Thursday 13 December 2018

బుల్లీయింగ్‌తో తలపడుతున్న తల్లులు

బిడ్డలు బయట ఎదుర్కొనే వేధింపులు, అవమానాలు తల్లులను బాధ పెడతాయి. అన్నీ సరిగ్గా ఉన్న చోట పిల్లలు ఆరోగ్యంగా సమాజంతో సంపర్కం అవుతారు. అన్నీ అపసవ్యాలు, వివక్షతలు ఉన్న చోట పిల్లల కోసం తల్లులు యుద్ధం చేయాల్సి వస్తుంది. - " బుల్లీయింగ్‌తో తలపడుతున్న తల్లులు " - ఏప్రిల్ నెల మాతృకలో ...

“ఈ పోరాటం ఎవరో ఒక తల్లిది అనుకోవద్దు. మనందరిదీ” – ఢిల్లీలో ఉండే రచయిత్రి నాజియా ఏరుం – తన పుస్తకం Mothering A Muslimని ఈ వాక్యాలతో మొదలుపెట్టింది.
ఆమె పుస్తకానికి కీలకం - స్కూలు కేంపస్‌లలో మత ప్రాతిపదికన జరుగుతున్న bullying (వేధింపు), పిల్లలపై దాని ప్రభావమూను. 12 నగరాలలోని స్కూళ్లకు వెళ్లి పిల్లల తలితండ్రులతో ఆమె ఈ అంశం గురించి మాట్లాడింది. బుల్లీయింగ్ అనేది ఢిల్లీకే పరిమితం కాదనీ, హైదరాబాద్, బెంగలూరు, పూనే, ముంబయి వంటి అనేక నగరాలలోనూ, పుస్తకం కోసం రీసెర్చ్ చేసినప్పుడు – దీని చిహ్నాలు కనపడ్డాయనీ ఆమె చెప్తోంది.
మతద్వేషాలు కలిగించే హాని గురించి తెలియనివారుండరు, మరి ఈ విషయంలో మనం ఆలోచించాల్సిన కొత్త అంశం ఏమిటి అంటే – ఇక్కడ బాధితులు పిల్లలు. పిల్లలు ఫిర్యాదులు చెయ్యరు. చిన్న పిల్లలకైతే - అవమానం అర్ధమయ్యే వయసు కాదు, పెద్ద పిల్లలకైతే - సహాయం అడగడానికి అహం అడ్డుపడుతుంది. గత రెండు దశాబ్దాలుగా వస్తున్న మార్పులకు పిల్లల స్పందన ఏమిటన్నది ఇంత వరకూ ఎవ్వరూ రాసి ఉండని విషయం.
బుల్లీ చేసే పసిపిల్లలకి చాలా సార్లు తాము యధాలాపంగా వాడే పాకిస్తానీ, ఐసిస్ అన్నమాటలకు అర్ధాలు కూడా తెలియదు, బుల్లీ అవుతున్న పిల్లలకీ తెలియదు – కానీ ఆగొంతుల్లో పలుకుతున్న అవమానం స్పష్టంగా తెలుస్తుంది. ముస్లిం క్లాస్మేట్ల పట్ల ఆపిల్లల ప్రవర్తన ఆయా స్కూళ్ల దృష్టిలోకి కూడా రాలేదని ఏరుం రీసెర్చిలో తెలుసుకుందట.
“అరే, వీడు ఉగ్రవాదిరా ... నాలుగు తగిలించండి! ఒరే పాకిస్థానీ … పోరా అవతలికి!” అనే ఛీత్కారాలు స్కూళ్లలో సాధారణమై పోతున్నాయని, ఆ వాతావరణంలో పెరిగి పెద్దయిన పిల్లలకి సంఘటనలు మరుపున పడ్డా, శాశ్వతంగా వారి మనస్సులపై గాటు పడుతుందని నాజియా ఏరుం ఆందోళన. విద్యాసంస్థల్లో మతపరమైన ద్వేషాలను ఎదుర్కోడానికి, తల్లిదండ్రులకు ధైర్యాన్ని అందించాలన్న ఆశయంతో ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టింది.
అసలలాటి వేధింపులు జరుగుతున్నాయనే చాలా తల్లులకు తెలియదంటోంది ఆమె, దానికోసమే #MotherAgainstBullying అనే పిలుపునిస్తోంది. ఏ తల్లీ తెలిసి తెలిసీ తన పిల్లలకు ద్వేషం నూరిపొయ్యదని ఏరుం ప్రగాఢ విశ్వాసం. అందుకే సోషల్ మీడియా సైట్లలోని తల్లుల గ్రూపుల్లో ఈ అంశం గురించి చైతన్యం పెంచాలని ఆమె ప్రయత్నిస్తోంది.
