Monday, 10 October 2016

స్వావలంబనకు ప్రతీక 'మధురవాణి'

స్వావలంబనకు ప్రతీక మధురవాణి

కన్యాశుల్కం నాటకం కేవలం ఒకప్పటి కాలంలో నివసించిన ఒకానొక అగ్రకులం వారికి సంబంధించిన సమస్యలకూ, సంస్కరణలకూ ఉద్దేశించిన రచన అని ఈనాడు కొంతమంది అనడం వింటున్నాను. అది పొరపాటనీ, ఈనాటి స్త్రీలెదుర్కునే సమస్యల చిత్రణ కూడా ఉందనీ నా నమ్మకం. 
తమ జీవితాల మీద సరేసరి, తాము కని పెంచే పిల్లల మీద కూడా హక్కూ, నిర్ణయాధికారం స్త్రీలకు లేదన్న సంగతి అబద్ధమా? ‘డబ్బు జబ్బు’ సోకిన పెద్దలు  మానవసహజమైన ప్రేమాభిమానాలను మర్చిపోయి – ఆ డబ్బు కోసం తమ కుటుంబం లోని ఆడపిల్లల జీవితాలు తాకట్టు పెట్టడం ఈనాడు మనం చూడడం లేదా? పరస్పరాకర్షణ కారణంగా ఏర్పడవలసిన స్త్రీ పురుష సంపర్కానికి బదులు, స్త్రీ శరీరమూ, ఆమె ప్రేమా రకరకాల ధరలకు అందుబాటులో ఉండే పరిస్థితులు లేవా? ఇవేవీ ఒక్క కాలానికో, ప్రాంతానికో, వర్ణానికో చెందిన సమస్యలు కావు – అనాదిగా స్త్రీలందరి ఉమ్మడి సమస్యలూను. ఆ సమస్యల గురించి వ్యధ చెంది, ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుందనే నమ్మకంతో, భవిష్యత్తు మీద ఆశ కలిగిన ‘మహాకవి’ సృష్టించిన పాత్ర ఈ మధురవాణి.

ఆయన దర్శించిన ఆధునిక మహిళ కుండే ప్రధాన లక్షణాలు ఏవన్నది మధురవాణి పాత్ర గుణగణాల్ని బట్టీ మనం ఊహించుకోవచ్చు. నిశిత పరిశీలనా, తనదైన స్పష్టమైన ఆలోచనాక్రమం, నిష్పక్షపాత ధోరణీ, ఆత్మవిశ్వాసమూ, స్వావలంబనా వీటన్నిటికీ మించి తన తోటివారి కష్ట సుఖాలను తనవి గా భావించగలిగే హృదయ సౌకుమార్యమూ, తన చేతనైనంత సాయం చేయాలనే మానవత్వమూ, అవసరమైతే తన స్వలాభాన్ని త్యజింఛి అడుగు ముందుకేసే సాహసమూ ఇవన్నీ మధురవాణిని ‘మధురవాణి’గా చేస్తాయి.                   

ఇంకా చెప్పుకోదగ్గ విశేషం: కుటుంబ స్త్రీల కొచ్చిన ఆపదలను గట్టెక్కించడం కోసం, ఏ కుటుంబ బంధాలకూ నోచుకోని ఒక స్త్రీ నిస్వార్ధంగా పూనుకోడం.
ఆర్ధిక భద్రతా, సాంఘిక గౌరవమూ లేకుండా సమాజం కట్టడి చేసిన కులంలో జన్మించినా,
1.     ఈనాటికీ మనకు ఆదర్శంగా నిలిచే లక్షణాలను ఆమె సంతరించుకోవడం,
2.     నాటకపు వ్యవధిలో ఆమె పాత్ర పరిణామం చెంది, ‘వృత్తిధర్మా’న్ని తప్పనిసరి అంటూ పాటించడానికి సమ్మతించక పోవడం,
3.     దాని విషయమై లోకాభిప్రాయాన్ని ప్రతిఘటించడం కూడా గమనించగలం.
కుటుంబంలో, సమాజంలో తన స్థానమేమిటో, తనకి జరుగుతున్న అన్యాయమేమిటో తెలుసుకోగలిగే స్పృహ, ఎదిరించి పోరాడవలసిన ఆవశ్యకతని గుర్తించడం – ఈనాటి స్త్రీకి తప్పనిసరి అని నిర్ద్వంద్వంగా ఒప్పుకోవచ్చు. వాటిని కన్యాశుల్కం నాటకం నేపధ్యంలో మధురవాణి పాత్రకు అనువర్తింప జేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె హృదయమూ, ఆమె మేధస్సూ రెండూ అద్భుతాలే! ఈనాటి ప్రమాణాలతో కొలిచి చూసుకున్నా  సరే అవి అనుసరణీయాలే. 

