Wednesday 14 September 2016

నిషేధం ఏ సమస్యకు పరిష్కారం?




          

ఫ్రాన్సులో జూలై 28 న నైస్, కాన్స్ పట్టణాల్లోని టూరిస్ట్ ప్రాంతాల్లోనూ, ఇంకా అనేక నగరాల్లోని బీచిల్లోనూ, బురఖాలతో నీటిలోకి దిగే ముస్లిం మహిళలను అపరాధ రుసుముతో శిక్షించాలని ఫ్రెంచి ప్రభుత్వం నిర్ణయించింది. దీని పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసన మిన్నుముట్టింది. ఈ విషయమై ఫ్రెంచి స్త్రీవాదులు ప్రభుత్వాన్ని ఖండించక పోవడం మరిన్ని వాగ్విదాలకు తెర తీసింది. ఇటీవల అంతర్జాతీయ రాజకీయాల్లో ఏర్పడుతున్న ఒత్తిడి దృష్ట్యా ఈ బురఖా ధారణ పూర్వాపరాలను విచారించ వలసి ఉంది.  బురఖా నిషేధం కలిగించే ప్రభావాలను అంచనా కట్టుకోవలసి ఉంది. ఆ చర్చ లోకి దిగే ముందు  ఒక మౌలిక విషయాన్ని  నిర్వివాదంగా అంగీకరిద్దాం.
1.స్త్రీల వస్త్రధారణ వారి స్వవిషయం:
బురఖా అనేది స్త్రీలకు ఇబ్బంది కలిగించే వస్త్రమే. అది  పితృస్వామ్యపు సెక్సిస్ట్ భావనలకు గుర్తు. అయితే భవిష్యత్తులో ఏదో ఒక నాడు, స్త్రీలు వారి జీవితాలకు సంబంధించిన అన్ని అంశాలను వారే నిర్ణయించుకోబోతారనీ, ఆ రోజున  ‘ముసుగు’ వేసుకునే అగత్యం వారికి తప్పిపోతుందని మనం విశ్వసించాలి. ఆ లోగా, ఏది ఏమైనా, మహిళలు ఎప్పుడు ఏ దుస్తులను ధరించాలన్న విషయంలో ‘రాజ్యం’ జోక్యం చేసుకోవడం మాత్రం తీవ్రంగా ఖండించ వలసిన విషయం. దానిలో ఏ అనుమానానికీ తావు లేదు.           

‘మత గురువులూ, ఛాందస కుటుంబాలూ, సమాజమూ – స్త్రీలేమి ధరించాలో చెప్పడం తప్పూ’ అని సరిగ్గా గుర్తు పట్టగలిగిన స్త్రీవాదులు మరి వారి ప్రభుత్వాల కెందుకు ‘ఆ అధికారాన్ని’ కట్టబెడుతున్నారో!? ఎవరి కిష్టమైన రీతిలో వారు దుస్తులు వేసుకునే హక్కు - ఎన్నో పోరాటాలు సాగించి సాధించిన హక్కు, ఇంకా కోట్లాది స్త్రీలకు దక్కని ఈ హక్కు –– దీనిని అంత సులభంగా జార విడుచుకోడం తెలివితక్కువ తనంగా తోస్తుంది.  
బురఖా - గౌరవం, మర్యాద లకు తప్పుడు పరిభాషలు చెప్తుందనడం లో సందేహం లేదు. అది స్త్రీ వ్యక్తిత్వాన్ని పరిహరిస్తుంది. ఆ విషయం అర్ధం చేసుకున్న స్త్రీవాదులు, స్త్రీకి బురఖా అగత్యం కలిగించే పరిస్థితులను ప్రతిఘటించాలి – ఆ పరిస్థితులను కల్పించేది ప్రభుత్వం అవనీ, కుటుంబాలు గానీ, సమాజం గానీ, మరేదైనా గానీ. అయితే  వాటిని ప్రతిఘటించే విధానాలు ఏవన్నది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఆ పని చర్చలూ, ఉద్యమాల ద్వారా జరగాలి కానీ నిషేధ చట్టాలను తయారు చేయడం ద్వారా  మాత్రం కానే కాదు. ఆ విషయాని కొస్తే బురఖా వేసుకుని తీరాలనే చట్టం ఏ దేశం లోనూ ఉన్నట్టు లేదు.            

