Tuesday 11 January 2022

ఆవేశం నుండి చైతన్యం దాకా : కారా

 "2016లో ఒకసారి మాటల్లో కారా మాస్టారి కథలు నాకు చాలా ఇష్టం!" అన్నారు Rama Sundari.

"చిన్నప్పుడు నాన్న (PRJ Pantulu) 'యజ్ఞం', 'రాగమయి' - చదివి వినిపించడం గుర్తుంది, అప్పుడూ, అటు తర్వాతా కూడా చదివాను కానీ #KaRa సాహిత్యం నాకంతగా అర్ధం కాలేదండీ" అన్నాను.
"మరో సారి చదవండి, మాస్టారి కథల మీద సారంగలో వ్యాసాలు రాసాం మేం, అవి పంపుతాను, చదివి చూడండి" అన్నారు.
ఆమె రాసిన 'హింస' కథ మీద వ్యాసం - చదవడం మొదలు పెట్టేను. ఒక్కసారిగా వయసు పెరిగిన అనుభూతి.
ఆ వ్యాసాలన్నిటినీ పుస్తకరూపం లోకి తేడానికి Vivina Murthyగారితో చేసిన చర్చల ఫలితంగా మరి కాస్త ఎదుగుదల.
Bammidi Jagadheeswararao గారితో నా ఆలోచనలు వ్యక్తం చేస్తూ, ఆయన స్పందనల ద్వారా కొంత స్పష్టత తెచ్చుకునేదాన్ని.
ఒకనాడు నాకేదో సరికొత్తగా స్ఫురించిందనిపించింది. విద్యుత్తు ప్రవహిస్తోందనిపించింది ఒక్కసారిగా. జరిగింది ఒక్క క్షణంలోనే - కాని ఆ మెరిసిందానిని అక్షరీకరించడంలో రెండేళ్లు పట్టింది.
మాస్టారికి Kalipatnapu Subba Rao గారు చూపిస్తారని, #KaRa కు చదవగలిగే ఆరోగ్యం ఉండాలనీ ఆశ.
రెండు వేర్వేరు వ్యాసాల్లో:
26 ఆగస్టున #వివిధలో,

చెప్పింది చదువుకునేందుకు వీలుగా ఒక్క దగ్గరే రాస్తున్నాను.
👇 - - - - - - - - - - - - - - - - - - - - -👇
సమాజ చరిత్రకూ, సమాజ చలనానికీ మధ్య ఉండేటటువంటి సంబంధం గుర్తించినటువంటి అతికొద్ది మంది రచయితల్లో కారా ఒకరని కేతు విశ్వనాధరెడ్డి అంటారు. సమాజ సమగ్ర స్వరూపాన్ని దర్శించే ప్రయత్నమే కారా మాస్టారి కథల లక్ష్యం. కలం పట్టిన తొలిరోజుల్లో – మధ్యతరగతి జీవుల గురించీ, వారి అనుభూతుల గురించే ఎక్కువగా రాసేరు.
అందరికీ చెందే వనరులని, కొందరు చేజిక్కించుకుంటున్న వైనం కంట పడ్డాక, ఆదోపిడీని – వ్యవస్థీకృతం, ఆమోదయోగ్యం – చేసుకోడానికే పీడన సాగుతోందని తెలిసాక - ఆయన రాసిన ఏకథా ఆ సత్యాన్ని విస్మరించలేదు.
కథనపు ప్రత్యేకత :
పీడనని మాత్రమే చిత్రీకరించే కథలు కోకొల్లలు – అలా రాయడం ఆయనకు సమ్మతం కాదు. అది ఏ రూపంలో జరుగుతోందో, ఎవరి ద్వారా జరుగుతోందో, దానిని అనుభవిస్తున్న వారి జీవితాలలో మార్పులేమిటో, దానికి ఎదురెళ్లేవారెవరో – పరిశీలించి తనకొక అవగాహన ఏర్పడింది అనుకున్నాకే దానిని కథావస్తువుగా స్వీకరిస్తారు. అందుకే ‘చెప్పేందుకు విషయాలున్నా చెప్పడానికి అవి నా అలవికి రావాలి’ అంటారొకచోట. నిజమైన వర్గ శత్రువుల అంతర్ బహిస్వరూపాలు ముందుగా తాను గుర్తించి తన కధల్లో వాటిని ఆవిష్కరించడం ఆయన లక్ష్యం.
ఆయన చూపు ననుసరించి మనం సమాజాన్ని కలయజూస్తే - నేలబారు జనపు జీవితాల్లో రాజుకుంటున్న సంఘర్షణ మనకు కనిపిస్తుంది. నీటి కోసం, నిప్పు కోసం, కూలి కోసం, పని చేసుకుని తినే హక్కుకోసం, గొరవంగా బ్రతికే హక్కు కోసం ఘర్షణ పడుతున్న సమూహాల నుండి పాత్రలనెంచుకుని, వారిపై లెన్స్ నుంచి వారి అంతరంగ దర్శనం చేయించడం ఈ కథల్లో మనం చూస్తాం. తాను తయారుచేసిన వస్తువు మీద తనకు హక్కుందని చిన్నకొడుకు ప్రకటించడం తీర్పు కథాంశం.
గౌరవంగా పని చేసే హక్కును నిలబెట్టుకోడం కోసం - వారానికొక సెలవు కావాలని పనిమనిషి అంకాలు నిలదీయడం ఆదివారం కథాంశం. అసహాయురాల్ని చేసి, స్వంత యింటిలో తన అక్కను తలదాచుకోనీకుండా చేసిన సమాజపు క్రౌర్యం, అది ఎనిమిదేళ్ల సంగిని పెట్టిన హింసా, పర్యవసానంగా కనిపించని శత్రువు మీద పోరాటానికి సిద్ధమైన సంగి ఆవేశమూ – హింస కథలో చూస్తాం.
