Tuesday, 11 January 2022

కులం - తరచుగా వేస్తున్న ప్రశ్నలు - సమాధానాలుకులానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఈ విలువైన ఇంటర్వ్యూను వీడియో రూపం నుండి లిఖిత రూపంగా మార్చి, తెలుగులోకి అనువాదం చేసి ఇచ్చిన Madhura Dhara Talluri Kalyani SJ లకు మాతృక ధన్యవాదాలు తెలియచేసుకొంటోంది.

కులం - తరచుగా వేస్తున్న ప్రశ్నలు - సమాధానాలు
శబ్దరూపంలోని ఇంటర్వ్యూను రాతపూర్వకంగా మార్చినవారు: మధురధార
ఆంగ్లం నుండి అనువాదం: ఎస్ జె కల్యాణి
సూరజ్ యెంగ్డే మన దేశపు ప్రముఖ విద్యావేత్త, ప్రజా మేధావి. జీజే మ్యాగజైన్ -25 ‘అత్యంత ప్రభావవంతమైన యువ భారతీయుల -జాబితాలో ఈయన పేరు ఉంది. ‘అత్యంత ప్రభావవంతమైన యువ దళితుల’లో ఈయన ఒకరని జీ వార్తాసంస్థ పేర్కొంది. సూరజ్ రాసిన ‘క్యాస్ట్ మాటర్స్’ (కులం చాలా ముఖ్యం)’ విజయవంతమైంది. అవార్డు గెలుచుకున్న ‘ది రాడికల్ ఇన్ అంబేద్కర్’ అనే సంకలనానికి ఆయన సహ సంపాదకునిగా పనిచేశారు. ఇటీవల ది హిందూ తయారుచేసిన ‘దశాబ్దపు ప్రతిష్టాత్మక ఉత్తమ నాన్-ఫిక్షన్ పుస్తకాల’ జాబితాలో ‘క్యాస్ట్ మాటర్స్’ పుస్తకం కూడా చోటు చేసుకుంది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో సీనియర్ ఫెలో, ఆయన ఆఫ్రికన్ మరియు ఆఫ్రికన్-అమెరికన్ అధ్యయనాల విభాగంతో రీసెర్చ్ అసోసియేట్‌గా ఉన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆఫ్రికన్ మరియు ఆఫ్రికన్-అమెరికన్ పరిశోధనల కోసం హచిన్స్ కేంద్రంలో నాన్ రెసిడెంట్ ఫెలోగా సేవలు అందిస్తున్నారు. ప్రపంచపు దక్షిణ భాగంలో ‘క్యాస్ట్’, జాతి, జాతి ప్రత్యేకతల అధ్యయనాలు, కార్మిక వలసల రంగంలో సూరజ్ రాసిన 100 పైగా వ్యాసాలు, ఆర్టికల్స్, ఇంకా పుస్తక సమీక్షలు బహుళ భాషలలో ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం, ఆయన దళితులు, నల్ల జాతికి సంబంధించిన అధ్యయనాలలో ఒక కీలకమైన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
ఈ ఇంటర్వ్యూ చేసినవారు టి.ఎం కృష్ణ. టి.ఎం కృష్ణ -రచయిత, యాక్టివిస్ట్, రామోన్ మాగ్సేసే అవార్డు గ్రహీత. గాయకుడిగా, ఆయన తన కచేరీల శైలిలోనూ, వస్తువులోనూ అనూహ్యమైన ప్రయోగాలు చేసారు. సాంప్రదాయ విలువలలో బంధించబడి సంగీతం ఉందనీ; రాజకీయ పక్షపాతాలతో, ప్రచ్ఛన్న భావజాలాలతో నిండిన సామాజిక సోపానాల ఉక్కు పిడికిలి నుంచీ కర్ణాటక సంగీతాన్నీ, ఇతర కళారూపాలను విడిపించాలని -ఆయన పుస్తకం 'రీషేపింగ్ ఆఫ్ ఆర్ట్' ద్వారా అభ్యర్థిస్తారు. అతని మరో పుస్తకం 'సెబాస్టియన్ & సన్స్' - గొడ్డు చర్మాన్ని వలిచి, మృదంగాన్ని తయారుచేసే దళిత కళాకారుల చరిత్ర.
టి.ఎం కృష్ణ: కొన్ని ప్రశ్నలు మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి, కులం కారణంగా ప్రత్యేక హక్కులను పొందిన ప్రజలు అడిగే ప్రశ్నలు ఇవి. కులం గురించి సంభాషణ జరిగిన ప్రతిసారీ ఇవే ప్రశ్నలు తిరిగి వస్తున్నాయి. వీటికి సమాధానాలు అనేక సందర్భాల్లో, అనేక వ్యక్తులు ఇచ్చినప్పటికీ, తరతరాలుగా -ఈ ప్రశ్నలు మాత్రం ఎక్కడికీ పోవడం లేదు. కాబట్టి మేము వాటన్నిటినీ ఒకచోట చేర్చి చూద్దాం అనుకుని -ఈ ప్రశ్నలను క్రౌడ్ సోర్సింగ్ (ప్రజల నుండి సేకరించడం) చేసి, సమాధానాలను ఒకే వేదిక పైకి తీసుకు వస్తున్నాము. ఈ అంశాలను విస్తృతంగా షేర్ చేసి, ఎంత ఎక్కువమందికి వీలైతే అందరికీ వినిపించాలనీ, వాళ్లందరూ వీటి నుండి నేర్చుకుంటారనీ ఆశిస్తున్నాము.
సూరజ్, స్వాగతం. ఈరోజు మనం ఇలా కలిసి అలా మాట్లాడే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
సూరజ్: థేంక్యూ బ్రదర్ కృష్ణ! మీ ధైర్యసాహసాలు, జనాకర్షణతో -తాను చేసుకున్న తప్పులలో తానే కూరుకొనిపోయి, అవసాన దశలో ఉన్న రంగానికి (సంగీత కళారంగం అయి ఉండవచ్చు – అను.) కొత్త ఊపిరి పోయడం చూసి నేను ఆనందిస్తూ ఉంటాను. మీరు అందిస్తున్న సేవలకు నా నెనరులు.
టి.ఎం కృష్ణ: థేంక్యూ! నేను నేరుగా ప్రశ్నలలోకి వెళ్తాను, నా దగ్గర కులానికి సంబంధించిన ఒక 10 ప్రశ్నలు ఉన్నాయి.
