Tuesday, 11 January 2022

అవార్డు స్వీకారం – వ్యక్తిగత నిర్ణయం 

ఎవరికైనా అవార్డు లభించింది అంటే, వారు చేసిన కృషిని గుర్తించి, పది మందిలోనూ గౌరవించడం, వారికి ఒక ప్రత్యేకతను అందించడం. అప్పటికే ప్రజాదరణ పొందారన్న దానికి రుజువు కావచ్చు, ఇక ముందు పొందబోతారనే దానికి సూచనా కావచ్చు – అవార్డు. అది చేకూర్చే ప్రయోజనం ఏదో ఉందని మాత్రం స్పష్టంగా ఊహించవచ్చు. స్థూలంగా చెప్పాలంటే – ఇంతే, కాని దానిలో చాలా మెలిక లున్నాయి.

కొంత మందికి ఇవ్వడం ద్వారా అవార్డుల ఘనతను పెంచుదామని ఇచ్చేవారు ప్రయత్నాలు చేస్తే, ఆ అవార్డును సామ దాన భేద దండోపాయాలతో – పుచ్చుకుని, తద్వారా ‘ఘనత’ను కొట్టేయ్యాలని అనేకులు ప్రయత్నిస్తూ ఉంటారు. వారి అర్హత గురించి అనేక అనుమానాలు వినవస్తాయి. దూషణ భూషణ తిరస్కారాలకు అతీతమైన కార్యశూరులు వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగిపోతారు. అది ఎంత చిన్న సంస్థ అయినా సరే, లోపాయకారీ ఒప్పందాల వల్ల లభిస్తున్నా సరే, డబ్బులిచ్చి కొనుక్కుని అయినా సరే అవార్డు కొట్టేయ్యాలి అని గట్టి పట్టుతో ఉన్నవారు, ఇప్పుడు దానిని దక్కించుకున్న వారి కోసం చప్పట్లు కొడితే, ఏదో ఒక రోజున మన ప్రయత్నాలో, పైరవీలో ఫలించి మనకు అవార్డు అంటూ వచ్చినప్పుడు – మన కోసం కూడా చప్పట్లు కొట్టే గుంపు ఉంటారనే ముందు చూపుల వారూ అనేకులు ఉంటారు, నా మట్టుకు నాకు,వారితో పేచీ ఏదీ లేదు. అవార్డులనేవి కొన్ని ద్వారాలను తెరుస్తాయి, కొన్ని మార్గాలను సుగమం చేస్తాయి అని మెజారిటీ ప్రజలు నమ్మినప్పుడు – వాటి కోసం వారికి చేతనయిన మార్గాలలో ప్రయత్నిస్తున్నారు తప్పేముంది అనుకుంటాను.

అయితే, అధికార చర్యలను ప్రతిఘటించేవారు, దాని నిర్ణయాలను వ్యతిరేకించేవారూ – ‘అవార్డును పుచ్చుకోవడం – ఆమోదాన్ని అందించడంతో సమానం’ అనే అవగాహన కారణంగా అవార్డులను తిరస్కరిస్తారు. తమ స్థాయికి తగినవని తోస్తేనే తీసుకుని, కాని పక్షంలో వదులుకునేవారు, తమ భావజాలానికి అనుకూలమైన వాటిని మాత్రమే ఆమోదించేవారు, కేవలం తటస్థ /ప్రైవేట్ సంస్థల నుండి మాత్రమే తీసుకునేవారు, ప్రభుత్వం నుండి లభించడం అంటే యావత్ ప్రజానీకానికి ప్రాతినిథ్యం వహించేదని భావించి వాటిని మాత్రమే స్వీకరించేవారూ – ఇలా ఎన్నో రకాలు. ఆ స్పందనలలో ఉండే స్వల్ప భేదాలూ, ఈ వైవిధ్యం – అంతా గతంలోని మాట. ఇప్పుడు ఆ గొంతుకలేవీ వినబడడం లేదు పెద్దగా. అసలు ఏ ఒకరినో ఎంపిక చేసి వారికి ఒక ప్రత్యేకతను ఆపాదించడం, గౌరవాన్ని కట్టబెట్టడం – అనే ఆలోచననే మౌలికంగా తిరస్కరించేవారూ ఉంటారట కానీ నేను చూడలేదు. “ఎప్పుడో మాకు రావలసింది కనీసం ఇప్పటి కన్నా ఇచ్చారు కానీయండి” అని మూలిగే ‘గతకాల ప్రతిభావంతుల’ను చాలా మందిని చూస్తున్నాను.

