పోర్న్ అనే మాటని వినకుండా, అదేమిటో తెలియకుండా చాలా ఏళ్లే గడిపేసి ఉంటారు మనలో చాలా మంది. మనకున్న సమస్యల్లో అదేమంత ముఖ్యమైనది కాదని కొందరంటారు. కానీ ఇంటర్నెట్ రాకతో సామాజికంగా వస్తున్న పెనుమార్పుల్లో ఒకటి ఈపోర్నోగ్రఫీ అనేది. దాని ప్రభావాన్ని అంచనా కట్టేందుకు – పోర్న్ మంచిచెడ్డల్ని చర్చించుకోవడం అవసరం.
పొర్న్ అంటే న్యూడిటీ (నగ్నత్వం) అని పొరబడతారు చాలామంది. నగ్న దృశ్యాలుండే మాట నిజమే కానీ
పోర్న్ అంటే దృశ్యాలు మాత్రమే కాదు. దానిలోని దృశ్యాలూ, సందర్భాలూ, సంభాషణలూ – ఇవన్నీ ఒకే ఒక లక్ష్యం కోసం ఉంటాయి, అది - వాడకందారులో – సెక్సువల్ ఎక్సైట్‌మెంట్‌ని (ఉత్తేజాన్ని) కలగజేయడం. దాని వాడకందారుల్లో కొంత భాగం దాని తప్పొప్పుల గురించి ఆలోచిస్తారనుకోను, దొరికితే చూసేదీ, అందుబాటులో లేదంటే మానుకునేది. వారికి ఈచర్చోపచర్చలతో సంబంధంలేదు.
పోర్న్‌కి సంబంధించి అనేక కోణాలున్నాయి. దానిని వ్యతిరేకించే వారందరి వాదనలనూ క్రోడీకరిస్తే రెండు ప్రధాన విషయాలు కనిపిస్తాయి. పోర్న్ తయారీలో పాల్గొనేవారి (స్త్రీపురుషులే కాదు - పిల్లలూ, జంతువులూ కూడా దానిలో భాగమే) మీద జరిగే పీడనా, తయారయి సమాజంలోకి విడుదలయ్యాక ప్రజల మీద అది చూపే ప్రభావం – ఈ రెండు విషయాల పట్లా ఆందోళన వ్యక్తమౌతూ ఉంటుంది.
పోర్న్ వ్యతిరేకుల్ని వ్యతిరేకించే వారున్నారు. వారి ఉద్దేశం ప్రకారం –
పోర్న్ అనేది ఒక పర్సనల్ ఛాయిస్. మనిషికుండే అనేకావసరాల్లో – ఒక ముఖ్యమైన అవసరాన్ని తీర్చుకునే ఒకానొక మార్గం. అయితే పోర్న్ తయారీలో జరిగే మానవహక్కుల ఉల్లంఘనని వీరూ సమర్ధించరు. ఎవరినీ బలవంతం చెయ్యకూడదనీ, తమ స్వంత ఇష్టంతో దానిలో పాల్గొనేవారి శ్రమకి తగిన పారితోషికం దొరకాలనీ వీరు ఆశిస్తారు. వారి హక్కుల రక్షణ కల్పించే విధంగా గట్టి చట్టాలు తేవాలి గానీ, పోర్న్ తయారీని నిషేధించాలనటం సరికాదని వీరంటారు. కన్నో కాలో వంగి – సెక్స్‌లో పాల్గోలేని వారూ, వృద్ధులూ, మరేదన్నా కారణంగా పోర్న్ తో తృప్తి చెందేవారు చాలా మంది ఉండొచ్చు. ఏ సమాజంలో అయితే స్త్రీపురుషుల మధ్య దూరాలుంటాయో, సెక్స్ స్వేచ్ఛ అతి పరిమితంగా ఉంటుందో – అలాటి చోట పోర్న్ వాడకం అనివార్యమౌతుందని, వారి సమస్యలకి అదొక పరిష్కారమనీ వీరి నమ్మకం. మరో మనిషికి తెలిసి ఏ అపకారం చెయ్యకుండా, తమ పడకగదిలోని ఏకాంతంలో – తమకు తోచిన రీతిలో ఆనందం పొందే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉండాలని వీరి అభిప్రాయం.
అయితే దేనిని వీరు పరిష్కారమంటున్నారో – అది మరిన్ని సమస్యలకి కారణమౌతుందనీ- పోర్న్ కారణంగా సెక్స్ నేరాలు పెరుగుతున్నాయన్న విమర్శ ప్రబలంగా వినిపిస్తోంది.
