Monday 10 December 2018

కంట్రోల్ వయా ట్రోల్

కొత్త రకం ట్రోల్లింగ్. పైకి కనబడదు, శబ్ధం చేసినట్లు ఉండదు. నిత్యం ఫేస్ బుక్ లో ఎదుర్కొనే విచిత్రమైన బాధ - మాతృక ఆగస్ట్ సంచికలో


సినిమా, టీవీ, రేడియో, ప్రింట్ మీడియా – ఇలా దాదాపు ప్రతీ ఒక్క వేదికా పవర్ బ్రోకర్ల చేతి పనిముట్టుగా మారిన కాలంలో ప్రజాస్వామ్యవాదులు కొంతలో కొంత ఆశగా చూసేది సోషల్ మీడియావైపే. మెయిన్ స్ట్రీం మీడియా పట్టించుకోని అంశాల గురించి చెప్పడానికీ, ప్రచారమౌతున్న వార్తల నిజానిజాలు తెలియజేయడానికీ పుట్టిన ప్రత్యామ్నాయ పత్రికలు – మనని అందుకోడానికి కూడా సోషల్ మీడియా మీదనే ఆధారపడుతూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకుని మన మనసులో మాటని అతి తేలికగా నలుగురిలోనూ పెట్టగల అవకాశం సోషల్ మీడియా మనందరికీ ఇచ్చింది.
అంత మందిని ఒకే సారి రీచ్ కాగల ఆ మాధ్యమాన్ని మనలాటి సామాన్యులకి వదిలేసేంత అమాయకులా మనల్ని ఏలిన వారు? వారూ దానిని వెయ్యి కళ్లతో కనిపెడుతూనే ఉంటారు. ప్రతికూల పవనాలు వీచినప్పుడల్లా – సోషల్ మీడియా మీద పట్టు బిగిసినట్టు కనిపిస్తూ ఉంటుంది. కారణమేమిటంటే - కేవలం ఒక అభిప్రాయం కలిగి ఉన్నందుకు, దానిని ప్రకటించినందుకూ – జైల్లో పెట్టించడం, హత్యలు చేయించడం – అనుకుంటాం గానీ, మరీ అంత సులభమేం కాదు. దానికి తోడు ఎంత మందిని ఒకే సారి శిక్షించగలం, బొత్తిగా ప్రాక్టికల్ కాదు! అభిప్రాయాలని కంట్రోల్ చేసే పని ఇప్పుడు ట్రోలింగ్ పేరుతో జరుగుతోంది.
కొందరు వ్యక్తుల్ని టార్గెట్ చేసి -వీరిని రేప్ చెయ్యాలి, హత్య చెయ్యాలి అనే కామెంట్లు - బెదిరింపులు – ట్రోలింగ్ లో భాగమే. అవి ప్రతిఘటనలకి ప్రతినిధులైన వారికి ప్రత్యేకం. ఒక అంశం మీద మాట్లాడినందుకు పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోందంటే – అంత అత్యవసరమైన అంశం మీద చర్చ అని అర్థం చేసుకోవచ్చు. ఏ వాదం, నినాదం, కాజ్ ప్రజలని ఆలోచించేలా చేస్తోందో – ఆ గొంతును ట్రోల్ చెయ్యడం జరుగుతోంది. ఆ గొంతు ఎంత సహేతుకమైందైతే అంత పెద్ద మొత్తంలో మూకలదాడి జరుగుతోంది. మూక అంటే ఒకరే కాదు కదా, ఎందరో వ్యక్తుల గుంపు కదా మరి ఒకే సారి కూడబలుక్కున్నట్టు ఎలా దాడి చేస్తున్నారు అని ప్రశ్న వస్తుంది. వేలాది మందికి శిక్షణ ఇచ్చి, జీత భత్యాలిచ్చి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ఐటీ సెల్స్ ని పెట్టి మరీ ఈ ట్రోలింగ్ని జరిపిస్తున్నారని – ఋజువులతో సహా బయటపడింది.
