Monday, 28 March 2016

వ్యక్తి వాదం తోనే ఆగిపోదామా?

దీనిని 'తెలుగు వెలుగు' ఫిబ్రవరి సంచికలో ప్రచురించారు. దాని link కింద ఇచ్చాను.
http://ramojifoundation.org/flipbook/link.php

విశ్వ శ్రేయస్సు కోసమే సాహిత్య సృష్టి జరగాలని భారతీయ సంప్రదాయం చెప్తూ ఉంటుంది. మన ప్రాచీన సాహిత్యంలో ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్న వాల్మీకి వాక్యం న్యాయ పరిభాషకు క్లుప్తమైన వ్యక్తీకరణ అని భావించవచ్చు. 


ఏ నియమ నిబంధనలు సమాజం లోని వ్యక్తులందరూ – తూచా తప్పకుండా పాటిస్తే- సమాజానికి శ్రేయస్కరమని వారు భావించారో, వాటన్నిటిని కలిపి మన పూర్వీకులు ‘ధర్మమ’ని పిలిచారు. కావ్యాల్లో ప్రచారం చేసారు. ఆ ధర్మం ప్రకారం అందరూ నడుచుకుంటే సమాజం లో అందరికీ న్యాయం జరుగుతుందని వారి నమ్మకం అనుకోవచ్చు.
అటువంటి  సార్వకాలికమైన, సార్వజనీనమైన ధర్మం భారతం లోని శాంతిపర్వంలో తిక్కన గారి ఈ పద్యం లో చూడొచ్చు.   
  ఒరులే యవి యొనరించిన
  నరవర అప్రియము తన మనంబునకగు, దా
  నొరులకు నవి సేయకునికి
 పరాయణము పరమ ధర్మ పదములకేల్లన్...
ఇతరులు చేసిన ఏయే పనుల వల్ల తనకు బాధ కలుగుతుందో – ఆ పనులను చేసి వేరొకరికి బాధ కలిగించకూడదని భావం.   
న్యాయం :
నైతిక ప్రవర్తనను నిర్దేశించే ఈ విశ్వజనీన సూత్రం - పద్దెనిమిదవ శతాబ్దపు మహా తత్వవేత్త ఇమ్మాన్యుయేల్ కాంట్  నిర్వచించిన (కాటగారికల్ ఇంపరేటివ్) గా ప్రఖ్యాతి కెక్కింది. లోకంలో అందరూ ఎలా ప్రవర్తించాలని ఆశిస్తామో అదే సార్వజనీన, సార్వకాలిక సూత్రాన్ని న్యాయం, కర్తవ్యం అని ‘కాంట్’ పిలిచాడు.


అంతకు ముందే బౌద్ధ, జైనాల్లోనూ, బైబిల్ (సెర్మన్ ఆన్ ద మౌంట్) లోనూ, కన్ ఫ్యూషియస్ ప్రవచనాల్లోనూ (విశ్వప్రేమ-‘జెన్’) – ఈ ‘సర్వ సమభావన’ను  అన్ని నాగరికతల్లోనూ ప్రబోధించారు.
అనేక శతాబ్దాల నుండీ  మానవ సమాజానికి ‘న్యాయం’ గురించి ఉన్నఅవగాహన – కొద్ది పాటి తేడాలతో ఆయా భాషల్లో మనకు లభిస్తోంది. నీకొక న్యాయం, అన్యులకొక న్యాయం కాదు – అందరికీ ఒకటే న్యాయం అనే భావన ఏ జాతి వాంగ్మయం లోనైనా ఒక ఆదర్శంగా చిత్రించి ఉంటుంది.

ప్రజాసాహిత్యం:
ఆ ఆదర్శానికి విరుద్ధంగా ఉండే సమాజపు తీరుతెన్నులను ప్రజాసాహిత్యం, అందులోనూ ముఖ్యంగా శతక సాహిత్యం నమోదు చేసింది. సమాజంలో ఉండే హెచ్చుతగ్గులూ, దానికి అనుగుణంగా మారే మనుషుల నడవడికలనూ సూటిగా విమర్శించిన వేమన పద్యాలు అనేకానేకం ఉన్నాయి.
      కులము కలుగువారు, గోత్రము కలవారు,
          విద్య చేత విర్రవీగువారు
     పసిడి కలుగు వాని బానిస కొడుకు లే
నంటూ మానవ జాతిని విభజించే అన్నివర్గీకరణల్లోకీ, కలిమీ లేముల భేదం అత్యంత మౌలికమైనదని వేమన స్పష్టంగా తేల్చి చెప్పడం మనకు కనిపిస్తుంది.
పేదవాని కోపం పెదవికి చేటు’ అని గమనించడానికి అతి లోతైన సామాజిక పరిజ్ఞానం ఉండనక్కర లేదు. సామాన్యమైన అనుభవం చాలు. అటువంటి ఉదాహరణ లెన్నో మనం జానపద సాహిత్యంలో మనకు దొరుకుతాయి.
ఆ భేదాలు సృష్టి సహజం కావనీ, మనిషి సృష్టిస్తున్నవేననీ స్పష్టంగా గ్రహించడానికి మాత్రం సామాజిక శాస్త్రవేత్తలూ, ఆర్ధిక శాస్త్రవేత్తలూ, ఇంకా చరిత్రకారులూ – వీరి కృషి తోడ్పడింది. ‘న్యాయం’ సమాజం లో అమలు జరగడం లేదనీ, అలా జరగకపోడానికి కారణాలు కూడా మన సమాజం లోనే ఉన్నాయన్న ఎరుకా, తెలివిడీ మనకు ఇప్పుడిప్పుడే కలిగింది.
ఆధునిక సాహిత్యం:
ఈ నూతన భావాలు తెలుగు సాహిత్యంలో ప్రతిబింబించేందుకు ఒక బలమైన పునాది ఆధునిక సాహిత్యానికి ఆద్యులైన కందుకూరి, గురజాడల రచనల ద్వారా ఏర్పడింది.

సంస్కరణోద్యమానికి సహాయకారిగా 
సాహిత్యాన్ని కందుకూరి వాడుకున్నారు.


కథలూ, ఇతిహాసాలూ, ఉపాఖ్యానాలూ మొదలుగా గల మన ప్రాచీన సాహిత్యం గతం 
నుండి గుణ పాఠాన్ని నేర్చుకోమనేటట్టుండేది.   
  ‘మంచి గతమున కొంచెమేనోయి 
 మందగించక ముందు అడుగేయి’


అంటూ గురజాడ వర్తమానాన్ని విమర్శించడానికీ, భవిష్యత్తుకు దిశానిర్దేశం చెయ్యడానికి సాహిత్యసృష్టి చేసేరు.  
ఉండవలసిన సమాజానికీ, అమలులో ఉన్న సమాజానికీ మధ్యగల వైరుధ్యానికి అక్షరరూపమివ్వడమే  సాహిత్యానికి కర్తవ్యం అనే  కొత్త నిర్వచనం వెలుగు లోకి వచ్చింది. అర్ధరహితంగా సామాన్య మానవుడి దృష్టికి కనిపించే జీవితానికి సంబంధించిన చలనసూత్రాలను కనిపెట్టి వివరించవలసిన బాధ్యత రచయితకు ఉంది. 
వ్యక్తీ, సమాజమూ :
న్యాయం, ధర్మం – అనే మాటలు వ్యక్తిపరంగానూ, సమాజపరంగానూ వేర్వేరు అర్ధాలతో గోచరిస్తూ ఉంటాయి. వ్యక్తికి సమాజం పట్ల ఉండదగిన నిబద్ధతా, సమాజానికి వ్యక్తి పట్ల ఉండవలసిన బాధ్యత – ఈ రెండిటినీ ఆశ్రయించుకుని  సామాజిక న్యాయం ప్రతీ తరం లోనూ కొత్త అర్ధాలను సమీకరించుకుంటుంది.  

