Wednesday 16 December 2015

దేవతా వస్త్రం


రాజు వెడలె రవితేజము లలరగ... ... రాజుగారి ఊరేగింపు చూసి ప్రజలు ముగ్ధులౌతున్నారు, వారి వస్త్రాలను చూడగలిగిన కన్నులే కన్నులట! తెలివైన వారికే ఆ వస్త్రాలు కనిపిస్తాయట! దేవేంద్రుడి తో తులతూగగలిగిన రాజుగారి రాజసానికి తగినట్టి దేవతావస్త్రమ్ అందించిన ఆ నేతగాళ్ళ గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు, లేదంటే వారిని తెలివితక్కువ వాళ్లు అనుకుంటారని భయం ప్రతీ ఒక్కరికీ. ఇంతలో ఒక చిన్నపిల్లవాడు... ‘ఛీ రాజుగారు బట్టల్లేకుండా తిరుగుతున్నా’రని గట్టిగా అరిచాడు.


ఈ కథ గుర్తొచ్చేఉదంతం ఒకటి ఈ మధ్యనే విన్నాను.

“ఒకానొక సందర్బంలో - ఒక పెద్ద మార్కెట్ కూడలిలో మైక్ పుచ్చుకుని ఎవరో ఒక నాయకుడిని విమర్శిస్తూ పాట పాడారు, వందల మంది విద్యార్ధులు అక్కడ వున్నారు. గట్టిగా కేకలు పెడుతూ నృత్యం చేశారు. సభ బాగా రక్తి కట్టిందని సంతోషంగా ఇంటికి పోయారు!
ఐతే రెండు రోజుల తరవాత, ఆ పాట ప్రభావం వల్ల అనుకుంటా - ఒక చిన్న అబ్బాయి, బహుశా, ఇంటర్ చదువుతున్నట్టున్నాడు - ఆ నాయకుడిని బెదిరిస్తూ లేఖ వ్రాసి పోలీసులకు దొరికి జైలుకు వెళ్ళాడు.”

ఇంతే వార్త!
 
ఇంకేమన్నాఆ కుర్రవాడి గురించి ఉందేమోనని ఆత్రుత గా ముందుకూ వెనక్కూ చదివాను కానీ ఏమీ దొరకలేదు. ఉన్న నాలుగు వాక్యాలూ నా మనసును పట్టేసాయి.



ఉత్తరం రాసిన తర్వాతా, పోలీసులు అరెస్ట్ చేసేలోగా ... ఆ రెండు రోజుల్లోనూ... ఏం జరిగింది? ఆ కుర్రాడు అలాటి ఉత్తరం రాసానని, తన సన్నిహితులకి చెప్పుకున్నాడు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. మిత్రులనీ, ఆ కుర్రాడి కి ఇష్టమైన టీచర్స్ నీ పిలిచారు. హడావిడిగాగా వచ్చిన బృందం అంతా ఆలేఖను మళ్ళీ చదివించుకున్నారు, లేఖలో సారాంశం గురించి చర్చించుకున్నారు. ఆ విషయాలతో ఆ రాజకీయనాయకుడి మీద ఒక ఫిర్యాదు పత్రం తయారుచేసారు, అందరూ సంతకాలు చేసారు. ఆ ఫిర్యాదులకి సాక్ష్యాధారాలను వెదికే పనిలో పడాలని నిర్ణయమైంది. ఇంత తతంగం ఉంటుందా అని పిల్లవాడు అబ్బురంగా చూస్తూ నిలుచుంటే, ఒక టీచర్ దగ్గరగా వచ్చి మాకెవరికీ తట్టనిది నీకెలా తట్టిందిరా అని వీపు తట్టాడు. మర్నాడు స్కూల్ అసెంబ్లీ లో ప్రిన్సిపాల్ ఈ విషయం ప్రస్తావించాడు. ఆ పాటను తనతో పాటు విని ఉర్రూతలూగిన వందలాదిపిల్లలందరూ, వాడిచుట్టూ మూగి ‘అలా ఎలా రాసేసావురా’ అని వాడిని ప్రశ్నలతోఉక్కిరిబిక్కిరి చేసారు. వాడి గురించి whatsapp లో messageలు, రాజకీయనాయకుడి మీద జోకులు, facebook లో పోస్టులు. చుట్టుపక్క ఇళ్లల్లో, ఆ పిల్లవాడి సందర్భం వస్తే, “ వాడిని చూసి నేర్చుకొండిరా, మీ చుట్టూ జరుగుతున్నవాటి మీద దృష్టి పెట్టండి” అని పెద్దవాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. తన లోనుండి అసంకల్పితం గా వచ్చిన ఒక చిన్న ప్రకంపనం, అల గా మారి తీరం తాకే సూచనలు కనిపించి వాడి మనసులో న్యాయం పట్లా, నాగరిక సమాజం పట్లా గొప్పగురీ, నమ్మకం కలిగాయి. ఆలేఖను చూసి చర్య తీసుకోడానికి పోలీసులు వచ్చేసరికి, సిద్ధం గా ఉన్నకుర్రాడి చుట్టూ పాతిక మందికి తగ్గకుండా వాడి సహవిద్యార్ధులు, వారికి అండగా వారి తల్లిదండ్రులూ. పోలీసు వాను కదులుతూంటే చుట్టుపక్కల ఇళ్ల నుండీ వాడి పేరుతొ హర్షధ్వానాలు! అంతే దృశ్యం కరిగిపోయింది.