మన తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఉదంతం ఒకటి: తెలంగాణావాదాన్ని బలపరిచిన ఒక రచయిత తన పుస్తకపు ఆవిష్కరణ సభ ఆంధ్రప్రదేశ్ లో జరుపుకోబోయేడు. ఆయన పుస్తకంలో స్త్రీలని అవమానించే భాష వాడేడనే కారణం చెప్పి, ఆ సభని జరగనీకుండా గూండాయిజం చేసి ఆపేసారు. ఆ రచయితపై దాడి కూడా చెయ్యబోయేరు. అక్కడ ఉన్న మహిళా ఉద్యమకారులు – ‘ఇది ప్రజాస్వామిక ధోరణి కాదు, ఆ పుస్తకం మీద విమర్శ పెట్టండి, లేదా మరో పుస్తకమే రాయండి, కాని ఆయనకి సభ జరుపుకునే హక్కును మీరు కాదనకూడదు’ అని అంటూ ఆ దాడిని ఆపబోయేరు. ఆ మహిళలపై ట్రోలింగ్ మొదలైంది. ఏ భాష అవమానకరంగా ఉందని, రచయిత మీద దాడి చేసేరో – అంతకు పదింతల అవమానకరమైన భాషలో – రచయితని సపోర్ట్ చేసిన మహిళల మీద దాడి చేసేరు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
ఇలా ఒక్కసారి జరిపే మూకుమ్మడి దాడి ఒకటే కాదు, చాప కింద నీరులా జరిపే ఇంటలెక్ట్యువల్ దాడి కూడా వ్యూహంలో భాగమే. దీనిని మీలో చాలా మంది చూస్తూండి ఉంటారు కూడా, కొద్దికాలంగా ఒక అజ్ఞాత ఐడీ ‘ ఏడుకొండలవాడు అనే తెలుగాయన’ – ఇంటర్నెట్లో వీర విహారం చేస్తున్నాడు. ఫేస్ బుక్ పోస్టులనించీ, వెబ్ మేగజీన్లూ, బ్లాగులూ – ఇలా ఒకటేమిటి అన్ని చోట్లా, అది చరిత్రగానీ, సంగీతం కానీ, సాహిత్యంగానీ మరేదన్నాగానీ, స్త్రీవాదం, దళితవాదం, సామ్యవాదం – ఇలాటి ప్రగతిశీలవాదపు చర్చలు ఎక్కడ జరుగుతున్నా – అక్కడ వాలి, రకరకాల లింకుల వర్షం కురిపిస్తాడు. అరుంధతీ రాయ్ నుంచీ అసిఫా హత్యదాకా, అగ్నివేశ్ మీద దాడి నుంచి సిరియా యుద్దం దాకా – అన్నిటి మీదా జల్లేందుకు ఈయన వద్ద బురద సిద్ధంగా ఉంటుంది. టీ ఎమ్ కృష్ణ శాస్త్రీయ సంగీతంలో బ్రాహ్మిణిజాన్ని విమర్శించినా ఈయనకే కావాలి, కల్బుర్గి బసవ పురాణం గురించి కుల చర్చ చేసినా ఈయనకే కావాలి – అన్నిటికీ ఈయన వ్యతిరేకమే.