ఇన్ని రకాల వారున్నారు కాబట్టే, ఎప్పటికప్పుడు – అవార్డు స్వీకారానికి సమర్ధనగా వింతవింత కారణాలు వినబడుతూ ఉంటాయి. విప్లవాత్మకమైన భావాలను, ఉత్తమ శిల్పంతో – కథల్లో లోతుగా ప్రవేశపెట్టి తెలుగుకథను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన రచయిత ఒకరు – ‘ఏ అవార్డునైనా, రివార్డునైనా – కథ కోసం తాను చేపట్టిన ఒకానొక ప్రాజెక్టు కోసమే వాడతాను’ అని ప్రకటించి – అవార్డులను స్వీకరించారు. తిరుగుబాటును అతి శక్తివంతంగా తన కవిత్వంలో వినిపించిన కవి మరొకరు – ‘నా కవిత్వానికీ, అవార్డుకూ ఏ సంబంధమూ లేదు, అది తీసుకున్నా – నా గొంతుక అదే స్థాయిలో పలుకుతుంది’ – అని నొక్కి చెప్పారు. ఇలా అవార్డుల గురించి పరస్పర వ్యతిరేక అభిప్రాయాలు వినవస్తున్నా, అవార్డుల గురించిన చర్చ జరుగుతూనే ఉంది. ఏమిటి కారణం? ఎవరు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు? దాని గురించి చర్చించే ముందు, ఎవరినిప్రశ్నిస్తున్నారు – అనే విషయంలో స్పష్టత ఉండాలి.

పురాణాలలో కొత్త స్వారస్యాలు వెతికి చెప్పే పండితులకో, ‘సెల్ఫ్ హెల్ప్’అనే పల్ప్ ఫిక్షన్ రాసుకునే లౌకికులకో అవార్డులు వస్తే, దాని గురించి ఎవరూ ప్రశ్నిస్తారనుకోను. అయితే, ఆలోచనాపరులూ, పదికాలాల పాటు నిలిచే అక్షరాలు రాసి ప్రజల మనసులపై ముద్ర వేసిన సాహిత్యకారుల విషయంలో ప్రశ్నలు లేచే అవకాశం ఉంది. ఏ రచనలకు, రచయితకూ ప్రాసంగికత ఉందో, వారి గురించే చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు అవార్డు లభించిన విప్లవకవి గురించి – ఎవరికీ పట్టనేలేదు నిజానికి.
ఇస్తే తీసుకుంటాం, లేదంటే ఊరుకుంటాం – ఆ విషయాని కంత కంటే ప్రాముఖ్యత లేదు అని నిజాయితీగా నమ్మి, ఆ ప్రకారంగానే ఆచరించే సాహిత్యకారులు ఉంటారు. వారిలో అసాధారణ ప్రతిభాశాలులు, లబ్ధ ప్రతిష్టులు కూడా ఉంటారు – నేను వారికి మాత్రమే ఈ చర్చను పరిమితం చేస్తున్నాను. ఒకవేళ అవార్డు వైపు మొగ్గు చూపినా – అది కేవలం సాహిత్యపరమైన కారణాల వల్లనే – అంటే మరింత ఎక్కువ మందికి తమ రచనలు చేరుకుంటాయనో, మరిన్ని భాషలలో పాఠకులకు అందుతాయనో, ఎన్నో తరాల పాటు సుస్థిరంగా మన స్మృతి నిలిచి ఉంటుందని ఆశ తప్ప, స్వార్ధ పరత్వమో, స్వీయానురాగమో ప్రేరణలు కావని కూడా ఒప్పుకుని, ఆ తర్వాతనే చర్చ సాగిద్దాం.
బాధ్యతతో రచనా వ్యాసంగం సాగించే వారు, ప్రజాస్వామిక విలువలను రచనలలో ప్రధానంగా చిత్రీకరించేవారు – రచయితలను జైలులో వేసిన సమయంలో – అవార్డును స్వీకరించడం ఎంత వరకూ సమంజసం అన్న ప్రశ్న లేచినప్పుడు – “వారి ఇష్టం, తీసుకుంటారో మానుతారో, మనమెవరం నిర్ణయించడానికి?”
“నిజానికి ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని వారినీ, ఆ పరిధి లోనికి రాని రచనలనీ – ప్రశ్నించలేము, విప్లవ రాజకీయాలతో సంబంధం పెట్టుకున్నవాళ్లే అవార్డుల పట్ల ఈ దృక్పధంతో వ్యవహరించడం లేదు, ఇంక అలా పెట్టుకోనివారిని ఏమనగలం?”అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బలమైన గొంతుకలను, తమ పక్షాన చేసుకోవడానికి ప్రభుత్వం అందించే లంచాలు అవార్డ్‌లనే అవగాహన కొన్ని సందర్భాలలో మనకు కనిపిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ, అవార్డు స్వీకారం అనేది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం అనీ, నైతిక చట్రంలో దానిని పెట్టి, తూచకూడదనీ అంటున్నారు. విప్లవాల కబుర్లు చెప్పి, వెనుదిరిగి ప్రభుత్వపు పంచన చేరిన వారిని విమర్శిస్తే అర్థం ఉంది గానీ, అలాటి వాగ్దానాలు చెయ్యని వారిని ఎలా అడుగుతాం అని కూడా చాలా మంది అంటున్నారు. కానీ ఇది వ్యక్తుల మీద ‘మాట తప్పేరన్న’అభియోగాన్ని మోపే సందర్భం కాదు. ఈ విషయానికున్న ప్రాముఖ్యత ఎటువంటిదంటే, వ్యక్తిగత స్థాయిని దాటి సామూహిక స్థాయిలో దాని గురించి, సంవాదం జరగవలసి ఉంది.

