Thursday, 13 December 2018

బుల్లీయింగ్‌తో తలపడుతున్న తల్లులు

బిడ్డలు బయట ఎదుర్కొనే వేధింపులు, అవమానాలు తల్లులను బాధ పెడతాయి. అన్నీ సరిగ్గా ఉన్న చోట పిల్లలు ఆరోగ్యంగా సమాజంతో సంపర్కం అవుతారు. అన్నీ అపసవ్యాలు, వివక్షతలు ఉన్న చోట పిల్లల కోసం తల్లులు యుద్ధం చేయాల్సి వస్తుంది. - " బుల్లీయింగ్‌తో తలపడుతున్న తల్లులు " - ఏప్రిల్ నెల మాతృకలో ...

“ఈ పోరాటం ఎవరో ఒక తల్లిది అనుకోవద్దు. మనందరిదీ” – ఢిల్లీలో ఉండే రచయిత్రి నాజియా ఏరుం – తన పుస్తకం Mothering A Muslimని ఈ వాక్యాలతో మొదలుపెట్టింది.
ఆమె పుస్తకానికి కీలకం - స్కూలు కేంపస్‌లలో మత ప్రాతిపదికన జరుగుతున్న bullying (వేధింపు), పిల్లలపై దాని ప్రభావమూను. 12 నగరాలలోని స్కూళ్లకు వెళ్లి పిల్లల తలితండ్రులతో ఆమె ఈ అంశం గురించి మాట్లాడింది. బుల్లీయింగ్ అనేది ఢిల్లీకే పరిమితం కాదనీ, హైదరాబాద్, బెంగలూరు, పూనే, ముంబయి వంటి అనేక నగరాలలోనూ, పుస్తకం కోసం రీసెర్చ్ చేసినప్పుడు – దీని చిహ్నాలు కనపడ్డాయనీ ఆమె చెప్తోంది.
మతద్వేషాలు కలిగించే హాని గురించి తెలియనివారుండరు, మరి ఈ విషయంలో మనం ఆలోచించాల్సిన కొత్త అంశం ఏమిటి అంటే – ఇక్కడ బాధితులు పిల్లలు. పిల్లలు ఫిర్యాదులు చెయ్యరు. చిన్న పిల్లలకైతే - అవమానం అర్ధమయ్యే వయసు కాదు, పెద్ద పిల్లలకైతే - సహాయం అడగడానికి అహం అడ్డుపడుతుంది. గత రెండు దశాబ్దాలుగా వస్తున్న మార్పులకు పిల్లల స్పందన ఏమిటన్నది ఇంత వరకూ ఎవ్వరూ రాసి ఉండని విషయం.
బుల్లీ చేసే పసిపిల్లలకి చాలా సార్లు తాము యధాలాపంగా వాడే పాకిస్తానీ, ఐసిస్ అన్నమాటలకు అర్ధాలు కూడా తెలియదు, బుల్లీ అవుతున్న పిల్లలకీ తెలియదు – కానీ ఆగొంతుల్లో పలుకుతున్న అవమానం స్పష్టంగా తెలుస్తుంది. ముస్లిం క్లాస్మేట్ల పట్ల ఆపిల్లల ప్రవర్తన ఆయా స్కూళ్ల దృష్టిలోకి కూడా రాలేదని ఏరుం రీసెర్చిలో తెలుసుకుందట.
“అరే, వీడు ఉగ్రవాదిరా ... నాలుగు తగిలించండి! ఒరే పాకిస్థానీ … పోరా అవతలికి!” అనే ఛీత్కారాలు స్కూళ్లలో సాధారణమై పోతున్నాయని, ఆ వాతావరణంలో పెరిగి పెద్దయిన పిల్లలకి సంఘటనలు మరుపున పడ్డా, శాశ్వతంగా వారి మనస్సులపై గాటు పడుతుందని నాజియా ఏరుం ఆందోళన. విద్యాసంస్థల్లో మతపరమైన ద్వేషాలను ఎదుర్కోడానికి, తల్లిదండ్రులకు ధైర్యాన్ని అందించాలన్న ఆశయంతో ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టింది.
అసలలాటి వేధింపులు జరుగుతున్నాయనే చాలా తల్లులకు తెలియదంటోంది ఆమె, దానికోసమే #MotherAgainstBullying అనే పిలుపునిస్తోంది. ఏ తల్లీ తెలిసి తెలిసీ తన పిల్లలకు ద్వేషం నూరిపొయ్యదని ఏరుం ప్రగాఢ విశ్వాసం. అందుకే సోషల్ మీడియా సైట్లలోని తల్లుల గ్రూపుల్లో ఈ అంశం గురించి చైతన్యం పెంచాలని ఆమె ప్రయత్నిస్తోంది.
ఈ ఉద్యమం ముస్లిం పిల్లలకు ప్రత్యేకమనే భావనను ఏరుం బలంగా వ్యతిరేకిస్తుంది – ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న ప్రతీ ఒక్క పసిప్రాణి కోసం అంటుంది. ఎందుకంటే – ద్వేషం ప్రతీ ఒక్కరినీ మింగేస్తుంది. ఎవరినీ విడిచిపెట్టదు. బాధపెట్టే వారు, బాధపడేవారూ – కూడా వ్యాకులిత వాతావరణంలోనే పెరుగుతారనే సత్యాన్ని గుర్తించాల్సి ఉంది అందుకే ఇది ప్రతీ ఒక్క పిల్లకూ సంబంధించిన సమస్య– ఇవాళ మన పిల్ల బుల్లీ చెయ్యబడొచ్చు, రేపు ఆమే ఒక బుల్లీగా మారొచ్చు, మన పిల్లలు పెట్టేవారౌతారా, పడేవారౌతారా అనేది మనం ఊహించనుకూడాలేం, అది మరింత భయపెట్టే విషయం.
మీ ఐదేళ్ల పసిపిల్ల, మీ పదిహేనేళ్ల పిల్లవాడు – కేవలం మరో మతానికి చెందుతారన్న కారణం చేత – ఇతరులను అవమానించాలని మీరు కోరుకుంటారా? అని సూటిగా ప్రశ్నిస్తుంది. ఈ పుస్తకాన్ని Mothering a Muslim అనే కన్నా, “Parenting A Muslim” అనడం సమంజసంగా ఉంటుందనుకుంటా. అయితే ఈ పేరు పెట్టడానికి కారణం ఉంది. పిల్లల ముచ్చట్ల మాటల్లోను, వారి పెంపకం గురించిన ప్రసంగాలలోను ముస్లిం తల్లుల ప్రసక్తి ఎక్కడ కనబడలేదంటుంది నాజియా ఏరుం. ముస్లిం పురుషుల గురించి ఉంది, ముస్లిం మహిళల గురించీ కనిపిస్తోంది, కానీ ముస్లిం తల్లి ఎక్కడా కనిపించడం లేదు, తక్కిన వారితో పోలిస్తే ఒక తల్లిగా ఆమె ఎదుర్కొనే కష్టనష్టాలెటువంటివి, ఒక ఆధునిక మహిళగా నాతోటి ముస్లిం మహిళల కథనాలేమిటని తెలుసుకోవాలనుకుని ఈ ప్రయాణం మొదలు పెట్టాను. ఒకరి కథలను మరొకరికి వినిపించడం ద్వారా ఒకరి నుండి మరొకరం నేర్చుకోవచ్చంటుంది ఏరుం. ఉదాహరణకి - ఒక తల్లి తన బిడ్డతో చెప్పిందట, “పాకిస్తానీవి అనంటే మరేం తప్పు కాదులే, అది కూడా ఒక దేశమే, కానీ నువ్వు పాకిస్తానీవి కాదు, ఇండియన్‌వి” – అని. ఈసమాధానం నాకు నచ్చింది అంటుంది ఏరుం.
“మీ అమ్మా నాన్నా బాంబులు చేస్తారా?”
“అల్ కాయిదాను సపోర్ట్ చేస్తావా?”,
“మీ నాన్న తాలిబాన్ వాడా? మమ్మల్ని షూట్ చేస్తాడా?”
ఈ ప్రశ్నల్లో అంతులేని భయం కనిపిస్తోందా? అలాటి భయభ్రాంతులకి గురయ్యే వారిలో మన పిల్లలూ ఉండొచ్చని మనం గుర్తించాలి. ఎందుకంటే అవి వేసేది ఏదో చదువులేని పల్లెటూరి పిల్లలు కాదు, దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో లక్షలకి లక్షలు పోసి వెళ్లిన పిల్లలు. “దీనిలో మనం చూడాల్సినది క్లాస్ రూంలని మాత్రమే కాదు, ఒక సమాజపు ప్రతిబింబాన్ని,” అని ఏరుం రాస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో నాయకులుగా ఎన్నికైన వ్యక్తులు, తమ మత అహంకారాన్ని దాచుకోకుండా, సమాజంలోని ఒక వర్గం పట్ల తమ ద్వేషాన్ని పచ్చిగా బయటపెడుతుంటే - తమ పిల్లల భవిష్యత్తుపట్ల ఆందోళన చెందాల్సి ఉందని ఆమె ప్రతీ పేరెంట్‌కూ పిలుపు నిస్తోంది. మగవారూ, అన్ని మతాలవారూ కూడా చదివి ఆలోచించాల్సిన అంశం.
కాని ఈపుస్తకం లక్ష్యం మెజారిటీ రాజకీయాల గురించి మాట్లాడడం కాదంటుంది ఆమె.
వైర్ మేగజీన్ కిచ్చిన ఇంటర్వ్యూలో అలీషా మతరుతో మాట్లాడుతూ, మారిన పరిస్థితుల్లోకి నెట్టబడుతున్న పిల్లల గురించే ఈ పుస్తకం అని చెప్పింది. తమ సొంత దేశంలో ‘ఇతరులు!’ అని వారిపై పడుతున్న ముద్ర గురించి - అని వివరిస్తుంది. స్కూళ్లలోకి పాకిన ఆ వ్యాధి గురించి ఏరుం ఒక జర్నలిస్ట్‌ చూపుతో వార్తాచిత్రంగా ఈ పుస్తకాన్ని మలిచింది.
దీనిలో రెండు భాగాలున్నాయి. స్కూళ్లలోనూ, ఆట స్థలాల్లోనూ - వారి ముస్లిం అస్థిత్వాలను నిత్యం గుర్తుచేస్తూ, అందరినీ ఒక గాటనే కట్టే మతేతరుల వైఖరి గురించి మొదటి భాగంలో చర్చించానని ఏరుం చెప్పింది. ఇక పిల్లలు ఇంటికి వచ్చాక ‘నీ మతాచరణ చాలదని, నీలో తగినంత మతం లేద’ని నిత్యం గుర్తుచేసే తోటి మతస్తుల గురించి రెండో భాగం పరిశీలన చేస్తుంది. ఇలా పిల్లలకి చెరో వైపు, చెరో మూసా పట్టుకుని అందులోకి లాగేందుకు లోనుంచి, బయట నుంచి జరుగుతున్న ప్రయత్నాలు మన కళ్లముందుకొస్తాయి. ఆ ఒత్తిళ్ల మధ్య ముస్లిం పిల్లలు నలుగుతున్నారన్నది – ఆమె చేసిన రీసెర్చి సారాంశం.
ఇలా నలుగుతున్న పిల్లలు కొందరు, అదే తమ నిజమైన అస్తిత్వం అని భావించి మతాన్ని మరింత గట్టిగా పట్టుకుంటున్న దృష్టాంతాలున్నాయి. కొందరు తమ వస్త్రధారణని మార్చుకుంటే, ఇంకొందరు మత గ్రంధాల్లో మరింత ఆసక్తి చూపిస్తుంటారు. సామూహికంగా మనం చేస్తున్న ప్రయాణాన్ని గురించి చెప్పే ఇలాటి పుస్తకాలు ఇంకా రావలసిన అవసరం ఉంది. అసలిలాటి ప్రమాదకరమైన స్థలానికెలా చేరామో సూక్ష్మంగా విశ్లేషిస్తూ – లెన్స్‌ని లోపలికి కూడా తిప్పి చూస్తుంది. ఇస్లాం గురించిన వ్యాఖ్యానాలలో, వివరణల్లో – కొద్దిపాటి వైవిధ్యాన్ని కూడా సహించలేని ముస్లింల గురించి పుస్తకంలోని ఒక భాగంలో చర్చ చేస్తుంది. దానికి కారణం సౌదీ అరేబియన్ నమూనా మతాన్ని దిగుమతి చేసుకోడం అని ఆమె అభిప్రాయపడుతుంది.
ఇరవయ్యో శతాబ్దం వారిమని ఒకప్పుడు నమ్మే పిల్లలు నాజియా ఏరుంతో చెప్పేరట, “18ఏళ్ల పాటు మాతో కలిసి పెరిగిన వారికి హఠాత్తుగా మేం పరాయివారిమై పోడం చూసాం, సరే, మేం ముస్లింలం మాత్రమే అయితే, పూర్తి ముస్లింగానే ఉండడం నయం కదా, కనీసం ఏదో స్థానానికి చెందినవారిమౌతాంగా” అన్నారట.
తిండి కూడా అంతవరకూ లేని కొత్త హద్దుల్ని కల్పిస్తోందట. 12ఏళ్ల పిల్లవాడొకడు, “నీ టిఫిన్ డబ్బాలోంచి తిననురా, నువ్వు బీఫ్ తింటావుగా” అనడం గురించి చెప్తూ, అంత కంటే వింత విషయం ఇంకొకటి ఉందని చెప్తుంది. టాప్ స్కూల్లో కేజీ చదువుతున్న ఒక అయిదేళ్ల పసివాడిని, “నువ్వు ముస్లింవా?” అని అడిగితే – దానికి ఆబాబు “ఔను, కాని నేను బీఫ్ తినను!” అని చెప్పేడట. అంత అమాయకమైన ఆమాటకు ఎలా స్పందించాలో ఆపిల్లవాడి తల్లికి కూడా తెలియలేదట. “ఇంట్లో మేం టీవీ చూడం, వార్తలకోసం కూడా టీవీ పెట్టం, పేపరు చదువుతాం, ఎప్పుడూ ఆవిషయం మాట్లాడుకోనుకూడా లేదు, మరి వాడు బీఫ్ తినడన్న విషయం వాడికెలా తట్టిందో తెలియద”ని అంటుందామె.
అలీషాతో మాట్లాడుతూ ఏరుం ఇలా అంటుంది: “చాలా మంది తల్లులు ‘అబ్బే, మాపిల్లలకెప్పుడూ బుల్లీయింగ్ సమస్య రాలేద’ని చెప్తారు. వారి పిల్లలు వచ్చి ‘అమ్మా, నీకింత వరకూ చెప్పలేదు, ఫలానా రోజున ఇలా ఇలా జరిగింది, నన్ను వాళ్లు బాగా బుల్లీ చేసార’ని గనకా చెప్తే - బహుశా ఆతల్లులు నివ్వెరపోయి, ఇబ్బందిగా మొహం పెడతారనుకుంటా. ఆ ఇబ్బందితోటే మరి ఆపిల్లలు మరి నోరిప్పకుండా చేస్తారేమో. పిల్లల శరీరానికి గాయం అయితే మందు పూస్తామా లేక రకరకాల దుస్తుల వెనక దానిని దాచే ప్రయత్నం చేస్తామా. మరి పిల్లల మనసులకు గాయమౌతూంటే మాత్రం ఎందుకు గుర్తించడానికి ఇష్టపడం? దానికి కారణమైన సమాజంలోని ఛిద్రాలను – బయట పడకుండా అందమైన మెరమెచ్చు మాటల వెనక కప్పాలని చూస్తున్నాం!”
అదే ఈ పిల్లలు ఆర్ధికంగా వెనకబడ్డ వర్గానికి చెందిన వారైతే ఈ సమస్య మరింత దుర్భరమవుతుందనుకుంటారా అని అలీషా ప్రశ్న. దానికి ఏరుం – తప్పనిసరిగా అది పేదముస్లిం పిల్లలను మరింత బాధిస్తుందని – జవాబిచ్చింది. తల్లీతండ్రీ ఉన్నత స్థానాల్లో ఉండి సురక్షితమైన జీవితం కల పిల్లలే ద్వేషాన్ని ఎదుర్కోలేక అభద్రతకు గురౌతూంటే, వెనకపడ్డ వర్గాల పిల్లల మనోభావాలను అంచనా కట్టే పరికరాలైనా మన దగ్గరున్నాయా అని సందేహం కలుగుతుంది.
అవమానం పొందుతున్న పిల్లల తలిదండ్రులకు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియదు, ఎందుకంటే తమ ప్రవర్తనకు బాధ్యులు అవమానించే పిల్లలు కారు, ‘ఇతరుల’ పట్ల పిల్లల తల్లిదండ్రులకున్న వక్ర అవగాహన. ఇక ఆ అవగాహనకు రూపకల్పన చేసేది మీడియా, ఇంకా లోతుకి వెళ్తే విశ్వవ్యాప్తంగా, అన్ని సంస్కృతులలోనూ పెరిగిపోతున్న మతఛాందసత్వం – దానిని పెంచి పోషించేందుకు – అనేక రాజకీయకారణాలు.
సమస్య మూలాలు చాలా లోతున ఉన్న మాట నిజం. కానీ పిల్లలకు సంబంధించిన ఈ అంశాన్ని దానికదే తక్షణ సమస్యగా భావించి స్పందించాలి మనం. అసలు ఈ ద్వేషపూరిత వాతావరణం గురించి చర్చించేంత చనువూ, నమ్మకం – పిల్లలకి మన దగ్గర ఉందా అనేది ఇంకా పెద్ద ప్రశ్న. ఈ సందర్భంలో - మానవజాతినంతటినీ ఒక్కటిగా గుర్తించి, బిడ్డలందరి గురించి అమితమైన ప్రేమతో, విశ్వాసంతో, ఆర్తితో పలవరించిన చలం మనకి స్ఫూర్తి నివ్వగలడు.
ఎందుకు పసితనాన్ని సంరక్షించడం మనకు అత్యావశ్యకమో... చలం మాటల్లోనే వినండి:
ఎప్పటికన్నా ఏ జాతులన్నా, ఏ జీవులన్నా తిరగబడి తప్పించు కోగలరు.
... జంతువులు కూడా తమను తాము కాపాడుకుంటాయేమో! కానీ ఈ పిల్లలు ఎప్పుడూ సమ్మె కట్టలేరు. తెలివి తెచ్చుకోలేరు. ధిక్కరించలేరు. ప్రార్ధించ లేరు, నోరు లేదు. శక్తి లేదు. మీలో అపారమైన విశ్వాసం తప్ప.

