Wednesday, 28 September 2016

పోరాట కారణమే ప్రధానం

http://www.andhrajyothy.com/artical93?SID=1602

 2015 నవంబర్ 5న ప్రచురణ అయిన వ్యాసం ఇది. బ్లాగులో జ్ఞాపకంగా ఉంచేను గానీ అది చదివేందుకు వీలుగా లేదని గుర్తించి ఇక్కడ మళ్ళీ post చేస్తున్నాను.
దేశంలో పెచ్చురిల్లుతున్న నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా - తాము పుచ్చు కున్న అవార్డులను వెనక్కి ఇచ్చి - రచయితలు - నిరసన తెలిపేరు.
ఆ చర్యను తప్పు పడుతున్న వాదాలకు  ప్రతి స్పందనగా రాసిన వ్యాసమిది.      

రచయితలు థర్డ్ పార్టీ లా ?

http://www.andhrajyothy.com/artical?SID=292122
రచయితలు ఈ వ్యవస్థలో పై పై తేలే తెట్టు (ఒట్టి సంఘటనలు) నే కథలోకి తీసుకోక ... వాటి వెనుక సమస్యల్నీ, సమస్యల్లో మనుషుల్నీ, మనుషులను నడిపించిన కారణాల్నీ పట్టుకునే ప్రయత్నం చేయాలని ... వ్యాసకర్త చెప్తున్నట్టు అర్ధం చేసుకున్నాను. వర్ధమాన సాహిత్యం మెరుగవ్వాలన్నఆకాంక్షతో చేసిన మంచి అబ్సర్వేషన్, దానికి తగిన సూచనా అని సంతోషించే లోగా - అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలు కనిపించాయి. మొత్తం వ్యాసం చదివితే కొన్ని తప్పుడు సందేశాలు పంపుతోందేమో అనిపించింది. 

బర్నింగ్ ఇష్యూస్ 
మామూలు మనుషుల్ని జీవిత పరిధిలో తాకే అనుభవాలు కాదు, రాష్ట్రాన్నో, దేశాన్నో కుదిపేసే విషయా(గ్రాండ్ థీం) లైతేనే కథకుల పెన్నులు కదులుతున్నాయి అని రాసేరు. దీనిని బట్టి బర్నింగ్ ఇస్స్యూస్ పై రచన సాగించడం పట్ల వ్యాసకర్తకు అభ్యంతరం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ సందర్భంలో జార్జ్ లూకాస్ నవల గురించి చెప్పిన మాటలు ఏ ఉత్తమ రచన కైనా ఉండాల్సిన లక్షణాలే అనిపిస్తాయి. “రచనలో వర్ణించ బడ్డ జీవితానికీ కాలానికీ సంబంధించిన ప్రత్యేక లక్షణాల అనుభూతి పాఠకుడికి కలగాలి. మానవజాతి చరిత్రలో ఆ కాలానికీ, తద్వారా ఆ అనుభూతికీ ఉన్నప్రత్యేకతని చూపించాలి.”
ఒక రకంగా సమస్త సాహిత్యమూ ఆయా కాలాల ‘బర్నింగ్ ఇష్యూ’ లకు ఆయా రచయితల ప్రతిస్పందనగా భావించవచ్చు. వాటికి మానవజాతి చరిత్రలో దక్కే స్థాన మెటువంటిదో రాబోయే తరాలు నిర్ణయిస్తాయి.
రచయిత జీవిస్తున్న ఆ ప్రత్యేక కాలానికి చెందిన ప్రత్యేక సమస్యలే ‘బర్నింగ్ ఇష్యూస్’. వాటికి స్పందించి కలం పట్టడం, వాటిని తమ అక్షరాల్లో శాశ్వతీకరించడం ప్రతీ రచయితకీ ఉండతగ్గ లక్ష్యమని అనిపిస్తుంది.   