మరొక కోణంలో కూడా చర్చ జరుగుతోంది – అనాదిగా తీరిక సమయమన్నదే అందనివ్వకుండా, శతాబ్దాల తరబడి వారి కళనూ, సృజననూ- మెయిన్ స్ట్రీంలోకి రానివ్వకుండా అడ్డుకుని, ఇక దశాబ్దాల నుండి వారి సృష్టిని వారికే తెలియకుండా చేజిక్కించుకుని –అంచుల్లోకి నెట్టివేయబడిన సమూహాలు – స్త్రీలూ, దళితులూ -వారికి సంబంధించిన చర్చ. ఈ గుర్తింపు, గౌరవాల రాజకీయాలలో వారి వైఖరి ఎలా ఉండాలి అన్నది కూడా చర్చనీయాంశమే. దానికి సంబంధించిన ఒక అభిప్రాయాన్ని ఇక్కడ ప్రస్తావించడమే తప్ప – వివరంగా చర్చ చెయ్యబోవడం లేదు:
“ముందు నుయ్యీ, వెనక గొయ్యీలా ఉంటోంది దళితులకు, ఈ వామపక్ష భావాల సాహిత్యకారులు ఎక్కడుంటే అక్కడ – ఇదే జరుగుతుంది, వీళ్ల మాటలు వినకపోతే, దుష్ప్రచారం చేస్తారు, దూరం పెడతారు, సరే అని వీళ్ల మాట విని అవార్డులను కాదనుకుంటే, ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేస్తుంది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ప్రభుత్వపు ఫలానా పాలసీకి నిరసన అనో, మరేదో చర్యకు వ్యతిరేకంగా అనో – మీమీద ఏదైనా ఒత్తిడి తెస్తారేమో. మీరు అదేదీ పట్టించుకోకండి, అవార్డులు వద్దనడం, వెనక్కి ఇచ్చేయడం వంటి కుప్పిగంతులు వెయ్యకండి, మరీ ముఖ్యంగా – దళిత రచయిత్రులను ఉద్దేశించి ఈ సలహా చెప్తున్నాను” అని హెచ్చరికలు వినవస్తున్నాయి.
ఏదో ఒక ఒత్తిడి వల్లనే తప్ప, అవార్డ్ వద్దనే నిర్ణయాన్ని స్వంతంగాఎవరూ తీసుకోరనీ, అవార్డును సాధింవడం, బయటి ఒత్తిడులకు లొంగకుండా దానిని ఉంచుకోవడం- అదే దళిత రచయితల తక్షణ కర్తవ్యం అనీ వీరి విశ్వాసం అనుకుంటాను. ఏది ఏమైనా, దళితులపై దాడులు ఎప్పటికంటే కూడా ఎక్కువైన ఈ తరుణంలో – ఏది సరైన అడుగు, ఏది వారి లక్ష్యం వైపు పడే అడుగు అనేది నిర్ణయించుకోవలసింది వారే.
__________
వెరసి, అవార్డు అంటూ రావడమే సృజనకు శిఖరాయమానమైన మజిలీ అనే ఏకాభిప్రాయానికి వచ్చారు మనలో చాలా మంది.కాబట్టి అవార్డులు నిరాకరించడం – త్యాగం చెయ్యడంతో సమానంగా భావిస్తున్నారు, వాటిని నిరాకరిండం అంటే – తనకుమాలిన ధర్మమే. అలాటి ‘ఆదర్శాలను’ రచయితల మీద రుద్దుతున్నారు అభ్యుదయ వాదులు – అనే అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు.దానితో నేను ఏకీభవించడం లేదు. దీనిలో మనం సాధారణంగా పరిగణనలోకి తీసుకోని అంశాలు ఉన్నాయని నా ఉద్దేశం. అవార్డులను సైద్ధాంతికంగా వ్యతిరేకించడాన్ని కాకుండా, వాటి ఫలితాలను, ప్రభావాలనూ ప్రాపంచిక దృష్టికోణంతో చర్చించే ప్రయత్నం చేస్తాను. ఆ సందర్భంలో ‘ఇమేజ్’కు ఉదాహరణగా చూపించడానికి – తెలుగు సాహిత్యంలో ‘స్టార్’లంటూ ఎవరూ కనబడక కొంచెం ఇబ్బందిపడ్డాను – వేరే రంగాల ప్రముఖుల పేర్లు చెప్పక తప్పలేదు.