రాత్రంతా ఒకే పక్క మీద జంటగా గడపాలనేది ఎందరికో తీరని కల. డబ్బులు సమకూర్చుకుని, కనీసం ఒక్క రాత్రి భార్యతో ఏకాంతాన్ని అనుభవించాలని - రూం కోసం వెతుకుతాడు నూకరాజు. తోటి మనుషుల నుంచి కనీస మర్యాద ఆశించడమే అతని సంఘర్షణ. కేపిటలిజం ఫలితమైన మొబిలిటీ బెట్వీన్ ద క్లాసెస్ కనిపించినా నో రూం లో లాడ్జిని ఇప్పటి ఫైవ్ స్టార్ హోటళ్లతో పోలిస్తే మనకి వాస్తవం బోధపడుతుంది. కులవివక్ష నక్కి కూచున్న అనేకానేక సామాజిక కోణాలలో ఒక చీకటి మూల నోరూం కథ.
పగలంతా కూలి పనికెళ్లి, సాయంత్రం ఏపూట దినవెచ్చాలు ఆ పూట తెచ్చుకునే జీవితాలు మాలపేటలోని సన్ని వంటి వారివి. ఆమె కూలి డబ్బుల మీద ఆశ వల్ల కలహం పెంచుకున్న అమ్మ, అత్త – నిజానికి పోరాడేది ‘బతుకు భయం’ తోనే. తమ బతుకుల పగ్గాలు తమ చేతిలో లేవన్న నిజం నిర్వీర్యం చేస్తుంటే సన్ని, ఆమె భర్త – పడే పెనుగులాట ఆర్తి కథ.
కాటు వేసే శత్రువు కనబడితే - అది దూరింది తన ఇంటిలో కాకున్నా – మట్టుపెట్టడం తన ధర్మం అని నమ్మి, ఆపోరాటంలో - ప్రాణభయం మీద విజయం సాధించిన సత్తెయ్య గాథ. లోకమంతా తన ఇల్లేనని భావించగలిగిన, లోకోత్తరుల కథ భయం.
తమ శ్రమకు తగిన ఫలితాన్నివ్వమని యాజమాన్యంతో చేసే పోరాటమొక వైపైతే, శాంతి పేరిట - వారు గొంతెత్తడాన్ని సైతం అణచివేసే ప్రభుత్వ యంత్రాంగంతో చేసే పోరాటం మరొకవైపు –కనిపిస్తుంది శాంతి కథలో. బతికినంతకాలం చలితో పోరాడి, చచ్చాక ‘ నాయిన్నాళ్ల సలీ కాష్టమ్మీనైనా కాలిపోవాల’ – అనేది నారమ్మ. ఆమె శవాన్ని కాల్చేందుకు కట్టెలు తేలేక అలమటించే కుటుంబాన్ని చూస్తాం చావు కథలో.
తాగడానికి నీరు లేని గ్రామస్థులందరి చేతా మహజర్లు రాయించి, ఊరికి కుళాయి తెప్పిస్తాడు రావుగారు. ఫలితం – రోజు కొక్క గంట వచ్చే వీధి కొళాయి ముందు మొత్తం ఊరిజనం, ఇల్లూ తోటా తడుపుకునే సదుపాయం ఏర్పాటు చేసుకున్న రావుగారూను. ఒక్క బిందె నీళ్ల కోసం, మానాభిమానాలు చంపుకుని మరీ రావుగారింటి గేటు దగ్గర చేసే యుద్ధం జీవధార కథ.
ఒక్కొక్క కథా ఒక్కొక్క జీవిత శకలానికి ప్రతిబింబం అన్న మాట నిజమే అయినా కూడా సమగ్రంగా అవన్నీ కలిపి ఇచ్చే అవగాహన కూడా ప్రత్యేకించి తెలుసుకోవలసిన విషయం. ఒక కథను అర్ధం చేసుకోడానికి వేరే కథలు సహాయపడతాయి. ఇంకోలా చెప్పాలంటే ... ఒక కథను చదివి గ్రహించిన దాని కంటే మొత్తం ఈ కథలన్నీ చదివిన తర్వాత అదే కథలోంచి గ్రహించగలిగే సారం మరింత ఎక్కువ.
భావజాలాల పై ప్రశ్న:
ఒక తరంలో దోచుకోడం, అణచి ఉంచడం, తమ స్వంత బలంతో సాగించే అపకారం. అది తరతరాలుగా సాగడానికీ, జనం ప్రవర్తనని శాశ్వతంగా శాసించేందుకు - ఏర్పరిచిన – పీడనకి తోడ్పడే భావజాలాలని – గుర్తించడం రచయితగా తన బాధ్యత అని కారా భావిస్తారు. అందుకే ఆయన కథల్లోని పాత్రలు – తమచుట్టూ జరుగుతున్న మోసం చూసి ప్రచారంలో ఉన్న నీతుల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి. ఉదాహరణకి – తీర్పు కథలో రెండో కొడుకు మేనత్తతో - పంచిన వాళ్లు పాపాన పోతారని సామెత నువ్వే చెప్పేవు కదా, నువ్వు పెద్దదానివి, నిన్ను నరకానికి పంపడం ఇష్టం లేదు, అందుకే ఆపాపమేదో నేనే మూటగట్టుకుంటున్నాను అంటూ తానే పంపకం చేస్తాడు. అలాగే ఆదివారం కథలో పనిమనిషి అంకాలు గురించి ఇంటావిడ కోడలు పాత్రతో – “ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేయడం నేర్చిన మనిషి, మనసులో విషయం దాచి మసిపూసి మారేడు కాయ చెయ్యడంలో మాకన్నా రెండాకులు ఎక్కువ చదివింది” అనిపిస్తారు. యజ్ఞం కథలో సీతారాముడు – “ఏరి కంటి క్కనపడకండా నువ్వేం సేస్తన్నావో – అదే పని నలుగురికీ కనపడేటట్టు నానూ సేసేను” అని తన కొడుకు శవాన్ని చూపిస్తాడు. ఆ మాటకి అర్ధం – ఒకరి జీవనభృతి లాక్కోడమంటే వారి భవిష్యత్తరాలని హత్య చెయ్యడమే అని.
