http://eemaata.com/em/issues/201601/8149.html?allinonepage=1
సాహిత్యంలో వేశ్యా వృత్తి
నళినీ జమీలా అనే సెక్స్ వర్కర్ వేశ్యల సమస్యలపై సమాజపు దృష్టి ప్రసరించే నిమిత్తం, తమకు న్యాయం కావాలంటూ కొన్నేళ్ళ క్రితం తన ఆత్మ కథను ప్రచురించారు. సమకాలీన సమాజంలో ఆమె ఎదుర్కొన్న కష్టనష్టాలు, సాగించిన పోరాటాలు కేవలం ఆమె ఒక్కరివే కావు. వేశ్యా వ్యవస్థలో భాగాలైన అనేక మంది స్త్రీలు ఆమె కథలోని చేదు అనుభవాలకు ప్రత్యక్ష సాక్షులు. వ్యక్తిగత అనుభవాల నేపధ్యంతో ఆమె తన ఆత్మకథలో వెలిబుచ్చిన అభిప్రాయాలపై చర్చగా కాక, వేశ్యావృత్తి సమస్య సామాజిక సమస్య అని భావించి, వారి జీవిత చిత్రణ మన సాహిత్యంలో ఏవిధంగా జరుగుతూ వచ్చిందో జరిపే విశ్లేషణ దిశగా ఈ వ్యాసరచనకు పూనుకుంటున్నాను.
ఇందుకు కారణం ఏమిటంటే, ఎవరి కథ వారే చెప్పుకోవడం స్వాగతించవలసిన పరిణామమే కానీ అదే అత్యంత ప్రామాణికం అని పూర్తిగా నమ్మలేం. ఈ సందర్భంలో కుటుంబరావుగారి ముడి సరుకు అనే కథ లోని ఒక వాక్యం గుర్తొస్తోంది. ఒక పాత్ర, ‘నన్నుగురించి నేను చెప్పుకోగలిగితే నువ్వు దేనికి!’ అని రచయితతో అంటుంది. అంటే సమస్యలో చిక్కుకుని ఉన్న వారు, తమ పరిస్థితి గురించి వస్తునిష్టతతో విశ్లేషించుకోడం పూర్తిగా సాధ్యం కాదు అని కొ.కు. అభిప్రాయం కావచ్చు. దానికి కళ సహయకారి కాగలదు. జీవితం కన్నా కళలు ఒక మెట్టు ముందుండి, భావికి సంకేతాలుగా ఉంటాయి. కళాకారులు సామాన్యుల జీవితాలను వారి కంటే లోతుగా గమనించి కళాసృష్టి చెయ్యగలరని ప్రజల నమ్మకం. అందుకే తన ఆత్మకథలో నళినీ లేవనెత్తిన ప్రశ్నల మూలాలను, మన ఆధునిక తెలుగు సాహిత్యపు పుటల్లో పరిశీలన చేసేందుకూ, ఆ రచయితల సామాజిక దృక్పథాల వెలుగులో చర్చించేందుకూ ప్రయత్నించాలన్నది ఈ వ్యాసానికి సంకల్పం అయ్యింది.
సమాజాన్ని చూసే విధానం, సమాజాన్ని గురించి ఉండే అవగాహన – వీటిని మనం సామాజిక దృక్పథం అని నిర్వచించుకుని, ఆ నిర్వచనంతో వేర్వేరు కాలాలకు చెందిన రచయితల సామాజిక దృక్పథాలను ఆ సమాజ పరిస్థితుల నేపధ్యంలో విశ్లేషణ చేసుకోవచ్చు. తటస్థ చరిత్ర లాగే తటస్థ సాహిత్యం కూడా ఉండదు. జీవితం లోని ప్రతీ సంఘటన, చూసేవారిని బట్టి వేరు వేరు అంతరార్ధంతో కనిపిస్తుంది. ఈ వైవిధ్యాన్ని – సాహిత్యకారుడు కాచి, వడపోసి, నిగ్గు దేల్చి ఏ దృక్పథం లోంచి ఆ సంఘటనల్లోని సత్యాన్ని లోకానికి వ్యక్తం చెయ్యాలో నిర్ణయించుకుంటాడు. అది అతని సామాజిక దృక్పథం ఔతుంది. ఆధునిక నవలకూ, నాటకానికీ, కథకూ, కవితకూ మూలపురుషులైన వీరేశలింగం, గురజాడలు ఒక నిశ్చితమైన సామాజిక దృక్పథం తోనే కలం పట్టారు. అలాగే తరువాతి తరాలలోనూ రచయితలు, సమాజపు నమ్మకాలకూ, జీవిత సత్యాలకూ ఉండే అంతరాలను వారి సాహిత్యంలో ఎత్తి చూపించారు, వారి దృక్పథాలు వారు జీవించిన సమాజాల విశ్వాసాలకంటే ఎంత భిన్నంగా ఉన్నవో గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని తరాల లోనూ, సమాజంలో వేశ్యల స్థానం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి, ఒక విలక్షణకోణంలో వేశ్యలను దర్శించి వారి పాత్రపోషణ కావించిన రచయిత లున్నారు. వారి రచనలలో వెల్లడయ్యే వారి దృక్పథాన్ని పరిశీలిస్తే వేశ్యావ్యవస్థను మరింత వివరంగా అర్ధం చేసుకోవచ్చు.