Monday, 10 December 2018

కంట్రోల్ వయా ట్రోల్

కొత్త రకం ట్రోల్లింగ్. పైకి కనబడదు, శబ్ధం చేసినట్లు ఉండదు. నిత్యం ఫేస్ బుక్ లో ఎదుర్కొనే విచిత్రమైన బాధ - మాతృక ఆగస్ట్ సంచికలో


సినిమా, టీవీ, రేడియో, ప్రింట్ మీడియా – ఇలా దాదాపు ప్రతీ ఒక్క వేదికా పవర్ బ్రోకర్ల చేతి పనిముట్టుగా మారిన కాలంలో ప్రజాస్వామ్యవాదులు కొంతలో కొంత ఆశగా చూసేది సోషల్ మీడియావైపే. మెయిన్ స్ట్రీం మీడియా పట్టించుకోని అంశాల గురించి చెప్పడానికీ, ప్రచారమౌతున్న వార్తల నిజానిజాలు తెలియజేయడానికీ పుట్టిన ప్రత్యామ్నాయ పత్రికలు – మనని అందుకోడానికి కూడా సోషల్ మీడియా మీదనే ఆధారపడుతూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకుని మన మనసులో మాటని అతి తేలికగా నలుగురిలోనూ పెట్టగల అవకాశం సోషల్ మీడియా మనందరికీ ఇచ్చింది.
అంత మందిని ఒకే సారి రీచ్ కాగల ఆ మాధ్యమాన్ని మనలాటి సామాన్యులకి వదిలేసేంత అమాయకులా మనల్ని ఏలిన వారు? వారూ దానిని వెయ్యి కళ్లతో కనిపెడుతూనే ఉంటారు. ప్రతికూల పవనాలు వీచినప్పుడల్లా – సోషల్ మీడియా మీద పట్టు బిగిసినట్టు కనిపిస్తూ ఉంటుంది. కారణమేమిటంటే - కేవలం ఒక అభిప్రాయం కలిగి ఉన్నందుకు, దానిని ప్రకటించినందుకూ – జైల్లో పెట్టించడం, హత్యలు చేయించడం – అనుకుంటాం గానీ, మరీ అంత సులభమేం కాదు. దానికి తోడు ఎంత మందిని ఒకే సారి శిక్షించగలం, బొత్తిగా ప్రాక్టికల్ కాదు! అభిప్రాయాలని కంట్రోల్ చేసే పని ఇప్పుడు ట్రోలింగ్ పేరుతో జరుగుతోంది.
కొందరు వ్యక్తుల్ని టార్గెట్ చేసి -వీరిని రేప్ చెయ్యాలి, హత్య చెయ్యాలి అనే కామెంట్లు - బెదిరింపులు – ట్రోలింగ్ లో భాగమే. అవి ప్రతిఘటనలకి ప్రతినిధులైన వారికి ప్రత్యేకం. ఒక అంశం మీద మాట్లాడినందుకు పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోందంటే – అంత అత్యవసరమైన అంశం మీద చర్చ అని అర్థం చేసుకోవచ్చు. ఏ వాదం, నినాదం, కాజ్ ప్రజలని ఆలోచించేలా చేస్తోందో – ఆ గొంతును ట్రోల్ చెయ్యడం జరుగుతోంది. ఆ గొంతు ఎంత సహేతుకమైందైతే అంత పెద్ద మొత్తంలో మూకలదాడి జరుగుతోంది. మూక అంటే ఒకరే కాదు కదా, ఎందరో వ్యక్తుల గుంపు కదా మరి ఒకే సారి కూడబలుక్కున్నట్టు ఎలా దాడి చేస్తున్నారు అని ప్రశ్న వస్తుంది. వేలాది మందికి శిక్షణ ఇచ్చి, జీత భత్యాలిచ్చి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ఐటీ సెల్స్ ని పెట్టి మరీ ఈ ట్రోలింగ్ని జరిపిస్తున్నారని – ఋజువులతో సహా బయటపడింది.
మన తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఉదంతం ఒకటి: తెలంగాణావాదాన్ని బలపరిచిన ఒక రచయిత తన పుస్తకపు ఆవిష్కరణ సభ ఆంధ్రప్రదేశ్ లో జరుపుకోబోయేడు. ఆయన పుస్తకంలో స్త్రీలని అవమానించే భాష వాడేడనే కారణం చెప్పి, ఆ సభని జరగనీకుండా గూండాయిజం చేసి ఆపేసారు. ఆ రచయితపై దాడి కూడా చెయ్యబోయేరు. అక్కడ ఉన్న మహిళా ఉద్యమకారులు – ‘ఇది ప్రజాస్వామిక ధోరణి కాదు, ఆ పుస్తకం మీద విమర్శ పెట్టండి, లేదా మరో పుస్తకమే రాయండి, కాని ఆయనకి సభ జరుపుకునే హక్కును మీరు కాదనకూడదు’ అని అంటూ ఆ దాడిని ఆపబోయేరు. ఆ మహిళలపై ట్రోలింగ్ మొదలైంది. ఏ భాష అవమానకరంగా ఉందని, రచయిత మీద దాడి చేసేరో – అంతకు పదింతల అవమానకరమైన భాషలో – రచయితని సపోర్ట్ చేసిన మహిళల మీద దాడి చేసేరు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
ఇలా ఒక్కసారి జరిపే మూకుమ్మడి దాడి ఒకటే కాదు, చాప కింద నీరులా జరిపే ఇంటలెక్ట్యువల్ దాడి కూడా వ్యూహంలో భాగమే. దీనిని మీలో చాలా మంది చూస్తూండి ఉంటారు కూడా, కొద్దికాలంగా ఒక అజ్ఞాత ఐడీ ‘ ఏడుకొండలవాడు అనే తెలుగాయన’ – ఇంటర్నెట్లో వీర విహారం చేస్తున్నాడు. ఫేస్ బుక్ పోస్టులనించీ, వెబ్ మేగజీన్లూ, బ్లాగులూ – ఇలా ఒకటేమిటి అన్ని చోట్లా, అది చరిత్రగానీ, సంగీతం కానీ, సాహిత్యంగానీ మరేదన్నాగానీ, స్త్రీవాదం, దళితవాదం, సామ్యవాదం – ఇలాటి ప్రగతిశీలవాదపు చర్చలు ఎక్కడ జరుగుతున్నా – అక్కడ వాలి, రకరకాల లింకుల వర్షం కురిపిస్తాడు. అరుంధతీ రాయ్ నుంచీ అసిఫా హత్యదాకా, అగ్నివేశ్ మీద దాడి నుంచి సిరియా యుద్దం దాకా – అన్నిటి మీదా జల్లేందుకు ఈయన వద్ద బురద సిద్ధంగా ఉంటుంది. టీ ఎమ్ కృష్ణ శాస్త్రీయ సంగీతంలో బ్రాహ్మిణిజాన్ని విమర్శించినా ఈయనకే కావాలి, కల్బుర్గి బసవ పురాణం గురించి కుల చర్చ చేసినా ఈయనకే కావాలి – అన్నిటికీ ఈయన వ్యతిరేకమే.
నేననుకునే దాన్ని: ‘ఇన్ని లింకులు పెట్టినా ఎవ్వరూ వాటిని చదివి స్పందించడం లేదు కదా, ఎందుకీయన అదే పనిగా చేస్తున్నాడు’ అని. కొన్నాళ్లు చూడగా అర్థమైంది, హిందూ ఛాందసవాదం తలకి పట్టిపోయిన కొందరు ఆ సమాచారం చూసి కొండందుకుపోతారు, అది ఎలాగూ ఉంది. కాని స్పష్టంగా కనపడుతున్న విషయానికి కూడా – మనకి తెలియని కోణం ఇంకేదో ఉందని భ్రమ కలిగించడం ఈయన అసలు లక్ష్యం. సందేహాలు పుట్టించడంలో కొన్ని సార్లు విజయం కూడా సాధించాడు. అటూ ఇటూ ఊగుతున్న కొందరు తటస్థవాదులు - అతని లింకులకున్న హెడింగ్ లు చదివి – ‘అది ‘అలా’ అనుకుంటున్నాం కానీ, కానీ ‘ఇలా కూడా’ అయుండొచ్చట’ అని నా ముందే డ్రాయింగ్ రూముల్లో తలలాడిస్తూ ఫేక్ న్యూస్ ప్రచారంలో తమకు తెలీకుండానే తమ వంతు సాయం చేసేరు.
చెప్పొచ్చేదేమిటంటే ఆ సర్వాంతర్యామి ఒక్కడు కాదనీ, ఆ ఐడీతో ఒక ముఠా పని చేస్తోందనీ, ప్రగతివాద చర్చలు చేసే వారి జాబితాని ఎప్పటికప్పుడు సవరించుకుంటున్నారనీ, వారిపై ఇంటలెక్చువల్ దాడి జరపడమే ఆ ముఠా ఉద్యోగమనీ – విశ్వసనీయ వర్గాల భోగట్టా.
************* ************* ***********
బెదిరించడం అనేది క్రిమినల్ అఫెన్స్ – శిక్షించదగ్గ నేరం. ఇందులో రెండో మాటే లేదు. వీటిని చట్టరీత్యా ఎదుర్కోడానికి మార్గాలున్నాయి, ఆ విషయాల్లో సలహాలివ్వడానికి నిపుణులూ ఉన్నారు. శిక్ష పడుతుందా లేదా, చర్య తీసుకున్నాకైనా బాధితులికి రిలీఫ్ దొరుకుతుందా లేదా, అసలు ఇలాటి నేరాలు ఇంత పెద్ద ఎత్తున బహిరంగంగా జరుగుతున్నాయంటే అది ఎవరి మద్దతు వల్ల అయ్యుంటుంది ఈ బెదిరింపుల ద్వారా వారేం సాధించాలనుకుంటున్నారు – అనే చర్చ ఇక్కడ చెయ్యబోవడం లేదు.
ఎవరో నియోగిస్తే, ఒక పద్ధతి ప్రకారం చేసే ట్రోలింగ్ అది, కళ్ల ముందు కనిపిస్తూ ఉంటుంది. వీటిని శిక్షించడంలో చాలా తికమకలున్నాయి కానీ గుర్తించడం మాత్రం తేలికే. తిప్పి కొట్టడానికీ మార్గాలున్నాయి. కాని ఇందాక చెప్పినట్టూ, ఏ రాజకీయ కారణం లేకుండానే కొందరు, ట్రోలింగ్ ని సమర్థించడం, తాము చేస్తున్నది ట్రోలింగేననే స్పృహ లేకుండా సోషల్ మీడియాలో ప్రవర్తించడం కనిపిస్తుంది. అసలు మనుషుల్లో ఈ ట్రోలింగ్ అనే టెండెన్సీ ఎలాటి సందర్భాల్లో ఎలా బయటపడుతుందో పరిశీలించడం ఇక్కడ నా ఉద్దేశం. రోగ నివారణ జరగాలంటే రోగ నిదానం ముందు జరగాలి. ఆ రోగ లక్షణాలేమిటో, ఏ కారణంగా వస్తాయో తెలిస్తే దానిని అరి కట్టడం తేలికౌతుంది.
అసలు ట్రోలింగ్ అంటే ఏమిటి? ఆ మాట ఎలా పుట్టింది? ట్రోల్ అంటే దుష్టుడు. విషయాన్ని దారి తప్పించడం, విభేదాలు సృష్టించడం, ఉద్రిక్తత రగిలించడం - అలాటి ఉద్దేశాలతో – సంబంధం లేని విషయాలనీ, దూషణలనీ (న్యూస్ గ్రూపు, ఫోరం, చాట్ రూం, బ్లాగ్ వంటి ఆన్లైన్ కమ్యూనిటీల్లో) పోస్ట్ చేసి - గొడవలకి దిగడం, వ్యక్తులను మానసికంగా హింసించడం – దీనిని ఇంటర్నెట్ పరిభాషలో ట్రోలింగ్ అంటారు. వాటిని చదివేవారు తీవ్రంగా స్పందించేటట్టూ, చర్చ పక్కదారి పట్టేటట్టూ చెయ్యడమే ట్రోలింగ్ లక్ష్యం.
సాధారణ మహిళలకి సోషల్ మీడియాలో తమ గొంతు వినిపించేందుకు ఆటంకాలనేకం. అవి కంప్లైంట్ ఇచ్చేంత పెద్దవీ కావు, అలా అని పట్టించుకోనవసరం లేనంత అల్పమైనవీ కావు. కాస్తో కూస్తో ప్రగతిశీల భావాలున్నవారు కూడా ఉద్రేకం వస్తే, స్త్రీలపై వ్యక్తిగత వ్యాఖ్యానాలు చెయ్యడం చూస్తూ ఉంటాం. సోషల్ మీడియా అనేదే కొత్త మన తరపు స్త్రీలకి. దానిలో ట్రోలింగ్ అనే ఇబ్బంది ఇంకా కొత్త. ఆ టెండెన్సీని బీజరూపంలో ఉండగానే పసిగట్టగలిగితే బాగుంటుందనిపించింది. సరే అట్నుంచి నరుక్కు వద్దామని – సోషల్ మీడియాలో ఆడవారి అభిప్రాయ ప్రకటనని ఆటంకపరిచిన ఉదంతాలని పరిశీలించాను. ఒకామె, ఈమధ్య రాముడి మీద జరిగిన చర్చల్లో, తన అభిప్రాయం చెప్పింది. ‘ఆధునికులనుకున్న వాళ్ల మెదళ్లలో దాగి ఉన్న ఖాళీలు బయట పడుతున్నాయీ’ అంది దానికి ఒకాయన మండిపడ్డాడు, చొక్కా చేతులు పైకి మడుచుకుని మరీ దాడికి సిద్ధమయ్యాడు.
‘ఇళ్లల్లో మొగుళ్లు పూజలు చేసుకుంటుంటే, పక్కన శంఖాలు పూరించే రకాలు ఒక్కోక్కళ్లు, ఇంట్లో చెప్పుకోలేరు కానీ బయటకి వచ్చి నీతులు చెప్తారు’ అని వెటకారం చేసేడు. అప్పటికీ కసి తీరక, ఆమె కుటుంబవివరాలు తవ్వితీసి – ‘పిటపిటలాడే మన పతివ్రతకి, తన కొడుకు పేరు ఎంచుకునే స్వతంత్రం లేకపోయిందే’ అని దాడి మొదలుపేట్టేడు. ఆ మాటల వాడకం చూస్తే, ‘నాకు గనకా కోపం తెప్పించారా - ఎలాటి మాటలైనా అనేయగలను చూసుకోండి’ అన్న అహంకారం కనిపిస్తుంది. ఆ దాడిని చదివి చప్పట్లు కొట్టినవారిలో – పేరు మోసిన రచయితలు కూడా ఉన్నారు. పురుషాధిక్యతకి దెబ్బ తగిలితే స్వయం నియంత్రణ కోల్పోడం– ఎలాగోలా అవతలివారికి బాధ కలిగించాలనిపించడం - అప్పుడు దుర్భాషల వాడకం – ఇదంతా వారికి మామూలయిపోయిందని అర్థమౌతోంది. నార్మలైజేషన్ ఆఫ్ స్లేండర్, అబ్యూజ్, బుల్లీయింగ్ – కూడా సమస్యలో భాగమే. (ఈ మాటలకి తెలుగు అర్థాల్ని వివరించడం వ్యర్థం – ఉదాహరణలే చాలు). సాధారణమైపోయిన విషయాలకి స్పందనరాదు, అదీ దురదృష్టం.
