
మరణ వాంగ్మూలాన్ని ఎలాటి కరుడు కట్టిన న్యాయస్తానాలైనా అతి పవిత్రంగా భావిస్తాయని విన్నాను. మనం మాత్రం, అతని తుది లేఖ చదివాక కూడా ప్రశ్నలు లేవనెత్తగలిగిన మేధావులం. వెళ్లిపోయిన రోహిత్ వెనక్కు వచ్చి మన కుసంస్కారాన్ని చక్కదిద్దలేడు కానీ రోహిత్ కు జన్మనిచ్చి, అతని మరణం అర్ధరహితం కాకుండా కాపాడేందుకు అతని సహచరులతో శిబిరం లో కూర్చున్న ఆ ‘రాధిక’ మన కేమైనా నేర్పగలుగుతుందేమో... ఒకసారి ఆమె జీవితాన్ని పరికిద్దాం.

రోహిత్ మరణానంతరం రాధికకు మనం కలిగించగలిగే ఉపశాంతి ఆమె కులం
గురించిన చర్చలే ఐనట్టయితే సరే, అవే చేద్దాం. రిజర్వేషన్ల ప్రాతిపదిక ఏమిటో
ఒక్క సారి గుర్తు చేసుకుందాం.
శతాబ్దాల తరబడి కొందరి జీవితాలు హెచ్చు సౌకర్యాలతో గడిచేందుకు, మరెందరి జీవితాలనో
తరతరాలుగా దుర్భరం చేసిన ఒక దుష్ట సంప్రదాయాన్ని గుర్తించాం. మనుషులందరికీ సమానమైన
సాంఘిక, ఆర్ధిక, రాజకీయ అవకాశాలు ఉండాలని
నమ్మేం. ఆ సమానత్వాన్ని సాధించడానికే రిజర్వేషన్లన్నాం. ఔనా?
మరి - ఒక ‘పేద దళిత స్త్రీ’ గా జీవితం లోని ప్రతీ
ఒక్క మజిలీ లోనూ తనకు జరుగుతున్న అన్యాయానికి ఎదురీది నిలిచిన ఈ రాధిక కంటే అణగారిన
వర్గాలకు ప్రాతినిధ్యం వహించగలిగినది ఎవరు? ఆమె కన్నా, ఆమె సంతానం కన్నా రిజర్వేషన్లకు
అర్హులెవరు?

ఆ కొడుకు జీవించి ఉండగానే -
తన ఆత్మ తన శరీరానికి ఎడమై పోతోందని తల్లడిల్లిపోయాడనీ,
ప్రేమభావన అతని హృదయాన్ని అను నిత్యం గాయపరుస్తూనే ఉన్నదనీ,
భరించలేని వేదన అతని జీవితాన్ని అలుముకుందనీ తెలిసాక – ఆ స్త్రీ మనసు చేసే
ఆర్తనాదానికి స్పందించే ‘సౌకుమార్యం’ మనకు ఉండకపోయిందా?
పిల్లల తో పాటూ తానూ చదివి పరీక్షలకు కూర్చున్న ఆమె పఠనాసక్తినీ, జ్ఞాన పిపాసనూ చూసి
గర్వపడలేమా మనం?
కుట్టుపని చేసి తన రెక్కల కష్టంతో పిల్లలను సాకిన ఆమె శ్రమశక్తి
విలువను అంచనా కట్టే ప్రయత్నం చెయ్యక పోయామా మనం?
తన కులం మనిషి కాదన్న కారణం చూపిస్తూ తనని హింసించిన వాడిని
వదిలిపెట్టి జీవించే ఆమె స్వశక్తి మీద కొండంత గౌరవం కలగక పోయిందా మనకు?
కొడుకు దూరమైనందుకు కుప్పకూలి పోకుండా, నిలిచి రాజ్యాన్ని
ప్రశ్నిస్తున్నది. అందుకే కదా ఆమె గతాన్నీ, కులాన్నీ రచ్చకెక్కించేదీ, ఆమె గొంతును వినపడకుండా
చేయాలనుకునేదీనూ.
దీనిని మనం గుర్తించ గలిగిన్నాడు “తన జన్మమే ఒక ప్రాణాంతక
ప్రమాదం” అని రోహిత్ రాసిన వాక్యం మనకు శూలంలా గుచ్చుకోక
మానదు. అప్పుడు, ఆ తల్లి కష్టాలను తానూ పంచుకుని, ఆమెకు జరిగిన అవమానాలకు
తానూ కించపడి, వాటిని అధిగమించి, తన మేధోశక్తితో స్కాలర్షిప్ప్లు
సంపాదించి ఆమెకు చేదోడు వాదోడు గా ఎదిగి నిలిచిన రోహిత్ చరిత్ర మనకు ఇంకా బాగా అర్ధం
అవుతుంది.
రాజకీయాల పొగలో చూపు మసక బారి, ముఠాకోరుల అబద్ధాల
వల్ల హృదయాలు బండ బారిన మనతో, తనకు గోచరమౌతున్న‘ఖాళీతనం’ గురించి వివరించలేక
రోహిత్ శాశ్వతంగా తన నోరు నోక్కేసుకున్నాడు.
చనిపోయే క్షణాల్లో కూడా న్యాయాన్యాయాలను గురించీ, విజ్ఞాన సిద్ధాంతాల
గురించీ వివేచన చేసాడు. మిత్రుల కారుణ్యాన్నీ, వారి బాగోగుల గురించీ
తలపోసాడు తప్ప తన దుస్తితికి బాధ్యులైన వారి పేరు సైతం తన 'తుది లేఖ'లో రాయలేదు. వ్యక్తి
స్థాయిలో వారు కలిగించిన నష్టం కంటే, వ్యవస్థ లో భాగంగా
మారి వారు చేసే హింసనూ, పీడననూ స్వయంగా అనుభవించాడు కనకేనేనేమో.

అతని మరణ వాంగ్మూలాన్ని చదివిన తర్వాత కూడా...
సామ్య వాదమంటే – ధనికులను ద్వేషించడం
అనీ,
దళిత వాదమంటే – అగ్రవర్ణాల మీద ద్వేషం
అనీ,
స్త్రీ వాదమంటే – పురుషులను ద్వేషించడం
అనీ ... ... ... నమ్ముతూనే ఉండిపోదామా? రోహిత్ గుర్తించిన
సత్యాన్ని మనమూ గుర్తించ వద్దా? వ్యవస్థ లో పాతుకుపోయిన వివక్షా, దానికి అనుగుణమైన భావజాలమూ
- వాటిని పాటించే మనుషుల కంటే కూడా శక్తివంతమైనవనీ, అతి ప్రమాదకరమైనవనీ
తెలుసుకోవద్దా ఇకనైనా?
అతని లేఖను చదివి, స్పందించిన వారు గుర్తించాల్సినదీ, పోరాడవలసినదీ – అతని మరణానికి కారణమైన
ఈ వ్యవస్థ తోనే, అది సరఫరా చేసే భావజాలం తోనే, వ్యక్తులను ‘గుంపులు’ గా తయారు చేసే దాని
కుట్రలతోనే.
రోహిత్ వేసిన ప్రశ్నలకు జవాబు దొరికేదాకా అతని మరణాన్ని మనం
స్మరిస్తూనే ఉండాలి.