ప్రాచీన సాహిత్యంలో, వేశ్యలతో సహవాసం దోషమనీ, ధర్మార్ధాలకు హాని కలుగుతుందనీ, అది మనిషిని పతనం చేస్తుందనీ మన పూర్వులు ఏకకంఠంతో చెప్తూ వచ్చారు. ‘మనుధర్మ శాస్త్రకర్తలు, వేశ్యాప్రియులు పంక్తి బాహ్యులనీ, వారికి రాజసభ లందు కొలువు లీయరాదనీ విధించి యున్నారు,’ అని వీరేశలింగం మనకు గుర్తు చేస్తారు. 1890ల తర్వాత భారతీయ సమాజంలో దేవదాసీలను నిషేధించాలంటూ ఏంటి నాచ్ ఉద్యమం మొదలయ్యింది. దాని ఆవశ్యకతను, తెలుగు సమాజపు నేపధ్యంలో కందుకూరి తన ప్రహసనాల్లో చిత్రించారు. ‘పూర్వకాలంలో ముసుగు వేసుకుని రెండో కంటి వాడికి తెలియకుండా వేశ్య ఇంటికి వెళ్ళేవారూ, ఈ కాలంలో అందరూ చూస్తే మరింత గౌరవమని భావించి, బాహాటంగా పట్టపగలే పదిమందిని వెంటపెట్టుకుని మరీ వేశ్యల ఇంటికి వెళ్తున్నారు. వేశ్యా సాంగత్యం సమాజంలో ప్రతిష్టాకారణమౌతోంది’ అంటూ గ్రంధాలలో రాసి ఉన్న ఆదర్శాలకూ, వాస్తవంగా సమాజం లో ప్రచారమౌతున్న భావాలకూ కనిపిస్తున్న ఈ వ్యత్యాసాన్ని వీరేశలింగం తీవ్రంగా ఖండించారు. ఆనాటి సమాజం పాటిస్తున్న – కన్యాశుల్కం, వృద్ధులకు చిన్నపిల్లలను కట్టబెట్టడం వంటి అనేక దురాచారాలతో బాటు, వేశ్యలనూ, వారి పోషకులనూ, వేశ్యావృత్తి సమర్ధకులనూ ఆయన చీల్చి చెండాడారు.
కందుకూరి వీరేశలింగం ఏంటీ నాచ్. కానీ వారిని వేశ్యల శ్రేయస్సుకు విరోధిగా కాక వారికి మెరుగైన జీవితం కోరిన సంస్కర్తగా మనం అర్ధం చేసుకోవాలి. ‘వివాహమాడి పతివ్రతలు కాదగిన వేశ్యలను జారిణులనుగా చెయ్యడమౌట చేత అది వేశ్యలకు కూడా ద్రోహమే,’ అని ఆ వృత్తి లోని దోషాన్ని ఆయన సరిగ్గా గుర్తించారు; వేశ్య దయనీయ జీవితాన్ని సానుభూతితో పరిశీలించారు. ‘కొంచెము వయసు జారిన తోడనే విటపురుషులు తమ్ము విడిచి యవలకు జారగా, గడించిన సొమ్ము వ్యాధుల కింద వ్యయపడగా, వెనుకటి సంగీతనాద మిప్పుడు రోదననినాదముగా మారగా, ముప్పది సంవత్సరముల ప్రాయముననే దేహము చెడిపోయి తిండికి లేక తమ పాపఫలమ నుభవించుచూ, రోగముల చేత బాధ పడుచూ – ఇట్టి కులవృత్తి నంగీకరించిన యీ దేశము యొక్క యపకీర్తి మూర్తీభవించి యీ రీతిని బహురూపముల మెలుగుచున్నదో యన అభాగ్యదేవతల వలె నెల్లెడ దిరుగుచుందురు.’ అని వారి దుస్థితిని కళ్ళకు కట్టినట్టు సమాజానికి చూపించారు.
వేశ్యలను వినోద సాధనాలుగా ఆమోదించే రివాజు సమాజంలో అనాదిగా ఉండేది. రూపకాల లోని స్త్రీ పాత్రలను పోషించడానికి బ్రహ్మదేవుడు అప్సరసలను సృష్టించినట్లు నాట్యశాస్త్రంలో (200BC -200AD) భరతుడు పేర్కొంటాడు. అలాటి తరతరాల సమాజపు నమ్మకాలను ఎదిరించి, వీరేశలింగం తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి సారి వేశ్యజాతిని భగవంతుడి సృష్టిలో భాగంగా కాక, సమాజంలోని ఒక జాడ్యానికి రూపంగా చూపారు. ఆయన దృక్పథం సమకాలీన సమాజస్వభావానికి భిన్నంగా, ప్రగతిశీలకంగా ఉండడం గమనించాల్సిన విషయం. అది తరువాత వారందరికీ కొత్త వెలుగు చూపింది.
1910లో గురజాడ అప్పారావు కన్యాశుల్కం లోని మధురవాణి పాత్ర వేశ్య అయి ఉండీ తాను ఏంటీ నాచ్ నని చెప్పుకోవడం ఒక విశేషం. వీరేశలింగంగారి భావజాలాన్ని అనుభవసారంగా గ్రహించి, ఆమోదించిన వ్యక్తిగా మధురవాణి పాత్రను అర్ధం చేసుకోవచ్చు. ‘నేను అక్షరాలా యాంటీ నాచ్‌నే, వివేకలేశం వున్నవారు ఎవరు యాంటీ నాచ్ కారండి?’ అని మధురవాణి అనడమే దానికి సాక్ష్యం. కానీ గురజాడకు వేశ్యల పట్ల ఉండే దృక్పథాన్ని మరింత తరచి చూడవలసిన అవసరముంది. సంస్కరణ వాదమంటే గౌరవమున్నా, ‘వేశ్యలను చూడమనీ, మాట్లాడమనీ, తాకమనీ’ ప్రకటించే సంస్కర్తల పట్ల గురజాడకు అభ్యంతరాలున్నట్టు మనకు ఆయన రచనల్లో తెలియవస్తుంది. వేశ్యలను పెళ్లి పేరంటాలకు పిలవకుంటే వారెట్లా బతకాలనీ, వారు గిరీశం వంటి కుక్కల పొత్తుకే తగుదురా, సౌజన్యారావు వంటి సత్పురుషులను చూడడానికి కూడా వీలవదా అనీ, వారు విద్యాబుద్ధులు నేరిస్తే సౌజన్యారావు వంటి వారు వారిని పెళ్లాడుదురా, అనీ మధురవాణి అనేక సందేహాలు వ్యక్తం చెయ్యడం దీనికి తార్కాణం.