సమాజం ఏర్పరచి పెట్టిన న్యాయసూత్రాలను పాటించమని వ్యక్తికి ఉద్భోధించే సాహిత్యం మనకు అనాదిగా ఉంది.  
దానికి మహోన్నతమైన కళారూపం ‘పంచతంత్రం’. ఆ కాలం వరకూ మానవజాతి సమీకరించుకున్న లోకజ్ఞానమూ, తప్పొప్పులను విడమర్చి చెప్పగల వివేకమూ – వీటన్నిటిన్నిటినీ ఏర్చి కూర్చి, జంతువులనూ, పక్షులనూ మానవులకు ప్రతీకలుగా ఏర్పరిచి భవిష్యత్ తరాలకు అందించిన గ్రంధం పంచతంత్రం.   
వ్యక్తి ప్రాధాన్యత :
మొదటి ప్రపంచ యుద్ధానంతరం – సాహిత్యంలో – వ్యక్తివాదమూ, వ్యక్తి స్వాతంత్ర్యమూ ప్రచారం లోకి వచ్చాయి. అప్పటికి అమలులో ఉన్న సంఘ నియమాలు శిధిల మౌతున్నాయి. కనక – సాహిత్యకారులు సంఘాన్ని ధిక్కరించి కూడా మెప్పు సంపాదించారు.

సమాజ ప్రభావం ప్రత్యేక వ్యక్తుల జీవితాలపై ఎలా ఉండేదీ చిత్రించే
సాహిత్యమూ, వ్యక్తి కోణం నుండి సమాజాన్ని విశ్లేషించే సాహిత్యం 
మనకు పాశ్చాత్య నాగరికత నుండి అందినదని వల్లంపాటి వెంకట సుబ్బయ్య 
వంటి విమర్శకులు చెప్తున్నారు. దానిలో  ప్రధానం గా చెప్పుకోవలసింది నవలాసాహిత్యాన్ని. సామాజిక నవలల్లోని పాత్రలు సమకాలీన భావజాలం లోంచి ఉద్భవించినవిగా ఉంటాయి. వాటిలో అంతః సంఘర్షణా, పరిస్థితుల ప్రభావమూ స్పష్టంగా కనపడతాయి. ఉదాహరణకు, బుచ్చిబాబు రాసిన ‘చివరకు మిగిలేది’ లోని దయానిధి పాత్ర, రావిశాస్త్రి ‘అల్పజీవి’ లోని సుబ్బయ్య,     

సామాజిక న్యాయం సంగతి సాహిత్యానికి ఎందుకు?
ఈ ప్రశ్న వేసే వారిని మనం సామాజిక న్యాయానికి వ్యతిరేకులని భావించలేం. వారి ఉద్దేశం లో సాహిత్యం- వ్యక్తి విశిష్టతనూ, అతని నిర్ణయాదికారాలనూ, అతని మానసిక విశ్లేషణ నూ వివరించే ప్రయత్నం చెయ్యాలి. ప్రతీ వ్యక్తీ ఒక ప్రత్యేక అస్థిత్వ స్వరూపం. వారిని సమూహాలుగా గుర్తించడం అసమగ్రం.
సమాజమే నిషి ప్రవర్తనను నిర్ణయిస్తుందని చెప్పే సమిష్టి వాదాలు – నియతి (deterministic) వాదాలనీ, అవి న్యాయాన్యాయ విచారణ చేసే సమయంలో ‘వ్యక్తి’ పాత్రను పరిగణించవనీ ఒక ఆరోపణ ఉంది. మనిషి ప్రవర్తనకు – అతనిదే పూర్తి బాధ్యత అవుతుందని ఈ వ్యక్తి వాదుల సిద్ధాంతం. వ్యక్తిని కేంద్రంగా చేసుకుని వచ్చిన సాహిత్యం ఆ సిద్ధాంతానికి బలాన్నిచ్చింది.
అయితే ఈ మార్పులు క్రమక్రమంగా సాహిత్య కారుల చూపును సమాజం నుండి మరల్చి ‘వ్యక్తి’ వైపుకు కేంద్రీకరిస్తున్నాయి. వారందరూ తరుచు గా అడిగే ప్రశ్న ఇది.
సమాజం చేత ప్రభావితం కాని వ్యక్తి గురించి రాయకూడదా?
ఈ ప్రశ్నకు సమాధానం ఇలా ఉంటుంది. వ్యక్తి తనవి అని భావించే భావాలు కూడా సామాజిక భావజాలంలో భాగమే. అలా అని సమాజ చిత్రణ మాత్రమే సాహిత్యం కాబోదు. (వాటికి సమాజ శాస్త్రాలు ఉండనే ఉన్నాయి).
సాహిత్యం లోని పాత్రలకు భౌతిక జీవితమూ, మానసిక జీవితమూ రెండూ ఉంటాయి. బయటికి వ్యక్తమౌతున్న అతని ప్రవర్తనా, అవ్యక్త మైన ఆలోచనా మంచి రచయిత ఆవిష్కరిస్తాడు.


పాత వాదం(?):
మనిషి తన కష్ట నష్టాలకు తన దురదృష్టం కారణమని తలిచి, మానవాతీత శక్తులే మానవజీవితాన్ని నడిపిస్తాయని నమ్మటం పౌరాణిక భావన.  ఆ భావనలో సామాజిక న్యాయం గురించి విమర్శలకూ, చర్చలకూ పెద్దగా తావుండదనిపిస్తుంది. అది భక్తి సాహిత్యమనీ, అది మన పరిధి కాదనీ విశ్లేషించకుండా వదిలేయ్యలేం. 
దీనికి ఒక ఉదాహరణ – వ్రత కథల్లోని ఫలశ్రుతి.  వాటిలో స్పష్టంగా ఇలా చెప్తారు, పుత్రులు లేని వారికి పుత్రులూ, దీర్ఘాయుష్షూ, యశస్సూ, రోగాల నుండి విముక్తి , అగ్నీ, చోరబాధల నుండి ఉపశమనం – ఇవన్నీ ప్రజలకు కావాలని వారే చెప్తూ, అవి ఆ పూజల వల్ల సిద్ధిస్తాయని కూడా హామీ ఇస్తారు. ఈనాటికీ  సమాజం లో ఆ భావాల ప్రభావం ఎంత బలంగా ఉన్నదీ మనకీ తెలుసు. ఆ నమ్మకాలతో ఉన్న వారు ‘సామాజిక న్యాయం’ సాహిత్యంలో ఉండాలనుకుంటారని ఆశించలేం.      
అల్లాగే మానవజీవితంలో కార్యకారణ సంబంధం లేదు. అంతా ఘటన అని భావించడం కూడా అత్యాధునిక మెట్ట వేదాంతం. ఇలా ఊహించే వారి సాహిత్యంలో సామాజిక న్యాయం మృగ్యం.  