కులం అనేది గతకాలానికి సంబంధించినదనే వాదంతో -ఈ ప్రశ్న పదేపదే తిరిగి వినిపిస్తూనే ఉంటుంది ‘నా పూర్వీకులు చేసిన అకృత్యాలకి నేనెందుకు మూల్యం చెల్లించాలి?’ అని.
సూరజ్: ముందుగా ఒక మాట. కులం అనేది గతానికి సంబంధించినది కాదు. అది ఈనాటిది, ఇప్పుడూ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మనం పీల్చే గాలి లాంటిది. మనం వదిలేది కార్బన్ డై ఆక్సైడ్‌ని కాదు కులతత్వాన్నే. కులం అనేది -అమాయక హృదయాన్ని సైతం దురభిమానిగా మార్చగలిగే శక్తి ఉన్న వ్యవస్థ. అది -బడికి పోయే పసిబిడ్డకి కూడా -వాడికీ నాకూ ఉన్న భేదాన్ని గమనించేలా చేస్తుంది. వాడి ఆధిపత్య కులాన్ని, నా దళిత కులాన్నీ గుర్తు పట్టేలా చేస్తుంది. అలాటి తేడాలను పసిగట్టే విద్య పిల్లవాడికి నేర్పిస్తుంది.
ప్రస్తుతం ఒక సంవత్సరంలో దళితుల పట్ల 49,000 దారుణాలు జరిగాయని తెలుస్తోంది -ఇంకా కులం గతానికి సంబంధించినదని ఎలా అంటాం? ఇది కేవలం ప్రభుత్వ డేటా మాత్రమే. సాధారణ డేటా కావాలంటే, దాన్ని మూడు పెట్టి గుణించండి. ఇంకా నమోదు అయిన కేసులు, నమోదు కానివి ఎన్నుంటాయో ఊహించాల్సిందే.
మీ పూర్వీకుల పాపాలకు మిమ్మల్ని పరిహారం చెల్లించమని ఎవరూ అడగడం లేదు, మీరు చెల్లించడం లేదు. అది మళ్లీ ఒక పెద్ద అబద్ధం. మీరు ఏమి చెల్లిస్తున్నారు? ఆధిపత్య కులంలో ఒకరు పుట్టారంటే అపారమైన సామాజిక మూలధనాన్ని పుట్టుకతోటే వెంట తెచ్చుకుంటారు. తక్కిన వాళ్లు ఇంకా కనుచూపు మేరలో కూడా లేనప్పుడు -ఇతను అప్పటికే ఆటలో ఒక అడుగు వేసి ఉన్నాడన్న మాట. యథాతథ స్థితిని కొనసాగించడం ద్వారా -మెజారిటీ జనాలని పీడించి, మీ పూర్వీకులు మీకు అందించిన ప్రయోజనాలని అందుకుంటున్నారు.
ఇంకో విషయం ఏమిటంటే -నిన్ను నువ్వు దేశంలో భాగంగా ఎలా చూసుకుంటున్నావు అనేది. ‘నా దేశం’ అనే భావనకి అర్థం త్రివర్ణ పతాకాన్ని మోయడం, మైనారిటీలను పరాయి వాళ్ల కింద చూడడం, లేదంటే ఒక మతాన్ని స్వంతం అనుకోడం కాదు. ఒక దేశ వాసులంతా ఆ దేశపు వనరులను పంచుకోవడం -అదీ ఒక దేశంగా ఉండడం అంటే. అభివృద్ధి చెందిన సమాజాలలో అది కనిపిస్తుంది. ‘నా దగ్గర ఒక 10 రొట్టెలున్నాయి, నాకొక రొట్టెతో కడుపు నిండిపోతుంది, తక్కిన తొమ్మిందింటినీ ఏం చేస్తాను? నా దగ్గరే ఉంచుకుని వాటిని కుళ్లి పోనిస్తానా లేక మరో 9 మందికి వదిలేస్తానా? అలా చేయడం ద్వారా -మర్నాడు నాకు కావలసింది తీసుకోడానికి వీలయిన వ్యవస్థ నొక దానిని తయారు చేసుకుంటానన్న మాట.
ఉదాహరణకి ఈ దేశంలో బ్రాహ్మణ సమాజం దగ్గర, సగటు జాతీయ ఆదాయం కంటే 40% ఎక్కువ ఆదాయం ఉంది. బ్రాహ్మలు సుమారుగా జనాబాలో 4-4.5% ఉంటారు, కొందరు 3.5% అంటారు. ఇది స్పష్టంగా అపార్థైడ్ (వివక్షతో నిండిన సమాజం -దక్షిణాఫ్రికాలో మైనారిటీలైన తెల్లజాతి, మెజారిటీ వనరులను స్వంతం చేసుకోడం) లాంటిదే. 3% ప్రజల దగ్గర 3% వనరులే ఉండాలి కదా, మిగిలిన 37% ఏ వనరులూ లేని ప్రజలకి పంపిణీ కావాలి కదా. అన్నట్టు, వారి దగ్గర ఉన్న వనరులు మెరిట్ మీద తెచ్చుకున్నవి కాదే, వలస ప్రభుత్వాల దగ్గరా, అంతకు ముందు ముస్లిం ప్రభువుల దగ్గరా -కొలువు చేసి ఈనాములుగా భూములను సంపాదించుకున్నారు, ఒక స్వతంత్ర భూస్వామ్యాన్ని ఏర్పరుచుకున్నారు. మెజారిటీ ప్రజలు పేదరికంలోనే ఉండిపోయారు. కాబట్టి చెప్పేదేమిటంటే, నువ్వు నీ పూర్వీకుల తరపున చెల్లించడం లేదు. నువ్వు ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా నీ వంతు పన్ను నువ్వు కడుతున్నావు. 10 రూపాయలు కట్టి, 100 కట్టినట్టు మాటాడి, ఆ పైన 1000 కట్టానని క్లెయిమ్ చేస్తుంటావు. ఇందులో చిత్రమేమిటంటే -వారి అతిశయోక్తులను వాళ్లే నమ్మి, దళితులు ఆదివాసీలు వీరి మీద పడి తింటున్నారనే నిర్ధారణకి వచ్చేస్తున్నారు. కానీ అది నిజం కాదు. అసలు అందుకే ఉద్యోగాల గురించి ప్రశ్న వేసుకోవాలి. ఏయే కుల సమూహం ఎంతెంత డబ్బు గడిస్తోందన్న గణాంకాలు కావాలి. నువ్వు దళితుల విద్యకయ్యే ఖర్చు భరించడం లేదు, వారి ఖర్చు వారే భరించుకుంటున్నారు -ఎందుకంటే అధికారిక, అనధికారిక ఆర్థిక వ్యవస్థలో వారు శ్రమ చేస్తున్నప్పుడు, వారు సృష్టిస్తున్న సంపద రాజ్యపు ఖజానాలో చేరుకుంటుంది, అదే రాజ్యం మళ్లీ వారికి వెనక్కిస్తుంది. ఇక్కడైతే, రాజ్యం వారికి వెనక్కి ఇవ్వడం లేదు కూడా. రాజ్యం ఆ డబ్బుని ఫ్లైఓవర్ల నిర్మాణం, కామన్‌వెల్త్ గేమ్‌లు వంటి వాటిలో ఖర్చు చేస్తోంది, మళ్లీ దానిలో దళితులని దోపిడీ చేయడమే జరుగుతోంది. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. దళితుల నుండి రాజ్యపు ఖజానాలోకి ఎంత వెళుతోంది, వారికి తిరిగి ఎంత వస్తోంది అన్న దాని మీద నిజానికి ఆర్థిక కోణంలోంచి ఖచ్చితమైన అధ్యయనం జరగాల్సి ఉంది.