వేశ్యల ధనదాహాన్నీ, వారి వల్ల కలిగిన కుటుంబ సంతాపాలనూ చిత్రించిన చింతామణి వంటి అనేక నాటకాలు తెలుగు వారికి చిర పరిచితాలే. వేశ్యలనే కాదు, వేశ్యామాతలను కసిదీరా తిట్టి ప్రేక్షకులకు ఆనందం కలిగించిన సన్నివేశాలు ఆ నాటకాలలో ఉండేవి. కానీ ఆ దుర్మార్గం వృత్తిలో ఉందనీ, వ్యక్తుల్లో కాదనీ గుర్తించి, వేశ్యలలో ఆరాధ్యులున్నారని చెప్పగలిగిన క్రాంతదర్శి గురజాడ. వృత్తి ధర్మానికీ, తన ప్రవృత్తికీ ఉన్న వైరుధ్యం కరటకశాస్త్రి స్నేహితుడై ఉండి కూడా గుర్తించనందుకు మధురవాణి నొచ్చుకుంటుంది. ‘వృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట్ల ద్రవ్యాకర్షణ చేస్తాను గానీ, మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలచారా? మీ తోడబుట్టుకి ప్రమాదం వచ్చినప్పుడు నేను డబ్బుకి ఆశిస్తానా?’ అని ఆమె అంటుంది.
స్వార్ధవర్తనం మరింతగా సమాజంలో పెరిగి, అన్ని రంగాల్లోనూ వచ్చిన నైతిక పతనమై, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కలుపుమొక్కలు (1935) కథలో దుర్గంధంగా మనకు పడుతుంది. ఆ కథలో, సబ్ కలెక్టరూ, ప్రెసిడెంటూ, ప్రెసిడెంటు గుమస్తా, బ్రాహ్మడూ మొదలైన మర్యాదస్తుల పాత్రలందరూ కలుపు మొక్కలే. బహుశా అందరూ కలుపుమొక్క అని భావించే వేశ్య శేషాచలం మాత్రమే ఈ కథలో కలుపుమొక్క కాని పాత్ర.
శ్రీపాద వారిదే మరొక రచన వడ్లగింజలు అనే కథ. చదరంగం ఆటలో అసమానప్రతిభావంతుడు శంకరప్ప రాజుగారితో ఆడి గెలవడం కథాంశం. దాని రచనాకాలం 1941 అయినా కథా కాలం మరింత వెనక్కి జరిగినట్టు ఆయన నేపధ్యం ద్వారా సూచిస్తారు. ఈ కథలో శాస్త్రిగారి చిన్నచిన్న వ్యాఖ్యానాలతో వేశ్యల జీవితాలలోని కళా వైదగ్ధ్యాన్ని ఊహించే ప్రయత్నం చెయ్యవచ్చు. తన గతాన్ని రాజు వద్ద ప్రస్తావిస్తూ స్వయంగా శంకరప్ప ఇలా చెప్పుకుంటాడు. చంద్రవదన అని మా వూళ్ళో వొక వేశ్య, ఆమె మా నాయనగారి దగ్గిర కావ్య నాటకాలంకార గ్రంధాలు నాతో పాటూ క్షుణ్ణంగా చదివింది. భ్రాతృ ప్రేమతో పెంచి నన్నామె చదరంగంలో ప్రవేశపెట్టి దిద్దింది, అని తన చెల్లెలు అంటూ చంద్రవదనకు కృతజ్ఞత చెప్పుకుంటాడు.
తరవాతి పాత్ర అలివేణిది. ఆమె తన నృత్య పాటవంతో పెద్దాపురపు సంస్థానానికి ప్రతిష్ట చేకూర్చిన కళాకారిణి. శంకరప్ప ప్రజ్ఞ అన్నా, అతని వ్యక్తిత్వమన్నా ఆమెకు అంతులేని ఆరాధన. రాజసభలో, శంకరప్ప సమక్షంలో అలివేణి అద్భుత నాట్య ప్రదర్శనకు అందరూ స్థాణువులైపోతారు. ‘ఎదుట కూచుని మహా విద్వాంసుడు చూస్తున్నాడన్న ఉత్సాహంతో అలివేణి ఇవాళ వొళ్ళు మరిచిపోయింది’ అని ఒకరంటే, ‘అదీ సంగతి, కోట్లిచ్చినా కళాశీలిక లాంటి ఆవేశం కలగదు మరి!’ అని మరొక రనుకుంటారు. ‘వేశ్యల కళకు ప్రేరణ డబ్బే’ అన్న లోకపు నమ్మకపు నేపధ్యంలో, కళాకారులకు మాత్రమే అర్ధమయ్యే ఆ కళావేశాన్ని, మైమరుపునూ వేశ్య అలివేణిలో దర్శించిన రచయిత చూపు మనకు కొత్త కోణాలను పరిచయం చేస్తుంది.
డబ్బుతో కొనలేని అంశాలను చిత్రించే అటువంటిదే మరో ప్రయత్నం 1940లలో వచ్చిన కుటుంబరావుగారి కథ, నీకేం కావాలి? లోని కస్తూరి పాత్ర. వేశ్య అయి ఉండీ, డబ్బుకు ఆశ పడని ఆమెలో ఒక మంచితనాన్ని ఊహిస్తాడు కథకుడు. ఆమెను, ఆ గాట్లోంచి ఎత్తి ఇంకో గాట్లో వేసి, సంస్కరించాలనీ, ప్రేమ మీదా, నీతి మీదా అభిమానం పుట్టించాలనీ అతని ప్రయత్నం. మధురవాణి చర్చించిన వేశ్యా వివాహపు సాధ్యాసాధ్యాలను మనం ఈ కథలో చూడవచ్చు. ఎటువంటి ఆడదైనా, తన ఆర్ధిక సమస్యల భారం మోసే మగవాణ్ని – ఎటువంటి వాడైనా సరే, ప్రేమించకుండా ఉండలేదు అని కథకుడి ధైర్యం. అది సమాజం లోని చాలా మంది నమ్మకం కూడా. కానీ కస్తూరి ప్రేమ అమ్మకానికి దొరకనిదని రచయిత మనకు స్పష్టం చేస్తారు. తనను అదుపు చేసే వారిని, బంగారమిచ్చినా కస్తూరి తన గడప తొక్కనీదు. తోటి స్త్రీ లతో పోల్చుకుని తనను తాను తక్కువ చేసుకోదు. ‘ఎవరి గొప్ప వారిదీ’ అంటుంది. తనని గాని, తన వృత్తిని గాని హేళన చేస్తే సహిస్తుంది నిందిస్తే సహించదు – ఆమె ఆత్మాభిమానం అటువంటిది. ఆమెతో సాన్నిహిత్యం పెరిగాక, అతని దురభిమానం పటాపంచలై పోతుంది. ఎట్టకేలకు ఆమె ప్రేమను సంపాదించుకుంటాడు. తన యింటికి వచ్చి ఉండమని ఆహ్వానిస్తాడు. ఆమె తిరస్కరిస్తుంది. ప్రేమబంధానికి కట్టుపడుతుంది కానీ దాని కోసం తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టదు. వృత్తి మానేసేటందుకు మనస్ఫూర్తి గా సమ్మతిస్తుంది. తన ఇంట్లో తానుంటాననీ, అతన్నే వచ్చి తన ఇంట్లో ఉండమనీ కోరుతుంది. నీకేం కావాలి? అన్న ప్రశ్నకు సమాధానంగా, ‘నీ మీద ప్రేమ ఉండి, నేనంటే ఇష్టం లేనివాళ్ళను తెచ్చి పెట్టకు, అంత కంటే నా కింకేమీ అక్కర్లేదు,’ అని చెప్తుంది. ధన ప్రలోభాలకీ, సంస్కరణ వాదాలకీ ప్రేమ అతీతమైనదనీ, ఆ ప్రేమ కంటే కూడా అపురూపమైనది ఆత్మగౌరవమనీ ఈ కధలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆదర్శాలు మనసును మొద్దు బార్చడం బహుశా గురజాడ లాగే కొ.కు. కూడా తన కాలపు సమాజంలో గమనించారనుకోవచ్చు.
