Tuesday 1 November 2016

నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలు


       https://www.youtube.com/watch?v=T25hOEyCs8U                                                                    
పై వాక్యం చదవగానే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని గతం లోకి తొంగి చూసుకోవాలనిపిస్తోంది కదూ. ఔను మరి... ప్రతీ సాహిత్యాభిమానీ అపురూపంగా తలుచుకుని మురిసిపోయే విషయమే ఇది.

ఇది ఏ వర్గం లోకి వస్తుందో నిర్ణయించడం కొద్దిగా కష్టమే. చెప్పాలంటే - ఒక తరానికి ప్రాతినిధ్యం వహించగలిగేవీ, తరతరాలకూ దారిచూప గలిగేవీ అయిన అనేక గ్రంధాలను గురించిన ప్రస్తావన లుంటాయి. కానీ కేవలం సాహిత్యానికి మాత్రమే సంబంధించిన విషయంగా చూడలేం. ఒక చిత్రమైన అంశం ఇది -  వస్తుగతమూ, ఆత్మగతమూ కూడా! సాహిత్యం సహాయంతో చేసే ఒక సైకో ఎనలిటికల్ ప్రాసెస్ (మానసిక విశ్లేషణా ప్రక్రియ), ఎంచేతనంటే – తమ పై పడిన ప్రభావం ఎటువంటిదో వివరించాలనుకుంటే, ముందుగా తమకు తాము – ఆలోచనలనూ, విశ్వాసాలనూ, దృక్పధాన్నీ సమీక్షించుకోవాలిగా.
            
అలాటి అంతరంగ సందర్శనం చేసుకునే  ప్రయత్నంలో ఒడ్డున నిలబడి నా మానస సరోవరంలో కదిలే చిరు కెరటాల వైపు చూస్తూ గడిపేను. అలా చూస్తూ ఉండగా, నిశ్చల మౌతున్న నీటి పై  ఎవరెవరి ప్రతిబింబాలో రూపుదిద్దుకోవడం కనిపించింది. ఎన్నేళ్ళగానో నిక్షిప్తాలైన ఆ నిధులను తవ్వుకుని చూసుకుని తన్మయ స్థితి లోకి వెళిపోయాను. ఆ అనుభవాన్ని కొంత నలుగురితో పంచుకోవాలని ఈ నా ప్రయత్నం. ఆ క్రమంలో, కల్పనా సాహిత్యాన్నివదిలి కేవలం వ్యాస సాహిత్యానికే పరిమితం కాదల్చుకున్నాను.

