Wednesday 16 December 2015

'ప్రేమ'కు రంగనాయకమ్మగారి రచనల్లో కనిపిస్తున్న నిర్వచనాలు


ఈ వ్యాసం 'వాకిలి' లో   1-1-16 న ప్రచురించారు.
http://vaakili.com/patrika/?p=9942


మకాలీన స్త్రీపురుషుల సంబంధాల గురించి రంగనాయకమ్మగారి కథలను ఉదాహరించి నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఆమె కథల పరిచయమో, లేక ఆమె శైలీ, రచనా విధానం వంటి మరే అంశాల గురించి చర్చించడమో ఈ వ్యాసం ఉద్దేశం కాదు. స్త్రీ పురుషుల ప్రణయ సంబంధాలూ, వారి సాహచర్యం (companionship), అన్యోన్యతా (compatibility), విలువలూ, సంస్కారాలూ, పరస్పర గౌరవాలూ… ఇలా వీటి గురించి ఆమె లేవనెత్తిన ప్రశ్నలూ, వాటికి సంబంధించిన చర్చా, పరిష్కారాలకు ఆమె అన్వేషించే మార్గాలూ… వీటిని గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావించ దల్చుకున్నాను.
గత పది పదిహేను సంవత్సరాల్లో ప్రధానంగా నేను గమనించిన మార్పు ఒకటుంది. అదేమిటంటే, ‘వివాహ బంధం, ప్రేమ బంధం’- ఈ మాటలను ఇప్పుడు ఎవరూ సమానార్థక పదాలుగా భావించడం లేదు. ఎవరైనా ఒక జంట గురించి సాహిత్య సందర్భాల్లోనో, ఇతరత్రానో పరిచయం చెయ్యాల్సివస్తే, వారిద్దరూ భార్యాభర్తలు అని చెప్తే పూర్తి వివరం ఇచ్చినట్టు అనిపించడం లేదు, వారు ప్రేమ బంధంలో కూడా ఉన్నారో లేదో విధిగా చెప్పవలసి ఉంటోంది. అంటే ప్రేమా, పెళ్ళీ కలిసే ఉంటాయి అని చాలా మంది నమ్మడం లేదేమో అనిపిస్తోంది.పెళ్లి అనేది సామాజిక భద్రతకు మాత్రమే సంబంధించిన విషయమని చాలా మంది అనుకుంటున్నారు. కలిసి బ్రతకడాలూ(లివింగ్ ఇన్ లు ), వివాహేతర బంధాలూ, విడిపోవడాలూ ఇవన్నీ ప్రత్యేక విషయాలు గానో, చెదురుమదురు సంఘటనలు గానో కాక సమాజంలో అంతర్భాగాలు అని చాలా మంది గుర్తిస్తున్నారు. ఆ భావాల ప్రచారం కూడా ఈనాడు అన్ని కళారూపాల్లోనూ చోటు చేసుకుంటూ ఉంది. ప్రేమరాహిత్యం, దాని కారణంగా వివాహబంధం తెగిపోవడం- ఇది కేవలం యువతీ యువకులకే కాక పెళ్ళయి పాతిక ముప్పై సంవత్సరాలు గడిపిన వారికి కూడా వర్తించే సమస్యగా మనమందరం గుర్తించవచ్చు.అలా అని ‘వివాహ వ్యవస్థ కు సమయం చెల్లిపోయింది’ అన్న నిర్ణయానికి రావాలా అనుకుంటే… వివాహ వేదికలూ, వాటికి సంబంధించిన బిజినెస్సులూ, అధునాతన సాంకేతికతలనుపయోగించుకుని చేసే మ్యాచ్ మేకింగ్ సంస్థలూ, ఇంక ఆ పైన వివాహానంతరపు కౌన్సిలింగు సదుపాయాలూ పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడం మనందరం గమనిస్తున్న విషయమే! ఇటువంటి వాటికి లభిస్తున్న ఆదరణను చూస్తే, వివాహాల మీద చూపించే శ్రద్ధ కూడా మునుపటి కంటే ఎక్కువగా కనిపిస్తోంది అని భావించాల్సి వస్తుంది. నచ్చిన వారిని ఎంచుకుని, వారితో జీవితాంతం సుఖశాంతులతో జీవించాలన్న ఆశ లేని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో.