సంస్కారాల్లో మౌలికమైన మార్పు రాని వారికి ఆదర్శం వట్టి నోటి మాటగా మిగులుతుందనీ, అటువంటి వారి మనసు సమాజపు ద్వంద్వనీతినే అనుసరిస్తుందనీ, వారు పేరుకే విశాల హృదయులనీ మనకు చూపించే కథ పతితులు (1949.) సంస్కరణ వాదం వేళ్ళూనిందని నమ్మే కాలంలో వచ్చిన గోపీచంద్‌గారి ఈ కథ, ఆరంభశూరులు వేశ్యాకులంలో జన్మించిన వారిని వివాహమాడి వారికి చేసే మేలు కంటే కీడే ఎక్కువని హెచ్చరిస్తుంది. ఇందులో నాయిక, ‘ఒకరి కోసం నీతిగా ఉండం, మన కోసం మనమే ఉండాల’ని నమ్మే వివేకం గలిగిన స్త్రీ. భోగం కులంలో జన్మించిన కారణం చేత సంఘం ఆమె పట్ల అవలంబించిన భేదభావమూ, నడిసముద్రంలో వదిలేసిన భర్త మోసమూ, దానికి కుంగిపోక కుట్టుపని చేసుకుని తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకున్న ఆమె ధీరగుణమూ మనకు ఈ కథలో ఆనాటి సమాజపు వాస్తవాలుగా గోపీచంద్ చిత్రించారు. కథానాయిక అక్క పాత్ర నీకేం కావాలి? కథ లోని కస్తూరి పాత్ర లాగానే సంసార స్త్రీల అతిశయానికి చిరాకు పడుతుంది, సమాజం పట్ల ధిక్కారస్వరాన్ని వినిపిస్తుంది.
ఆర్ధిక స్వాతంత్ర్యం స్త్రీకి లేకపోవడాన్ని కుటుంబరావు, గోపీచందుల కంటే ముందే కలం పట్టిన చలం గుర్తించారు. పైగా ఆ అస్వతంత్రతనూ, దాస్య భావాలనూ చూసి మురిసే వారిని ఆయన గర్హించాడు. 1925 లోనే చలం తన స్త్రీ అన్న పుస్తకంలో ఇలా అంటారు: ‘తను ప్రతి దినమూ, నాల్గణాలు సంపాయించుకునే స్త్రీ, దేహమమ్ముకునే వేశ్య – సమస్తాభరణాలతో బనారసు చీరెలతో, కులుకుతూ ధర్మ భర్త పక్కన పదిమంది బిడ్డలతో, గుర్రపు బండిలో పోయే పుణ్యస్త్రీ కన్న పవిత్రురాలూ, స్వతంత్రురాలూ.’ లోకం ఆమోదించనిదీ, లోకం జాగ్రత్తగా కప్పిపెట్టుకున్నదీ బయట పెట్టడం ఆయన రచనల లక్ష్యం.
సంసార స్త్రీ కంటే నయమనే మాట కొంత వరకూ నిజమే కానీ చలం ఊహించినంత స్వతంత్రత వేశ్యా వృత్తిలో కూడా లేదేమో అనిపిస్తుంది. వేశ్యల జీవనాలనూ, నిర్వహణనూ సమాజంలో పెద్దమనుషులుగా చెలామణీ అయ్యే కొందరు నడుపుతూ ఉండేవారు. కందుకూరి కాలంలో సమాజం ప్రోనాచ్, ఏంటి నాచ్ లుగా చీలి పోయింది. ప్రోనాచ్ లని మనం గుర్తించే వారిలో కొన్ని వాదాలను క్లుప్తంగా ఇలా చెప్పుకోవచ్చు.
దేవదాసీలు దేవుని సేవకు అంకితమైన కళాకారులనీ, వారి జీవనోపాధిని తొలగించి వారిని వ్యభిచారులుగా మార్చవద్దనీ వాదించి, వీరేశలింగం గారిని ప్రతిఘటించిన వారిని ప్రోనాచ్ లలో ముందు పేర్కొనాల్సి ఉంటుంది. వారిలో కర్నాటక సంగీత విద్వాంసురాలైన బెంగుళూరు నాగరత్నమ్మ వంటి ప్రసిద్ధులు కూడా ఉన్నారు. కానీ ఏంటి నాచ్ ఉద్యమానికి రాజ్య సహకారం కూడా తోడవడం చేత ప్రోనాచ్ వారి ఈ వాదం నిలదొక్కుకో లేకపోయింది అని మనకు తెలుస్తోంది. మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథల్లో దేవదాసీల గురించీ, వేశ్యావృత్తి గురించీ ఒక భిన్నమైన దృక్పథం కనిపిస్తుంది. శంకరమంచి సత్యం తమ అమరావతి కథలలో దేవదాసీల ప్రాభవాలనూ, జీవితాలనూ మన కళ్ళ ముందుంచారు. పందిరిపట్టిమంచం కథలో చిన ముత్తెం నిస్వార్ధ ప్రణయం కథాంశం.