నేననుకునే దాన్ని: ‘ఇన్ని లింకులు పెట్టినా ఎవ్వరూ వాటిని చదివి స్పందించడం లేదు కదా, ఎందుకీయన అదే పనిగా చేస్తున్నాడు’ అని. కొన్నాళ్లు చూడగా అర్థమైంది, హిందూ ఛాందసవాదం తలకి పట్టిపోయిన కొందరు ఆ సమాచారం చూసి కొండందుకుపోతారు, అది ఎలాగూ ఉంది. కాని స్పష్టంగా కనపడుతున్న విషయానికి కూడా – మనకి తెలియని కోణం ఇంకేదో ఉందని భ్రమ కలిగించడం ఈయన అసలు లక్ష్యం. సందేహాలు పుట్టించడంలో కొన్ని సార్లు విజయం కూడా సాధించాడు. అటూ ఇటూ ఊగుతున్న కొందరు తటస్థవాదులు - అతని లింకులకున్న హెడింగ్ లు చదివి – ‘అది ‘అలా’ అనుకుంటున్నాం కానీ, కానీ ‘ఇలా కూడా’ అయుండొచ్చట’ అని నా ముందే డ్రాయింగ్ రూముల్లో తలలాడిస్తూ ఫేక్ న్యూస్ ప్రచారంలో తమకు తెలీకుండానే తమ వంతు సాయం చేసేరు.
చెప్పొచ్చేదేమిటంటే ఆ సర్వాంతర్యామి ఒక్కడు కాదనీ, ఆ ఐడీతో ఒక ముఠా పని చేస్తోందనీ, ప్రగతివాద చర్చలు చేసే వారి జాబితాని ఎప్పటికప్పుడు సవరించుకుంటున్నారనీ, వారిపై ఇంటలెక్చువల్ దాడి జరపడమే ఆ ముఠా ఉద్యోగమనీ – విశ్వసనీయ వర్గాల భోగట్టా.
************* ************* ***********
బెదిరించడం అనేది క్రిమినల్ అఫెన్స్ – శిక్షించదగ్గ నేరం. ఇందులో రెండో మాటే లేదు. వీటిని చట్టరీత్యా ఎదుర్కోడానికి మార్గాలున్నాయి, ఆ విషయాల్లో సలహాలివ్వడానికి నిపుణులూ ఉన్నారు. శిక్ష పడుతుందా లేదా, చర్య తీసుకున్నాకైనా బాధితులికి రిలీఫ్ దొరుకుతుందా లేదా, అసలు ఇలాటి నేరాలు ఇంత పెద్ద ఎత్తున బహిరంగంగా జరుగుతున్నాయంటే అది ఎవరి మద్దతు వల్ల అయ్యుంటుంది ఈ బెదిరింపుల ద్వారా వారేం సాధించాలనుకుంటున్నారు – అనే చర్చ ఇక్కడ చెయ్యబోవడం లేదు.
ఎవరో నియోగిస్తే, ఒక పద్ధతి ప్రకారం చేసే ట్రోలింగ్ అది, కళ్ల ముందు కనిపిస్తూ ఉంటుంది. వీటిని శిక్షించడంలో చాలా తికమకలున్నాయి కానీ గుర్తించడం మాత్రం తేలికే. తిప్పి కొట్టడానికీ మార్గాలున్నాయి. కాని ఇందాక చెప్పినట్టూ, ఏ రాజకీయ కారణం లేకుండానే కొందరు, ట్రోలింగ్ ని సమర్థించడం, తాము చేస్తున్నది ట్రోలింగేననే స్పృహ లేకుండా సోషల్ మీడియాలో ప్రవర్తించడం కనిపిస్తుంది. అసలు మనుషుల్లో ఈ ట్రోలింగ్ అనే టెండెన్సీ ఎలాటి సందర్భాల్లో ఎలా బయటపడుతుందో పరిశీలించడం ఇక్కడ నా ఉద్దేశం. రోగ నివారణ జరగాలంటే రోగ నిదానం ముందు జరగాలి. ఆ రోగ లక్షణాలేమిటో, ఏ కారణంగా వస్తాయో తెలిస్తే దానిని అరి కట్టడం తేలికౌతుంది.
