Saturday 8 December 2018

మనిషి, సరుకు- ఒక క్రూర వ్యాపారం

అక్రమ మానవ రవాణా గురించి రాసిన వ్యాసం  సెప్టెంబర్ నెల మాతృకలో ...


“బబ్బో, అమ్మా లేదంటే బూచాడొచ్చి ఎత్తుకుపోతాడు!”
“పిల్లలు ఒకళ్లూ పెద్దవాళ్లు లేకుండా తిరక్కూడదు అమ్మో దొంగలు ఎత్తుకుపోతారు.”
“తెలియని వాళ్లు ఇచ్చిన చాక్లెట్లు అవీ తినకూడదు. వాళ్లు పిలిస్తే వెళ్లకూడదు.” ఇవే చైల్డ్ ట్రాఫికింగ్‌ని ఎదుర్కోడానికి మనకి చేతనయిన రెస్పాన్స్‌లు. ఈమాటలు వింటూనే పెరిగాం.
చైల్డ్ ట్రాఫికింగ్ మాట కొత్తది కానీ, విషయం మనకి తెలీంది కాదు. సినిమాల్లోనూ దీని ప్రస్తావనలొచ్చాయి కాకపోతే ఒక ట్రాజెడీ లాగే చూపిస్తారు. లేదా హీరో వీర పోరాటానికీ లేదా విలన్ దుర్మార్గానికీ ఉదాహరణగానే. అందుకే సాధారణంగా ఏకొందరు అతి క్రూరులు చేసే విలనీలాగానో మాత్రమే భావిస్తూ ఉంటాం. పాలు తాగే కృష్ణుణ్ని ఇంట్లో అందరి కళ్లూ గప్పి పూతన ఎత్తుకుపోవడం కథ నాటి నుంచీ పిల్లల పాలిటి శత్రువులున్నారని గుర్తించాం. కాకపోతే ఎవరో దుష్టులు చేస్తూ ఉంటారని ఊహిస్తూ వచ్చాం. పూతన వచ్చింది కూడా కంసుడి కోసం కృష్ణుణ్ని చంపడానికే.
ఈనాడు వేల కొద్దీ పిల్లలు ఊహాతీతమైన హింసకు గురౌతున్నారన్నది మనం మర్చిపోలేని వాస్తవం. ప్రభుత్వాల కన్నా సేవాసంస్థల మీదే వారి శ్రేయస్సు ఆధారపడి ఉండడం మరొక చేదు నిజం. ప్రజ్వల అనే పేరు గల సంస్థ నడిపే సునీత కృష్ణన్ చైల్డ్ ట్రాఫికింగ్‌కి సంబంధించి భయంకరమైన సంఘటనల్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఆమె చెప్పిన ఒక ముగ్గురి పాపలు, ప్రణీత, షాహీన్, అంజలిల కథ. ప్రణీత తల్లి ఒక వేశ్య, ఆమెకు హెచ్ఐవీ సోకింది. ఎయిడ్స్ చివరి దశలో ఇక వృత్తి కొనసాగించలేని స్థితి వచ్చి – 4ఏళ్ల ప్రణీతను –బ్రోకర్‌కి అమ్మేసింది. సంగతి తెలిసి రక్షించేందుకు వీళ్లు వెళ్లే సమయానికే – ముగ్గురు వ్యక్తులు ఆ పాపని రేప్ చేసారు. షాహీన్ తల్లిదండ్రులెవరో తెలియదు కానీ వీరికి ఆమె రైల్వే ట్రాక్ పై దొరికింది, వీరు ఆమెను తీసుకొచ్చే సరికి అనేక మంది ఆమెను రేప్ చేసి ఉన్నారని గుర్తులు కనిపించాయి. దాని కారణంగా ఆమె పొట్టలో పేగులు బయటకొచ్చి ఉన్నాయట, వాటిని మళ్లీ లోనికి వేసి 32 కుట్లు వేసేరట డాక్టర్లు. అంజలి తండ్రి తాగుబోతు, ఆమెను పోర్నోగ్రఫీలో వాడబడేందుకు అమ్మేసాడు. ఈ ముగ్గురూ, ఇలాటి వేలాది మంది బాలలు – కేవలం 3,4,5 ఏళ్లవారు ఈ చైల్డ్ ట్రాఫికింగ్ విక్టింలు. అది సాడిజంలా కనిపించవచ్చు కానీ కాదు, బిలియన్ల వ్యాపారం. దేశాల బోర్డర్లు దాటి జరిగే మానవ రవాణా – డ్రగ్స్ ఆయుధాల తర్వాత అతి పెద్ద ఇల్లీగల్ ట్రేడ్.
