మహిషుడు మూలవాసుల రాజనీ, ఆర్యులు అతనిని యుద్ధంలో ఓడించలేక ‘దుర్గ’ అనే స్త్రీనినియోగించేరనీ, మోసం చేసి మహిషుని మట్టుబెట్టేరనీ ఒక కథనం (నరేటివ్) వినికిడి లోకి వచ్చింది. మహిషుడి ‘వీరమరణా’న్ని సంస్మరించుకుంటున్నారనీ, దుర్గను అవమానిస్తున్నారన్న వార్త – భారత పార్లమెంటులో, గౌ. మంత్రిగారి నోటి వెంటే సామాన్య పౌరులందరికీ తెలిసింది. దీని మీద విస్మయం, ఆగ్రహం, సానుభూతి, చిరాకూ వగైరా పరస్పర విరుద్ధ ప్రతిస్పందనలు బహిర్గత మౌతున్నాయి.
అసహనం మినహా మరో ఆలోచన రానివ్వని ఆవేశపరులను పక్కన పెడితే, ఏ ఛాన్దసవర్గానికీ చెందని తటస్థ పౌరులు సైతం ఈ ప్రత్యామ్నాయ కథనాల పట్ల తమ అసంతృప్తిని ప్రకటించడం కనిపిస్తోంది. అసంఖ్యాకులు తరతరాలుగా వింటూ వస్తున్న కథను తిరగరాస్తున్న ఈ విపరీత ధోరణుల వల్ల విద్వేషాలు రాజుకుంటాయని కొందరు మేధావుల అభ్యంతరం. వారి వాదాన్ని కొంచెం వివరంగా అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
దుర్గను తల్లిగా తలిచి, తమ కష్టాలను తీర్చేందుకై ఆమె అవతారం దాల్చిందని విశ్వసించే సంప్రదాయం ఉంది. ఆర్య దురహంకారాన్ని ఏ కోశానా సమర్ధించని వారిలో, దుర్గను మంచికి ప్రతీకగా, మహిషాసుర వధను కేవలం చెడు మీద మంచి సాధించిన విజయంగా పరిగణించి, దుర్గ పూజల్లో పాల్గొనే ప్రజలూ ఉన్నారు.
అదే కాక, ఒకనాడు ప్రబలంగా ఉండిన మాతృస్వామ్య వ్యవస్థకు ‘శక్తి ఆరాధన’ ఒక అవశేషంగా అని భావించే వారూ ఉన్నారు. మరి ఇటువంటి వారందరూ ‘దుర్గ’ను ఒక కుట్రలో భాగంగా చెప్పే కథ గురించి ఏ విధంగా స్పందించవలసి ఉంటుంది? అన్నినరేటివ్ లూ, ఖచ్చితమైన ఆధారాలతో, రుజువులతో చరిత్ర పుట ల్లోకి ఎక్కని సుదూర కాలానికి చెందిన కథనాలే. వీటిలో ఏది నిజం? ఏది అభూత కల్పన? ఎవరిది మోసం? ఎవరి వైపున ఉంది న్యాయం? ఇలాటి ప్రశ్న లుదయించి సామాన్య పౌరులను ఇబ్బంది పెట్టే మాట వాస్తవమే.
కానీ, నిజానికి మనం వేసుకోవలసిన ప్రశ్నలు ఇవేవి కానే కావని నా అభిప్రాయం. ఇది మరెక్కడా జరగని ‘ప్రత్యెక’ సంఘటనగానో, ఒక వింత పరిణామంగానో భావించడమే మన ఈ గందరగోళానికీ, అది కలిగించే అసహనానికి అసలు కారణం. సాంస్కృతిక పరిశోధకుల ప్రకారం పూర్వీకుల ఊహలు, ఆరాధనలు కాలక్రమంలో దివ్య గాధలుగా మారడం ఒక సర్వ సాధారణ విషయం. ఆ క్రమంలో - ఒకే కథకు ఒకటి కంటే ఎక్కువ కథనాలు ఏర్పడే ‘వైనం’ మన సంస్కృతిలో చాలా సందర్భాల్లో కనబడుతుంది.
తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు ‘నా రచనా నేపధ్యం’ వ్యాసంలో సామాజిక అంశాలనూ,సాంస్కృతిక కథనాలనూ కలిపి చర్చిస్తారు. లింగ వివక్షను తొలిసారి గమనించానని చెప్తూ స్వయంగా ఆయన చిన్ననాడు విన్న ‘ఈదమ్మ కొలుపు’ కథాగానాన్నిఉదహరిస్తారు. మాంధాత అనే రాజు స్త్రీ అల్పమైనదని నమ్మి, తాను స్త్రీగర్భాన కాక, తండ్రి కడుపు చీల్చుకుని పుడతాడట. అటు తరువాత కూడా ‘ఈదమ్మ’(విధి) అధికారాన్ని అంగీకరించక ఆమె తో తలపడతాడట, అష్ట కష్టాలూ పడతాడట.

ఆ కథను అలా ఉంచితే, ఒక ముప్పై నలభై ఏళ్ల కాల పరిమితిలో ఒక జానపద కథారూపమైన ‘ఈదమ్మ కథ’ రేడియోకి వచ్చేసరికి ‘మాంధాత కథ’ గా మారిందని రఘోత్తమరెడ్డిగారు చేసిన పరిశీలన మనకు చాలా విలువైన సమాచారం అందిస్తుంది. కథ ఎవరి పరంగా చెప్తున్నారో ఆ అంశం కూడా గుర్తించాల్సిన సంగతేనని తెలియజేస్తుంది. దుర్గ పరంగా చెప్పిన కథకూ, మహిషుని పరంగా చెప్పిన కథకూ ఉండే భేదాలను అర్ధం చేసుకోవాలంటే – ఆ కథనాలు ఎవరికి, ఎవరి ద్వారా, ఏ రూపాన, ఏ కారణాన రూపొందిన కథలో గుర్తించాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని విశదంగా పరిశీలించాలంటే ఎన్నో ఉదాహరణలు మన పురాణాల్లోనే మనకు దొరుకుతాయి.
ప్రాచీన కాలం లోని భారతదేశ చరిత్రను గమనిస్తే, వైదికమతం లో పేరుకుపోయిన కర్మకాండలకూ, జంతుబలులకూ, కుల వివక్షకూ – వ్యతిరేక స్వరం పలుకుతూ బౌద్ధ మతం ఉద్భవించి, ఒక దశలో ఉద్ధృతంగా ఉండి, క్రమేణా సన్నగిలిందని మనకు తెలిసిన విషయమే. తరువాతి కాలంలో బుద్ధుడిని విష్ణువు అవతారంగా చెప్పే ఆసక్తికరమైన కథ ఒకటి లింగ పురాణంలో ఉంది. అది ఈ సందర్భంలో ఒక నూతన దృష్టికోణాన్ని అందింస్తుందని నా నమ్మకం.
కాశీకి రాజైన దివోదాసును బ్రహ్మ ధర్మపాలన చేసి భూమండలాన్ని రక్షించమని కోరాడట. దానికి దివోదాసు ఒప్పుకున్నాడు కానీ ఒక షరతు పెట్టేడట. దాని ప్రకారం దేవతలూ, నాగులూ మొదలైన వారందరూ భూమి మీద ఉండకుండా తమ స్వస్తానాలకు వెనుదిరిగి పోయారట. ధర్మం సంగతి సరే గానీ, శివుడికి మాత్రం తన కత్యంత ప్రియమైన కాశీ నగరాన్ని విడిచి పెట్టి ఉండడం దుస్సహం అయిపోయిందట. దివోదాసును ఓడించేందుకు ఉపాయంగా, విష్ణువు బుద్ధుడిగా అవతారం దాల్చాడట, తన బోధలతో ప్రజలను వైదిక ధర్మానికి విముఖుల్ని చేసాడట. ప్రజలు అధర్మ వర్తనులవడం చేత రాజు దివోదాసు శక్తిహీనుడయ్యాడనీ, తద్వారా భూమిపై దేవతల ప్రాబల్యం పెరిగిందనీ కథ.
ఈ కథను విన్న బౌద్ధులు, “హన్నా! మా బుద్ధ భగవానుని బోధలు విని ప్రజలు ధర్మభ్రష్టులయ్యా రంటారా?” అని మండిపడితే అది సమంజసమవుతుందా? ఈ కథను ఒక చారిత్రక నేపధ్యంలో అర్ధం చేసుకోవడమే సరైన పద్ధతి. ఒక కీలకమైన దశలో బౌద్ధం పట్ల వైదిక మతాని కుండిన వైఖరి -ఈ కథ మనకందించే సమాచారం.