మహిళలు తమ గురించి తామే ఎంతో తక్కువ స్థాయిలో అంచనా వేసుకునే పరిస్థితులు ఈనాటికీ ఉన్న మన సమాజాల్లో, ఎప్పుడో వంద ఏళ్లకు పైబడిన వేశ్య పాత్రలో ఈనాటి స్త్రీలకు ఆదర్శం అనదగ్గ లక్షణాలున్నాయని చెప్తే, నమ్మడం కష్టమే. కనక ముందుగా, మధురవాణిలో ఈ లక్షణాలను పొదిగిన గురజాడ అభిప్రాయాలను తెలుసుకోవడం సముచితంగా ఉంటుంది. వేశ్యలు సమాజానికి చీడ పురుగులనీ, పురుషులను నాశనం చెయ్యడం వారి ప్రవృత్తి అనీ ప్రచారాలు ముమ్మరంగా సాగే రోజుల్లో గురజాడ ఆలోచనలు ఇలా ఉండేవి: వేశ్యలో మానుషత్వాన్ని మరచి పోకండి. ఆమె సుఖదుఃఖాలు మీవి గానీ నావి గానీ అయిన సుఖదుఃఖాలకు ప్రాముఖ్యంలో తీసిపోవు. సంఘంలో లెఖ్ఖ లేని వ్యభిచారులైన భర్తలూ, భార్యలూ ఉన్నారు. స్పష్టంగా తన వృత్తిని తెలియబరిచే వేశ్య వారందరికన్నా అధమురాలెట్లా అవుతుంది? పైగా వేశ్య ఏ వివాహప్రమాణాన్నీ భగ్నం చెయ్యడం లేదు వీళ్ళ వలెఅని 1909 లో వంగోలు మునిమాణిక్యం గారికి అప్పారావుగారు రాసేరు. (అప్పారావు గారి ఇంగ్లీషుకు చలం తర్జుమా) 

ఒక వైపు సంసార స్త్రీలను ‘అతి పవిత్రం’గా ఉంచేందుకు వారిని నాలుగు గోడల మధ్యా బంధించి, మరో వైపు సానికులం వారిని మగవారికి వినోదం కలిగించే పని మీద వీధిలోకి నెట్టే సంప్రదాయం నిరాఘాటంగా సాగుతూ ఉండేది. ఈ విభజనను గురజాడ స్పష్టంగా గమనించారనీ, దానిని తన రాతల ద్వారా మార్చా లనుకున్నారనీ తెలుస్తుంది. అందుకే ఆయన సాహిత్య సృష్టి  ఆనాటి భావజాలాలకు పరిమితం కాకుండా ముందడుగు వేసింది.

