Thursday, 23 August 2018

మైనారిటీ హక్కులా ... అవెందుకు?


మైనారిటీ హక్కులా ... అవెందుకు?
అనగనగా ... ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం – దుస్తుల తయారీకి పేరుమోసింది. వాటి ఎగుమతి వల్ల రాజ్యానికి చాలా ఆదాయం వచ్చేది. దర్జీ పని ఆపౌరులకి ప్రధాన వృత్తి. ఇలా ఉండగా దేశంలో తిరుగుబాటు జరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఒక పద్ధతి ప్రకారం పరిపాలన జరగాలని, కొన్ని నియమాలూ, సూత్రాలు రాసుకున్నారు. పౌరులందరికీ సమాన హక్కులూ, సమానావకాశాలూ ఉండాలనుకుని, వివరాలు సేకరించారు. రాజ్యంలో కుట్టుమిషన్‌లన్నీ కుడి చేతి వాటం. అయితే జనాభాలో కనీసం పది శాతం వరకూ ఎడమ చేతి వాటం ఉన్న వారని లెక్కల్లో తెలిసింది. వారికి కూడా జీవనోపాధికి సరైన అవకాశం దొరకాలంటే - కొన్ని ఏర్పాట్లు అవసరం అనుకున్నారు. ఎ.చే.వా. వారికోసం ఎడమ చేతి వాటపు మిషన్లుండాలి. వారికి ప్రత్యేకించి శిక్షణా స్థలాలుండాలి. ఎ.చే.వా. కుట్టుమిషన్ల - తయారీ కోసం, శిక్షణ కోసం, అమ్మకం కోసం ప్రచారం చేసుకునే హక్కు కల్పించింది. ఇవేవీ - కు.చే.వా. మీద నిర్లక్ష్యంతో కాదు, సంఖ్యాబలం వల్ల వారికి దొరికే సౌకర్యాలని, సంఖ్యలో తక్కువైన ఎ.చే.వా. వారికి కూడా కల్పించేందుకే. ఆహక్కుల నుపయోగించుకుని, ఎ.చే.వా. వారి తలసరి ఆదాయం పెరిగితే - కు.చే.వా. వారి ఆదాయం తగ్గకపోగా - మొత్తం దేశాదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. 
మైనారిటీ హక్కులెందుకనే ప్రశ్నకి జవాబు ఇంత సరళమా? చూద్దాం. 
మన రాజ్యాంగం మైనారిటీ సమూహాల కోసం ఏం హక్కులిచ్చింది? మూడు, (a) విద్యా సంస్థల్ని నడుపుకోడానికి (Article 30); (b) వారి భాష, లిపి, సంస్కృతిని రక్షించుకోడానికి (Article 29); (c) మత సంబంధమైన కార్యకలాపాలని నడుపుకోడానికి (Article 26). మెజారిటీ/మైనారిటీ సంస్కృతులని మన కథలోని కుడి/ఎడమ వాటాలతో పోల్చి చూసుకుంటే – కథలో అందరికీ లాభం కలుగుతోంది కదా, నిజ జీవితంలో ఆహక్కుల పట్ల కొంత వ్యతిరేకత ఎందుకు వ్యక్తమౌతోంది? అసలు - ఆ పోలిక సరైనదేనా అనే ప్రశ్న వస్తుంది. ఇంకా లోతుగా వెళ్తే, విద్య, భాష, సంస్కృతి వరకూ సరే గానీ ‘మతం’ – ‘జీవనోపాధి’ వంటి నిత్యావసరమా అనే ప్రశ్న ఉండనే ఉంది.

నిజమే, ఆదాయం లాగా మతవిశ్వాసాలన్నవి కొలవగలిగే వస్తువు కాదు మరి, ఆ లాభనష్టాలని బేరీజు ఏమని వెయ్యగలం? మతాన్ని నమ్మని వారికి మతస్వేచ్ఛ వీసమెత్తు విలువ కూడా చెయ్యకపోవచ్చు. కానీ ఒక దిలీప్ – అల్లా రఖా రెహమాన్‌గా మారి, నా సంగీతానికి ప్రేరణ – ఇస్లామే అంటే కాదని ఎవరైనా ఎందుకనాలి? ‘కాచర్ ఇన్ ద రై’ అనే పుస్తకంతో సంచలనం రేపి, స్టేటస్ కోని ప్రశ్నించడం ప్రధాన తత్వంగా రచనలు సాగించిన 20వ శతాబ్ది అమెరికన్ రచయిత – జెడి సాలింజర్ – తాను అద్వైత వేదాంతానికి అనుయాయినంటే – ఎవరైనా ఏమంటారు? ఎవరి నమ్మకాలు వారి ఇష్టం అని తప్ప.