సినిమా చూస్తున్నానా? ఇలాగే జరిగిందా? నిజం చెప్పాలంటే అలా ఇప్పుడు సినిమాల్లోకూడా జరగదు, నేనే పగటికల కంటున్నాను. ... ..... ........ఆ దేవతా వస్త్రపు కథలో అరిచిన పిల్లవాడి గతి ఏమైందో తెలియదు గానీ, ఈ ఉత్తరం రాసిన పిల్లవాడి సంగతి మాత్రం ఊహించి చెప్పగలను. పోలీసులకు దొరికేవరకూ ఆ పిల్లవాడు ఉత్తరం రాసిన సంగతి ఎవరికీ తెలిసిఉండదు. పోలీసులు ఆపని ఎంత పెద్ద ద్రోహమో, జాగ్రత్త పడకపోతే ఈ ఆకతాయితనం ముదిరి ముందుముందు ఎంత పెద్దనేరస్తుడి గా మారతాడో వాడి చిట్టి బుర్రలోకి ఇంకేలాగా, తల్లిదంద్రులముందు జ్ఞానబోధ చేసిఉంటారు. బంధువులు చీవాట్లు పెట్టి ఉంటారు. స్నేహితులు చిన్నబుచ్చి ఉంటారు. హతాశుడై, జైలు నుండి బయటకు వచ్చాక కూడా ఒక loser గా అందరి ముందూ తలవంచుకుని ఉంటాడు. మనసు లోనుండి వచ్చిన ఒక ధర్మాగ్రహాన్నిఅణుచుకుని అందరిలాగా దులుపుకుని పోనందుకు... తగిన గుణ పాఠం దొరికిందని, జీవితం లో మరెప్పుడూ స్పందించకుండా బుద్ధికలిగి మసులుదామని నిర్ణయంచుకుని ఉంటాడు, ఒక సగటు మనిషిగా పూర్తి గా మారి ఉంటాడు.

2 comments:

  1. ఈ దేవతావస్త్రాలకథ తమాషాగా ఉంటుందండీ. మథిర సుబ్బన్నదీక్షితులు గారనీ‌ ఒకాయన అబ్బో చాలా పుష్కరాల క్రిందట కాశీమజిలీ కథలూ అని పేద్ద పుస్తకాల కట్ట ఒకటి రాసారు. వాటిలో‌ ఒక కథన్న మాట. తెలివైన వారికి మాత్రమే దేవతావస్త్రాలు కనిపించటం‌ కాదండి. అలా కాదండి. ఎవరికైనా ఆ వస్త్రాలు కనబడలేదూ‌ అంటే వాళ్ళ తల్లులు పతివ్రతలు కాదనిట! ఎవరు మాత్రం ఇంక నోరెత్తుతారూ. ఐతే ఒక బుడతడో‌ బుడతో గుట్టు బయట పెట్టేసినట్లు ఉందనుకోండి. అది వేరే సంగతి. ఈ‌ కాశీమజిలీ కథల్లో కొన్నింటి ఆధారంగా లొగడ తెలుగులో మంచి మంచి సినిమాలు వచ్చి బాగా ఆడాయండి. అదండి సంగతి.

    ReplyDelete
  2. మీ స్పందనకు ధన్యవాదాలండీ!

    ReplyDelete