టి.ఎం కృష్ణ- తర్వాతి ప్రశ్న- ‘అగ్ర ‘కులం’ అంటే దానిలో ఫార్వర్డ్ కేస్ట్‌లు అన్నీ వస్తాయి కదా (FCs). మరి మీరు ‘బ్రాహ్మణీయ’ అనే పదం ఎందుకు వాడుతుంటారు?”
సూరజ్: ఇది ఆసక్తికరమైన ప్రశ్న. బ్రాహ్మలు ప్రత్యేకించి, ‘బ్రాహ్మణీయ’ అనే పదం వాడకం మీద అభ్యంతరం చెప్తూ ఉంటారు. వారిని మాత్రమే నిందిస్తున్నట్టు అనిపిస్తుందనుకుంటా. ఇది ఒక రకంగా నిజం, మరో రకంగా నిజం కాదు కూడా. ‘బ్రాహ్మణీయ’ వ్యవస్థ అనేది - ‘పురుషోత్తముడు’ అనే భావనలో విశ్వాసం ఉంచుతుంది. ఏ జీవి ఏ కడుపున పుడతుంది అనేది బ్రహ్మ, లేదంటే మరో పాత్ర నిర్ణయిస్తుందనీ, ఆ సూత్రాన్ని బట్టీ సృష్టిని నడుపుతుందనీ నమ్ముతుంది.
రుజువు చేసుకోనవసరం లేకుండానే, దాని కోసం ప్రయత్నించనక్కర లేకుండానే -వారికి యోగ్యత ఆపాదించబడుతుంది -అదే ఇక్కడ సమస్య. ఒక్క కులం అనే కాదు, అన్ని రకాల అణచివేతలను కలిపి ఉంచే వ్యవస్థని ‘బ్రాహ్మణీయం’ అని పిలుస్తున్నాం, ఎందుకంటే, నిచ్చెన మెట్ల వ్యవస్థలో బ్రాహ్మలు అగ్రభాగాన ఉంటూ, అక్కడే నిలిచి ఉండడానికి రకరకాల ఎత్తులు, జిత్తులూ కనిపెట్టారని తెలుస్తోంది. ఒకరు పైన ఉన్నారంటే, తక్కిన వారంతా కింద ఉన్నారని అర్థం -కనకనే ఆ అగ్ర భాగాన ఉన్న వారి పేరుతోనే ఆ వ్యవస్థని గుర్తిస్తున్నాం.
టి.ఎం కృష్ణ: “కులం అన్ని మతాల్లోనూ ఉంది, మరి హిందూ మతాన్నే ఎందుకు ప్రత్యేకించి తప్పు పడుతున్నారు?”
టి.ఎం సూరజ్: ఇది పొరపాటు అభిప్రాయం. నిజం కాదు. అంబేద్కర్ కూడా క్రైస్తవం, ఇస్లాంలో ఉన్న వివక్ష గురించి చాలా నిశితమైన విమర్శ చేసి ఉన్నాడు. మరో సంగతి, అంబేద్కర్ క్రైస్తవంలోని వివక్షను స్వయంగా అనుభవించాడు. ఆయన బరోడా వెళ్లినపుడు, క్రైస్తవమతం పుచ్చుకున్న ఒక బ్రాహ్మణ మిత్రుడు కులవివక్షను పాటించేవాడని తన ఆత్మకథలో రాసుకున్నాడు, అలాగే పార్సీల గురించి కూడా చెప్పాడు. పార్సీలు చాలా పలుకుబడి కలిగిన వర్గం, కానీ వారు కూడా బ్రాహ్మణీయ భావజాలానికి లొంగి ఉన్నారు. కాబట్టి, ఏ వ్యవస్థ అయితే స్త్రీని 4 గంటలకి లేచి, తమ పనిముట్లు పట్టుకుని వెళ్లి -మన మలమూత్రాలను శుభ్రం చేయమని ఆదేశించి, అణగదొక్కుతోందో -ఆ వ్యవస్థని మనం ఖండిస్తున్నాము. అది అలాగే ఉండాలని సమర్ధించే ప్రతీ ఒక్కరికీ, కేవలం హిందువుకే కాదు -ఇది వర్తిస్తుంది. భారతదేశంలో కులాలన్నిటిలోనూ -ఈ ధోరణి కనిపిస్తుంది, అన్ని మతాలకీ పాకింది. ఈ ఏరు పారుతున్నంత కాలం, అందరూ దీనిలో ఒళ్లు తడుపుకోడానికి చూస్తూనే ఉంటారు. సుమారు 2,600 ఏళ్ల కితం, ఏ విధానాలని ఆధారంగా చేసుకుని, ఈ దుర్మార్గ వ్యవస్థ రూపొందించబడిందో, ఆ విధానాల తోటే మెజారిటీ సమూహాలని పీడించడం ఈనాటికీ కొనసాగుతోంది.
టి.ఎం కృష్ణ: థేంక్యూ! “అసలు నిజంగా వ్యక్తులను వేరుచేసేది వర్గం కదా, (కులంకాదు కదా)?”