శాంతి కాముకులు:
దొంగిలించే దాని కన్నా దోచితే చిక్కేది ఎక్కువని తెలుసుకుని కొందరూ, అవేవీ తెలియకుండానే జన్మసిద్ధంగా అందిన వనరుల వల్ల ఇంకొందరూ – ఈ ఆర్ధిక చట్రంలో సౌకర్యవంతమైన స్థానాలలో చేరతారు. వారికి పోరాటాలంటే చెప్పరాని కంపరం. వారి గురించి శాంతి కథలో ఇలా చెప్తారు – “స్వేచ్ఛగా మసలడానికో ఇల్లూ, కట్టేందుకు ఖరీదైన గుడ్డా, అమిరిన వాళ్లందరికీ శాంతి కావాలి.
ఇవన్నీ అవరకపోయినా, వాటిని ఆర్జించుకునే అవకాశం దొరికిన వాళ్లకి దాన్నుపయోగించుకుని పెరగడానికి శాంతి చాలా అవసరం.
ఈ తక్కువ కాలంలోనే అందిపుచ్చుకున్న అవకాశాల్తో అవలీలగా ఆస్థులు సంపాదించుకున్న పెద్దలకు తామే కాక తమ తరువాతి తరాలు కూడా నిష్పూచీగా నిరాటంకంగా అనుభవించేందుకు సుస్థిరమైన శాంతి తప్పకుండా కావాలి. కాని దురదృష్టమేమిటంటే ఈదేశంలో అలాటివాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు.” అందుకే కథలన్నిటిలోనూ ఒక ఇనెవిటబిలిటీ ఉంటుంది – పోరాటం వారికెలా తప్పనిసరౌతోందో విప్పి చూపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆకథలు.
ఎవరో రెచ్చగొడితేనో లేక మరెవరో చేయిస్తేనో పోరాటాలు జరుగుతాయని మనలో చాలా మంది భావన. కానీ కారా చూసిన సత్యం అది కాదు. అజ్ఞానంతోనో, మరి నిషాతోనో కళ్లుమూసుకుపోయినప్పుడు తప్ప – ప్రపంచంలో ఘర్షణ లేని శాంతి దొరకదు – అని ఖండితంగా చెప్తాడు శాంతి కథలో కథకుడు. ఈ విషయం కారా కథామాలికలకు ఒక దారం వంటిది.
సంపద ఒక చోట కూడి పడి ఉన్నంత కాలం తమ జీవనావసరాల కోసం – ప్రజలకు ఆ సంపద వైపు అడుగు వెయ్యడం తప్పనిసరే. దాని వల్ల అలజడి రేగి – సంపదల ధర్మకర్తలు - భయపెట్టినా, బెదిరించినా, శాంతి పన్నాలు వల్లించినా- ఆ ప్రజలు సంపద పై తమ హక్కును ప్రకటించక తప్పదు.
చావు కథలో సీతయ్య ఇలా అంటాడు: “బతికున్న మనిషైతే నీదీ నాదీను, చచ్చిన శవం ఊరందరిదీనూ.
మరి దానిక్కర్రలు కావాల, నిన్నూ నిన్నూ అందర్నడిగినాం, మీరెవ్వరివ్వలేదు. అవి ఉంటే గాని నాగ్గడవదు. అవక్కడున్నాయి. అందుకని తెచ్చినాను. నువ్వు నామీద కేసే ఎట్టు, పోలీసులకే అప్పసెప్పు, కాదని నన్నురి దీసీసినా – అయినా నాకవుసరమైతే నాను తేకమానను.”
అలాగే జీవధార కథ ముగింపులో కథకుడు ఇలా అంటాడు: “ కసురుకున్నా విసుక్కున్నా కుక్కల్నీ పోలీసుల్నీ చూపి భయపెట్టినా లేనివారు కలవారి నిబ్బంది పెట్టక వల్లకాదు.”
అయితే మరి శాంతి కాముకుల మాటల్లో, చేతల్లో ఒక రైటియస్‌నెస్ (ధర్మాత్ములమన్న నమ్మకం) ఉంటుంది. అప్రజ్ఞాతం, యజ్ఞం, కథల్లో – సూరప్పడూ, శ్రీరాములు నాయుడూ ఆ కోవకు చెందిన వాళ్లు. నలుపూ తెలుపులకి అలవాటుపడిన పాఠకులకి వారి సంక్లిష్టత చప్పున అర్ధంకాదు. వారి పాత్ర చిత్రీకరణని లోతుగా పరామర్శిస్తే - దోచుకోబడే వారికే కాదు, దోచుకునేవారి క్కూడా ఛాయిస్ ఉండదనే – అనే కీలక విషయం మనం అర్ధం చేసుకోగలుగుతాం. ఈ వ్యవస్థలో వారి పాత్ర ఏమిటో, వారి హద్దు లేమిటో స్పష్టంగా తెలియజెప్పే వాక్యం – యజ్ఞం లోనే ఉంది - ఆళ్లకి ఆళ్లు సేసుకోలేని మంచిని నువ్వు సేసినంతకాలఁవే నీ రాజ్జెం. లాబీయింగ్‌లు జరిగేది ఎవరి కోసమో, జరిపేది ఎవరో తెలిసిన పాఠకులకి ‘ఆళ్లు’ ఎవరో, ఆ ‘మంచి’ ఏమిటో సులభంగా అర్ధమౌతుంది. ఆ అంశాన్ని మరో చోట ఇలా వివరిస్తారు – ‘ప్రభుత్వాల మనుగడ పెంట మనుషుల చేతుల్లోనూ, పెద్ద మనుషుల ధన ప్రాణ మానాలు ఆ ప్రభుత్వం చేతిలోనూ చిక్కుకున్నాయి.’ ప్రజాస్వామ్యపు బలమూ, బలహీనతా ఈ వాక్యంలోనే ఉన్నాయి తెలుసుకోగలిగితే.
