ప్రాసంగికత:-
మధ్యతరగతి మహిళలను గమనిస్తే ఈ ముప్పై నలభై ఏళ్లలో కనీసం
డిగ్రీ దాకా అయినా చదివిన స్త్రీల శాతం బాగా పెరిగింది. ఆడపిల్ల ఉద్యోగం చెయ్యడం
తప్పుగా కాక తప్పనిసరి గానో, ఇంకా కాదంటే అదనపు అర్హత గానో భావిస్తున్నారు. జానకిని
వేధించిన నెలసరి సమయపు క్షుద్ర సంప్రదాయాలూ, రివాజులూ ఈనాడు తగ్గు ముఖం పట్టి ఉండవచ్చు.
ఇంటా బయటా పనులు చక్కబెట్టుకునే ఈనాటి స్త్రీకి పరాయి మగవాడితో మాట్లాడకుండా జరగదు.
వీటన్నిటి వల్లా – ఆనాటి జానకి మీద ఉన్నంత కట్టడి ఇప్పటి స్త్రీ మీద లేదనీ, ఆ
మేరకు సమాజంలో స్త్రీ స్థాయి మెరుగైందనీ
అనుకోవచ్చా? అలా అనుకునే ముందు పురుషాధిపత్యం ఈనాడు ఏరూపంలో సాగుతోందో గమనించాలి. ‘జానకి
విముక్తి’ ఈనాటి స్త్రీ సమస్యలనే విధంగా ప్రతిబింబించ గలదో పరిశీలించాలి.
సమాజంలో స్త్రీ పురుషుల స్థానం సమానంగా లేదనేది అందరం
ఒప్పుకునేదే. ఇంటి బయటి పరిస్థితులు సరేసరి, తమ కుటుంబ సంబంధాలలో కూడా ఆడవారికి న్యాయమైన స్థానం లభించడం అరుదు. శారీరక మానసిక
హింసలకు గురౌతున్న ‘జానకి’లు మన చుట్టుతా ఉన్నారు. ఉదాహరణకు, వివాహ బంధం లో దిగకుండా
‘లివిన్ రిలేషన్’ లలో జీవిస్తున్న మాడరన్ యువజంట లలో సైతం పురుషుడు స్త్రీ మీద
చేయ్యిచేసుకోవడం పరిపాటే అంటే - అది పాశ్చాత్య దేశాలతో సహా ప్రపంచమంతటా వ్యాపించి ఉందంటే
... ‘గృహ హింస’ ఈనాటికీ ఎంత సీరియస్ సమస్యో, ఎంత లోతుగా పాతుకుపోయిందో మనం అర్ధం
చేసుకోవచ్చు.
‘ఆమెను కట్టడిలో ఉంచుతున్నది ఆమె సంక్షేమం కోసమే ననడం!
ఆమెను స్వంత మనిషి గా భావిస్తున్నామంటూ ఆమె మీద అధికారం
చెలాయించడం! ఆమెను అనుమానించి హింసించడానికి ఆమె పట్ల ‘అవధులు లేని ప్రేమే’
కారణమనడం ... ... ... ఇవన్నీ ‘అణచి వేత’కు ఆధునిక సమాజం
కప్పిన అందమైన ముసుగులు. అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే – స్త్రీలే ఆ మాటలను
నిజమని నమ్మడం. ఈ నేపధ్యం లో ‘జానకి విముక్తి’ లో చిత్రించిన పురుష స్వామ్యపు
భావజాలాన్ని ఒక్క సారి పరిశీలిద్దాం.
దెబ్బలు తిని సిగ్గుతో, అవమానంతో కుమిలిపోతున్నజానకిని సముదాయిస్తూ
వెంకట్రావు మాట్లాడిన మాటలు యుగయుగాల పురుషుడి వంచనాశిల్పానికి నిలువెత్తు
అద్దాలు. తల్లి కన్నా జానకే దగ్గరదనీ, అందుకే ఆమె వద్ద తనకు స్వతంత్రమనీ ఒక
సమర్ధింపు. జానకి గొడవ పెంచుతోంది కనక నోరు మూయించడానికి మరేమీ తోచక ... కొట్టానని
మరో బుకాయింపు. తీరా కొట్టాక తనకే ఎక్కువ బాధ కలిగిందనీ, అంతులేని పశ్చాత్తాపంతో
వటించి పోతున్నానని ఇంకో మోసగింపు. ఆనాటి వెంకట్రావు కురిపించిన తర్కాలన్నీ అక్షరం
పొల్లు పోకుండా ఈనాటి పురుషులూ వినిపిస్తూనే ఉన్నమాట అబద్ధమూ కాదు, వాటిని నమ్మే
దుస్థితిలో స్త్రీలు ఇంకా ఉంటున్నారన్నది అవాస్తవమూ కాదు.