నవ్య వాదాలు:
మానసిక శాస్త్రవేత్తలైన ఆడ్లర్, యూంగ్ ల ఆలోచనలు విశ్వవ్యాప్తంగా సాహిత్యరంగాన్ని ఎంతో ప్రభావితం చేసాయి. ఆడ్లర్ పేరు తెలియకపోయినా అతను కనిపెట్టిన కాంప్లెక్సులు – ఆధిక్యతా భావం, అల్పత్వ భావం – (సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ ) ఆధునికులకు చిరపరిచితాలే. యూంగ్ చర్చించిన అన్కాంక్షస్, అచేతన వంటి పదాలు కూడా సాహిత్యకారులను ఆకర్షించాయి.
ఇక వీరిద్దరికీ గురువూ, మానసికశాస్త్రాన్నే ఒక మలుపు తిప్పిన ఫ్రాయిడ్ కారణంగా వ్యక్తి జీవిత విశ్లేషణ లో బాల్యానికి అద్వితీయమైన ప్రాధాన్యత సమకూరింది. సమస్యా పరిష్కారానికి సమాజ సహకారం ఆశించడం తగ్గి, ప్రతీ వ్యక్తి జీవిత సమస్యకూ అతని బాల్యం లో జరిగిన ఏదో సంఘటన కారణమని వెతికే మేధావులు ఎక్కువయ్యారు. వారు చేసే వృధా చర్చలకు సాహిత్యం ఒక రంగం కావడం ఒక పరిణామం.  

సమకాలీన వాదాలైన అస్తిత్వ వాదమూ, దళిత వాదమూ, స్త్రీ వాదమూ మొదలైన నవ్య భావాల సహాయంతో చరిత్రనూ, సమాజ శాస్త్రాలనూ విశ్లేషించడం శతధా మనకు అభిలషణీయమే.
అయితే సాహిత్యానికి వాటన్నిటి మూలాలను స్పృశించగల శక్తి ఉన్నదని నమ్మొచ్చు. ఎందుకంటే ... సామాజిక శాస్త్రాలు సమాజాన్ని గురించిన సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని అందజేస్తే సాహిత్యం అనుభవ ప్రధానమైన, అనుభూతి ప్రధానమైన వివేకాన్ని అందజేస్తుంది. 
రూపం లేని భావాలకు రూపాన్నివ్వటమే సాహిత్యం.
‘వ్యక్తి ఆశ్రిత’మైన న్యాయానికీ, సామాజిక న్యాయానికీ సమతౌల్యం సాధించడం లో సాహిత్యం పాత్ర చాలా ఉంటుందని నా నమ్మకం.   

ప్రస్తుత పరిస్థితి:
కానీ ప్రస్తుతపు సాహిత్య వాతావరణాన్ని గమనిస్తే – నాకు కలిగిన అభిప్రాయాన్ని మీతో పంచుకోవా లనుకుంటున్నాను. సామాజిక న్యాయం వంటి వాటి గురించి రాయడం – తమ కళారాధనను కించ  పరుచుకోవడమే అనుకునే ప్రతిభావంతులు రొజురొజుకూ ఎక్కువౌతున్నారు.
అలాకాక సమాజం లోని అన్యాయాలకు స్పందించే వారు – వాటిని దళితవాదమో, స్త్రీ వాదమో, అస్తిత్వవాదమో మరేదైనా ప్రత్యేక సమస్యకు చెందిన అంశమో – వీటికి సంబంధించిన కోణాల నుండి మాత్రమే విశ్లేషించగలుగుతున్నారు. దీని కారణంగా – ఆ సమస్యలకు కళారూపం కల్పించడానికి అవసరమైన సార్వజనీనతా, విశ్వసనీయతా కొరవడి, అవి ఆ వాదాల ప్రచార సాహిత్యంగా మారిపోయే ప్రమాదం కలుగుతోంది.
ఇది నా పరిమిత అవగాహనా లోపం అయిఉండవచ్చు, కానీ - అన్ని వాదాల పరిజ్ఞానాన్నీ మేళవించుకుని, ప్రజాబాహుళ్యం – ఇది మా కథే, ఇవి మా జీవితాలే అని స్పందించే విధంగా సాహిత్యసృష్టి జరగాలనీ, ఏ ఒక్క సమూహానికో మాత్రమే ఆ రచన పరిమితమై ఉండిపోకూడదనీ నా ఆకాంక్ష.        
సమన్వయం:
వర్గ వివక్షా, కుల వివక్షా, లింగ వివక్షా – ఇవన్నీ కాక జాతి, మత, ప్రాంత వివక్షా – సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందనీయడం లేదని గుర్తించి- వాటికి వ్యతిరేకంగా గొంతెత్తిన రచయితలు అనేకం ఉన్నారు. వారు ఆయా వాదాలను ఆమోదించేవారికే కాక సమాజానికంతటికీ చెందిన వారని మనం గుర్తించాల్సి ఉంది. ఈ వాదాలన్నిటి ప్రయోజనం - సమాజం బలహీనులు గానూ, బలవంతులగానూ విడిపోయి ఉందనీ అందరికీ సామాజిక న్యాయంఅందకపోడానికి అదే ఆటంక మౌతోందనీ – ప్రజలందరికీ తెలిసేటట్టు చెయ్యడం. అన్ని వాదాలనూ సమన్వయ పరిచే ప్రయత్నం లో – అందరి హృదయాలనూ సమానంగా తాక గలిగే శక్తి ఉన్న పసివారి జీవితాలు మనను తట్టి లేపుతాయి.   

సామాజిక న్యాయం గురించి ఇన్ని విభిన్న వాదాల వెలుగులో, ఇంత విస్తృతంగా చర్చ జరగని కాలంలో, కేవలం తమ సంవేదనా శక్తినే చుక్కానిగా తీసుకుని – సామాజిక బాధ్యతతో రచనలు చేసిన వారు, 1940 నుండి 1970 వరకూ ఉన్న కాలపరిధి లోని సమాజాన్ని చిత్రించిన కొందరు రచయితల కథలను ఇక్కడ పరిశీలించబోతున్నాం.    