వేశ్యల జాతి అనాదిగా నృత్యగానాలతో అలరించడానికే ఉన్నదనీ, అది కులవృత్తిగా కలవారు దానినే అవలంబించాలనీ, పెళ్లిపేరంటాలలో వేశ్యలు తిరుగాడితే శుభమనీ, వారిని ఆదరించడం కళాపోషణ అనీ కొందరు అభిప్రాయ పడేవారు. ఇంకొందరు ‘బోగం వారు లేకపోతే సంసార్లు అందరూ చెడిపోతారు’ అంటారని కందుకూరి వారి వేశ్యాభిమానపు బండారం తమ ప్రహసనాల్లో బయటపెట్టారు. వేశ్యా వృత్తిని అంటి పెట్టుకుని బ్రతకడం – వేశ్యలతో మేజువాణీ లను చేయించడం, ఆ బృందాలను నడపడం వంటి పనులు చేసే వారి గురించిన చిత్రణ కూడా కందుకూరి సాహిత్యంలో మనకు లభిస్తుంది. ‘వేశ్యలకు యెంత జనవశ్యం ఉన్నదో వేశ్యల మూలంగా ఆయనకూ అంత జనవశ్యం ఉన్నది,’ అని అటువంటి వారికి సమాజంలో ఉండే పలుకుబడికి కారణాలను విశదీకరిస్తారు. వేశ్యావృత్తి సమర్ధకులకు ఒక ఉదాహరణ మనకు కరటక శాస్త్రి వంటి వారి రూపంలో కన్యాశుల్కంలో కూడా కనిపిస్తుంది. కాపు మనిషినై పుట్టినా బాగుండునని అనుకుంటున్న మధురవాణి విరక్తి అర్ధం కాని కరటక శాస్త్రి ఆమె వంటి ‘వేశ్యా శిఖామణి లేకపోతే భగవంతుడి సృష్టికే లోప’మంటూ మెరమెచ్చు మాటలు చెప్తాడు. అలాటి మాటలు విని విని ప్రాణం విసిగి ఉంటుంది, సృష్టి సంగతికేం గానీ చిక్కులలో మీకు లోపం వస్తుంది లెమ్మని అతని స్వార్ధ ప్రయోజనాలను మధురవాణి బయట పెడుతుంది.
కన్యాశుల్కం నాటకంలో గురజాడ మధురవాణిని స్త్రీజాతికి మకుటాయమానంగా తీర్చిదిద్దినది ఎంత వాస్తవమో, ఆ పాత్రలో అంతర్లీనంగా వృత్తి పట్ల ఆమెకు కలుగుతున్న విరక్తీ, కుటుంబ జీవనం సాగించాలన్న ఆమె కాంక్షనూ అంతే ఆర్తితో చిత్రించారన్నది వాస్తవం. శ్రీపాద వారి వడ్లగింజలు కథలో కళాకోవిదుల జీవితాలతో పాటూ, శంకరప్ప మనసు కలిచేసి అతని ఆటను పాడు జేయడానికి ముగ్గురు వేశ్యలు నియామకం కావడం మనం చూడవలసిన చేదు వాస్తవం. వేశ్యల పాటి స్వతంత్రత కుటుంబ స్త్రీలకు లేదని చలం, కుటుంబరావు ఆవేదన వ్యక్తం చేసిన మాట నిజమే కానీ ప్రేమ బంధమే స్త్రీ పురుష శరీర సంపర్కానికి ప్రాతిపదిక కావాలని వారు కూడా స్పష్టం చేసి ఉన్నారు. ‘భార్యలూ ఉండాలి, వేశ్యలూ ఉండాలి’ అని కోరే పురుషుల సంస్కారాన్ని అసహ్యించుకుంటారు గోపీచంద్.
1947లో దేవదాసి ఆక్ట్ వచ్చి ఆ కులవృత్తి రద్దయిన తర్వాత, పేదరికంతో పాటూ, తోటి స్త్రీల అసూయా ద్వేషాలకూ, పోలీసుల జులుంకీ, ఊరి పెద్దల నిరసనకూ గురై దేవదాసీల జీవితాలెలా అస్తవ్యస్తమయ్యాయో తెలియజేసే ఉమామహేశ్వరరావు గారి కథ – నోరు గల్ల ఆడది (2010) ప్రోనాచ్ వారు హెచ్చరించిన విధంగానే ఆనాడు దేవదాసీల పునరావాసాల్లో అన్యాయం జరిగిందని మనకు తెలియజేస్తుంది.ఈనాటికీ సమాజపు అంచుల లోని కొందరు స్త్రీలు వ్యభిచారం చేసి పొట్ట పోసుకుంటున్నారన్నది వాస్తవం. సంస్కరణ వాదం ఆ కాలపు సమాజం లో చైతన్యం తెచ్చిన మాట నిజమే అయినా సమస్య లోతుల్లోకి అది వెళ్ళలేకపోయింది. ప్రస్తుతం ఆవృత్తి వారసత్వంగా అందకపోయినా, వారసత్వంగా అందే పేదరికం ఆ స్త్రీలను చాలా సులభంగా అటు వైపు తోస్తుంది. ‘కమర్షియల్ సివిలైజేషను’ అని రావిశాస్త్రిగారు పిలిచిన స్వాతంత్ర్యానంతరపు భారతంలో వేశ్యావ్యవస్థ కొత్త రూపం తెచ్చుకుంది. కులవృత్తి అనే ఆచ్చాదన తొలిగిపోయాక, నియమిత వెల లేని వస్తువూ, తనని తానే అమ్ముకోవాల్సిన వస్తువుగా శరీరసౌఖ్యం అందించే పరికరంగా స్త్రీ శరీరం మారిన విధానం నగ్నంగా మన కళ్ళ ముందుకొచ్చింది. అలా ‘అమూల్యమైన దానికి మూల్యం నిర్ణయించే’ పాపానికి ఆవేదన చెందుతూ 1949లో వచ్చిన కథ, రావిశాస్త్రి గారి విలువలు.