అందుకే ఆ వాదాల వెనక ఉన్న బూటకాన్నిఇలా బయట పెడతారు:
వెంకట్రావు వాగిందంతా ఏదో అల్లాటప్పా వాగుడు కాదు, అది ఒక శక్తివంతమైన తత్వశాస్త్రం! లక్షలాది, కోట్లాది స్త్రీల మెదళ్ళని చీడలా పట్టి మొద్దుబార్చి, వాటిని అజ్ఞానానికీ అచేతనానికీ అభిమాన రాహిత్యానికీ
ఈడ్చెయ్య గల తత్వశాస్త్రం.
కాలితో ఈడ్చితన్నిన మనిషి ముందు, తన్నులు తిన్నమనిషి అంత లొంగుబాటు తనంతో కూర్చున్నదంటే, తన్నిన మనిషి వాగేదంతా అంత సహనంతో వింటున్న
దంటే, చివరికి ‘అసలు నాదే పొరపాటేమో’ అనుకుంటున్నదంటే, దానర్ధం ఏమిటి?
నిలదీసి అడుగుతున్నట్టున్నఈ ప్రశ్నలు చదివినప్పుడల్లా సమకాలీన
సమాజం లో దాని ప్రతిధ్వనులు మారుమోగినట్టయి ఉలిక్కి పడతాం! ఇకనైనా మేలుకోమని
హెచ్చరిస్తున్నట్టయి జాగ్రత్త పడతాం! మన సమాజం శతాబ్దాలుగా పేర్చుకుంటూ వచ్చిన ఈ తిరోగమన
భావజాలమంతటికీ గొడ్డలి పెట్టు ‘మార్క్సిజం’ అని తెలుసుకుంటాం!
జ్ఞానం:-
అంతు లేని మానసిక దాస్యం లోంచి బయటపడి సత్యం
స్నేహాభిమానాలతో ఆత్మవిశ్వాసం పుంజుకున్న జానకి క్రమేణా ఒక కొత్త మనిషిగా
రూపొందుతుంది. మార్క్సిజం అనే తత్వ శాస్త్రపు వివిధ పార్శ్వాలు ఆమె వ్యక్తిత్వం లోని
వివిధ కోణాలలో కాంతిని ప్రసరిస్తాయి. శాస్త్రీయ దృక్పధం అలవడుతుంది. స్త్రీ పురుషుల
అసమానతకూ, స్త్రీల ఆర్ధిక అస్వతంత్రతకూ ఉన్న సంబంధం తెలుసుకుంటుంది. ఇంటిపనీ,
బయట పనీ విభజన స్త్రీల సమస్యకు మూలకందమైనదని గుర్తించుకుంటుంది. గర్భిణీ గా
ఉన్నా ధైర్యంగా ఫాక్టరీలో పని చేయడం ప్రారంభిస్తుంది. సమాజాన్ని పరిశీలించడం, తోటి
వారి సమస్యలకు స్పందించడం, చేతనైనంత సహాయం చేసి తన ఉనికిని సార్ధకం చేసుకోవాలనే
విధంగా జానకి పరిణతి చెందుతుంది.
