్పి పుచ్చుకుంటుంది. ఒక ‘రెడ్డి’ని ఆకట్టుకున్న వసంత చాకచక్యానికి ముచ్చట పడుతూ, ఆ చంద్రారెడ్డిని అదుపులో పెట్టుకోలేకపోడం అతని భార్యదే లోపమని ప్రచారం చేస్తుంది ఊరు. నీ మొగుడు నీ దగ్గర శుద్ధం లేకనే గదా నీకాడ గాకుండా యింగొకరి కాడి కొచ్చుండేది! అని భార్యని అడిగే రెండు నాలికల మనుషుల గుట్టు రట్టు చేస్తారు నామిని.

సహజమైన వాంఛ కారణంగా ఏర్పడ్డ సంబంధాల తృణీకరణా, స్వప్రయోజనాల కోసం ఏర్పరుచుకున్న సంబంధాలకు సమర్ధనా – ఇదీ ఈనాటి సమాజంలో మనకు కనిపిస్తున్న కపట గౌరవాల రహస్యం.  
                     ***                        ***                              ***
ఈ ద్వంద్వ నీతులకు విరుద్ధమైన స్వభావంతో మూలింటామె పాత్ర ప్రవర్తిస్తుంది. నీతీ, న్యాయాలకు సంబంధించి ఆమె పరిభాష పూర్తిగా వేరు. పాత బట్టలను దొంగిలించాడన్న నేరానికి ఒక బలహీనుడ్ని గుంజకేసి కొడుతూంటే ఆమె గుండె చెరువౌతుంది. ఊళ్ళో మొగోళ్ళు మాత్రం ఎందురు – చేన్ల కాడుండే పారా, గెడ్డ పారా దొంగిలించకపోయ్ నాటా రంగింట్లో యిచ్చేసి సారాయి తాగేసి రాలేదు! ఈదల్లో ఆడోళ్ళు పొనుకొనుంటే రేత్తిర్లు తాళి బొట్లు తెంపక పోయే ఆడ దొంగల్లేరా మనూళ్ళో! ఊళ్ళో దొంగల్ను యే పొద్దన్నా కరెంటు పోలుకు కట్టేసినారా?” అని ప్రశ్నిస్తుంది.

మూలింటి మొదుటమ్మి మనసు తెలిసిన నేస్తం గురవమ్మ. కొనమ్మి వెళ్ళిపోయిందని తెలిసి, అన్ని కష్టాలు తెలిసిన బిడ్డికి ఎంత కష్టమొచ్చి పడిందమ్మా అని విలవిల లాడుతుంది. ఏనాడో కొనమ్మి దగ్గర తీసుకున్న వొడ్లకు గానూ, కోడిపుంజు నొక దాన్ని గురివి తెచ్చి మూలింటామె కిస్తుంది. ఊరందరూ కక్ష కట్టి సాధిస్తున్నా, చల్లని నాలుగు మాటలు మాట్లాడి మూలింటామె ప్రాణం తెరిపిన పడేస్తుంది. ఆ పుంజును తన అక్క ఎర్రక్క కోసం వండేటప్పుడు, తన పిల్లులతో పాటూ గురివి కూడా తినాలని మూలింటామె మనసు తహతహ లాడుతుంది.

గొర్రెల మధ్యనే పుట్టి, కాస్త అవతలి వారిపై ఆధిక్యత చూపే అవకాశం వస్తే వదులుకోని పొట్టేళ్ల వంటి మనుషులంటే మూలింటమ్మెకు  విరక్తి. ఆ వ్యక్తి స్వంత అక్కే అయినా, ఆమెతో మానసికంగా సంబంధం తెంచుకునే ఉంటుంది. ఆ ఎర్రక్క తత్త్వం గురించి గురివితో ఇలా చెప్తుంది-‘మంచీ చెడ్డా తెలవకుండా అదవగా తిరిగే నా బోటి నీ బోటి గొర్రిల్ని కొమల్తో పొడస్తా తిరగతా వుంటాది’.

మూలింటామె యాడ బాద పెట్టుకుంటాదో అని గురివి ఆరాటం – అందుకే మూలింటక్కా! బూమ్మింద కేర్ మని పడినప్పుట్నుంచీ యిట్టాంటి మాటలే యింటూండా. మీ అక్క అన్న మాట్లకి నేను బేదం బెట్టుకోను. ఈ జలమ్మ కింతే!” –. అని సద్ది చెప్తుంది. వివక్ష తప్పని తెలుసుకుని, మానుకోడమే ఒక అచీవ్ మెంట్ అని సభ్య సమాజం భావిస్తూ ఉంటుంది. కానీ ఆ పరిజ్ఞానమేదీ లేకపోయినా - కమ్మ కులపు మూలింటామెకీ, మాల కులపు గురివికీ ఏర్పడిన స్నేహం స్థాయిని అందుకోడానికి  ఇంకా ఎన్ని తరాలు గడవాలో మరి.
              