ముందుగా ఒక విషయాన్ని స్పష్టపరుచుకోవాలి. అవార్డు అంటే – కేవలం పరోపకార పరాయణత్వంతో ఒకరు మరొకరికి అందించే ఒక బహుమతి అనే భ్రమలో ఉన్నాం. దాని నుండి బయటపడాలి. మనం అప్పుడప్పుడు పొగడ్తలు వింటూ ఉంటాం చూడండి, ‘ఫలానా వారి వల్ల అవార్డుకే పేరు వచ్చిందని’, అది నిజమే కూడా కొన్ని సందర్భాలలో. పుచ్చుకునే వారికే కాదు, ఇచ్చేవారికీ, ఇప్పించే వారికీ– లాభం రకరకాల రూపాలలో (గుడ్‌విల్, లెజిటిమసీ, రెలవెన్స్) ఉంటుంది.

దీనిని వివరించడానికి ఒక ఉదాహరణ ఇస్తాను: అడ్వర్టైజ్మెంట్ రంగంలో బ్రాండ్ అంబాసిడర్‌లు ఉంటారు. వారి ఉత్పత్తికి సరిపోయే, ప్రజల మనసులో నాటుకుపోగల ఒక ఇమేజ్‌ను వారు ఊహించుకుంటారు, దానికి కేంపెయిన్‌ ద్వారా రూపకల్పన చేస్తారు, దానిని పోషించగల ప్రముఖుల కోసం వెతుకుతారు, అప్పటికే అటువంటి ఇమేజ్‌ను ఆ ప్రముఖులు సాధించి ఉంటే కేంపెయిన్ మరింత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కనక అటువంటి వారికి మరింత గిరాకీ. సినిమా నటి తాప్సీ పణ్ణు విషయమే తీసుకోండి, ఒక బలమైన, స్వతంత్ర వ్యక్తిత్వం అనే గుర్తింపు అప్పటికే వచ్చింది కనక ఎముకలకు పుష్టిని ఇస్తుందని చెప్పే పానీయానికి ఆమెను ఎన్నుకున్నారు. అంటే అందచందాలూ, సినిమాల విజయమూ, నటనా సామర్ధ్యం మాత్రమే కాదు, ‘ఇమేజ్’ – అంటే ప్రజలు ఆమెను ఎలా చూస్తున్నారు అనేది అక్కడ ప్రధాన అంశం. సాహిత్యకారుల విషయంలో ఇమేజ్ అంటే, వారి భావజాలం, వారు నమ్మే విలువలతోపాటు, ప్రజల మనసులను తాకగల వారి నైపుణ్యం అని అర్థం చేసుకోవాలి. అరుంధతీ రాయ్ బుకర్ అవార్డ్‌ను తీసుకుంది. విశ్వవ్యాప్తంగా, బుద్ధిజీవులకు పరిచయం అయ్యింది. దాని వల్ల తన భావాలకు, తాను సహకారం అందించే ఉద్యమాలకూ ప్రచారం జరిగింది.

