Friday 12 July 2019

రక్షక కవచాలు


Published in  Matruka, May 2019



20 మందికి పైగా విద్యార్ధుల ఆత్మహత్య – ఒక్క సారి ఉలిక్కిపడే వార్త. నిజమే –  అలా అని ఇది హఠాత్ పరిణామమా అంటే – కానే కాదు. ప్రతీ సంవత్సరం – ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ కలిపి - 100 మందికి పైగా జూనియర్ కాలేజీ విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత మందికి గుర్తుందో తెలీదు కానీ  నిన్న కాక మొన్న 2017లో, కేవలం సెప్టెంబర్ – అక్టోబర్ నెలల మధ్యలో – 50కి పైగా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారని లెక్క తెలిసింది. 
భరించలేనంత దుర్గంధం - గుప్పున ఇప్పుడు ముఖం మీద కొట్టినట్టౌతోంది కానీ – అది కుళ్లడం మొదలై చాలా కాలమైంది. 2001లోనే - విద్యార్ధుల ఆత్మహత్యల ఉదంతాలను మీడియా బయటపెట్టగా –  అప్పటి విద్యామంత్రి ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ హెడ్ - ప్రొఫెసర్ నీరద రెడ్డి  -
మనుషులని హైజాక్ చేసి కాన్సంట్రేషన్ కేంపుల్లో పెట్టినట్టున్నాయి జూనియర్ కాలేజీలు!!’ – అని తమ నివేదికలో హెచ్చరించారు. పరిస్థితిని మెరుగు పరచడానికి తాము చేసిన సూచనల్లో ఒక్కటి కూడా - ఈనాటికీ పాటించబడలేదని ఆమె చెప్పడం గమనించాల్సిన విషయం.  
మన విద్యా వ్యవస్థలోని భారీ వైఫల్యాన్ని అర్ధం చేసుకుంటూనే – ఆత్మహత్యను దానికదే పెను సమస్యగా గుర్తించవలసి ఉంది. 2004లోనే - యుద్ధాలు, హత్యల కంటే – ఆత్మహత్యల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారని రూఢి అయింది. నానాటికీ ఆసంఖ్య పెరుగుతోనే ఉంది.  ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ అతి పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారింది. 10 సెప్టెంబర్ – ఆత్మహత్యలని నిరోధించే దినం అని ప్రపంచారోగ్య సంస్థ WHO - నిర్ణయించింది. దానికి మానసిక, సామాజిక శాస్త్రజ్ఞులతో సర్వేలూ, పరిశోధనలూ, కార్యక్రమాల రూపకల్పనలూ – ఇవన్నీ చాలా సాగుతున్నాయి. వాటన్నిటిలోంచీ బయటపడిన ఒక సత్యం ఉంది. అది - మనం తెలుసుకోవలసినదీ, నమ్మి ఆచరించదగ్గదీను. అదేమిటంటే – ఈ ఆత్మహత్యలన్నీ – ప్రతీ ఒక్కటీ – మనం నివారించగలిగినవే అని. దాని కోసం నిపుణులంతా ఏకగ్రీవంగా అంగీకరించిన మార్గాలు రెండున్నాయి:
అవి – 1.
self-esteem, వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం; 2. social connectedness, వారిని సమాజంతో ముడివేసే బంధాలని పునరుద్ధరించడం.        