సరే, వ్యక్తిగతమైన మత స్వేచ్ఛ వరకూ అర్ధముంది, సామూహికపరమైన వెసులుబాట్లు ఎందుకు? మత ప్రచారాలు సమాజానికి అవసరమా అనిపిస్తుంది. కానీ ఆప్రశ్న ఇప్పటిది కాదు. మతానికి మనమిచ్చే విలువ ఏమిటన్నది రాజ్యాంగం రాసుకున్నప్పుడే నిశ్చయమైపోయింది. ‘సెక్యులర్’ అనే పదానికి – ‘పాశ్చాత్య సమాజాలలోలాగా, రాజ్యాన్ని మతం నుంచి వేరుచేసి చూడడం’ – అన్న భావన కాక – ‘అన్ని మతాలనీ సమానంగా గౌరవించడం’ అనే అర్ధం చెప్పుకున్నాం. మతానికి దూరంగా ఉండడం – అనేది కాక – ‘అన్ని మతాలకూ సమానావకాశాలు ఇవ్వడం’ అనేదే – మన విధానం అయ్యింది. ఆదిశలో కొంత దూరం వచ్చాక - ఇప్పుడు కేవలం మైనారిటీ మతాలని మాత్రమే ఆప్రశ్న వెయ్యడం తర్కబద్ధం కాదు. 
మనమే కాదు, ప్రజాస్వామ్య భావాలు పచ్చి పచ్చిగా ఉన్న కాలం గనక పాకిస్థాన్ రూపశిల్పి జిన్నా కూడా – వారి రాజ్యాంగ నిర్మాణ సభని ఉద్దేశించి ఇలా మాట్లాడేడు. “… మీరంతా స్వేచ్ఛగా గుళ్లకైనా, మసీదులకైనా మరే ఆరాధనా స్థలాలకైనా వెళ్లవచ్చు. మీరే మతానికి చెందినవారన్నదానితో రాజ్యానికి ఏమీ సంబంధం లేదు ... ఇక నుండీ హిందువులు హిందువులు కారు, ముస్లిములు ముస్లిములు కారు, మత పరమైన అర్ధంలో కాదు గాని రాజకీయ అర్ధంలో వారు కేవలం పాకిస్థాన్ రాజ్యపౌరులు మాత్రమే.” (జిన్నా 1947)
‘మాటలు కోటలు దాటి ఏం ప్రయోజనం, చేతల్లో లేక పోయాక’ - అని నిట్టూర్చి లాభంలేదు. అవి రెండూ ఒక దాన్ని మరొకటి ప్రభావితం చేసుకుంటాయి. మాటలకంత ప్రాముఖ్యం లేదనుకుంటే సెక్యులర్ అనే మాట తొలగించాలనే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది ఇప్పుడు? మైనారిటీ హక్కులన్న మాట వింటేనే మధ్యతరగతికి అంత చిరాకు వస్తోంది? విఐపీ క్యూలో వెళ్లేవారి మీద మామూలు క్యూలోని జనానికి కలిగే అసూయ వంటిది – మెజారిటీలో ఎలా నాటుకుంది? కనక మాటల కున్న ప్రాముఖ్యతని గుర్తిస్తే, గుసగుసలాడుకోడం కాక వాటిని బహిరంగంగా చెప్పడం, చర్చించడమే ఆరోగ్యకరం అని తేలుతుంది.
మత విశ్వాసాలూ, ప్రచారాలని పట్టించుకోని న్యూట్రల్ ప్రజలకి కూడా – న్యాయ పాలనలో తరతమ భేదాలున్నాయని, ‘పర్సనల్ లా’ పేరున ఇస్లాం మతస్థులకు ప్రత్యేక విచారణ చేస్తున్నారని విమర్శ ఉంది. బహుభార్యత్వం, విడాకుల విషయాలు వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. షాబానో కేసులో – భరణం విషయమై – సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు – స్త్రీల పక్షాన ఉండిందనీ; కానీ ఇస్లాం వివాహ చట్టం దానిని సమ్మతించదని – ముస్లిం ఫండమెంటలిస్ట్‌లు పట్టుపట్టడం వల్ల, రాజీవ్ గాంధీ ప్రభుత్వం తోసిపుచ్చిందన్న విషయం - వారందరూ గుర్తు చేసుకుంటారు. ఈ సమస్యకి పరిష్కారం యుసిసి, యూనిఫార్మ్ సివిల్ కోడ్ (పౌరులందరికీ ఒకే చట్టం) - అని భావిస్తారు. 