సూరజ్: ఆ విషయంలో నాకు, కొంత అంగీకారం లేకపోలేదు. వర్గం -విభాజక అంశమే, కానీ కేవలం అది ఒక్కటే కాదు. అలా అయి ఉంటే, ఈపాటికే విప్లవం వచ్చి ఉండేది. మన అనుభవాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం, దానిని ఏమని పిలుస్తాం అనే విషయంలో ఒక పాటి అంతరం ఉంది ప్రజల అవగాహనలో. వర్గ అంతరం వల్ల బాధ పడేవారు వర్గం గురించి మాట్లాడతారు, కులం బాధించే వారికి కులం సమస్యగా కనపడుతుంది. భారతదేశపు వ్యవస్థలో, కులం అనేది వర్గాన్ని అధిగమించి పోయింది. అయితే, మనం కేవలం కులం గురించి మాట్లాడితే సరిపోదు. కులం అనే మాట పక్కన, ఒక కామా పెట్టి విధిగా దానికి వర్గం అనే మాటను జోడించాల్సి ఉంది. ఎందుకంటే శ్రమని దోచుకోవడం అనేది కుల వ్యవస్థకి పునాది కదా? మార్క్స్ ‘అదనపు శ్రమ’ అనే మాటని గుర్తించి, మనకి చెప్పడానికి ఎంతో పూర్వమే భారతదేశంలో శ్రమదోపిడీ -కులవిభజన ద్వారా అమలు జరుగుతోంది. కులాన్ని ఎందుకు పోకుండా కాపాడాలనుకుంటారు ఎవరైనా? పొలం పనికైనా, నిత్యజీవితంలోనైనా -శ్రామికులు అందుబాటులో వుంటారు. అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే దానిని విదిలించెయ్యవచ్చు, ఎవరికీ జవాబు చెప్పుకోనక్కరలేదు. ఆ మనుషులకి నువ్వు బాధ్యత పడక్కరలేదు, ఎందుకంటే వాళ్లు ధర్మ శాస్త్రాలు చెప్పే కర్మ సిద్ధాంతంతో బంధించబడి ఉంటారు, ఇక్కడ ‘పాప పరిహారం’ చేసుకోడానికి పుట్టిన మనుషులు వాళ్లు.
కాబట్టి వర్గం ప్రశ్నకి సంబంధించినంత వరకు, ప్రత్యేకించి ఈ కొత్త లిబరల్ సందర్భంలో -వర్గం అనేది మౌలిక నిర్ణాయకం అనేది నేను ఒప్పుకుంటున్నాను. అయితే -ఇక్కడ ఒక ఆసక్తికరమైన మెలిక ఉంది. ఈ ‘నియో లిబరలిజం’ (కొత్త ఉదారవాదం) అనేది కుల వ్యవస్థలోని సూక్ష్మ రంధ్రాలలోకి ఇంకింది. రాజకీయాలని, నిత్యజీవితాన్ని మాత్రమే కాదు, ఇది ఇప్పుడు అంతర్జాతీయ
సంస్థలలో సైతం చొచ్చుకుపోయింది. కేంబ్రిడ్జ్‌లో చూశాం మనం. కాలిఫోర్నియాలో, ఆర్యసమాజ్ ‘బాప్స్’ గుడిలో ఎలాటి దోపిడీ జరిగిందో చూశాం కదా. (యుఎస్‌లోని BAPS, Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sansthan మీద 12 మే 2021న, ఎఫ్‌బీఐ దాడి చేసింది. అక్కడ, దళిత శ్రామికులని, అమానవీయ పరిస్థితులలో బలవంతంగా ఉంచి, 10% వేతనాన్నిస్తూ – పని చేయిస్తున్నారని బయటపడింది -అను)
కాబట్టి ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకో వలసినదేమిటంటే, ఈ రెండు అంశాల మీదా ఒకేసారి దృష్టి సారించి, మనం నిశితంగా విశ్లేషణ చెయ్యాలి. అయినా ఏది ముందు పోవాలనే ప్రశ్న ఏమిటి, ఇదేమన్నా పోటీనా?
వర్గం అనేది నిలవడానికి, కులానికి ఒక గిన్నెలాగా అమిరింది. ఆ వర్గం అనే మొక్క వేళ్లుని, బలంగా పుంజుకుని మరింత ఎదగడానికి దోహదం చేసే భూమిక -కులం.
మరో సంగతి గమనించండి, ఉన్నత ‘వర్గం’ లో ఉన్న వారంతా ఎవరు? వారి కులం ఏమిటి? అని చూస్తే, బ్రాహ్మలు, వైశ్యులు -వీళ్లే పెట్టుబడికి యజమానులు. క్షత్రియ కులాల దగ్గర భూమి తప్ప నికరమైన పెట్టుబడి లేదు. అది 93% బ్రాహ్మలు, వైశ్యుల దగ్గరే ఉందని EPW (ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ) రీసెర్చ్‌లో తేలింది.
టి.ఎం కృష్ణ:
ఔను, నిస్సందేహంగా! ఇదిగో ఈ ప్రశ్న, తరచుగా బ్రాహ్మల నుండి వస్తూ ఉంటుంది. “దళితులు ఎదుర్కొంటున్న హింస చాలా వరకు OBC సమూహాల ద్వారానే జరుగుతుంది. అయినా కుల ఉద్యమకారులు బ్రాహ్మలనే తప్పు పడతారు, OBCలని ఎందుకు ప్రశ్నించరు?”
సూరజ్: మనం ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటే, మనం ఎలా ఉన్నాం అనేదే చూస్తాం. అలాటిదే ఇదీని. నేను చాలామందినే ప్రశ్నిస్తున్నా, నువ్వు మాత్రం నీ పేరునే వింటావు. ఈ మానసిక వైఖరి మానవ సహజం. బ్రాహ్మలనే కాదు, వర్గం-కులం సమూహాలన్నింటి గురించీ నేను విమర్శ పెడుతూనే ఉన్నాను. OBCల ద్వారా హింస జరుగుతోందనేది వాస్తవమే. అయితే, కులం అనే నిర్మాణానికి లోబడివారు ఆ హింసని కొనసాగిస్తున్నారు. కులం లేనప్పుడు, OBCలూ మనుషులే, బ్రాహ్మలూ మనుషులే, దళితులూ మనుషులే. కులం అనే చట్రంలో ఒకరు బ్రాహ్మలు అవుతారు, ఒకరు OBC అవుతారు. నేను నా బ్రాహ్మణ మిత్రులతో అంటూ ఉంటాను. నిజంగా ఈ విషయాన్ని వాళ్లు పట్టించుకునే మాటయితే, బ్రాహ్మణ సమూహాలు ఒక ఫత్వాలాంటి తీర్మానాన్ని జారీ చెయ్యాలి. ఏమని అంటే -దళితుల మీదా, ఆదివాసీల మీదా జరిగే హింస -హిందూ ధర్మానికీ, అది బోధించే విలువలకీ వ్యతిరేకం కనుక ఎవరైనా OBCలు అలాటి హింసకు పాల్పడితే, వారికి ఆలయాలలో ప్రవేశం నిషేధం అని.