ఈ ఉద్యమం ముస్లిం పిల్లలకు ప్రత్యేకమనే భావనను ఏరుం బలంగా వ్యతిరేకిస్తుంది – ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న ప్రతీ ఒక్క పసిప్రాణి కోసం అంటుంది. ఎందుకంటే – ద్వేషం ప్రతీ ఒక్కరినీ మింగేస్తుంది. ఎవరినీ విడిచిపెట్టదు. బాధపెట్టే వారు, బాధపడేవారూ – కూడా వ్యాకులిత వాతావరణంలోనే పెరుగుతారనే సత్యాన్ని గుర్తించాల్సి ఉంది అందుకే ఇది ప్రతీ ఒక్క పిల్లకూ సంబంధించిన సమస్య– ఇవాళ మన పిల్ల బుల్లీ చెయ్యబడొచ్చు, రేపు ఆమే ఒక బుల్లీగా మారొచ్చు, మన పిల్లలు పెట్టేవారౌతారా, పడేవారౌతారా అనేది మనం ఊహించనుకూడాలేం, అది మరింత భయపెట్టే విషయం.
మీ ఐదేళ్ల పసిపిల్ల, మీ పదిహేనేళ్ల పిల్లవాడు – కేవలం మరో మతానికి చెందుతారన్న కారణం చేత – ఇతరులను అవమానించాలని మీరు కోరుకుంటారా? అని సూటిగా ప్రశ్నిస్తుంది. ఈ పుస్తకాన్ని Mothering a Muslim అనే కన్నా, “Parenting A Muslim” అనడం సమంజసంగా ఉంటుందనుకుంటా. అయితే ఈ పేరు పెట్టడానికి కారణం ఉంది. పిల్లల ముచ్చట్ల మాటల్లోను, వారి పెంపకం గురించిన ప్రసంగాలలోను ముస్లిం తల్లుల ప్రసక్తి ఎక్కడ కనబడలేదంటుంది నాజియా ఏరుం. ముస్లిం పురుషుల గురించి ఉంది, ముస్లిం మహిళల గురించీ కనిపిస్తోంది, కానీ ముస్లిం తల్లి ఎక్కడా కనిపించడం లేదు, తక్కిన వారితో పోలిస్తే ఒక తల్లిగా ఆమె ఎదుర్కొనే కష్టనష్టాలెటువంటివి, ఒక ఆధునిక మహిళగా నాతోటి ముస్లిం మహిళల కథనాలేమిటని తెలుసుకోవాలనుకుని ఈ ప్రయాణం మొదలు పెట్టాను. ఒకరి కథలను మరొకరికి వినిపించడం ద్వారా ఒకరి నుండి మరొకరం నేర్చుకోవచ్చంటుంది ఏరుం. ఉదాహరణకి - ఒక తల్లి తన బిడ్డతో చెప్పిందట, “పాకిస్తానీవి అనంటే మరేం తప్పు కాదులే, అది కూడా ఒక దేశమే, కానీ నువ్వు పాకిస్తానీవి కాదు, ఇండియన్‌వి” – అని. ఈసమాధానం నాకు నచ్చింది అంటుంది ఏరుం.
“మీ అమ్మా నాన్నా బాంబులు చేస్తారా?”
“అల్ కాయిదాను సపోర్ట్ చేస్తావా?”,
“మీ నాన్న తాలిబాన్ వాడా? మమ్మల్ని షూట్ చేస్తాడా?”
ఈ ప్రశ్నల్లో అంతులేని భయం కనిపిస్తోందా? అలాటి భయభ్రాంతులకి గురయ్యే వారిలో మన పిల్లలూ ఉండొచ్చని మనం గుర్తించాలి. ఎందుకంటే అవి వేసేది ఏదో చదువులేని పల్లెటూరి పిల్లలు కాదు, దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో లక్షలకి లక్షలు పోసి వెళ్లిన పిల్లలు. “దీనిలో మనం చూడాల్సినది క్లాస్ రూంలని మాత్రమే కాదు, ఒక సమాజపు ప్రతిబింబాన్ని,” అని ఏరుం రాస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో నాయకులుగా ఎన్నికైన వ్యక్తులు, తమ మత అహంకారాన్ని దాచుకోకుండా, సమాజంలోని ఒక వర్గం పట్ల తమ ద్వేషాన్ని పచ్చిగా బయటపెడుతుంటే - తమ పిల్లల భవిష్యత్తుపట్ల ఆందోళన చెందాల్సి ఉందని ఆమె ప్రతీ పేరెంట్‌కూ పిలుపు నిస్తోంది. మగవారూ, అన్ని మతాలవారూ కూడా చదివి ఆలోచించాల్సిన అంశం.