అసలు ట్రోలింగ్ అంటే ఏమిటి? ఆ మాట ఎలా పుట్టింది? ట్రోల్ అంటే దుష్టుడు. విషయాన్ని దారి తప్పించడం, విభేదాలు సృష్టించడం, ఉద్రిక్తత రగిలించడం - అలాటి ఉద్దేశాలతో – సంబంధం లేని విషయాలనీ, దూషణలనీ (న్యూస్ గ్రూపు, ఫోరం, చాట్ రూం, బ్లాగ్ వంటి ఆన్లైన్ కమ్యూనిటీల్లో) పోస్ట్ చేసి - గొడవలకి దిగడం, వ్యక్తులను మానసికంగా హింసించడం – దీనిని ఇంటర్నెట్ పరిభాషలో ట్రోలింగ్ అంటారు. వాటిని చదివేవారు తీవ్రంగా స్పందించేటట్టూ, చర్చ పక్కదారి పట్టేటట్టూ చెయ్యడమే ట్రోలింగ్ లక్ష్యం.
సాధారణ మహిళలకి సోషల్ మీడియాలో తమ గొంతు వినిపించేందుకు ఆటంకాలనేకం. అవి కంప్లైంట్ ఇచ్చేంత పెద్దవీ కావు, అలా అని పట్టించుకోనవసరం లేనంత అల్పమైనవీ కావు. కాస్తో కూస్తో ప్రగతిశీల భావాలున్నవారు కూడా ఉద్రేకం వస్తే, స్త్రీలపై వ్యక్తిగత వ్యాఖ్యానాలు చెయ్యడం చూస్తూ ఉంటాం. సోషల్ మీడియా అనేదే కొత్త మన తరపు స్త్రీలకి. దానిలో ట్రోలింగ్ అనే ఇబ్బంది ఇంకా కొత్త. ఆ టెండెన్సీని బీజరూపంలో ఉండగానే పసిగట్టగలిగితే బాగుంటుందనిపించింది. సరే అట్నుంచి నరుక్కు వద్దామని – సోషల్ మీడియాలో ఆడవారి అభిప్రాయ ప్రకటనని ఆటంకపరిచిన ఉదంతాలని పరిశీలించాను. ఒకామె, ఈమధ్య రాముడి మీద జరిగిన చర్చల్లో, తన అభిప్రాయం చెప్పింది. ‘ఆధునికులనుకున్న వాళ్ల మెదళ్లలో దాగి ఉన్న ఖాళీలు బయట పడుతున్నాయీ’ అంది దానికి ఒకాయన మండిపడ్డాడు, చొక్కా చేతులు పైకి మడుచుకుని మరీ దాడికి సిద్ధమయ్యాడు.
‘ఇళ్లల్లో మొగుళ్లు పూజలు చేసుకుంటుంటే, పక్కన శంఖాలు పూరించే రకాలు ఒక్కోక్కళ్లు, ఇంట్లో చెప్పుకోలేరు కానీ బయటకి వచ్చి నీతులు చెప్తారు’ అని వెటకారం చేసేడు. అప్పటికీ కసి తీరక, ఆమె కుటుంబవివరాలు తవ్వితీసి – ‘పిటపిటలాడే మన పతివ్రతకి, తన కొడుకు పేరు ఎంచుకునే స్వతంత్రం లేకపోయిందే’ అని దాడి మొదలుపేట్టేడు. ఆ మాటల వాడకం చూస్తే, ‘నాకు గనకా కోపం తెప్పించారా - ఎలాటి మాటలైనా అనేయగలను చూసుకోండి’ అన్న అహంకారం కనిపిస్తుంది. ఆ దాడిని చదివి చప్పట్లు కొట్టినవారిలో – పేరు మోసిన రచయితలు కూడా ఉన్నారు. పురుషాధిక్యతకి దెబ్బ తగిలితే స్వయం నియంత్రణ కోల్పోడం– ఎలాగోలా అవతలివారికి బాధ కలిగించాలనిపించడం - అప్పుడు దుర్భాషల వాడకం – ఇదంతా వారికి మామూలయిపోయిందని అర్థమౌతోంది. నార్మలైజేషన్ ఆఫ్ స్లేండర్, అబ్యూజ్, బుల్లీయింగ్ – కూడా సమస్యలో భాగమే. (ఈ మాటలకి తెలుగు అర్థాల్ని వివరించడం వ్యర్థం – ఉదాహరణలే చాలు). సాధారణమైపోయిన విషయాలకి స్పందనరాదు, అదీ దురదృష్టం.
