కొకు 10 కథల పునర్మూల్యాంకనం - కొలిమి అంతర్జాల పత్రికలో
https://kolimi.org/category/%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%ae%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d/%e0%b0%86-%e0%b0%95%e0%b0%a5-%e0%b0%87%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%9a%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b1%87/
ఏ అంశాన్నిచూసేందుకైనా, విభిన్న కోణాలుంటాయి అనీ, ఎన్ని ఎక్కువ కోణాల నుండి చూస్తే అంత మంచిదనీ నా నమ్మకం. చూసిన వాటిని 'సమన్వయం' చేసుకున్నాక, నాకందిన జ్ఞానాన్ని నలుగురితో పంచుకోడమే నా ఉద్దేశం.
Showing posts with label కొకు. Show all posts
Showing posts with label కొకు. Show all posts
Tuesday, 11 January 2022
ఆ కథ ఇప్పుడు చదివితే
Tuesday, 1 November 2016
నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలు
పై వాక్యం చదవగానే ఒక్క
క్షణం కళ్ళు మూసుకుని గతం లోకి తొంగి చూసుకోవాలనిపిస్తోంది కదూ. ఔను మరి... ప్రతీ
సాహిత్యాభిమానీ అపురూపంగా తలుచుకుని మురిసిపోయే విషయమే ఇది.
ఇది ఏ వర్గం లోకి
వస్తుందో నిర్ణయించడం కొద్దిగా కష్టమే. చెప్పాలంటే - ఒక తరానికి ప్రాతినిధ్యం వహించగలిగేవీ,
తరతరాలకూ దారిచూప గలిగేవీ అయిన అనేక గ్రంధాలను గురించిన ప్రస్తావన లుంటాయి. కానీ కేవలం
సాహిత్యానికి మాత్రమే సంబంధించిన విషయంగా చూడలేం. ఒక చిత్రమైన అంశం ఇది - వస్తుగతమూ, ఆత్మగతమూ కూడా! సాహిత్యం సహాయంతో
చేసే ఒక సైకో ఎనలిటికల్ ప్రాసెస్ (మానసిక విశ్లేషణా ప్రక్రియ), ఎంచేతనంటే –
తమ పై పడిన ప్రభావం ఎటువంటిదో వివరించాలనుకుంటే, ముందుగా తమకు తాము – ఆలోచనలనూ,
విశ్వాసాలనూ, దృక్పధాన్నీ సమీక్షించుకోవాలిగా.
అలాటి అంతరంగ సందర్శనం
చేసుకునే ప్రయత్నంలో ఒడ్డున నిలబడి నా మానస
సరోవరంలో కదిలే చిరు కెరటాల వైపు చూస్తూ గడిపేను. అలా చూస్తూ ఉండగా, నిశ్చల
మౌతున్న నీటి పై ఎవరెవరి ప్రతిబింబాలో
రూపుదిద్దుకోవడం కనిపించింది. ఎన్నేళ్ళగానో నిక్షిప్తాలైన ఆ నిధులను తవ్వుకుని
చూసుకుని తన్మయ స్థితి లోకి వెళిపోయాను. ఆ అనుభవాన్ని కొంత నలుగురితో పంచుకోవాలని
ఈ నా ప్రయత్నం. ఆ క్రమంలో, కల్పనా సాహిత్యాన్నివదిలి కేవలం వ్యాస సాహిత్యానికే పరిమితం
కాదల్చుకున్నాను.
చలం ‘బిడ్డల శిక్షణ’
నేను చదివిన మొట్టమొదటి నాన్ ఫిక్షన్. ఆ తర్వాత దానిని అనేక సందర్భాల్లో మళ్ళీ
మళ్ళీ చదివడం జరిగింది. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళనుకున్న వారికి బహుమతిగా
ఇచ్చాను. మా పిల్లలకి చదివి వినిపించేను. వారందరికీ, ప్రతీ ఒక్క దశ లోనూ కొత్త
చూపు నిస్తూ జీవితోన్ముఖుల్ని చేసింది, ఉత్తేజపరిచింది.
బిడ్డల శిక్షణ చదివేటప్పటికి
నా వయసు పదిహేను ఉంటుంది సుమారుగా, చిన్నా కాని పెద్దా కాని వయసు. అది ఏ దశలో
చదవితే ఉత్తమం? అది పిల్లలకి ఉద్దేశించిందా, పెద్ద వారికా అని సందేహం ఒకప్పుడు వచ్చేది.
కానీ అది ఏకకాలంలో ఇరు పక్షాలకీ మేలు చేసే పుస్తకం అని ఇప్పుడు నమ్మకంగా చెప్పగలను.
పిల్లల మనస్తత్వ శాస్త్రవేత్తలూ, పిల్లల పెంపకంలో అపారమైన అనుభవం ఉన్న నిపుణులూ –
రాసిన పుస్తకాలు గొప్పగొప్పవి అనేకం ఉన్నా, 1930ల్లో వచ్చిన ఈ పుస్తకం అతి విశిష్టమైనదని నా అభిప్రాయం. పిల్లలని
ఆరోగ్యంగా, ఆనందంగా పెంచేందుకు ప్రాక్టికల్ సూచన లిచ్చినట్టు కనిపించినా,
వాటన్నిటి వెనకా జీవితాదర్శాలకు సంబంధించిన కొన్నిమౌలిక భావన లున్నాయని
తెలుస్తుంది. ఒకటి రెండు ఉదాహరణలతో వివరించే ప్రయత్నం చేస్తాను.
నిజాయితీ:
నిజాయితీ:
పిల్లల్లో యే సద్గుణాలు
కలుగజేయా లనుకుంటారో ఆ గుణాల్ని పెద్దవారు తాము అలవరుచుకుని అనుష్టించాలి. (ఇది ఈనాడు మనకు అంత కొత్తగా కనపడక పోవచ్చు) కానీ "చిన్నప్పట్నించీ కూడా పిల్లలకి వివాహాన్ని గురించీ, ప్రేమ గురించీ చక్కని ‘నిజమైన’ అభిప్రాయాలనివ్వాలి" అనే సూచన మాత్రం ఈనాటికీ మనలో చాలామందికి సాహసం గానే
కనిపిస్తుంది. పెళ్ళికి సిద్ధమైన పిల్లలతో కూడా ప్రేమ గురించీ, పెళ్లి గురించీ
సీరియస్ గా మాట్లాడలేని తల్లిదండ్రులున్నారు మనలో. చలం ఆశించే పూర్తి స్థాయి
నిజాయితీకి చాలా దూరంలో ఉన్నాం. అయితే ఆచరించిన మేరకే, అద్భుతమైన ఫలితాలనివ్వగల
సూచన అది.
నీతి:
లోకం తోవలో పోవడం కాదు,
తప్పు కనిపించే చోట ఎదిరించమనీ, అలా ఎదిరించే అలవాటు పిల్లలకు నేర్పాలనీ చలం ఉద్బోధిస్తారు.
పది మొదలు పద్దెనిమిదేళ్ళ వరకూ ఉన్న పిల్లలకు, ‘లోకం లో నీతి అనే దానికీ, నిజమైన
నీతికీ భేదం చూపాలి’ అన్నభావగర్భితమైన సూచన ఇస్తారు. నిజమైన నీతిని తాము
గుర్తించడం, పిల్లలు ఆ భేదం గమనించేలా ప్రవర్తించడం ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన
అంశాలు.
విశ్వాసం:
‘బిడ్డకి నీతి నేర్పాలని
ప్రయత్నించే తల్లిదండ్రులు బిడ్డ స్వభావంలో విశ్వాసముంచడం అవసరం.
ఎన్నిసార్లు తప్పుపని
చేసినా, బిడ్డ ఆ పని కన్నాఅతీతుడని తెలుసుకుని ... “మళ్ళీ ప్రయత్నించు, ఈ సారి సరిగ్గా చెయ్యగలవు” అంటూ
ధైర్యమూ, విశ్వాసమూ ఇవ్వాలి.
తప్పుపని చేస్తే
పెద్దవారు ఆశ్చర్యపడి “ఇదేమిటి ఇంత పొరపాటు చేసేవు! నీవంటిది చేసే పని కాదే”
అనాలి.’