“అణువును పరిశీలించి పదార్ధ స్వభావాన్ని గ్రహించగలగడం, పదార్ధ స్వభావాన్నీ, లక్షణాన్నీ అణువులో చూడగలగడం, మంచి రచయితల రచనా రహస్యం...”     - కాళీపట్నం రామారావు.
బాల్యం విశిష్టత:
అటువంటి మౌలిక విలువలను ఆవిష్కరించడంలో ‘బాల్యం’ పారదర్శక మైన మాధ్యమం గా ఆ రచయితలకు  విశేషంగా సహాయపడినట్టు తోచింది. సమాజ ప్రభావాలను రుజువు చేసే సమిష్టి వాదాన్నీ, నిగూఢమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే అవకాశమిచ్చే బాల్యావస్థనూ కలిపి ఆలోచిస్తే ‘సామాజిక న్యాయం’ ఒక కొత్త రూపుతో కనపడుతుంది.     
జీవితానుభవాలు మనిషి వ్యక్తిత్వాన్ని, బాల్యంలో ప్రభావితం చేసినంత తీవ్రంగా తరువాత కాలంలో చెయ్యవు. మనిషి అస్తిత్వం లో బాల్యావస్త ప్రధానమైన అంశమని నానాటికీ రుజువౌతోంది. అలాగే సమాజ ప్రభావాలకు అతి చేరువలో ఉండేదీ బాల్యమే.
సమాజం లోని లోటుపాట్లు పిల్లల అంతరంగాల పై ఎటువంటి సంచలనాలను సృష్టిస్తాయో గుర్తించిన రచయితలు, ఆ వృత్తాంతాలలో వారు దర్శించిన జీవిత సత్యాలను పొందుపరిచి, పిల్లలను ప్రధాన పాత్రలుగా మలిచి  రాసిన కథలను కొన్ని ఎన్నుకుని మీముందు ఉంచాలని ఈ ప్రయత్నం.  


సాహిత్య లక్ష్యం:
గర్భంలో ఉన్న పిల్లలకు సైతం బేరం కుదుర్చుకుంటున్నపరిస్థితులను చూసి, ఆటువంటి దురాచారాలను బట్ట బయలు చెయ్యడమూ, సంస్కారాన్ని పెంపొందించే భావాలను ప్రచారం చెయ్యడం – వీటి కంటే ఉత్కృష్టమైన లక్ష్యం సాహిత్యానికి లేదనీ – అందుకే ‘కన్యాశుల్క’ నాటక రచనకు పూనుకున్నాననీ గురజాడ 1910 లో ముందుమాట లో రాసుకున్నారు. నాటకం లో మన కళ్ళ ముందుకు రాని ‘సుబ్బి’ విషాదాన్ని ‘పూర్ణమ్మ’ గొంతులో మనం వినగలం. ఆత్మహత్య తప్ప మరి గత్యంతరం కనపడని  బాలల దురవస్థ ఆ కవితలో గ్రంథస్థం అయ్యింది.

కుంకుడాకు (1943) – చాసో: 
పారమ్మ, గవిరి ఇద్దరూ ఎనిమిదేళ్ళ పిల్లలు. పారమ్మ మోతుబరి కూతురు, గవిరి కూలీ వాడి కూతురు. ఆ భేదం వాళ్ళ బట్టల్లో కనిపిస్తూనే ఉంటుంది. కానీ దానిని నిర్విచారంగా ఆమోదించడానికి గవిరికి వయసు చాలదు.
పారమ్మ ముందు తన దరిద్రాన్నిదాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది గవిరి. ముందు రోజు రాత్రి పస్తు పడుకున్నా, ‘రెయ్యి’లు నంచుకున్నానని  ‘గొప్పకి అబద్ధవాడు’ తుంది. కూలీ వాడైన తండ్రి చదివించలేడు కనక ‘ఎందుకూ ముష్టి చదువూ?’ అంటుంది. తనకి ‘ముంతంత కొప్పున్నాది’, పారమ్మకు ‘బుర్ర మీద ఎంట్రుకలే నేవు’ అంటుంది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా పారమ్మకూ, గవిరికీ మధ్య ఉన్న అంతరం – చేదు వాస్తవం, పారమ్మ ఆమెను కించపరుస్తుంది –గవిరికి  గొంతుక లోకి ఏడుపూ, కళ్ళ లోకి నీళ్ళూ – తెప్పిస్తుంది.
గవిరి రాత్రికి పొయ్యిలో నిప్పు కోసం, రాలిన కుంకుడాకులు ఏరుకుని గంప నింపుకుంటుంది. ఓ పక్క పారమ్మ నిర్భయంగా చింతకాయలు రాల్చుకుని తింటూ ఉంటుంది. గవిరికి నోరూరినా, ధైర్యం చాలదు. సిగ్గు వొదిలి ‘ఒలే పారా నాకో కాయెట్టవు?’అని ప్రాధేయ పడుతుంది. పారమ్మ విదిలించుకుని వెళ్ళిపోతుంది. గవిరి రాయేసి కొడితే కాయ బదులు ఎండుకొమ్మ విరిగి పడుతుంది. దానికే ఆ పిల్ల సంబరపడుతుంది. ఎండు కంపను విరిచి గంపలో సద్దుకుంటుంది.
ఇంతలో బుగత వస్తాడు. గంపలో ఏదో దాచిందన్న అనుమానం తో కాలితో తన్ని చెత్తను చిందర వందర చేస్తాడు. ‘తుప్ప వార’ దాచి ఉంచిన పేడను చూస్తాడు.  గవిరి పేడ దొంగిలించిందని, చేతికర్రతో గవిరి వెన్ను మీద కొడతాడు.
నాను కాదు బాబోయ’ని ఏడుపు మొదలెడుతుంది.
ఎనిమిదేళ్ళ గవిరిలో కలిగిన - అనుభూతుల ప్రవాహాన్ని, దాని నుండి ఆమెకు కలిగిన ధర్మాగ్రహాన్నీ చాసో వర్ణించిన తీరు ఒక్క సారి గమనించండి.  

‘తను కాదని చెప్పినా భుక్త తంతున్నాడు. అతనికి చెప్పినా తెలియదేమా అని నివ్వెరపడ్డది.
ఏడుపు లోంచి పౌరుషమొచ్చింది. అది దొంగ కాదు. అంచేత ధైర్యమొచ్చింది. ఏడుపు మాని కళ్ళెర్రజేసి: ‘నాను కాదు నా తట్టా సేతులూ చూడు’ అన్నాది. అయినా బుగత నమ్మకుండా దెబ్బలు కొడతాడు.

అడ్డుకోడానికీ, తిరిగి కొట్టడానికీ బలం చాలని చిన్న పిల్ల, కాపాడే వారెవరూ తన వెంటలేని ఒంటరి పిల్ల –గవిరి  బుగత దౌర్జన్యాన్ని సహించి ఊరుకోలేకపోతుంది. ఆపుకోలేని కోపంతో తిడుతుంది.  

బుగత కొట్టిన అన్ని దెబ్బలూ తిని, ఏడ్చి ఏడ్చి ఎప్పటికో కళ్ళు తెరుస్తుంది. లేచి – కుంకుడాకులను కూడ దీసుకుంటుంది. ఎంచేతనంటే తల్లీ తండ్రీ పొయ్యి మీదికి తేగలిగినా, తేలేక పోయినా గవిరి పొయ్యి కిందికి తెచ్చి తీరాలి. ఇది ఆమె అనివార్య జీవిత వాస్తవం.