అనాదిగా వస్తున్న కుల, మత, జాతులకు సంబంధించిన ఎంపికలే కాక, పూర్వం మనం ఎన్నడూ వినని అంశాల మీద ఆధారపడి పెళ్ళిళ్ళు చేసుకొబోతున్న వారిని చూస్తున్నాను. ఫలానా వృత్తి వారే కావాలనీ, ఫలానా ఊరిలో ఉండేవారైతేనే చేసుకుంటామనీ కొందరు అనడం కూడా వింటున్నాను. అదేదో ఒక సినిమా వచ్చింది. అందులో అమ్మాయి తనకు వరుడు ఫలానా హీరో పేరు గల వాడవ్వాలనో, లేక ఆ హీరో అభిమాని కావాలనో కోరుకుంటుంది. అది అతిశయోక్తి అయితే కావచ్చు కానీ సమాన అభిరుచులంటే ఇలాటివే అని కొందరు భావిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ‘ఆరాలు తీయడం’ సరైన భాగస్వామి తో జీవితం పంచుకోడానికే కదా! మరి ఈ ఎంపికలన్నీ తగిన ఫలితాల నిస్తున్నాయా అన్న ప్రశ్న వేసుకోవాల్సి వుంటుంది.
వివాహం చేసుకోవాలంటే స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినది ఏది? అనే విషయంలో రంగనాయకమ్మ గారు సార్వత్రికంగా వెలిబుచ్చే అభిప్రాయం ఒకటి ఏమిటంటే సంస్కారాల్లో సమాన స్థాయి ఉండటం. అది లేని జంటలలోని వ్యక్తులు ఒకరికొకరు ఆసరా కాలేరు, ఫలప్రదమైన జీవితం గడపలేరు అని తెలియజేసే అనేక సందర్భాలను ఆమె రచనలలో మనం గుర్తు చేసుకోవచ్చు. జీవితం పట్ల ‘చూపు’ లో ఒకింత సామ్యం లేని వారు కలిసి ప్రయాణం చెయ్యడం సాధారణం గా అసంతృప్తికి దారి తీస్తుంది.
సమాన స్థాయి సంస్కారం అనేది ‘మైత్రీ’ బంధానికి మొదటి మెట్టుగా ఉంటుంది. అందుకే మనకు నచ్చే ఆదర్శాలూ, అభిరుచులూ ఉన్న వారు అనేకులు మనకు స్నేహితులౌతారు. కానీ వారిలో ఏ ‘ఒక్కరి’ కోసమో మాత్రం హృదయం విశేషంగా స్పందిస్తుంది.
ఈ విషయం గురించి 2013 లో వచ్చిన ‘పల్లవి లేని పాట’ అనే రచనలో రంగనాయకమ్మ గారు ఇలా చర్చిస్తారు. మంచితనం కావాలి. కానీ మంచివారందరి మీదా ఇష్టం కలుగు తుందా? మనుషులెవ్వరూ కోతుల్లా ఉండరు, అందరూ బాగుంటారు. రూపాల్లో తేడాలు అంతే. నలుగురు మంచివాళ్ళతో, అందమైన వాళ్ళతో, పరిచయాలు ఉంటే, అందులో ఒక్కరి మీదే ఆసక్తి ఉంటుంది.
సంస్కారం, వివాహబంధానికి ‘తప్పనిసరి కారణం’(necessary condition) అని భావించాలి. కానీ అది మాత్రమే సరిపోదు. ‘ప్రేమ’ మాత్రమె వారి సహజీవనానికి ‘తగినంత (సరైన) కారణం’(sufficient condition) కాగలదు.
పల్లవి లేని పాట
కథలో రెండు జంటలుంటాయి. వసంత, సమీర్ లు కులాంతర వివాహం చేసుకోవాలనుకుంటారు. వసంత స్నేహితురాలు పద్మ. ఆమెదీ, జనార్దన్ దీ పెద్దలు కుదిర్చిన పెళ్లి. జనార్దన్ చాలా సంస్కారవంతుడు. దంపతు లిద్దరూ భావుకులు. వారికి ఒక చిన్న పాప.