స్వేచ్ఛ:
అన్నిటి కంటే అతి
ముఖ్యమైనదీ, బిడ్డల శిక్షణకు పునాదీ అయిన భావన ‘స్వచ్చంద నిర్ణయశక్తి.’ వాళ్ళంతట
వారుగా నిర్ణయాలు తీసుకుని, వాటి బాధ్యతను
వారు వహించేటట్టూ పిల్లలను తయారు చెయ్యడం
పెద్దవారి విద్యుక్తధర్మమని ఈ పుస్తకం మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది.
బలవంతంగా సన్మార్గం లోకి తిప్పడం కంటే దుర్మార్గంలో ఉండనిస్తే మంచిది
అన్న ఈ వాక్యం ఒక మంత్రం
లా నా చెవిలో మోగుతూ ఉంటుంది.
ఈ కింది వాక్యాలొక్కొక్కటీ
ఒక్కొక్క కరదీపిక.
1. సరైన శిక్షణ ఇవ్వగలిగిన తల్లిదండ్రులు ఎప్పుడూ సంతోషంగా, దయగా, ఓర్పుగా ఉండాలి.
2. శిక్షణ ప్రారంభించక పూర్వమే తమ అహంభావాన్నీ, తమ అధిక్యతనీ, ఆత్మసుఖాన్నీ త్యజించడం మొదటి పని.
3. ఇంటికి వొచ్చే ప్రతీ వారినీ పెద్దవాళ్ళు సమానంగా చూడాలి. స్నేహతారతమ్యమే గౌరవ తారతమ్యం కలిగించే ప్రధాన సూత్రంగా
ఉండాలి. కులమూ, లింగమూ, భాగ్యమూ మొదలైన భేదాలన్నీ యేమాత్రమూ గౌరవ విషయంలో
పాటించకూడదు.
4. భయపడ్డ మనే దానికి బిడ్డ సిగ్గు పడాలి. కానీ ఆ సిగ్గు
వల్ల భయం పోవాలి గానీ, సిగ్గు పడి భయాన్నిదాచుకోకూడదు.
5. పిల్లలకు వారి దేహం మీదా, శీలం మీదా అమితమైన గౌరవం
ఉండాలి. ప్రేమా, ఇతరులను ప్రేమించడం అనే అనుభవం అతి అద్భుతంగానూ, ఉన్నతం గానూ
కనబడాలి.
సర్వ మానవజాతినీ బిడ్డలుగా
భావించి అమితమైన ప్రేమతో, విశ్వాసంతో, ఆర్తితో తీవ్రమైన కాంక్షతో, చలం వాణి ఈ
పుస్తకం లోంచి మనల్ని పలకరిస్తూ ఉంటుంది.
ఎందుకు పసితనాన్ని
సంరక్షించడం మనకు అత్యావశ్యకమో... చలం మాటల్లోనే వినండి:
ఎప్పటికన్నా ఏ జాతులన్నా, ఏ జీవులన్నా తిరగబడి తప్పించు కోగలరు.
... జంతువులు కూడా తమను
తాము కాపాడుకుంటాయేమో! కానీ ఈ పిల్లలు ఎప్పుడూ సమ్మె కట్టలేరు. తెలివి తెచ్చుకోలేరు.
ధిక్కరించలేరు. ప్రార్ధించ లేరు, నోరు లేదు. శక్తి లేదు. మీలో అపారమైన విశ్వాసం తప్ప.
***** ***** *****
నేను చదివిన ‘బిడ్డల
శిక్షణ’ పుస్తకం రంగనాయకమ్మగారి ముందుమాట తో ఉండేది. లోపల ఉండే కామన్ సెన్స్
కారణంగా - అప్పటికే, చుట్టూ జరుగుతున్నవాటిలో అసంబద్ధంగా తోచేవాటిని గుర్తించడం,
అసంతృప్తి చెందడం మొదలైందను కుంటాను. మార్క్సిజం గురించి విన్నది కూడా అప్పుడే.
అన్యాయాలు అంతమవ్వాలంటే సమ సమాజం రావాలని చెప్పే ఒక థియరీగా మార్క్సిజం అర్ధమైంది
నాకు. సమాజంలో ఏర్పడుతున్న ప్రతీ ఒక్క మార్పునూ, చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ
ఒక్క పరిణామాన్నీ- అర్ధం చేసుకునేందుకూ, అంచనా కట్టుకునేందుకూ – ఆ థియరీని
అనువర్తింప చేసుకోవచ్చని ఆమె వ్యాసాలూ చదివేకే తెలిసింది. సిద్ధాంత గ్రంధాలు చదవని
వారు సైతం సమానత్వం అన్న మార్క్సిజం మూల సూత్రపు వెలుగులో జీవితానికి
స్పందించే ప్రయత్నం చేయొచ్చని పించింది.
లతా మంగేష్కర్
శ్రద్ధాంజలి పాడడం వల్ల – మరణించిన గాయకుల
హక్కులకు భంగం కలుగుతుందని రాసినా,
వీర్యదానాన్ని రక్తదానం లా పరిగణిస్తే పుట్టబోయే పిల్లల హక్కులకు భంగం కలుగుతుందని రాసినా,
మెడల్స్ సంపాదించిన ఆటగాళ్లకు ‘ప్రజాధనం’ లోంచి కోట్లు ధార పోసే హక్కు ప్రభుత్వాలకు లేదని రాసినా – అవన్నీ మార్క్సిజానికి మనం చేసుకోగలిగే అన్వయాలేనని అప్పట్లో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఆమె వాటన్నిటి మీదా పాపులర్ వ్యాసాలు రాసినందుకు కృతజ్ఞత కలుగుతోంది.
వీర్యదానాన్ని రక్తదానం లా పరిగణిస్తే పుట్టబోయే పిల్లల హక్కులకు భంగం కలుగుతుందని రాసినా,
మెడల్స్ సంపాదించిన ఆటగాళ్లకు ‘ప్రజాధనం’ లోంచి కోట్లు ధార పోసే హక్కు ప్రభుత్వాలకు లేదని రాసినా – అవన్నీ మార్క్సిజానికి మనం చేసుకోగలిగే అన్వయాలేనని అప్పట్లో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఆమె వాటన్నిటి మీదా పాపులర్ వ్యాసాలు రాసినందుకు కృతజ్ఞత కలుగుతోంది.
సమసమాజం అంటే ప్రజల్లో
అనేక అపోహలు ఆనాడే ఉండేవి, (ఇప్పుడు మరింత బలపడ్డాయి అనుకోండి.) అలాటి ఒక సందర్భంలో
ఆమె ఇలా రాస్తారు: “అందరూ సమాన హక్కులతోటీ, సమాన బాధ్యతలతోటీ ఉండే సమాజంలో
వ్యక్తులు సుఖంగా ఉంటారా? గతంలోకన్నా బాధలు పడతారా?” ఆ ప్రశ్నలకు నమ్మకంగా
జవాబు చెప్తారామె.
ఈనాటికీ నాలో ఆశాదీపంలా
వెలిగే ఒక నమ్మకం ఆమె రచనల కారణంగానే ఏర్పడింది – అదేమిటంటే ... “అలాటి (సమాన)
సంబంధాల్లో వ్యక్తి క్షేమానికీ, సమిష్టి క్షేమానికీ వైరుధ్యం ఉండదు.” అలాటి వైరుధ్యం గనుక మన దైనందిన జీవితంలో ఎదురైతే, ‘సమానత్వాన్నే లక్ష్యంగా
పెట్టుకుని, ఆ సమస్యను పరిష్కరించుకోవాలని నేను నేర్చుకున్నాను.
***** ***** *****
నలుపూ తెలుపూ అన్నంత
విస్పష్టంగా మంచి చెడ్డల్ని రంగనాయకమ్మ గారు చూపితే, కుటుంబరావు గారి ‘సాహిత్య,
సంస్కృతి వ్యాసా’ల ప్రభావం మరో రకంగా మరింత బలంగా పడింది. కారా మాస్టారి మాటల్లో
చెప్పాలంటే ... “తన అనుభవం, తన పరిశీలన మన కళ్ళ ముందుంచి దానిని మన అవగాహనతో
బేరీజు చేసుకునేలా చేసి మనలో మార్పు కలిగించేలా చెయ్యడం” కొకు విశిష్టత.