నాటకం మొదలైన కొద్ది క్షణాలకే మధురవాణి ప్రసక్తి వస్తుంది - గిరీశం మాటల్లో. అతను ఇంగ్లీషు చదువుకున్న యువకుడనీ, మధురవాణి పోషకుడనీ అనిపిస్తుంది. కానీ ఉట్టి వాక్చాతుర్యంతో నలుగురికీ టోపీ వేసి భుక్తి గడుపుకునే అప్రయోజకుడని కూడా తెలిసిపోతుంది మనకు. అతనిని వదిలించుకుని, మధురవాణి రామప్పంతులనే కోర్టు పక్షిని చేరుకుంటుంది. గిరీశం మాటల్లో చెప్పాలంటే ‘రామప్పంతులు జిత్తులకు జాకాల్ (గుంట నక్క), తెలివికి బిగ్ యాస్(గాడిద)’. ఆ రామప్పంతులు పన్నిన వలలో లుబ్ధావుధాన్లనే చేప చిక్కుతుంది. దాని ఫలితంగా లుబ్ధుడు ముసిలివాడై ఉండీ చిన్నపిల్లని కొనుక్కుని పెళ్ళాడేందుకు సిద్ధమౌతాడు.   
రామప్పంతులు లేని సమయంలో కరటకశాస్త్రి వచ్చి మధురవాణి సహాయం కోరతాడు. అతని చెల్లెలి కిద్దరు కూతుళ్ళు. పెద్ద పిల్ల బుచ్చమ్మ, ఆమె బాల వితంతువై, పుట్టింటిలో అణగారుతుండగా మళ్ళీ అలాటి దుస్థితే చిన్న పిల్ల సుబ్బికి పట్టబోతుంది -ఆమెనే లుబ్ధుడు కొనుక్కోబోయేది. మేనగోడలు సుబ్బి పెళ్లి తప్పించేందుకు, కరటక శాస్త్రి తన శిష్యుడికి ఆడవేషం వేసి మధురవాణి దగ్గరకు తీసుకు వస్తాడు.               
ఆ సమయంలో మధురవాణి స్పందన ఆమె మనసును మనకు పరిచయం చేస్తుంది. పెళ్లి ఆపడంలో ఆమె అందించబోయే సహాయానికి ప్రతిఫలం ఇస్తానని కరటకశాస్త్రి వాగ్దానం చేస్తాడు. అది విని మధురవాణి విచారంగా ఇలా అంటుంది. వృత్తి చేత వేశ్యని గనుక చెయ్యవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తాను గానీ మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలచారా? మీ తోడబుట్టుకు ప్రమాదం వొచ్చినపుడు నేను డబ్బుకు ఆశిస్తానా?

ఈ మాటల్లోని విషాదం ఏమిటంటే డబ్బు కోసం తన సహజ భావోద్వేగాలను అణచుకోవాల్సిన వృత్తిలో ఉన్నా ... ఆమె హృదయం ఉండవలసిన చోటనే ఉంది. కానీ ఆ విషయాన్ని ఆమే ప్రకటించుకోవాల్సిన మానసిక ఏకాంతజీవనం ఆమెది. ఆ మాట కొస్తే కరటకుడు రాక ముందే, తనకేమీ సంబంధం లేకపోయినా, ఆ పెళ్లి తప్పించమని రామప్పంతుల్ని పీడిస్తూ ఉంటుంది మధురవాణి – అదీ అకారణంగా! ఎందుకంటే ముసిలివాడు పెళ్లి చేసుకోడం తప్పని ఆమె మనసుకు తెలుసు కనక!!
అలాగే ఆమె హృదయాన్ని చూరగోనే వ్యక్తులు – రూపవంతులో, అమిత ధనవంతులో, కీర్తి మంతులో కాదు, మిక్కిలీ మంచివారు!  పెళ్ళికూతురు వేషం కట్టిన శిష్యుడు పెళ్ళయ్యాక పారిపోతాడు, కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. రామప్పంతులు జరగని కూనీ జరిగిందని నమ్మించి పెళ్ళికొడుకైన లుబ్దుడి మీద హత్యానేరం మోపుతాడు.
‘లోకం అంతా స్వప్రయోజనపరులే ‘ అని మధురవాణి అనుభవం ఆమెకు చెప్తుంది. తద్విరుద్ధంగా - నిర్దోషి అయిన లుబ్ధుడి మీద కేవలం జాలితో సౌజన్యారావు అనే లాయరు కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడని విని ఆమెలో కుతూహలం రేగుతుంది. పరోపకారం అతని సహజగుణమని తెలిసి కలవాలని ముచ్చట పడుతుంది. పరిపూర్ణమైన అతని మంచితనంలో చెడ్డే లేదనిపించి ఆమెలో సౌజన్యారావు పట్ల అమాయకమైన భక్తి  అంకురిస్తుంది.
లుబ్దుడికి పెళ్ళైన పిల్ల ఆడపిల్లే కాదన్న నిజాన్ని చెప్పి, అతనికి సహాయం చేసేందుకు వెళ్లి కలుస్తుంది. అతనంటే తన మనసులో ఉన్న ఇష్టాన్ని నిష్కపటంగా బయట పెడతుంది. అతను ఏంటి నాచ్ గనక, వేశ్యలతో సావాసం చెయ్యడం వ్రతభంగమని గునుస్తూనే ముద్దు పెట్టుకోడానికి సమ్మతిస్తాడు. కానీ ఆమె అతన్ని అక్కడే ఆపుతుంది. ఇష్టాన్ని నిర్భయంగా ప్రకటించడంలోనూ; ఎదుటి వారి అభ్యంతరాలను గమనించి, దూరం జరిగి తన స్వాభిమానాన్ని నిలుపుకోడం లోనూ కూడా ఆమె వ్యక్తిత్వం ప్రకాశం అవుతుంది.