              ***                          ***                           ***
తనకో న్యాయం, పరులకో న్యాయం అనే హిపోక్రసీకి మూలింటామె చాలా దూరం. లైంగికత గురించి కూడా తనదైన పారదర్శకమైన ధోరణిలో మాట్లాడుతుంది: తన భర్త పోయి బిడ్డలు పసివారుగా ఉన్నప్పుడు, పక్కింటి చెంగముని ‘ఎద్దులకు మడక్కట్టి దున్ని’ సేద్యంలో తనను ఆదుకున్నాడనీ, అతనితో తనకు సంబంధం ఉండిందనీ ఒప్పుకుంటుంది. కనక వసంతకూ, చంద్రారెడ్డికీ ఉన్న సంబంధం కారణంగా ఆమె వసంతను దూరంగా ఉంచిందనుకోలేం.  వసంత లోని వ్యాపారదృష్టిని ఆమె మొదటి చూపు లోనే పసి గట్టి ఉంటుంది. ఎంత తప్పించుకుని తిరిగినా వసంత వేటు ఆమెపై పడనే పడుతుంది. అన్నిటికీ తల వొంచుతుంది కానీ భూమిని అమ్మేందుకు మాత్రం మూలింటామె సమ్మతించదు. చివరకు ప్రాణాల్నే విడుస్తుంది. కథకుడి స్వరం తటస్థంగా మొదలై, మూలింటి మీద ఊరి వారి ఆరళ్ళకు సానుభూతి చూపుతూ, క్రమంగా వసంత ‘కాండ’ల వర్ణనలో వ్యంగ్యాన్ని నింపుకుంటుంది.

‘ప్రపంచమంతా ప్రతీకల మయం. దానికి ప్రతిబింబంగా తయారయ్యే సాహిత్యంలో ప్రతీకలు బలవత్తరంగా వికసించుకుంటూ సార్వజనీనమైన సత్యాల్ని పట్టుకుంటాయి’ అంటారు మధురాంతకం నరేంద్ర ‘కొండ కింద కొత్తూరు’కు ముందుమాటలో. వసంత లాభార్జనకూ, మూలింటామె మానవత్వానికీ చుక్కెదురవడం సహజ పరిణామం. ఆమెకింకే మోహమూ మిగిలి లేదు కనక ఆ పిల్లుల్నే ఉపయోగించుకుని మూలింటామెను లొంగదియ్యాలని వసంత పధకం. కానీ మూలింటామె ఆత్మస్థయిర్యం అనూహ్యంగా ఉంటుంది: ‘యిప్పుడు నిండా కటీనురాలై పొయ్యింది మొదుటిది. చచ్చిపోయిన పిల్లి పిల్లల్ని చేటలో యిసిరిపారేస్తా వుండినా – కండ్లల్లో నీళ్ళుపెట్టుకోకుండా తోడబుట్టిన అక్కకు చేతులెత్తి దండబెట్టి నోరు తెరవకుండా కండ్లు మూసుకొని యెగతాళి పడతుండాది’. అన్ని పిల్లుల్నీ చంపకుండా ఒక రెండు పిల్లి పిల్లల్నే చంపడంలో – వసంత బెదిరింపూ, మూలింటామె తెగింపూ చూసి రచయిత కూడా దిగ్భ్రాంతి చెందేరా అన్న భ్రమ కలుగుతుంది. మూలింటామె చేత సంతకం చేయించేందుకు వసంత ప్రయోగించిన సామ దాన భేద దండోపాయాలను చూస్తే భూ - సేకరణ, సమీకరణ, ఆక్రమణల్లోని హద్దులు అస్పష్టమౌతూ కన్పిస్తాయి.

మూలింటామెది ఒంటరిపోరాటం అయినందుకు మనకు అంతు లేని దుఃఖం కలుగుతుంది. ఆమె కూతురు నడిపమ్మి పేరుకు తగ్గట్టూ నడుమనే ఉంటుంది – ఏ పక్షానా చేరకుండా. ఆ ఇంటిలోనే పుట్టినా, ఆ పొలంలో జీవితమంతా పని చేసినా – కూతురు గనక ఆ ఆస్తిపై ఏ హక్కూ లేని గాలి జీవితం ఆమెది.

స్వంత కూతుర్నే తలుచుకోకుండా మనసు రాయి చేసుకుంటుంది ఆ నడిపమ్మి. మనం గాని ఆ యమ్మిని కడుపులోనే గాని పెట్టుకున్నా మంటే యింట్లో వుండే లేదర పిల్లకాయల్ని కూడా సాక్కోలేము, సదివించు కోలేము అనేది ఆమె భయం. ఊరివారి మాటలంటే భయం, వసంతను ఎదిరించాలంటే భయం – అందుకే ‘తప్పించుకోని తప్పించుకోని తిరగతుండాది’. బలం గల వసంత మీది మోజుతో రంజకం, మొలకమ్మి ఆమె పక్షాన చేరడం మనకు బాగానే  అర్ధమౌతుంది. కానీ ఏ ఆసరా లేని నడిపమ్మి వంటి బడుగు ప్రాణులు 'భయపడి' తటస్థంగా ఉండడం కన్నా- మూలింటామె వెంట నిలవడమే శ్రేయస్కరం అనిపిస్తుంది.
                                          
                  ***********************************