ఇంకో ఉదంతం - ఒకామె భర్తని వదిలి పెట్టి తన పిల్లలతో విడిగా ఉంటోంది. ఆమెకు అనేక మంది మగ స్నేహితులున్నారనీ, ఒకరితో ఉంటూనే వేరే వారితో సన్నిహితంగా మెలిగిందనీ, వాటికి ఋజువులు చూపిస్తామంటూ కొంత మంది చేరి అదే పనిగా దాడి చేసేరు. గుర్తు తెలియని ఐడీలతోనూ, మారు పేర్లతోనూ కూడా జరిగే ఈ వేధింపులు – ఎవరు చేస్తున్నారన్నది కూడా తెలుసుకోడం కష్టం. ఒక స్త్రీకి గౌరవం ఇవ్వాలన్నా లేక అవమానం చెయ్యాలన్నా – ఆమె లైంగికత మీదనే కామెంట్ చేసే ఈ ధోరణిని గుర్తించాలి ఇక్కడ. ఈ రెండు సందర్భాలలోనూ – ఒకరి కుటుంబం పేరెత్తీ, మరొకరి నడవడి పేరెత్తీ – చేసే వ్యాఖ్యల సారాంశం – షేమింగ్ : ఏదో లోపం ఎత్తి చూపించడం, ఇలాటి వారికి మాట్లాడే అర్హత లేదని నిరూపించాలనుకోడం. కొన్ని అనుభవాలు వింటే, అవి మరీ అంత తీవ్రమైనవిపించవు గానీ, మహిళ అభిప్రాయ ప్రకటనకి ఆటంకం కలిగిందని చెప్పక తప్పదు. ఒకాయన ఒకామెను ఒక మీటింగ్ లో కలిసాడు. వారిద్దరి మైత్రీ పెరిగింది. చాలా కాలం పాటు ఆమె ప్రతీ పోస్టుకూ తన సమ్మతీ, ఒక్కోసారి సాదర ప్రశంసా జనాంతికంగా అందజేస్తుండేవాడు. ఇంతలో వారి ఈక్వేషన్ తారుమారైంది. చిక్కేమిటంటే అది సోషల్ మీడియాలో ఆమెకు పంటి కింద రాయిలా మారింది. ఆమె ఏం రాసినా ప్రశ్నించడం, విమర్శించడం చేసేవాడు. రెట్టించినపుడు ఆమె బదులివ్వక పోయినా, అతను ఆగలేదు. వేరెవరైనా ఆమెను విమర్శ చెయ్యగానే, వారి పక్షాన చేరి ‘అవునండీ, నేనూ అదే అంటున్నాను’ అని మళ్లీ వ్యాఖ్యలు– ఇలా సాగింది ఆయన ధోరణి. మీరు నా అస్మదీయ వర్గంలో లేకుంటే, నేనెంత ఇబ్బంది పెట్టగలనో చూపిస్తాననే మొండితనం అది. అదే పని ఒక పురుషుడితో ఆయన చేస్తాడని అనుకోను.
మరొక ఉదంతం – ఒకాయన, అభ్యుదయ భావాలున్న వ్యక్తి, మంచి కవితలు రాస్తాడు, ఫేస్ బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు ఈమెకు. అతని అవగాహనలో మంచి స్పష్టత ఉన్నదని అనుకునేది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయం అయింది. స్నేహితుడనే భావించేది. ఆయనా గౌరవంగా ఉండేవాడు. ఇదిలా ఉండగా - ఒక వృద్ధ రచయిత సన్మానాలు పుచ్చుకోడాన్ని నిరసిస్తూ చాలా మంది ఫేస్ బుక్ పోస్ట్ లు పెట్టేరు. ‘అలా ఆయన సన్మానాలు పుచ్చుకోడాన్ని నేనూ సమర్థించను గానీ, ఆయన్ను విమర్శ చేసే పద్ధతి ముతకగా ఉంది, అది నాకు నచ్చదు’ అని ఆమె పోస్ట్ రాసుకుంది. ఆ ఫ్రెండ్ చదివి, మావి ‘ముతక’ రాతలంటారా అని కోపం తెచ్చుకున్నాడు. చిన్న పాటి డిబేట్ జరిగేక, ఆమె ఆ మిత్రుడిని అన్ ఫ్రెండ్ చేసింది. దానితో అతని వైఖరి పూర్తిగా మారిపోయింది. అన్యాపదేశంగా సంబోధిస్తూ పోస్టుల పరంపర ప్రారంభించేడు. ఒక విషయంలో అభిప్రాయ భేదం వస్తే, అవతలి వారి ప్రవృత్తినే శంకించడం, వ్యక్తిగత విమర్శలకి దిగడం – ఈ పెడసరపు ధోరణి మనకి తరుచూ కనిపిస్తూనే ఉంటుంది. బయట మార్కెట్ లో రొమ్ము విరుచుకు తిరిగే రౌడీలు గుర్తొస్తారు కొందరి వైఖరి చూస్తే. ఈ పేట అంతా మాది, మీరు ఇక్కడ తిరగాలనుకుంటే మమ్మల్ని తప్పుకు తిరగండి అని చెప్తున్నట్టుంటాయి వారి రాతలు.
*************** **************** *****************
స్త్రీల ఆలోచనాశక్తినీ, ఆసక్తినీ, ఆత్మవిశ్వాసాన్నీ కుంటుపరిచే ధోరణులు అనాదిగా ఉన్నాయి, మారుతున్న సమాజంలో అవి ఏయే కొత్త రూపాల్లో బయట పడుతున్నాయో మగవారి స్పందనలో తెలుస్తుంది. అలాటి వ్యక్తిగత అనుభవాలను కొంత మంది పంచుకున్నారు. ఒకామె ఎక్కడో దూరదేశంలో విప్లవ పోరాటం జరిగిన స్థలానికి వెళ్లి, మహోదాత్తమైన చరిత్ర మరో సారి గుర్తురాగా – అత్యుత్సాహంతో – తనకు వింతగా తోచిన ఒక్కొక్క అంశానికీ ఫొటోతీసి, దాని గురించి అక్కడి వారు చెప్పిన వివరాలని జతపరిచి – తాను పొందిన ఉత్తేజాన్నంతా పొందుపరిచి ఒక పోస్టు రాసిందట. దానికి ఒక మేధావి మిత్రుడు ఇలా స్పందించాడట: ‘పోన్లే ఇన్నాళ్లకి ఇల్లు కదిలి కాస్త నాలుగు వైపులా చూస్తున్నావ్, బొత్తిగా నూతిలో కప్పలా ఉండి పోకుండా’ – అన్నాడట. ఆమె రాసిన ఏ అంశమూ అతనికి ఆసక్తి కలిగించ లేదే అని ఆమె నిర్ఘాంతపోతూనే ఉంది. ఆమె అంటుందీ – అతను చేసింది దాడి కాక పోవచ్చు గానీ అది నా ఆలోచననీ, మాటలనీ చిన్నబుచ్చడమే అంటుంది.
ప్రపంచాన్ని వారి సొంత దృష్టితో పరికించి, తమవైన ఆలోచనలని షేర్ చేసుకునే సందర్భంలో – మహిళకి ఎదురయ్యే సమస్యల్ని చాలా మంది గుర్తించేరు. ఒకామె తన మితృడి గురించి ఇలా చెప్పింది - ఏదన్నా చర్చలో ఆమె తనకి తోచిన పాయింట్ చెప్పగానే – ఆయన – ‘అబ్బే ఇది పాతికేళ్ల నుండీ నలుగుతున్నదే నండీ, ఇందులో కొత్తేం లేదు’ అని చప్పరించేస్తాట్ట. ‘ఏదో మీరిప్పుడు మేలుకున్నారు గానీ దీనిలో చర్చించేదేం లేదు’ అని తేల్చేస్తాడట. ఆమెను మాట్లాడనీయకుండా - ఫలానా ‘ఇది’ ‘అదిగో’ ఫలానా ‘దాని’ వల్ల వస్తుందని బోధిస్తాడట. ఆడవారికి ఉండే ప్రపంచావగాహన గురించి అంత తేలిక అభిప్రాయం. ఇలాటి ధోరణులని చూసి చూసి విసిగిన జనం mansplain, maneturrption అనే కొత్త పేర్లు కాయిన్ చేసుకున్నారు. మళ్లీ ఆయనే ‘తెలుగుస్త్రీలలో ఒరిజినల్ గొంతులూ లేవండీ, అసలు రావడమే లేదు’ అని అంగలారుస్తూ ఉంటాడట, ఆడవారు మాటాడేదానికి అడ్డుపడుతూ ఉంటే – వారి కొత్త గొంతులు ఎలా వినపడతాయి?
మరొకామె – ఇద్దరు మేధావి మిత్రుల గురించి చెప్పింది, ఒక మిత్రుడికి తాను రాసిందేదన్నా పంపి అభిఫ్రాయం చెప్పమంటే – అతను తాను ఆ విషయం గురించి ఎప్పుడెప్పుడు ఏ రచనలు చేసాడో, ఏయే ప్రసంగాలు చేసేడో – వాటి వివరాలు పంపుతాడట, కానీ చదివి అభిప్రాయం మాత్రం చెప్పడంటుంది. రెండో ఆయన ఏది చర్చించాలన్నా - ఈ ఆలోచనలూ, అభిప్రాయ ప్రకటనలూ, చర్చలూ కేవలం వృధా అనే విధంగా మాట్లాడతాడట. చాలా మందికి ఆడవారి సృజనా శక్తి మీదా, విశ్లేషణ మీదా చిన్నచూపు, అదే సోషల్ మీడియాలో వారి కామెంట్లలో కనిపిస్తూ ఉంటుంది. మనం చెప్పాలనుకున్న అంశం నిరర్థకమేమో, మనం ఏది మాట్లాడితే ఎవరు ఏ రకమైన కామెంట్ రాస్తారో అనే బెరుకు స్త్రీలలో పెరగడం – ఏ మాత్రం మంచిది కాదు.
మేల్ బాషింగ్ చేయడానికి, మగవారిని విమర్శించేందుకు కాదు - ఈ వ్యాసం. కొన్ని తప్పు ధోరణులని ఎత్తి చూపించడం కోసం మాత్రమే. ఆ మాటకొస్తే, ఈ ధోరణులని అలవరుచుకున్న ఆడవారి వల్ల కూడా తోటి స్త్రీలకి అసౌకర్యం కలుగుతూ ఉంటుంది. ఇన్ బాక్స్ ల్లోకి వెళ్లి మరీ గదమాయించీ, బెదిరించే ఆడవారి గురించి వింటూ ఉన్నాను.
అలాగే - మనస్ఫూర్తిగా వారి అనుభవాన్నీ, పరిజ్ఞానాన్నీ – అడిగినప్పుడల్లా పంచి ఇవ్వడమే కాదు, మనం చెప్పేదానికి , ‘చెవి’ని కూడా ఇవ్వగలిగిన పురుషులు చాలా మంది ఉన్నారు. తన సొంత గొంతు వినిపించి, తన ఆలోచనలకి అక్షరరూపం ఇచ్చిన ప్రతీ మహిళా – ఆ ప్రయాణంతో తమకి తోడుగా నిలిచిన స్నేహితుల పేర్లు చెప్పినప్పుడు వాటిలో తప్పకుండా కొన్నైనా మగవారి పేర్లు ఉంటాయి. ‘నా మాట సావధానంగా విని, ఓహో మీరలా అనుకుంటున్నారా, మరి నేనిలా అనుకున్నాను’ అంటూ నాతో గౌరవపూర్వకంగా విభేదించిన వ్యక్తులని కొందరిని నేను స్వయంగా ఎరుగుదును - వారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు.
‘సోషల్’ మీడియా కి ఒక ఎటికెట్ (మర్యాద) పాటించడం తప్పనిసరి. దానిని ‘పర్సనల్’ వ్యాఖ్యానాలకి దూరంగా ఉంచితే ఆరోగ్యకరంగా ఉంటుంది. స్త్రీలు ఆ మాధ్యమంలో పాల్గొంటున్నప్పుడు, వారి మీద వ్యక్తిగత వ్యాఖ్యానాలు చెయ్యడం – ఆమె భావ ప్రకటనా స్వేచ్ఛకి ఆటంకం కల్పించడమే – అని నమ్మి ఆచరించాలి. దాని కోసం విరివిగా చర్చలు జరగాలి. నిన్నో మొన్నో ఒక వర్ధమాన మళయాళ నటుడి ఇంటర్వ్యూ విన్నాను. లింగ వివక్ష గురించి మాట్లాడే ‘విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ అనే సంస్థ గురించి మీ అభిప్రాయమేవిటని ప్రశ్న వేసేరు. ‘అలాటివి ఏర్పడటం శుభసూచకం, మరింత బలపడాలని కోరుకుంటాను’ అని చెప్తూ – ఇంకా ఇలా అన్నాడు. ‘ఈనాడు మా తరం మగవాళ్లు ‘కరెక్ట్’ మాట్లాడడం నేర్చుకుంటున్నామంటే దానికి కారణం – ఎవరో ఒకరు తప్పుని ‘తప్పు’ అని చెప్పినందువల్లే, ఎవరూ చెప్పకపోతే మేమింకా అలాగే మాట్లాడుతూ ఉండేవారిమేనేమో” అన్నాడు. ‘ఇదిగో, ఈరకమైన ప్రవర్తన ఆడవారికి ఇబ్బంది కలిగిస్తుంది’ అని చెప్పడం అత్యావశ్యకం.
కొందరు శ్రేయోభిలాషులు – ‘ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు అరుస్తాయి, దానికేముందండీ, వాటిని పట్టించుకోనక్కర లేదు’ అని సలహా ఇస్తారు. కానీ మనం మాట్లాడాల్సింది ఏనుగు ఏం చేసి ఉండాల్సిందో అనేది కాదు. అందుకే ఈ వ్యాసంలో – ఇబ్బందికి గురైన ఆడవారేం చేసారో, ఎలా వ్యవహరించారో చెప్పడం అవసరం అనుకోలేదు. వీరిలో ఏ ఒక్కరూ కూడా - ఇబ్బంది వచ్చింది కదా అని వెనుకంజ వెయ్యలేదు, మాట్లాడడం మానలేదు. కానీ వారి గొంతు వినపడనీయకుండా చేసే కారుకూతల్ని మనం నిర్లక్ష్యం చెయ్యకూడదు... సమస్యకి పరిష్కారం వ్యక్తిపరంగా కాదు వెతకాల్సింది. సమాజపరంగా మనం ఆ అరుపుల గురించీ, వాటి వెనకనున్న స్వభావాల గురించీ ఆలోచించాలి.

Saturday, 8 December 2018

మహాశ్వేతా దేవి రిక్షావాలా – ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ రచయిత!