ఆమె మేధస్సు నాటకంలోని ప్రధాన వ్యూహాలను నడపడమే కాక, ప్రతికూల వాతావరణంలో కూడా  తెలివి నుపయోగించి ఒడ్డు చేరాలన్న స్ఫూర్తి మనలో కలుగజేస్తుంది. మధురవాణి తనతో సంబంధం గల వాళ్ళందరి గుట్టు మట్లూ తెలుసుకోగల మనిషి లాగా కనిపిస్తుంది. ఆమె తన యోగక్షేమాలు తాను చూసుకుంటుంది గానీ, వాటి కోసం ఇతరుల పైన ఆధారపడదు. అయినా ఇతరుల యోగక్షేమాలూ చూడగలదు.
"మధురవాణి స్వావలంబన ఎంత సమర్ధమైనదో
, ఆమె ఆత్మ విశ్వాసం అంత అచంచలమైనది. ఎలాటి పరిస్థితిలోనూ ఆమె తడబడడమూ, బేజారెత్తటమూ, నిస్సహాయురాలు కావటమూ మనం చూడం."_ (కొ.కు)
ఉదాహరణకి రామప్పంతులు తన ఫోర్జరీ నేరం బయట పడిందనుకుని – ‘పీక తెగిపోతుంది, ఏమిటి సాధనం?’ అని కాళ్ళూ, చేతులూ తొక్కుకుంటూ ఉంటే ... ‘యంత్రం ఎదురు తిరిగిందో? ఐతే చక్రం అడ్డు వేస్తాను’ అని ధీమాగా చెప్పి, అంత పనీ చేసుకొస్తుంది. వివిధ సందర్భాల్లో ఆమె ఇచ్చే చిట్టి పొట్టి సలహాలు ఒక పక్క నవ్వు పుట్టిస్తూనే, మరో పక్క ఆమె సమయస్ఫూర్తికి అద్దం పడతాయి.
ఇక మధురవాణి సంభాషణలు నాటకంలో ప్రత్యేకంగా విశ్లేషించుకోవలసిన అంశం. అవి ఆమె లోకానుభవాన్నీ, దాని నుండి ఆమె నేర్చుకున్న పాఠాల్నీ వెల్లడిస్తాయి. ఆమె మాటల్లో ఆమె కున్నటువంటి ‘సమదృష్టి’ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తి మాటల్లో ‘వైరుధ్యం’ పసిగట్టిందో, సందర్భాన్నానుసరించి – సరైన మార్గం లోకి మళ్లమని నిర్బంధించడమో, బుద్ది చెప్పడమో, ఎత్తి చూపడమో, అదేదీ కుదరక పోతే కనీసం చురక అంటించడమో అయినా చెయ్యక మానదు.
1.     పరువైన మొగాళ్లొచ్చి నప్పుడు పరువైన ఆడవాళ్లెందుకు రాకూడదు అని గిరీశాన్ని హేళనగా ప్రశ్నించడంలో ఆమె ధిక్కారస్వరం వినపడుతుంది.
2.     తాను చేస్తే లౌక్యం, మరొకరు చేస్తే మోసం అనరాదా? అబద్ధానికి అర్ధం ఏమిటి? అని రామప్పంతులి జీవనవిధానంలోని డొల్లతనాన్ని ఈసడిస్తుంది.
3.     ఆయన కంటే మీ న్యాయం ఏం బాగా ఉంది? తనకి  రొట్టా, ఒహడికి ముక్కానా? అని కరటకశాస్త్రి ఆలోచనల్లోని సంకుచితత్వాన్ని పదే పదే ఎత్తి చూపి, అతనిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.     
4.     లుబ్దుడిని సైతం ‘ఏమి ఈ మగవారి చిత్రం! ఇంతసేపూ పెళ్లి వద్దని వగిస్తిరి; ఇప్పుడు పెళ్లి తేలిపోయిందని వగుస్తున్నారు’ అని పరిహాసం చేయకుండా వదలదు.      
ఎవరి భావాల ప్రభావాల వల్లా కాక తనదైన ఆలోచనా సరళి ప్రకారం నిర్ణయాలు తీసుకునే ఆమె ప్రత్యేకత సౌజన్యారావుతో ఆమె చేసిన చర్చలో మన ముందు కొస్తుంది. తానెంతో ఆరాధిస్తున్న వ్యక్తి అయినా, అతని ఆలోచనలు తప్పుదారిలో ఉన్నాయని గుర్తించి, తన భావాలను  స్పష్టంగా వ్యక్తీకరించి సౌజన్యారావును నిరుత్తరుడ్ని చేస్తుంది. ఆ సన్నివేశంలోని నాటకీయత కోసమే కాక ఆమె మాటల అంతరార్ధం గ్రహించేందుకు ఒక్క సారి ఆమాటల్ని గుర్తుచేసుకునే అవసరం ఉంది.
వేశ్య జాతి చెడ్డ కావచ్చును. గాని తాము శలవిచ్చినట్టు చడ్డలో మంచి వుండకూడదా? మంచి యెక్కడున్నా గ్రాహ్యం కాదా అండీ?’ అని వేసిన ఆమె ప్రశ్న గురించి ఆలోచిస్తే, వృత్తి నుండి ప్రవృత్తిని వేరు చేసి చూడమన్న ఉపదేశం వినిపిస్తుంది. మగవారి ‘మనసు రంజింప’చేయడమనే పనిని ఒక వృత్తిగా తయారు చేసి ఉంచిన పరిస్థితులతో పోరాటం సాగించాలి గానీ, తప్పనిసరి అయి ఆ వృత్తిని అవలంబిస్తున్న స్త్రీలను అసహ్యించుకోవడం ఎంత పొరపాటో అర్ధమౌతుంది. మధురవాణి పాత్ర ద్వారా గురజాడ మనోభావాలు వెల్లడి అవుతాయి. గురజాడ వేశ్యలను హేయ దృష్టితో చూడలేదు. నీచంగా తలచలేదు. అయినా వేశ్య వృత్తిని ఆయన ప్రోత్సహించలేదు, ప్రశంసించ లేదు. దాన్ని లేకుండా చేయడమే ఆయన తన సమాజ సంస్కారాల్లో చేర్చిన ముఖ్య ఆచరణల్లో ఒకటి. మధురవాణి ఆయన లోకపు పరిజ్ఞానాన్నీ, లోకాన్ని ప్రశ్నించే సంస్కారాన్నీ పుణికి పుచ్చుకుని మన ముందుకు వస్తుంది.