చలం బిడ్డల శిక్షణ నేను చదివిన మొట్టమొదటి నాన్ ఫిక్షన్. ఆ తర్వాత దానిని అనేక సందర్భాల్లో మళ్ళీ మళ్ళీ చదివడం జరిగింది. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళనుకున్న వారికి బహుమతిగా ఇచ్చాను. మా పిల్లలకి చదివి వినిపించేను. వారందరికీ, ప్రతీ ఒక్క దశ లోనూ కొత్త చూపు నిస్తూ జీవితోన్ముఖుల్ని చేసింది, ఉత్తేజపరిచింది.
బిడ్డల శిక్షణ చదివేటప్పటికి నా వయసు పదిహేను ఉంటుంది సుమారుగా, చిన్నా కాని పెద్దా కాని వయసు. అది ఏ దశలో చదవితే ఉత్తమం? అది పిల్లలకి ఉద్దేశించిందా, పెద్ద వారికా అని సందేహం ఒకప్పుడు వచ్చేది. కానీ అది ఏకకాలంలో ఇరు పక్షాలకీ మేలు చేసే పుస్తకం అని ఇప్పుడు నమ్మకంగా చెప్పగలను. పిల్లల మనస్తత్వ శాస్త్రవేత్తలూ, పిల్లల పెంపకంలో అపారమైన అనుభవం ఉన్న నిపుణులూ – రాసిన పుస్తకాలు గొప్పగొప్పవి అనేకం ఉన్నా, 1930ల్లో వచ్చిన  ఈ పుస్తకం అతి విశిష్టమైనదని నా అభిప్రాయం. పిల్లలని ఆరోగ్యంగా, ఆనందంగా పెంచేందుకు ప్రాక్టికల్ సూచన లిచ్చినట్టు కనిపించినా, వాటన్నిటి వెనకా జీవితాదర్శాలకు సంబంధించిన కొన్నిమౌలిక భావన లున్నాయని తెలుస్తుంది. ఒకటి రెండు ఉదాహరణలతో వివరించే ప్రయత్నం చేస్తాను.                             
నిజాయితీ:
పిల్లల్లో యే సద్గుణాలు కలుగజేయా లనుకుంటారో ఆ గుణాల్ని పెద్దవారు తాము అలవరుచుకుని అనుష్టించాలి. (ఇది ఈనాడు మనకు అంత కొత్తగా కనపడక పోవచ్చు) కానీ "చిన్నప్పట్నించీ కూడా పిల్లలకి వివాహాన్ని గురించీ, ప్రేమ గురించీ చక్కని ‘నిజమైన’ అభిప్రాయాలనివ్వాలి" అనే సూచన మాత్రం ఈనాటికీ మనలో చాలామందికి సాహసం గానే కనిపిస్తుంది. పెళ్ళికి సిద్ధమైన పిల్లలతో కూడా ప్రేమ గురించీ, పెళ్లి గురించీ సీరియస్ గా మాట్లాడలేని తల్లిదండ్రులున్నారు మనలో. చలం ఆశించే పూర్తి స్థాయి నిజాయితీకి చాలా దూరంలో ఉన్నాం. అయితే ఆచరించిన మేరకే, అద్భుతమైన ఫలితాలనివ్వగల సూచన అది.
నీతి:
లోకం తోవలో పోవడం కాదు, తప్పు కనిపించే చోట ఎదిరించమనీ, అలా ఎదిరించే అలవాటు పిల్లలకు నేర్పాలనీ చలం ఉద్బోధిస్తారు. పది మొదలు పద్దెనిమిదేళ్ళ వరకూ ఉన్న పిల్లలకు, లోకం లో నీతి అనే దానికీ, నిజమైన నీతికీ భేదం చూపాలి అన్నభావగర్భితమైన సూచన ఇస్తారు. నిజమైన నీతిని తాము గుర్తించడం, పిల్లలు ఆ భేదం గమనించేలా ప్రవర్తించడం ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన అంశాలు.             
విశ్వాసం:
బిడ్డకి నీతి నేర్పాలని ప్రయత్నించే తల్లిదండ్రులు బిడ్డ స్వభావంలో విశ్వాసముంచడం అవసరం.
ఎన్నిసార్లు తప్పుపని చేసినా, బిడ్డ ఆ పని కన్నాఅతీతుడని తెలుసుకుని ... “మళ్ళీ ప్రయత్నించు, ఈ సారి సరిగ్గా చెయ్యగలవు” అంటూ ధైర్యమూ, విశ్వాసమూ ఇవ్వాలి.
తప్పుపని చేస్తే పెద్దవారు ఆశ్చర్యపడి “ఇదేమిటి ఇంత పొరపాటు చేసేవు! నీవంటిది చేసే పని కాదే” అనాలి.’
స్వేచ్ఛ:
అన్నిటి కంటే అతి ముఖ్యమైనదీ, బిడ్డల శిక్షణకు పునాదీ అయిన భావన ‘స్వచ్చంద నిర్ణయశక్తి.’ వాళ్ళంతట వారుగా నిర్ణయాలు తీసుకుని, వాటి బాధ్యతను వారు వహించేటట్టూ  పిల్లలను తయారు చెయ్యడం పెద్దవారి విద్యుక్తధర్మమని ఈ పుస్తకం మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది.       
బలవంతంగా సన్మార్గం లోకి తిప్పడం కంటే దుర్మార్గంలో ఉండనిస్తే మంచిది అన్న ఈ వాక్యం ఒక మంత్రం లా నా చెవిలో మోగుతూ ఉంటుంది.
ఈ కింది వాక్యాలొక్కొక్కటీ ఒక్కొక్క కరదీపిక.
1.   సరైన శిక్షణ ఇవ్వగలిగిన తల్లిదండ్రులు ఎప్పుడూ సంతోషంగా, దయగా, ఓర్పుగా ఉండాలి.
2.  శిక్షణ ప్రారంభించక పూర్వమే తమ అహంభావాన్నీ, తమ అధిక్యతనీ, ఆత్మసుఖాన్నీ త్యజించడం మొదటి పని.
3.  ఇంటికి వొచ్చే ప్రతీ వారినీ పెద్దవాళ్ళు సమానంగా చూడాలి. స్నేహతారతమ్యమే గౌరవ తారతమ్యం కలిగించే ప్రధాన సూత్రంగా ఉండాలి. కులమూ, లింగమూ, భాగ్యమూ మొదలైన భేదాలన్నీ యేమాత్రమూ గౌరవ విషయంలో పాటించకూడదు. 
4.  భయపడ్డ మనే దానికి బిడ్డ సిగ్గు పడాలి. కానీ ఆ సిగ్గు వల్ల భయం పోవాలి గానీ, సిగ్గు పడి భయాన్నిదాచుకోకూడదు.
5.  పిల్లలకు వారి దేహం మీదా, శీలం మీదా అమితమైన గౌరవం ఉండాలి. ప్రేమా, ఇతరులను ప్రేమించడం అనే అనుభవం అతి అద్భుతంగానూ, ఉన్నతం గానూ కనబడాలి.                  
సర్వ మానవజాతినీ బిడ్డలుగా భావించి అమితమైన ప్రేమతో, విశ్వాసంతో, ఆర్తితో తీవ్రమైన కాంక్షతో, చలం వాణి ఈ పుస్తకం లోంచి మనల్ని పలకరిస్తూ ఉంటుంది.
ఎందుకు పసితనాన్ని సంరక్షించడం మనకు అత్యావశ్యకమో... చలం మాటల్లోనే వినండి:
ఎప్పటికన్నా ఏ జాతులన్నా, ఏ జీవులన్నా తిరగబడి తప్పించు కోగలరు.
... జంతువులు కూడా తమను తాము కాపాడుకుంటాయేమో! కానీ ఈ పిల్లలు ఎప్పుడూ సమ్మె కట్టలేరు. తెలివి తెచ్చుకోలేరు. ధిక్కరించలేరు. ప్రార్ధించ లేరు, నోరు లేదు. శక్తి లేదు. మీలో అపారమైన విశ్వాసం తప్ప.
      *****                       *****                      *****   