బచ్‌పన్ బచావో ఆందోళన్ పేరున స్థాపించిన కైలాష్ సత్యార్ధిలాటి వారి వల్ల సమస్య, ఉద్యమరూపాన్ని సంతరించుకోడం, కొద్ది కొద్దిగా ప్రజల మధ్యకు రావడం మొదలైంది. ముఖాలు తెలియని అనామక అభాగ్యులు గుంపులు గుంపులుగా కాక – ముఖాలతో బయటకు రావడం ఒక పెద్ద మలుపు. బాధితులు వారి గొంతు విప్పి జరుగుతున్న అత్యాచారాల్ని బయటపెట్టడం చరిత్రలో ముందెన్నడూ జరగలేదు. దానికి ఆ సేవాతత్పరుల మానవత్వమే కారణం. ఎంతెంతటి అవరోధాలను కూడా దాటి నడిచినంత మేరా సస్యశ్యామలం చేసే జీవధారలాటి మానవత్వం నిండుగా ఉన్న వ్యక్తుల వల్లనే ఈకార్యం సాధ్యపడింది – సందేహం లేదు.
అయితే అందులో చిక్కుకున్న వారిని రక్షించడం, వారికి పునరావాసం కల్పించడం, అది ఎంత నిస్వార్ధమైన సేవ అయినప్పటికీ అది సమస్య పరిష్కారానికి మొదటి అడుగు మాత్రమే అని చెప్పుకోవాలి. ఒక్కొక్కరి వృత్తాంతం వింటే గుండెలు కరిగిపోయేమాట వాస్తవమే. వారి దురదృష్టం పట్ల మనకు కలిగే సానుభూతి - సమస్య లోతుల్లోకి మనని తీసికెళ్లదు. జాలి, దయ, కరుణ, సంఘీభావం – బాధితుల పట్ల కలగడం సహజం. కానీ – పరిష్కారం వెతకడానికి అవేవీ సహాయపడవు.
సమస్య వ్యాప్తి
2016 స్లేవరి ఇండెక్స్ (బానిసత్వపు సూచి) ఈనాడు 46 మిలియన్ల స్త్రీలూ, పురుషులూ, పిల్లలూ ఆధునిక బానిసత్వంలో ఉన్నారని, అందులో సగం ఆసియాలోనే ఉన్నారని చెబుతోంది. ఇంటర్నేనల్ లేబర్ ఆర్గనైజేషన్ ((ILO), లెక్కల ప్రకారం ఈ అక్రమ వ్యాపారంలో లాభాలు 150 బిలియన్లు దాటుతున్నాయట. చరిత్రలో ఎప్పటి కంటే ఈనాడు ఎక్కువ బానిసలున్నారని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. ఇది వెనకబడ్డ దేశాల్లోనే ఉందనీ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉందని అనుకోడానికి లేదు. బంగ్లాదేశ్ లోని అనేక పరిశ్రమల్లో బలవంతపు వెట్టిచాకిరీ ఉంటే, లాస్ ఏంజిల్స్‌లో సెక్సువల్ దోపిడీకి గురౌతున్న ఆడవాళ్లున్నారు. ఉగాండాలో పిల్లల్ని సైన్యంగా వాడుతూంటే, చైనాలో మానవ అవయవాలను పంటల్లా వాడుతున్నారు. యూరప్ రాజధానుల రోడ్ల మీద ఉండే బిచ్చగాళ్లను ట్రాఫికింగ్ చేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని మిలిటరీ స్థావరాలకీ అనుబంధంగా వేశ్యావాటికలుంటాయి. అదే అనుకుంటే, ఆ సైన్యం అక్కడ నుంచి కదలగానే, ఆ పిల్లలను ఇంకా డిమాండున్న స్థలాలకు తరలిస్తారు.