పూర్తిగా విస్మృతి లో పడ్డ పాత జీవితంతో జానకికి మిగిలిన ఏకైక
బంధం విశాలాక్షి స్నేహం. తన అవగాహనలో కొస్తున్న నూతన చైతన్యాన్ని జానకి
ఎప్పటికప్పుడు విశాలాక్షితో పంచుకుంటూ ఉంటుంది. కానీ విశాలాక్షి తీవ్ర నిరాశా
నిస్పృహల్లో ఉండి విరక్తిగా మాట్లాడుతుంది. ఎందుకంటే జానకి కంటే భిన్నమైన సమస్య ఆమెది,
కేవలం ఆత్మవిశ్వాసంతో తీరేది కాదు. ఆమె భర్త బాధ్యతారాహిత్యం వల్ల కుటుంబం ఆర్ధికంగా చితికి పోయి ఉంది. గంపెడు
సంతానాన్నీ పెంచి పెద్ద చేసే మార్గం దొరికే వరకూ విశాలాక్షికి ‘విముక్తి’ దొరకడం
దుర్లభం. అది అర్ధమై తన బంగారం పుస్తెల్ని అమ్మేసి, కుట్టుమిషను కొనుక్కోమని జానకి
విశాలాక్షికి డబ్బు పంపిస్తుంది. దానితో పాటూ సత్యం కూడా విశాలాక్షిని ఊరడిస్తూ
ఉత్తరం రాస్తాడు. ఆ గడ్డు పరిస్థితుల్లో కూడా మార్క్సిజం అందించే జ్ఞానాన్ని
నిర్లక్ష్యం చెయ్యొద్దంటాడు. ఎందుకంటే సరైన పరిష్కారం పట్టుకోవాలంటే సరైన జ్ఞానమే
ఆధారం అని అతని విశ్వాసం. “మీరున్న స్థితిలో కూడా జ్ఞానం పట్ల మీ నిరుత్సాహం
మీ కెంత హాని చేస్తుందో మీరెరగరు.” అని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు.
బాధ పడేవారి పట్ల సానుభూతి మాత్రమే కాదు, విముక్తి మార్గమూ,
దాని కార్యాచరణా కావాలని రాస్తారు. “ఈలోకంలో ఉన్న ప్రతీ బాధకీ అనేక వేల హృదయాలు
సానుభూతితో కంపిస్తాయి. కానీ ఆ హృదయాల శక్తి, ఆ బాధని
నిర్మూలించడానికి చాలదు.” సమస్యలను పరిష్కరించు కునేందుకు
తక్షణ మార్గాలను చేపడుతూనే, విముక్తి సిద్ధాంతమైన ‘మార్క్సిజా’న్ని అధ్యయనం చేస్తూ
ఉండాలనీ, సమస్యల్లోంచి బయటపడాలన్న వారికి ఘర్షణ ని మించిన కర్తవ్యం లేదనీ
రంగనాయకమ్మగారు అనేక సందర్భాల్లో చెప్తూ
ఉంటారు.
వెంకట్రావు ఆధిపత్యంలో గిజగిజ లాడే జానకిలో భయం, భీతి ప్రబల
లక్షణాలుగా ఉండేవి. తన తప్పు లేకుండా శిక్ష ననుభవించేటప్పుడు ఉక్రోషం, ఉడుకుమోత్తనం
ఆమెను ముంచెత్తేవి. నోట మాట రానంత ఆవేశమూ,
దుఃఖం మితి మీరి నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్నంత విరక్తీ కలిగేవి.
తన పరిస్థితిని గురించి ప్రశ్నించడం నేర్చుకున్నాక ఆమెలో
పరివర్తన మొదలౌతుంది. ఈ సందర్భం లో ‘తల
ఎత్తిన బానిస, అప్పుడే సగం బానిస కాడు’ అన్న లెనిన్ వాక్యాన్నిఉదహరిస్తారు.
ఆ స్థితిలో ఉన్న ఆమెకు అందిన సరైన ‘జ్ఞానం’ ఆమెలో బలాన్ని
నింపుతుంది. జానకి వెంకట్రావుతో సంభాషించే విధానమే మారిపోతుంది. ఈ వాక్యాల్లో
ధైర్యంగా నిలదీసే జానకిని మనం చూడొచ్చు: ‘జానకి, కోపంగా మాట్లాడ్డం
లేదు, నెమ్మదిగానే, శాంతం గానే మాట్లాడుతోంది.
కానీ పట్టుదలగా మాట్లాడుతోంది. తన పక్షాన ఎంత న్యాయం ఉందో చూడమన్నట్టు మాట్లాడుతోంది.’ ఆ ‘సంయమనం’
జానకికి జ్ఞానం వల్లనే చేకూరిందంటే అతిశయోక్తి
కాదేమో.