మూలం: మనోరంజన్ బ్యాపారి చేతిలో పుస్తకాన్ని ఒళ్లుమర్చి చదువుకుంటున్నాను, రిక్షాలైన్ లో నా వంతు వచ్చిందని తెలియనేలేదు. గభాలున మేలుకున్నా, తలెత్తి చూస్తే ఎదురుగా ఒకామె ఒక పాతికేళ్ల యువకునితో కలిసి రావడం కనిపించింది. టీచర్‌గా మాకందరికీ పరిచయమైన ముఖమే. మళ్లీ ఒకసారి నేను చదువుతున్న పుస్తకం పేజీలు వేళ్లతో తిరగేసాను. ఆరో ఏడో పేజీలు మిగిలేయంతే, ఏం చెయ్యాలో తోచలేదు, నావెనక నిలబడ్డ అతన్ని ఆసవారీ తీసుకోమని అడిగేను. నేను తర్వాత వచ్చేవాళ్లని ఎక్కించుకుంటానన్నాను.
“చాల్చాలు, తెలివి ఎక్కువౌతోందే, గుర్రం దిగింక” అని కోపంగా జవాబిచ్చాడు అతను. “ఇద్దరు పాసింజర్లు వచ్చారని తెలివిగా నామీద తోసేద్దామనుకుంటున్నావా, నీ వొంతిది, నీ కేది రాసి పెట్టుంటే అదొస్తుంది. నా వొంతొచ్చినప్పుడు నేను తీసుకుంటాను. నీలాగే అందరం ఎండలో మాడుతున్నాం, ఆ పుస్తకం పక్కన పడేసి సవారీ కట్టు – పో!” అని గసిరాడు.
నాకేది రాసిపెట్టుంటే అదొస్తుందని కదా అన్నాడు?  ఆమాట నిజం. లేకపోతే ఆమె నా రిక్షా లోకే ఎక్కడం ఎలా సంభవిస్తుంది?
సరే, ఇక చేసేదేం లేక అయిష్టంగానే లేచి పుస్తకాన్ని సీట్ కిందకి తోసేను. సూర్యుడు పడమటింటికి దిగుతున్నాడన్న మాటే గానీ, వేడి భరించలేకుండా ఉంది. నా ఒళ్లు చెమటతో తడిసి ముద్దై ఉంది.
రోడ్లు మామూలు కంటే ఎక్కువ రద్దీగా ఉన్నాయి. ఆరోజు శనివారం, స్కూళ్లు కాలేజీలూ వదిలే టైమయింది, ఇంటి మొహం పట్టిన స్టూడెంట్లతో వీధులు నిండి పోతున్నాయి. వచ్చి నాముందు నిలబడ్డ పెద్దావిడని చూసేను, నెరిసిన జుత్తూ, కళ్లద్దాలూ, పక్కగా వేలాడుతున్న సంచీ. ఆమె ముఖం సీరియస్ గా ఉంది, ఆమె ఎలాటి టీచరయ్యుంటుందో అలాగే కనిపించింది.
ఆమె జాదవ్ పూర్ వెళ్లాలట. రిక్షా సాగి పోతోంది. సగం దారిలో అనుకుంటా, ఒక పదం గుర్తొచ్చింది: జిజీవిష.  కొన్ని రోజుల క్రితం చాణక్యసేన్ పుస్తకం చదివినప్పుడు తగిలింది. ఆ మాటకి అర్ధం ఎవరూ చెప్పలేక పోయారు నాకు. అప్పటి నుంచీ తలలో అప్పుడప్పుడు మెదులుతూనే ఉంది. అందుకని ఆమెని అడిగాను .
“దీదీ, మీరేమనుకోనంటే ఒక మాటకి అర్ధం అడగొచ్చా, జిజీవిష అనే మాటకి అర్ధం ఏమిటమ్మా?”
నా ప్రశ్న ఆమెకి ఆశ్చర్య కలిగించిందనుకుంటా, ఆమె అంది: “జిజీవిష అంటే జీవించాలనే కోరిక. అది సరే గానీ ఆమాటని నువ్వెక్కడ విన్నావ్?”
“ఒక పుస్తకంలోనమ్మా,” అని జవాబిచ్చేను.
నిశ్శబ్దం. పాసింజర్ సీట్లో నావెనక కూర్చుంది. ఆమె ముఖం లోని భావాలు కదిలి ఉంటాయో నాకు చూసే అవకాశం కలగలేదు.
కాసేపటి తర్వాత ఆమే అడిగింది, “నువ్వెంత వరకూ చదువుకున్నావ్?”
“నాకు స్కూల్ కెళ్లి చదువుకోడం కుదరలేదమ్మా.”
“మరి చదవడం ఎలా వచ్చింది?”
“అంటే … నా అంతట నేనే కొద్ది కొద్దిగా… నేర్చుకున్నానమ్మా,” నేను చెప్పేను.
చక్రాలు గిర్రుగిర్రని తిరుగుతున్నాయి. మా గమ్యస్థానం దగ్గర పడింది.
అయితే తిరుగుతున్నవి నిజానికి ఏం చక్రాలు? అవి రిక్షా చక్రాలా లేక నా భాగ్య చక్రాలా? ముందుకుకదులుతున్నది ఏది? నా రిక్షానా లేక నేనా? అంధకారం, అవమానాలతో నిండిన అనామక జీవితం నుంచి గౌరవం, మర్యాద దొరికే జీవితంలోకి ప్రవేశించుతున్నానా?
అప్పుడు ఆమె ఇలా అంది, “నేనొక పత్రిక నడుపుతూ ఉంటాను, దానిలో నీలాటి శ్రమజీవులూ, కాయ కష్టం చేసేవారూ – రాస్తూ ఉంటారు. నాకోసం రాస్తావా? నువ్వు రాస్తానంటే, నేను ప్రచురిస్తాను.”
నేను? రాయడమా!
పుస్తకపు ముఖచిత్రాల మీద మెరిసే పేర్లూ, రేడియోలో వినపడే గొంతులూ, టీవీ స్క్రీన్ల మీద తేలుతూ కనపడే ముఖాలూ – కళ్ల ముందు తిరుగాడేయి. వారు మన నేల మీదే నడుస్తారని అప్పటి వరకూ అనుకోలేదు. ఎక్కడో వేరే గ్రహం మీద ఉండే మనుషులన్నట్టు నా భావం. మన లాగే తింటారనీ, పడుకుంటారనీ, బజారు కెళతారనీ, వీధుల్లో తిరుగుతారనీ – అసలు ఊహించనేలేను. ఏది ఏమైనా – వాళ్లెవరూ రిక్షా అయితే తొక్కుతారని ఒక్కనాటికీ అనుకోలేదు.
అలాటిది ఈ మహిళ మరి ఆ వరాన్ని ప్రసాదిస్తానంటుందేమటి?
“నేను రాసేది అచ్చు వేస్తారా?”
“ఔను, అదే అంటున్నాను. రాస్తావా మరి?”
“కానీ … నేను దేని గురించి రాయగలను?” అడిగాను.
“రిక్షావాలాగా నీ జీవితం గురించి చెప్పు,” ఆమె చెప్పింది. “నువ్వు ఈపనిలోకి ఎలా వచ్చావు, నువ్వు రోజుకెంత సంపాదిస్తావు, నీ కుటుంబానికి సరిపోతోందా – అవన్నీ రాయి, ఏం రాస్తావా?”
“నేనింతకు ముందెప్పుడూ రాసి ఎరగను,” సంకోచంతో చెప్పేను. “కానీ ప్రయత్నిస్తాను. రాయగలిగినట్టైతే, మీదగ్గరకి తెస్తాను. మీ అడ్రస్ ఇస్తారా?”
ఆపాటికి జాదవ్ పూర్ చేరుకున్నాం. ఆమె కాగితం, పెన్నూ బయటికి తీసింది. కాగితంమీద ఏదో రాసి, నాచేతికి అందించింది.
“ఇదిగో,” అంది.
కాగితం ముక్క మీద రాసి ఉన్నది చదివేను, నా చుట్టూ ఉన్న ప్రపంచం అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టింది.
“మీరా?!” ఆశ్యర్యాతిరేకంతో అరిచేను.
“నేనెవరో తెలుసా?”
నాకు నువ్వెవరో తెలియకపోవడమేమిటమ్మా, ఓ మహోత్కృష్ట అక్షరశిల్పీ! ఎటువంటి జ్ఞానమది? తిరుగుబాట్లూ, ప్రతిఘటనలూ, ఉద్యమాలూ, ఆక్రోశాలూ – వాటి లోంచి, ఆ స్వేదం, రక్తంలోంచి –  ఉత్పన్నమైంది. పీడితుల పక్షానా, నిస్సహాయుల పక్షానా నిలిచి – వారి కోసం – కలాన్ని ఖడ్గంగా ఝళిపించిన ఆగ్రహం అది. నీ ద్రౌపదిని చదివేక ఆ రేపిస్ట్ లని వెతికి వేటాడి చంపాలని ఊగిపోయానమ్మా! వారు కాకుంటే అలాటి దుర్మార్గులని కొందరినైనా శిక్షించాలనిపించిందమ్మా …
అయితే ఇదేదీ చెప్పలేదు. నా ఉధృత భావప్రవాహన్ని – భాషలోకి తేలేకపోయాను.
నేనన్నాను, “మీ పుస్తకాలు చదివేను. అగ్నిగర్భ ఇదిగో ఇక్కడే ఉంది.”
సీట్ పక్కకి జరిపి పుస్తకం బయటికి తీసేను.
ఆమె మనసులో ఏం ఆలోచనలు మెదిలాయో నాకు తెలియదు. నాకు మాత్రం ఒక అపురూపమైన సంతృప్తి ఆమె ముఖంమీద మెరిసిందని తోచింది. ఆమె ఏబడుగు జీవుల కోసం రచనలు చేస్తోందో, వారు ఆమె పుస్తకాలని గుర్తించారనీ, శ్రద్ధాసక్తులతో చదువుతున్నారనీ తెలియడం – ఆమెకి ఆనందం కలిగించి ఉంటుంది.
ఇక నా సంగతి చెప్పాలంటే, ఉద్వేగం పట్టలేక ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను. శ్వాసతీసుకోడం కష్టమైపోతోంది. నా గుండె గట్టిగా కొట్టుకుంటోంది, నా శరీరం వణుకుతోంది, మనసూ కంపిస్తోంది, నా జీవమే ఒక ప్రకంపనగా మారింది. నిటారుగా శరీరాన్ని నిలబడనంటోంది … తల ఎత్తి నిలబెట్టడం శక్యమవడం లేదు. నా శిరస్సు దానికదే వంగి పోయింది, ఆమె కాళ్ల ముందు సాగిలపడిపోయాను. తల ఎత్తి నిలబడే సందర్బాలు అనేకం ఉంటాయి మనిషికి. ఎవరికైనా శిరసు వంచి గౌరవం చూపగల అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. సరైన పాఠశాలగది మొహం చూడని ఒక పిల్లవాడు, కేవలం తల్లిపాలతోనే తన దాహాన్ని తీర్చుకున్న పసివాడు, ఇన్నేళ్ల  తర్వాత ఒక దేవత ముందు నిలుచున్నాడు. సాక్షాత్ హంసవాహిని సన్నిధి. ఔను, సరస్వతికి మరో పేరు మహా శ్వేత కదా?
మర్నాడు తనని వచ్చి కలవమని, తనతో కలిసి లంచ్ చెయ్యమని ఆమె ఆహ్వనించింది. ఈలోగా ఆమె ఎక్కాల్సిన బస్ వచ్చింది. బస్ ఎక్కుతూ ఆమె చెయ్యి ఊపింది – ఏదో దివ్యహస్తం ఆశీర్వదించినట్టు అనిపించింది.
మరుసటి రోజు ఉదయాన్నే ఏడు గంటలకల్లా, బాలీగంజ్ రోడ్లో ఉన్న ఆమె ఇల్లు చేరుకున్నాను. వంకర తిరిగి ఉన్న మెట్లు ఎక్కుతున్నాను, తలలో ముప్పిరిగొంటున్న భావాల సందోహం.
ఆ మెట్లు: పూలూ, పళ్లూ, కలుపు మెక్కలూ, పురుగులూ, క్రిమి కీటకాలూ పుష్కలంగా ఉన్న మట్టిలోకి  బలంగా పాదుకుని ఉన్న ఆమెట్లు, వాటి రెండో అంచు మాత్రం – అవధులు లేని సువిశాల స్థలంలోకి,  ఆశల దీపాలు వెలిగే ప్రాంగణం లోనికి, అప్పటికింకా రూపుకట్టని ఉజ్వల భవిష్యత్తు లోకి – తెరుచుకునే మెట్లు.
ఆమెట్ల మీద నడుస్తుంటే, నాకాలి ఒత్తిడికి జవాబుగా -వాటి భాషలో కిర్రుమంటూ స్వాగతం చెప్పేయి. మొదటి అంతస్థులోని ఆమె ఇంటి ముందు నిలుచునే సరికి, నా జీవితపు అత్యున్నత స్థానాన్ని చేరుకున్న భావం కలిగింది.
నేను బెరుకు బెరుకుగా తలుపు తట్టేను, ఆమె గొంతు జవాబిచ్చింది.
“తలుపు తెరిచే ఉంది, లోపలికి వచ్చి కూచో, మదన్.”
నన్ను చూడకుండానే నేనని గ్రహించింది. నిన్న కలిసిన పిచ్చివాడు, రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా ఉండి ఉంటాడు, పొద్దు పొడవగానే వచ్చేసి ఉంటాడని ఆమె ఊహించింది.
అది ఆమె కూచుని రచన సాగించే గది. చుట్టూ చూసాను. ఒక టేబులూ, కుర్చీ. టేబుల్ మీద పెన్నులూ, కాగితాలూ ఉన్నాయి. పది పన్నెండు నిమిషాల తర్వాత ఆమె వచ్చింది. ఆదివారం, సెలవు కావడంతో – పొద్దెక్కే కొద్దీ – చాలా మంది రావడం మొదలైంది. వారందరికీ నన్ను ఒక రచయితగా పరిచయం చేసింది.
“ఇదిగో ఈయన నా కొత్త రచయిత, మదన్.” రచయిత!
అలా నా జీవితంలోని అతి క్లిష్టమైన సమయం మొదలైంది. యుద్ధం చెసేవాడిని. తుపాకీ గొట్టాలూ, బాంబులతో చేసే దాని కన్నా కష్టతరమైన యుద్ధం. నాకు తెలిసి, అన్నిటి కంటే దుష్కరమైన పోరాటం.
ఒక వాక్యం మరో వాక్యంలోకి నా కన్నుగప్పి దూరిపోయేది. పెనుగులాడే వాడిని. పదాలు ఒక్కో చోట ఒక్కోలా ధ్వనించేవి. ఏది సరైనదో నాకెలా తెలియాలి? తల కొట్టుకునే వాడిని. ఏ పదాన్ని వాక్యంలో ఎక్కడ వాడితే – ఆవాక్యం అర్ధవంతంగానూ, వ్యాకరణబద్దంగానూ కూడా ఉండగలదు?అర్ధమయ్యేది కాదు.  కాగితాల మీద రాసే వాడిని, మళ్లీ  చించేసేవాడిని. రీముల కొద్దీ కాగితం, లీటర్ల కొద్దీ కిరోసిన్ ఖర్చయింది. కొన్నాళ్లు పనికి కూడా వెళ్లకుండా ఇంట్లో ఉండిపోయేవాడిని. కొంతకాలానికి నేను రాసినదాని మీద కాస్తంత సంతృప్తి కలిగింది‘నేను రిక్షాలు తొక్కుతాను’  అనే పేరుతో బర్తిక1981 జనవరి-మార్చి సంచికలో అది అచ్చైంది.
మహాశ్వేతా దేవి కేవలం రచయిత మాత్రమే కాదు. కవి మనీష్ ఘటక్ కూతురు, ఫిల్మ్ డైరెక్టర్ రిత్విక్ ఘటక్ మేనకోడలు, నాటకకర్త బిజన్ భట్టాచార్య స్నేహితురాలు – వీటన్నిటికీ మించి – ప్రతిఘటనా స్వరానికి బలమైన గొంతుగా నిలబడ్డ వ్యక్తి. ఆమె ఎడిట్ చేసే పత్రికలో నా పేరు కనబడ్డాక, జుగాంతర్ అనే వార్తాపత్రికలో ఒక సమీక్షకుడు నారచన గురించి రెండు మంచి మాటలు రాసాడు. తర్వాత  “ఎంతో దగ్గర అయినా మరెంతో దూరం”, అన్న పేరుతో రాసే తన ధారావాహికలో, మహాశ్వేతా దేవి నాపేరు ప్రస్తావించింది, “మదన్ గొప్ప వ్యక్తి. అతను రిక్షా నడుపుతాడు. అతను రాస్తాడూ… ” అంటూ ఆమె రాసింది. దానితో నేను నలుగురికీ పరిచయమయ్యాను, చాలా పత్రికలు నా రచనలు వేసుకుంటాం అన్నాయి. నాకు రిక్షావాలా రచయిత అని పేరు వచ్చింది. అది నాలో ఉత్సాహాన్ని నింపింది, నామీద నాకు నమ్మకాన్నిచ్చింది.
ఔను, నేను రాయగలిగేను.
ఛండాలుడిగా పుట్టిన నా ఇతివృత్తం’  అనే పేరున్న ఆయన ఆత్మకధ ‘Interrogating my Chandal life’గా ఇంగ్లీషులోకి తర్జుమా అయింది. (సిప్రా ముఖర్జీ అనువాదం). దానిలో ఈ అత్యద్భుత ఘటనని, అది తన జీవితాన్ని తిప్పిన మలుపునూ – మనోరంజన్ బ్యాపారి వివరించారు.
ఆయన చరిత్ర తెలుసుకోడం అంటే ఆయన విశిష్టత తెలుసుకోడమే :ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురణల్లో తన రచనకి స్థానం పొందిన  ఏకైక రిక్షావాలా – అలాటి వ్యక్తి  ప్రపంచంలోనే మరెవరూ లేరంటే అది అబద్ధం కాదు. పుట్టుకే – భయంకరమైన పేదరికం, అనిశ్చత వాతావరణంలోకి. పార్టిషన్ సమయంలో వెస్ట్ బెంగాల్లోని బంకురా జిల్లాలోని రెఫ్యూజీ కేంప్ – అతనికి పసితనం గుర్తుల్ని మిగిల్చింది. తర్వాత కొద్ది కాలానికే చెట్టు కొకరూ పుట్ట కొకరుగా అతని కుటుంబం చెదిరి పోయింది. ఎన్నో ఆటుపోట్లు.
ఎమర్జెన్సీ టైంలో అతన్ని ఆలీపూర్ జైల్లోనూ, తరవాత ప్రెసిడెన్సీ జైల్లోనూ పెట్టారు. అప్పుడే – ఒక తోటి ఖైదీ ప్రోత్సాహంతో – గోడలమీదా, నేలమీదా, మట్టితో, రాయితో, అక్షరాలు దిద్దుకుని కూడబలుక్కుంటూ చదువుకోడం నేర్చుకున్నాడు. జైలు లోంచి పుస్తకాల పురుగుగా మారి బయటకొచ్చాడు. ఈనాడు దళితసాహిత్యంలో అతని  అక్షరాలు నిజనిర్దేశాలుగా మారి వెలుగు పంచుతున్నాయి.