చైల్డ్ ట్రాఫికింగ్‌ లోకి పిల్లల్ని చేర్చే విధానాల్లో వివిధ దశలున్నాయి. ఏయే రకాలుగా దీనిలోకి లాగబడతారో తెలుసుకుంటే – వాటికి అక్కడక్కడ చెక్ చేసే ఉపాయాలను అన్వేషించగలుగుతాం. కిడ్నాప్ చేసి ఎత్తుకు పోయే సందర్భాల్లో పూర్తి నిర్బంధం ఉంటుంది. పని ఇప్పిస్తామని ఆశ పెట్టి కొందరినీ, సగం సగం నిజాలు చెప్పి కొందరినీ తీసుకెళ్లి వారిని అమానవీయ కార్యాలకు నియోగించడంలో మోసం ఉంటుంది. కొందరినైతే సెక్స్ వ్యాపారాలకు నియోగిస్తామని చెప్పి మరీ - వారి తల్లిదండ్రులను బెదిరించడం, డబ్బిచ్చి కొనుక్కుని దోపిడీ చెయ్యడం చేసి వారి పిల్లలను తీసుకుపోతారు.
ఎన్నో విధాలుగా పిల్లల ట్రాఫికింగ్ – తక్కిన వాటి కంటే భిన్నమైనదప్పటికీ - దానిని స్లేవరీ అనే వ్యాపారంలో భాగంగా చూసి అర్ధం చేసుకోవాలి. సామాజిక పరంగా విశ్లేషించుకోవలసినవి కొన్నుంటే, ఆర్ధిక పరంగా పరిశీలించాల్సిన అంశాలు కొన్ని.
సామాజిక కోణం లోంచి ట్రాపికింగ్ మీద ప్రభావం చూపుతాయనుకున్న అంశాలను గుర్తించి, వాటిని ఎదుర్కోగలిగే మార్గాలను అన్వేషించుకోవాలి.
జాతిపరమైన వేర్పాటు (ఎత్నిక్ ఫ్రాక్షనలైజేషన్)
విభిన్న మతాలూ, జాతులూ ఉండే బహుముఖ సమాజంలో, ఎత్నిక్ ఫ్రాక్షనలైజేషన్ బలపడుతోందంటే – ఆ సమాజం సమూహాలగా విడగొట్టబడుతోందని అర్ధం చెప్పుకోవచ్చు. సమూహాలు వేటికవిగా భావించుకుని బలపడాలన్న ఆకాంక్షల వల్ల – ఒక సమూహానికేదైనా ఆపద వస్తే తక్కిన సమూహాలు తగినంతగా స్పందించకపోడం – ఒక ధోరణి. భిన్న సమూహాల మధ్య పరస్పర సంబంధాలు తగ్గిపోయిన కొద్దీ సురక్ష చక్రం (safety net) బలహీనమౌతుంది. చైల్డ్ ట్రాఫికింగ్ విషయాని కొస్తే - బాధితుల వయసు తక్కువగా ఉండడమనే అంశం చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది. పిల్లలు కట్టుబానిసత్వంలో చిక్కుకునేలా చేసేవి ఏయే అంశాలని సోషియాలజీలో రీసెర్చిలు జరుగుతున్నాయి. [Nunn and Wantchekon రాసిన ‘slave trade & origins of mistrust in Africa’, 2011] దీనికి సమాజంలోని కొన్ని విలువలూ, జీవనవిధానాలూ కొంత వరకూ బాధ్యత వహించాల్సి ఉందని తెలుస్తోంది. ఆఫ్రికాలోని బానిసవ్యాపారం బహిరంగంగా జరిగిన సమయంలో ... సమాజంలో మెజారిటీ ప్రజ బానిసత్వాన్ని ఆమోదించేది. దాని