కానీ, బుగత చేసిన అన్యాయానికి నిరసన ప్రకటిస్తూ ‘లమిడీ కొడకా! నీ సింత కంప లెవిడికీ అక్కర నేదు’ అని చింత కంపలు వదిలేసి ‘కుంకుడాకు’లను మాత్రమే ఏరుకోడం - గవిరిలో ఉన్న ఆత్మాభిమానానికి తార్కాణం గా కనిపించింది.
ఎందుకు పారేస్తాను నాన్నా? (1944) – చాసో: 
కృష్ణుడు బడి మానేసాడు, వాళ్ళ నాన్న డబ్బు చాలదని ఫోర్తు ఫారం లో వాడి చదువు మానిపించేసాడు. కానీ ఆ విషయం కృష్ణుడి మనసు అంగీకరించడం లేదు. వాడి స్నేహితుడు నరిశింహం అడిగితే – ‘సోమవారం చేరతాను’ అని కృష్ణుడు చెప్తాడు. వాడి కొత్త పుస్తకం లోకి మొహం పెట్టి కృష్ణుడు వాసన చూస్తాడు.
పుస్తకం పేజీలు తిరగేసిన కొద్దీ వాడికి గుండెల్లో గాభరా పుట్టింది. చదువు తున్నకుర్రాళ్ళ మీద ఈర్ష్యా, తనకి చదువు లేకుండా పోయిందన్నదుఃఖమూ- రెండూ రెండు లేడిక పాములై అతని బుర్రని కరకర లాడిస్తున్నాయి.
వాడి ఇంటి దగ్గర ఉన్న వాళ్లకి ఆంధ్ర పత్రిక వస్తుందనీ, దాన్ని రోజూ చదువుతానని కృష్ణుడు చెప్పినప్పుడు - చదువు మీద వాడి కున్న కోరికా, వాడి తోటి వారందరి కంటేనూ కూడా వాడి కున్న అర్హతా, అటువంటి వాడి చదువు కొచ్చిన ఆటంకమూ – ఈ విషయాలన్నీ పాఠకుడి  మనసును కూడా కుదిపేస్తాయి.

తండ్రికి చుట్టలు కొని పట్టికేళ్లెందుకు వచ్చిన వాడు, బడి వరండాలో నుండి కదల లేకపోతాడు. కొన్నేళ్ళ క్రితం ఒక కుర్రాడి పేరు అటెండెన్సు రిజిస్టరులో నుండి కొట్టేసి, ‘డిస్కంటిన్యుడ్’ అని మాస్టారు రాయడం కృష్ణుడికి గుర్తు కొస్తుంది. ఆ పదం, అర్ధం జ్ఞాపకం రాగానే అతనికి దుఃఖం పొర్లుకుంటూ వస్తుంది. 
ఇంతలో కొడుకును వెతుక్కుంటూ తండ్రి బడి లోకి వస్తాడు. తండ్రికి కొడుకు బాధ అర్ధమౌతుంది. కృష్ణుడికి ఆనకట్టలు తెగ్గొట్టుకుని దుఃఖం కొట్టుకొస్తుంది.
తన ఆర్ధిక వాస్తవ పరిస్థితీ, తండ్రి అసమర్ధతా అర్ధమయ్యీ అంగీకరించలేక, ‘భూమి బద్దలైనంత గట్టిగా’ బడి వదిలిరానని కృష్ణుడు అరుస్తాడు.
బడి నాది’ అని కృష్ణుడు చేసిన తీర్మానం –విశ్వవ్యాప్తంగా ‘విద్య’ బాలలందరి ప్రాధమిక హక్కు అని మనకు గుర్తు చేస్తుంది.               
తండ్రి తన చుట్టల వ్యసనాన్నివదులుకుని, ఆ డబ్బుతో చదువు చెప్పిస్తానని మాట ఇస్తాడు. దానితో కృష్ణుడి ప్రాణాలతో పాటూ పాఠకుల ప్రాణాలు కూడా కుదుట పడతాయి. ఆ మాటకు హామీ గా కొత్త ఇంగ్లీషు పుస్తకాన్నికూడా కృష్ణుడికి కొనిస్తాడు.  
ఆడబ్రతుకే మధురం (1947) – కొడవటిగంటి కుటుంబరావు:
సమాజం లో ఆడవారిపై ప్రచారమయ్యే చులకన భావాలు, అప్పుడొకటీ అప్పుడొకటీగా విన్న చిన్నపిల్లలు – వాటినెలా అర్ధం చేసుకుంటారో వర్ణిస్తూ చేసిన ఒక చిన్న రచన ఇది. స్త్రీ పురుషుల స్థానాలలో ఉన్న అసమానతలూ, వాటికి అనుగుణమైన భావజాలమూ చిన్న పిల్లల తలల్లోకి యథాతథంగా పంపిణీ అవుతాయి. క్రమేణా అవి వారి పాలిటి ‘శాశ్వత సత్యాలై’ పోతాయి.

ఇంకా సహజ సిద్దమైన ‘తార్కికత’ కోల్పోని ఒక చిన్నపిల్ల స్వగతంలో మనకు ఈ పరస్పర విరుద్ధ భావాల కలబోత స్పష్టంగా కనిపిస్తుంది.
“ఎంతో పాపం చేసుకుంటే గానీ ఆడవాళ్ళై పుట్టరట, అమ్మమ్మ చెప్పింది, అందుకనే మొగవాళ్ళాడవాళ్ళని కొడతారు, తిడతారు.”  
“ఆడవాళ్ళంత చదువు చదువు కుంటే చెడిపోతారు.”
ఇలాటి సమాజపు ప్రచారానికి, “ఆడబ్రతుకే మధురం” అని రేడియోలోని పాట ప్రతీక గా చిత్రిస్తారు కొకు. అవన్నీ నిజమే అని నమ్మడానికి ఆ పిల్ల ప్రయత్నిస్తుంది.
కానీ ఆమె ఎరుకలో ఉన్న కృష్ణమూర్తి గారి కుటుంబం లోకం చేసే ప్రచారానికి విరుద్ధంగా కనిపించడమూ, వారు ఆనందంగా ఉండడమూ ఆమెను ఆలోచనలో పడేస్తాయి. 
కిష్టమూర్తి గారి పెళ్ళాం పిల్లల్ని కొట్టదు. “నిన్ను నీ మొగుడు కొడితే ఏం చేస్తావే!” అంటే వాళ్ళ వాణి (కృష్ణమూర్తి గారి కూతురు వాణి ఈ పిల్ల స్నేహితురాలై ఉండొచ్చు) “చంపేస్తా!” అంటుంది.    
లోకం అందించే ‘సమాచారమూ’, లోకజ్ఞానమూ కలహించుకుని చివరికి లోకజ్ఞానం నెగ్గుతుంది. ఆ పిల్ల ఇలా నిశ్చయించుకుంటుంది.
“నేను పెద్దదాన్నైతే కొట్టే మొగుణ్ణి మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయె, ఎవరు పడుతారమ్మా దెబ్బలూ, తిట్లూనూ? పెద్దదాన్నైతే ఎవరికీ తెలీకుండా కిష్టమూర్తి గార్ని చేసుకుంటాను!...”
“ఆడబ్రతుకే మధురం!” అనే పాట పాడడం మానేసింది రేడియో.         

ఇద్దరు పిల్లలు (1954) – రావి శాస్త్రి:
గోపాలం, సుబ్బడూ ప్రాణస్నేహితులు. ఇద్దరిదీ ఇంచుమించు ఒకటే వయసు, ఏడేళ్ళ వాళ్ళు. ఇద్దరి తండ్రులూ మరలో నౌఖిరీకీ, తర్వాత తాగుడికీ కలిసే వెళ్తారు కనక వారి ఆర్ధికస్థాయీ, ఇబ్బందులూ రెండూ సమానమే. ఒకే స్కూలు, ఒకటే క్లాసూ –అక్కడ వారి చదువులూ అంతంత మాత్రమే, అవీ సమానమే.  