చేత కాక పోతే రాయకండి! 
పైకి లెఫ్టిస్టులకూ, రైటిస్టులకూ అందరికీ వర్తిస్తున్నట్టు రాసినా వ్యాసకర్త ప్రధానంగా సామాజిక స్పృహ తో రాసేవారినే గురిచేసినట్టు కనిపిస్తుంది. ఆయన వ్యాసంలో మెచ్చుకున్న రచయితల పేర్లు కూడా ఆ విషయాన్నేసూచిస్తాయి. సమాజం గురించి రాయాలనుకుంటే ‘వారి’లా రాయండి! రాయలేరు కనక ఆ విషయాలను ఎత్తుకోకపోవడమే ఉత్తమం అన్న పద్ధతిలో వర్ధమాన రచయితలను నిరుత్సాహపరుస్తూ వచ్చారు వ్యాసకర్త. మరి ఇదే అంశం మీద ఆయనే మెచ్చుకున్న కుటుంబరావు గారి అభిప్రాయం ఇలా ఉంది: ‘విస్తృతమైన జీవితానుభవం గల కథకుడు కూడా పరిమిత సంఖ్య లోనే పనికివచ్చే కథలు రాయగలడు. అందరూ వాస్తవజీవితాన్ని గురించే రాస్తున్నారనుకున్న పక్షంలో ఒకే కథకుడు రాసిన పది కథల కంటే పది మంది రాసిన పది కథలు ఎక్కువ జీవితాన్ని ప్రతిబింబిస్తాయి.’
కనుక ఎవరో మహారచయిత అంత బాగా మనం రాయలేం కనక రాయడమే అనవసరం అన్నధోరణి సర్వత్రా హానికరం. కావలిసిందల్లా వాస్తవ జీవితాన్నిమన రచనలో ప్రతిబింబించాలన్న ఆశయం మాత్రమే.
అలాటి ఆశయం కల రచయితల నుద్దేశించే అనుకుంటాను, (చెహోవ్ ని కోట్ చేస్తూ) అతని (రచయిత)కి అర్ధం కాని విషయాల జోలికి వెళ్ళడం వల్ల ఏ మంచీ జరగదు అని రాసేరు. ఆ మాట నిజమే. కనుక రచయితలను - ‘తమను కదిలించిన’ విషయాల గురించి మరింత లోతైన అవగాహనను ఏర్పరచుకొని రాయమనడం న్యాయం. అంతే తప్ప- దేనికైనా ‘కదిలి’ (వ్యాస కర్త మాటల్లో చెప్పాలంటే ‘చదివి చలించి’) కలం పడితే – అదే తప్పు ధోరణి అని చెప్పడం ఎంత వరకూ సమంజసం? మెహెర్ గారి వ్యాసం పదే పదే అదే రేఖను దాటుతూండడం గమనార్హం.

మార్కెట్ శక్తులకు లోనై రచన చెయ్యడం కంటే –మార్క్సిస్ట్ నిబద్ధతతో రాయడమే పనికిమాలిన పని అని వ్యాసాంతం లో తేల్చేసారు. ఒక కుర్ర రచయిత తన తప్పు తెలుసుకొని, నిబద్ధత తో రచన సాగిస్తానంటే - దానర్ధం జీవితం లోని వైవిధ్యాన్నిత్యజించడమే అని ఎలా నిర్దారించారో అంతుబట్టదు. ఒక దృక్పధం కలిగి ఉండడం అంటే కళాహీనతకూ, అవగాహనా రాహిత్యానికీ గుర్తన్న విధంగా వ్యాసం సాగింది.   

సివిక్ గిల్ట్
మౌలికంగా సమాజంలో రచయితల స్థానం పట్లనే వ్యాసకర్త పరస్పర విరుద్ధ అభిప్రాయాలను ప్రకటించారు. అటు సింహాలకీ, ఇటు వేటగాడికీ చెందని హైనాలంటూ రచయితలను థర్డ్ పార్టీగా మొదట్లో చూపిస్తారు. మరో చోట న్యూస్ కెమెరా కళ్ళనే అంతచ్చక్షువులుగా స్వీకరించే  రచయితలు తమ సివిక్ గిల్ట్ ను మాత్రమే తృప్తి పరచుకోగలరని రాస్తారు. వేటగాడి జాతికీ, సింహం జాతికీ కూడా చెందని హైనాకు ఏ రకమైన గిల్ట్ అయినా ఎందుకుంటుంది అన్నప్రశ్న రావడం లేదా? వార్తల్లో వచ్చిన విషయాల ప్రభావం తోటి మనుషులందరి లాగా రచయితలపై కూడా పడడం సహజసిద్ధం కాదా? రచయితలు దానికి అతీతులైతే మరి ఏ గిల్ట్ ను తృప్తి పరుచుకునేందుకు వారు రచన సాగిస్తారు? ఇందులో ఏది నిజమందాం?

అసలు రచయితను ఒక థర్డ్ పార్టీగా చేసే ఆ ప్రతిపాదనే సత్యదూరం అనిపిస్తుంది. తాను జీవిస్తున్నసమాజ వాస్తవాల నుంచి రచయితను దూరంగా విసిరేసే ప్రయత్నంగా కనిపిస్తుంది.

రచయితలు ఆబ్జెక్టివ్ గా, జీవితపు అన్ని కోణాలనూ పరిశీలించాలని చెప్పే సాహిత్య సిద్ధాంతానికి కొందరు చేస్తున్నవక్రభాష్యం ఇది. కళలో ఈస్తటిక్ డిస్టెన్స్ పాటించడమంటే తన పాత్రలకు ఒకింత దూరం జరిగి, జీవితసత్యాలను ఆవిష్కరించే ప్రయత్నం చేయాలన్నఅర్ధమే తప్ప, దృక్పధాలూ, నిబద్ధతలూ కలిగి ఉండకూడదని అర్ధం కాదనుకుంటాను.