వల్ల సమస్యని మొత్తంగా చూడడం పోయి, ఎవరికి వారు బానిసత్వాన్ని తప్పించుకునే ధోరణిలో ఉండేవారట. మానవ జీవితం పట్ల అగౌరవమూ, కొన్ని జీవితాలు వేరే వాటి కంటే ఎక్కువ విలువైనవన్న భావం – ఆ సమాజపు ప్రధాన లక్షణాలనీ తెలుస్తోంది. మన నమ్మకాలూ, సంస్కృతీ, అవగాహనలూ మన చుట్టూ జరిగేవాటిని ప్రభావితం చేస్తాయి. ఈనాడు ఎక్కడెక్కడైతే ట్రాఫికింగ్ తక్కువగా ఉందని తెలుస్తోందో, ఆ ప్రాంతాల ప్రజలు సహజంగానే ఉన్నత నైతిక విలువలున్నవారని, లేక తోటి వారి పట్ల ఎక్కువ ప్రేమ ఉన్నవారనీ చెప్పడానికి లేదట.
కానీ ‘వారు- మేము’ అని బలంగా విడదీసే శక్తులు పనిచేస్తున్న సమాజంలో ట్రాఫికింగ్‌కి ఎక్కువ అవకాశాలుంటాయని పరిశోధకులు నమ్మకంగా చెప్తున్నారు. సమాజంలో అల్లుకుపోయి ఉన్న ఈ విభజనరేఖలతో, పిల్లలు ఏ బలహీనవర్గానికి చెందినవారన్న వాస్తవం కలిసి పనిచేసి వారి ట్రాఫికింగ్‌ సంభావ్యతని సూచిస్తుందంటున్నారు.
అంతర్జాల రాపిడికి అసహాయంగా గురి కావటం (ఆన్లైన్ వల్నరబిలిటీ)
మనం గుర్తించవలసిన సామాజిక పరమైన మరో మార్పు ఇంటర్నెట్, అది పిల్లలను వేటాడడానికి పెద్ద సాధనం. పిల్లల ఆన్లైన్ వల్నరబిలిటీ అనే మాటని – ఇంటర్నెట్ మాధ్యమంలో ట్రాఫికర్లకి పిల్లల లభ్యత పెరిగింది అని అర్ధం చేసుకోవచ్చు. ట్రాఫికర్లకి ఇంతకు ముందు ముఖాముఖీ కలిసే అవసరం ఉండేది. కాని వారు ఇప్పుడు కొత్త బాధితులను పట్టడంలో సోషల్ మీడియాని ఉపయోగించుకుంటున్నారు, ఎవరికీ దొరకకుండా ఉంటూ, సులభంగా దెబ్బతియ్య గల అవకాశాల కోసం కాచుకుని కూచుంటారు. ఆన్లైన్‌ దాడిలో ఆరితేరుతున్నారు. వాట్సప్ మెసేజిలు పంపి, ఎవరన్నా జవాబివ్వగానే వారిపై తమ వల విసురుతూంటారు. ఇబ్బంది కలిగించగల ఫొటోలను, ఇతర వివరాలనీ చేజిక్కించుకుని తమ పట్టు బిగిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోకి సైతం వారి నెట్‌వర్క్ చొచ్చుకుపోయినట్టు వార్తలొస్తున్నాయి.
రాజకీయ అస్థిరతా, సామాజిక సంక్షోభం పెద్ద ఎత్తున పిల్లల జీవితాలపై ప్రభావం చూపుతుంది. యుద్ధాలూ, ప్రకృతి వైపరీత్యాలూ సంభవించే సమయం ప్రత్యేకించి పిల్లలను అతలాకుతలం చేస్తుంది. అది అదునుగా ట్రాఫికర్లు మరింత వేగంగా వారి ఎత్తులు వేస్తారని గుర్తిస్తే కొంతైనా మనం జాగ్రత్తపడగలం.