ఇక్కడ విషయం బలప్రయోగం కానీ ఒక నిర్దిష్ట వస్త్రం కాదు.

ఈ నిషేధాన్ని సమర్ధించే వారి వాదన ప్రకారం, మహిళలు స్వచ్చందంగా బురఖాను ధరించాలనుకోరు కనుక బురఖా ఆచారంపై  స్త్రీలు తిరగబడేందుకు ఈ నిషేధ చట్టం సహాయపడుతుందని వీళ్ళ ఊహ. కానీ ఒక ముఖ్య విషయం మర్చి పోతున్నారు - ప్రభుత్వ జోక్యపు విధానాలు స్త్రీల స్వయం నిర్ణయశక్తిని బల పరచక పోగా ఎవరి వస్త్రధారణపై  వారి సహజసిద్ద అధికారాన్ని అడ్డు కుంటున్నాయి.

2.స్త్రీవాదుల పాత్ర:
ప్రభుత్వ విధానాలకు తోడు, సంఘాల పంధా కూడా ఈ స్త్రీల స్వేచ్చను ఆటంకపరిచేదిగా ఉండడం శోచనీయం. ఒకప్పుడు పేరున్న స్త్రీవాద సంఘాలు ముసుగు వేసుకున్న వారిని తమ మీటింగుల్లోకి అనుమతించేవి కాదు. ముసుగు వేసుకోవడం అణచివేత కు ఒక ప్రతీక గనుక దానిని పాటించేవారు ఫెమినిజం ప్రతిపాదించే విలువలకు వ్యతిరేకమని వారి ఉద్దేశ్యం.
అప్పట్లో కొందరు స్త్రీవాదులు ఆ వివక్షను ప్రతిఘటించక పోలేదు. ఆ లెక్కన ఎత్తు చెప్పులూ, పెదాలకు పూసుకునే రంగూ వంటి అనేక స్త్రీత్వపు గుర్తులు కూడా విభజనకూ, వివక్షకూ ప్రతీకలని ముద్ర వెయ్యాలా అని చర్చలు కూడా చేసారు. వారిలో ఒకరు క్రిస్టీన్ డెల్ఫీ అనే ఫ్రెంచి రచయిత్రి. ఆమె ప్రఖ్యాత ఫెమినిస్ట్ సిమోన్ డీ బోవర్ తో కలిసి పని చేసిన వ్యక్తి. ముస్లిం మహిళల ప్రత్యేక పరిస్తితులను అధ్యయనం చేసాక ఆమె శ్వేత జాతీయులైన తన తోటి స్త్రీవాదుల నిలా హెచ్చరిస్తున్నారు: “ఈ ముస్లిం మహిళలు వారి సమస్యలకు తగిన పరిష్కారాలతో, వారి పరిస్థితులకు అనుగుణమైన స్త్రీవాద భావజాలాన్ని నిర్మించుకోబోతున్నారు. ఆ స్త్రీవాదం వారి ముస్లిం సంస్కృతిని కూడా పరిగణన లోకి తీసుకుంటుంది. అది మనం గుర్తించకపొతే, విద్వేషాలను పెంచి పోషించే శక్తులకు మద్దతు నిచ్చిన వాళ్ళ మౌతాం. కాలం మించిపోక మునుపే ఈ పొరపాటును మనం సరి చేసుకోబోతామని ఆశిస్తున్నాను.” 

3.నిషేదాలు సమస్యకు పరిష్కారాలా?
ముసుగు విషయం పై  స్త్రీవాదులు కనపరుస్తున్న ఏహ్యభావంలో ఒక స్వయం విరుద్ధత కనిపిస్తుంది. మహిళలు ముసుగులు ధరించడానికి కారణం సాంప్రదాయ శక్తుల ప్రోద్బలమేనని వీరు అంగీకరిస్తారు. అటువంటప్పుడు వారిని స్కూళ్ళ లోకి రావద్దని తిరస్కరిస్తే వారి కుటుంబాల అవాంఛనీయ ప్రభావాల లోకే ఆ స్త్రీలను తిప్పి పంపినట్టౌతుంది కదా, అది మరి సమస్యను పరిష్కరిస్తుందా?