మనిషి, సరుకు- ఒక క్రూర వ్యాపారం

అక్రమ మానవ రవాణా గురించి రాసిన వ్యాసం  సెప్టెంబర్ నెల మాతృకలో ...


“బబ్బో, అమ్మా లేదంటే బూచాడొచ్చి ఎత్తుకుపోతాడు!”
“పిల్లలు ఒకళ్లూ పెద్దవాళ్లు లేకుండా తిరక్కూడదు అమ్మో దొంగలు ఎత్తుకుపోతారు.”
“తెలియని వాళ్లు ఇచ్చిన చాక్లెట్లు అవీ తినకూడదు. వాళ్లు పిలిస్తే వెళ్లకూడదు.” ఇవే చైల్డ్ ట్రాఫికింగ్‌ని ఎదుర్కోడానికి మనకి చేతనయిన రెస్పాన్స్‌లు. ఈమాటలు వింటూనే పెరిగాం.
చైల్డ్ ట్రాఫికింగ్ మాట కొత్తది కానీ, విషయం మనకి తెలీంది కాదు. సినిమాల్లోనూ దీని ప్రస్తావనలొచ్చాయి కాకపోతే ఒక ట్రాజెడీ లాగే చూపిస్తారు. లేదా హీరో వీర పోరాటానికీ లేదా విలన్ దుర్మార్గానికీ ఉదాహరణగానే. అందుకే సాధారణంగా ఏకొందరు అతి క్రూరులు చేసే విలనీలాగానో మాత్రమే భావిస్తూ ఉంటాం. పాలు తాగే కృష్ణుణ్ని ఇంట్లో అందరి కళ్లూ గప్పి పూతన ఎత్తుకుపోవడం కథ నాటి నుంచీ పిల్లల పాలిటి శత్రువులున్నారని గుర్తించాం. కాకపోతే ఎవరో దుష్టులు చేస్తూ ఉంటారని ఊహిస్తూ వచ్చాం. పూతన వచ్చింది కూడా కంసుడి కోసం కృష్ణుణ్ని చంపడానికే.
ఈనాడు వేల కొద్దీ పిల్లలు ఊహాతీతమైన హింసకు గురౌతున్నారన్నది మనం మర్చిపోలేని వాస్తవం. ప్రభుత్వాల కన్నా సేవాసంస్థల మీదే వారి శ్రేయస్సు ఆధారపడి ఉండడం మరొక చేదు నిజం. ప్రజ్వల అనే పేరు గల సంస్థ నడిపే సునీత కృష్ణన్ చైల్డ్ ట్రాఫికింగ్‌కి సంబంధించి భయంకరమైన సంఘటనల్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఆమె చెప్పిన ఒక ముగ్గురి పాపలు, ప్రణీత, షాహీన్, అంజలిల కథ. ప్రణీత తల్లి ఒక వేశ్య, ఆమెకు హెచ్ఐవీ సోకింది. ఎయిడ్స్ చివరి దశలో ఇక వృత్తి కొనసాగించలేని స్థితి వచ్చి – 4ఏళ్ల ప్రణీతను –బ్రోకర్‌కి అమ్మేసింది. సంగతి తెలిసి రక్షించేందుకు వీళ్లు వెళ్లే సమయానికే – ముగ్గురు వ్యక్తులు ఆ పాపని రేప్ చేసారు. షాహీన్ తల్లిదండ్రులెవరో తెలియదు కానీ వీరికి ఆమె రైల్వే ట్రాక్ పై దొరికింది, వీరు ఆమెను తీసుకొచ్చే సరికి అనేక మంది ఆమెను రేప్ చేసి ఉన్నారని గుర్తులు కనిపించాయి. దాని కారణంగా ఆమె పొట్టలో పేగులు బయటకొచ్చి ఉన్నాయట, వాటిని మళ్లీ లోనికి వేసి 32 కుట్లు వేసేరట డాక్టర్లు. అంజలి తండ్రి తాగుబోతు, ఆమెను పోర్నోగ్రఫీలో వాడబడేందుకు అమ్మేసాడు. ఈ ముగ్గురూ, ఇలాటి వేలాది మంది బాలలు – కేవలం 3,4,5 ఏళ్లవారు ఈ చైల్డ్ ట్రాఫికింగ్ విక్టింలు. అది సాడిజంలా కనిపించవచ్చు కానీ కాదు, బిలియన్ల వ్యాపారం. దేశాల బోర్డర్లు దాటి జరిగే మానవ రవాణా – డ్రగ్స్ ఆయుధాల తర్వాత అతి పెద్ద ఇల్లీగల్ ట్రేడ్.
బచ్‌పన్ బచావో ఆందోళన్ పేరున స్థాపించిన కైలాష్ సత్యార్ధిలాటి వారి వల్ల సమస్య, ఉద్యమరూపాన్ని సంతరించుకోడం, కొద్ది కొద్దిగా ప్రజల మధ్యకు రావడం మొదలైంది. ముఖాలు తెలియని అనామక అభాగ్యులు గుంపులు గుంపులుగా కాక – ముఖాలతో బయటకు రావడం ఒక పెద్ద మలుపు. బాధితులు వారి గొంతు విప్పి జరుగుతున్న అత్యాచారాల్ని బయటపెట్టడం చరిత్రలో ముందెన్నడూ జరగలేదు. దానికి ఆ సేవాతత్పరుల మానవత్వమే కారణం. ఎంతెంతటి అవరోధాలను కూడా దాటి నడిచినంత మేరా సస్యశ్యామలం చేసే జీవధారలాటి మానవత్వం నిండుగా ఉన్న వ్యక్తుల వల్లనే ఈకార్యం సాధ్యపడింది – సందేహం లేదు.
అయితే అందులో చిక్కుకున్న వారిని రక్షించడం, వారికి పునరావాసం కల్పించడం, అది ఎంత నిస్వార్ధమైన సేవ అయినప్పటికీ అది సమస్య పరిష్కారానికి మొదటి అడుగు మాత్రమే అని చెప్పుకోవాలి. ఒక్కొక్కరి వృత్తాంతం వింటే గుండెలు కరిగిపోయేమాట వాస్తవమే. వారి దురదృష్టం పట్ల మనకు కలిగే సానుభూతి - సమస్య లోతుల్లోకి మనని తీసికెళ్లదు. జాలి, దయ, కరుణ, సంఘీభావం – బాధితుల పట్ల కలగడం సహజం. కానీ – పరిష్కారం వెతకడానికి అవేవీ సహాయపడవు.
సమస్య వ్యాప్తి
2016 స్లేవరి ఇండెక్స్ (బానిసత్వపు సూచి) ఈనాడు 46 మిలియన్ల స్త్రీలూ, పురుషులూ, పిల్లలూ ఆధునిక బానిసత్వంలో ఉన్నారని, అందులో సగం ఆసియాలోనే ఉన్నారని చెబుతోంది. ఇంటర్నేనల్ లేబర్ ఆర్గనైజేషన్ ((ILO), లెక్కల ప్రకారం ఈ అక్రమ వ్యాపారంలో లాభాలు 150 బిలియన్లు దాటుతున్నాయట. చరిత్రలో ఎప్పటి కంటే ఈనాడు ఎక్కువ బానిసలున్నారని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. ఇది వెనకబడ్డ దేశాల్లోనే ఉందనీ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉందని అనుకోడానికి లేదు. బంగ్లాదేశ్ లోని అనేక పరిశ్రమల్లో బలవంతపు వెట్టిచాకిరీ ఉంటే, లాస్ ఏంజిల్స్‌లో సెక్సువల్ దోపిడీకి గురౌతున్న ఆడవాళ్లున్నారు. ఉగాండాలో పిల్లల్ని సైన్యంగా వాడుతూంటే, చైనాలో మానవ అవయవాలను పంటల్లా వాడుతున్నారు. యూరప్ రాజధానుల రోడ్ల మీద ఉండే బిచ్చగాళ్లను ట్రాఫికింగ్ చేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని మిలిటరీ స్థావరాలకీ అనుబంధంగా వేశ్యావాటికలుంటాయి. అదే అనుకుంటే, ఆ సైన్యం అక్కడ నుంచి కదలగానే, ఆ పిల్లలను ఇంకా డిమాండున్న స్థలాలకు తరలిస్తారు.
చైల్డ్ ట్రాఫికింగ్‌ లోకి పిల్లల్ని చేర్చే విధానాల్లో వివిధ దశలున్నాయి. ఏయే రకాలుగా దీనిలోకి లాగబడతారో తెలుసుకుంటే – వాటికి అక్కడక్కడ చెక్ చేసే ఉపాయాలను అన్వేషించగలుగుతాం. కిడ్నాప్ చేసి ఎత్తుకు పోయే సందర్భాల్లో పూర్తి నిర్బంధం ఉంటుంది. పని ఇప్పిస్తామని ఆశ పెట్టి కొందరినీ, సగం సగం నిజాలు చెప్పి కొందరినీ తీసుకెళ్లి వారిని అమానవీయ కార్యాలకు నియోగించడంలో మోసం ఉంటుంది. కొందరినైతే సెక్స్ వ్యాపారాలకు నియోగిస్తామని చెప్పి మరీ - వారి తల్లిదండ్రులను బెదిరించడం, డబ్బిచ్చి కొనుక్కుని దోపిడీ చెయ్యడం చేసి వారి పిల్లలను తీసుకుపోతారు.
ఎన్నో విధాలుగా పిల్లల ట్రాఫికింగ్ – తక్కిన వాటి కంటే భిన్నమైనదప్పటికీ - దానిని స్లేవరీ అనే వ్యాపారంలో భాగంగా చూసి అర్ధం చేసుకోవాలి. సామాజిక పరంగా విశ్లేషించుకోవలసినవి కొన్నుంటే, ఆర్ధిక పరంగా పరిశీలించాల్సిన అంశాలు కొన్ని.
సామాజిక కోణం లోంచి ట్రాపికింగ్ మీద ప్రభావం చూపుతాయనుకున్న అంశాలను గుర్తించి, వాటిని ఎదుర్కోగలిగే మార్గాలను అన్వేషించుకోవాలి.
జాతిపరమైన వేర్పాటు (ఎత్నిక్ ఫ్రాక్షనలైజేషన్)
విభిన్న మతాలూ, జాతులూ ఉండే బహుముఖ సమాజంలో, ఎత్నిక్ ఫ్రాక్షనలైజేషన్ బలపడుతోందంటే – ఆ సమాజం సమూహాలగా విడగొట్టబడుతోందని అర్ధం చెప్పుకోవచ్చు. సమూహాలు వేటికవిగా భావించుకుని బలపడాలన్న ఆకాంక్షల వల్ల – ఒక సమూహానికేదైనా ఆపద వస్తే తక్కిన సమూహాలు తగినంతగా స్పందించకపోడం – ఒక ధోరణి. భిన్న సమూహాల మధ్య పరస్పర సంబంధాలు తగ్గిపోయిన కొద్దీ సురక్ష చక్రం (safety net) బలహీనమౌతుంది. చైల్డ్ ట్రాఫికింగ్ విషయాని కొస్తే - బాధితుల వయసు తక్కువగా ఉండడమనే అంశం చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది. పిల్లలు కట్టుబానిసత్వంలో చిక్కుకునేలా చేసేవి ఏయే అంశాలని సోషియాలజీలో రీసెర్చిలు జరుగుతున్నాయి. [Nunn and Wantchekon రాసిన ‘slave trade & origins of mistrust in Africa’, 2011] దీనికి సమాజంలోని కొన్ని విలువలూ, జీవనవిధానాలూ కొంత వరకూ బాధ్యత వహించాల్సి ఉందని తెలుస్తోంది. ఆఫ్రికాలోని బానిసవ్యాపారం బహిరంగంగా జరిగిన సమయంలో ... సమాజంలో మెజారిటీ ప్రజ బానిసత్వాన్ని ఆమోదించేది. దాని వల్ల సమస్యని మొత్తంగా చూడడం పోయి, ఎవరికి వారు బానిసత్వాన్ని తప్పించుకునే ధోరణిలో ఉండేవారట. మానవ జీవితం పట్ల అగౌరవమూ, కొన్ని జీవితాలు వేరే వాటి కంటే ఎక్కువ విలువైనవన్న భావం – ఆ సమాజపు ప్రధాన లక్షణాలనీ తెలుస్తోంది. మన నమ్మకాలూ, సంస్కృతీ, అవగాహనలూ మన చుట్టూ జరిగేవాటిని ప్రభావితం చేస్తాయి. ఈనాడు ఎక్కడెక్కడైతే ట్రాఫికింగ్ తక్కువగా ఉందని తెలుస్తోందో, ఆ ప్రాంతాల ప్రజలు సహజంగానే ఉన్నత నైతిక విలువలున్నవారని, లేక తోటి వారి పట్ల ఎక్కువ ప్రేమ ఉన్నవారనీ చెప్పడానికి లేదట.
కానీ ‘వారు- మేము’ అని బలంగా విడదీసే శక్తులు పనిచేస్తున్న సమాజంలో ట్రాఫికింగ్‌కి ఎక్కువ అవకాశాలుంటాయని పరిశోధకులు నమ్మకంగా చెప్తున్నారు. సమాజంలో అల్లుకుపోయి ఉన్న ఈ విభజనరేఖలతో, పిల్లలు ఏ బలహీనవర్గానికి చెందినవారన్న వాస్తవం కలిసి పనిచేసి వారి ట్రాఫికింగ్‌ సంభావ్యతని సూచిస్తుందంటున్నారు.
అంతర్జాల రాపిడికి అసహాయంగా గురి కావటం (ఆన్లైన్ వల్నరబిలిటీ)
మనం గుర్తించవలసిన సామాజిక పరమైన మరో మార్పు ఇంటర్నెట్, అది పిల్లలను వేటాడడానికి పెద్ద సాధనం. పిల్లల ఆన్లైన్ వల్నరబిలిటీ అనే మాటని – ఇంటర్నెట్ మాధ్యమంలో ట్రాఫికర్లకి పిల్లల లభ్యత పెరిగింది అని అర్ధం చేసుకోవచ్చు. ట్రాఫికర్లకి ఇంతకు ముందు ముఖాముఖీ కలిసే అవసరం ఉండేది. కాని వారు ఇప్పుడు కొత్త బాధితులను పట్టడంలో సోషల్ మీడియాని ఉపయోగించుకుంటున్నారు, ఎవరికీ దొరకకుండా ఉంటూ, సులభంగా దెబ్బతియ్య గల అవకాశాల కోసం కాచుకుని కూచుంటారు. ఆన్లైన్‌ దాడిలో ఆరితేరుతున్నారు. వాట్సప్ మెసేజిలు పంపి, ఎవరన్నా జవాబివ్వగానే వారిపై తమ వల విసురుతూంటారు. ఇబ్బంది కలిగించగల ఫొటోలను, ఇతర వివరాలనీ చేజిక్కించుకుని తమ పట్టు బిగిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోకి సైతం వారి నెట్‌వర్క్ చొచ్చుకుపోయినట్టు వార్తలొస్తున్నాయి.
రాజకీయ అస్థిరతా, సామాజిక సంక్షోభం పెద్ద ఎత్తున పిల్లల జీవితాలపై ప్రభావం చూపుతుంది. యుద్ధాలూ, ప్రకృతి వైపరీత్యాలూ సంభవించే సమయం ప్రత్యేకించి పిల్లలను అతలాకుతలం చేస్తుంది. అది అదునుగా ట్రాఫికర్లు మరింత వేగంగా వారి ఎత్తులు వేస్తారని గుర్తిస్తే కొంతైనా మనం జాగ్రత్తపడగలం.
ఆర్ధిక కోణం
ఎమోషనల్ స్పందన అదుపులోకి తెచ్చుకుని – ఈ బానిసల వ్యాపారానికి మూలాల్లోకి వెళ్లాలి. వ్యాపారంగా దాన్ని అర్ధం చేసుకోవాలంటే ఈకోణంలోంచి చూడడం తప్పనిసరి. ట్రాఫికింగ్లో జరిగే మానవుల మార్పిడిని సప్లై, డిమాండ్ల పరస్పర చర్యగా చూసి – ఆ మార్కెట్ ని ప్రభావితం చేసే అంశాలు ఏవన్న ప్రశ్న వేసుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో (ఒక దేశం లోని కొన్ని ప్రాంతాల్లో కూడా) శారీరక శ్రమనీ, వస్తువులనీ, సెక్స్‌నీ చవకగా కొనుగోలు చేసే డిమాండ్ ఉంటుంది. అదే ఈబానిసల మార్కెట్‌ని నడుపుతుంది. అయితే మామూలు వ్యాపారాల కంటే బానిసల వ్యాపారపు మార్కెట్ రెండు అంశాల్లో భిన్నంగా ఉంటుంది.
ఒకటి ప్రాఫిట్ రేటు. వేల సంఖ్యలో నిత్యం కొనుగోలూ, అమ్మకాలూ జరిపే రాకెట్ (ముఠా)కి – ఒక వ్యక్తిని ఎక్స్‌ప్లాయిట్ చేసేందుకయ్యే ఖర్చు అతి తక్కువ. [Jakobsson & Kotsadam రాసిన ‘The Economics of Trafficking for Sexual Exploitation’, 2015] ఒక హోటల్ గదిలాగా మనిషిని మళ్లీ మళ్లీ అమ్మగలిగే అవకాశం ఉండడం వల్ల ఒకసారి బానిసగా మారిన వ్యక్తి ధర పడిపోయి పడిపోయి – అతి చవకగా అమ్ముడు పోయి కూడా తన యజమానికి లాభం అందిస్తాడు.
సమస్య తీవ్రతని అర్ధం చేసుకునేందుకొక ఉదాహరణగా – ఒక రెడ్‌లైట్ ఏరియాని తీసుకోండి. ట్రాఫికింగ్ చేయబడిన ఒక పిల్లకు ఒక వ్యక్తి 500 రూపాయలు చెల్లించాడనుకోండి. 10మందికి అమ్మితే ఒక రోజుకు ఎంత, ఆ ఏరియాలో ఒక 100 మంది పిల్లలపై గడించే బ్లాక్‌మనీ 5లక్షలు. ఒక దేశంలో అలాటి ఏరియాలు వేల కొద్దీ ఉంటాయి, ప్రపంచంలో ఈ వ్యాపారం సాగుతోంది 100 పైచిలుకు దేశాలతో హెచ్చించి చూడండి. ఇదంతా లెక్క ల్లోకి రాని అక్రమ ధనం. అసలు కీలకం అంతా ఇక్కడే ఉంది. ఈ పోగుపడ్డ ధనమంతా మళ్లీ డ్రగ్స్, ఆయుధాలూ, రాజకీయాల వంటి అక్రమ వ్యాపారాల్లోకి పెట్టుబడిగా మారుతుంది. ఆలాభాల్లో వాటాదారులు అత్యంత శక్తివంతమైన స్థానాల్లో ఉంటారని మనం గుర్తించాలి. ఇలా బలంగా వేళ్లూనుకున్న విషవృక్షాన్ని కూల్చడానికి వేర్వేరు నాలుగు దిశల్లోంచి బలమైన వేట్లు పడాలి.
నాలుగు ‘పి’ లు- ప్రోసిక్యూషన్, ప్రొటెక్షన్, ప్రివెన్షన్, పార్టనర్‌షిప్,
1. ప్రోసిక్యూషన్, (చట్ట సంబంధమైన చర్యలు)
అస్పృశ్యత, మనుషుల వ్యాపారం- రెండూ రాజ్యాంగ ప్రకారము నేరాలే కానీ కైలాష్ సత్యార్ధి అనే ఏక్టివిస్ట్ ఉద్యమించే దాకా ట్రాఫికింగ్‌పై సమగ్రమైన చట్టం లేనేలేదు. బచ్‌పన్ బచావో ఆందోళన్, 2011లో, ఆర్టికల్ 32 కింద – సర్కస్‌లలో పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రజాహిత వ్యాజ్యాన్ని వేసింది. దాని వచ్చిన ఒక మంచి ఫలితం – భారతదేశం అంతర్జాతీయ ఒప్పందంలో భాగమవడం. ఐక్యరాజ్య సమితి చేసిన పాలెర్మో ప్రోటోకాల్‌ని మన దేశమూ రేటిఫై చేసింది, (పాలించాలని నిర్ణయించుకుంది). దాని ప్రకారం: శ్రమ చేయించేందు కోసం – బలవంతం చేసి గాని, తప్పనిసరి చేసి గాని, మోసం చేసి గాని, ఎత్తుకుపోయి గాని - వ్యక్తులని - రవాణా చెయ్యడం, నియోగించడం, ఆ రవాణాకి సహకరించడం, దాని కోసం సొమ్ము పుచ్చుకోడం – ఇవన్నీ ట్రాఫికింగ్ పరిధిలోకి వస్తాయని – కఠినంగా శిక్షించవలసిన నేరాలని స్పష్టమైంది.
ఏజెంట్‌ని అరెస్ట్ చెయ్యడమో, ట్రాఫిక్ అయిన పిల్లలని ఉద్యోగంలో పెట్టుకున్న ఫేక్టరీలని మూయించెయ్యడమో– చాలదు. డబ్బు ఎక్కడెక్కడ చేతులు మారిందో ఆ జాడలన్నిటినీ పరిశీలించి, సంబంధిత వ్యక్తులపై చట్టానికి అప్పగించాలి.
2. ప్రొటెక్షన్ (రక్షణ చర్యలు)
బానిసత్వమే మానవుడికి ఒక మచ్చ అనుకుంటే, పిల్లలను బానిసలుగా మార్చడం దానికి అనేక రెట్లు తీవ్ర సమస్య. ఒక సారి వారి మూలాల్నుంచి పెకిలించబడ్డాక, వారి జీవితాలకు ఎటువంటి పూచీ ఉండదు. ఒకసారి ఆ వలయం నుంచి రక్షించబడినా, స్వయంసమృద్ధి కలిగే దాకా వారికి సురక్షిత స్థావరం దొరకడం చాలా కష్టం. అక్కడ మళ్లీ వారిపై ఏ అత్యాచారమూ జరగకుండా కాపలా కాయడమన్నది ఏ సంస్థకైనా కత్తి మీద సామే.
3. ప్రివెన్షన్ (నిరోధించే చర్యలు)- శాశ్వతంగా దీన్ని నిర్మూలించాలంటే ఒకటే మార్గం, కూకటి వేళ్లని పెకిలించడం. ఆర్ధిక శక్తిని ఉపయోగించి, ఏ వ్యాపారాన్ని దెబ్బతియ్యాలన్నా దాని లాభాన్ని శూన్యం చెయ్యాలి. ఒక పిల్లవాడిని బానిసగా మార్చేందుకయ్యే ఖర్చు పెంచాలి అంటే లావాదేవీలలో (కాస్ట్, సప్లై, ప్రోడక్షన్ అన్ని దశల్లోనూ) ఆటంకాలు కల్పించగలగాలి. ట్రాఫికర్లు ఆశించే లాభాన్ని ప్రబావితం చెయ్యగలిగే పాలసీలను - సప్లై వైపు నించీ, డిమాండ్ వైపు నించీ – కూడా తయారు చేసుకోవాలి. వాటి కోసం పటిష్టమైన చట్టాలనీ, వాటి అమలునూ కోరుకుని సాధించే రాజకీయ ఇచ్ఛాశక్తి (పొలిటికల్ విల్) కావాలి మనకి.
4. పార్టనర్‌షిప్ (భాగస్వామ్యం వహించే చర్యలు)
జూలై 30న ట్రాఫికింగ్‌కి వ్యతిరేక దినంగా గుర్తించారు. దానిని ప్రజల్లో ఈ సమస్య పట్ల సానుభూతినీ, సహకారాన్నీ కూడగట్టడానికి వినియోగించాలి. సునీతాకృష్ణన్ వంటి అపూర్వ మహిళలు – తనపై 8వ ఏట జరిగిన గాంగ్ రేప్ వంటి దారుణాన్ని వ్యక్తిగతంగా అధిగమించి నిలబడడమే కాక ఆ నిప్పుల వర్షంలో నిలబడ్డ దురదృష్టజీవుల్ని నీడలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంలో ఆమె పదేపదే ఒకే మాటను చెప్తుంది – ఈ పోరాటంలో ఆమెకు అత్యంత ప్రయాస కలిగించే అంశం, సమాజం ఈ బాధితులను కలుపుకునేలా చెయ్యడమేనట. ఆమెతో కలిసి పని చేసిన వారు సైతం – ఆ విక్టింలను పనిలో చేర్చుకోడానికి ఇష్టపడకపోడాన్ని ఆమె బాధగా ఎత్తి చూపిస్తుంది. సమాజపు ఆమోదం కోసం నాలుగో దిశగా వేసే ఈ అడుగు కూడా ప్రధానమైనదే.
శాశ్వత పరిష్కారం సుదూరంగా ఉంది, నిజమే ... మరి ఈలోగా మనం ఏమేం చెయ్యగలం? మెజారిటి ప్రజలకు ఇది ముఖ్య సమస్య అని చెప్పి ఒప్పించగలగాలి. అది ఎక్కడో బలహీనవర్గపు పిల్లలకు సంభవించేది మన పిల్లలకు కాదని అనుకునే మధ్యతరగతికి – సమస్య అసలు స్వరూపం తెలియజేయాలి. దిక్కులేని పిల్లల రక్తం తాగి బలిసిన మృగం, దాని వేటును ఉన్నతవర్గపు పిల్లల మీద కూడా వెయ్యకమానదు. ఒక ఐయేఎస్ ఆఫీసర్ కూతురు కూడా ఈ ట్రాఫికింగ్ కి బలయి, ‘ప్రజ్వల’ రక్షించగా బయటపడ్డ సంగతి గుర్తు చెయ్యాలి. మనకి పక్కనే అగాధాన్ని ఉంచుకుని, నిత్యం దానిలో వేలాది పిల్లలు నెట్టబడుతూంటే - దానిలో మనం పడంలెమ్మని ఊరుకోడం మూర్ఖత్వమని వారికి వివరించగలగాలి.
హైడ్రాలాగా అనేక ముఖాలున్న సమస్య ఇది కనక ప్రత్యేక నైపుణ్యం కల పౌర సమాజ సంస్థలు దీనికని పూనుకోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్ జీవోలన్నీ – కలిసి పనిచేసేందుకు సమైక్యవిధానాలను రూపొందించుకోడం, లోపాలను పూరించుకోడానికి అవసరమైన టెక్నాలజీని సమకూర్చుకోడం, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించడం వంటి అనేక కార్యక్రమాలను – ఒకే లక్ష్యసాధన - కోసం ప్రణాళికగా చేపడితే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అన్నిటి కంటే ముందు ఈసమస్య తీవ్రత తెలిసేటట్టు ఎన్ జీవోలు, ప్రజలకి సరైన అర్ధాన్ని అందించని ‘ట్రాఫికింగ్’ అనే పటాటోపపు మాటను వదిలి ‘దొంగిలించడం’, ‘అమ్మడం’ అనే మాటలను వాడడం మంచిది.