ఆర్ధిక కోణం
ఎమోషనల్ స్పందన అదుపులోకి తెచ్చుకుని – ఈ బానిసల వ్యాపారానికి మూలాల్లోకి వెళ్లాలి. వ్యాపారంగా దాన్ని అర్ధం చేసుకోవాలంటే ఈకోణంలోంచి చూడడం తప్పనిసరి. ట్రాఫికింగ్లో జరిగే మానవుల మార్పిడిని సప్లై, డిమాండ్ల పరస్పర చర్యగా చూసి – ఆ మార్కెట్ ని ప్రభావితం చేసే అంశాలు ఏవన్న ప్రశ్న వేసుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో (ఒక దేశం లోని కొన్ని ప్రాంతాల్లో కూడా) శారీరక శ్రమనీ, వస్తువులనీ, సెక్స్‌నీ చవకగా కొనుగోలు చేసే డిమాండ్ ఉంటుంది. అదే ఈబానిసల మార్కెట్‌ని నడుపుతుంది. అయితే మామూలు వ్యాపారాల కంటే బానిసల వ్యాపారపు మార్కెట్ రెండు అంశాల్లో భిన్నంగా ఉంటుంది.
ఒకటి ప్రాఫిట్ రేటు. వేల సంఖ్యలో నిత్యం కొనుగోలూ, అమ్మకాలూ జరిపే రాకెట్ (ముఠా)కి – ఒక వ్యక్తిని ఎక్స్‌ప్లాయిట్ చేసేందుకయ్యే ఖర్చు అతి తక్కువ. [Jakobsson & Kotsadam రాసిన ‘The Economics of Trafficking for Sexual Exploitation’, 2015] ఒక హోటల్ గదిలాగా మనిషిని మళ్లీ మళ్లీ అమ్మగలిగే అవకాశం ఉండడం వల్ల ఒకసారి బానిసగా మారిన వ్యక్తి ధర పడిపోయి పడిపోయి – అతి చవకగా అమ్ముడు పోయి కూడా తన యజమానికి లాభం అందిస్తాడు.
సమస్య తీవ్రతని అర్ధం చేసుకునేందుకొక ఉదాహరణగా – ఒక రెడ్‌లైట్ ఏరియాని తీసుకోండి. ట్రాఫికింగ్ చేయబడిన ఒక పిల్లకు ఒక వ్యక్తి 500 రూపాయలు చెల్లించాడనుకోండి. 10మందికి అమ్మితే ఒక రోజుకు ఎంత, ఆ ఏరియాలో ఒక 100 మంది పిల్లలపై గడించే బ్లాక్‌మనీ 5లక్షలు. ఒక దేశంలో అలాటి ఏరియాలు వేల కొద్దీ ఉంటాయి, ప్రపంచంలో ఈ వ్యాపారం సాగుతోంది 100 పైచిలుకు దేశాలతో హెచ్చించి చూడండి. ఇదంతా లెక్క ల్లోకి రాని అక్రమ ధనం. అసలు కీలకం అంతా ఇక్కడే ఉంది. ఈ పోగుపడ్డ ధనమంతా మళ్లీ డ్రగ్స్, ఆయుధాలూ, రాజకీయాల వంటి అక్రమ వ్యాపారాల్లోకి పెట్టుబడిగా మారుతుంది. ఆలాభాల్లో వాటాదారులు అత్యంత శక్తివంతమైన స్థానాల్లో ఉంటారని మనం గుర్తించాలి. ఇలా బలంగా వేళ్లూనుకున్న విషవృక్షాన్ని కూల్చడానికి వేర్వేరు నాలుగు దిశల్లోంచి బలమైన వేట్లు పడాలి.