ఫ్రెంచి ఫెమినిస్టులు ముసుగుధారిణులను ‘బాధితులు’గా అంగీకరిస్తే, బహిష్కరణలను మాని, సంఘీభావంతో అక్కున చేర్చుకోవాలి. వారు స్వేచ్చగా తిరుగాడేందుకు సావకాశం కల్పించాలి. ఆ మహిళలకు బురఖా కంటే తీవ్రమైన సమస్యలున్నాయని గుర్తించాలి, వాటి విషయం లో శ్రద్ధ కనపరచాలి.

ఈ సందర్భంలో ‘హిమాల్ సౌతేషియన్’ ఎడిటర్, అనాహిత మొజుందార్ తన ఆఫ్ఘనిస్తాన్ అనుభవాల ఆధారంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకోవలసి ఉంది.“ఆ స్త్రీలు బురఖా లేకుండా తిరగడం సర్వధా వాంఛనీయమే! అయితే వారు బయటకి రావడం, ముఖ్యంగా పని లోకి రావడం , అది ముసుగు వేసుకునైనా సరే – అంతకంటే ముఖ్యం. ముసుగు లేకుండా తిరిగే పరిస్థితులు ఏర్పాటయ్యే దాకా ఇంటిలో కూర్చోవలసి రావడం ఎంత మాత్రం వాంఛనీయం కాబోదు.”  

4.ఇస్లామోఫోబియా:
బురఖా నిషేధాన్ని సమర్ధించే వారు ఫ్రాన్సూ జర్మనీలకూ, అఫ్ఘనిస్తానుకూ తేడా ఉందంటారు. బురఖాను ఖండించేవారు – దానిని మతచిహ్నాల బహిరంగ ప్రదర్శన సమస్యగా తీసుకున్నారానుకున్నా, సంస్కృతి సూచిక పేరున దూరంగా ఉంచాలనుకున్నారన్నా – భిన్నమతాల, సంస్కృతుల చిహ్నాలెన్నో ఉండగా బురఖా పై మాత్రమే ఎందుకింత వ్యతిరేకతన్న ప్రశ్న రానే వస్తుంది. విషయానికి ఎంత మసి పూసి మారేడుకాయ చెయ్యాలని చూసినా బురఖా పై నిర్ణయం ఇస్లామోఫోబియా (ముస్లింల పట్ల పెంచుకునే అకారణమైన భయం) నే కనపరుస్తుంది. ఫ్రాన్సులో దీని తీరుతెన్ను లీనాటివి  కావు.
పాఠశాలల్లో బాలికలు తల మీద ముసుగు ధరించడాన్ని నిషేధిస్తూ 2004లో ఒక చట్టం వచ్చింది. ‘మత చిహ్నాలు రాజకీయ లౌకికత కు వ్యతిరేకమ'న్న భావనతో తయారైన, ఏంటి ముస్లిం అని గుర్తు పట్టగలిగే మొట్ట మొదటి చట్టం అది. అయితే అంతకు నలభై ఏళ్ల క్రితం నుంచీ ముస్లిం ప్రతికూల ప్రచారాలు మొదలయ్యాయి. 2004కు ముందు కూడా ముసుగు వేసుకున్న యువతుల్ని స్కూళ్ళ లోకి రానిచ్చేవారు కాదు. అది విద్యపై వారికి గల ప్రాధమిక హక్కుల తృణీకరణగా పరిగణించ వలసిన విషయం.
థామస్ దేల్టంబ్ అనే పాత్రికేయుడు ఒక గంభీరమైన అంశాన్ని గుర్తించి తన ఆక్షేపణ ప్రకటించాడు.  ఫ్రాన్సులో కెల్లా ప్రధాన వార పత్రికలు రెండిటిలోనూ ఏదో ఒక దానిలో - "మనము ఇస్లాము ను చూసి భయపడాలా?" అనో, "ఇస్లాము ప్రజాస్వామ్యానికి అనుకూలం కాదా?" అనో - ప్రశ్నలు గుప్పిస్తూ వచ్చారట.
1980 - 2000 సంవత్సరాల మధ్య కాలంలో, ఏదో ఒక పత్రిక అలాటి శీర్షికలతో ఆర్టికల్స్ ప్రచురించని వారమే లేదట! దినపత్రికలూ. రేడియో, టీవీల క్కూడా అదే విధమైన ఉన్మాదం పాకింది, కాలంతో పాటు అది మరింత తీవ్రమౌతూనూ వస్తోంది.
2004 లో సేడ్ బోమామా రాసినట్టూ - రాజకీయ లౌకికవాదం పేరుతొ చెలామణీ అవుతున్న ఫ్రెంచి ఇస్లామోఫోబియా నిజానికి చేసే పని ఏమిటంటే జాతి వివక్షతా భావాలకు ప్రజల దృష్టి లో ఒక బూటకపు గౌరవాన్ని కల్పించడం మాత్రమే.