ఈకుట్రలూ, దోపిడీలూ జరిగే పద్ధతిని తెలుసుకోకనే నిరు పేద వర్గాలు – నీరుకూ, నిప్పుకూ, గూడుకూ, చివరికి శారీరక అవసరాలకు కూడా మొహం వాచిపోయిన సమూహాలు ... వారిలో వారే పోటీలు పడుతూ – తలోదారీ పడుతున్నారని, వారికి అసలు నిజం చూపడమే సాహిత్యకారుల కర్తవ్యమనీ కారా నమ్ముతారు. వారిలో ఐక్యత ఎందుకు లోపిస్తుందో ఆర్తి కథలో చర్చిస్తారు. నేలబారు జనం గురించి చాలా మంది కుండే తేలిక అభిప్రాయం నాయుడు మాటల్లో వినిపిస్తుంది. “తొత్తు కొడుకులు వొళ్లు కొవ్వెక్కి తెగ బలిసున్నారు. కన్నూ మిన్నూ కానక కొట్టుక సస్తున్నారు”. దానికి నారాయుడు – పొలాల్లో కూలి పనికెళ్లినా, చిన్న బంజరు ముక్కమీద పని చేసుకున్నా, పట్నానికెళ్లి సంపాదించినా – ఏది చేసినా తిండికి చాలని తమ సంపాదనల గురించి వివరించి - ‘అదుగో ఆ కడుపు గోలల్లో పుట్టింది బాబూ ఈ మంటంతా’ అంటాడు.
తన జీవితకాలంలోనే – కొందరు ధనవంతులవడం, మరి కొందరి సంపాదనలు పడిపోతున్న – ఈ నిష్పత్తి - చావు కథలో తాత కూడా గుర్తిస్తాడు – “ఒకడు నెగిసేసరికి 100 మంది, పది మంది నెగిస్తే యేల కొద్దీ రాలతన్నారు – జనం.” ఆ లేచేవారిలో ఒకరో అరో తన వాడున్నా – (జనం తాలూకు అజ్ఞానం మీదా, ఆకలి మీదా – ఆ రెంటి బాధా లేని వాళ్లలో – తన ప్రభావం ద్వారా నాటిన దురాశ మీదా ... బతికే వ్యవస్థ కనక) ... “మన్లో సూడగల తొత్తుకొడుకెవడేనుంటే, మన్నాడే ఆల్లల్లో కలిసిపోతున్నాడ’’ న్న తాత మాటలు నిజమే అన్పిస్తాయి.
ఈ నిరాశాజనక స్థితిలో రచయితల కర్తవ్యం గురించి కారా కొక స్పష్టమైన అభిప్రాయముంది - ఒక ప్రశ్నకి సమాధానమిస్తూ - సమకాలీన పోరాటాల ఫలితంగా (దళిత రాజకీయాలు, ఫెమినిస్ట్ ధోరణులు) వారిపై జరుగుతున్న అణచివేత, పీడనల గురించిన స్పృహ ఈ రెండు వర్గాలలోనూ చైతన్యంగా పరిణమిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సామాజిక విప్లవాల గురించి చదివే వాళ్ల అవగాహననీ, స్పృహను, చైతన్యాన్నీ, నిబద్ధతను, నిమగ్నతను ఏ దశ నుండి ఏ మేరకు పెంచేదైనా – విప్లవ కథేనని ఆయన నమ్మకం.
ఏ సందర్భాల్లో ప్రజలు ఏకమౌతారన్న ప్రశ్నకి – చావు కథలో అప్పారావు మాటల్లో మనకి జవాబు స్ఫురిస్తుంది. అవుసరం, నిజంగా నీకవుసరం కావాల, అదుంటే అప్పుడే అనుమానాలూ ఉండవు, ఇన్ని డొంకతిరుగుళ్లూ ఉండవు. అలాగే జీవధార కథలో “ఒలే రాండర్రా! ఇక్కడీల్లు కుక్కల్ని ఉసిగొలుపుతారట!” అన్న సత్యవతి పొలికేక విన్న ఆడవాళ్లు “ఇక్కడ నీళ్లిస్తారు” అన్నట్లు అర్ధం చేసుకున్నారేమో పోటీలు - పోటీలు పరుగులెడుతున్నారని రాస్తారు. ప్రజల నిజమైన అవసరాలను గుర్తించిన నినాదాలతో ప్రజలు గొంతు కలుపుతారని అనిపిస్తుంది.
అసమాన బలాల మధ్య పోరాటం:
ఇందాక చెప్పుకున్నట్టు – కొన్ని పాత్రలు తప్పనిసరి అయి పోరాటం గనక చేస్తాయి గనక అసమాన బలాల మధ్య పోరాటం కారా కథల్లో ప్రముఖంగా కనిపిస్తుంది( ఉదా. వధ, వీరుడు మహావీరడులో అక్షరాలా యుద్దమైతే, శాంతి, జీవధార వంటి వాటిలో వనరుల కోసం, హక్కుల కోసం పోరాటం). గెలవగలనన్న నమ్మకంతో కాక తలపడక తప్పదన్న స్పృహతో చేసే పోరాటాల వర్ణన ఉంటుంది వాటిలో.
ప్రత్యర్ధి బలాన్ని అర్ధం చేసుకున్న పాత్రల నుంచి మనకి వాస్తవం తెలుస్తుంది. బలం అంటే అంగ బలమో అర్ధ బలమో మాత్రమే కాదని. నోరూంలో మేస్త్రీ తన స్కిల్, దానితో తయారైన యజమాని మేడ – ఈ రెంటినీ పోలుస్తూ - ఇలా అంటాడు- ఆడి సొత్తు ఆడు నీకందకండా దాయగలడు. నువ్వలా దాయలేవు. పనోడితో వచ్చిన సావే అది.