“ఇదిగో, సమాజంలో అన్ని రకాలవారూ ఉంటారు, నేరమనస్తత్వం ఉన్నవారు పోర్న్
చూడకపోయినా ఆనేరాలకు పాల్పడతారు,
అలాటివారికీ, బలహీనమనస్కులకూ మేం పూచీపడలేం. మేం పోర్న్ చూసినా, ఎవరినీ ఇబ్బంది
పెట్టలేదు, అవమానించలేదు, కనీసం చెడుదృష్టితో కూడా చూడలేదు, మా ప్రవర్తనకి మేం
పూర్తి బాధ్యత వహిస్తాం, మీకిష్టం లేకపోతే మీరు చూడడం మానుకోండి, అంతేగాని అది
తప్పని అంటే మాత్రం మేం ససేమిరా ఒప్పుకోం!” అని కరాఖండీగా
చెప్పే నిజాయితీపరులున్నారు. పోర్న్ వాడకంలో పాశ్చాత్యదేశాలు మన కంటే ముందున్నాయి,
అక్కడ దానికి సంబంధించిన చర్చలూ, చట్టాలూ అనేకం వచ్చాయి వాటిని గురించి
తెలుసుకోమనీ, కాస్త అప్ గ్రేడ్ అవమనీ వారు సలహా ఇస్తారు. నిజమే, అది మంచి సలహాయే.
మన కంటే ముందు నడుస్తున్నవారి అనుభవం నుంచి నేర్చుకోడం సరైనపనే కదా. ఆపనే
చేద్దామని నిర్ణయించుకున్నాను.
నార్మన్ డాయిడ్జ్ అనే కెనడియన్ మానసిక శాస్త్రవేత్త,
‘The Brain that Changes Itself' (2007),
అనే పుస్తకంలో బ్రెయిన్ సైన్స్ కి సంబంధించిన సరికొత్త విషయాలను వివరిస్తూ, మెదడును ఒక సజీవ అవయవంగా చూపిస్తాడు. Acquired Tastes and Loves (అందిపుచ్చుకున్న అభిరుచులు, ప్రేమలు) అనే పేరున్న ఒక అధ్యాయంలో పోర్నోగ్రఫీ గురించి అతను రాసిన విషయాలు – ఈనాటి పరిణామాలను అర్ధం చేసుకోడానికి ఉపయోగపడతాయి.
సెక్స్
అనేది శరీరానికి సంబంధించినదే అయినా మెదడు పాత్ర దానిలో తిరుగులేనిదనే విషయం
దాదాపు అందరికీ తెలిసినదే. ఆ సంగతిని గుర్తుచేసుకుంటూ, పోర్న్ అనేదానిని కొన్ని
దృశ్యాల సంపుటిగా కాక ఒక శక్తివంతమైన భావజాల ప్రసారంగా అర్ధం చేసుకోవాల్సి
ఉంటుంది. సెక్స్ దృశ్యాలను చూసినప్పుడు వ్యక్తుల్లో అసంకల్పితంగా ప్రతి స్పందన
ఉంటుంది కనక అది instincts
(సహజాతాలు)కి సంబంధించిన విషయం అనుకుంటారు.
కానీ నార్మన్ అది నిజం కాదంటాడు. అలా అయితే మిలియన్ల సంవత్సరాల క్రితం మన
పూర్వీకుల అభిరుచులే మనవీ అవ్వాలి కదా అని ప్రశ్నిస్తాడు. సెక్స్ అభిరుచిపై
సంస్కృతి, అనుభవం – వీటి ప్రభావం ఉంటుందనీ, అవి మెదడు మీద ముద్రవేస్తాయని
చెప్తాడు. సెక్స్ తో పూర్తి పరిచయం కాని, ఇంకా అభిరుచులు పూర్తిగా తయారుకాని యువత
మెదడుపై పోర్నోగ్రఫీ ప్రభావం ఏ రూపం తీసుకుంటుందో అంచనా కట్టడం కూడా కష్టమే.
మనకు
ఆనందం రెండు రకాలుగా కలుగుతుందంటాడు నార్మన్.
ఒకటి ఉద్రేకపరిచేది, ఒకటి
సంతృప్తిపరిచేది. మొదటది - ఒక మంచి
భోజనాన్నో, సెక్స్‌నో ఊహించుకుంటూ – ‘కోరిక పుట్టించే ఆనందాన్ని’ కలిగించేది.