ఆ రిపోర్టులోనే మరో ఆందోళన కలిగించే విషయం బయటపడింది. ఆత్మహత్యల గణాంకాల రేటు వ్యక్తుల వయసుతో పాటు పెరగడం సాధారణం. కానీ ఆ ధోరణులు, 15 -25 వయోపరిమితి వారి మధ్య విపరీతంగా పెరగడం కనిపించింది. ప్రత్యేకించి యువత మీద, అదీ మన దేశంలో అయితే - విద్యార్ధుల మీద, పోటీ అనేది మోయలేని బరువుగా మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
దీని పరిష్కారం సామాజికంగానే జరగాలి. ఆటలూ, వాటి కోసం క్రీడాస్థలాలూ, డిబేటింగ్ సొసైటీలూ, సైన్స్ ప్రదర్శనలూ, లిటరరీ క్లబ్బులూ, విద్యార్ధి సంఘాలూ, వాటి ఎన్నికలూ, మోడల్ పార్లమెంట్లూ, ఎక్స్ కర్షన్లూ, స్టడీ టూర్లూ – ఇవన్నీ విద్యకి సంబంధించిన పదజాలమేనని – తల్లిదండ్రులూ, టీచర్లే మరిచిపోయారు. వాటన్నిటి మధ్యా పెరిగిన పిల్లలు – ప్రశ్నించే కుతూహలంతో, ఆటుపోట్లని ఎదుర్కునే స్థైర్యంతో, భవిష్యత్తు మీద ఆశలతో, కలలు నిండిన కళ్లతో – దృఢంగా ఎదుగుతారు. అవన్నీ విద్యార్ధికి కనీస అవసరాలని పెద్దవారికే తెలియదు.  ఇక వాటి కోసం విద్యా సంస్థలని నిలదీసేదెవరు? అవేవీ లేకుండా స్కూళ్లు వారినెలా వంచిస్తున్నాయో – పిల్లలే కనుక్కుని తిరగబడతారేమో ... మరి. ఆలోటును గుర్తిస్తూనే, అది పూడ్చుకునే లోగా – మనం పిల్లల కోసం – ఏం చెయ్యగలమో చూడాలి.   
          ***************                                 ****************         
ప్రతి ఒక్కరి జీవితం, దేనికదే ప్రత్యేకం, అయినా ఆత్మహత్యకి తలపడిన వారందరి మానసిక స్థితిలోనూ ఒక ఉమ్మడి అంశం ఉంటుంది – అదే – ఓటమి, తాము వ్యర్ధులమన్న భావం. వ్యక్తిత్వం పూర్తిగా  రూపొందని వయసులో న్యూనత ఒకసారి వారిలో చేరిందంటే –  రోజురోజుకీ వారిపై దాని పట్టు బిగుస్తూ ఉంటుంది.  ఈ నేపథ్యంలో, తీవ్రమైన ఒత్తిడికి గురైన పిల్లలు మానసికంగా ఒంటరులై నలుగుతూ ఉంటారు. తమ ఆప్తులకు కూడా మనసులోని మాట చెప్పుకోలేరు. భరించలేని నిరాశా, నిస్పృహలు ఆవరించిన క్షణంలో – ఆత్మహత్య వారికి ఒక విడుదలగా తోస్తుంది.
కేవలం తల్లిదండ్రులే కాకుండా, కుటుంబ సభ్యులూ, టీచర్లూ, బంధువులూ, స్నేహితులూ, ఇరుగుపొరుగువారూ, పరిచయస్థులూ – ఇలా  ఏ స్థాయిలోనైనా – మనం చెయ్యగలిగేది ఎంతో కొంత ఉంది. నదిలో నీరు కలుషితమై పోయి వ్యాధులు ప్రబలుతూంటే – ఇళ్లలో మనుషులకి కుండల మీద మూత లుంచుకోండి, తినే ముందు చేతులు కడుక్కోండి – అని ఇచ్చే సలహాల్లా  ఇవి కనిపించినా – మన పిల్లల జీవితాల సమస్య కనక – మనకు చేతనైనంతా - తక్షణమే చేసుకుతీరాలి, తప్పదు. 
మనందరిలోనూ కొద్దో గొప్పో ఉంటూ మన ప్రవర్తనపై ప్రభావం చూపే అంశం ఒకటి ఉంది - అదేమిటంటే షేమ్!  సిగ్గు కాదది, న్యూనత. మన మనసులో ఉన్నది బయటపెట్టుకోడానికి సంకోచిస్తాం, మన నిజం నలుగురూ మెచ్చరేమో అన్న భయం వల్ల. అదే పిల్లలకీ నేర్పిస్తాం. ఇబ్బందికరమైన విషయాన్ని బయటకి చెప్పకూడదని మనకి తెలియకుండానే వారికి సూచిస్తూ ఉంటాం. అలా కాకుండా మనసులో ఉన్నది నిర్భయంగా మాట్లాడగలగడం ఒక అలవాటుగా మారాలి. ఓటమి అన్నది సిగ్గు పడి దాచుకోవలసిన  విషయం కాదని, పెద్దవాళ్లు తమ నిత్యజీవితంలోని సాధారణ సంఘటనలలో వారికి ఆచరించి చూపాలి.