తన లోకజ్ఞానానికి కారణం తల్లి తనకు నేర్పిన పాఠాలేనని  ఒకటి రెండు సందర్భాల్లో తన తల్లికి కృతజ్ఞత చెప్పుకుంటుంది. ఆడవారి మీద ప్రయోగించే ఆయుధాలలో అతి ముఖ్యమైనది పొగడ్తలని లోకంలో చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా ‘విద్వాంసుల’ ఇచ్చకాలకు మైమరచి, మెరమెచ్చు మాటలకి పొంగిపోవద్దని చెప్పే ఆ తల్లి ఉపదేశం ఆధునిక  మహిళ క్కూడా ఉపయోగపడవచ్చు. 
కరటకశాస్త్రి అన్నట్టూ చూపితే అందుకు పోయే చురుకుదనం  మధురవాణి  సొంతం. దాని కారణంగా బాహ్యంగా ఉండే సమస్యలను తన స్వశక్తితో పరిష్కరించుకోగలదు. తాను కోరిన పరిస్థితుల్ని తానే సృష్టించుకోనూ గలదు. కానీ ఆమె పాత్రలో అంతస్సంఘర్షణ లేక పోలేదు. ఆమే ఒక చోట అన్నట్టూ వలలో ముత్యపుచిప్పలు పడితే లాభం కానీ నత్తగుల్లలు పడితే మోతచేటు కదా. ఆమె తన వృత్తి కారణంగా తన జీవితంలో తప్పనిసరిగా ఏర్పడే ప్రేమరాహిత్యాన్ని గుర్తించుకుంటుంది. పైపై కిరాయి జీవితాన్ని గడపడానికి ఆమె మానసం ఘోషిస్తుంది. అందుకే ఇక మీదట సీమకుక్కలనూ, ఊరకుక్కలనూ దూరంగా ఉంచాలని నిర్ణయం చేసుకుంటుంది.  ఇది ఆమె స్వాతంత్ర్య శక్తికి మకుటాయమానమైన ఉదాహరణ.