కాని ఈపుస్తకం లక్ష్యం మెజారిటీ రాజకీయాల గురించి మాట్లాడడం కాదంటుంది ఆమె.
వైర్ మేగజీన్ కిచ్చిన ఇంటర్వ్యూలో అలీషా మతరుతో మాట్లాడుతూ, మారిన పరిస్థితుల్లోకి నెట్టబడుతున్న పిల్లల గురించే ఈ పుస్తకం అని చెప్పింది. తమ సొంత దేశంలో ‘ఇతరులు!’ అని వారిపై పడుతున్న ముద్ర గురించి - అని వివరిస్తుంది. స్కూళ్లలోకి పాకిన ఆ వ్యాధి గురించి ఏరుం ఒక జర్నలిస్ట్‌ చూపుతో వార్తాచిత్రంగా ఈ పుస్తకాన్ని మలిచింది.
దీనిలో రెండు భాగాలున్నాయి. స్కూళ్లలోనూ, ఆట స్థలాల్లోనూ - వారి ముస్లిం అస్థిత్వాలను నిత్యం గుర్తుచేస్తూ, అందరినీ ఒక గాటనే కట్టే మతేతరుల వైఖరి గురించి మొదటి భాగంలో చర్చించానని ఏరుం చెప్పింది. ఇక పిల్లలు ఇంటికి వచ్చాక ‘నీ మతాచరణ చాలదని, నీలో తగినంత మతం లేద’ని నిత్యం గుర్తుచేసే తోటి మతస్తుల గురించి రెండో భాగం పరిశీలన చేస్తుంది. ఇలా పిల్లలకి చెరో వైపు, చెరో మూసా పట్టుకుని అందులోకి లాగేందుకు లోనుంచి, బయట నుంచి జరుగుతున్న ప్రయత్నాలు మన కళ్లముందుకొస్తాయి. ఆ ఒత్తిళ్ల మధ్య ముస్లిం పిల్లలు నలుగుతున్నారన్నది – ఆమె చేసిన రీసెర్చి సారాంశం.
ఇలా నలుగుతున్న పిల్లలు కొందరు, అదే తమ నిజమైన అస్తిత్వం అని భావించి మతాన్ని మరింత గట్టిగా పట్టుకుంటున్న దృష్టాంతాలున్నాయి. కొందరు తమ వస్త్రధారణని మార్చుకుంటే, ఇంకొందరు మత గ్రంధాల్లో మరింత ఆసక్తి చూపిస్తుంటారు. సామూహికంగా మనం చేస్తున్న ప్రయాణాన్ని గురించి చెప్పే ఇలాటి పుస్తకాలు ఇంకా రావలసిన అవసరం ఉంది. అసలిలాటి ప్రమాదకరమైన స్థలానికెలా చేరామో సూక్ష్మంగా విశ్లేషిస్తూ – లెన్స్‌ని లోపలికి కూడా తిప్పి చూస్తుంది. ఇస్లాం గురించిన వ్యాఖ్యానాలలో, వివరణల్లో – కొద్దిపాటి వైవిధ్యాన్ని కూడా సహించలేని ముస్లింల గురించి పుస్తకంలోని ఒక భాగంలో చర్చ చేస్తుంది. దానికి కారణం సౌదీ అరేబియన్ నమూనా మతాన్ని దిగుమతి చేసుకోడం అని ఆమె అభిప్రాయపడుతుంది.
ఇరవయ్యో శతాబ్దం వారిమని ఒకప్పుడు నమ్మే పిల్లలు నాజియా ఏరుంతో చెప్పేరట, “18ఏళ్ల పాటు మాతో కలిసి పెరిగిన వారికి హఠాత్తుగా మేం పరాయివారిమై పోడం చూసాం, సరే, మేం ముస్లింలం మాత్రమే అయితే, పూర్తి ముస్లింగానే ఉండడం నయం కదా, కనీసం ఏదో స్థానానికి చెందినవారిమౌతాంగా” అన్నారట.
తిండి కూడా అంతవరకూ లేని కొత్త హద్దుల్ని కల్పిస్తోందట. 12ఏళ్ల పిల్లవాడొకడు, “నీ టిఫిన్ డబ్బాలోంచి తిననురా, నువ్వు బీఫ్ తింటావుగా” అనడం గురించి చెప్తూ, అంత కంటే వింత విషయం ఇంకొకటి ఉందని చెప్తుంది. టాప్ స్కూల్లో కేజీ చదువుతున్న ఒక అయిదేళ్ల పసివాడిని, “నువ్వు ముస్లింవా?” అని అడిగితే – దానికి ఆబాబు “ఔను, కాని నేను బీఫ్ తినను!” అని చెప్పేడట. అంత అమాయకమైన ఆమాటకు ఎలా స్పందించాలో ఆపిల్లవాడి తల్లికి కూడా తెలియలేదట. “ఇంట్లో మేం టీవీ చూడం, వార్తలకోసం కూడా టీవీ పెట్టం, పేపరు చదువుతాం, ఎప్పుడూ ఆవిషయం మాట్లాడుకోనుకూడా లేదు, మరి వాడు బీఫ్ తినడన్న విషయం వాడికెలా తట్టిందో తెలియద”ని అంటుందామె.