సమిష్టి జీవితాల పెద్ద కేన్వాసును తీసుకున్నప్పటికీ - మొత్తంగా కలిపి చూసినప్పుడు - పోరాడే వ్యక్తుల చిత్రీకరణలో కొన్ని రంగులు ప్రస్ఫుటంగా కనిపించడం గమనించవలసిన విషయం, సంఘర్షణకి లోనౌతున్న పాత్రల మానసిక అవస్థల్లో రకరకాల స్థాయిలు కారా కథల్లో మనకి ఎదురౌతుంటాయి. చాలా చోట్ల రచయిత పాత్రల్లోని ఉద్రేకపు భావన ఏ స్ధాయిలో ఉందో వివరిస్తూ ఉంటారు. ఏం జరుగుతోందో తెలియని ఆరాటం, కష్టాలను ఓర్చుకోలేక ఆక్రోశం, దానికి కారణమైన మనుషులను చూసి ఆవేశం - కనిపిస్తాయి. ముఖ్యంగా బలమైన శత్రువుతో తలపడేట్టు చేసేది ఆవేశమే.
ఆవేశం:
ఈ సందర్భంలో ఆవేశం గురించి కారా అవగాహన ఏమిటన్నది అప్పుడప్పుడు ఆయన చెప్పిన మాటల్లో – ‘ఆవేశం గొప్ప చోదకశక్తి. మనుషుల్లో మందిలో జాతుల్లో ధైర్యం సాహసం తెగువ త్యాగం లాంటి సుగుణాలన్నిటి వెనకా ఉండేది ఆవేశమే.’ పోరాటాలను ఇంత నిశితంగా పరిశీలించి, రికార్డు చేసిన కథలని చదివేక – పాత్ర ఎమోషన్ల వర్ణన ద్వారా, ఆయన దర్శించిన జీవిత సత్యమేదో మనకి అందిస్తున్నారని నాకు తోచింది. ఆవేశం ఉద్రేకపు స్థాయిని దాటితే గాని పోరాటంలో విజయం సాధించలేమని కారా అనుకుంటారేమో. ఉదాహరణకి తీర్పులో మోసాన్ని గ్రహించిన రెండో వాడి గురించి ఇలా రాస్తారు– ‘వాడి పెదవులు ఎంత ఆపుకున్నా ఆగక వణుకుతున్నాయి. అలా వణకడం వాడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు.’ వధ, వీరడు – మహావీరడు కథల్లో కూడా ఆవేశానికి లోనై పోరాటం సాగించడం అనేది ఓటమి వైపు అడుగుపడినట్టు సూచించడమూ కనపడుతుంది.
బలవంతుడికి ఉండే ధీమా వల్ల వాడి ధోరణి ఎలా ఉంటుందో ఈ వర్ణన చూస్తే తెలుస్తుంది. ఉదాహరణ - వధలో వాలి. ‘పోరులో వాలి ఆయాసపడడు, ఎదిరిని దెబ్బ తీయడానికి ఉద్రేక పడడు. ఎదిరి మీది మీదికి వస్తే ఆవేశపడిపోడు. వెనవెనక్కు అడుగు వెయ్యడానికి సిగ్గు పడిపోడు ... మళ్లీ ఆవేశపడి వచ్చేవరకూ వేచి ఉంటాడు.’
దానికి విరుద్ధంగా సుగ్రీవుడు – ‘అడవుల పట్టిన వాడు, అష్టకష్టాలు పడుతున్న వాడు, అన్యాయాలను తలంచుకుని ఆవేశపడేవాడు’
ఒక అంశం నాకు కారా కథల్లో చాలా ఆసక్తికరంగా తోచింది – విజయానికీ, ఉద్రేకానికీ ఏదో తకరారున్నట్టు అనిపించింది. విజయాన్ని సాధించిన పాత్రలన్నీ ఉద్రేకాన్ని అదుపులోకి తెచ్చుకుని ప్రవర్తించడం కనిపించింది. అది ఒక దగ్గర మొండి ధైర్యంతో తిరగబడడమైనా, క్రమశిక్షణతో తమ ప్రణాళికను అమలు జరుపుకోడమైనా, సాహసంతో సంఘద్రోహులను సంహరించబూనడమైనా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడమైనా. ఒక చైతన్యంతో స్వయంనిర్ణయాధికారాన్ని రీయిన్ ఫోర్స్ చేయడం కనిపిస్తుంది.
పోరాటం తప్పనిసరి అని తెలుసుకున్న పాత్రలను వారి అవగాహనల ప్రకారం ఒక స్కేలు మీద చేరిస్తే - నిర్లిప్తంగా తమకొచ్చిన కష్టాలన్నిటినీ తన వారికి కథల్లా వల్లించి చెప్పే చావు తాత ఒక చివర ఉంటే, తమ హక్కును నిక్కచ్చిగా అడగ్గలిగే ఆదివారం అంకాలూ, తీర్పు రెండో కొడుకూ... ఆ స్కేలు మీద మరి కాస్త ముందు నుంటారు. తనపర భేదమే పట్టించుకోని సత్తెయ్య (భయం) – పూర్తి పరిణతితో స్కేలుకు రెండో చివర నుంటాడు. అతని చరిత్ర చెపుతూ - తన భయం ఎలా పోయిందో, ఏ చైతన్యం అందుకు కారణమో గ్రహించగలిగే వూహ సత్తెయ్యకి లేదు అని వివరిస్తారు. అలాగే మరణపు అంచును ముట్టి వచ్చిన సుగ్రీవుడి విషయం – ‘ఏ తలపులు ఆవే(దే)శాలనిచ్చి ఆశలు వానికి జీవం పోశాయో తెలియదు.’
మూమెంట్ కేప్చర్:
పాము గురించి భయపడేవారికి సత్తెయ్య ఇలా చెప్తాడు - అదెప్పుడో కాటేస్తుందో యెయ్యదో. దాని బయ్యం మనిషిని తినేస్తుంటది పురుగు నాగ. ఎదురు తిరిగితే ఏటీ నేదు. నీ సెయ్యే పైని.