మరో విషయం, ఎంపిక చేసుకునేది సంస్థలే కాదు – ప్రముఖులకు కూడా తమ ఇమేజ్‌ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. ఏ బ్రాండ్‌కు తమ పేరును జోడించాలనే విషయంలో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. ఆమిర్ ఖాన్ సినిమా అవార్డులకు దూరంగా ఉండడం – ఆదర్శవాదమో, త్యాగమో కాదు. అదే అయితే, ఆస్కార్ కోసం వెళ్లి ఉండేవాడు కాదు, దీనానాధ్ మంగేష్కర్ అవార్డును పుచ్చుకుని ఉండేవాడు కాదు. సినిమా అవార్డ్‌ల చవకబారు వ్యవహారం తన ఇమేజ్‌ను కించపరుస్తుందని భావించాడు. ఈ ఉదాహరణ ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే – తీసుకోవడానికీ, వద్దనడానికీ కూడా – ఎవరికి సమంజసమనిపించే కారణాలు వారికి ఉండవచ్చు అని.

కనుక అవార్డులను అందరూ ఒకే దృష్టితో చూస్తారనేది వాస్తవం కాదు. వారి కేది ప్రయోజనకారి అనిపిస్తుందో, వారి సాహిత్య పయనంలో వారే మజిలీ వద్ద ఉన్నారో, వారి సృజనకూ, లెగసీకీ ఏర్పడే హానిలాభాలేమిటో బేరీజు వేసుకుని – ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారు.
__________

మరి రచయిత తనకు సరైనదని తోచి తీసుకున్న నిర్ణయం గురించి, పాఠకులకు తమ అనంగీకారం, వ్యతిరేకతను తెలిపే హక్కు, విమర్శ చేసే హక్కు – ఉంటుందా ఉండదా అనేది ప్రశ్న. దానికి జవాబుగా, ఇటీవలే జరిగిన ఉదంతాన్ని తీసుకుందాం:
అవార్డు తీసుకున్నందుకు – తాను అభిమానించే రచయితపై – వ్యక్తిగత స్థాయిలో ఒక వ్యక్తి నిరాశను ప్రకటించారు. రచయిత పరిచయం చేసిన ప్రగతిశీల భావాలతోనూ, జీవితంపై వారు చేసే సూక్ష్మ పరిశీలనలతో ప్రభావితమై, ఆ అక్షరాలతో మమేకం చెంది,వారి ప్రవర్తనలో కనిపించే ప్రజాస్వామిక విలువలను గమనించి, అవేవిలువలకు భంగం కలుగుతున్న బయటి పరిస్థితులకు తానువిచలితమవుతూ, రచయిత నుండి సంఘీభావాన్ని అపేక్షిస్తూ, ఒక అభిమాని వినిపించిన ‘భావావేశపు స్పందన’ (emotional response) గా నాకది కనిపించింది. రచయిత ఏమని ప్రతిస్పందిస్తున్నారో – తెలియదు కానీ – వారి అభిమానులో, లేక అవార్డుల అభిమానులో గానీ – తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దిశ ఎలా ఉందో చెప్పడానికి ఈ రెండు వాక్యాలు చదవండి:
“అవార్డు వచ్చిందని, వారి మీద అసూయ.”
“తెలుగులో ఇంకా చాలా మందికి అవార్డులు ప్రకటించబడ్డాయి కదా? వాళ్ళను ఎందుకు విమర్శించడం లేదు?”
రచయితలకూ, వారి రచనల వల్ల ప్రభావితమైన పాఠకులకూ ఉండే అనుబంధాన్ని వీరెవరూ గుర్తించడం లేదనిపించింది. పాఠాన్ని శ్రద్ధగా విని వంటబట్టించుకున్న విద్యార్ధే, ప్రశ్నలు అడిగే శ్రమతీసుకుంటాడు. ఒక రకంగా అది ఉపాధ్యాయుడి విజయమే. భావ ప్రసారం జరిగిన చోట, వ్యక్తులు సన్నిహితమవుతారు. ఇబ్బందికరమైన ప్రశ్నలను సైతం వేస్తారు.