అలీషాతో మాట్లాడుతూ ఏరుం ఇలా అంటుంది: “చాలా మంది తల్లులు ‘అబ్బే, మాపిల్లలకెప్పుడూ బుల్లీయింగ్ సమస్య రాలేద’ని చెప్తారు. వారి పిల్లలు వచ్చి ‘అమ్మా, నీకింత వరకూ చెప్పలేదు, ఫలానా రోజున ఇలా ఇలా జరిగింది, నన్ను వాళ్లు బాగా బుల్లీ చేసార’ని గనకా చెప్తే - బహుశా ఆతల్లులు నివ్వెరపోయి, ఇబ్బందిగా మొహం పెడతారనుకుంటా. ఆ ఇబ్బందితోటే మరి ఆపిల్లలు మరి నోరిప్పకుండా చేస్తారేమో. పిల్లల శరీరానికి గాయం అయితే మందు పూస్తామా లేక రకరకాల దుస్తుల వెనక దానిని దాచే ప్రయత్నం చేస్తామా. మరి పిల్లల మనసులకు గాయమౌతూంటే మాత్రం ఎందుకు గుర్తించడానికి ఇష్టపడం? దానికి కారణమైన సమాజంలోని ఛిద్రాలను – బయట పడకుండా అందమైన మెరమెచ్చు మాటల వెనక కప్పాలని చూస్తున్నాం!”
అదే ఈ పిల్లలు ఆర్ధికంగా వెనకబడ్డ వర్గానికి చెందిన వారైతే ఈ సమస్య మరింత దుర్భరమవుతుందనుకుంటారా అని అలీషా ప్రశ్న. దానికి ఏరుం – తప్పనిసరిగా అది పేదముస్లిం పిల్లలను మరింత బాధిస్తుందని – జవాబిచ్చింది. తల్లీతండ్రీ ఉన్నత స్థానాల్లో ఉండి సురక్షితమైన జీవితం కల పిల్లలే ద్వేషాన్ని ఎదుర్కోలేక అభద్రతకు గురౌతూంటే, వెనకపడ్డ వర్గాల పిల్లల మనోభావాలను అంచనా కట్టే పరికరాలైనా మన దగ్గరున్నాయా అని సందేహం కలుగుతుంది.
అవమానం పొందుతున్న పిల్లల తలిదండ్రులకు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియదు, ఎందుకంటే తమ ప్రవర్తనకు బాధ్యులు అవమానించే పిల్లలు కారు, ‘ఇతరుల’ పట్ల పిల్లల తల్లిదండ్రులకున్న వక్ర అవగాహన. ఇక ఆ అవగాహనకు రూపకల్పన చేసేది మీడియా, ఇంకా లోతుకి వెళ్తే విశ్వవ్యాప్తంగా, అన్ని సంస్కృతులలోనూ పెరిగిపోతున్న మతఛాందసత్వం – దానిని పెంచి పోషించేందుకు – అనేక రాజకీయకారణాలు.
సమస్య మూలాలు చాలా లోతున ఉన్న మాట నిజం. కానీ పిల్లలకు సంబంధించిన ఈ అంశాన్ని దానికదే తక్షణ సమస్యగా భావించి స్పందించాలి మనం. అసలు ఈ ద్వేషపూరిత వాతావరణం గురించి చర్చించేంత చనువూ, నమ్మకం – పిల్లలకి మన దగ్గర ఉందా అనేది ఇంకా పెద్ద ప్రశ్న. ఈ సందర్భంలో - మానవజాతినంతటినీ ఒక్కటిగా గుర్తించి, బిడ్డలందరి గురించి అమితమైన ప్రేమతో, విశ్వాసంతో, ఆర్తితో పలవరించిన చలం మనకి స్ఫూర్తి నివ్వగలడు.
ఎందుకు పసితనాన్ని సంరక్షించడం మనకు అత్యావశ్యకమో... చలం మాటల్లోనే వినండి:
ఎప్పటికన్నా ఏ జాతులన్నా, ఏ జీవులన్నా తిరగబడి తప్పించు కోగలరు.
... జంతువులు కూడా తమను తాము కాపాడుకుంటాయేమో! కానీ ఈ పిల్లలు ఎప్పుడూ సమ్మె కట్టలేరు. తెలివి తెచ్చుకోలేరు. ధిక్కరించలేరు. ప్రార్ధించ లేరు, నోరు లేదు. శక్తి లేదు. మీలో అపారమైన విశ్వాసం తప్ప.