పాత్రలు ఆవేశం నుంచి చైతన్యం వైపు చేసే ప్రయాణంలో – అవి పొందే భయాన్ని కూడా మనం గుర్తించగలం. తర్వాత భయాన్ని దాటే ఒక ప్రత్యేక క్షణపు ప్రసక్తి వస్తుంది. ఆ క్షణాన్ని చాలా స్పష్టంగా పట్టుకుని మనకందిస్తారు కారా. ‘సత్యవతికి భయానికి బదులు రోషం పుట్టింది’ (జీవధార); ‘అక్కడి భయంకరమైన నిశ్శబ్దం కానీ, స్మశానాల్లోని ఆ ప్రశాంతత కానీ ఆమెని భయపెట్టలేదు’ (హింస); ‘ప్రాణం పోవడమంటే ఏమిటో తెలిసిన సుగ్రీవునకు ప్రాణభయం పోయింది.’ (వధ)
సత్యవతిలోనూ, సంగిలోనూ, సుగ్రీవుడిలోనూ, భయం అవధులు దాటాక ... దాని పై స్దాయికి వాళ్లు చేరుకోడం చూస్తాం. వీరంతా సామాన్యులే. కానీ పరిస్థితులు వారిని ఆ దిశగా తోసాక, వారిలోని అసాధారణ జీవశక్తి వారిని భయాన్ని జయించే స్ధాయిలో ప్రవేశపెడుతుంది.
చైతన్యం:
మన చుట్టూ జరుగుతున్న పోరాటాలను గమనిస్తే – ఆవేశమే ఎక్కువగా కనిపిస్తుందంటే తప్పు కాదేమో. మొదలవ్వాలిసింది దానితోనే కానీ కొనసాగాలంటే మాత్రం దాని తర్వాత స్థాయికి చేర్చాల్సి ఉంటుంది. అంతిమంగా విజయం చేకూర్చేది చైతన్యమే.
తనకు జరిగిన అన్యాయానికి ఒక మనిషి వ్యక్తిగతంగా కారణం కాదని తెలిసిన మీదట ఏది అసలైన కారణమో తెలుసుకున్నఅనుభవం (జ్ఞానం) మీద దానితో తరవాతి అడుగు ఎటు పడాలో నిర్ణయించుకుని, తనకే కాక తనవారిక్కూడా – సాయపడగలిగేదే చైతన్యం.
పోరాటపు పరిధిలో చైతన్యాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు - వ్యక్తిగత స్ధాయిలో – సర్వసహజమైన ఉద్వేగాలూ, ఉద్రేకాలూ, భయాలూ – మనిషిని మరింత బలహీనుణ్నిగా చేస్తూ ఉంటాయి, సామూహిక స్థాయిలో లక్ష్యాన్ని విస్మరించేలా చేస్తాయి. చైతన్యం పొందిన -మనిషి - కోపాన్నీ, భయాన్నీ జయించుతూ అప్రమత్తుడై పోరాడగలుగుతాడు, సమూహం –శక్తుల్ని ఏకీకృతం చేసుకుని ఐకమత్యంతో పోరాటాలను కొనసాగించగలుగుతుంది
------------------------------
జనవాక్యం:
వర్తమానంలో జరుగుతున్న ఏ విషయం గురించైనా- చుట్టూ ఉన్న జనం ఏమనుకుంటున్నారనేది- జనవాక్యం. అది ఏ కాలంలోనూ అతి ముఖ్యమైన అంశమే. ఈ ఇంటర్నెట్‌ యుగంలో దాని ప్రాసంగికత ఊహాతీతమైన స్థాయికి పెరిగిపోయింది. ప్రజలకి తమ వాదం వినిపించే ప్రయత్నాలూ, మరే పక్షపు స్వరమూ వినిపించకుండా చేసే ప్రచారాలూ, వారిని తమవైపు తిప్పుకునే వ్యూహాలూ- ఒకరితో ఒకరు తలపడే పక్షాలన్నీ- తమ శక్తి మేరకు చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కాళీపట్నం రామారావు (కారా) రచనల్ని చదవడం ఉపయోగకరం. ఎందుకంటే-సమాజంలో నిత్యం, విడివిడిగా, రకరకాల రూపాల్లో సాగుతోన్న పోరాటాలు కారా కథలకి- ముడిసరుకుగా కనిపిస్తుంది. ‘వధ’, ‘వీరుడు మహావీరడు’లో ప్రత్యక్షంగానూ, ‘శాంతి’, ‘జీవధార’ల్లో- జీవితావసరం గానూ, ‘భయం’లో ప్రతీకాత్మకంగానూ- పోరాటం కనపడుతుంది.
పోరాటం జరిగిన చోటల్లా మూడు భాగాలుంటాయి. పోరాటం సాగించే రెండు ప్రధాన భాగాలైతే, తక్కిన ప్రపంచం- రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌, మూడో భాగంగా ఉంటుంది. ఆ భాగం- తనను తాను తటస్థమనే భావించు కుంటుంది. కానీ నిజానికి అది ఎటోవైపు చేరుతూనే ఉంటుంది. తటస్థ పక్షం ఏవైపు మొగ్గుతోంది, దాని మద్దతు ఎవరికి లభిస్తోంది-అనే అంశాలు సమాజపు రూపురేఖలను నిర్ణయిస్తాయి. కారా కథా నిర్మాణంలో- ఈ మూడో విభాగపు నడవడిని గమనించడం, వర్ణించడం- ఒక ప్రత్యేకతని సంతరిచుకుంటుంది. తమ మధ్య జరుగుతున్న పోరాటాల పట్ల ప్రజల స్పందనను కారా అనేక కోణాల నుంచి చాలా కథలలో చిత్రించారు. మూడో పక్షానికీ- పోరాటానికీ ఉండే సంబంధం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానాన్ని ఆయన కథల్లోంచి రాబట్టే ప్రయత్నం చేస్తాను.