గోపాలానికి ఒక తమ్ముడు – వాడు అందరికీ తమ్ముడే. మూడేళ్ళవాడు, కానీ ఒంట్లో  జవసత్త్వాలు లేక ఒక సంవత్సరం పిల్లాడిలా ఉంటాడు. కొనప్రాణాలు కళ్ళలో ఉంటాయి వాడికి.
ఈ స్నేహితులకి –
బటానీలు, పకోడీలు, ఉసిరికాయలు, రేగుపళ్ళు, వేరుశెనగలు, గాలిపడగలు, పలకపుల్లలు, రబ్బర్లు, తెల్లకాయితాలు, బొంగరాలు, గొట్టికాయలు వగైరాలు- అన్నీ కూడా వారి సమిష్టి ఆస్తులు. అవి ఒకరికి ఉన్నట్లయితే రెండో వారికి ఉన్నట్లే లెక్క. 

సుబ్బడి బావ పట్నం నుంచి మెరిసిపోయే ఎర్రటి బస్సు తెచ్చి సుబ్బడికి ఇస్తాడు. అప్పటి నుండీ సుబ్బడి ప్రవర్తనలో మార్పును చూస్తాడు గోపాలం. ఆ బస్సు తన సొంతం, దానిని తానే వాడాలి అని సుబ్బడికి ఉందని అర్ధమై గోపాలం అసహ్యించుకుని ఊరుకుంటాడు. ఇద్దరూ ఒకరినొకరు తప్పించుకుని తిరగడం మొదలెడతారు.
కానీ ఒకనాడు గోపాలం తమ్ముడు సుబ్బడి చేతిలో ఆ ఎర్రబస్సును చూసి నవ్వుతాడు. ఎప్పుడూ నవ్వని ఆ పిల్లడు నవ్వి, “బచ్చు బచ్చు” అంటూ ఆ బస్సు కోసం మారాం చేస్తాడు.
అభిమానాన్నీ పౌరుషాన్నీచంపుకుని, తమ్ముడి కోసం ... సుబ్బడిని బస్సు అడుగుతాడు. తన మాట సుబ్బడు నమ్మడేమో అని  మా అమ్మ ఒక్కసారి ఇమ్మందిరా అని కూడా చెప్తాడు.
సుబ్బడి ‘వ్యామోహం’ మీద వాడి ‘వివేకం’ గెలిచే లోగా జరగవలసిన అనర్ధం జరిగి పోతుంది. ఆ బస్సు తో అడుకోకుండానే తమ్ముడు కన్ను మూస్తాడు.
అచ్చంగా, అచ్చంగా తీసుకోరా! నా కొద్దురా ఇదీ” అంటూ చెయ్యి జాచి తీసుకోమని ఏడుస్తూ చెప్తాడు సుబ్బడు గోపాలంతో.
కథ లోని జీవితసత్యం ఈ వాక్యంలో ఇమిడి ఉంది అనిపించింది.
కొన్ని వస్తువులు మనుషుల్ని వేరు చేస్తాయి. కొన్ని పరిస్థితులు మనుషుల్ని దగ్గరగా తీసుకొస్తాయి.                                

తీర్పు (1964) – కారా:    
ఒక మధ్యతరగతి కుటుంబంలో పిల్లలు అట్టలు తయారుచేసుకుని (తయారైన అట్టల్లో ఒకటి మెరుగైంది), వాటిని పంచుకోడం ఇందులో కేంద్ర సంఘటన.
అట్టలను పంచడంలో తనకు ‘అన్యాయం’ జరగబోతోందని రెండో కొడుకు గుర్తిస్తాడు.
అట్టల తయారీకీ, ఒక అట్ట మెరుగ్గా తయారవడానికీ ‘ఐడియా’ ఇచ్చిన వాడు పెద్ద కొడుకు, అందుకు వాడికో అట్ట, పెట్టుబడి అర్ధరూపాయ తల్లిది, బజార్లో అట్ట పావలాకి దొరుకుతుంది-ఆ లెక్కన అర్ధరూపాయ పెట్టుబడికీ రెండు అట్టలు తల్లికీ, కొద్దిగా సహాయ పడ్డది మూడో కొడుకు కనక వాడికో అట్టా – ఇలా పంచి ఇస్తాడు.  

అట్టల్నితయారు చెయ్యడంలో ప్రధానపాత్ర వహించిన రెండో కొడుకు, ‘పంపకం’ కూడా తన చేతి లోకి తీసుకోడం, మేలు రకం అట్టను తానే తీసుకోడం ఈ కథలో స్పష్ట మౌతున్న సామాజిక న్యాయం.
నాలుగు ఒకే రకం అట్టల మధ్య ఐదో అట్ట కాస్త మేలు రకంది, చేరితే ఎలాంటి ఆర్ధిక, రాజకీయ సమస్య ఏర్పడేదీ ఈ కథ చిత్రిస్తుంది.
ఆదర్శవంతమైన సమాజంలో, ఉత్పత్తి చేసేవారే సంపద పంపకం ఏ రీతిలో జరగాలో నిర్ణయిస్తారనీ ప్రతీకాత్మకంగా చెప్తుంది.
ఎవరెవరు అన్యాయానికి ఎలా సహకరించినదీ తెలిసిన రెండో కొడుకు పక్షపాత బుద్ధితో వ్యవహరించే మేనత్తతో ఇలా చెప్తాడు: ‘మొదట అన్నయ్యని పంచమన్నాం. వాడికి చేతులు రాలేదు. అమ్మకు పంచడం ఇష్టమే కానీ ఆమెకు చేతనయింది కాదు. చేతనయ్యీ ఎందుచేతో నాన్నగారు వెనకా ముందూ ఆలోచిస్తున్నారు. నువ్వైతే, అడక్కుండానే పంచడానికి వచ్చేవు.’        

హింస (1968) – కారా:     
పదేళ్ళ సంగి లేత మనసుకు అయిన గాయం హింస కథ.
కథలో సంగి బాల్యపు అమాయకత్వం, ఒక్క సారిగా ఆమెకు అవగతమైన సమాజపు క్రౌర్యమూ చిత్రిత మౌతాయి. సుబ్బయ్య టీ దుకాణం దగ్గర, దాసు అనే కాలక్షేపరాయుడు చేరి, వెటకారాలతో సంగి అక్క పైడమ్మ కథ నలుగురికీ చెప్తూ ఉంటాడు.