ఇంకో ఉదంతం - ఒకామె భర్తని వదిలి పెట్టి తన పిల్లలతో విడిగా ఉంటోంది. ఆమెకు అనేక మంది మగ స్నేహితులున్నారనీ, ఒకరితో ఉంటూనే వేరే వారితో సన్నిహితంగా మెలిగిందనీ, వాటికి ఋజువులు చూపిస్తామంటూ కొంత మంది చేరి అదే పనిగా దాడి చేసేరు. గుర్తు తెలియని ఐడీలతోనూ, మారు పేర్లతోనూ కూడా జరిగే ఈ వేధింపులు – ఎవరు చేస్తున్నారన్నది కూడా తెలుసుకోడం కష్టం. ఒక స్త్రీకి గౌరవం ఇవ్వాలన్నా లేక అవమానం చెయ్యాలన్నా – ఆమె లైంగికత మీదనే కామెంట్ చేసే ఈ ధోరణిని గుర్తించాలి ఇక్కడ. ఈ రెండు సందర్భాలలోనూ – ఒకరి కుటుంబం పేరెత్తీ, మరొకరి నడవడి పేరెత్తీ – చేసే వ్యాఖ్యల సారాంశం – షేమింగ్ : ఏదో లోపం ఎత్తి చూపించడం, ఇలాటి వారికి మాట్లాడే అర్హత లేదని నిరూపించాలనుకోడం. కొన్ని అనుభవాలు వింటే, అవి మరీ అంత తీవ్రమైనవిపించవు గానీ, మహిళ అభిప్రాయ ప్రకటనకి ఆటంకం కలిగిందని చెప్పక తప్పదు. ఒకాయన ఒకామెను ఒక మీటింగ్ లో కలిసాడు. వారిద్దరి మైత్రీ పెరిగింది. చాలా కాలం పాటు ఆమె ప్రతీ పోస్టుకూ తన సమ్మతీ, ఒక్కోసారి సాదర ప్రశంసా జనాంతికంగా అందజేస్తుండేవాడు. ఇంతలో వారి ఈక్వేషన్ తారుమారైంది. చిక్కేమిటంటే అది సోషల్ మీడియాలో ఆమెకు పంటి కింద రాయిలా మారింది. ఆమె ఏం రాసినా ప్రశ్నించడం, విమర్శించడం చేసేవాడు. రెట్టించినపుడు ఆమె బదులివ్వక పోయినా, అతను ఆగలేదు. వేరెవరైనా ఆమెను విమర్శ చెయ్యగానే, వారి పక్షాన చేరి ‘అవునండీ, నేనూ అదే అంటున్నాను’ అని మళ్లీ వ్యాఖ్యలు– ఇలా సాగింది ఆయన ధోరణి. మీరు నా అస్మదీయ వర్గంలో లేకుంటే, నేనెంత ఇబ్బంది పెట్టగలనో చూపిస్తాననే మొండితనం అది. అదే పని ఒక పురుషుడితో ఆయన చేస్తాడని అనుకోను.