నేను చదివిన ‘బిడ్డల శిక్షణ’ పుస్తకం రంగనాయకమ్మగారి ముందుమాట తో ఉండేది. లోపల ఉండే కామన్ సెన్స్ కారణంగా - అప్పటికే, చుట్టూ జరుగుతున్నవాటిలో అసంబద్ధంగా తోచేవాటిని గుర్తించడం, అసంతృప్తి చెందడం మొదలైందను కుంటాను. మార్క్సిజం గురించి విన్నది కూడా అప్పుడే. అన్యాయాలు అంతమవ్వాలంటే సమ సమాజం రావాలని చెప్పే ఒక థియరీగా మార్క్సిజం అర్ధమైంది నాకు. సమాజంలో ఏర్పడుతున్న ప్రతీ ఒక్క మార్పునూ, చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్క పరిణామాన్నీ- అర్ధం చేసుకునేందుకూ, అంచనా కట్టుకునేందుకూ – ఆ థియరీని అనువర్తింప చేసుకోవచ్చని ఆమె వ్యాసాలూ చదివేకే తెలిసింది. సిద్ధాంత గ్రంధాలు చదవని వారు సైతం సమానత్వం అన్న మార్క్సిజం మూల సూత్రపు వెలుగులో జీవితానికి స్పందించే ప్రయత్నం చేయొచ్చని పించింది.
లతా మంగేష్కర్ శ్రద్ధాంజలి పాడడం వల్ల  – మరణించిన గాయకుల హక్కులకు భంగం కలుగుతుందని రాసినా, 
వీర్యదానాన్ని రక్తదానం లా పరిగణిస్తే పుట్టబోయే పిల్లల హక్కులకు భంగం కలుగుతుందని రాసినా, 
మెడల్స్ సంపాదించిన ఆటగాళ్లకు ‘ప్రజాధనం’ లోంచి కోట్లు ధార పోసే హక్కు ప్రభుత్వాలకు లేదని రాసినా – అవన్నీ మార్క్సిజానికి మనం చేసుకోగలిగే అన్వయాలేనని అప్పట్లో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఆమె వాటన్నిటి మీదా పాపులర్ వ్యాసాలు రాసినందుకు కృతజ్ఞత కలుగుతోంది.
సమసమాజం అంటే ప్రజల్లో అనేక అపోహలు ఆనాడే ఉండేవి, (ఇప్పుడు మరింత బలపడ్డాయి అనుకోండి.) అలాటి ఒక సందర్భంలో ఆమె ఇలా రాస్తారు: “అందరూ సమాన హక్కులతోటీ, సమాన బాధ్యతలతోటీ ఉండే సమాజంలో వ్యక్తులు సుఖంగా ఉంటారా? గతంలోకన్నా బాధలు పడతారా? ఆ ప్రశ్నలకు నమ్మకంగా జవాబు చెప్తారామె. 
ఈనాటికీ నాలో ఆశాదీపంలా వెలిగే ఒక నమ్మకం ఆమె రచనల కారణంగానే ఏర్పడింది – అదేమిటంటే ... “అలాటి (సమాన) సంబంధాల్లో వ్యక్తి క్షేమానికీ, సమిష్టి క్షేమానికీ వైరుధ్యం ఉండదు.అలాటి వైరుధ్యం గనుక మన దైనందిన జీవితంలో ఎదురైతే, ‘సమానత్వాన్నే లక్ష్యంగా పెట్టుకుని, ఆ సమస్యను పరిష్కరించుకోవాలని నేను నేర్చుకున్నాను. 
       