ఈ కథనాల్లోని సత్యం ఏదైనప్పటికీ – చరిత్ర గతిలో చోటు చేసుకున్న మార్పులు, ఆనాటి సాంస్కృతిక అంశాలను ఎంతగా ప్రభావితం చేయగలవో మనకి ఈ ఉదంతాలు స్పష్టం చెయ్యగలవు.
చరిత్ర నెప్పుడూ విజేతలే రాస్తారని అనడం వెనక ఒక తిరుగులేని చారిత్రక సత్యముంది. పాలకులు గెలుచుకున్న రాజ్యాన్ని భద్రంగా నిలబెట్టడానికి ఉపయోగపడే ఆలోచనలూ, ఆశలూ, విశ్వాసాలూ ప్రజల సాంస్కృతిక దృక్పధంలో భాగం కావడం అనివార్యం. మనకు తరతరాలుగా అందిన గాధలన్నిటి వెనకా వాటిని కథలుగా మలిచినవారి దృక్కోణం విధిగా ఉండి తీరుతుంది. ఈ నిజాన్ని గుర్తించి మరుగున పడి ఉన్నకథలకు వేదిక కల్పించడం ప్రజాస్వామ్య వాదుల కర్తవ్యం.
విస్తృతమైన ప్రచారం లో లేని ఎన్నో కథలు ఆ కాలపు వాస్తవాలను తమలో నింపుకున్న భిన్నవర్గాల, జాతుల చరిత్రలు. అవి వారి పూర్వీకుల నుండి వారి కందినవైనా, ఈనాడు వాటిని మనందరి సమిష్టి జ్ఞానసంపదలో భాగమని మనం గుర్తించవలసి ఉంది. మనం నమ్ముతూ వచ్చిన విలువలను ప్రశ్నించినంత మాత్రాన, వారిని చీదరించుకోవడం, ఆ కథనాల పట్ల శత్రువైఖరిని పాటించడం అసంగతం. ఇలాటి ఆల్టర్నేట్ నెరేటివ్లు (ప్రత్యామ్నాయ కథనాలు) మన కందించే చరిత్ర శకలాలు ఏమిటా అని విశ్లేషించుకోవాలి. వాటిని ఆకళింపు చేసుకునేందుకు, ఒక నిర్దిష్టమైన ఆలోచనా క్రమాన్ని, సమాజం అలవరుచుకోవలసి ఉంది.
ఆ కొత్తచూపు తో ప్రస్తుత విషయం ‘దుర్గ, మహిషుల కథ’ ను పునః పరిశీలన చేద్దాం. బహుజనులు వెలుగు లోకి తెచ్చిన కథ ప్రకారం, మహిషుడు అసురుల రాజు, అతన్ని చంపేందుకు దుర్గను దేవతలు పంపేరు, ఆమె మహిషుడితో తొమ్మిది రాత్రులూ గడిపి, నమ్మించి, పదవ రోజున అతన్ని చంపేసింది.
మహిషుడు మోసపోయి మరణించిన రోజు కనుక ‘అసురులు’
దుర్గాపూజను చూడరు, అతనికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, వారి పూర్వీకులను పూజించుకుంటారు. ఈకథను చట్ట సభలో ఉటంకించినదీ, దానిని పరిగణిస్తున్న వారందరినీ ‘భ్రష్ట మనస్కుల’నేదీ ప్రజల మధ్య విభేదాలు పెంచడానికీ, రాజకీయమైన లబ్ది పొందడానికే అని నా నిశ్చయం. అయినప్పటికీ, ఈ ప్రచారం వల్ల జరిగిన అనేక పరిణామాల్లో, ఒక మంచి జరిగిందని మాత్రం అనిపిస్తోంది - అదేమిటంటే, ‘అసురులు’ అనే పేరు తో ప్రాచీనమైన తెగ ఒకటి ఉందన్న విషయం యావద్భారతదేశానికీ తెలిసింది.