ఈ OBCలని ‘బ్రాహ్మణీయ సేవక కులాల’ని పిలుస్తాను. ఎందుకంటే ఆ వ్యవస్థకి ఒకపక్క ఊడిగం చేస్తూ, ఉత్తుత్తి ఆధిక్యతను అనుభవిస్తారు. వారిది మౌలికమైన అధికారమూ కాదు, చాలినంత ఎలాగూ లభించదు. దళితుల మీద దౌర్జన్యం అనే నేరాన్ని అతను/ఆమె ఎందుకు చేస్తారంటే, ఆ హింసకి ప్రతిఫలం -ఈనాడు మనం భారతదేశంలో చూస్తూ ఉన్నట్టూ -రాజకీయంగానో, ఆథ్యాత్మికంగానో, మరో రకంగానో పై నుండి తమకు అందుతుందని -వారు విశ్వసిస్తారు కాబట్టి.
టి.ఎం కృష్ణ: ఇదిగో ఈ ప్రశ్న అయితే, నా స్నేహితులు చాలా మంది అడుగుతూ ఉంటారు. వాళ్లంటారూ -“నా ఇంటిలో పని చేసే వ్యక్తిని నా కుటుంబ సభ్యునిగా భావిస్తాను. (వారు ఎన్నో దశాబ్ధాలగా మా ఇంటిలో ఉన్నారు), నన్ను కులవాదినని ఎందుకు నిందిస్తారు?”
సూరజ్: ఉదార గుణంతో ఉండడం అనే విషయానికి వస్తే మరే రకమైన ప్రశ్నలు వెయ్యకుండా ఉండడానికి అలవాటు పడిపోయాం. ఆశ్రయం ఇస్తున్నాం అనే భావం ఒక్కోసారి అసభ్యమైన స్థాయికి చేరుకుంటూ ఉంటుంది. అవతలి వారు నీ ఇంటిలో పని చేస్తున్నారంటే -అది సాధ్యమయ్యేలా చేసిన కుల వ్యవస్థ ఒకటుందని, అది వారి జీవితాన్ని నరకప్రాయం చేసిందనే విషయం మర్చిపోకూడదు. మా నాయనమ్మ, అమ్మమ్మ ఇళ్లలో పని చేసేవారు. ఒక్కోసారి మా అమ్మమ్మ పని చేసే ఇంటికి నన్ను తీసికెళ్లేది. వాళ్లింటిలో నెయ్యి రాసిన రొట్టెలు, ఇంకా కొన్ని నాజూకు వంటకాలు నాకు దొంగతనంగా పెట్టాలని చూసేది. నా అమ్మమ్మ నా కళ్లలో హీరోయిన్, అలాటిది ఆ పని చేయాల్సి వచ్చిందంటే -నాకు ఎంతో ఇబ్బంది కలిగేది. తనకి ఇష్టమై ఆమె ఇళ్లలో పనికి కుదరలేదు, బయట ఉన్న పరిస్థితులు ఆమెకు అది తప్పనిసరి అయ్యేలా చేశాయి. కనక, నిన్ను నువ్వు కులరహితుడివి అయ్యావు అని ప్రకటించుకునే ముందు, నీకూ ఆమెకూ మధ్య కులభేదాన్ని పొగొట్టడానికి -నువ్వు ఏం చేశావు అనే ప్రశ్నని వేసుకుంటే బాగుంటుంది. పనివాళ్లు వాడే పాత్రలూ, గ్లాసులూ విడిగా ఉంచుతారు, ఇంట్లో ఒకవేళ పూజగది ఉంటే -దానిలోకి రానివ్వరు. అసహ్యకరమైన వ్యవస్థ, అందులో బ్రతుకుతున్నాం. అయితే ఒక మంచి పరిణామాన్ని చూస్తున్నాను. యువతరం, ప్రత్యేకించి సవర్ణ సమూహాలకి చెందిన పిల్లలు -నాకు చెప్తూ ఉంటారు -మేము ఈ కుల వివక్షను మా చుట్టూ గమనిస్తున్నాం, మాకు చాలా బాధ కలుగుతోంది అని. నేననేది ఏమిటంటే, ఈ కుల నిర్మాణాలు నీ చుట్టూ ఉన్నాయని నువ్వు గుర్తించకపోతే, నీ ఔదార్యం, దయాగుణాలు సైతం క్రమక్రమంగా నిన్ను కులవాదంలో భాగంగా మార్చివేస్తాయి.
టి.ఎం కృష్ణ: నిజమే! ప్రగతిశీల, ఉన్నతకులాల వ్యక్తులు అడిగే మరో ప్రశ్న -“నేను కులాన్ని నమ్మను (అలా అని వాళ్లంటారు). నా కులాన్ని సూచించే ఇంటిపేరును కూడా నేను వాడను. నేను కుల పీడకుడిని ఎలా అవుతాను?”
సూరజ్: ఇంటి పేరు మార్చుకుంటే, అంతా చెరిగిపోయే పనైతే ఇంక సమస్య ఏముంది? అయితే ఇది ఆసక్తికరమైన విషయం -తమిళనాడులో, ఇంటిపేరు అంటూ ఉండదు, ఐస్‌లాండ్‌లో కూడా అలాగే ఉంటుంది, పిల్లలకి తండ్రి పేరే వస్తుంది. దానిలో ఒక స్వేచ్ఛ లేకపోలేదు.