ఆరకమైన ఆనందానికి కారణం ఆసమయంలో మెదడులో స్రవించే
‘డోపమైన్’ అని చెప్తాడు. రెండవది ఊహలు కార్యరూపం తీసుకుని, పూర్తయ్యాక, పొందిన ‘అనుభవం నుంచి వచ్చే ఆనందం'. దానికీ మెదడులో స్రవించే ‘ఎండార్ఫిన్’కీ సంబంధముందని చెప్తాడు. అనేక రకాలైన
సెక్సువల్ వస్తువుల్ని అందించే పోర్న్ వల్ల కలిగే ఆనందం సంతృప్తి కంటే, ఉద్రేకం
కలిగించే భాగాలని మరింత ప్రేరేపిస్తూ ఉంటుందంటాడు. డ్రగ్, ఆల్కహాల్ లలాగే పోర్న్
కూడా అడిక్షన్ (వ్యసనం) కాగలదని చెప్తూ, వాటి పోలికని ఇలా వివరిస్తాడు. ఆ పదార్ధాల
లాగే పోర్న్ కూడా - పని విజయవంతంగా జరిగినప్పుడు
సహజంగా స్రవించాల్సిన డోపమైన్ వ్యవస్థని హైజాక్ చేసి – పనితో సంబంధం
లేకుండానే ఆనందం కలిగించే ప్రయత్నం చేస్తుందని చెప్తాడు.
2001 లో MSNBC.com వారి సర్వేలో 80% ప్రజలు తమ ఉద్యోగాలనీ, కుటుంబాలనీ నిర్లక్ష్యం చేస్తూ పోర్న్ చూడడంలో గడుపుతున్నామని చెప్పారట. 2007లో అతను ఈ పుస్తకం రాసేనాటికి ఉన్న లెక్కల ప్రకారం కేవలం పోర్న్ కారణంగా వీడియోలని అద్దెకు తీసుకునే రేటు 25% పెరిగిందట. సైకియాట్రిస్ట్‌గా అతని అనుభవంలోకి వచ్చిన కేసుల ఆధారంగా నార్మన్ కొన్ని అంశాలని ప్రతిపాదించి, వివరణలిచ్చాడు. సెక్సువల్ టెన్షన్ నుంచి విడుదల చేస్తుందని, ఆరోగ్యకరమైన ఆనందం కలుగుతుందనీ నమ్మి పోర్న్ వాడేవారికి ముందుముందుకి ఆనందం తగ్గిపోడం తాను గమనించానని, పోర్న్‌ని నచ్చుకోలేక పోతూ కూడా అది కావాలని ఆరాటపడే విచిత్ర పరిణామాన్ని సైతం చూసానని నార్మన్ రాస్తాడు. దానికి కారణాలను మనకి అర్ధమయే భాషలో వివరించే ప్రయత్నం చేస్తాడు.
అడిక్షన్
అంటే సాధారణంగా అందరికీ తెలిసిన పదమేకానీ, మానసిక శాస్త్ర పరిభాషలో దానిని
అర్ధంచేసుకోడం అవసరం.
- తాము చేసే పని మీద నియంత్రణ కోల్పోడం,
- దుష్ఫలితాలు కలుగుతున్నాయని తెలిసీ, పనిని ఆపలేకపోడం,
- సంతృప్తి చెందేందుకు మరింత ఎక్కువ మోతాదు కావలసిరావడం(టాలరెన్స్ పెరుగుదల),
- పని పూర్తికాకపోతే విపరీతమైన బాధ (విత్ డ్రాయల్) అనుభవించడం – ఇవన్నీ అడిక్షన్ లక్షణాలు.
వ్యసనం వల్ల
మెదడు దానికి సంబంధించిన అంశాలకి సెన్సిటైజ్ అయిఉంటుంది, ఏ చిన్న అవకాశం దొరికినా
అది అవధులు దాటేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.
అప్పుడు అడిక్ట్‌లో craving (ఆపుకోలేనంత తీవ్రవాంఛ) కలుగుతూ ఉంటుంది.
పోర్న్ వాడకం పెరిగాక, వ్యక్తులు పడకగదిలో తమ భాగస్వాములతో ఇంద్రియాల అనుభవానికి బదులుగా, తమ మెదడుల్లోకి దిగుమతి అయిన పోర్న్ రచనలలోని సినేరియో(సందర్భాలు)లలో తమను తాము పాత్రలుగా భావించి, fantasize చేసుకోడం (ఊహించుకుంటూ ఉండడం) – ఒక వాస్తవం. ఒక పక్క మనుషుల మనసుల్లో భావుకత్వం తగ్గిపోతూ ఉండడం, మరో పక్క ఆ రచనలు నానాటికీ మరింత అనాగరికంగా, హింసాత్మకంగా మారుతూపోడం గమనించాల్సిన విషయాలు.
తమ భాగస్వాములు వస్తుతహ ఆకర్షణీయంగానే తోచినా, వారి పట్ల ఉత్తేజం కలగకపోడం - ఈ అడిక్షన్కి మరొక పార్శ్వం. ఒకప్పుడు ఉత్తేజపరిచిన పోర్న్ దృశ్యాలు సైతం తరవాతి కాలంలో ఆనందాన్నివ్వకపోడం; ఆ నిరుత్సాహం – తమ సంబంధాలలోకి పాకడం; దానిని పోగొట్టుకోడానికి – వారికి అయిష్టమైన పనులను చెయ్యమని తమ భాగస్వాములను బలవంతపెట్టడం – ఇవన్నీ పాశ్చాత్యసమాజాల ప్రజలు స్వయంగా అనుభవిస్తున్నవే.