నాలుగు ‘పి’ లు- ప్రోసిక్యూషన్, ప్రొటెక్షన్, ప్రివెన్షన్, పార్టనర్‌షిప్,
1. ప్రోసిక్యూషన్, (చట్ట సంబంధమైన చర్యలు)
అస్పృశ్యత, మనుషుల వ్యాపారం- రెండూ రాజ్యాంగ ప్రకారము నేరాలే కానీ కైలాష్ సత్యార్ధి అనే ఏక్టివిస్ట్ ఉద్యమించే దాకా ట్రాఫికింగ్‌పై సమగ్రమైన చట్టం లేనేలేదు. బచ్‌పన్ బచావో ఆందోళన్, 2011లో, ఆర్టికల్ 32 కింద – సర్కస్‌లలో పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రజాహిత వ్యాజ్యాన్ని వేసింది. దాని వచ్చిన ఒక మంచి ఫలితం – భారతదేశం అంతర్జాతీయ ఒప్పందంలో భాగమవడం. ఐక్యరాజ్య సమితి చేసిన పాలెర్మో ప్రోటోకాల్‌ని మన దేశమూ రేటిఫై చేసింది, (పాలించాలని నిర్ణయించుకుంది). దాని ప్రకారం: శ్రమ చేయించేందు కోసం – బలవంతం చేసి గాని, తప్పనిసరి చేసి గాని, మోసం చేసి గాని, ఎత్తుకుపోయి గాని - వ్యక్తులని - రవాణా చెయ్యడం, నియోగించడం, ఆ రవాణాకి సహకరించడం, దాని కోసం సొమ్ము పుచ్చుకోడం – ఇవన్నీ ట్రాఫికింగ్ పరిధిలోకి వస్తాయని – కఠినంగా శిక్షించవలసిన నేరాలని స్పష్టమైంది.
ఏజెంట్‌ని అరెస్ట్ చెయ్యడమో, ట్రాఫిక్ అయిన పిల్లలని ఉద్యోగంలో పెట్టుకున్న ఫేక్టరీలని మూయించెయ్యడమో– చాలదు. డబ్బు ఎక్కడెక్కడ చేతులు మారిందో ఆ జాడలన్నిటినీ పరిశీలించి, సంబంధిత వ్యక్తులపై చట్టానికి అప్పగించాలి.
2. ప్రొటెక్షన్ (రక్షణ చర్యలు)
బానిసత్వమే మానవుడికి ఒక మచ్చ అనుకుంటే, పిల్లలను బానిసలుగా మార్చడం దానికి అనేక రెట్లు తీవ్ర సమస్య. ఒక సారి వారి మూలాల్నుంచి పెకిలించబడ్డాక, వారి జీవితాలకు ఎటువంటి పూచీ ఉండదు. ఒకసారి ఆ వలయం నుంచి రక్షించబడినా, స్వయంసమృద్ధి కలిగే దాకా వారికి సురక్షిత స్థావరం దొరకడం చాలా కష్టం. అక్కడ మళ్లీ వారిపై ఏ అత్యాచారమూ జరగకుండా కాపలా కాయడమన్నది ఏ సంస్థకైనా కత్తి మీద సామే.
3. ప్రివెన్షన్ (నిరోధించే చర్యలు)- శాశ్వతంగా దీన్ని నిర్మూలించాలంటే ఒకటే మార్గం, కూకటి వేళ్లని పెకిలించడం. ఆర్ధిక శక్తిని ఉపయోగించి, ఏ వ్యాపారాన్ని దెబ్బతియ్యాలన్నా దాని లాభాన్ని శూన్యం చెయ్యాలి. ఒక పిల్లవాడిని బానిసగా మార్చేందుకయ్యే ఖర్చు పెంచాలి అంటే లావాదేవీలలో (కాస్ట్, సప్లై, ప్రోడక్షన్ అన్ని దశల్లోనూ) ఆటంకాలు కల్పించగలగాలి. ట్రాఫికర్లు ఆశించే లాభాన్ని ప్రబావితం చెయ్యగలిగే పాలసీలను - సప్లై వైపు నించీ, డిమాండ్ వైపు నించీ – కూడా తయారు చేసుకోవాలి. వాటి కోసం పటిష్టమైన చట్టాలనీ, వాటి అమలునూ కోరుకుని సాధించే రాజకీయ ఇచ్ఛాశక్తి (పొలిటికల్ విల్) కావాలి మనకి.