సంస్కారం:
ఒక్కో విషయం ఉదహరించడం నా
అభిమతం కాదు. అయితే ఒక్క ‘సంస్కారం’ అన్న పదం కొకు ప్రభావాన్నంతటినీ
ఇముడ్చుకోగలదు అనిపిస్తుంది. ఆ మాటను మనం వాడే రెగ్యులర్ అర్ధంలో ఆయన వాడరు. రకరకాల
సందర్భాల్లో కొకు కొత్త అర్ధాల్ని దాన్లో సంక్షేపిస్తారు. వివేకం, స్వయం
నిర్మితమైన విచక్షణ, సౌందర్య పిపాస, ఆనందాన్వేషణ లాటి అర్ధాలు నాకు స్పురణ కొస్తూ
ఉంటాయి. స్థూలంగా ‘రిఫైండ్ టేస్ట్’, కల్చర్ అన్న అర్ధం చెప్పుకోవచ్చేమో. ఆ ‘సంస్కారం’
పెంచే శక్తి కొకు రచనల కుందని నా నమ్మకం.
కారెక్టర్:
ఈనాడు వెనక్కు తిరిగి
చూసుకుంటే, యధాలాపంగా రచయితలు చెప్పిన మాటలు, అవి పిల్లల నుద్దేశించినవైతే మాత్రం,
నాలో వెంటనే చొచ్చుకుపోయే వనిపిస్తోంది. నాన్ డీటెయిల్డ్ పుస్తకంలో బాల సాహిత్యం
మీద కొకు రాసిన వ్యాసం ఒకటి మాకు పాఠ్యాంశంగా ఉండేది. అందులోని సూచనలను పదే
పదే మననం చేసుకోడం, చదివే కథలకు వాటిని వర్తింపచేసుకోడం, అవి పిల్లల మీద ఏవిధమైన ప్రభావం
చూపుతాయని ఆలోచించుకోవడం నాకు బాగా గుర్తుంది. బాల్యాన్నీ, దాని ప్రత్యేకతనూ
గుర్తించిన రచయిత లంటే నాకు గురి కుదిరిపోయిందప్పట్నించే. కొన్ని అమూల్య రత్నాల
వంటి వాక్యాలు - సాంద్రత తోనూ, స్పష్టత తోనూ, సమగ్రత తోనూ ధగధగ లాడుతూ
ఏనాటికీ పాతబడకుండా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే కదా! అలాటివే కొకువి కొన్ని:
1.
బాల సాహిత్యం పిల్లల మెదడులో
కొన్ని మౌలికమైన భావాలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రతా,
త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించడం ద్వారా సంతృప్తిని
కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలు చేస్తాయి.
2.
యుక్తి
కథలకు బాల సాహిత్యంలో
స్థానం ఉంది.
3.
మహాసత్వుల
(ఒక లక్ష్యం పెట్టుకుని సాధించిన) కథలు హెచ్చుగా చదివితే పిల్లల్లో కారెక్టర్
ఏర్పడుతుంది. మన లాటి పేద దేశాల్లో పిల్లలకు డబ్బు మీద దృష్టి ఏర్పడడం కన్నా, ‘కారెక్టర్’ ఏర్పడడం చాలా
అవసరం.
4.
ముఖ్యంగా
చిన్నపిల్లలకు దొంగల భయమూ, దెయ్యాల భయమూ లాటివి అతి తేలికగా అబ్బుతాయి. ఆ భయాలను
తగ్గించే దొంగల కథలూ, దయ్యాల కథలూ పిల్లలు చదివి ఉండడం మంచిది.
ఈ నాలుగు ఉదాహరణలూ కూడా
పిల్లల మనసులపై సాహిత్యం చూపగలిగే ప్రభావాన్ని బలపరుస్తూ ఉండడం గమనార్హం. జీవితంలోని
సమస్యలకు సాహిత్యం సహాయంతో పరిష్కారాలు వెతుక్కోగలమనే నమ్మకం నాలో కలగడానికి
ఇవే ప్రాతిపదిక లైనాయి.
పరిణతి:
మంచి చెడ్డల మధ్య దాటరాని
దూరాలుంచే పిల్లల సాహిత్యాని కవతల వైపు సాహిత్యపు కర్తవ్యాన్నినిలుపుతారు కొకు. సాహిత్యం
చేయవలసిన పనీ, కాని పనీ చర్చించే సందర్భంలో సాహిత్యకారుడి కున్న అపరిమితమైన
శక్తి యుక్తులనిలా వివరిస్తారు.
నీతి శాస్త్రాలూ, న్యాయ
శాస్త్రాలూ - సామాన్య జీవితంలో సామాన్య మానవుడి ప్రవర్తనకు ఎక్కువగా వినియోగపడుతూ,
విశేష పరిస్థితులను కూడా సాధ్యమైనంత వరకూ చర్చించ గలవు. కానీ వీటిని రోజు రోజుకూ
మార్పు చెయ్యడం అసంభవం.
కానీ మానవుడి మనః పద్మం
అనుక్షణమూ వికసిస్తూనే ఉంటుంది. మానవుడు యుగయుగాల నుంచీ సాటి మానవుడి
మనస్తత్వాన్ని అర్ధం చేసుకుంటూ వస్తున్నాడు. నిర్జీవాలైన శాస్తాలు సమర్ధించ లేకపోయినా
సోదర మానవుణ్ణి ఇతను సమర్ధిస్తాడు. తెలివితేటలు వినియోగించి
ధర్మశాస్త్రాన్ని తప్పించుకు తిరుగుతున్న దుర్మార్గుణ్ణి పట్టుకుని ఈ మేధావి
నరకం లోకి తోసిపారేస్తాడు. ఈ రచయిత ఇంకొకటి కూడా చేస్తాడు – అమలులో ఉన్నన్యాయానికి బద్ధుడైన వ్యక్తి పడిన ఆవేదన చిత్రించుతాడు.
ఏవిధంగా చూసినా సారస్వత
కళ యొక్క పని శాస్త్రాలకు ప్రత్యామ్నాయంగా ఉండడం కాదు – వాటి (ఆ నీతి శాస్త్రాల) వల్ల
కాని అత్యుత్తమ ధర్మాన్ని నిర్వర్తించడమే.
పిల్లల మానసాలపై సాహిత్యం
చూపించే ప్రభావాన్ని క్రోడీకరించిన దృక్పధానికీ, మానవ జీవితాల మీద సాహిత్యం
చూపగలిగే ప్రభావాన్ని పరిశీలించిన విధానానికీ ఒక అంతరాన్ని గమనించవచ్చు. అదే ‘పరిణతి’.
***** ***** *****
‘చదువు పట్లే కాకుండా రాత
పట్ల కూడా ఆసక్తి పెరగ్గా చివరకు రచన కుండే శక్తి పట్ల వారిలో ఓ విశ్వాసం
ఏర్పడుతుంది’ అంటారు కారా. ఈ మాట నా విషయంలో నిజమైంది.
నా సాహిత్య ప్రయాణంలో గత
సంవత్సర కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. నా భావాలను లిఖిత రూపకంగా నలుగురితోనూ
పంచుకోవాలన్న ప్రగాఢమైన కోరిక కలిగిందీ, రాయడం మొదలుపెట్టింది ఈ సంవత్సరం
లోనే. అంతకు ముందుకూ, ఇప్పటికీ పోల్చి చూసుకుంటే, నేను చదివే సాహిత్యం నా మీద
చూపించే ప్రభావంలో ఒక అంతరం గమనిస్తున్నాను. కేవలం కథ మీదే కాక కథకుడి పైకీ, కథా
సంవిధానం పైకీ నా దృష్టి మరలుతూ వస్తోంది. దానికి కారణం కారా గారూ, వల్లంపాటి
వెంకటసుబ్బయ్య గారూను.
అంత వరకూ అదేదో తిరుపతి
దేవుడి విగ్రహం – స్వయంభువూ, ఎవరూ చెక్కలేదు – అన్న కథలోలాగా, కథ ఆకాశం లోంచి
ఊడిపడుతుంది అనుకునే దాన్నేమో తెలియదు కానీ దాని పుట్టుక గురించి ఏనాడూ
ఆలోచించలేదు. కారా గారి వ్యాసాలు చదివేకే కథకుడి ఉనికిని గుర్తించడం మొదలైంది.
కథ యొక్క అర్ధం – రచయిత సృష్టించిన ‘కల్పిత’ ప్రపంచానికీ, కథకు బయట
ఉన్న ‘వాస్తవ’ ప్రపంచానికీ మధ్య ఉన్న సంబంధంలో ఉంటుంది. కథ అర్ధం కావడమంటే ఈ
సంబంధం అర్ధం కావడమే అన్న వల్లంపాటి గారి వాక్యం కథ అర్ధమవ్వడంలో ఒక
పాఠకురాలిగా నాకుపయోగపడితే...