మరొక ఉదంతం – ఒకాయన, అభ్యుదయ భావాలున్న వ్యక్తి, మంచి కవితలు రాస్తాడు, ఫేస్ బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు ఈమెకు. అతని అవగాహనలో మంచి స్పష్టత ఉన్నదని అనుకునేది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయం అయింది. స్నేహితుడనే భావించేది. ఆయనా గౌరవంగా ఉండేవాడు. ఇదిలా ఉండగా - ఒక వృద్ధ రచయిత సన్మానాలు పుచ్చుకోడాన్ని నిరసిస్తూ చాలా మంది ఫేస్ బుక్ పోస్ట్ లు పెట్టేరు. ‘అలా ఆయన సన్మానాలు పుచ్చుకోడాన్ని నేనూ సమర్థించను గానీ, ఆయన్ను విమర్శ చేసే పద్ధతి ముతకగా ఉంది, అది నాకు నచ్చదు’ అని ఆమె పోస్ట్ రాసుకుంది. ఆ ఫ్రెండ్ చదివి, మావి ‘ముతక’ రాతలంటారా అని కోపం తెచ్చుకున్నాడు. చిన్న పాటి డిబేట్ జరిగేక, ఆమె ఆ మిత్రుడిని అన్ ఫ్రెండ్ చేసింది. దానితో అతని వైఖరి పూర్తిగా మారిపోయింది. అన్యాపదేశంగా సంబోధిస్తూ పోస్టుల పరంపర ప్రారంభించేడు. ఒక విషయంలో అభిప్రాయ భేదం వస్తే, అవతలి వారి ప్రవృత్తినే శంకించడం, వ్యక్తిగత విమర్శలకి దిగడం – ఈ పెడసరపు ధోరణి మనకి తరుచూ కనిపిస్తూనే ఉంటుంది. బయట మార్కెట్ లో రొమ్ము విరుచుకు తిరిగే రౌడీలు గుర్తొస్తారు కొందరి వైఖరి చూస్తే. ఈ పేట అంతా మాది, మీరు ఇక్కడ తిరగాలనుకుంటే మమ్మల్ని తప్పుకు తిరగండి అని చెప్తున్నట్టుంటాయి వారి రాతలు.
*************** **************** *****************
స్త్రీల ఆలోచనాశక్తినీ, ఆసక్తినీ, ఆత్మవిశ్వాసాన్నీ కుంటుపరిచే ధోరణులు అనాదిగా ఉన్నాయి, మారుతున్న సమాజంలో అవి ఏయే కొత్త రూపాల్లో బయట పడుతున్నాయో మగవారి స్పందనలో తెలుస్తుంది. అలాటి వ్యక్తిగత అనుభవాలను కొంత మంది పంచుకున్నారు. ఒకామె ఎక్కడో దూరదేశంలో విప్లవ పోరాటం జరిగిన స్థలానికి వెళ్లి, మహోదాత్తమైన చరిత్ర మరో సారి గుర్తురాగా – అత్యుత్సాహంతో – తనకు వింతగా తోచిన ఒక్కొక్క అంశానికీ ఫొటోతీసి, దాని గురించి అక్కడి వారు చెప్పిన వివరాలని జతపరిచి – తాను పొందిన ఉత్తేజాన్నంతా పొందుపరిచి ఒక పోస్టు రాసిందట. దానికి ఒక మేధావి మిత్రుడు ఇలా స్పందించాడట: ‘పోన్లే ఇన్నాళ్లకి ఇల్లు కదిలి కాస్త నాలుగు వైపులా చూస్తున్నావ్, బొత్తిగా నూతిలో కప్పలా ఉండి పోకుండా’ – అన్నాడట. ఆమె రాసిన ఏ అంశమూ అతనికి ఆసక్తి కలిగించ లేదే అని ఆమె నిర్ఘాంతపోతూనే ఉంది. ఆమె అంటుందీ – అతను చేసింది దాడి కాక పోవచ్చు గానీ అది నా ఆలోచననీ, మాటలనీ చిన్నబుచ్చడమే అంటుంది.