మధురవాణి లోని ఈ ప్రత్యేకతను మిగిలిన పాత్రలు సైతం నాటకంలో గుర్తించినట్టే కనిపిస్తుంది.  ఒంటరి ఆడది, తన వద్దకు మగవారు వచ్చి ఇచ్చే డబ్బే ఆధారంగా బ్రతికేది, ఆ వృత్తి పట్ల లోకానికున్న వ్యతిరేకతను తెలిసిన వ్యక్తి – అయినా సరే తాను ఒకరి కింద అణిగి ఉండదనీ, తాననుకున్నపని నిస్సంకోచంగా చేసి తీరుతుందనీ అందరికీ తెలిసేటట్టూ ప్రవర్తించడం – ఆమె సాధించిన విజయాల్లో ఒకటి. దానికి వారు పెట్టిన పేరు తిక్క! సౌజన్యారావు కూడా ‘చిత్రం! వెయ్యి రూపాయల కంటే వక ముద్దు ఎక్కువ విలవా?’’ అని విస్తుపోతాడు. ‘ఏమి పెంకెవు!’ అని మురిసిపోతాడు. తన కున్న ఆ ‘తిక్కే’ అందరికీ ఉపచరిస్తోందని గర్వంగా చెప్పుకోగలిగిన సార్ధక జీవి మధురవాణి.

ఈ సందర్భంలో, కేవలం సుబ్బికి ఆమె చేసిన ఉపకారమే కాక నాటకం లోని తక్కిన స్త్రీల పట్ల కూడా ఆమె చూపే సంఘీభావం ప్రత్యేకించి చెప్పుకోదగ్గది. మగవారి కారణంగా సాటి ఆడవారితో అసూయలు పెంచుకోడం, వైరం సాగించడం ఆమె వైఖరి కాదు. రామప్పంతులు విషయంలో, లుబ్దుడి వితంతు కూతురు మీనాక్షి కున్న బలహీనత గురించి తెలిసినా, ఆమెను అర్ధం చేసుకుని ఆమెను తన నేస్తం అని చెప్పుకుంటుంది. పగలబడి నవ్వొస్తున్నా, మంచం కింద దూరే ఘట్టంలో గిరీశం ప్రియురాలు పూటకూళ్ళమ్మకే మధురవాణి సానుభూతి అని గుర్తించి సంతొషించకుండా ఉండలేం.              

ముందుగా గిరీశాన్నీ, తరువాత రామప్పంతుల్నీ, ఆ పై తన చుట్టూ మూగుతున్న పెద్దమనుషుల్నీ వదిలించుకుంటున్న ఆమె పాత్ర క్రమ పరిణామాన్ని విశ్లేషిస్తూ ప్రముఖ రచయిత సంజీవదేవ్ ఇలా రాస్తారు:
ఒక్కొక్క పీడనే వదిలించుకుని సంఘం మురికిగుంట (society’s gutter) కాకుండా, పురుష స్వార్ధపు గడప చాప (door mat) కాకుండా, మంచినీటి ఊటగా బాధల్లో ఉండే వాళ్ళ బతుకు అనే ఓడకు తెరచాపగా పరిణతి చెందింది.   __________________________________________________________