“ఒక సంఘటన కానీ,
స్థితి కానీ – ఏదైతే రచయితను స్పందింప చేస్తుందో అదే కథ. నాలో కలిగే స్పందనను నేను
మళ్ళీ మీలో కలిగించగలగాలి” అంటూ
కారా మాష్టారు చెప్పిన ఈ మాటలు రచయిత కోణం నుంచీ కథ విలువను నిర్వచించేయి.
మూల్యాంకనం :
వీరిద్దరి వలనా - నాకు
నచ్చిన కథలు ఎందుకు నచ్చుతున్నాయో, నచ్చని వాటిలో ఏ అంశాలు వాటిని నచ్చకుండా
చేస్తున్నాయో గమనించడం మొదలు పెట్టాను. వాటి ప్రభావాన్నీ, తద్వారా వాటి
విలువనీ అంచనా వేసుకునే పని అప్రయత్నం గానే మొదలైంది.
దీనికి భూమిక కొకు
వాక్యాలతో పడిందనుకుంటా. విమర్శకు దిగే ముందుగా
వస్తువు విలువ గురించి ఒక నిశ్చయానికి రావడం అవసరం అంటూ విమర్శకులకు ఒక
హెచ్చరిక లాటి వాక్యం ఇది: “న్యాయంగా
జరిగి ఉండవలసినదేమిటంటే ముందు నాకథలకు ఎటువంటి విలువ అయినా ఉన్నదో లేదో నిర్ణయించి
ఆ తరువాత నన్ను గురించిన విమర్శ చెయ్యటం. మనకు అవసరం లేని వస్తువును గురించి
గంట సేపు బేరం ఆడం!”
ఇలా రచనకు విలువ
కట్టుకునే విషయంలో నన్ను చకిత పరిచిన వ్యక్తి ఒకరు. ఆయన కేతవరపు రామకోటి శాస్త్రి.
వారి ‘విశ్వనాథ వైఖరి’ అన్న
పుస్తకంతో పరిచయం ఇటీవలే జరిగింది. నా ఆలోచనాక్రమం మీద గాఢమైన ముద్ర వేసిన కారణం
చేత ఒకటి రెండు వాక్యాలలోనైనా ప్రస్తావించాలను కుంటున్నాను.
విశ్వనాథ వారి అతి తీవ్ర
అభిమానిగా వారి రచనాపటిమకు పరవశులై ఒక మహాకవి మాత్రమే రాయగలరంటూ ‘కల్పవృక్షం’ మీద
వ్యాఖ్యానాలు రాసిన వ్యక్తి రామకోటి శాస్త్రి గారు. అటువంటి వ్యక్తి తరువాత కాలంలో,
విశ్వనాథ భావజాలం తిరోముఖమైందని గుర్తించడమే ఒక విశేషమైతే, ఆ వెనుక చూపుకు కారణం రియాక్షనరీ ధోరణి అని గుర్తించడమూ, దానికి గల చారిత్రక,
సామాజిక కారణాలను విశ్లేషించడం అన్నది మరీ అరుదు అనిపించింది. రామకోటి శాస్త్రి గారు జీవించిన కాలం, వారు
నివసించిన ప్రాంతం - ఆయన లోని యీ విశిష్ట పరిణామశీలతకు దోహదం చేసి ఉంటాయన్న సంగతి
ఇటీవలే ఒక మిత్రుల (కరుణాకర్ గారి) మాటల్లో తెలిసింది.
విశ్వనాథ రచనలకు ఉన్న
విలువ ఎంతో, ఈనాటికీ వాటిని చదవవలసిన ఆవశ్యకత ఏమిటో కూడా శాస్త్రి గారు, ఇలా
వివరిస్తారు . “... సత్యన్నారాయణ గారి జీవిత దృక్పధం పరిధి చాలా
చిన్నదైపోయింది. అయితే, ఆయన అనంతమైన సృజన ప్రతిభాశక్తి కలవాడు కావడం చేత మనిషి
అంతశ్చాలన సీమల్లోకి యదేచ్ఛగా ప్రవేశించాడు. అది అభేదకం గనుక ఆయన వీర విహారం
చేయడానికి వీలయింది.”
శాస్త్రిగారు చేసిన
ప్రతిపాదనకు పుష్టి నివ్వగల కారా వాక్యం నాకు గుర్తు కొచ్చింది: “ఇప్పటికీ శ్రీపాద,
విశ్వనాథ వంటి వారి కథలు నన్ను వెంటాడుతూ – వారి భావజాలం తో ఏకీభవించినా
లేకున్నా- ఉంటాయి. disturb చేస్తాయి ...”
కారా మాస్టారి అనుభవం
మనలో చాలా మందికే అయ్యుంటుంది. దానికి కారణమిదని విశ్వనాధ విషయంలో చలసాని అంటారు: "సమాజం పట్ల
స్పష్టమైన తాత్విక అవగాహన వుందాయనకు. తన చుట్టూ ఉన్న జీవితంతో అతి సన్నిహితమైన
పరిచయం ఉంది. పరిశీలనాశక్తి ఉంది. గొప్ప ఊహశీలి. సాహిత్యాన్ని ఆహార్యంగా చేసుకుని,
కవిత్వాన్ని కవచంగా ధరించిన ‘నిబద్ద’ సాహిత్యవేత్త విశ్వనాథ. తమ సిద్ధాంతాన్ని ఇంత
బలంగా, శక్తివంతంగా ‘ప్రచారం’ చేసినవారు అరుదు."
అసమాన ప్రతిభతోనూ,
సూక్ష్మ పరిశీలనతోనూ, సంవేదనతోనూ రచించిన సాహిత్యానికి ఉండే శక్తిని గుర్తించిన
మీదట, దానిని రాసిన రచయిత దృక్పధం ఏదైనా, ఎప్పటికప్పుడు దానిని సమకాలీన
పరిస్థితులకు అన్వయించుకుంటూ అధ్యయనం చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.
ఇలా
జీవితపు మౌలిక విలువల మీద
చలం ప్రభావమూ,
వైరుధ్యాలను పరిష్కరించుకోవడంలో
రంగనాయకమ్మ ప్రభావమూ,
మానవుని ‘సంస్కారం’ మీద
నమ్మకం ఏర్పడడంలో – కుటుంబరావుగారి ప్రభావమూ,
రచనా ప్రక్రియకు
సంబంధించిన పరిజ్ఞానం, సాహిత్య గ్రహణశక్తిని పెంచుతుందన్న స్పృహ ఏర్పడడంలో –
కాళీపట్నం, వల్లంపాటిల ప్రభావమూ ఉన్నాయి.
మేధో పరిణతికీ, వస్తుగత
విమర్శనా శక్తికీ, ఒక ఉదాహరణగా రామకోటిశాస్త్రిగారు నిరంతర పరిణామ శీలత్వానికి
నాకు ప్రేరణ నిస్తున్నారు.
ఇక్కడ పేరు తీసుకోకపోయినా
కూడా, ఇంకా ఎందరో సాహిత్యకారుల ప్రభావం వల్ల రాత మీద విశ్వాసం నాకు ఇనుమడిస్తూ
ఉంది – వారందరికీ నా కృతజ్ఞతలు.
____________________________________________________Monday, 10 October 2016
స్వావలంబనకు ప్రతీక 'మధురవాణి'
స్వావలంబనకు
ప్రతీక మధురవాణి:
కన్యాశుల్కం
నాటకం కేవలం ఒకప్పటి కాలంలో నివసించిన ఒకానొక అగ్రకులం వారికి సంబంధించిన
సమస్యలకూ, సంస్కరణలకూ ఉద్దేశించిన రచన అని ఈనాడు కొంతమంది అనడం వింటున్నాను. అది
పొరపాటనీ, ఈనాటి స్త్రీలెదుర్కునే సమస్యల చిత్రణ కూడా ఉందనీ నా నమ్మకం.