మరొక ముఖ్యపరిణామం - తమ సామర్ధ్యం గురించి అనుమానాలు కలగడం. పోర్న్ చూసే యువకులు అమితంగా ఆందోళన చెందే అంశం - నపుంసకత్వం. పేరుకి erectile dysfunction (అంగ స్థంభనంలో సమస్య) అంటారు గాని, నిజానికి సమస్య వారి అంగాలలో కాదు, మెదడుల్లో ఉందంటాడు నార్మన్. పోర్న్ వాడినప్పుడు అంగం బాగానే పనిచేస్తూ ఉంటుంది, వారు వాడుతున్న పోర్న్‌కీ, నపుంసకత్వానికీ ఏదన్నా సంబంధం ఉందేమో అన్న సంగతి చాలా తక్కువ మందికి తడుతుంది మరి.
వాడకందారుల్లో టాలరెన్స్ పెరుగుతున్న కొద్దీ, పోర్నోగ్రాఫర్లు కొత్త కొత్త థీము (కథనాలు) లను ప్రవేశపెడతారు. బలవంతపు సెక్స్, ఆడవారి ముఖాలపై స్ఖలనాలూ, ద్వేషంతోటీ, అవమానంతోటీ కలిపిన సెక్స్ – ఇటువంటి వన్నీ పోర్న్ పత్రికల వారు తయారుచేసే కొత్త రుచుల్లో భాగం. ఆపత్రికల వెనక పేజీలు చూసినట్టైతే వయాగ్రా వంటి మందులూ, వృద్ధుల అంగస్థంభన కోసం తయారవుతున్న మందులంటూ – ప్రకటనలు కోకొల్లలుగా కనిపిస్తాయట.
స్వేచ్ఛా
పూరిత సెక్స్ ని ప్రోత్సహించడం, ఫోబియా (అకారణ భయం)లనీ, టాబూ (చెయ్యకూడని పని)లనీ
వ్యతిరేకించడం తమ లక్ష్యమని చెప్తారట పోర్న్ తయారీదార్లు. కానీ, అనేక పోర్న్ చిత్రాలలో స్త్రీలని సెక్స్కి ఎప్పుడూ
సిద్ధంగా ఉండేవారిగా చిత్రించడం, ఆ కారణంగా వారికి విలువలేనట్టు సూచించడం
సర్వసాధారణమని చెబుతాడు. ఒక పుస్తకంలో మగ
స్నేహితులతో గడపడానికొచ్చే ఆడవారిని "cum dumpsters" (వీర్యాన్ని పారబోసేందుకున్న
బుట్టలు) అని సంబోధించిన విషయం ఎత్తి చూపిస్తాడు.
ముందే చెప్పినట్లు – రెండో కంటివాడికి తెలిసే పనే లేదు, ఇక చర్చలతో మాకేం పని అనుకునే వారి కోసం కాదు, పోర్న్ పూర్వాపరాల గురించి తెలుసుకుని, తరవాత నిర్ణయానికి రావాలనుకునే వారి కోసం ఈ వ్యాసం. ఎందుకంటే నార్మన్ కూడా తన పుస్తకంలో - పోర్న్ వ్యసనానికి చికిత్స కోసం వచ్చిన పేషెంట్లు, తమ మెదడులో ఏర్పడుతున్న మార్పుల గురించి తెలుసుకోగానే బిత్తరపోయారనీ, కొద్దికొద్దిగా దాని నుండి తేరుకున్నారనీ - రాస్తాడు. వారు పూర్తిగా కోలుకున్నాక తమ భాగస్వాముల పట్ల మళ్లీ ఆకర్షణ కూడా తిరిగివచ్చిందని చెప్తాడు.
ఉప్పెనలా
ముంచెత్తుతున్న ఇంటర్నెట్లో – పోర్న్ అనే అంశం – మనం కావాలనుకున్నా వద్దనుకున్నా –
పిల్లా పెద్దా తేడా లేకుండా అందరి చేతికీ అందుబాటులో ఉండబోతోంది. కనక ఏ రకమైన
అవగాహనా లేకుండా ఒంటరిగా దానికి మన మెదడును అప్పగించాలో, లేక నలుగురితోనూ చర్చలకు
దిగి – దాని బాగోగులను ఎప్పటికప్పుడు అంచనా కట్టుకోవాలో – మరి నిర్ణయించుకోండి.
Once a saint said: "Do not be alone if you cannot control your mind"...there by we can avoid the dangers (in the offing) of being alone. Nicely analysed.
ReplyDeletetrue ...
ReplyDelete