సిద్ధాంత జ్ఞానపు ఆవశ్యకతని మరో సందర్భం లోనూ ప్రస్తావిస్తారు.‘భర్త’
అనేవాడి తోడు లేకుండా తన స్వంత శ్రమతో జీవించడానికీ, బిడ్డను కూడా ఒంటరిగానే పెంచడానికీ
జానకి సిద్ధమౌతుంది. ఆ సమయంలో సత్యం ఆమె నిర్ణయపు దృఢత్వాన్ని పరీక్షించాలని
అనుకుంటాడు. జీవితంలో జరిగే మార్పుల్ని స్తిరంగా,
నిబ్బరంగా, సహజంగా
తీసుకోలేక బాధపడుతుందేమో అని సత్యానికి కొంచెం సందేహం. జానకి దృక్పధం
లోని స్పష్టతను తెలుసుకున్నాక సత్యం గర్వపడతాడు.
మనిషికి గొప్ప సంస్కారాన్నీ,
గాంభీర్యాన్నీ, సాహసాన్నీ,
విప్లవ దృష్టినీ ఇచ్చేది సమాజం గురించి తెలుసుకునే జ్ఞానమే అని
సత్యం నమ్మకం. సిద్ధాంత పరిజ్ఞానానికి తోడుగా మనుషుల మనస్తత్వాలకు
సంబంధించిన లౌకిక జ్ఞానం ఆమెకై ఆమే స్వానుభవంతో తెలుసుకుంటుందని ఊహిస్తాడు. జానకి
తన స్నేహితుల్లో మగవారి తోనూ, ఆడవారి తోనూ స్వతంత్రంగా చనువుగా కలిసి మెలిసి
ఉండాలని ఆశిస్తాడు. ఎవరెటు వంటి వారో, ఎక్కడ ఎలా మెలగాలో ఆమే నిర్ణయించుకుంటుందని
తల్లికి భరోసా ఇస్తాడు.
అలా సరైన దృక్పధం ఏర్పడడంలో ‘జ్ఞానం’ పాత్ర ఎంతటి మౌలిక మైనదో
జానకి జీవితం మనకు నిరూపిస్తుంది. సిద్ధాంతాన్ని అధ్యయనం చెయ్యడం, వాస్తవ
పరిస్థితులకు దానిని అన్వయించుకోవడం, అన్వయించుకున్న దాన్ని ఆచరణ లో సరిచూసుకోడం ‘విముక్తి’కి
తప్పనిసరి అని మనకు ‘జానకి కథ’ పాఠం చెప్తుంది.
భార్యాభర్తల సంబంధాలు:
జానకివిముక్తి లో అనేక తరహా దంపతులు మనకు ఎదురౌతారు. వారి
మధ్య ఉండే సాన్నిహిత్యం, సమానత్వ స్థాయిల్లో హెచ్చుతగ్గులను గమనించొచ్చు. మచ్చుకి ఆర్ధిక
నిచ్చెన లో - లక్ష లార్జించుకునే నవ నాగరీక జంట హేమా, భర్తా ఒక చివరా, నాలుగిళ్ళ
పాచిపని చేసుకునే నరసమ్మా, భర్తా మరో చివరా –కనపడతారు. స్వాభిమానంతో జీవించే
కాంక్ష లేకుండా పలాయనవాదంలో దిట్ట ఐన హేమా; రెక్కలు ముక్కలు చేసుకుని కూడా మొగుడికి
జడిసి దెబ్బలు తింటూ కాపరం చేసే నరసమ్మా... వీరిద్దరి వైవాహిక జీవితాల లోనూ
సమానత్వం ఉండదు, అసలు వారికి తమదో సమస్య అన్న స్పృహ కూడా ఉండదు.
ఆలోచిస్తే – సమస్య ఉందన్న విషయం గుర్తించేందుకు కూడా కొంత
సంస్కారం, అవగాహనా అవసరం అనిపిస్తుంది. గుర్తించిన తరువాత దానికి కారణాలను
అన్వేషించ వలసి ఉంటుంది.
జానకి వెంకట్రావు తో విడి పోయినట్టూ - అన్ని సమస్యలకూ
విడిపోవడమే పరిష్కారం కాదని చెప్తారు. సామరస్యం కుదిరే సందర్భాల్లో రాజీ
పడకపోయినా, విషమిస్తున్న చోట అలసత్వం చూపించినా – రెండూ తీరని నష్టాలే అని
వివరిస్తారు. భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలను ఎలా ఆకళింపు చేసుకోవాలో ఇలా రాస్తారు.