వసంతకు సంప్రదాయాన్ని కాదనే ‘తెగింపు’ ఎలా వచ్చిందా అని పద్మ తర్కించుకుంటూ ఉంటుంది. కానీ వారి ప్రేమను చూసి వారు సుఖంగా జీవించగలరని ఆమెకు నమ్మకం కలుగుతుంది.
ఒకరోజు సమీర్ రాసిన ప్రేమలేఖని అందుకుని వసంత ముఖం మీద వచ్చిన ‘శోభ’ను చూసి పద్మ దిగ్భ్రమ చెందుతుంది. పెళ్ళికి ముందు కలిగే ప్రేమ తనకు తెలియని అనుభూతి అని అనుకుంటుంది.
తర్వాత జనార్దన్, పద్మా ప్రేమ వివాహాల గురించి మాట్లాడుకుంటారు. ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకున్న జంటలు విడిపోడానికి తమ ఆఫీసుకు రావడాన్ని చెప్తూ వారందరికంటే మనం ఎంతో హాయిగా ఉన్నామని లాయరైన జనార్దన్ అభిప్రాయ పడతాడు. కానీ వసంతకూ, సమీర్ కూ అనుభవమౌతున్న ‘ఆ ప్రేమ’ పెళ్ళికి ముందు తాము పొందక పోవడం ‘లోటే’ నని కూడా చెప్తాడు.
‘ప్రతీ రాత్రీ వసంత రాత్రీ, ప్రతి గాలి పైర గాలి’- అనే పాటకు వారు ఇలా అన్వయం చెప్పుకుంటారు. ప్రేమతోనే స్త్రీ పురుష సంబంధం ప్రారంభం కావాలి. అది ఆ పాటకు పల్లవి. కొన్ని ప్రేమలు పెళ్లి తర్వాత నిలవవు. అంటే ఆ పాటకు చరణాలు లేవని అర్థం. తమలా పెళ్ళయ్యాక చిగిర్చిన ప్రేమ తో ఒకరితో ఒకరు, ఒకరి కోసం ఒకరుండే సాహచర్యాలను – పల్లవి లేని పాటలనుకుంటారు.
ఇక్కడ రచయిత్రి సామాజిక దృక్పథం గురించి నా అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రధానం గా స్త్రీ సమస్యలను గురించి చర్చించే వారిలో రెండు ధోరణులను గమనిస్తున్నాను. హద్దుల్లేని స్వేచ్చ, అన్నికుటుంబ బంధనాలనూ కాదనుకోవాలనే తెగింపూ, ఒకరికంటే ఎక్కువ వారిపై ఏకకాలంలో కలిగేదని వర్ణించే స్వేచ్ఛా ప్రణయమూ – వీటిని గురించి రాసేవారు ఒక వర్గమైతే, సంప్రదాయ బద్ధమైన కుటుంబ బంధనాలను ఏమాత్రమూ ప్రశ్నించకుండా, అవి మాత్రమే స్త్రీకి సరైన రక్షణ, శాంతి సౌఖ్యాలూ ఇవ్వగలుగుతాయనే నమ్మకం తో ఉండేవారు ఇంకొక వర్గం.
సాధారణంగా మొదటి వర్గం వారు స్త్రీ సమస్యలకు ఆర్థిక, సామాజిక కారణాలను విశ్లేషించకుండా కేవలం చరిత్రను మాత్రమే చూస్తూ దానిని ‘తిరగరాయాలనే’ దృక్పథం లో ఉంటారు. మరి కుటుంబ జీవనపు భద్రత ను గుర్తించే రెండో వర్గం వారు నూతన భావాల ప్రయోజనాలనూ, తిరుగుబాటు ధోరణుల ఆవశ్యకతనూ అర్థం చేసుకోలేరు.