అక్కకి టీ కొని పట్టి కెళ్ళడానికి అక్కడికి వచ్చిన సంగికి ఏ సంగతీ తెలియదు.
సొమ్ము తీసుకునే అయినా- ఆ రాత్రప్పుడు టీ చేసి యిస్తున్నసుబ్బయ్యా, సరదాగా మాతాడుతున్న ఆ మనిషీ, బేరం చూడమని పంపిన ఆ పెద్ద మనుషులూ, చాలా మంచి వాళ్ళలా కనిపించేరు.
పక్కన చేరిన వారికి మరింత వినోదం కల్పించేందుకు, దాసు సంగిని సొంత బంధువులమ్మాయిలా దగ్గరికి తీసుకుని కొంతసేపు దాని సొంత భోగట్టా లడుగుతాడు. తన కుటుంబం సంగతులు ఒక్కొక్కటీ చెప్తూ...అక్కా బావా సంగతి చెప్పేముందు ఒక్క క్షణం పస్తాయిస్తుంది.
అంత అభిమానంగా మాటాడే చోట, మర్మం పెట్టడం తప్పనిపించింది – ఆ పిల్లకి. అందుకే బావ అక్క నొదిలేసేడని నిజం చెప్తుంది.       
అలా కొంత సేపు ఆ కబురూ ఈ కబురూ మాట్లాడేక, ‘మీ అక్కను నన్ను కలవమని చెప్తావా’ అని దాసు సంగిని అడుగుతాడు. ‘సెప్తాను’ అంటుంది సంగి ఆలోచించకుండా.
ఘొల్లుమన్న జనంతో గొంతు కలిపి పకపక నవ్వుతున్నాడు దాసు. వెనక్కి తిరిగిన సంగి కళ్ళలో అదరిపాటును దాసు గ్రహించలేదు.  
ఆమె నివ్వెరపాటుకు అది మొదలు. తర్వాత ఇల్లు చేరేసరికి ఇంట్లో గోలగోలగా ఏదో చర్చ జరుగుతూ ఉంటుంది. అక్క పైడమ్మ వ్యభిచారం లో చిక్కుకుంది కనక ఆమెను బంధుగణం వెలేస్తారు. ఈ సంగతులేవీ బోధపడని సంగి మనసును తల్లి రోదనా, అక్క నిస్సహాయతా పట్టి పల్లారుస్తాయి.
సంగికి కలిగిన అనుభవం ఆమెలో కలిగించిన భావాలనిలా వర్ణిస్తారు. ఊరి బయట సెలకలో మేకపిల్ల అరుపులు విని ‘సంగికి ఎందుకు వచ్చిందో చెప్పరాని ఆవేశం వచ్చింది. ఆమె కెక్కడ్నుంచి వచ్చిందో చెప్పరాని ధైర్యం వచ్చింది.    
హృదయవిదారకమైన మేక అరుపులు విన్న సంగికి, వాటి కళ్ళలో కనిపించిన దిక్కుమాలినతనం చూడగానే, విపరీతమైన జాలి కలిగి కన్నులు జేవురించాయి.
ఆమె స్థానం లో మనముండి ఆలోచిస్తే గానీ ఆమె మానసిక పరిస్థితిని మనం అర్ధం చేసుకోలేమని రచయిత కథ ముగింపులో చెప్తారు. 

చింపిరి (1970) – పెద్దిబొట్ల సుబ్బరామయ్య:  
‘చింపిరి’ ఓ కుర్రాడి పేరు. వాడితో పాటూ బుజ్జమ్మా, నిప్పుకోడీ, కోటిగాడూ రైల్వే స్టేషన్ లోనే ఉంటారు. పినాకినీ ఎక్ష్ ప్రెస్ పెట్టే లూడ్చ్జిశుభ్రం చేసి, ప్రయాణీకుల ముందు చేతులు జాపి, వాళ్ళు దయతో విదిల్చిన కాసిని పైసలూ పోగేసుకుని పొట్ట పోసుకుంటూ ఉంటారు.
చింపిరికి ‘దేవుడు’ అనే కుర్రాడితో పరిచయం ఉంటుంది. వాడి తెలివితేటలూ, చాకచక్యాలంటే చింపిరికి ఆరాధన. చింపిరి సంపాదన రోజుకు రెండో మూడో ఐతే దేవుడు రోజుకు పాతిక రూపాయలు సంపాదిస్తాట్ట! దేవుడు రకరకాల పనులు చేస్తాడు. ఎక్కువ సంపాదన కోసం, త్రిల్ కోసం సినీమా టిక్కెట్లు బ్లాకు లో అమ్మడం, జేబులు కొట్టడం వంటి పనులు చేస్తాట్ట.  
చింపిరిని వాడు వైనుషాపులో పనికి కుదురుస్తాడు. గ్లాసులూ నీళ్ళూ అందించడంతో, మిరపకాయ బజ్జీ, మిక్షర్లు, సిగరెట్లూ తెచ్చి ఇవ్వడంతో చింపిరి శ్వాస తీసుకోడం కూడా మరిచిపోయి పరుగులు తీస్తూ పని చేస్తాడు. రాత్రి పన్నెండు తర్వాత, రద్దీ తగ్గాక యజమాని డబ్బు లెక్కేట్టుకుని తాళం పెట్టుకునే లోగా చింపిరి షాపంతా ఊడ్చి శుభ్రం చేస్తాడు. తర్వాత షాపు బయట ఓ మూల ముడుచుకు పడుకుంటాడు.

రెండో రోజుకే కాళ్ళలో సత్తువ క్షీణించి, కదులుతున్న శవం లా తయారైనా - రోజుకి ఎనిమిది రూపాయల జీతమూ, ఆ పైన కస్టమర్ల నుండి కూడా మరో ఎనిమిది ముడుతుందన్నఆశా చింపిరికి ఓపిక నిస్తాయి.

మర్నాడు, ఓ తాగుబోతు ఒక రూపాయి చింపిరి చేతికిచ్చి సిగరెట్టు తెమ్మని, తీరా సిగరెట్ తెచ్చి ఇచ్చాక తాను ఇచ్చింది రెండు రూపాయలనీ, చిల్లర ఇమ్మనీ దబాయిస్తాడు. చింపిరికి దొంగతనం అంటగడతాడు. గుడ్ల నీళ్ళు కుక్కుకుంటున్న చింపిరిని చూసి కూడా యజమాని ఒక్క మాట అనకుండా దూరంగా పోయి, తన నోట్లు తాను లెక్కపెట్టు కుంటూ ఉంటాడు. అవమానంతో, బిక్కచచ్చి పోయి తన జేబులో ఉన్న చిల్లర చింపిరి అక్కడ పెట్టేస్తాడు. ఆ అనుభవం వాడికి కొత్త జ్ఞానాన్ని ఇస్తుంది.
ఆ రాత్రి షాపు మూసేటప్పుడు వెళ్లి పని మానేస్తున్నానని యజమానితో నిబ్బరంగా చెప్తాడు. వాడికి రావా ల్సిన జీతం కూడా యజమాని ఇవ్వడు. ‘కానీ కూడా ఇవ్వద్దు, నేనేల్లి పోతాను’ అని విసురుగా నడుస్తూ స్టేషనుకు తన స్నేహితుల మధ్యకు వచ్చేస్తాడు. ముందు రోజు ‘పంజరం’ లా కనిపించిన స్టేషను వాడికి అప్పుడు ‘కన్నతల్లి’ లా కనిపిస్తుంది.
ఈ కథలో మనకు కనిపించే కొన్ని దృశ్యాలు సమాజానికి ప్రతిబింబాలలా ఉంటాయి. నిరాశ్రయులైన పిల్లలు ఏదారీ తెన్నూ లేకుండా పరిభ్రమించడం, వారిలో ‘దేవుడు’ వంటి వారు నేర ప్రపంచానికి ఆకర్షితులై, అతి కొద్ది కాలం లోనే సమాజానికి దూరమై పోవడం మన ముందు అతి సహజంగా జరిగి పోతూనే ఉంది.
ఈ నేపధ్యంలో చింపిరి వంటి పిల్లలకు, షాపు యజమాని వ్యాపార ప్రపంచం పులి బోను వంటిదనీ, నాలుగు డబ్బులు తక్కువ దొరికినా, తమ తోటి బీద బికారి పిల్లల మధ్యనే వారికి ‘రక్షణ’ ఉంటుందనీ, ‘న్యాయం’ దొరుకుతుందనీ రచయిత సూచించారనిపించింది.
దిక్కూ మొక్కూ లేని ఆ పిల్లలకు మురికిని శుభ్రం చేసి, ముష్టి అడుక్కునే సదుపాయమే పెన్నిధి లాగా ఉండడం – కథ లోని అసలైన విషాదం.  
ఉపసంహారం:
మానవుడు తాను పొందిన అనుభవాన్ని జగత్తుకు అందించే ప్రయత్నాలే కళారూపాలయ్యాయి అని అంటారు. ‘కరుణ’ సాహిత్యసృష్టికి  కారణభూతమైన అనుభూతి అని విజ్ఞులు చెప్పగా ఇటీవలే  విన్నాను.