              *****                  *****               *****

నలుపూ తెలుపూ అన్నంత విస్పష్టంగా మంచి చెడ్డల్ని రంగనాయకమ్మ గారు చూపితే, కుటుంబరావు గారి ‘సాహిత్య, సంస్కృతి వ్యాసా’ల ప్రభావం మరో రకంగా మరింత బలంగా పడింది. కారా మాస్టారి మాటల్లో చెప్పాలంటే ... “తన అనుభవం, తన పరిశీలన మన కళ్ళ ముందుంచి దానిని మన అవగాహనతో బేరీజు చేసుకునేలా చేసి మనలో మార్పు కలిగించేలా చెయ్యడం” కొకు విశిష్టత.

సంస్కారం:
ఒక్కో విషయం ఉదహరించడం నా అభిమతం కాదు. అయితే ఒక్క సంస్కారం అన్న పదం కొకు ప్రభావాన్నంతటినీ ఇముడ్చుకోగలదు అనిపిస్తుంది. ఆ మాటను మనం వాడే రెగ్యులర్ అర్ధంలో ఆయన వాడరు. రకరకాల సందర్భాల్లో కొకు కొత్త అర్ధాల్ని దాన్లో సంక్షేపిస్తారు. వివేకం, స్వయం నిర్మితమైన విచక్షణ, సౌందర్య పిపాస, ఆనందాన్వేషణ లాటి అర్ధాలు నాకు స్పురణ కొస్తూ ఉంటాయి. స్థూలంగా ‘రిఫైండ్ టేస్ట్’, కల్చర్ అన్న అర్ధం చెప్పుకోవచ్చేమో. ఆ ‘సంస్కారం’ పెంచే శక్తి కొకు రచనల కుందని నా నమ్మకం.
కారెక్టర్:
ఈనాడు వెనక్కు తిరిగి చూసుకుంటే, యధాలాపంగా రచయితలు చెప్పిన మాటలు, అవి పిల్లల నుద్దేశించినవైతే మాత్రం, నాలో వెంటనే చొచ్చుకుపోయే వనిపిస్తోంది. నాన్ డీటెయిల్డ్ పుస్తకంలో బాల సాహిత్యం మీద కొకు రాసిన వ్యాసం ఒకటి మాకు పాఠ్యాంశంగా ఉండేది. అందులోని సూచనలను పదే పదే మననం చేసుకోడం, చదివే కథలకు వాటిని వర్తింపచేసుకోడం, అవి పిల్లల మీద ఏవిధమైన ప్రభావం చూపుతాయని ఆలోచించుకోవడం నాకు బాగా గుర్తుంది. బాల్యాన్నీ, దాని ప్రత్యేకతనూ గుర్తించిన రచయిత లంటే నాకు గురి కుదిరిపోయిందప్పట్నించే. కొన్ని అమూల్య రత్నాల వంటి వాక్యాలు - సాంద్రత తోనూ, స్పష్టత తోనూ, సమగ్రత తోనూ ధగధగ లాడుతూ ఏనాటికీ పాతబడకుండా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే కదా! అలాటివే కొకువి కొన్ని:
1.    బాల సాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావాలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రతా, త్యాగబుద్ధీ, కార్యదీక్షా, న్యాయమూ మొదలైనవి జయించడం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు, ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనస్సులకు చాలా మేలు చేస్తాయి.
2.    యుక్తి కథలకు బాల సాహిత్యంలో స్థానం ఉంది.
3.    మహాసత్వుల (ఒక లక్ష్యం పెట్టుకుని సాధించిన) కథలు హెచ్చుగా చదివితే పిల్లల్లో కారెక్టర్ ఏర్పడుతుంది. మన లాటి పేద దేశాల్లో పిల్లలకు డబ్బు మీద దృష్టి  ఏర్పడడం కన్నా, ‘కారెక్టర్’ ఏర్పడడం చాలా అవసరం. 
4.    ముఖ్యంగా చిన్నపిల్లలకు దొంగల భయమూ, దెయ్యాల భయమూ లాటివి అతి తేలికగా అబ్బుతాయి. ఆ భయాలను తగ్గించే దొంగల కథలూ, దయ్యాల కథలూ పిల్లలు చదివి ఉండడం మంచిది.
ఈ నాలుగు ఉదాహరణలూ కూడా పిల్లల మనసులపై సాహిత్యం చూపగలిగే ప్రభావాన్ని బలపరుస్తూ ఉండడం గమనార్హం. జీవితంలోని సమస్యలకు సాహిత్యం సహాయంతో పరిష్కారాలు వెతుక్కోగలమనే నమ్మకం నాలో కలగడానికి ఇవే ప్రాతిపదిక లైనాయి.  