ఈ ప్రగతివాదులు, ‘నేనైతే, నా కులం పేరును తీసేశాను’ అని చెప్తారు, నాకు తెలుసు వారి ఉద్దేశం మంచిదే, వాళ్లని వేళాకోళం చెయ్యకూడదు. వారికి అర్థమయ్యేలా చెప్పాలి- నువ్వు గ్రహిస్తున్నదీ, అక్కడ ప్రదర్శించబడుతున్నదీ – రెండింటి మధ్యా కొన్ని ఇబ్బందులున్నాయని. కొందరు ప్రగతివాదులు - ‘అందరి పురోగతి’ అనే లిబరల్ విలువని, గాంధీ మోడల్‌గా భావిస్తారు. కానీ ఆ ‘అందరి మోడల్’లో, నిజానికి అసలైన పాత్ర ఆధిపత్య కులాలదే ఉంటుంది. గ్రాంట్‌లు ఇవ్వడం, మెమోలు రాయడం లాటివన్నీ వాళ్లే. అరుదుగా ఎప్పుడో ఒకవేళ, ఏ దళితుడికో, ఆదివాసీకో ఏ కొంతన్నా మేలు జరిగిందో -దానిని అక్కాడా ఇక్కడా ప్రస్తావించి -దానికి మెప్పుదలలని పొందడానికి ప్రయత్నిస్తారు. అక్కడే చాలా ఇబ్బంది కలుగుతుంది
కానీ -వేరే ప్రగతివాదుల సమూహాలూ ఉంటాయి. వారికి నిజంగానే ఈ విషయంలో ఆసక్తీ ఉంటుంది, వారికి మార్గనిర్దేశం అవసరం అవుతుంది. వారిది రైట్ వింగ్ భావజాలం కాదు, కానీ వారు విశ్వాసాలతో బంధించబడి ఉంటారు. వారి కులానికి దొరికే ప్రివిలేజ్‌లని వాడుకోడానికి, ఇంటి పేరును బయటపెట్టే అవసరమే ఉండదు. ఎందుకంటే మహానగర సంస్కృతిలో –నీకు అవసరమయ్యేది -నీ కనెక్షన్‌లే (పరిచయాలు).
కాబట్టి కులతత్వ విరోధం కోసం నేను ఏ రకమైన పని చేయాలనే దానితో పాటు, ఈ విభజనలని సమూలంగా నిర్మూలించడానికి నా వరకు నేను ఎంత పూచీ పడగలను అనే దిశలో ఆలోచించాలి. అంటే, ఎక్కువ పదవులను ఆక్రమించుకుని, ఈ విభజనలను పెంచే విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులని, నీ స్వంత సమూహాల్లో గుర్తించి వారిని ప్రశ్నించగలగాలి. దళితవాడల్లోకి వెళ్లి, వారికి సహాయపడతాం అనే బదులు, ఎవరి పరిసర సమాజాల్లో వారు -‘పవర్’తోనూ ‘ప్రివిలేజ్‌’తోనూ సంభాషణ జరపాలి.
టి.ఎం కృష్ణ- ప్రజలు అడిగే మరోప్రశ్న – ఇది కులం కాదు సంస్కృతి అంటారు. సాధారణంగా వివాహానికి సంబంధించి ఈ చర్చ జరుగుతూ ఉంటుంది. వాళ్లంటారూ -“మాకు అసలు కులం గురించిన సమస్య లేనేలేదు, కానీ ఒకే రకమైన సమూహాల మధ్య పెళ్లిళ్లు, సహజీవనం -సులభంగా ఉండడం నేను గమనించాను. అదే సంస్కృతి.”
సూరజ్- దానిలో తప్పేమీ లేదు. పెళ్లి నిర్ణయం అనేది ప్రతి ఒక్కరి స్వవిషయం. కానీ భారతదేశంలో సంస్కృతి అంటే కులమే. ప్రముఖ చరిత్రకారుడు, మార్క్సిస్ట్ మేధావి, బ్రిటిష్ దేశస్థుడు, ఎరిక్ హాప్సన్ ‘సంప్రదాయం’ మీద ఒక విశ్లేషణ వ్యాసం రాశాడు. ఆయన అంటాడు, సంప్రదాయం అనేది ఏదీ ఉండదు, మన స్వంత విలువలని నిలబెట్టుకోడానికీ, మిగిలిన మెజారిటీ మీద వాటిని రుద్దడానికి -దానిని సృష్టిస్తాం. పండగల లాంటివన్నీ ‘సంప్రదాయం’లో భాగంగా మారిపోతాయి. ఉదాహరణకి, అమెరికా ఉత్సవం జరుపుకునే విషయం, మిగిలిన ప్రపంచానికి నవ్వుతాలు వ్యవహారంలా ఉంటుంది, కానీ దానిని వాళ్లు సంప్రదాయంగా మార్చుకున్నారు.
అయితే సంస్కృతి విషయానికొస్తే, సంస్కృతికి చారిత్రక సందర్భం అవసరం అవుతుంది. కులం అది అందిస్తుంది. కులం నీకు చరిత్రని ఇస్తుంది, కులం నీకు సూచికలని, ప్రస్తావనలని ఇస్తుంది. సంస్కృతిలో వైకల్యాలు చోటు చేసుకున్న కారణంగా, అది అస్థిత్వంలో లేకుండా పోవాల్సిన పరిస్థితి వస్తే, దానికి నిర్దోషిత్వం ఆపాదించి -దానిని రక్షించి, కొనసాగేలా చేస్తుంది -కులం. ఆ పని కోసం ఒక్కోసారి కాల్పనిక కథలను అందిస్తుంది, ఒక్కోసారి వాటిని వక్రీకరిస్తుంది. ఎలాగోలాగ ఆ సంస్కృతి అనే నిర్మాణాన్ని భవిష్యత్ కాలానికి సుస్థిరంగా నిలిచేలా చేస్తుంది. సంస్కృతి -ఇక కల్చర్ అన్న మాట పరిధిని దాటిపోయి, ఆధ్యాత్మిక – మతపరమైన ఆవరణను చేరుకుని, ఆధ్యాత్మిక సదుపాయాలని అందించే వాహిక అనే నెపంతో మన జీవితాల్లో కలగలిసిపోతుంది.
మనం కల్చర్ అని యూరోపియన్ పదాన్ని వాడినప్పుడు, దానికి ఒక విలక్షణత ఉంటుంది. కాని దానినే మనం ఇండియన్ సందర్భంలో వాడినప్పుడు, దానికి ఆధ్యాత్మిక-మత సంబంధమైన అధికారాన్ని, అనుమతిని కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. అదే కులాన్ని నియంత్రించే సూత్రంగా మారుతుంది. కాబట్టి, మీరు ఎవరిని కావాలంటే వారిని పెళ్లి చేసుకోండి, కానీ మరెవరైనా వేరే కులం వారిని చేసుకోవాలనుకున్నప్పుడు -వారికి మద్దతునివ్వండి. ఒకే సంస్కృతి అయితే దానిలో సౌలభ్యం ఉంటుందని మీకు అనిపించినంత మాత్రాన, అందరూ అలాగే ఆలోచిస్తారని అనలేం కదా. మరి అలా పెళ్లిళ్లు జరగాలంటే, దళిత పిల్లల హత్యలు జరగకూడదు.