Thursday, 23 August 2018

మైనారిటీ హక్కులా ... అవెందుకు?


మైనారిటీ హక్కులా ... అవెందుకు?
అనగనగా ... ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం – దుస్తుల తయారీకి పేరుమోసింది. వాటి ఎగుమతి వల్ల రాజ్యానికి చాలా ఆదాయం వచ్చేది. దర్జీ పని ఆపౌరులకి ప్రధాన వృత్తి. ఇలా ఉండగా దేశంలో తిరుగుబాటు జరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఒక పద్ధతి ప్రకారం పరిపాలన జరగాలని, కొన్ని నియమాలూ, సూత్రాలు రాసుకున్నారు. పౌరులందరికీ సమాన హక్కులూ, సమానావకాశాలూ ఉండాలనుకుని, వివరాలు సేకరించారు. రాజ్యంలో కుట్టుమిషన్‌లన్నీ కుడి చేతి వాటం. అయితే జనాభాలో కనీసం పది శాతం వరకూ ఎడమ చేతి వాటం ఉన్న వారని లెక్కల్లో తెలిసింది. వారికి కూడా జీవనోపాధికి సరైన అవకాశం దొరకాలంటే - కొన్ని ఏర్పాట్లు అవసరం అనుకున్నారు. ఎ.చే.వా. వారికోసం ఎడమ చేతి వాటపు మిషన్లుండాలి. వారికి ప్రత్యేకించి శిక్షణా స్థలాలుండాలి. ఎ.చే.వా. కుట్టుమిషన్ల - తయారీ కోసం, శిక్షణ కోసం, అమ్మకం కోసం ప్రచారం చేసుకునే హక్కు కల్పించింది. ఇవేవీ - కు.చే.వా. మీద నిర్లక్ష్యంతో కాదు, సంఖ్యాబలం వల్ల వారికి దొరికే సౌకర్యాలని, సంఖ్యలో తక్కువైన ఎ.చే.వా. వారికి కూడా కల్పించేందుకే. ఆహక్కుల నుపయోగించుకుని, ఎ.చే.వా. వారి తలసరి ఆదాయం పెరిగితే - కు.చే.వా. వారి ఆదాయం తగ్గకపోగా - మొత్తం దేశాదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. 
మైనారిటీ హక్కులెందుకనే ప్రశ్నకి జవాబు ఇంత సరళమా? చూద్దాం. 
మన రాజ్యాంగం మైనారిటీ సమూహాల కోసం ఏం హక్కులిచ్చింది? మూడు, (a) విద్యా సంస్థల్ని నడుపుకోడానికి (Article 30); (b) వారి భాష, లిపి, సంస్కృతిని రక్షించుకోడానికి (Article 29); (c) మత సంబంధమైన కార్యకలాపాలని నడుపుకోడానికి (Article 26). మెజారిటీ/మైనారిటీ సంస్కృతులని మన కథలోని కుడి/ఎడమ వాటాలతో పోల్చి చూసుకుంటే – కథలో అందరికీ లాభం కలుగుతోంది కదా, నిజ జీవితంలో ఆహక్కుల పట్ల కొంత వ్యతిరేకత ఎందుకు వ్యక్తమౌతోంది? అసలు - ఆ పోలిక సరైనదేనా అనే ప్రశ్న వస్తుంది. ఇంకా లోతుగా వెళ్తే, విద్య, భాష, సంస్కృతి వరకూ సరే గానీ ‘మతం’ – ‘జీవనోపాధి’ వంటి నిత్యావసరమా అనే ప్రశ్న ఉండనే ఉంది.