తమ
జీవితాల మీద సరేసరి, తాము కని పెంచే పిల్లల మీద కూడా హక్కూ, నిర్ణయాధికారం
స్త్రీలకు లేదన్న సంగతి అబద్ధమా? ‘డబ్బు జబ్బు’ సోకిన పెద్దలు మానవసహజమైన ప్రేమాభిమానాలను మర్చిపోయి – ఆ
డబ్బు కోసం తమ కుటుంబం లోని ఆడపిల్లల జీవితాలు తాకట్టు పెట్టడం ఈనాడు మనం చూడడం
లేదా? పరస్పరాకర్షణ కారణంగా ఏర్పడవలసిన స్త్రీ పురుష సంపర్కానికి బదులు, స్త్రీ
శరీరమూ, ఆమె ప్రేమా రకరకాల ధరలకు అందుబాటులో ఉండే పరిస్థితులు లేవా? ఇవేవీ ఒక్క
కాలానికో, ప్రాంతానికో, వర్ణానికో చెందిన సమస్యలు కావు – అనాదిగా స్త్రీలందరి
ఉమ్మడి సమస్యలూను. ఆ సమస్యల గురించి వ్యధ చెంది, ఆధునిక మహిళ చరిత్రను
తిరగరాస్తుందనే నమ్మకంతో, భవిష్యత్తు మీద ఆశ కలిగిన ‘మహాకవి’ సృష్టించిన పాత్ర ఈ
మధురవాణి.
ఆయన
దర్శించిన ఆధునిక మహిళ కుండే ప్రధాన లక్షణాలు ఏవన్నది మధురవాణి పాత్ర గుణగణాల్ని
బట్టీ మనం ఊహించుకోవచ్చు. నిశిత
పరిశీలనా, తనదైన స్పష్టమైన ఆలోచనాక్రమం, నిష్పక్షపాత ధోరణీ, ఆత్మవిశ్వాసమూ, స్వావలంబనా
వీటన్నిటికీ మించి తన తోటివారి కష్ట సుఖాలను తనవి గా భావించగలిగే హృదయ
సౌకుమార్యమూ, తన చేతనైనంత సాయం చేయాలనే మానవత్వమూ, అవసరమైతే తన స్వలాభాన్ని
త్యజింఛి అడుగు ముందుకేసే సాహసమూ ఇవన్నీ మధురవాణిని ‘మధురవాణి’గా
చేస్తాయి.
ఇంకా
చెప్పుకోదగ్గ విశేషం: కుటుంబ స్త్రీల కొచ్చిన ఆపదలను గట్టెక్కించడం కోసం, ఏ కుటుంబ బంధాలకూ
నోచుకోని ఒక స్త్రీ నిస్వార్ధంగా పూనుకోడం.
ఆర్ధిక
భద్రతా, సాంఘిక గౌరవమూ లేకుండా సమాజం కట్టడి చేసిన కులంలో జన్మించినా,
1. ఈనాటికీ మనకు ఆదర్శంగా నిలిచే లక్షణాలను
ఆమె సంతరించుకోవడం,
2. నాటకపు వ్యవధిలో ఆమె పాత్ర పరిణామం చెంది,
‘వృత్తిధర్మా’న్ని తప్పనిసరి అంటూ పాటించడానికి సమ్మతించక పోవడం,
3. దాని విషయమై లోకాభిప్రాయాన్ని
ప్రతిఘటించడం కూడా గమనించగలం.
కుటుంబంలో,
సమాజంలో తన స్థానమేమిటో, తనకి జరుగుతున్న అన్యాయమేమిటో తెలుసుకోగలిగే స్పృహ, ఎదిరించి
పోరాడవలసిన ఆవశ్యకతని గుర్తించడం – ఈనాటి స్త్రీకి తప్పనిసరి అని నిర్ద్వంద్వంగా ఒప్పుకోవచ్చు.
వాటిని కన్యాశుల్కం నాటకం నేపధ్యంలో మధురవాణి పాత్రకు అనువర్తింప జేసుకునే
ప్రయత్నం చేద్దాం. ఆమె హృదయమూ, ఆమె మేధస్సూ రెండూ అద్భుతాలే! ఈనాటి
ప్రమాణాలతో కొలిచి చూసుకున్నా సరే అవి
అనుసరణీయాలే.
మహిళలు
తమ గురించి తామే ఎంతో తక్కువ స్థాయిలో అంచనా వేసుకునే పరిస్థితులు ఈనాటికీ ఉన్న మన
సమాజాల్లో, ఎప్పుడో వంద ఏళ్లకు పైబడిన వేశ్య పాత్రలో ఈనాటి స్త్రీలకు ఆదర్శం
అనదగ్గ లక్షణాలున్నాయని చెప్తే, నమ్మడం కష్టమే. కనక ముందుగా, మధురవాణిలో ఈ
లక్షణాలను పొదిగిన గురజాడ అభిప్రాయాలను తెలుసుకోవడం సముచితంగా ఉంటుంది. వేశ్యలు
సమాజానికి చీడ పురుగులనీ, పురుషులను నాశనం చెయ్యడం వారి ప్రవృత్తి అనీ ప్రచారాలు
ముమ్మరంగా సాగే రోజుల్లో గురజాడ ఆలోచనలు ఇలా ఉండేవి: వేశ్యలో మానుషత్వాన్ని మరచి
పోకండి. ఆమె సుఖదుఃఖాలు మీవి గానీ నావి గానీ అయిన సుఖదుఃఖాలకు ప్రాముఖ్యంలో తీసిపోవు.
సంఘంలో లెఖ్ఖ లేని వ్యభిచారులైన భర్తలూ, భార్యలూ ఉన్నారు. స్పష్టంగా తన వృత్తిని తెలియబరిచే వేశ్య వారందరికన్నా
అధమురాలెట్లా అవుతుంది? పైగా వేశ్య ఏ వివాహప్రమాణాన్నీ భగ్నం చెయ్యడం
లేదు వీళ్ళ వలె” అని 1909 లో వంగోలు మునిమాణిక్యం గారికి
అప్పారావుగారు రాసేరు. (అప్పారావు గారి ఇంగ్లీషుకు చలం తర్జుమా)
ఒక
వైపు సంసార స్త్రీలను ‘అతి పవిత్రం’గా ఉంచేందుకు వారిని నాలుగు గోడల మధ్యా
బంధించి, మరో వైపు సానికులం వారిని మగవారికి వినోదం కలిగించే పని మీద వీధిలోకి
నెట్టే సంప్రదాయం నిరాఘాటంగా సాగుతూ ఉండేది. ఈ విభజనను గురజాడ స్పష్టంగా
గమనించారనీ, దానిని తన రాతల ద్వారా మార్చా లనుకున్నారనీ తెలుస్తుంది. అందుకే ఆయన
సాహిత్య సృష్టి ఆనాటి భావజాలాలకు పరిమితం
కాకుండా ముందడుగు వేసింది.
నాటకం
మొదలైన కొద్ది క్షణాలకే మధురవాణి ప్రసక్తి వస్తుంది - గిరీశం మాటల్లో. అతను
ఇంగ్లీషు చదువుకున్న యువకుడనీ, మధురవాణి పోషకుడనీ అనిపిస్తుంది. కానీ ఉట్టి
వాక్చాతుర్యంతో నలుగురికీ టోపీ వేసి భుక్తి గడుపుకునే అప్రయోజకుడని కూడా
తెలిసిపోతుంది మనకు. అతనిని వదిలించుకుని, మధురవాణి రామప్పంతులనే కోర్టు పక్షిని
చేరుకుంటుంది. గిరీశం మాటల్లో చెప్పాలంటే ‘రామప్పంతులు జిత్తులకు జాకాల్ (గుంట
నక్క), తెలివికి బిగ్ యాస్(గాడిద)’. ఆ రామప్పంతులు పన్నిన వలలో
లుబ్ధావుధాన్లనే చేప చిక్కుతుంది. దాని ఫలితంగా లుబ్ధుడు ముసిలివాడై ఉండీ
చిన్నపిల్లని కొనుక్కుని పెళ్ళాడేందుకు సిద్ధమౌతాడు.
రామప్పంతులు
లేని సమయంలో కరటకశాస్త్రి వచ్చి మధురవాణి సహాయం కోరతాడు. అతని చెల్లెలి కిద్దరు
కూతుళ్ళు. పెద్ద పిల్ల బుచ్చమ్మ, ఆమె బాల వితంతువై, పుట్టింటిలో అణగారుతుండగా
మళ్ళీ అలాటి దుస్థితే చిన్న పిల్ల సుబ్బికి పట్టబోతుంది -ఆమెనే లుబ్ధుడు కొనుక్కోబోయేది.