ఈశాన్య భారతంలో అసుర జాతి ఇప్పటికీ ఉనికిలో ఉన్నది. వారు నాగరికత తెలియని గిరిజనులు. మహిషాసురుడు తమ దేవుడిగా వారు కొలుస్తారు. ప్రస్తుతం 10,000 మంది మాత్రమే ఈ జాతి వాళ్ళుఉనికిలో ఉన్నారు. బీహార్, జార్ఖండ్, బెంగాల్ ఇతర ఈశాన్య రాష్ట్రాలలో నివసిస్తున్నారు. అసురజాతి అంతరించిపోతున్న జాతిగా భారత ప్రభుత్వం ప్రకటించింది. వారిలో 7,000 మంది వరకుమాట్లాడే వారి సొంత భాష అంతరించడం ఖాయం అని యునెస్కో ప్రకటించింది. వారి ఇతిహాసాలను వీలైనంత సమగ్రంగా main stream సంస్కృతిలో అంతర్భాగం చేసే ‘కార్యం’ మన తక్షణ కర్తవ్యం. ఈ సందర్భంలో శ్రీశ్రీ దేశచరిత్ర ల్లోని పంక్తులను ఒక్క సారి స్మరించుకోవాల్సి ఉంది.

ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పుడు !
దాచేస్తే దాగని సత్యం .
ఈ సందర్భంగా, దాదాపు వైదిక మత మంత ప్రాచీనమైన జైన మత సంప్రదాయాన్ని ఒక్కసారి స్పశించడం సముచితంగా ఉంటుందనిపిస్తోంది. జైనుల తత్వ వివేచనలో ఒక అత్యద్భుతమైన అంశం ‘నయవాదం’.
దాని ప్రకారం ఏ ప్రతిపాదన అయినా ఒక పరిమితార్ధం లోనే తప్ప, అన్ని అర్దాలలోనూ నిజం కాదు. కనుక అది పాక్షిక సత్యమనీ, సాపేక్ష సత్యమనీ చెప్తారు. అది ఏనాడూ సంపూర్ణ సత్యంలో ఒక భాగం మాత్రమే. ఈ పరిమితిని అర్ధం చేసుకున్నందు వల్ల తాము నమ్మినదే సత్యమనీ, సమగ్రమనీ అహంకరించే ధోరణిని మనం వదులుకోగలం. ఎన్ని విభిన్న కథనాలు సమాజం లో ప్రచారం లోకి వస్తే, ఆ సమాజం అంత పరిణతి చెందుతోందని, సత్యానికి అంత దగ్గరౌతున్నామనీ అర్ధం చేసుకోవచ్చు.
సంస్క్రు తార్ధం ఏమైనప్పటికీ, ఇతిహాసాలంటే తెలుగు భాష వాడుకలో చరిత్రా, కల్పనా కలిసిన రూపంగా అర్ధం చేసుకుంటాం. కనుక మనకు తెలిసిన కథనాలే పరమ సత్యాలనే ధోరణిని వదులుకుంటే, విభిన్న కథనాల ద్వారా చరిత్ర సంబంధించిన విభిన్న పార్శ్వాలతో పరిచయం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఆ చర్చకు అవసరమయ్యే మానసిక పరిణతిని అలవరుచుకుందాం.
రాజహంసలు పాలూ, నీరూ కలిసిన మిశ్రమం లో పాలను వేరు చేసి తీసుకోగలవని అంటూ ఉంటారు. ఎవరెంత రెచ్చగొట్టినా, మనం మాత్రం మన సమతౌల్యాన్ని కోల్పోకుండా – రాజహంసల్లాగా ‘మిత్’ అనే చట్రంలో బిగించి ఉన్న ‘చరిత్ర’ను గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఈ కథనాల వెనుక మూల కారణమేదైనా, మనం చేపట్ట వలసిన కార్యం అన్నిటినీ నిష్పక్షపాతంగా సమీక్షించడం... వాటి నుండి అవసరమైన గుణపాఠాలను నేర్చుకోవడం.
ప్రత్యామ్నయ భావనలను స్థిమిథంగా చూసి,పరిగణన లోకి తీసుకొనే పరిణితి మన లో లేదు.
ReplyDeleteమత ,కుల వాద ప్రమేయంతో జరిగే ఘర్షణలలో జరిగే దొమ్మీ లలో
మితి మీరిన దోపిడీ,ఊచకోతలు, సజీవ దహనం మన సంస్కృతి లో ఈనాటికి అంగాలే!
1984 డెల్ హి , 2002 లో గుజరాత్ లో నేను ప్రత్యక్షంగా చూసాను.
So true... And rulers encourage this intolerant attitude ... It is easy to manipulate the immature masses...
ReplyDelete