నిజమే, ఆదాయం లాగా మతవిశ్వాసాలన్నవి కొలవగలిగే వస్తువు కాదు మరి, ఆ లాభనష్టాలని బేరీజు ఏమని వెయ్యగలం? మతాన్ని నమ్మని వారికి మతస్వేచ్ఛ వీసమెత్తు విలువ కూడా చెయ్యకపోవచ్చు. కానీ ఒక దిలీప్ – అల్లా రఖా రెహమాన్‌గా మారి, నా సంగీతానికి ప్రేరణ – ఇస్లామే అంటే కాదని ఎవరైనా ఎందుకనాలి? ‘కాచర్ ఇన్ ద రై’ అనే పుస్తకంతో సంచలనం రేపి, స్టేటస్ కోని ప్రశ్నించడం ప్రధాన తత్వంగా రచనలు సాగించిన 20వ శతాబ్ది అమెరికన్ రచయిత – జెడి సాలింజర్ – తాను అద్వైత వేదాంతానికి అనుయాయినంటే – ఎవరైనా ఏమంటారు? ఎవరి నమ్మకాలు వారి ఇష్టం అని తప్ప.
సరే, వ్యక్తిగతమైన మత స్వేచ్ఛ వరకూ అర్ధముంది, సామూహికపరమైన వెసులుబాట్లు ఎందుకు? మత ప్రచారాలు సమాజానికి అవసరమా అనిపిస్తుంది. కానీ ఆప్రశ్న ఇప్పటిది కాదు. మతానికి మనమిచ్చే విలువ ఏమిటన్నది రాజ్యాంగం రాసుకున్నప్పుడే నిశ్చయమైపోయింది. ‘సెక్యులర్’ అనే పదానికి – ‘పాశ్చాత్య సమాజాలలోలాగా, రాజ్యాన్ని మతం నుంచి వేరుచేసి చూడడం’ – అన్న భావన కాక – ‘అన్ని మతాలనీ సమానంగా గౌరవించడం’ అనే అర్ధం చెప్పుకున్నాం. మతానికి దూరంగా ఉండడం – అనేది కాక – ‘అన్ని మతాలకూ సమానావకాశాలు ఇవ్వడం’ అనేదే – మన విధానం అయ్యింది. ఆదిశలో కొంత దూరం వచ్చాక - ఇప్పుడు కేవలం మైనారిటీ మతాలని మాత్రమే ఆప్రశ్న వెయ్యడం తర్కబద్ధం కాదు. 
మనమే కాదు, ప్రజాస్వామ్య భావాలు పచ్చి పచ్చిగా ఉన్న కాలం గనక పాకిస్థాన్ రూపశిల్పి జిన్నా కూడా – వారి రాజ్యాంగ నిర్మాణ సభని ఉద్దేశించి ఇలా మాట్లాడేడు. “… మీరంతా స్వేచ్ఛగా గుళ్లకైనా, మసీదులకైనా మరే ఆరాధనా స్థలాలకైనా వెళ్లవచ్చు. మీరే మతానికి చెందినవారన్నదానితో రాజ్యానికి ఏమీ సంబంధం లేదు ... ఇక నుండీ హిందువులు హిందువులు కారు, ముస్లిములు ముస్లిములు కారు, మత పరమైన అర్ధంలో కాదు గాని రాజకీయ అర్ధంలో వారు కేవలం పాకిస్థాన్ రాజ్యపౌరులు మాత్రమే.” (జిన్నా 1947)
‘మాటలు కోటలు దాటి ఏం ప్రయోజనం, చేతల్లో లేక పోయాక’ - అని నిట్టూర్చి లాభంలేదు. అవి రెండూ ఒక దాన్ని మరొకటి ప్రభావితం చేసుకుంటాయి. మాటలకంత ప్రాముఖ్యం లేదనుకుంటే సెక్యులర్ అనే మాట తొలగించాలనే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది ఇప్పుడు? మైనారిటీ హక్కులన్న మాట వింటేనే మధ్యతరగతికి అంత చిరాకు వస్తోంది? విఐపీ క్యూలో వెళ్లేవారి మీద మామూలు క్యూలోని జనానికి కలిగే అసూయ వంటిది – మెజారిటీలో ఎలా నాటుకుంది? కనక మాటల కున్న ప్రాముఖ్యతని గుర్తిస్తే, గుసగుసలాడుకోడం కాక వాటిని బహిరంగంగా చెప్పడం, చర్చించడమే ఆరోగ్యకరం అని తేలుతుంది.
మత విశ్వాసాలూ, ప్రచారాలని పట్టించుకోని న్యూట్రల్ ప్రజలకి కూడా – న్యాయ పాలనలో తరతమ భేదాలున్నాయని, ‘పర్సనల్ లా’ పేరున ఇస్లాం మతస్థులకు ప్రత్యేక విచారణ చేస్తున్నారని విమర్శ ఉంది. బహుభార్యత్వం, విడాకుల విషయాలు వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. షాబానో కేసులో – భరణం విషయమై – సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు – స్త్రీల పక్షాన ఉండిందనీ; కానీ ఇస్లాం వివాహ చట్టం దానిని సమ్మతించదని – ముస్లిం ఫండమెంటలిస్ట్‌లు పట్టుపట్టడం వల్ల, రాజీవ్ గాంధీ ప్రభుత్వం తోసిపుచ్చిందన్న విషయం - వారందరూ గుర్తు చేసుకుంటారు. ఈ సమస్యకి పరిష్కారం యుసిసి, యూనిఫార్మ్ సివిల్ కోడ్ (పౌరులందరికీ ఒకే చట్టం) - అని భావిస్తారు. 
అయితే రాజకీయంగా ఆ డిమాండ్ ఏ పక్షంవారు చేస్తున్నారన్న దాని మీద, వారి ఉద్దేశాల మీద - దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఆ స్త్రీల కన్యాయం జరిగినందుకు కాక, ఆ పురుషులకి ఉన్న అదనపు సౌకర్యం మాకెందుకు లేదని ప్రశ్నించేవారు గానీ ఆ యూసిసి డిమాండ్ వెనక ఉన్నట్టైతే - మేలు జరక్కపోగా కీడు జరిగేను. ఎందుకంటే – స్త్రీలకి అన్యాయం చేసే చట్టాలు కేవలం ఇస్లాం వివాహ చట్టాల్లోనే కాదు, అన్ని పర్సనల్ లాల్లోనూ రకరకాలుగా ఉన్నాయి. ఆ అసమానతల పట్ల స్త్రీవాదులు ఎప్పటి నుండో మాట్లాడుతున్నారు. ఉదాహరణకి – హిందూ వివాహ చట్టం ప్రకారం – భార్యకి దత్తత తెచ్చుకునే స్వేచ్ఛా లేదు, ఇచ్చే స్వతంత్రమూ లేదు. అసలు వైదిక మతాచారపు తతంగం జరపకపోతే వివాహానికి చట్టబద్ధతే లేదు. 
ఈ ఆధునిక భావాలను చర్చించడం, అర్ధం చేసుకోడం దాకా కాదు, కనీసం గుర్తించడానికి కూడా ఒప్పుకోని హిందూ మత ఆధిక్యవాదులు – యూసిసి అమలుజరగాలని కోరుకోడంలో అర్ధమేమిటి? వారి దృష్టిలో హిందూ లా సర్వోన్నతమైంది కనక – దానినే సర్వ మతస్తులూ పాటించాలని వారి కోరిక. తినే తిండి మీద ఆంక్షలు విధించి, జీవనోపాధి మీద దెబ్బకొట్టి, మైనారిటీ వివాహచట్టాలని మార్చాలని మాట్లాడితే – ఆ సమూహాలకి చెందిన స్త్రీలు కూడా – ఆ వాదనని విశ్వసించలేరు. అన్ని లోపాలనూ ఆధిగమించే వివాహచట్టాలు – తయారవాలంటే, బాధితులైన స్త్రీలు పాల్గొంటేనే జరుగుతుంది. వారి నేతృత్వంలో సవరణలు జరగాలి. 
ఒక వాదనని సమర్ధించే ముందు, పూర్వాపరాలు విచారించుకోవాలి. సంక్షేమ సంస్థల్లోకీ – రాజకీయ ఎజెండాలు చొరబడుతోన్న కాలం కనక ఒకటికి రెండు సార్లు వాటి కార్యాచరణని తరచి చూసుకోవాలి. ఉదాహరణకి, చర్చిల్లో కన్ఫెషన్ అనే ఆచారం వల్ల ఆడవారి మీద లైంగికదోపిడీ జరిగే ఆస్కారం పెరుగుతోందనీ, కనక కన్ఫెషన్ను నిషేధించాలనీ – ‘నేషనల్ కమిషన్ ఫర్ విమెన్’ ఈ మధ్య రికమెండ్ చేసింది. దాని మీద స్వామి అగ్నివేశ్ స్పందన గమనిస్తే దృష్టికోణంలో సమగ్రత ఉండాలని మనకి అర్ధమౌతుంది. రాంపాల్, ఆసారాం, రాంరహీం వంటి నేరస్థులను కూడా కమిషన్ అదే విధంగా ఖండించాలని ఆయన కోరడం – వెనక ఉన్న కారణం అదే. అసమానతల పట్ల విమర్శ – ఒక సమూహాన్ని గురి చేసి ఉంటే, అది తాత్కాలిక రాజకీయ లబ్ధిని ఇస్తుందేమో కానీ శాశ్వత పరిష్కారాలని సూచించదు. 
మైనారిటీ హక్కులు – మెజారిటీవారికి నష్టం చెయ్యవని నమ్ముతూ, యూసిసి అనేది మైనారిటీలకి నష్టం కలిగించని రీతిలో, వారి సమ్మతి సహకారాలతో తయారవ్వాలని కోరుకోవాలి. 

Monday, 30 July 2018

బయో మైనారిటీల విషమ సమస్యనిరాయుధులైన పాలస్తానీయుల్ని ఇజ్రాయెల్ స్నైపర్లు చేస్తున్న హత్యాకాండతో - గాజా తదితర ఆక్రమిత ప్రాంతాలలో మానవజీవితం మరింత పతనమైంది. రోహింగ్యాలని - మియాన్మార్ లో జెనోసైడ్ చెయ్యడం, ఇండియా, బాంగ్లాదేశ్, ఇండోనేషియా, థాయ్ లాండ్, ఇంకా మిగిలిన ఆసియా దేశాలలో అవమానాలకి గురి చెయ్యడం. కాశ్మీరులో సామాన్యుల ఇష్టాయిష్టాలతో సంబంధంలేకుండా ఇండియన్ మిలిటరీ స్థావరం ఏర్పరుచుకోడం – ప్రతీ ఒక్క సందర్భంలోనూ, టార్గెట్ అయిన కమ్యూనిటీలు ముస్లింలే, కాని విభిన్నమైన చారిత్రక సందర్భం కలిగిన సమూహాలు. ఈ సమూహాలన్నిటి ఊచకోతల వెనకనుండి నడిపించే చలనసూత్రం ఏది, పైపైన చూస్తే, అది ప్రధానంగా వారు ముస్లింలవడమే అనిపించవచ్చు – కాని అది వాస్తవం కాదు.
ఎక్కడెక్కడ నివసించే ముస్లింలంతా –ఒకటే  విశ్వమానవ సమూహం (అది కూడా ఒకే మాట మీద, పూర్తి సమన్వయంతో నడుచుకునే సమూహం) లో భాగాలన్నట్టు -  ఊహించడం, చూపించడం – ఒక మిథ్య.  కొన్ని ప్రత్యేకమైన పాశ్చాత్య, ముస్లిం  రాజకీయ మత శాస్త్రాలు కలిపి అల్లిన వల. దానిని స్వయంనిరూపక  నిత్యసత్యం అని భావించడం పొరపాటు. గాజాలో ఇజ్రాయెల్ సాగించే -ఒక చోటికి చేర్చి, ఎక్కడి కీ పోనీకుండా కాపలాకాసి, ఆకలితో మాడ్చి చంపే – నిర్బంధ మారణకాండ carceral genocide.
ఏ స్థిరమైన జీవికా మిగలనీకుండా బయటికి పెకిలించి చెదరగొట్టి, చావును చేరుకునే దాకా  వారిని తరిమికొట్టే - వలస జాతుల మారణకాండ diasporic genocide.
bipolar condition of biominorities
1.     అతి శక్తివంతమైన మిలిటరీ ఉంది ఇజ్రాయెల్ వద్ద, పాలస్తీనా వారిని తేలికగా తరిమెయ్యవచ్చు కదా – ఎందుకలా చెయ్యదు?
 1A:
·        ఆ పాలస్తీనా వారికి సాయుధ ప్రతిఘటనలో సుదీర్ఘ చరిత్ర ఉంది, మిడిల్ ఈస్ట్ దేశాలు సహాయం చేసిన సందర్భాలూ ఉన్నాయి (ఈమధ్యనే ఇరాన్ సహాయం చెసింది.) పట్టుదలగా పోరాడతారు గనక వారిని నిర్బంధించి చంపాలి.
·        బంధించబడిన పాలస్తీనా జనాభా ఎదురుగా లేకుంటే – ప్రస్తుతం అధికారం చెలాయిస్తున్న మతతత్వ రైట్ కి గానీ, జనామోదం పొందిన బెంజమిన్ నెతనాయూ అథారిటేరియనిజంకి గానీ అస్థిత్వమే మిగలదు.  టర్కీలోకుర్దులూ, హంగరీలో యూదులూ, ఇండియాలో ముస్లింలూ – ఇలాటి కంటికి కనబడే బయోమైనారిటీలు లేకపోతే – ప్రజాస్వామ్యమనే పెద్ద ప్రమాదం విరుచుకుపడుతుంది. ఇజ్రాయిల్ మతతత్వ రాజకీయాలకు అది సుతరామూ పనికిరాదు. ఇక డొనాల్డ్ ట్రంప్ కైతే తన క్లైంట్ దేశాలు మితవాదులౌతారని సూచనాప్రాయంగా అనిపించిందో – అస్సలు గిట్టదు.

2.మియన్మారులో రోహింగ్యాలని – నిర్బంధించి, శిక్షించి, పస్తులుంచి చంపొచ్చు కదా, ఎందుకు చెయ్యరు?
2A:  పశ్చిమతీరంలో సారవంతమైన భూభాగాలను సాగులోకి తెచ్చుకుని రోహింగ్యాలు - శతాబ్దాల తరబడి బలంగా పాతుకుపోయి ఉన్నారు. ఆ భూములన్నీ పోర్టుల నిర్మాణానికీ, బంగాళాఖాతంలో రవాణా అభివృద్ధికీ – అనువుగా ఉన్నాయి. వారు అక్కడ నుంచి పోవాలి, హత్య, రేప్, సైన్యంతో అణచివేతా – ఇవన్నీ వారిని బయటికితోసేసే ఉద్దేశంతోనే జరుగుతున్నాయి. ఎత్నిక్ జాతుల నాశనం కోరే బౌద్ధ సన్యాసగణాలు – భావజాలపు ఇంధనాన్ని అందిస్తోంది, సైనిక పాలనలో ఇష్టపూర్వకంగా పాలుపంచుకోంటోంది. రోహింగ్యాలు ముస్లింలవడం, మెజారిటీ అయిన బౌద్ధులకు వివాదాస్పదం అవుతున్న మాట నిజమే కానీ రోహింగ్యాలు బలహీనులవడం, మియన్మార్ సముద్రతీరంలో – గ్లోబల్ ఆయువుపట్లనదగ్గ జాగాలలో వారు నివాసాలుండడం – ఈరెండు విషయాలే వారి ఊచకోతకి అసలు కారణాలు.
నేషన్ స్టేట్ లనే హర్మ్యాలన్నీ – కల్తీ లేని జాతి అనే భావన మీదా, తమ జాతి విశేషత మీదా – (కొన్ని బయటకి కనిపించనీయవు గానీ) తమ పునాదిని వేసుకుంటాయి. మైనారిటీ జాతుల బహుళత్వం ఈ ఆధునిక నేషన్ స్టేట్ లకి ఎప్పుడూ కంటిలో నలుసు లాగే కనిపిస్తుంది.  
కనక రకరకాల మారణకాండలన్నీ – మతానికి సంబంధించినవి కాదు, ఉన్మాదవాదపు/ దోపిడీదారు (లేదా రెండూ) - నేషన్ స్టేట్ లకి సంబంధించినవి.

Saturday, 24 March 2018

ఏకాంతంలో పొంచి ఉన్న ప్రమాదం


పోర్న్ అనే మాటని వినకుండా, అదేమిటో తెలియకుండా చాలా ఏళ్లే గడిపేసి ఉంటారు మనలో చాలా మంది. మనకున్న సమస్యల్లో అదేమంత ముఖ్యమైనది కాదని కొందరంటారు.  కానీ ఇంటర్నెట్ రాకతో సామాజికంగా వస్తున్న పెనుమార్పుల్లో ఒకటి ఈపోర్నోగ్రఫీ అనేది. దాని ప్రభావాన్ని అంచనా కట్టేందుకు – పోర్న్ మంచిచెడ్డల్ని చర్చించుకోవడం అవసరం. 

పొర్న్ అంటే న్యూడిటీ (నగ్నత్వం) అని పొరబడతారు చాలామంది. నగ్న దృశ్యాలుండే మాట నిజమే కానీ 
పోర్న్ అంటే దృశ్యాలు మాత్రమే కాదు. దానిలోని దృశ్యాలూ, సందర్భాలూ, సంభాషణలూ – ఇవన్నీ ఒకే ఒక లక్ష్యం కోసం ఉంటాయి, అది - వాడకందారులో – సెక్సువల్ ఎక్సైట్‌మెంట్‌ని (ఉత్తేజాన్ని) కలగజేయడం.  దాని వాడకందారుల్లో కొంత భాగం దాని తప్పొప్పుల గురించి ఆలోచిస్తారనుకోను, దొరికితే చూసేదీ, అందుబాటులో లేదంటే మానుకునేది. వారికి ఈచర్చోపచర్చలతో సంబంధంలేదు.