అంతమాత్రాన ఎవరి కోరికలు మరెవరికీ శిరోధార్యాలు కానవసరం లేదు. విన్నాక, ఆలోచించాక, నిర్ణయం తీసుకునే హక్కు సంపూర్ణంగా రచయితకు ఉంటుంది. దానిని ఎవరూ కాదనరు – అయితే, రచయితను ఆ విషయమై సంబోధించడమే నేరంగా మారిన పరిస్థితి నాకు రుచించడం లేదు. ఆవేదన వ్యక్తీకరణ పట్ల సానుభూతి లేకపోవడం, అలాటి ప్రశ్నలు సంధించే వారందరినీ – కుసంస్కారులుగా, ఓర్వలేనివారుగా, అహంభావులుగా చిత్రీకరించడం అభ్యంతరకరంగా అనిపించింది.

ఇలాటి ప్రతిస్పందనలు, ప్రశ్నలను నీరుగారుస్తాయి. అవార్డులు తీసుకోవడం మానడం అనేది, వ్యక్తిగత నిర్ణయమైనా -ప్రజల మీదా, తోటి రచయితల మీదా ప్రభావం చూపగల నిర్ణయం కనుక, చర్చజరిగేందుకు సానుకూల పరిస్థితులు ఉండాలి. నిర్ణయం తీసుకునే వారి మనసులో ప్రశ్నలను లేవనెత్తడం, సమాధానాలను సరఫరా చేయగలగడమే – ఈ చర్చలకు లక్ష్యంగా ఉండాలి. అవార్డుకు సర్వవిధాలా అర్హులై, తమ ప్రయత్నం ఏమీ లేకుండా – పిలిస్తే వెళ్తాం, ఇస్తే పుచ్చుకుంటాం అనే వారితోపాటు, ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయానికీ రాని వారికి కూడా ఇలాటి చర్చల వల్ల మేలు జరుగుతుంది. తాము తీసుకునే నిర్ణయపు ప్రభావమేమిటని ఆలోచించుకుంటారు, దానిలో ధ్వనించే రాజకీయాల పట్ల తమకు అభ్యంతరం ఏమైనా ఉందా అని తరచి చూసుకుంటారు. అంతిమంగా నిర్ణయం వారిదే – అది ఏదైనా సరే.

కాలం ఎప్పుడూ ఇలాగే ఉండిపోదు, వ్యక్తులెప్పుడూ ఒక్కలాగానే ఉండరు. ఒకనాడు ప్రజల కోసం పనిచేసిన వారు, ఇప్పుడు ఉద్యమాలను హేళన చేయవచ్చు. అలాగే తన చుట్టు పక్కల ఏమౌతోందనేది ఏనాడూ పట్టని వ్యక్తి – తన దృష్టిని ఏ మారుమూల ప్రదేశానికో ప్రసరించి, అక్కడి ప్రజలను సంఘటిత పరచవచ్చు. ఇవేళ ప్రజల కోసం మాట్లాడేవారెవరూ, పుడుతూనే సామాజిక స్పృహను తమ వెంటతెచ్చుకుని రాలేదు.

ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో ఒక స్పృహ కలుగుతుంది. ప్రకాష్ రాజ్ అనే నటుడు 2016 దాకా విజయవంతమైన నటుడు మాత్రమే. తన స్నేహితురాలు గౌరీ లంకేష్‌ను హత్య చేసిన మతతత్వ మూకల రాజకీయాలను ఎదిరించడం – తన వ్యక్తిగత బాధ్యతగా తోచిందిఒక్కసారిగా అతనికి. తోటి మనుషుల జీవితాలను లోతుగా పరిశీలించి, వారి అభివృద్ధిని కాంక్షించి బాధ్యతతో రచనలు సాగించే వారికి ఈ స్పృహ కలిగే అవకాశం మరింత ఎక్కువ ఉంటుంది. వారి నుండి సహకారాన్నీ, సంఘీభావాన్నీ అపేక్షించడం ఎన్నటికీ వృధా కాబోదు. కనుక ప్రశ్నలు వేసేవారు వేస్తూనే ఉండాలి.