స్త్రీ తన శరీరాన్ని గతిలేక అమ్ముకుంటుంటే, చట్టం ఆమెకు రక్షణ కల్పించక పోగా, ‘టేరిబుల్ న్యూసెన్సు అనీ, కమ్చీతో కొట్టాలనీ’ పోలీసులు సాగించే జులుం, 1961లో రావిశాస్త్రి గారిని ఆరు సారా కథల్లో ఒకటైన న్యాయం అనే కథ రాసేందుకు ప్రేరేపించింది. నూకరాజు కంపెనీ నుంచి ఆమెను కొందరు షిప్పు లోంచి దిగిన ముష్కరులు ఒక రాత్రికని కొనుక్కుంటారు. తాగించి, క్రూర జంతువుల్లా హింసించి, పోలీసు స్టేషను ముందు ఒళ్ళు తెలియని ఆమెను నగ్నంగా పడేసి పోతారు. పోలీసులు కబురు పెడితే కంపెనీ ఓనరు బట్టలు మాత్రం పంపి ఊరుకుంటాడు. పోలీసులు ఆమెపై న్యూసెన్సు కేసు పెడతారు. జడ్జీ ఆమెను నేరం చేసేవా? అని అడిగితే కేసు ఒప్పేసుకుంటానండీ అని జవాబు ఇస్తుంది. ‘ఈ పన్లు చేసుకోడం వారి బతుకు, వారిని పట్టుకోడం మా బతుకు, ఏ బతుకు బతికే వారు ఆ బతుకు బతకాలి కదా’ అని వేదాంతం చెప్పే హెడ్డు మాటలకు గుండెలు పగిలి ఆ స్త్రీ మెజిస్ట్రేటు ముందు ‘నా కొద్దీ బతుకు, నన్ను చంపేయండి’ అంటూ విలపించే సన్నివేశం ఆ వృత్తి లోని ఘోరాన్ని ఎలుగెత్తి చాటుతోంది.
1969లో వచ్చిన కాళీపట్నం రామారావుగారి కథ, హింస – పదేళ్లకు మించని సంగి కోణం నుండి వ్యభిచారుల కుటుంబాల వ్యధనూ, నిస్సహాయతనూ చిత్రిస్తుంది. సంగి తల్లి ఆవాల జగ్గమ్మ, తన పెద్ద కూతురు పైడమ్మకు పాతూరి గొల్లల సంబంధం చేసింది. అత్త వారు ఆమెను పొగాకు పనులకు పంపేరు. పొగాకు పందిళ్ళలో చెడిపోయి, కాపురమూ చెడి, భయపడి పైడమ్మ పట్నం పోయింది. మొదట మోసానికి లొంగిన మనిషి బలవంతానికి పడిపోయింది. ఆ పడ్డం, పడ్డం దిగజారి దిగజారి సబ్బారపు సంజీవమ్మ కంపెనీలో తేలింది. వ్యభిచారంలో దిగబడిపోయిన అప్పను ఇక పైకి లాగలేమని తీర్పునిస్తుంది బంధుగణం. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది తల్లి, కనబడని శత్రువు మీద యుద్ధం ప్రకటిస్తుంది చెల్లి. జరగవలసిన దానికీ, జరిగిన దానికీ మధ్య ఉన్న అగాధాన్ని చూపించడం కారా గారి శిల్పం. కులవృత్తిని రూపుమాపామని ఒక వైపు చెబుతూ, మరోవైపు కుటుంబపు తోడూ నీడా లేకుండా ఒక అమానవీయమైన వాతావరణాన్ని కృత్రిమంగా తయారు చేసి, దురదృష్టం కొద్దీ దానిలో చిక్కుకున్నవారిని దానిలోనే మగ్గమని చేతులు దులుపుకుంటున్న సమాజానికి, అది సాగిస్తున్న హింసను అద్దం లో చూపించడం – రామారావు గారి దృక్పథంగా మనకు కనిపిస్తుంది. అటువంటి దురదృష్టవంతులను తిరగబడమని ఉద్బోధించడమే ఆయన ఆశయం.
పైడమ్మ జీవితమే కథాంశం అయినా నోరులేని పాత్రలా ఆమె కేవలం సాక్షిగా మిగిలి ఉంటుంది. ఆ మూగ బాధకు ప్రతిస్పందన యిదా అన్నట్టూ నోరు గల్ల ఆడది కథ లోని స్వర్ణ ఏటికి ఎదురీదుతుంది. ‘ఆ నోరు బెట్టుకోకపోతే యీ వూళ్ళో నిలవనీడుణ్ణా ఆ యమ్మికి? యీ పొద్దుటికి గూడా ఆయమ్మి మానంగా బతకతా వుండాదంటే ఆ నోటివల్లనే గదా నాయినా…’ అంటూ అవ్వ స్వర్ణక్క గురించి చెప్పిన మాటలు సమాజాన్ని ఎదుర్కునే తరుణోపాయం లాగా కనిపిస్తాయి.
1969లో వచ్చిన రంగనాయకమ్మ గారి అంధకారంలో అనే నవల వేశ్యల దుర్భర జీవితాలను వివరంగా చిత్రీకరించింది. అప్ప చెల్లెళ్ళ నిస్సహాయత హింస కథలో మనకు కారా వారు చూపిస్తే, ఈ నవలలో, అక్కా తమ్ముళ్ళ మధ్య తలవని తలంపుగా జరిగిన ముఖాముఖీ మనను నిశ్చేష్టులను చేస్తుంది. రాజేశ్వరి తల్లిపోయాక, సవతి తండ్రి తనపై చేసిన దురాగతం వల్ల పట్నం వచ్చి వ్యభిచారం పాలౌతుంది. పద్దెనిమిదేళ్ళ సవతి తమ్ముడు రమణ బ్రోతల్ హౌస్ లోకి వస్తాడు. అక్కడ అక్కను గుర్తించి తల ఎత్తలేకపోతాడు. ‘ఎంత పాపం తప్పిందక్కా’ అని ఏడుస్తున్న తమ్ముడికి బుద్ధి చెప్తూ ‘నేనేనా అక్కని? ఇక్కడి ఆడవాళ్ళందరూ అక్కలూ చెల్లెళ్ళూ కారా? అదంతా పాపం కాదా?’ అని అడిగే రాజేశ్వరి ప్రశ్నకు సమాజమే సమాధానం చెప్పాలి. వారి జీవన స్థితి గతులపై రచయిత ఆవేదననూ, దృక్పధాన్నీ ఈ వాక్యంలో మనం అర్ధం చేసుకోవచ్చు: ‘రోడ్డు పక్క కంపుకొట్టే యూరిన్ దొడ్డిలా, శారీరక కామాన్ని నివారించుకునే మరుగు దొడ్డి ఆ బ్రోతల్ హౌస్!’