పరిణతి:
మంచి చెడ్డల మధ్య దాటరాని దూరాలుంచే పిల్లల సాహిత్యాని కవతల వైపు సాహిత్యపు కర్తవ్యాన్నినిలుపుతారు కొకు. సాహిత్యం చేయవలసిన పనీ, కాని పనీ చర్చించే సందర్భంలో సాహిత్యకారుడి కున్న అపరిమితమైన శక్తి యుక్తులనిలా వివరిస్తారు.
నీతి శాస్త్రాలూ, న్యాయ శాస్త్రాలూ - సామాన్య జీవితంలో సామాన్య మానవుడి ప్రవర్తనకు ఎక్కువగా వినియోగపడుతూ, విశేష పరిస్థితులను కూడా సాధ్యమైనంత వరకూ చర్చించ గలవు. కానీ వీటిని రోజు రోజుకూ మార్పు చెయ్యడం అసంభవం.
కానీ మానవుడి మనః పద్మం అనుక్షణమూ వికసిస్తూనే ఉంటుంది. మానవుడు యుగయుగాల నుంచీ సాటి మానవుడి మనస్తత్వాన్ని అర్ధం చేసుకుంటూ వస్తున్నాడు. నిర్జీవాలైన శాస్తాలు సమర్ధించ లేకపోయినా సోదర మానవుణ్ణి ఇతను సమర్ధిస్తాడు. తెలివితేటలు వినియోగించి ధర్మశాస్త్రాన్ని తప్పించుకు తిరుగుతున్న దుర్మార్గుణ్ణి పట్టుకుని ఈ మేధావి నరకం లోకి తోసిపారేస్తాడు. ఈ రచయిత ఇంకొకటి కూడా చేస్తాడు – అమలులో ఉన్నన్యాయానికి బద్ధుడైన వ్యక్తి పడిన ఆవేదన చిత్రించుతాడు.
ఏవిధంగా చూసినా సారస్వత కళ యొక్క పని శాస్త్రాలకు ప్రత్యామ్నాయంగా ఉండడం కాదు – వాటి (ఆ నీతి శాస్త్రాల) వల్ల కాని అత్యుత్తమ ధర్మాన్ని నిర్వర్తించడమే.        

పిల్లల మానసాలపై సాహిత్యం చూపించే ప్రభావాన్ని క్రోడీకరించిన దృక్పధానికీ, మానవ జీవితాల మీద సాహిత్యం చూపగలిగే ప్రభావాన్ని పరిశీలించిన విధానానికీ ఒక అంతరాన్ని గమనించవచ్చు. అదే ‘పరిణతి’.

 *****                   *****                        *****           
దువు పట్లే కాకుండా రాత పట్ల కూడా ఆసక్తి పెరగ్గా చివరకు రచన కుండే శక్తి పట్ల వారిలో ఓ విశ్వాసం ఏర్పడుతుంది  అంటారు కారా. ఈ మాట నా విషయంలో నిజమైంది. 
              