మేనగోడలు సుబ్బి పెళ్లి తప్పించేందుకు, కరటక శాస్త్రి తన శిష్యుడికి ఆడవేషం వేసి
మధురవాణి దగ్గరకు తీసుకు వస్తాడు.
ఆ
సమయంలో మధురవాణి స్పందన ఆమె మనసును
మనకు పరిచయం చేస్తుంది. పెళ్లి ఆపడంలో ఆమె అందించబోయే సహాయానికి ప్రతిఫలం ఇస్తానని
కరటకశాస్త్రి వాగ్దానం చేస్తాడు. అది విని మధురవాణి విచారంగా ఇలా అంటుంది. వృత్తి చేత వేశ్యని గనుక
చెయ్యవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తాను గానీ మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని
తలచారా? మీ తోడబుట్టుకు ప్రమాదం వొచ్చినపుడు నేను డబ్బుకు ఆశిస్తానా?
ఈ
మాటల్లోని విషాదం ఏమిటంటే డబ్బు కోసం తన సహజ భావోద్వేగాలను అణచుకోవాల్సిన వృత్తిలో
ఉన్నా ... ఆమె హృదయం ఉండవలసిన చోటనే ఉంది. కానీ ఆ విషయాన్ని ఆమే
ప్రకటించుకోవాల్సిన మానసిక ఏకాంతజీవనం ఆమెది. ఆ మాట కొస్తే కరటకుడు రాక ముందే,
తనకేమీ సంబంధం లేకపోయినా, ఆ పెళ్లి తప్పించమని రామప్పంతుల్ని పీడిస్తూ ఉంటుంది
మధురవాణి – అదీ అకారణంగా! ఎందుకంటే ముసిలివాడు పెళ్లి చేసుకోడం తప్పని ఆమె
మనసుకు తెలుసు కనక!!
అలాగే
ఆమె హృదయాన్ని చూరగోనే వ్యక్తులు – రూపవంతులో, అమిత ధనవంతులో, కీర్తి మంతులో కాదు,
మిక్కిలీ మంచివారు!
పెళ్ళికూతురు వేషం కట్టిన శిష్యుడు పెళ్ళయ్యాక పారిపోతాడు, కథ అనూహ్యమైన
మలుపు తిరుగుతుంది. రామప్పంతులు జరగని కూనీ జరిగిందని నమ్మించి పెళ్ళికొడుకైన
లుబ్దుడి మీద హత్యానేరం మోపుతాడు.
‘లోకం అంతా స్వప్రయోజనపరులే ‘ అని మధురవాణి అనుభవం ఆమెకు
చెప్తుంది. తద్విరుద్ధంగా - నిర్దోషి అయిన లుబ్ధుడి మీద కేవలం జాలితో సౌజన్యారావు
అనే లాయరు కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడని విని ఆమెలో కుతూహలం రేగుతుంది. పరోపకారం అతని సహజగుణమని
తెలిసి కలవాలని ముచ్చట పడుతుంది. పరిపూర్ణమైన అతని మంచితనంలో చెడ్డే లేదనిపించి ఆమెలో
సౌజన్యారావు పట్ల అమాయకమైన
భక్తి అంకురిస్తుంది.
లుబ్దుడికి
పెళ్ళైన పిల్ల ఆడపిల్లే కాదన్న నిజాన్ని చెప్పి, అతనికి సహాయం చేసేందుకు వెళ్లి
కలుస్తుంది. అతనంటే తన మనసులో ఉన్న ఇష్టాన్ని నిష్కపటంగా బయట పెడతుంది. అతను ఏంటి
నాచ్ గనక, వేశ్యలతో సావాసం చెయ్యడం వ్రతభంగమని గునుస్తూనే ముద్దు పెట్టుకోడానికి
సమ్మతిస్తాడు. కానీ ఆమె అతన్ని అక్కడే ఆపుతుంది. ఇష్టాన్ని నిర్భయంగా
ప్రకటించడంలోనూ; ఎదుటి వారి అభ్యంతరాలను గమనించి, దూరం జరిగి తన స్వాభిమానాన్ని
నిలుపుకోడం లోనూ కూడా ఆమె వ్యక్తిత్వం
ప్రకాశం అవుతుంది.
ఆమె
మేధస్సు
నాటకంలోని ప్రధాన వ్యూహాలను నడపడమే కాక, ప్రతికూల వాతావరణంలో కూడా తెలివి నుపయోగించి ఒడ్డు చేరాలన్న స్ఫూర్తి
మనలో కలుగజేస్తుంది. మధురవాణి తనతో సంబంధం గల వాళ్ళందరి గుట్టు మట్లూ తెలుసుకోగల మనిషి
లాగా కనిపిస్తుంది. ఆమె తన యోగక్షేమాలు తాను చూసుకుంటుంది గానీ, వాటి కోసం ఇతరుల పైన ఆధారపడదు. అయినా ఇతరుల
యోగక్షేమాలూ చూడగలదు.
"మధురవాణి స్వావలంబన ఎంత సమర్ధమైనదో, ఆమె ఆత్మ విశ్వాసం అంత అచంచలమైనది. ఎలాటి పరిస్థితిలోనూ ఆమె తడబడడమూ, బేజారెత్తటమూ, నిస్సహాయురాలు కావటమూ మనం చూడం."_ (కొ.కు)
"మధురవాణి స్వావలంబన ఎంత సమర్ధమైనదో, ఆమె ఆత్మ విశ్వాసం అంత అచంచలమైనది. ఎలాటి పరిస్థితిలోనూ ఆమె తడబడడమూ, బేజారెత్తటమూ, నిస్సహాయురాలు కావటమూ మనం చూడం."_ (కొ.కు)
ఉదాహరణకి
రామప్పంతులు తన ఫోర్జరీ నేరం బయట పడిందనుకుని – ‘పీక తెగిపోతుంది, ఏమిటి
సాధనం?’ అని కాళ్ళూ, చేతులూ తొక్కుకుంటూ ఉంటే ... ‘యంత్రం ఎదురు తిరిగిందో? ఐతే చక్రం అడ్డు వేస్తాను’
అని ధీమాగా చెప్పి, అంత పనీ చేసుకొస్తుంది. వివిధ సందర్భాల్లో ఆమె ఇచ్చే చిట్టి
పొట్టి సలహాలు ఒక పక్క నవ్వు పుట్టిస్తూనే, మరో పక్క ఆమె సమయస్ఫూర్తికి అద్దం
పడతాయి.
ఇక
మధురవాణి సంభాషణలు నాటకంలో ప్రత్యేకంగా విశ్లేషించుకోవలసిన అంశం. అవి ఆమె
లోకానుభవాన్నీ, దాని నుండి ఆమె నేర్చుకున్న పాఠాల్నీ వెల్లడిస్తాయి. ఆమె మాటల్లో
ఆమె కున్నటువంటి ‘సమదృష్టి’
అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తి మాటల్లో ‘వైరుధ్యం’ పసిగట్టిందో,
సందర్భాన్నానుసరించి – సరైన మార్గం లోకి మళ్లమని నిర్బంధించడమో, బుద్ది చెప్పడమో,
ఎత్తి చూపడమో, అదేదీ కుదరక పోతే కనీసం చురక అంటించడమో అయినా చెయ్యక మానదు.
1. పరువైన మొగాళ్లొచ్చి నప్పుడు పరువైన
ఆడవాళ్లెందుకు రాకూడదు అని గిరీశాన్ని హేళనగా ప్రశ్నించడంలో ఆమె ధిక్కారస్వరం
వినపడుతుంది.
2. తాను చేస్తే లౌక్యం, మరొకరు చేస్తే మోసం
అనరాదా? అబద్ధానికి అర్ధం ఏమిటి? అని రామప్పంతులి జీవనవిధానంలోని డొల్లతనాన్ని ఈసడిస్తుంది.
3. ఆయన కంటే మీ న్యాయం ఏం బాగా ఉంది?
తనకి రొట్టా, ఒహడికి ముక్కానా? అని కరటకశాస్త్రి ఆలోచనల్లోని
సంకుచితత్వాన్ని పదే పదే ఎత్తి చూపి, అతనిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తూ
ఉంటుంది.
4. లుబ్దుడిని సైతం ‘ఏమి ఈ మగవారి
చిత్రం! ఇంతసేపూ పెళ్లి వద్దని వగిస్తిరి; ఇప్పుడు పెళ్లి తేలిపోయిందని
వగుస్తున్నారు’ అని పరిహాసం చేయకుండా వదలదు.