బలం ఉన్న జీవాలు బలహీనమైనవాటిని ఓడించడం- ప్రకృతి సహజం. అడవి దానికే అలవాటు పడి ఉంటుంది. దానికి విరుద్ధంగా జరిగితే అడవి స్పందన ఎలా ఉంటుందో ‘వధ’లో ప్రతీకాత్మకంగా వర్ణిస్తారు: ‘‘(వాలి సుగ్రీవుణ్ని చావగొడుతున్న) అంతవరకూ తమ నడిబొడ్డున జరుగుతున్న ఆ పోరాటాన్ని నిక్కి నిక్కి నిటారుగా, ఏ వంకకూ తలల చివరలైనా ఊపకుండా అతినిర్లిప్తతతో చూస్తూ ఉండిన మహావృక్షాలన్నీ (రాముడు వాలిమీద బాణం వేసిన) క్షణంలో శివమెత్తినట్లు- మొదళ్లను సైతం కదుపుకుని ఊగిపోతూ హోరుహోరుమంటున్నాయి. ఆ అదటుకి అరణ్యంలో ఉండే క్రూర సత్వాలన్నీ పిచ్చెత్తినట్టు బొబ్బరిస్తూ అరణ్యమల్లా పరుగులు తీసాయి. వాటిని చూచి, ప్రాణభయంతో సాధుసత్వాలు విరిగి బెదిరి కలవరపడి కల్లోలమై కలసి పరుగులు పెట్టాయి.’’
వన్య జీవనంలోనే కాదు, సంఘజీవనంలో కూడా దీనికి అన్వయం కుదుర్చుకోవడం- చాలా సులభం. మూడోముక్క- జనం- పోరాటాలకూ తమకూ ఏ సంబంధమూ లేదనుకుంటూ చోద్యం చూసే పార్టీ. కానీ దాని ఆమోదం- సర్వసాధారణంగా బలవంతులవైపే ఉండడం అందరం గమనించే విషయమే.
కేవలం ప్రజల ఆమోదం కోసం కాక, తమ పక్షంలోని న్యాయాన్ని వారి ముందుకు తెచ్చి, వారి సహాయాన్ని అపేక్షించే ప్రయత్నాలూ జరుగుతాయి. కానీ వాటిలో నూటికో కోటికో ఒకటే ప్రజలని తాకుతాయి. అలాటి వాటిని సైతం పక్కదారి పట్టించగల వైనాల గురించిన చర్చ ఉంటుంది- ‘వీరుడు మహావీరడు’ కథలో. ‘వధ’లో రాముడు బలహీను డైన సుగ్రీవుడి పక్షానచేరి వాలిని కూల్చితే, ఇందులో మాత్రం కొత్తపేట శాండో ‘‘తంతున్న అల్లిపురం వస్తాదుని వదిలేసి- తాపులు తింటున్న’’ గంజిపేట రౌడీ ఎముకలు విరుస్తాడు. అంతవరకూ గంజిపేట రౌడీ వైపు సింపతీతో ఉన్న జనం రెచ్చిపోయి అతని మీద తలో చెయ్యి వేసే పరిస్థితి వస్తుంది. ప్రజాభిప్రాయాన్ని చిటికెలో (ఏ)మార్చగల కొత్తపేట శాండో ద్వారా ప్రజల విచక్షణ మీద వ్యంగ్య విమర్శ చేస్తాడు కథకుడు: ‘‘అవును గురూ అలాటోళ్లు, ఏటనుకుంటారంటే, జనం జూస్తూ అన్నేయాలు జరగనిస్తారా అనుకుంటారు. అనుకుని- న్యాయం ధర్మం- అని పెద్ద పెద్ద కబుర్లతో చిక్కుల్లో పడతారు. పడి ఒకళ్లకి తెద్దునా, అందరికీ తెద్దునా అని క్రైసీసులు సృష్టిస్తారు. ఒక్కసారి జనం సంగతేంటో తెలిస్తే మరింకెప్పుడూ అలాటి ఎర్రి కుట్టి ఏషాలెయ్యడు.’’
ప్రత్యక్షంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలు బలహీనుడిని ఒంటరిని చేసిన కథ ఇదైతే, ‘యజ్ఞం’ కథలో అది దండలో దారంలా దాగి ఉంటుంది. తనకి జరిగిన అన్యాయాన్ని వివరించడానికి మూడు రోజుల పాటు ప్రయత్నిస్తాడు అప్పల్నాయుడు. కానీ ప్రయోజనం ఉండదు. ప్రజల సానుభూతిని అర్థించేవారికి అది దొరుకుతుందని గాని, దొరికినా అది ఉపకరిస్తుందని గాని చెప్పలేం. ఏ పరువు కోసం మాట తప్పని వాడినని అతను నిరూపించదల్చుకున్నాడో- ఆ ప్రజామోదాన్ని కథకుడు చీదరించుకుంటాడు: ‘‘అప్పల్రాముడు, అతని సంతతీ- భూమినమ్మేందుకు పత్రాల వేలి ముద్రలు పెట్టడం అంతా అయ్యాక- జనం సానుభూతి రాముడి వంక ప్రవహిస్తోంది. దేనికా ప్రవాహం మురుగు నీరు దాని కన్నా నయం.’’
ఇంచుమించు అలాటి అవగాహనే ఆదివారం కథలో అంకాలుది కూడా. తన హక్కు దక్కించుకోడానికెంతైనా దృఢంగా నిలబడుతుంది. శ్రమ విలువతో పోలిస్తే- ఆమె దృష్టిలో పరువు గుడ్డి గవ్వ పాటీ చెయ్యదు. అందుకే- రెండు రూపాయలెక్కువ పుచ్చుకునైనా సరే, ఆదివారం నాడు మాత్రం పనిలోకి వచ్చి- చుట్టాలు పక్కాలలో తన పరువు నిలబెట్టమని యజమానురాలంటే- ‘‘అంకాలు పక పక నవ్వింది. నవ్వుతూ నవ్వుతూ నా వంక తిరిగి ఆ నవ్వుతోనే- ‘సూడమ్మా యీ యమ్మ మాటలు! దాసీ ముండన్నేనట- యీ యమ్మ పరువు నిలబెట్టాలట!’ అంది. ఆ పరువేపాటిదో చూడన్నట్టు, అందుకా ఆ రెండు రూపాయలన్నట్టు.’’