పోర్న్‌కి సంబంధించి అనేక కోణాలున్నాయి. దానిని వ్యతిరేకించే వారందరి వాదనలనూ క్రోడీకరిస్తే  రెండు ప్రధాన విషయాలు కనిపిస్తాయి. పోర్న్ తయారీలో పాల్గొనేవారి (స్త్రీపురుషులే కాదు - పిల్లలూ, జంతువులూ కూడా దానిలో భాగమే) మీద జరిగే పీడనా, తయారయి సమాజంలోకి విడుదలయ్యాక ప్రజల మీద అది చూపే ప్రభావం – ఈ రెండు విషయాల పట్లా  ఆందోళన వ్యక్తమౌతూ ఉంటుంది.

పోర్న్ వ్యతిరేకుల్ని వ్యతిరేకించే వారున్నారు. వారి ఉద్దేశం ప్రకారం – 
పోర్న్ అనేది ఒక పర్సనల్ ఛాయిస్. మనిషికుండే అనేకావసరాల్లో – ఒక ముఖ్యమైన అవసరాన్ని తీర్చుకునే ఒకానొక మార్గం. అయితే పోర్న్ తయారీలో జరిగే మానవహక్కుల ఉల్లంఘనని వీరూ సమర్ధించరు. ఎవరినీ బలవంతం చెయ్యకూడదనీ, తమ స్వంత ఇష్టంతో దానిలో పాల్గొనేవారి శ్రమకి తగిన పారితోషికం దొరకాలనీ వీరు ఆశిస్తారు. వారి హక్కుల రక్షణ కల్పించే విధంగా గట్టి చట్టాలు తేవాలి గానీ, పోర్న్ తయారీని నిషేధించాలనటం సరికాదని వీరంటారు. కన్నో కాలో వంగి – సెక్స్‌లో పాల్గోలేని వారూ, వృద్ధులూ, మరేదన్నా కారణంగా పోర్న్ తో తృప్తి చెందేవారు చాలా మంది ఉండొచ్చు. ఏ సమాజంలో అయితే స్త్రీపురుషుల మధ్య దూరాలుంటాయో, సెక్స్ స్వేచ్ఛ అతి పరిమితంగా ఉంటుందో – అలాటి చోట పోర్న్ వాడకం అనివార్యమౌతుందని, వారి సమస్యలకి అదొక పరిష్కారమనీ వీరి నమ్మకం. మరో మనిషికి తెలిసి ఏ అపకారం చెయ్యకుండా, తమ పడకగదిలోని ఏకాంతంలో – తమకు తోచిన రీతిలో ఆనందం పొందే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉండాలని వీరి అభిప్రాయం.

అయితే దేనిని వీరు పరిష్కారమంటున్నారో – అది మరిన్ని సమస్యలకి కారణమౌతుందనీ- పోర్న్ కారణంగా సెక్స్ నేరాలు పెరుగుతున్నాయన్న విమర్శ ప్రబలంగా వినిపిస్తోంది.
ఇదిగో, సమాజంలో అన్ని రకాలవారూ ఉంటారు, నేరమనస్తత్వం ఉన్నవారు పోర్న్ చూడకపోయినా  ఆనేరాలకు పాల్పడతారు, అలాటివారికీ, బలహీనమనస్కులకూ మేం పూచీపడలేం. మేం పోర్న్ చూసినా, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు, అవమానించలేదు, కనీసం చెడుదృష్టితో కూడా చూడలేదు, మా ప్రవర్తనకి మేం పూర్తి బాధ్యత వహిస్తాం, మీకిష్టం లేకపోతే మీరు చూడడం మానుకోండి, అంతేగాని అది తప్పని అంటే మాత్రం మేం ససేమిరా ఒప్పుకోం!” అని కరాఖండీగా చెప్పే నిజాయితీపరులున్నారు. పోర్న్ వాడకంలో పాశ్చాత్యదేశాలు మన కంటే ముందున్నాయి, అక్కడ దానికి సంబంధించిన చర్చలూ, చట్టాలూ అనేకం వచ్చాయి వాటిని గురించి తెలుసుకోమనీ, కాస్త అప్ గ్రేడ్ అవమనీ వారు సలహా ఇస్తారు. నిజమే, అది మంచి సలహాయే. మన కంటే ముందు నడుస్తున్నవారి అనుభవం నుంచి నేర్చుకోడం సరైనపనే కదా. ఆపనే చేద్దామని నిర్ణయించుకున్నాను.

నార్మన్ డాయిడ్జ్ అనే కెనడియన్ మానసిక శాస్త్రవేత్త,  
‘The Brain that Changes Itself' (2007),
అనే పుస్తకంలో బ్రెయిన్ సైన్స్ కి సంబంధించిన సరికొత్త విషయాలను వివరిస్తూ, మెదడును ఒక సజీవ అవయవంగా చూపిస్తాడు.  Acquired Tastes and Loves (అందిపుచ్చుకున్న అభిరుచులు, ప్రేమలు) అనే పేరున్న ఒక అధ్యాయంలో పోర్నోగ్రఫీ గురించి అతను రాసిన విషయాలు – ఈనాటి పరిణామాలను అర్ధం చేసుకోడానికి ఉపయోగపడతాయి.
సెక్స్ అనేది శరీరానికి సంబంధించినదే అయినా మెదడు పాత్ర దానిలో తిరుగులేనిదనే విషయం దాదాపు అందరికీ తెలిసినదే. ఆ సంగతిని గుర్తుచేసుకుంటూ, పోర్న్ అనేదానిని కొన్ని దృశ్యాల సంపుటిగా కాక ఒక శక్తివంతమైన భావజాల ప్రసారంగా అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సెక్స్ దృశ్యాలను చూసినప్పుడు వ్యక్తుల్లో అసంకల్పితంగా ప్రతి స్పందన ఉంటుంది కనక అది instincts (సహజాతాలు)కి సంబంధించిన విషయం అనుకుంటారు. కానీ నార్మన్ అది నిజం కాదంటాడు. అలా అయితే మిలియన్ల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల అభిరుచులే మనవీ అవ్వాలి కదా అని ప్రశ్నిస్తాడు. సెక్స్ అభిరుచిపై సంస్కృతి, అనుభవం – వీటి ప్రభావం ఉంటుందనీ, అవి మెదడు మీద ముద్రవేస్తాయని చెప్తాడు. సెక్స్ తో పూర్తి పరిచయం కాని, ఇంకా అభిరుచులు పూర్తిగా తయారుకాని యువత మెదడుపై పోర్నోగ్రఫీ ప్రభావం ఏ రూపం తీసుకుంటుందో అంచనా కట్టడం కూడా కష్టమే.    
మనకు ఆనందం రెండు రకాలుగా కలుగుతుందంటాడు నార్మన్.  ఒకటి  ఉద్రేకపరిచేది, ఒకటి సంతృప్తిపరిచేది.  మొదటది - ఒక మంచి భోజనాన్నో, సెక్స్‌నో ఊహించుకుంటూ – కోరిక పుట్టించే ఆనందాన్నికలిగించేది. ఆరకమైన ఆనందానికి  కారణం ఆసమయంలో మెదడులో స్రవించే డోపమైన్ అని చెప్తాడు.  రెండవది ఊహలు కార్యరూపం తీసుకుని,  పూర్తయ్యాక, పొందిన అనుభవం నుంచి వచ్చే ఆనందం'. దానికీ మెదడులో స్రవించే ఎండార్ఫిన్కీ సంబంధముందని చెప్తాడు. అనేక రకాలైన సెక్సువల్ వస్తువుల్ని అందించే పోర్న్ వల్ల కలిగే ఆనందం సంతృప్తి కంటే, ఉద్రేకం కలిగించే భాగాలని మరింత ప్రేరేపిస్తూ ఉంటుందంటాడు. డ్రగ్, ఆల్కహాల్ లలాగే పోర్న్ కూడా అడిక్షన్ (వ్యసనం) కాగలదని చెప్తూ, వాటి పోలికని ఇలా వివరిస్తాడు. ఆ పదార్ధాల లాగే పోర్న్ కూడా - పని విజయవంతంగా జరిగినప్పుడు  సహజంగా స్రవించాల్సిన డోపమైన్ వ్యవస్థని హైజాక్ చేసి – పనితో సంబంధం లేకుండానే ఆనందం కలిగించే ప్రయత్నం చేస్తుందని చెప్తాడు. 

2001 లో MSNBC.com వారి సర్వేలో 80% ప్రజలు తమ ఉద్యోగాలనీ, కుటుంబాలనీ నిర్లక్ష్యం చేస్తూ పోర్న్ చూడడంలో గడుపుతున్నామని చెప్పారట. 2007లో అతను ఈ పుస్తకం రాసేనాటికి ఉన్న లెక్కల ప్రకారం కేవలం పోర్న్ కారణంగా వీడియోలని అద్దెకు తీసుకునే రేటు 25% పెరిగిందట. సైకియాట్రిస్ట్‌గా అతని అనుభవంలోకి వచ్చిన కేసుల ఆధారంగా నార్మన్ కొన్ని అంశాలని ప్రతిపాదించి, వివరణలిచ్చాడు. సెక్సువల్ టెన్షన్ నుంచి విడుదల చేస్తుందని, ఆరోగ్యకరమైన ఆనందం కలుగుతుందనీ నమ్మి పోర్న్ వాడేవారికి ముందుముందుకి ఆనందం తగ్గిపోడం తాను గమనించానని, పోర్న్‌ని నచ్చుకోలేక పోతూ కూడా అది కావాలని ఆరాటపడే విచిత్ర పరిణామాన్ని సైతం చూసానని నార్మన్ రాస్తాడు. దానికి కారణాలను మనకి అర్ధమయే భాషలో వివరించే ప్రయత్నం చేస్తాడు.

అడిక్షన్ అంటే సాధారణంగా అందరికీ తెలిసిన పదమేకానీ, మానసిక శాస్త్ర పరిభాషలో దానిని అర్ధంచేసుకోడం అవసరం.

  •  తాము చేసే పని మీద నియంత్రణ కోల్పోడం,
  •  దుష్ఫలితాలు కలుగుతున్నాయని తెలిసీ, పనిని ఆపలేకపోడం,
  • సంతృప్తి చెందేందుకు మరింత ఎక్కువ మోతాదు కావలసిరావడం(టాలరెన్స్  పెరుగుదల),
  • పని పూర్తికాకపోతే విపరీతమైన బాధ (విత్ డ్రాయల్) అనుభవించడం – ఇవన్నీ అడిక్షన్ లక్షణాలు.
వ్యసనం వల్ల మెదడు దానికి సంబంధించిన అంశాలకి సెన్సిటైజ్ అయిఉంటుంది, ఏ చిన్న అవకాశం దొరికినా అది అవధులు దాటేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.  అప్పుడు అడిక్ట్‌లో craving (ఆపుకోలేనంత తీవ్రవాంఛ) కలుగుతూ ఉంటుంది.

పోర్న్ వాడకం పెరిగాక, వ్యక్తులు పడకగదిలో తమ భాగస్వాములతో ఇంద్రియాల అనుభవానికి బదులుగా, తమ మెదడుల్లోకి దిగుమతి అయిన పోర్న్ రచనలలోని సినేరియో(సందర్భాలు)లలో తమను తాము పాత్రలుగా భావించి, fantasize చేసుకోడం (ఊహించుకుంటూ ఉండడం) – ఒక వాస్తవం. ఒక పక్క మనుషుల మనసుల్లో భావుకత్వం తగ్గిపోతూ ఉండడం, మరో పక్క ఆ రచనలు నానాటికీ మరింత అనాగరికంగా, హింసాత్మకంగా మారుతూపోడం గమనించాల్సిన విషయాలు.

తమ భాగస్వాములు వస్తుతహ ఆకర్షణీయంగానే తోచినా, వారి పట్ల ఉత్తేజం కలగకపోడం - ఈ అడిక్షన్కి మరొక పార్శ్వం. ఒకప్పుడు ఉత్తేజపరిచిన పోర్న్ దృశ్యాలు సైతం తరవాతి కాలంలో ఆనందాన్నివ్వకపోడం; ఆ నిరుత్సాహం – తమ సంబంధాలలోకి పాకడం; దానిని పోగొట్టుకోడానికి – వారికి అయిష్టమైన పనులను చెయ్యమని తమ  భాగస్వాములను బలవంతపెట్టడం – ఇవన్నీ పాశ్చాత్యసమాజాల ప్రజలు స్వయంగా అనుభవిస్తున్నవే. 

మరొక ముఖ్యపరిణామం - తమ సామర్ధ్యం గురించి అనుమానాలు కలగడం. పోర్న్ చూసే యువకులు అమితంగా ఆందోళన చెందే అంశం - నపుంసకత్వం. పేరుకి erectile dysfunction (అంగ స్థంభనంలో సమస్య) అంటారు గాని, నిజానికి సమస్య వారి అంగాలలో కాదు, మెదడుల్లో ఉందంటాడు నార్మన్. పోర్న్ వాడినప్పుడు అంగం బాగానే పనిచేస్తూ ఉంటుంది, వారు వాడుతున్న పోర్న్‌కీ, నపుంసకత్వానికీ ఏదన్నా సంబంధం ఉందేమో అన్న సంగతి చాలా తక్కువ మందికి తడుతుంది మరి.

వాడకందారుల్లో టాలరెన్స్ పెరుగుతున్న కొద్దీ, పోర్నోగ్రాఫర్లు కొత్త కొత్త థీము (కథనాలు) లను ప్రవేశపెడతారు. బలవంతపు సెక్స్, ఆడవారి ముఖాలపై స్ఖలనాలూ, ద్వేషంతోటీ, అవమానంతోటీ కలిపిన సెక్స్ – ఇటువంటి వన్నీ పోర్న్ పత్రికల వారు తయారుచేసే కొత్త రుచుల్లో భాగం. ఆపత్రికల వెనక పేజీలు చూసినట్టైతే వయాగ్రా వంటి మందులూ, వృద్ధుల అంగస్థంభన కోసం తయారవుతున్న మందులంటూ – ప్రకటనలు కోకొల్లలుగా కనిపిస్తాయట.
స్వేచ్ఛా పూరిత సెక్స్ ని ప్రోత్సహించడం, ఫోబియా (అకారణ భయం)లనీ, టాబూ (చెయ్యకూడని పని)లనీ వ్యతిరేకించడం తమ లక్ష్యమని చెప్తారట పోర్న్ తయారీదార్లు. కానీ, అనేక పోర్న్  చిత్రాలలో స్త్రీలని సెక్స్కి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారిగా చిత్రించడం, ఆ కారణంగా వారికి విలువలేనట్టు సూచించడం సర్వసాధారణమని చెబుతాడు. ఒక పుస్తకంలో మగ స్నేహితులతో గడపడానికొచ్చే ఆడవారిని "cum dumpsters" (వీర్యాన్ని పారబోసేందుకున్న బుట్టలు) అని సంబోధించిన విషయం ఎత్తి చూపిస్తాడు.   

ముందే చెప్పినట్లు – రెండో కంటివాడికి తెలిసే పనే లేదు, ఇక చర్చలతో మాకేం పని అనుకునే వారి కోసం కాదు, పోర్న్ పూర్వాపరాల గురించి తెలుసుకుని, తరవాత నిర్ణయానికి రావాలనుకునే వారి కోసం ఈ వ్యాసం. ఎందుకంటే నార్మన్ కూడా తన పుస్తకంలో - పోర్న్ వ్యసనానికి చికిత్స కోసం వచ్చిన పేషెంట్లు, తమ మెదడులో ఏర్పడుతున్న మార్పుల గురించి తెలుసుకోగానే బిత్తరపోయారనీ, కొద్దికొద్దిగా దాని నుండి తేరుకున్నారనీ - రాస్తాడు. వారు పూర్తిగా కోలుకున్నాక తమ భాగస్వాముల పట్ల మళ్లీ ఆకర్షణ కూడా తిరిగివచ్చిందని చెప్తాడు.
ఉప్పెనలా ముంచెత్తుతున్న ఇంటర్నెట్లో – పోర్న్ అనే అంశం – మనం కావాలనుకున్నా వద్దనుకున్నా – పిల్లా పెద్దా తేడా లేకుండా అందరి చేతికీ అందుబాటులో ఉండబోతోంది. కనక ఏ రకమైన అవగాహనా లేకుండా ఒంటరిగా దానికి మన మెదడును అప్పగించాలో, లేక నలుగురితోనూ చర్చలకు దిగి – దాని బాగోగులను ఎప్పటికప్పుడు అంచనా కట్టుకోవాలో – మరి నిర్ణయించుకోండి.