6 comments:

  1. పాకిస్థాన్ బంగ్లాదేశ్ దేశాల్లో వాళ్ళు అల్పసంఖ్యాక జనాలపై చేసే అరాచకాలు గురించి అంతెందుకు పాతబస్తీలో ఎలాఉంటుందో పుస్తకాలు వ్రాయరెందుకు.

    ReplyDelete
    Replies
    1. Where did Hindus sleep when Taslima Nasreen was attacked by MIM thugs?

      Delete
    2. అధ్యయనం చేసి రాయడానికి ప్రయత్నించండి! ఇప్పుడు మీరన్న దాన్ని Whataboutism అంటారు. ఎవరి దాకానో ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణ పిల్లల్ని 1990లు, 2000ల్లో చాలా అవమానకరంగా Bully చేసేవారన్నది నా స్వీయానుభవం. అంతమాత్రానా Whatabout it అంటే ఢిల్లీలో ముస్లిం పిల్లలు అనుభవిస్తున్న వేదన మాసిపోదు.
      సమస్య అన్ని దేశాల్లోనూ, అన్ని భాషల్లోనూ, అన్ని క్లాసురూముల్లోనూ ఉంది. Pattern కనుక్కుని, దీన్నెలా ఎదుర్కోవాలన్నదానిపై అందరికీ అవగాహన కల్పిస్తే పాతబస్తీలో హిందువులకు, పశ్చిమగోదావరిలో బ్రాహ్మణులకు, ఢిల్లీలో ముస్లింలకు కూడా ఉపయోగపడుతుందనే నమ్ముతున్నాను.

      Delete
    3. తమాషా ఏంటంటే హిందువులని వెనకేసుకొస్తూ ఒకరు, తస్లిమా నస్రిన్ పేరుచెప్పి మరొకరు కూడా చేసింది Whataboutism ఏ. హిందూ, ముస్లిం, క్రైస్తవాది మతాలకన్నా "దీని సంగతి ఏమిటి" అన్న తాత్త్వికత నేపథ్యంలో ఓ మతం పెడితే బాగా ప్రాచుర్యం పొందుతుంది గావాల.

      Delete
  2. చాలా బాగా, విస్తారమైన వ్యాసం రాసారండీ. థాంక్ యూ. దీన్ని గురించి మొదట హిందూ లో చదివాను

    ReplyDelete
  3. థేంక్ యూ సుజాతగారూ, చదివిన వాటిపై ఇలా ఫీడ్ బేక్ ఇచ్చే మీవల్ల నాకు కలిగే సంతోషం ఎలాగూ ఉంది, దానితో పాటూ - ఆ సమస్యపై చర్చ చేసేవారూ, ఆ తల్లులతో సంఘీభావం ఉన్నవారు కనిపించారని కూడా ఆనందం :)

    ReplyDelete