1975-78 మధ్య వచ్చిన పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారి కథల్లో కటిక పేదరికం కారణంగా ఆ వృత్తికి చిక్కుకున్న స్త్రీలు మనకి తెలియని వారి చరిత్రలు వివరిస్తారు. చీకటి అనే కథలో కనీసం ఒక పావలా అప్పు దొరికితే కాసిని టీనీళ్లు తాగుదామని ఆరాటపడుతున్న సావిత్రి జీవితం కంటిక్కడుతుంది. తల్లి కాయకష్టం చేసి ఆమెను పెంచింది కానీ సావిత్రికి ఈ శాపగ్రస్త జీవితం తప్పించలేకపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం కనుక కర్ఫ్యూ రోజుల్లో పైసా సంపాదన దొరక్క ఆకలికి మలమల మాడి పది రూపాయలు అప్పు తీసుకుంటుంది. వడ్డీగా ఆమె శరీరం శిథిలమైపోతున్నా ఆ అప్పు మాత్రం అలాగే ఉండడమనేది, ఆ వృత్తిలో ఉండేవారి జీవితాలకు ప్రతీకగా తోస్తుంది. ‘తనకు పాపపు బ్రతుకిచ్చిన దేవుడు పైనుండి వసూలు చేస్తున్న వడ్డీ లాంటి చీకటి’ అనే వాక్యం సమాజం వీరి నుండి అనాదిగా వసూలు చేస్తున్న అధర్మ వడ్డీని మనకు గుర్తు చేస్తుంది. మరో కథ, సతీ సావిత్రి, వేశ్యల వృత్తి లోని పరాధీనతకు చరమ సీమలను చూపిస్తుంది. ఏ ‘కంపెనీ’ లోనూ చేరకుండా తన ఒళ్లమ్ముకున్న డబ్బు తాను తిందామనుకోవడమే పేరాశ ఔతుంది ఈ సావిత్రికి. ఒక పసిబిడ్డ తల్లిగా కనిపిస్తే, కాస్త సులభంగా వృత్తి చేసుకోవచ్చని ఊహిస్తుంది. ఐదు నెలల పసికందు తల్లికి తనింటిలో ఆశ్రయమిస్తుంది. ఆ బిడ్డను రాత్రిపూట ఎత్తుకుని రోడ్డెక్కుతూ ఉంటుంది. దురదృష్టం! ఒకనాడు ఆ పసిగుడ్డుతో సహా దొరికిపోతుంది. లాకప్‌లో బిడ్డ ఆకలితో రాత్రంతా గగ్గోలు పెడుతుంది, కన్నతల్లి కాదు కనక పాలివ్వలేని అసహాయతతో సావిత్రి కుమిలిపోతుంది. ఓడిపోయి మాణిక్యం కింద వృత్తి చేసుకు బ్రతికేందుకు ఒప్పుకుంటుంది, అప్పుడు మాణిక్యం జరిమానా చెల్లించి ఆమెను బయట పడేస్తుంది. అతి కష్టం మీద పసిబిడ్డను ప్రాణాలతో తల్లికి ఒప్పచెప్పిన సావిత్రికి తన దురదృష్టం తలుచుకుని ఏడుపు పొంగుకొస్తుంది.
వేశ్యల దుస్థితి ఇలా దిగజారుతూనే ఉండగా, ఈ శతాబ్దారంభంలో ఎయిడ్స్ మహమ్మారి వీరి జీవితాలను అతలాకుతలం చేసింది. ఈ పరిణామాన్ని, దాని పర్యవసానాలనూ 2001లో కుప్పిలి పద్మ, కొత్తచావు అనే కథలో వర్ణించారు. వేశ్యల దుస్థితికి అసలు కారణాలు – అవకాశవాదుల దురాశ, ఆకలి, దరిద్రం, చట్టం పేరుతో జరిగే హింస; వీటితో – మందు లేని ఎయిడ్స్ వ్యాధిని పోల్చడం చాలా సరైన ఉపమానమనిపిస్తుంది. దారిద్ర్యం కొందరికి ఆ వృత్తిని తప్పనిసరిగా చేస్తే, వారితో బిజినెస్ నడిపే కంపెనీలు దాని నుండి బయట పడాలనుకునే వారిని అడ్డుకోడం ఈ కథలో మనం చూస్తాం. సమాజం మీది తిరుగుబాటు ధోరణీ, అంతటి వ్యాధి పైబడినా బ్రతుకు మీది తీపితో వేశ్యాగృహం లోంచి బయటపడాలని వారి ప్రయత్నం లోని ఆశావాదమూ – ఈ కథలోని ప్రత్యేకతలు.
మానవ సమాజంలో – ఆకలి కన్నా, అధిక శ్రమ కన్నా, నిరుద్యోగం కన్నా, కులం కన్నా, అన్నిరకాల దురంతాల కన్నా – అతి క్రూరమైన, అతి నీచమైన దురంతం వ్యభిచారం. వేశ్యావృత్తి అలాగే కలకాలం వర్ధిల్లాలనే కోరుకునేవారు సమాజంలో ఈనాటికీ ఉండనే ఉన్నారు. వ్యభిచరించడమనేది ప్రజల స్వంత విషయమని వీరి వాదం. దానికి వీలు కల్పించే వేశ్యా వృత్తి కూడా అన్ని వృత్తుల వంటిదేనని వీరి నమ్మకం. కొందరు సమ్మతించి ఆ వృత్తిలో ప్రవేశిస్తే సమాజం వారిని నీచంగా చూడడం అన్యాయమనీ, దానికి మిగిలిన వృత్తులతో సమానమైన గౌరవం కల్పించాలనేది ఆధునికమైన వేశ్యావృత్తి సానుభూతిపరుల లక్షణమని చెప్పుకోవచ్చు.