టి.ఎం కృష్ణ: చాలా నిజం మీరన్నది! ఇండియాలో కులమే సంస్కృతి అన్న మీ పాయింట్, చాలా శక్తివంతమైన వాక్యం. ప్రతీ ఒక్కరూ ఆ వాక్యాన్ని గురించి సీరియస్‌గా ఆలోచించాల్సి ఉంది. తర్వాతి ప్రశ్న, నిజానికి ఒకే తరహాలో ఉన్న కొన్ని ప్రశ్నలు ఇవి …“(ఎవరు ఏ మాట మాట్లాడినా) ప్రతీ ఒక్క విషయాన్ని మీరు కులంతో ముడిపెడతారేం?”
సూరజ్: (పెద్దగా నవ్వుతూ) రామబాణం లాగా అన్నమాట. ప్రగతివాదులకీ, తిరోగమన వాదులకీ ఈ విషయంలో ఏకాభిప్రాయం ఉంటుంది లెండి: ‘అన్ని నొప్పులకీ ఒకటే మందు ఝండూబామ్ అన్నట్టు – అన్ని సమస్యలనీ క్రియేటివ్‌గా మీరు కులానికి లింక్ చేసేస్తారు’ -అంటారు. వారు మిస్ అవుతున్న పాయింట్ ఏమిటంటే, కులం ఒక్కటే కాదు, మిగిలిన రకాల అణచివేతల గురించి కూడా విమర్శ పెడుతూనే ఉంటాం, విశ్లేషిస్తూనే ఉంటాం. కానీ కులం మాత్రం ఎక్కువగా వినపడుతుంది. కారణం ఏమిటంటే, కులం అందించే ప్రివిలేజ్‌లని మరింత బాహాటంగా వాడుకుంటారు. ఉదాహరణకి -మననే తీసుకుందాం -పరలింగ సంపర్క (హెటెరోసెక్సువల్), పితృస్వామిక సమాజంలో -లైంగిక వివక్షకు గురయ్యే మైనారిటీ కమ్యూనిటీలు, ట్రాన్య్‌జెండర్ వ్యక్తులతో పోలిస్తే -నువ్వూ, నేనూ మగవారిమి అవడం కారణంగా ఒక రకమైన ‘ప్రివిలేజ్’ని కలిగి ఉన్నాం, అయినా ఆ విషయం అంత స్పష్టంగా కనిపించదు, కానీ కులాధిక్యత మనసుల్లో మెదిలే సందర్భాలు అనేకం. దానిని మనం నిస్సంకోచంగా ప్రదర్శిస్తాం.
అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే -కులం మన ఎంపికలని నియంత్రిస్తుంది, విలక్షణతల ఆధారంగా, సమాజంలో వివక్షకి- మద్దతునిచ్చి, కొనసాగించేలా చేస్తుంది, అంతే కాదు, అపరిమితమైన నియంత్రణా శక్తిని అందిస్తుంది. నువ్వు ఒక కులానికి చెందినవాడివి అంటే, కులానికి యజమానివి -అంటే కులాల నిచ్చెనలో నీకంటే దిగువనున్న కులాలకి యజమానివి.
వర్గం ఏయే రకాలుగా పనిచేస్తుంది అనే చర్చలో - మనం వర్గం, ప్రగతివాద రాజకీయాలు, దేశభావన – ఇలా ఎన్నో అంశాలని కలిపి మాట్లాడుకోవలసి ఉంటుంది. అంబేద్కర్, ఫూలే, పెరియార్‌లని చదివితే -కులం ఒంటరిగా పని చేయదు, దానితో పాటుగా అనేక వ్యవస్థలు దానికి సహకరిస్తూ వస్తాయనే సంగతి స్పష్టంగా రాశారు వాళ్లు. ఈ విషయం గురించి మనం ఒక సానుకూల అవగాహనని పెంపొందించుకోవాల్సి ఉంది. కులం గురించే మాట్లాడి, మరే ఇతర విషయాల గురించి మాట్లాడకపోవడం వల్ల ఒక విధమైన వాక్యూం (సంభాషణ అక్కడ తెగిపోయి, ఒకరి మాటలు మరొకరికి చేరని పరిస్థితి -అను.) ఏర్పడుతుంది. ఎవరూ పనిగట్టుకని కులాన్ని అన్ని సమస్యలతో ముడిపెట్టడానికి ప్రయత్నించడం లేదు. అయితే, ఇక్కడ -సమాజాన్ని యధాస్థితిలో ఉంచే సంస్కృతి రోజూ ఉత్పత్తి అవుతోంది. దానిని సవాలు చేయడానికి, మూలాలలోకి వెళ్లాల్సి ఉంది.
ఒకప్పుడు -మన చిన్నతనంలో అనేవారు గుర్తుందా – జనాభా పెరుగుదలే అన్ని సమస్యలకీ మూలకారణం అని. కులం కాదా అన్ని సమస్యలకీ మూలకారణం? చైనా జనాభా కూడా ఎక్కువే కదా? మరి అది ఈనాడు ఉన్న చోటికి ఇండియా ఎందుకు చేరుకోలేదు? అది కొన్ని (ప్రివిలేజ్) ప్రత్యేక సౌకర్యాలని రద్దు చేసింది. దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా, మిగిలిన దేశాలు -అధిక జనాభా ఉండి కూడా అభివృద్ది చెందిన దేశాలు -ఏం చేస్తున్నాయనేది మనం పరిశీలించాలి.
టి.ఎం కృష్ణ: కరెక్ట్! ఇదిగో, కులం గురించిన చివరి ప్రశ్న -ఉద్యమాలకు సంబంధించి మాట్లాడుతున్నారనుకుంటాను. దళిత ఉద్యమం అనేది కూడా గత దశాబ్ధకాలంలో చాలా మార్పులు చెందింది. ఈ ప్రశ్న -కొన్ని ఉన్నతవర్గాల నుండి వస్తోంది. “నేను కుల సంభాషణలో పాల్గొనాలంటే (కుల సమస్యల గురించి పట్టించుకోవాలంటే), నువ్వు అంత కరకు గొంతుతో మాట్లాడడం మానెయ్యాలి.”