          *************                                         ***************    
విజయం సాధించాలనే కోరిక, తన చుట్టూ ఉన్న పది మంది లోకీ తానే గొప్పవాడినని పించుకోవాలన్న తపన – నానాటికీ శృతిమించుతూండడం కనిపిస్తూనే ఉంది. దాని మంచి చెడ్డల చర్చ లోకి పోకుండా, ప్రాక్టికల్‌గా ఆలోచించి చూస్తే – సామాన్య ప్రజలందరికీ - చదువుకుని ఉపాధి సంపాదించుకోడం తప్పనిసరి. దాని కోసం పరిశ్రమ చెయ్యడమూ తప్పనిసరే. దానిని మనం కాదనలేం. కాని ఆ పరిశ్రమలోని హెచ్చుతగ్గుల మీదనో, దొరికే ఫలితాల మీదనో – వారికి అందే ప్రేమాదరాలు ఆధారపడతాయని – వారికి ఏనాడూ అనిపించకూడదు.     
కుటుంబంలో ఒక సభ్యునిగా, దోస్తుల మధ్య ఒక దోస్తుగా, తమని ప్రేమించే బంధాలున్నాయని వారికి అనిపించాలి. కేవలం గెలుపుల కోసం పరుగులే జీవితం అనిపించకుండా, చిన్న చిన్న ఆనందాలని కలిసి ఆస్వాదించడం ఒక అలవాటుగా మారాలి.  చిట్టి పొట్టి సహాయాలతోనో, ఆటలతోనో, పాటలతోనో, అవేవీ కాకపోతే ఒక జోకు చెప్పి నవ్వించడం ద్వారానో – వారెంత ఆనందం పంచుతున్నారో – పిల్లలకి  మనం తెలియజేస్తూ ఉండాలి. వారు తమ జీవితాల్లో ఉండడం ద్వారా ఎంత నిండుదనం తెస్తున్నారో వారికి తెలిసేలా ప్రవర్తించాలి. వారి అభిరుచులకీ, అభిప్రాయాలకీ, వాటి ప్రకటనకీ – ప్రతిస్పందిస్తూ ఉండాలి. చుట్టు పక్కల జీవిస్తున్న మనుషులతో వారిని సంబంధం ఏర్పరుచుకొనేలా ప్రోత్సహించాలి. సమూహాలలో తమ ఉనికికొక విలువ ఉందని వారికి నిస్సందేహంగా తెలియాలి.
అయితే ఒక్క విషయం – ఈ ప్రేమానందాలూ, సహానుభూతులూ – జీవిత పోరాటంలో ఎదురైన ఓటములని మర్చపోయేందుకు ప్రత్యామ్నాయాలు కాదు. జీవితం అంటేనే సుఖ దుఃఖాల సమాహారం. మంచి విషయాలు చెడ్డవాటిని అవతలికి తోసేయవు. అలాగే చెడ్డ విషయాలు – మంచి విషయాల వల్ల కలిగే ఆనందాన్ని పోగొట్టవు. కాకపోతే ఒత్తిడికి గురైన వారికి  ఓటమి తప్ప మరేదీ కనిపించని ప్రమాదం ఉంది. దానిని నివారించేందుకు – వారిలో కలుగుతున్న ఒత్తిడిని వారు ఏరోజు కారోజే – బయటకి చెప్పుకునే అవకాశం మనం కల్పించాలి. ఏ మనిషికైనా తోటి మనుషులే రక్షక కవచాలు! ఓటమి వల్ల జీవితమే వృధా అని పిల్లలకి అనిపించిన రోజున సభ్య సమాజంలో భాగమైన మనమందరం  నేరస్థులం అవుతాం.