5.కాందిశీకుల పై నిరాదరణ: 
ఇస్లాం మతం పాశ్చాత్య నాగరికతను దెబ్బ తీస్తుందన్న అనుమానం ఒకటి  పౌరుల్లో బలంగా వేళ్ళూనుతోంది. పెనుభూతంగా మారి భయపెడుతోంది. ఆ 'ఇస్లాం అనే ప్రమాదా'నికి  ప్రతిరూపంగా వారు చిత్రీకరించుకుంటున్నది మరెవరినో కాదు, ఉత్తర ఆఫ్రికా బిడ్డలైన అయిదు  మిలియన్ (ముస్లింలూ, ముస్లిమేతరులూ కూడా ఉన్న) ఫ్రాన్సు పౌరులుగా స్థిరపడ్డ కాందిశీకులనే!           

దానిలో భాగమే ముస్లింలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్న 'లైసేట్' అనే లౌకికవాదం. రాజకీయ నాయకులూ, పత్రికల వారూ, వాణిజ్య ముఠాలూ కలిసి ఈ చట్టపు పరిభాషను పూర్తిగా మార్చేసినందు వల్ల ఒక తప్పుడు అవగాహన ప్రచారం అవుతోంది. అలాటి ప్రచారాల ప్రభావమా అన్నట్టు, ముస్లిం మహిళలు అసలు 'నిజమైన' ఫ్రెంచి పౌరులు కానే కాదన్నట్టు  ప్రవర్తించడం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది.

దీనికి తాజా ఉదాహరణ ఈ ఆగస్ట్ 27న ట్రెంబ్ లే ఎన్ ఫ్రాన్సు పట్టణం లోని ఉదంతం: “తీవ్రవాదులు ముస్లింలు, ముస్లిం లందరూ తీవ్రవాదులే” అంటూ ముసుగు ధరించిన ముస్లిం మహిళలకు తిండిని అమ్మనని ‘లే సెనకిల్’ రెస్టారెంటు యజమాని చేసిన వ్యాఖ్య ఫ్రెంచి ప్రభుత్వాన్ని తలదించుకునేలా చేసింది. మంత్రి లారెన్స్ రోసిగ్నాల్ సైతం, ఈ ప్రవర్తన సహించలేనిదని ఒప్పుకోవలసి వచ్చిందంటే ఈ దురభిప్రాయాలు సమాజాన్ని ఎంత లోతుగా  చీలుస్తున్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరి దృష్టీ ఐక్యత సాధించడం మీద పెట్టవలసి ఉంది. సమాజాన్ని కలిపి ఉంచేందుకు భిన్న సంస్కృతుల స్వభావాలను సంయోజనం చేసుకోవాలే తప్ప, భిన్నత్వాలనే రూపుమాపాలనుకోవడం సరైన మార్గం కాదు.   

ఒక ఆచారాన్ని నిషేధపు కోణం లోనుంచీ కాకుండా, దానిని పాటించేవారి కోణం నుంచి పరిశీలించి, వాస్తవాలను పరామర్శించు కోవడం సత్ఫలితాల నిస్తుంది. ఎంతో అసౌకర్యానికి ఓర్చి ఆ ముస్లిం మహిళలు బురఖా నెందుకు ధరించాలను కుంటున్నారో ఒక సారి ఆలోచించవలసి ఉంది.           

6.బురఖా ధారణ కుండే విభిన్న కోణాలు:
మతచిహ్నాలను నలుగురికీ కనపడేట్టు ధరించడం అనే అంశం అనేకార్ధాలతో మనకు కనిపిస్తుంది. ఈ విషయమై క్రిస్టీన్ ఇలా అభిప్రాయ పడుతున్నారు. “ముస్లిం మహిళలు తమ జాతి వారికి తమ సంఘీభావం తెలుపు తున్నా రన్నఅర్ధం తీసుకోవచ్చు. తామున్న దుస్థితి నుండి తప్పించుకునే ప్రయత్నంలో మతం అందించే ఆధ్యాత్మిక భావాలలో రక్షణ పొందుతున్నారన్న అర్ధమూ తీసుకోవచ్చు, లేదా ఇదీ అని చెప్పకుండా వారికి తోచిన పద్ధతిలో వ్యవస్థ పై వారి నిరసన ప్రకటిస్తున్నారనీ అర్ధం చేసుకోవచ్చు.”