ఎవరి
భావాల ప్రభావాల వల్లా కాక తనదైన ఆలోచనా సరళి ప్రకారం నిర్ణయాలు తీసుకునే ఆమె
ప్రత్యేకత సౌజన్యారావుతో ఆమె చేసిన చర్చలో మన ముందు కొస్తుంది. తానెంతో
ఆరాధిస్తున్న వ్యక్తి అయినా, అతని ఆలోచనలు తప్పుదారిలో ఉన్నాయని గుర్తించి, తన
భావాలను స్పష్టంగా వ్యక్తీకరించి
సౌజన్యారావును నిరుత్తరుడ్ని చేస్తుంది. ఆ సన్నివేశంలోని నాటకీయత కోసమే కాక ఆమె
మాటల అంతరార్ధం గ్రహించేందుకు ఒక్క సారి ఆమాటల్ని గుర్తుచేసుకునే అవసరం ఉంది.
‘వేశ్య
జాతి చెడ్డ కావచ్చును. గాని తాము శలవిచ్చినట్టు చడ్డలో మంచి వుండకూడదా? మంచి
యెక్కడున్నా గ్రాహ్యం కాదా అండీ?’ అని వేసిన ఆమె ప్రశ్న గురించి
ఆలోచిస్తే, వృత్తి నుండి
ప్రవృత్తిని వేరు చేసి చూడమన్న ఉపదేశం వినిపిస్తుంది. మగవారి ‘మనసు
రంజింప’చేయడమనే పనిని ఒక వృత్తిగా తయారు చేసి ఉంచిన పరిస్థితులతో పోరాటం సాగించాలి
గానీ, తప్పనిసరి అయి ఆ వృత్తిని అవలంబిస్తున్న స్త్రీలను అసహ్యించుకోవడం ఎంత
పొరపాటో అర్ధమౌతుంది. మధురవాణి పాత్ర ద్వారా గురజాడ మనోభావాలు వెల్లడి అవుతాయి.
గురజాడ వేశ్యలను హేయ దృష్టితో చూడలేదు. నీచంగా తలచలేదు. అయినా వేశ్య వృత్తిని ఆయన ప్రోత్సహించలేదు, ప్రశంసించ లేదు. దాన్ని లేకుండా చేయడమే ఆయన తన సమాజ సంస్కారాల్లో
చేర్చిన ముఖ్య ఆచరణల్లో ఒకటి. మధురవాణి ఆయన లోకపు పరిజ్ఞానాన్నీ, లోకాన్ని ప్రశ్నించే సంస్కారాన్నీ
పుణికి పుచ్చుకుని మన ముందుకు వస్తుంది.
తన
లోకజ్ఞానానికి కారణం తల్లి తనకు నేర్పిన పాఠాలేనని ఒకటి రెండు సందర్భాల్లో తన తల్లికి కృతజ్ఞత
చెప్పుకుంటుంది. ఆడవారి మీద ప్రయోగించే ఆయుధాలలో అతి ముఖ్యమైనది పొగడ్తలని లోకంలో
చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా ‘విద్వాంసుల’ ఇచ్చకాలకు మైమరచి, మెరమెచ్చు
మాటలకి పొంగిపోవద్దని చెప్పే ఆ తల్లి ఉపదేశం ఆధునిక మహిళ క్కూడా ఉపయోగపడవచ్చు.
కరటకశాస్త్రి
అన్నట్టూ చూపితే అందుకు పోయే చురుకుదనం మధురవాణి
సొంతం. దాని కారణంగా బాహ్యంగా ఉండే సమస్యలను తన స్వశక్తితో
పరిష్కరించుకోగలదు. తాను కోరిన పరిస్థితుల్ని తానే సృష్టించుకోనూ గలదు. కానీ ఆమె
పాత్రలో అంతస్సంఘర్షణ లేక పోలేదు. ఆమే ఒక చోట అన్నట్టూ ‘వలలో ముత్యపుచిప్పలు పడితే లాభం కానీ
నత్తగుల్లలు పడితే మోతచేటు’ కదా. ఆమె తన వృత్తి కారణంగా తన
జీవితంలో తప్పనిసరిగా ఏర్పడే ప్రేమరాహిత్యాన్ని గుర్తించుకుంటుంది. పైపై కిరాయి
జీవితాన్ని గడపడానికి ఆమె మానసం ఘోషిస్తుంది. అందుకే ఇక మీదట సీమకుక్కలనూ,
ఊరకుక్కలనూ దూరంగా ఉంచాలని నిర్ణయం చేసుకుంటుంది. ఇది ఆమె స్వాతంత్ర్య శక్తికి మకుటాయమానమైన
ఉదాహరణ.
మధురవాణి
లోని ఈ ప్రత్యేకతను మిగిలిన పాత్రలు సైతం నాటకంలో గుర్తించినట్టే
కనిపిస్తుంది. ఒంటరి ఆడది, తన వద్దకు
మగవారు వచ్చి ఇచ్చే డబ్బే ఆధారంగా బ్రతికేది, ఆ వృత్తి పట్ల లోకానికున్న
వ్యతిరేకతను తెలిసిన వ్యక్తి – అయినా సరే తాను ఒకరి కింద అణిగి ఉండదనీ, తాననుకున్నపని
నిస్సంకోచంగా చేసి తీరుతుందనీ అందరికీ తెలిసేటట్టూ ప్రవర్తించడం – ఆమె సాధించిన
విజయాల్లో ఒకటి. దానికి వారు పెట్టిన పేరు ‘తిక్క’! సౌజన్యారావు కూడా ‘చిత్రం! వెయ్యి
రూపాయల కంటే వక ముద్దు ఎక్కువ విలవా?’’ అని విస్తుపోతాడు. ‘ఏమి పెంకెవు!’ అని
మురిసిపోతాడు. తన కున్న ఆ ‘తిక్కే’ అందరికీ ఉపచరిస్తోందని గర్వంగా
చెప్పుకోగలిగిన సార్ధక జీవి మధురవాణి.
ఈ
సందర్భంలో, కేవలం సుబ్బికి ఆమె చేసిన ఉపకారమే కాక నాటకం లోని తక్కిన స్త్రీల
పట్ల కూడా ఆమె చూపే సంఘీభావం ప్రత్యేకించి చెప్పుకోదగ్గది. మగవారి
కారణంగా సాటి ఆడవారితో అసూయలు పెంచుకోడం, వైరం సాగించడం ఆమె వైఖరి కాదు.
రామప్పంతులు విషయంలో, లుబ్దుడి వితంతు కూతురు మీనాక్షి కున్న బలహీనత గురించి
తెలిసినా, ఆమెను అర్ధం చేసుకుని ఆమెను తన నేస్తం అని చెప్పుకుంటుంది. పగలబడి
నవ్వొస్తున్నా, మంచం కింద దూరే ఘట్టంలో గిరీశం ప్రియురాలు పూటకూళ్ళమ్మకే మధురవాణి
సానుభూతి అని గుర్తించి సంతొషించకుండా ఉండలేం.
ముందుగా
గిరీశాన్నీ, తరువాత రామప్పంతుల్నీ, ఆ పై తన చుట్టూ మూగుతున్న పెద్దమనుషుల్నీ
వదిలించుకుంటున్న ఆమె పాత్ర క్రమ పరిణామాన్ని విశ్లేషిస్తూ ప్రముఖ రచయిత సంజీవదేవ్
ఇలా రాస్తారు:
ఒక్కొక్క
పీడనే వదిలించుకుని – సంఘం మురికిగుంట (society’s gutter) కాకుండా, పురుష స్వార్ధపు గడప చాప (door mat) కాకుండా, మంచినీటి ఊటగా బాధల్లో ఉండే వాళ్ళ బతుకు
అనే ఓడకు తెరచాపగా పరిణతి చెందింది.
__________________________________________________________
Wednesday, 28 September 2016
రచయితలు థర్డ్ పార్టీ లా ?
http://www.andhrajyothy.com/artical?SID=292122
రచయితలు ఈ వ్యవస్థలో పై పై తేలే తెట్టు (ఒట్టి సంఘటనలు) నే
కథలోకి తీసుకోక ... వాటి వెనుక సమస్యల్నీ, సమస్యల్లో మనుషుల్నీ, మనుషులను
నడిపించిన కారణాల్నీ పట్టుకునే ప్రయత్నం చేయాలని ... వ్యాసకర్త చెప్తున్నట్టు
అర్ధం చేసుకున్నాను. వర్ధమాన సాహిత్యం మెరుగవ్వాలన్నఆకాంక్షతో చేసిన మంచి
అబ్సర్వేషన్, దానికి తగిన సూచనా అని సంతోషించే లోగా - అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలు
కనిపించాయి. మొత్తం వ్యాసం చదివితే కొన్ని తప్పుడు సందేశాలు పంపుతోందేమో అనిపించింది.