కానీ దీనిలో ఉన్నవారు అత్యధిక శాతం నిరుపేదలనీ, మరొక దారి దొరక్క కొందరూ, ఎదురు తిరగడానికి ధైర్యం చాలక ఆ వృత్తిని మోస్తున్నవారు మరికొందరూ, పారిపోయే ప్రయత్నాలు ఫలించక అణచివేతకు గురౌతూ ఇంకొందరూ – ఈ వృత్తిని సాగిస్తున్నారనీ, తమ ఇష్టంతో వారక్కడ జీవించడం లేదనీ ఈ సాహిత్య కారులు భావిస్తున్నట్టు అనిపిస్తోంది. ఆకలికి ఆగలేని పసివాడు ఎంగిలాకుల్లోంచి అన్నం ఏరుకోబోతూ ఉంటే, ఒక కుక్క అతని చేతిలో నుండి ఆ అన్నం లాక్కోబోయే చందంగా పోలీసులూ, గూండాలూ వేశ్యలను వేధిస్తున్నారన్నది అందరూ ఏకగ్రీవంగా అంగీకరించే వాస్తవం. కానీ ఎంగిలాకులు ఏరుకునే దుస్థితిలో తమను ఉంచుతున్నందుకు సమాజం బాధ్యత వహించాలని పోరాటం సాగించే బదులు, కుక్కలు లేకుండా పోతే మాకంతకంటే ఇంకేమీ అక్కరలేదనే వాదం ఎంత తెలివి మాలినదో, ఈ ఆధునిక సానుభూతి ధోరణులు అంత ప్రమాదకరం.
వాస్తవంగా ఎదురయ్యే సమస్యలను పుస్తకాలు ఏం తీరుస్తాయన్న సంశయం కొంతమందికి కలగవచ్చు. మనుషుల జీవితాల లోని వాస్తవ సంఘర్షణ వెనుక నైతిక, ధార్మిక సమస్యలు విధిగా ఉంటాయి. అవి ఎంత ఎక్కువగా చర్చ లోకి వస్తే సమస్యా పరిష్కారానికి అంత దగ్గరౌతాం. ‘వ్యభిచారం అనేది కుట్టు పనీ, నేతపనీ, వడ్రంగం వంటి వృత్తే ఐతే, ఆ వృత్తుల్లాగే ఇది కూడా సమాజానికి ఎప్పుడూ కావాలి. కానీ సెక్స్ అనేది శరీర ధర్మం. శరీర ధర్మాలేవీ శ్రమలు కావు, వృత్తిగా కనపడే ప్రతీదీ వృత్తి కాదు,’ అని ఈ సమస్య పై రంగనాయకమ్మ తమ అభిప్రాయం చెప్తారు.
వేశ్యావృత్తిలో ఉన్న వారి పట్ల సానుభూతినీ, వారి వ్యక్తిత్వం పట్ల గౌరవాన్నీ ప్రకటించిన రచయితలు తమ కాలం లోని ప్రజా బాహుళ్యపు విశ్వాసాలకు భిన్నమైన దృక్పథాలతో రచనలు సాగించారు. వీరందరూ ఇటువంటి ప్రత్యేక వ్యక్తిత్వంతో సృష్టించిన వేశ్యల పాత్రల ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే అసహజమైన వృత్తిని సమాజం వారిపై రుద్దింది కానీ సహజసిద్ధమైన వారి విలక్షణతలను రూపు మాపలేకపోయింది అని. మానవత్వానికీ, న్యాయవర్తనానికీ, ఆత్మగౌరవానికీ, కళాభిమానానికీ ప్రతీకలుగా వేశ్యలను కొందరు దర్శిస్తే, ఆ చీకటిరాజ్యంలో చిక్కుకుని వెలుగు లోకి వచ్చే అవకాశం కోసం వారి ఆరాటాన్నీ, పోరాటాన్నీ మరి కొందరు చిత్రించారు. ఈనాడు వ్యభిచారం మునుపటి కంటే మరింత భయంకరమైన పరిస్థితులను కల్పిస్తూ ఉంటే, సమస్య మరింత క్లిష్టమైపోయి, వేశ్యలు వారి కథ వారే చెప్పుకున్న సందర్భంలో ఈ రచయితల స్పందనను మరొక్కసారి పరామర్శించవలసిన అవసరం ఉంది.
సెక్స్‌ని అమ్మే, కొనే పరిస్థితులు సమాజంలో పోతేగానీ ఈ సమస్య పూర్తిగా సమసిపోదు. ముందు ముందు అలాటి స్వప్నం సిద్ధించిన నాడు ఈ వృత్తిని తప్పనిసరై చేసుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవచ్చు. కానీ అంతవరకూ ఆ వలయంలో చిక్కుకుని బయట పడాలనుకునే వారికి తగిన పునరావాసమూ, వృత్తిని తప్పనిసరియై సాగిస్తున్నవారికి తగిన సామాజికన్యాయమూ అందాలనేదే ఈ సాహిత్యకారుల ఆకాంక్ష అని మనం అర్ధం చేసుకోవాలి.
[ఈ వ్యాసపు సంక్షిప్త రూపం డిసెంబర్ 7, 2015 ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురించబడింది ]-సం.https://www.andhrajyothy.com/artical?SID=180876
[ఈ వ్యాసపు తొలి రూపం - నా మాటల్లో ఇక్కడ వినొచ్చు]
https://www.youtube.com/watch?time_continue=9&v=eNaEyvlF-Wg
[ఈ వ్యాసపు తొలి రూపం - నా మాటల్లో ఇక్కడ వినొచ్చు]
https://www.youtube.com/watch?time_continue=9&v=eNaEyvlF-Wg
I have gone through entire Vyasam...so deep and depth study I understand that you have represented. I appreciate first of all for your narration and the way you projected the content of the article. Samajika Nyaanni andinchalani mee voohaki/ kakshaki naa sammathini teliyajestunnanu.
ReplyDeleteమంచి దృక్పథం అండి
ReplyDelete