వీటన్నిటినీ పరిశీలిస్తే ఈ చిక్కు ప్రశ్నలకు సమాధానం సాధించకుండా బురఖాపై సులభంగా ఒక నిర్ణయానికీ రాలేమని తెలుస్తుంది. అది అలా ఉండగా, బురఖా తొలగింపు, స్త్రీజనోద్ధరణకు ఒక కొండ గుర్తని పాశ్చాత్య దేశాల్లోని, అభివృద్ది కాంక్షుల కొక నమ్మకం కుదిరిపోయింది. ఆఫ్ఘనిస్తాను వంటి దేశాలలో స్త్రీల పరిస్థితికి బురఖా ధారణను ఒక సూచీగా చూపిస్తున్నారు. బురఖాను వీరు ఒకానొక మత మౌడ్యానికి ప్రతీక గానే చూస్తున్నారు తప్ప, దాని కీలకం పితృస్వామ్య వ్యవస్థ లో ఉందని గుర్తించడం లేదు.
ముస్లిం జాతి పైనున్న దురభిప్రాయాల కారణంగా పాశ్చాత్య స్త్రీవాదులు ముస్లిం మహిళల దుస్థితికి గల నిజమైన కారణాలను పట్టించుకోవడం లేదు. అందుకే బురఖా ధారిణులను పీడించడం లో పితృస్వామ్యమే కాక  జాతి వివక్ష కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని మనకు అనిపిస్తుంది.
7.బురఖాపై పట్టుదల?:
పితృస్వామ్యం – అది ఇస్లాం దైనా, పాశ్చాత్యపు దైనా – దాని వికార స్వరూపాలూ, దురాచారాలూ అన్ని సంస్కృతుల్లోనూ విధిగా కనిపిస్తాయి. అది ఒక జాతికి మాత్రమే ప్రత్యేకమని భ్రమించకూడదు.
నిజంగా ప్రభుత్వాలకు ఈ కాందిశీక మహిళలను సమాజ జన వాహినిలో అంతర్భాగం చెయ్యడమే లక్ష్యమైతే, బురఖాల నిషేధం వంటి అడ్డదారుల్లో కాక, మరింత విస్తృతమైన పరిధిలో ఆ ప్రయత్నాలను చేపట్టాలి. కేవలం కాందిశీకుల ఆచారాలనే కాక మిగిలిన సమూహాలలో పాతుకు పోయిన సెక్సిస్ట్, వివక్షా ధోరణుల పై కూడా కొరడా ఝళిపించాలి. అలా కాక బురఖా ఆచారాన్ని మాత్రమే అనుమానించడం అంటే జాతి అహంకారానికీ, మత ద్వేషానికీ - ‘స్త్రీల హక్కుల పరిరక్షణ’ అనే రంగు పులమడం అన్న మాట. 

ఆగస్టు నెలాఖరులో ఫ్రెంచి ఉన్నత న్యాయస్థానం రివియేరా పట్టణం లో బురఖా పై నిషేధాన్ని నిలిపి వేసింది. ఆ తీర్పు మరిన్ని చోట్ల తన ప్రభావాన్ని చూపగలదన్న ఆశాభావం వ్యక్తమౌతోంది. కానీ కొన్ని నగరాలు కోర్టు తీర్పును లెక్క చేయ్య బోమనీ, బురఖా నిషేధాన్ని కొనసాగిస్తామనీ వ్యాఖ్యలు చెయ్యడం కూడా జరుగుతోంది.



ఈ వివాదాన్నంతటినీ గమనించగా ఒక్క విషయం స్పష్టమౌతుంది. మన హక్కులను కాపాడుకోడం లో ఆదమరుపు పనికి రాదు. రాజ్యం విధించే నిషేధాలు ఏదో రూపంలో మన జీవితాలను శాసించేందుకు నిత్యం పొంచి ఉంటాయి. వాటిని ప్రతిఘటించి కనపడుతున్న సమస్యల మూలాలెక్కడ ఉన్నాయో చూసుకుంటూ వాటిని కూకటి వేళ్ళతో పెకలించడానికి సన్నద్దులం కావాలి.         

        

No comments:

Post a Comment