నా సాహిత్య ప్రయాణంలో గత సంవత్సర కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. నా భావాలను లిఖిత రూపకంగా నలుగురితోనూ పంచుకోవాలన్న ప్రగాఢమైన కోరిక కలిగిందీ, రాయడం మొదలుపెట్టింది ఈ సంవత్సరం లోనే. అంతకు ముందుకూ, ఇప్పటికీ పోల్చి చూసుకుంటే, నేను చదివే సాహిత్యం నా మీద చూపించే ప్రభావంలో ఒక అంతరం గమనిస్తున్నాను. కేవలం కథ మీదే కాక కథకుడి పైకీ, కథా సంవిధానం పైకీ నా దృష్టి మరలుతూ వస్తోంది. దానికి కారణం కారా గారూ, వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారూను.
అంత వరకూ అదేదో తిరుపతి దేవుడి విగ్రహం – స్వయంభువూ, ఎవరూ చెక్కలేదు – అన్న కథలోలాగా, కథ ఆకాశం లోంచి ఊడిపడుతుంది అనుకునే దాన్నేమో తెలియదు కానీ దాని పుట్టుక గురించి ఏనాడూ ఆలోచించలేదు. కారా గారి వ్యాసాలు చదివేకే కథకుడి ఉనికిని గుర్తించడం మొదలైంది.
కథ యొక్క అర్ధం – రచయిత సృష్టించిన ‘కల్పిత’ ప్రపంచానికీ, కథకు బయట ఉన్న ‘వాస్తవ’ ప్రపంచానికీ మధ్య ఉన్న సంబంధంలో ఉంటుంది. కథ అర్ధం కావడమంటే ఈ సంబంధం అర్ధం కావడమే అన్న వల్లంపాటి గారి వాక్యం కథ అర్ధమవ్వడంలో ఒక పాఠకురాలిగా నాకుపయోగపడితే...                                    
ఒక సంఘటన కానీ, స్థితి కానీ – ఏదైతే రచయితను స్పందింప చేస్తుందో అదే కథ. నాలో కలిగే స్పందనను నేను మళ్ళీ మీలో కలిగించగలగాలి అంటూ కారా మాష్టారు చెప్పిన ఈ మాటలు రచయిత కోణం నుంచీ కథ విలువను నిర్వచించేయి.          
మూల్యాంకనం :
వీరిద్దరి వలనా - నాకు నచ్చిన కథలు ఎందుకు నచ్చుతున్నాయో, నచ్చని వాటిలో ఏ అంశాలు వాటిని నచ్చకుండా చేస్తున్నాయో గమనించడం మొదలు పెట్టాను. వాటి ప్రభావాన్నీ, తద్వారా వాటి విలువనీ అంచనా వేసుకునే పని అప్రయత్నం గానే మొదలైంది.

దీనికి భూమిక కొకు వాక్యాలతో పడిందనుకుంటా. విమర్శకు దిగే ముందుగా  వస్తువు విలువ గురించి ఒక నిశ్చయానికి రావడం అవసరం అంటూ విమర్శకులకు ఒక హెచ్చరిక  లాటి వాక్యం ఇది: “న్యాయంగా జరిగి ఉండవలసినదేమిటంటే ముందు నాకథలకు ఎటువంటి విలువ అయినా ఉన్నదో లేదో నిర్ణయించి ఆ తరువాత నన్ను గురించిన విమర్శ చెయ్యటం. మనకు అవసరం లేని వస్తువును గురించి గంట సేపు బేరం ఆడం! 

ఇలా రచనకు విలువ కట్టుకునే విషయంలో నన్ను చకిత పరిచిన వ్యక్తి ఒకరు. ఆయన కేతవరపు రామకోటి శాస్త్రి. వారి ‘విశ్వనాథ వైఖరి అన్న పుస్తకంతో పరిచయం ఇటీవలే జరిగింది. నా ఆలోచనాక్రమం మీద గాఢమైన ముద్ర వేసిన కారణం చేత ఒకటి రెండు వాక్యాలలోనైనా ప్రస్తావించాలను కుంటున్నాను.
విశ్వనాథ వారి అతి తీవ్ర అభిమానిగా వారి రచనాపటిమకు పరవశులై ఒక మహాకవి మాత్రమే రాయగలరంటూ ‘కల్పవృక్షం’ మీద వ్యాఖ్యానాలు రాసిన వ్యక్తి రామకోటి శాస్త్రి గారు. అటువంటి వ్యక్తి తరువాత కాలంలో, విశ్వనాథ భావజాలం తిరోముఖమైందని గుర్తించడమే  ఒక విశేషమైతే, ఆ వెనుక చూపుకు కారణం  రియాక్షనరీ ధోరణి అని గుర్తించడమూ, దానికి గల చారిత్రక, సామాజిక కారణాలను విశ్లేషించడం అన్నది మరీ అరుదు అనిపించింది.  రామకోటి శాస్త్రి గారు జీవించిన కాలం, వారు నివసించిన ప్రాంతం - ఆయన లోని యీ విశిష్ట పరిణామశీలతకు దోహదం చేసి ఉంటాయన్న సంగతి ఇటీవలే ఒక మిత్రుల (కరుణాకర్ గారి) మాటల్లో తెలిసింది.  