బర్నింగ్ ఇష్యూస్
మామూలు మనుషుల్ని జీవిత పరిధిలో తాకే అనుభవాలు కాదు,
రాష్ట్రాన్నో, దేశాన్నో కుదిపేసే విషయా(గ్రాండ్ థీం) లైతేనే కథకుల పెన్నులు
కదులుతున్నాయి అని రాసేరు. దీనిని బట్టి బర్నింగ్ ఇస్స్యూస్ పై రచన
సాగించడం పట్ల వ్యాసకర్తకు అభ్యంతరం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ సందర్భంలో జార్జ్
లూకాస్ నవల గురించి చెప్పిన మాటలు ఏ ఉత్తమ రచన కైనా ఉండాల్సిన లక్షణాలే
అనిపిస్తాయి. “రచనలో వర్ణించ బడ్డ జీవితానికీ కాలానికీ సంబంధించిన ప్రత్యేక
లక్షణాల అనుభూతి పాఠకుడికి కలగాలి. మానవజాతి చరిత్రలో ఆ కాలానికీ, తద్వారా ఆ
అనుభూతికీ ఉన్నప్రత్యేకతని చూపించాలి.”
ఒక రకంగా సమస్త సాహిత్యమూ ఆయా కాలాల ‘బర్నింగ్ ఇష్యూ’ లకు
ఆయా రచయితల ప్రతిస్పందనగా భావించవచ్చు. వాటికి మానవజాతి చరిత్రలో దక్కే స్థాన
మెటువంటిదో రాబోయే తరాలు నిర్ణయిస్తాయి.
రచయిత జీవిస్తున్న ఆ ప్రత్యేక కాలానికి చెందిన ప్రత్యేక
సమస్యలే ‘బర్నింగ్ ఇష్యూస్’. వాటికి స్పందించి కలం పట్టడం, వాటిని తమ అక్షరాల్లో
శాశ్వతీకరించడం ప్రతీ రచయితకీ ఉండతగ్గ లక్ష్యమని అనిపిస్తుంది.
చేత కాక పోతే రాయకండి!
పైకి లెఫ్టిస్టులకూ, రైటిస్టులకూ అందరికీ వర్తిస్తున్నట్టు
రాసినా వ్యాసకర్త ప్రధానంగా సామాజిక స్పృహ తో రాసేవారినే గురిచేసినట్టు కనిపిస్తుంది.
ఆయన వ్యాసంలో మెచ్చుకున్న రచయితల పేర్లు కూడా ఆ విషయాన్నేసూచిస్తాయి. సమాజం
గురించి రాయాలనుకుంటే ‘వారి’లా రాయండి! రాయలేరు కనక ఆ విషయాలను ఎత్తుకోకపోవడమే ఉత్తమం
అన్న పద్ధతిలో వర్ధమాన రచయితలను నిరుత్సాహపరుస్తూ వచ్చారు వ్యాసకర్త. మరి ఇదే అంశం
మీద ఆయనే మెచ్చుకున్న కుటుంబరావు గారి అభిప్రాయం ఇలా ఉంది: ‘విస్తృతమైన
జీవితానుభవం గల కథకుడు కూడా పరిమిత సంఖ్య లోనే పనికివచ్చే కథలు రాయగలడు. అందరూ
వాస్తవజీవితాన్ని గురించే రాస్తున్నారనుకున్న పక్షంలో ఒకే కథకుడు రాసిన పది కథల
కంటే పది మంది రాసిన పది కథలు ఎక్కువ జీవితాన్ని ప్రతిబింబిస్తాయి.’
కనుక ఎవరో మహారచయిత అంత బాగా మనం రాయలేం కనక రాయడమే అనవసరం
అన్నధోరణి సర్వత్రా హానికరం. కావలిసిందల్లా వాస్తవ జీవితాన్నిమన రచనలో ప్రతిబింబించాలన్న
ఆశయం మాత్రమే.
అలాటి ఆశయం కల రచయితల నుద్దేశించే అనుకుంటాను, (చెహోవ్ ని
కోట్ చేస్తూ) అతని (రచయిత)కి అర్ధం కాని విషయాల జోలికి వెళ్ళడం వల్ల ఏ మంచీ
జరగదు అని రాసేరు. ఆ మాట నిజమే. కనుక రచయితలను - ‘తమను కదిలించిన’
విషయాల గురించి మరింత లోతైన అవగాహనను ఏర్పరచుకొని రాయమనడం న్యాయం. అంతే తప్ప-
దేనికైనా ‘కదిలి’ (వ్యాస కర్త మాటల్లో చెప్పాలంటే ‘చదివి చలించి’) కలం
పడితే – అదే తప్పు ధోరణి అని చెప్పడం ఎంత వరకూ సమంజసం? మెహెర్ గారి వ్యాసం పదే పదే
అదే రేఖను దాటుతూండడం గమనార్హం.
మార్కెట్ శక్తులకు లోనై రచన చెయ్యడం కంటే –మార్క్సిస్ట్
నిబద్ధతతో రాయడమే పనికిమాలిన పని అని వ్యాసాంతం లో తేల్చేసారు. ఒక కుర్ర రచయిత తన
తప్పు తెలుసుకొని, నిబద్ధత తో రచన సాగిస్తానంటే - దానర్ధం జీవితం లోని వైవిధ్యాన్నిత్యజించడమే
అని ఎలా నిర్దారించారో అంతుబట్టదు. ఒక దృక్పధం కలిగి ఉండడం అంటే కళాహీనతకూ,
అవగాహనా రాహిత్యానికీ గుర్తన్న విధంగా వ్యాసం సాగింది.
సివిక్ గిల్ట్
మౌలికంగా సమాజంలో రచయితల స్థానం పట్లనే వ్యాసకర్త పరస్పర
విరుద్ధ అభిప్రాయాలను ప్రకటించారు. అటు సింహాలకీ, ఇటు వేటగాడికీ చెందని హైనాలంటూ రచయితలను
థర్డ్ పార్టీగా మొదట్లో చూపిస్తారు. మరో చోట న్యూస్ కెమెరా కళ్ళనే
అంతచ్చక్షువులుగా స్వీకరించే రచయితలు తమ
సివిక్ గిల్ట్ ను మాత్రమే తృప్తి పరచుకోగలరని రాస్తారు. వేటగాడి జాతికీ, సింహం
జాతికీ కూడా చెందని హైనాకు ఏ రకమైన గిల్ట్ అయినా ఎందుకుంటుంది అన్నప్రశ్న రావడం లేదా?
వార్తల్లో వచ్చిన విషయాల ప్రభావం తోటి మనుషులందరి లాగా రచయితలపై కూడా పడడం
సహజసిద్ధం కాదా? రచయితలు దానికి అతీతులైతే మరి ఏ గిల్ట్ ను తృప్తి పరుచుకునేందుకు
వారు రచన సాగిస్తారు? ఇందులో ఏది నిజమందాం?
అసలు రచయితను ఒక థర్డ్ పార్టీగా చేసే ఆ ప్రతిపాదనే సత్యదూరం
అనిపిస్తుంది. తాను జీవిస్తున్నసమాజ వాస్తవాల నుంచి రచయితను దూరంగా విసిరేసే
ప్రయత్నంగా కనిపిస్తుంది.
రచయితలు ఆబ్జెక్టివ్ గా, జీవితపు అన్ని కోణాలనూ
పరిశీలించాలని చెప్పే సాహిత్య సిద్ధాంతానికి కొందరు చేస్తున్నవక్రభాష్యం ఇది. కళలో
ఈస్తటిక్ డిస్టెన్స్ పాటించడమంటే తన పాత్రలకు ఒకింత దూరం జరిగి, జీవితసత్యాలను
ఆవిష్కరించే ప్రయత్నం చేయాలన్నఅర్ధమే తప్ప, దృక్పధాలూ, నిబద్ధతలూ కలిగి ఉండకూడదని
అర్ధం కాదనుకుంటాను.
Subscribe to:
Posts (Atom)