కరుణ రసాశ్రితమైన ఈ కథలు మానవజీవితాలను పిల్లల కోణం నుండి విశ్లేషిస్తాయి. మనని ఆలోచించమంటాయి. సామాజిక న్యాయాన్ని కావాలంటాయి. ప్రతీ కథ లోనూ సమాజం లో దాగిఉన్న అన్యాయం, అది ఆ పసివారి మనసులో కలిగించిన సంఘర్షణా – సామాన్యఅంశం గా ఉండడం మనం గుర్తించవచ్చు.
ఈ కథలన్నిటిలోనూ సామాన్యాంశం ఐన పిల్లల మానసిక వేదన గురించి మనం మరోసారి పరిశీలించాల్సి ఉంది. ఆ ‘వేదన’ ముందు ముందు వారిని ఎటువంటి వ్యక్తులుగా మారుస్తుందో ఊహించాల్సి ఉంది.   
ఈ సందర్భం లో పిల్లల క్షేమాన్ని కాంక్షించి, వారి గురించి ప్రేమతో, దయతో, బాధ్యతతో చర్చించిన చలం గారిని స్మరించుకుంటున్నాను. మానవ సమాజం లో సభ్యుల మైన మనందరికీ - పిల్లల పక్షాన చలం గారు చేస్తున్నఅభ్యర్ధనతో వ్యాసానికి ముగింపు చెప్పాలనుకుంటున్నాను.

బిడ్డల శిక్షణ (1925)- చలం:
ఎప్పటికన్నా ఏ జాతులన్నా, ఏ జీవులన్నా తిరగబడి తప్పించు కోగలరు.
జ్ఞాపకం తెచ్చుకోండి. పంచముల సౌఖ్యం, హక్కులూ అంటే, బానిస ప్రజల దేశ స్వతంత్రపు హక్కులంటే, స్త్రీల హక్కులంటే, సమానత్వమంటే ... ... ...అర్ధం కాక తాగివచ్చాడని చూసిన రోజులని.
(ఆ హక్కులు కావాలనడం దాకా ఎందుకు ఆ మాటలు ఉచ్చరించడమే అసంబద్దం గా కనపడేది ఒకనాడు )

కానీ ఏనాటికో, ఏ ఉద్బోధ వల్లనో, ఏ సిగ్గూ బాధా భరించలేకనో, వాళ్ళు ఏనాటికో మీ నెత్తి మీద కొట్టి, మీ కళ్ళు తెరవక మానరు.
(భవిష్యత్తు లో ఎప్పటికో అప్పటికి అది జరిగి తీరుతుంది...)
జంతువులు కూడా తమను తాము కాపాడుకుంటాయేమో! ఏనాటికో తెలివి తెచ్చుకుని జింకలూ చిలకలూ మీకు చిక్కకుండా ఉపాయాలు కనిపెడతాయేమో, ఆవులూ గేదెలూ మీ దొంగ స్తోత్రాల నుంచీ, పాలు పితకడాలనించీ దూరంగా పోతాయేమో!
(జంతువులు వాటి రక్షణ అవి చేసుకునే విధంగా ప్రకృతి వాటిని అనుగ్రహిస్తుందేమో ... ... ...)

కానీ ఈ పిల్లలు ఎప్పడూ సమ్మె కట్టలేరు. తెలివి తెచ్చుకోలేరు. ధిక్కరించలేరు. ప్రార్ధించలేరు, నోరు లేదు. శక్తి లేదు. మీలో అపారమైన విశ్వాసం తప్ప.  (పిల్లల విషయంలో ప్రకృతి కూడా ఏమీ చెయ్యలేదు ... ఎందుకంటే పిల్లలకి వేరెవ్వరి మీదా కాదు - మన మీదే నమ్మకం...వారి సంరక్షకులమని ...)  
                                                                                                                                  చివరగా -
మితిమీరిన వ్యక్తి వాదం - సామాజిక న్యాయ చర్చలను కుంటు పరుస్తోందేమోనని నా సందేహం. ‘పాపం, పుణ్యం, ప్రపంచమార్గం ఏమీ ఎరుగని’ వారని అని శ్రీశ్రీ శైశవ గీతి లో తలుచుకున్నట్టు, ప్రతికూల వాతావరణం లో సైతం మొక్కవోని ‘ఆత్మశక్తి’ తో నిలుచున్న ఈ పిల్లల గాధలు ‘వ్యక్తి వాదుల’కు కూడా నచ్చేవే అని నమ్ముతాను.  

విభిన్న (స్త్రీ, దళిత, మైనారిటీ)వాదాల నుండి ఎంతో బలం పుంజుకున్న మన ఆధునిక సాహిత్యం - ఈనాడు వాటిని తప్ప మరేదీ చూడలేకపోతోందని నా ఆవేదన. ఆ వాదాలిచ్చిన పరిజ్ఞానంతో సమస్యల మూలాలను తాకే సాహిత్య సృష్టి జరగాలని కోరుతున్నాను. అందుకే అన్నిటినీ తనలో సమన్వయ పరుచుకునే అంశాలను వెలికితీయాలనీ, వాటి వెలుగులో సామాజిక న్యాయానికి 'పునర్ముల్యాంకనం' చేసుకోవాలనే లక్ష్యం తో - అలాటి ఒక అంశాన్ని(పిల్లల మానసిక సంఘర్షణ) ఎన్నుకుని ఈ వ్యాసం తో మీ ముందుకు వచ్చాను. 

2 comments:

  1. లేమి లో పుట్టీ పెరిగే పిల్లలు కులము మతము లాంటి తరగతులకంటే లేమి వల్లే మనస్సును పిండేసే కష్టాలకు లోనౌతారు, డికెన్స్ సాహిత్యం అందుకే లోక ప్రియం అయ్యింది. చాలా బాగా వ్రాసావమ్మా

    ReplyDelete
  2. @chavera,ధన్యవాదాలండీ!
    మీరన్నది నిజం ...పేదరికం అన్ని కుల, మత, జాతి భేదాలనూ దాటి పీడించే జాడ్యం, దానికి బాల్యం చిక్కి అల్లాడుతోంది...

    ReplyDelete