4. పార్టనర్‌షిప్ (భాగస్వామ్యం వహించే చర్యలు)
జూలై 30న ట్రాఫికింగ్‌కి వ్యతిరేక దినంగా గుర్తించారు. దానిని ప్రజల్లో ఈ సమస్య పట్ల సానుభూతినీ, సహకారాన్నీ కూడగట్టడానికి వినియోగించాలి. సునీతాకృష్ణన్ వంటి అపూర్వ మహిళలు – తనపై 8వ ఏట జరిగిన గాంగ్ రేప్ వంటి దారుణాన్ని వ్యక్తిగతంగా అధిగమించి నిలబడడమే కాక ఆ నిప్పుల వర్షంలో నిలబడ్డ దురదృష్టజీవుల్ని నీడలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంలో ఆమె పదేపదే ఒకే మాటను చెప్తుంది – ఈ పోరాటంలో ఆమెకు అత్యంత ప్రయాస కలిగించే అంశం, సమాజం ఈ బాధితులను కలుపుకునేలా చెయ్యడమేనట. ఆమెతో కలిసి పని చేసిన వారు సైతం – ఆ విక్టింలను పనిలో చేర్చుకోడానికి ఇష్టపడకపోడాన్ని ఆమె బాధగా ఎత్తి చూపిస్తుంది. సమాజపు ఆమోదం కోసం నాలుగో దిశగా వేసే ఈ అడుగు కూడా ప్రధానమైనదే.
శాశ్వత పరిష్కారం సుదూరంగా ఉంది, నిజమే ... మరి ఈలోగా మనం ఏమేం చెయ్యగలం? మెజారిటి ప్రజలకు ఇది ముఖ్య సమస్య అని చెప్పి ఒప్పించగలగాలి. అది ఎక్కడో బలహీనవర్గపు పిల్లలకు సంభవించేది మన పిల్లలకు కాదని అనుకునే మధ్యతరగతికి – సమస్య అసలు స్వరూపం తెలియజేయాలి. దిక్కులేని పిల్లల రక్తం తాగి బలిసిన మృగం, దాని వేటును ఉన్నతవర్గపు పిల్లల మీద కూడా వెయ్యకమానదు. ఒక ఐయేఎస్ ఆఫీసర్ కూతురు కూడా ఈ ట్రాఫికింగ్ కి బలయి, ‘ప్రజ్వల’ రక్షించగా బయటపడ్డ సంగతి గుర్తు చెయ్యాలి. మనకి పక్కనే అగాధాన్ని ఉంచుకుని, నిత్యం దానిలో వేలాది పిల్లలు నెట్టబడుతూంటే - దానిలో మనం పడంలెమ్మని ఊరుకోడం మూర్ఖత్వమని వారికి వివరించగలగాలి.
హైడ్రాలాగా అనేక ముఖాలున్న సమస్య ఇది కనక ప్రత్యేక నైపుణ్యం కల పౌర సమాజ సంస్థలు దీనికని పూనుకోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్ జీవోలన్నీ – కలిసి పనిచేసేందుకు సమైక్యవిధానాలను రూపొందించుకోడం, లోపాలను పూరించుకోడానికి అవసరమైన టెక్నాలజీని సమకూర్చుకోడం, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించడం వంటి అనేక కార్యక్రమాలను – ఒకే లక్ష్యసాధన - కోసం ప్రణాళికగా చేపడితే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అన్నిటి కంటే ముందు ఈసమస్య తీవ్రత తెలిసేటట్టు ఎన్ జీవోలు, ప్రజలకి సరైన అర్ధాన్ని అందించని ‘ట్రాఫికింగ్’ అనే పటాటోపపు మాటను వదిలి ‘దొంగిలించడం’, ‘అమ్మడం’ అనే మాటలను వాడడం మంచిది.

No comments:

Post a Comment