‘భార్యాభర్తల మధ్య వచ్చే కలహాలకు కూడా మిత్రవైఖరీ,
శత్రువైఖరీ ఉంటాయి.
మిత్రవైఖరి కలిగిన సంబంధం లో వచ్చే అసంతృప్తుల్ని గురించి భయపడవలసిన
అవసరం లేదు. ఆ సంబంధం చెడకుండానే ఆ అసంతృప్తుల్ని పోగొట్టుకోడానికి వీలౌతుంది. దాని
కోసం కూడా తగిన ప్రయత్నాలు తగిన పద్ధతిలో చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఆ ప్రయత్నాలు
ఫలిస్తాయి, నిష్ఫలం కావు.
కానీ భార్యాభర్తల మధ్య ‘శత్రువైఖరి’
ప్రబలం అవుతూ ఉన్నప్పుడు,
దాన్ని గమనించుకోకపోతే,
జీవితం వ్యర్ధం అయిపోతుంది.’
అసమానత్వపు అపశ్రుతులన్నిటి మధ్యా శాంతా సత్యాల ‘సహజీవనం’ -
మన ముందు మిలమిలా మెరుస్తూ, ఆహ్లాదకరమైన సంగీతంలా వినిపిస్తూ, కమ్మని పరిమళం
మనసంతా నింపుతూ ... భవిష్యత్తు మీద మనలో ఆశను పెంచుతుంది. సహజీవన సౌఖ్యానికీ,
శాంతికీ, కుటుంబం ఇవ్వగలిగే ఆలంబనానికీ – సత్యం శాంతల కాపురం ఒక నిదర్శనం.
దాదాపు లోపరహితంగా ఉండే శాంత పాత్ర దాని కదే ఒక సంపూర్ణమైన
ప్రతీక. శతవిధాలా ఆధునిక మహిళకు ఆదర్శమని అనిపిస్తుంది. విముక్తి దిశగా జానకి
సాగించిన ప్రయాణం లో గమ్యానికి ఒకింత దగ్గరలో శాంత ఉందని ఊహించొచ్చు.
సామాజిక చైతన్యం:
స్వతంత్ర వ్యక్తిత్వాలను సంతరించుకోవడం విషయాని కొస్తే జానకీ,
శాంతా కూడా ఈనాటి మన మధ్యతరగతి మహిళల కంటే చాలా ముందున్నారని పిస్తుంది. భర్త లతో తో
సమానంగా ఆర్జిస్తూ, తమ తమ రంగాల్లో ప్రవీణులన్న పేరు తెచ్చుకున్న స్త్రీలనే
ఒక్కసారి పరిశీలిద్దాం. తమ సమీప పరిసరాల్లో జరుగుతున్న మార్పులను గుర్తించడం కానీ,
చుట్టూ ఉన్నవారి కష్టసుఖాలను పట్టించుకోడం గానీ, వాటి గురించి ఆలోచించడం గానీ – ఇది ఎంత మంది స్త్రీలలో చూడగలుగు తున్నాం?
సగటు స్త్రీ కి ప్రపంచం ఈనాటికీ తనకూ, తన కుటుంబానికే పరిమితమై ఉంటోంది కదా! అలాటి
వారిని చూస్తే సత్యానికే కాదు, మనకు కూడా ‘సంసారాలు చేసేవాళ్ళు ఆ ఘనకార్యం తప్ప, ఇంకే మంచిపనీ చెయ్యకూడదా? ఇంకే విషయాలూ పట్టించుకోకూడదా?’ అన్న ప్రశ్న
లేస్తుంది. జానకి పాత్రను సగటు స్త్రీ లందరికీ మార్గదర్శకం గా మలిచారనడం లో సందేహం
లేదు.
వేరే ఫాక్టరీ వర్కర్లు సమ్మె చేస్తూంటే వారికి సహాయం
అందించే నిమిత్తం జానకి తన సహ కార్మికులతో కలిసి చందాలు పోగేసే పని చేస్తుంది. ఆ
అనుభవాలను ఇలా విశాలాక్షికి లేఖలో వివరిస్తుంది:
మీరు నమ్ముతారో లేదో గానీ బాగా చదువుకున్నఆడవాళ్ళు కూడా వాళ్ళకై వాళ్ళు స్వతంత్రించి
చందా లివ్వలేదండీ. భర్తల్నో, కొడుకుల్నో పిలిచి అడగడం! వాళ్ళతో మాట్లాడి వాళ్ళు
చెప్పినట్టు చెయ్యడం!