విశ్వనాథ రచనలకు ఉన్న విలువ ఎంతో, ఈనాటికీ వాటిని చదవవలసిన ఆవశ్యకత ఏమిటో కూడా శాస్త్రి గారు, ఇలా వివరిస్తారు . “... సత్యన్నారాయణ గారి జీవిత దృక్పధం పరిధి చాలా చిన్నదైపోయింది. అయితే, ఆయన అనంతమైన సృజన ప్రతిభాశక్తి కలవాడు కావడం చేత మనిషి అంతశ్చాలన సీమల్లోకి యదేచ్ఛగా ప్రవేశించాడు. అది అభేదకం గనుక ఆయన వీర విహారం చేయడానికి వీలయింది.
శాస్త్రిగారు చేసిన ప్రతిపాదనకు పుష్టి నివ్వగల కారా వాక్యం నాకు గుర్తు కొచ్చింది: ఇప్పటికీ శ్రీపాద, విశ్వనాథ వంటి వారి కథలు నన్ను వెంటాడుతూవారి భావజాలం తో ఏకీభవించినా లేకున్నా- ఉంటాయి. disturb చేస్తాయి ...

కారా మాస్టారి అనుభవం మనలో చాలా మందికే అయ్యుంటుంది. దానికి కారణమిదని విశ్వనాధ విషయంలో చలసాని అంటారు: "సమాజం పట్ల స్పష్టమైన తాత్విక అవగాహన వుందాయనకు. తన చుట్టూ ఉన్న జీవితంతో అతి సన్నిహితమైన పరిచయం ఉంది. పరిశీలనాశక్తి ఉంది. గొప్ప ఊహశీలి. సాహిత్యాన్ని ఆహార్యంగా చేసుకుని, కవిత్వాన్ని కవచంగా ధరించిన ‘నిబద్ద’ సాహిత్యవేత్త విశ్వనాథ. తమ సిద్ధాంతాన్ని ఇంత బలంగా, శక్తివంతంగా ‘ప్రచారం’ చేసినవారు అరుదు."

అసమాన ప్రతిభతోనూ, సూక్ష్మ పరిశీలనతోనూ, సంవేదనతోనూ రచించిన సాహిత్యానికి ఉండే శక్తిని గుర్తించిన మీదట, దానిని రాసిన రచయిత దృక్పధం ఏదైనా, ఎప్పటికప్పుడు దానిని సమకాలీన పరిస్థితులకు అన్వయించుకుంటూ అధ్యయనం చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.       

ఇలా
జీవితపు మౌలిక విలువల మీద చలం ప్రభావమూ,
వైరుధ్యాలను పరిష్కరించుకోవడంలో రంగనాయకమ్మ ప్రభావమూ,
మానవుని ‘సంస్కారం’ మీద నమ్మకం ఏర్పడడంలో – కుటుంబరావుగారి ప్రభావమూ,
రచనా ప్రక్రియకు సంబంధించిన పరిజ్ఞానం, సాహిత్య గ్రహణశక్తిని పెంచుతుందన్న స్పృహ ఏర్పడడంలో – కాళీపట్నం, వల్లంపాటిల ప్రభావమూ ఉన్నాయి.
మేధో పరిణతికీ, వస్తుగత విమర్శనా శక్తికీ, ఒక ఉదాహరణగా రామకోటిశాస్త్రిగారు నిరంతర పరిణామ శీలత్వానికి నాకు ప్రేరణ నిస్తున్నారు. 

ఇక్కడ పేరు తీసుకోకపోయినా కూడా, ఇంకా ఎందరో సాహిత్యకారుల ప్రభావం వల్ల రాత మీద విశ్వాసం నాకు ఇనుమడిస్తూ ఉంది – వారందరికీ నా కృతజ్ఞతలు.                    
____________________________________________________