అయితే రాజకీయంగా ఆ డిమాండ్ ఏ పక్షంవారు చేస్తున్నారన్న దాని మీద, వారి ఉద్దేశాల మీద - దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఆ స్త్రీల కన్యాయం జరిగినందుకు కాక, ఆ పురుషులకి ఉన్న అదనపు సౌకర్యం మాకెందుకు లేదని ప్రశ్నించేవారు గానీ ఆ యూసిసి డిమాండ్ వెనక ఉన్నట్టైతే - మేలు జరక్కపోగా కీడు జరిగేను. ఎందుకంటే – స్త్రీలకి అన్యాయం చేసే చట్టాలు కేవలం ఇస్లాం వివాహ చట్టాల్లోనే కాదు, అన్ని పర్సనల్ లాల్లోనూ రకరకాలుగా ఉన్నాయి. ఆ అసమానతల పట్ల స్త్రీవాదులు ఎప్పటి నుండో మాట్లాడుతున్నారు. ఉదాహరణకి – హిందూ వివాహ చట్టం ప్రకారం – భార్యకి దత్తత తెచ్చుకునే స్వేచ్ఛా లేదు, ఇచ్చే స్వతంత్రమూ లేదు. అసలు వైదిక మతాచారపు తతంగం జరపకపోతే వివాహానికి చట్టబద్ధతే లేదు. 
ఈ ఆధునిక భావాలను చర్చించడం, అర్ధం చేసుకోడం దాకా కాదు, కనీసం గుర్తించడానికి కూడా ఒప్పుకోని హిందూ మత ఆధిక్యవాదులు – యూసిసి అమలుజరగాలని కోరుకోడంలో అర్ధమేమిటి? వారి దృష్టిలో హిందూ లా సర్వోన్నతమైంది కనక – దానినే సర్వ మతస్తులూ పాటించాలని వారి కోరిక. తినే తిండి మీద ఆంక్షలు విధించి, జీవనోపాధి మీద దెబ్బకొట్టి, మైనారిటీ వివాహచట్టాలని మార్చాలని మాట్లాడితే – ఆ సమూహాలకి చెందిన స్త్రీలు కూడా – ఆ వాదనని విశ్వసించలేరు. అన్ని లోపాలనూ ఆధిగమించే వివాహచట్టాలు – తయారవాలంటే, బాధితులైన స్త్రీలు పాల్గొంటేనే జరుగుతుంది. వారి నేతృత్వంలో సవరణలు జరగాలి. 
ఒక వాదనని సమర్ధించే ముందు, పూర్వాపరాలు విచారించుకోవాలి. సంక్షేమ సంస్థల్లోకీ – రాజకీయ ఎజెండాలు చొరబడుతోన్న కాలం కనక ఒకటికి రెండు సార్లు వాటి కార్యాచరణని తరచి చూసుకోవాలి. ఉదాహరణకి, చర్చిల్లో కన్ఫెషన్ అనే ఆచారం వల్ల ఆడవారి మీద లైంగికదోపిడీ జరిగే ఆస్కారం పెరుగుతోందనీ, కనక కన్ఫెషన్ను నిషేధించాలనీ – ‘నేషనల్ కమిషన్ ఫర్ విమెన్’ ఈ మధ్య రికమెండ్ చేసింది. దాని మీద స్వామి అగ్నివేశ్ స్పందన గమనిస్తే దృష్టికోణంలో సమగ్రత ఉండాలని మనకి అర్ధమౌతుంది. రాంపాల్, ఆసారాం, రాంరహీం వంటి నేరస్థులను కూడా కమిషన్ అదే విధంగా ఖండించాలని ఆయన కోరడం – వెనక ఉన్న కారణం అదే. అసమానతల పట్ల విమర్శ – ఒక సమూహాన్ని గురి చేసి ఉంటే, అది తాత్కాలిక రాజకీయ లబ్ధిని ఇస్తుందేమో కానీ శాశ్వత పరిష్కారాలని సూచించదు. 
మైనారిటీ హక్కులు – మెజారిటీవారికి నష్టం చెయ్యవని నమ్ముతూ, యూసిసి అనేది మైనారిటీలకి నష్టం కలిగించని రీతిలో, వారి సమ్మతి సహకారాలతో తయారవ్వాలని కోరుకోవాలి.