చాలా మంది ఆడవాళ్ళు మేము
వెళ్ళగానే, మా వ్యవహారం మొగాళ్ళకి అప్పచెప్పి లోపలికి వెళ్లి పోయేవారు. కరపత్రం
తీసుకుని, సంగతేమిటో విని ఎంతో కొంత వాళ్ళే ఇవ్వకూదడూ? ‘మా ఆయన లేరండీ’ అనడం!
‘ఇంట్లో మొగాళ్ళు లేరండీ’ అనడం!
స్త్రీల చైతన్య రాహిత్యం వారి ఒక్కరి సమస్యే కాదు, ఆ
స్త్రీల కుటుంబ సభ్యులకు కూడా అందులో భాగస్వామ్యం ఉంటుంది. సామాజిక క్రియాశీల
జీవితాలను కోరుకునే పురుషులు, తమ కుటుంబం లోని స్త్రీలు తమకు సహకరించరని వాపోతూ
ఉండడం కద్దు. అలా స్త్రీలను తప్పు పట్టే మగవారు కూడా సత్యం నుండి కొన్ని అంశాలను నేర్చుకోవలసి
ఉంటుంది. ‘సిద్ధాంతానికి సంబంధించిన పుస్తకం ఏదో ఒకటి రెగ్యులర్ గా చదవాలని
పెట్టుకున్నాం. ఎవరికి వాళ్ళం వేరు వేరుగా చదువుతాం. ఒక పుస్తకం అయిపోతే ఇంకొకటి
ప్రారంభిస్తాం. ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకోవలసి వొస్తూనే ఉంటుంది.’
అని సత్యం తన స్నేహితునితో చెప్తాడు.
ఇంకా ‘భార్యాభర్తలు పుస్తకాలు కలిసి చదువుకోడం
మొదలుపెడితే ఇంట్లో వాతావరణం చాలా బాగుంటుంద’ని కూడా వివరిస్తాడు.
కుటుంబాలలోని స్త్రీల శక్తి సామర్ద్యాలు సమాజమంతటికీ వినియోగమయ్యే విధంగా కుటుంబ
వాతావరణం రూపుదిద్దుకోవాలన్న ఆకాంక్ష కనిపిస్తుంది.
జానకి జీవితనౌక - బిడ్డ ‘బ్రూనో’ పెంపకం, చదువుకోడం,
ఫాక్టరీలో కార్మికురాలిగా మారడం, ప్రభాకర్ తో సహజీవనం, బాధ్యతను గుర్తెరిగిన వ్యక్తిగా సామాజిక జీవనం, ఇలా ఒక్కొక్క మజిలీ చేసుకుంటూ సాగిపోతుంది. వ్యక్తి
విముక్తి సమాజం విముక్తి తో అంతస్సంబంధం కలిగి ఉంది గనక జానకి విముక్తి సమగ్రమైపోయిందని అనలేం.
Please give link for part-I, my reading of part-II, is making me eager to go through part-II, earliest.
ReplyDeletehttp://mythesisandantithesis.blogspot.in/2016/05/blog-post.html
ReplyDeletethank you chavera garoo...your comment gives me confidence that I am able to communicate...
ReplyDeleteజానకి విముక్తి సీరియల్ గా వస్తూ ఆంధ్ర జ్యోతిలో ఆగి పొయిన గుర్తు.
ReplyDeleteనాకు ఇన్నాళ్ళకి జానకి విముక్తి ఎల అయ్యిందో మీబ్లాగు ద్వారా తెలిసింది
ఇప్పుడు నిజ జీవితం లో నా దగ్గర చదివిన / చదువుతున్న అమ్మాయిలు ఎందరో,
ఇంకా ఎంతో సాహసోపేతంగా తమ తమ కు నచ్చిన మార్గాలను ఎన్నుకుంటున్నారు.
రంగనాయకమ్మ గారు, మరి వారిలాంటి వారు ఈ మార్గాలకు దారి చూపారు.
Chadalavaada Venkata Rama Mohan