పరువూ, ప్రజామోదాన్ని లెక్కచెయ్యనివారి సంగతి వదిలేస్తే- ప్రజల మద్దతు కోరే వారికైనా అది లభించొద్దా? ఇక తటస్థ వర్గం ఎప్పటికీ బలవంతుల వైపే మొగ్గుతూ ఉంటుందా? తన కన్నా బలవంతుడైన ప్రత్యర్థితో పోరాటం చెయ్యడమూ తప్పక, చుట్టూ చూస్తూ ఉన్న ప్రజలు సైతం, ఆ బలవంతుడి పక్షమే అవుతూ ఉంటే- నిస్సహాయంగా నేల కూలడమే బలహీనుడి వంతా? కారా కథల్లో కనిపించే వాస్తవం ఇదేనా లేక మరేదైనా పార్శ్వం ఉందా?
ఈ ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే ముందు ఒక మౌలిక ప్రశ్నని వేసుకోవాలి. అదేమిటంటే- పోరాటాలలో ఉన్నవారు- జనం పట్ల- ఏ వైఖరి అవలంబించవలసి ఉంది? దానికి సంపూర్ణమైన సమాధానం- ‘భయం’ కథలో సత్యం పాత్రలో దొరుకుతుంది. సత్యం చిన్నప్పుడే తన శత్రువును గుర్తించి జీవితమంతా పోరాడుతూనే ఉంటాడు. ఆ శత్రువు పేరు- భయం. తనలాగే తన తోటి వారందరిలోనూ భయం ఉందని గుర్తిస్తాడు. తనని ఆదుకోవడానికి వచ్చినవారికే- సహాయం చెయ్యడానికి వెరిచే వ్యక్తి సుబ్బాయమ్మ. ఆమె వంటి వారి స్వార్థానికి కారణం కూడా భయమేనని తెలుసు అతనికి. తన పర భేదాన్ని గుర్తించని విశ్వకుటుంబీకుడౌతాడు.
పోరాటంలో అలిసిపోయి కూలిపోతాడేమో కాని ఓడిపోడు. తనకోసం భార్యని ‘‘ఏడనియ్యడమ్మా! దాన్ని ఏణ్నియ్యడు! దాన్నే కాదు ఎవళూ ఏడవొద్దంటాడు,’’ అన్న వాక్యం వెనకాల ప్రజల నుంచి సానుభూతిని కోరని అతని విశ్వాసం కనిపిస్తుంది.
సత్యంవంటి నాయకులు తన సహచరులకి జ్ఞానం అందించ గలుగుతారు. జీవితం మనిషిలో మార్పు తెస్తుంది. అందుకు అనుభవం కారణం అవుతుంది అంటారు కారా. ఆనాటిదాకా- నిత్యం చూసే మందే, మందలోని పశువులే- కొత్తగా కనపడడం మొదలౌతుంది గురువులికి. లోగుట్లు కనిపెట్టగల విద్య పట్టుబడుతుంది- సత్యంతో జరిగిన అనుభవం కారణంగా.
ఎలాటి అన్యాయాలు తమ మధ్య జరిగినా పట్టనట్టుండే జనాన్నే కారా కథల్లో చూసిన మనకి,- ‘భయం’ కథలోని జనవాక్యం పూర్తిగా భిన్నంగా వినిపిస్తుంది. ‘‘ ‘...బతికిన్నాడూ, సచ్చిన్నాడూ బయఁవెరగడు మనిషి, పాఁవుమీద పగపట్టిన్నాడే, పేణాలమీద ఆశ ఒగ్గుకున్నాడు... అంసలాగ బతికిందికి ఆర్నెల్లు సాలు! ఉంటాం, నువ్వూ నేనూ. ఎంత కాలఁవైనా ఒక్కటే...’- జనం ఎన్నెన్నో విధాల చెప్పుకుంటున్నారు.’’ సత్యం పోరాటం పట్ల ప్రజల స్పందన మన ప్రశ్నలెన్నిటికో జవాబులు దొరికే దారి చూపిస్తుంది.
సమాజంలో పోరాటాలు ఏయే కారణాల వల్ల మొదలౌతాయో, వాటి ఫలితాలెలా ఉన్నాయో, అవి ప్రజలమీద ఎలాటి ప్రభావాన్ని మిగిల్చాయో- దగ్గరనుంచి పరిశీలించి- ఆ పరిశీలనా సారాన్ని ఒక్కో కథగా మలిచినట్ట నిపిస్తుంది. పోరాటాలని వర్ణించేటప్పుడు- ప్రత్యర్థుల హావభావాలనీ, తద్వారా మానసిక స్థాయిలనీ తెలియజేయడం కారా కథల ప్రత్యేకత. ఆవేశంతో పోరాడుతున్నవారు ఓటమివైపూ, ఆవేశాన్ని అదుపు చేసుకున్న వాడు గెలుపువైపూ అడుగు వేస్తున్నట్టు కథలలో చాలాసార్లు కనిపించడం యాదృచ్ఛికం కాదు. భయం మీద విజయం సాధించి, ఆవేశపు తదుపరి స్థాయి చైతన్యాన్ని చేరినవారే పోరాటాల దిశ మార్చగలుగుతారు. ప్రజలలో సహానుభూతినే కాక ధైర్యాన్ని కూడా నింపగలుగుతారు. వారిలో పోరాటాలపట్ల సంఘీభావం కలగాలంటే- ఎటువంటి కార్యాచరణ ఉండాలో దానికి సత్యం పాత్ర నమూనాగా కనిపిస్తుంది.

No comments:

Post a Comment