సూరజ్: సరే, ఇటీవలే నాకు జరిగిన అనుభవం ఒకటి ఇది కృష్ణా, నేనేం చేస్తున్నానో, ఏమి రాస్తున్నానో దాని గురించి నిశిత పరిశీలన జరుగుతూ ఉంటుంది. నేనొక దాని గురించి కామెంట్ రాసాను. కొన్ని సమూహాల పట్ల నేను మొరటుదనం చూపించినట్లు దానిని తీసుకున్నారు. “నువ్వు ఈమాట వాడి ఉండాల్సింది, ఆమాట వాడకుండా ఉండాల్సింది” అని చెప్పడం మొదలుపెట్టారు. నాకనిపించింది -సభ్యతా సూత్రం ఎప్పుడూ అణచివేతకి గురి అవుతున్న వాడికే ఎందుకు వర్తిస్తుందని అని?
టి.ఎం కృష్ణ: చాలా మంచి ప్రశ్న!
సూరజ్: నేననేది ఏమిటంటే, మనం జీవిస్తున్న సమాజం ఇంకా నాగరిక సమాజంగా మారలేదు, మనం పౌరబాధ్యతల గురించి నేర్చుకుంటున్నాం, అంతే. స్థానిక ప్రభుత్వాలంటే ఏమిటి, మన విధులేమిటి వగైరా వగైరా. అంతే తప్ప సభ్యత అనే భావనని మనం ఇంకించుకోలేదు.
ఈ సందర్భంలో, ఐఐటీలో పనిచేస్తున్న ఒక గొప్ప ప్రొఫెసర్, డా. సూర్యకాంత్ వాగ్‌మోరె రాసిన విషయాలని ప్రస్తావించాలి. ఆయన, సభ్యత గురించి -కులం సందర్భంలో వివరిస్తాడు. హిందూ ద్వంద్వాలను ఆయన ఎత్తిచూపుతూ, ‘హిందూ ఆధునికత’ అనే పదబంధాన్ని కాయిన్ చేశాడు. కులంగానీ, ఇంకా మిగిలిన ప్రివిలేజ్‌లు గానీ ఒక పక్క సమాజంలో ఉంటూ ఉండగా, ఆధునికత అనే భావనకి కూడా చోటు ఉండడం. (అనాగరికమైన ఆ విభజనలను ఆమోదిస్తూనే, ఆధునిక మానవులం అని కూడా కొందరు అనుకోవడం ఇందులో విషాదం)
ప్రస్తుత విషయానికొస్తే, మనం మహా హింసాత్మకమైన, గర్హనీయమైన, అసహనతతో నిండిన సమాజంలో బ్రతుకుతున్నాం. సంభాషణ ఎలాటి వాతావరణంలో జరుగుతోందో చెప్పడానికి, ఒక ఉదాహరణ ఇస్తాను -నువ్వు ఒక మాట అంటావు, అవతలి నుంచి ఒక మాట వస్తుంది. నువ్వు దానికి జవాబు ఇస్తావు, ఇక అవతలి వ్యక్తి నుండి వచ్చే రెండవ జవాబు –దెబ్బ, దహనకాండ లేదంటే మారణహోమం. అటువైపు ఉన్నవాళ్లు నీ మాటలోని కరుకుదనం ఎంత మోతాదులో ఉంది అనే లెక్క పెట్టరు, ఎందుకంటే -ఇది ‘సంస్కృతి కలవారి జాగా’కి సంబంధించిన రాజకీయం కదా!
‘ఏయ్ ఆ రకమైన భాష మాట్లాడకు’ అని నన్ను అదిలించారు. కొన్ని రకాలైన రాజకీయ విశ్వాసాలకు సంబంధించిన పనిని ముందుకు తీసుకుపోవాలంటే -ఏ రకమైన గొంతుకని వాడాలో నాకు పాఠం చెప్పారు. సరే, ఈ అల్పప్రాణికి పూర్తిగా ఆకళింపు అయ్యింది. నా వరకూ అయితే పరవాలేదు. ఎందుకంటే, నాకు ఒక హోదా ఉంది. కానీ ఏదో పని చేసుకుంటే కానీ బ్రతకలేని వారికి ఈ నియమాలని వర్తింపచేయడం అన్యాయం. మర్యాదగా, నాజూకుగా మాట్లాడే సావకాశం నాకు ఉంది. కానీ కళ్ల ముందే వారి అక్కచెల్లెలి పైనో, తల్లిపైనో అత్యాచారం జరగడాన్ని చూసిన వ్యక్తిని చప్పుడు చెయ్యకుండా, మర్యాదగా ఉండమంటే, ఉండగలడా? ఈ కోపాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం లేదు -ఇది అనేక తరాల పాటు ఉడుకుతూ వస్తోంది. వారసత్వంగా సంక్రమిస్తోంది. ఇప్పుడు అగ్ని పర్వతం బద్దలై, లోపలి నుండి లావా ప్రవహిస్తోంటే, దాని సెగ నీకు తగిలింది. ఇప్పుడే దానిని గుర్తించావు. ఆ విషయం ఈ ప్రశ్న వేసిన వారందరూ అర్థం చేసుకుంటే మంచిది.
టోన్ మీద నిఘా, పెట్టాలనుకుంటే -పెట్టండి. కాని దానిని బాధితుల మీదనే కాకుండా -పీడకుడికి కూడా వర్తింపచేసినప్పుడు -బహుశా అప్పుడు సమాన స్థాయిలో సంభాషణ చేయగలం.
టి.ఎం కృష్ణ: పూర్తిగా అంగీకరిస్తున్నాను! ఈ ప్రశ్నలకి సమాధానాలిచ్చినందుకు అనేకానేక ధన్యవాదాలు సూరజ్. ప్రశ్నలూ, జవాబులూ ఒకే చోట లభిస్తున్నాయి కాబట్టి -ప్రజలు, కనీసం మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలు అనాలోచితంగా వెయ్యకుండా -వాటి గురించి ఆలోచిస్తారనీ ఆశపడుతున్నాను. మీ సమయం వెచ్చించి, ఇంత స్పష్టతని అందించారు, థేంక్యూ సూరజ్!
సూరజ్: థేంక్యూ బ్రదర్.

No comments:

Post a Comment