ప్రపంచాన్ని వారి సొంత దృష్టితో పరికించి, తమవైన ఆలోచనలని షేర్ చేసుకునే సందర్భంలో – మహిళకి ఎదురయ్యే సమస్యల్ని చాలా మంది గుర్తించేరు. ఒకామె తన మితృడి గురించి ఇలా చెప్పింది - ఏదన్నా చర్చలో ఆమె తనకి తోచిన పాయింట్ చెప్పగానే – ఆయన – ‘అబ్బే ఇది పాతికేళ్ల నుండీ నలుగుతున్నదే నండీ, ఇందులో కొత్తేం లేదు’ అని చప్పరించేస్తాట్ట. ‘ఏదో మీరిప్పుడు మేలుకున్నారు గానీ దీనిలో చర్చించేదేం లేదు’ అని తేల్చేస్తాడట. ఆమెను మాట్లాడనీయకుండా - ఫలానా ‘ఇది’ ‘అదిగో’ ఫలానా ‘దాని’ వల్ల వస్తుందని బోధిస్తాడట. ఆడవారికి ఉండే ప్రపంచావగాహన గురించి అంత తేలిక అభిప్రాయం. ఇలాటి ధోరణులని చూసి చూసి విసిగిన జనం mansplain, maneturrption అనే కొత్త పేర్లు కాయిన్ చేసుకున్నారు. మళ్లీ ఆయనే ‘తెలుగుస్త్రీలలో ఒరిజినల్ గొంతులూ లేవండీ, అసలు రావడమే లేదు’ అని అంగలారుస్తూ ఉంటాడట, ఆడవారు మాటాడేదానికి అడ్డుపడుతూ ఉంటే – వారి కొత్త గొంతులు ఎలా వినపడతాయి?
మరొకామె – ఇద్దరు మేధావి మిత్రుల గురించి చెప్పింది, ఒక మిత్రుడికి తాను రాసిందేదన్నా పంపి అభిఫ్రాయం చెప్పమంటే – అతను తాను ఆ విషయం గురించి ఎప్పుడెప్పుడు ఏ రచనలు చేసాడో, ఏయే ప్రసంగాలు చేసేడో – వాటి వివరాలు పంపుతాడట, కానీ చదివి అభిప్రాయం మాత్రం చెప్పడంటుంది. రెండో ఆయన ఏది చర్చించాలన్నా - ఈ ఆలోచనలూ, అభిప్రాయ ప్రకటనలూ, చర్చలూ కేవలం వృధా అనే విధంగా మాట్లాడతాడట. చాలా మందికి ఆడవారి సృజనా శక్తి మీదా, విశ్లేషణ మీదా చిన్నచూపు, అదే సోషల్ మీడియాలో వారి కామెంట్లలో కనిపిస్తూ ఉంటుంది. మనం చెప్పాలనుకున్న అంశం నిరర్థకమేమో, మనం ఏది మాట్లాడితే ఎవరు ఏ రకమైన కామెంట్ రాస్తారో అనే బెరుకు స్త్రీలలో పెరగడం – ఏ మాత్రం మంచిది కాదు.
మేల్ బాషింగ్ చేయడానికి, మగవారిని విమర్శించేందుకు కాదు - ఈ వ్యాసం. కొన్ని తప్పు ధోరణులని ఎత్తి చూపించడం కోసం మాత్రమే. ఆ మాటకొస్తే, ఈ ధోరణులని అలవరుచుకున్న ఆడవారి వల్ల కూడా తోటి స్త్రీలకి అసౌకర్యం కలుగుతూ ఉంటుంది. ఇన్ బాక్స్ ల్లోకి వెళ్లి మరీ గదమాయించీ, బెదిరించే ఆడవారి గురించి వింటూ ఉన్నాను.
అలాగే - మనస్ఫూర్తిగా వారి అనుభవాన్నీ, పరిజ్ఞానాన్నీ – అడిగినప్పుడల్లా పంచి ఇవ్వడమే కాదు, మనం చెప్పేదానికి , ‘చెవి’ని కూడా ఇవ్వగలిగిన పురుషులు చాలా మంది ఉన్నారు. తన సొంత గొంతు వినిపించి, తన ఆలోచనలకి అక్షరరూపం ఇచ్చిన ప్రతీ మహిళా – ఆ ప్రయాణంతో తమకి తోడుగా నిలిచిన స్నేహితుల పేర్లు చెప్పినప్పుడు వాటిలో తప్పకుండా కొన్నైనా మగవారి పేర్లు ఉంటాయి. ‘నా మాట సావధానంగా విని, ఓహో మీరలా అనుకుంటున్నారా, మరి నేనిలా అనుకున్నాను’ అంటూ నాతో గౌరవపూర్వకంగా విభేదించిన వ్యక్తులని కొందరిని నేను స్వయంగా ఎరుగుదును - వారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు.
‘సోషల్’ మీడియా కి ఒక ఎటికెట్ (మర్యాద) పాటించడం తప్పనిసరి. దానిని ‘పర్సనల్’ వ్యాఖ్యానాలకి దూరంగా ఉంచితే ఆరోగ్యకరంగా ఉంటుంది. స్త్రీలు ఆ మాధ్యమంలో పాల్గొంటున్నప్పుడు, వారి మీద వ్యక్తిగత వ్యాఖ్యానాలు చెయ్యడం – ఆమె భావ ప్రకటనా స్వేచ్ఛకి ఆటంకం కల్పించడమే – అని నమ్మి ఆచరించాలి. దాని కోసం విరివిగా చర్చలు జరగాలి. నిన్నో మొన్నో ఒక వర్ధమాన మళయాళ నటుడి ఇంటర్వ్యూ విన్నాను. లింగ వివక్ష గురించి మాట్లాడే ‘విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ అనే సంస్థ గురించి మీ అభిప్రాయమేవిటని ప్రశ్న వేసేరు. ‘అలాటివి ఏర్పడటం శుభసూచకం, మరింత బలపడాలని కోరుకుంటాను’ అని చెప్తూ – ఇంకా ఇలా అన్నాడు. ‘ఈనాడు మా తరం మగవాళ్లు ‘కరెక్ట్’ మాట్లాడడం నేర్చుకుంటున్నామంటే దానికి కారణం – ఎవరో ఒకరు తప్పుని ‘తప్పు’ అని చెప్పినందువల్లే, ఎవరూ చెప్పకపోతే మేమింకా అలాగే మాట్లాడుతూ ఉండేవారిమేనేమో” అన్నాడు. ‘ఇదిగో, ఈరకమైన ప్రవర్తన ఆడవారికి ఇబ్బంది కలిగిస్తుంది’ అని చెప్పడం అత్యావశ్యకం.
కొందరు శ్రేయోభిలాషులు – ‘ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు అరుస్తాయి, దానికేముందండీ, వాటిని పట్టించుకోనక్కర లేదు’ అని సలహా ఇస్తారు. కానీ మనం మాట్లాడాల్సింది ఏనుగు ఏం చేసి ఉండాల్సిందో అనేది కాదు. అందుకే ఈ వ్యాసంలో – ఇబ్బందికి గురైన ఆడవారేం చేసారో, ఎలా వ్యవహరించారో చెప్పడం అవసరం అనుకోలేదు. వీరిలో ఏ ఒక్కరూ కూడా - ఇబ్బంది వచ్చింది కదా అని వెనుకంజ వెయ్యలేదు, మాట్లాడడం మానలేదు. కానీ వారి గొంతు వినపడనీయకుండా చేసే కారుకూతల్ని మనం నిర్లక్ష్యం చెయ్యకూడదు... సమస్యకి పరిష్కారం వ్యక్తిపరంగా కాదు వెతకాల్సింది. సమాజపరంగా మనం ఆ అరుపుల గురించీ, వాటి వెనకనున్న స్వభావాల గురించీ ఆలోచించాలి.