వీరిరువురి వాదాలకు భిన్నంగా ఉండేదీ, స్త్రీ పురుషుల స్వేచ్చా సమానతలకు, ఆత్మగౌరవాలకు లోటు రానివ్వనిదీ, ఆచరణయోగ్యమైనదీ ఐన వివేచన నాకు రంగనాయకమ్మ గారి రచనల్లో కనిపిస్తుంది. గృహస్తు జీవితానికి ఉండే వివిధ కోణాలను, కుటుంబ నిర్ణయాల పర్యవసానాలను, పిల్లల మీద, వృద్ధుల జీవితాల మీదా వాటి ప్రభావాలనూ ఏమాత్రమూ విస్మరించకుండా ఆమె స్త్రీ పురుషుల ప్రణయాన్ని ఆధునిక సమాజ నేపథ్యంలో చిత్రించారు.
ఆశా దీపం  by H S Haldankar(1882-1968)

జీవితనిర్ణయాలను తీసుకునే వారు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం గా నాకు ఈ కింది పాటకు ఆమె చెప్పే భాష్యం కనిపిస్తుంది. పియా మిలన్ కో జానా, జగ కీ లాజ్, మన కి మౌజ్, దోనో కో నిభానా …. సమాజ గౌరవాన్నీ మనసులోని ఆశనీ కూడా నిభాయిన్చుకోమంటు”న్నది ఈ పాట.
“దేన్ని ఎంత తీసుకోవాలో, ఎంత తిరస్కరించాలో ఆ వివేకం లేకపోతే, పాతవాళ్ళు చెప్పినట్టే అక్షరాలా చేస్తే, తప్పు సంప్రదాయాల్ని దిద్దుకోడం ఎలా జరుగుతుంది?
అలా అని మన కోరికలు ఎలా రేగితే అలా చేస్తే, మనం కొత్త తప్పుల్లోకి పోతాం. అందుకే దోనోంకో నిభానా అంటున్నాడు కవి”. పాతది ప్రతీదీ రోత కానక్కరలేదనీ, కొత్తది అంతా వింత కాదనీ ‘పాత కొత్తల మేలు కలయిక’ అనిపించే ఒక సమన్వయవాదం మనం ఇక్కడ గమనించవచ్చు.
ప్రేమ మాత్రమే స్త్రీపురుషుల బంధానికి ప్రాతిపదిక కావాలని చెప్పే కథ ‘ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది’. ఇది 1978 లో వచ్చింది . వివాహం తర్వాత ప్రేమ నిలుస్తుందా అన్న చర్చ కూడా ఈ కథలో జరుగుతుంది.
ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది
ఆస్తిపాస్తులను ఆశించో, వంశ మర్యాదలని చూసో చేసుకున్న పెళ్ళిళ్ళు ఎలా విఫలమౌతుంటాయో ఒక చోట ఇలా వర్ణిస్తారు. పార్వతమ్మగారూ, వెంకట్రామయ్యగారూ చేసుకున్న పెళ్లి –మనిషికీ మనిషికీ జరిగిన పెళ్లి కాదు. వీళ్ళ డబ్బుకీ వాళ్ళ డబ్బుకీ అన్నమాట! ఆ డబ్బంతా తగలేస్తాడాయన, అందులో గొప్ప నేర్పరట, ఆ నేర్పు ఆవిడకేం నచ్చదు. తిడుతుంది. కొడతాడు, ఇంకా తిడుతుంది. ఇంకా కొడతాడు. గమ్మత్తేమిటంటే ఆవిడెప్పుడోచ్చినా ఓ కొత్త నగ పట్టుకొచ్చి “మావారు నా కోసం కొన్నారు” అంటుంది. దానికీ – “మావారు నాకివాళ కడుపు నిండా అన్నం పెట్టారు. ఓ గ్లాసు మంచినీళ్ళు కూడా ఇచ్చారు” అని చెప్పుకోడానికీ ఏమిటి తేడా అని రచయిత్రి ప్రశ్నిస్తారు.
మరో చోట కులాల గొప్పను నమ్మే ఓ అన్నపూర్ణమ్మ గారి గురించి ఇలా ఉంటుంది: పోనీ ఇతర్ల దగ్గిర పర్వాలేదు. ఆవిణ్ణి భరించలేకపోతే స్నేహం మానేస్తారు. జీవితాంతం కలిసి ఉండవలసిన భర్త దగ్గిర కూడా – “మా వంశం లో ఇలాటి వెన్నడూ ఎరగం! అసలు మా కుటుంబం… మా తాతగారు… మా పుట్టింటారు…” అని ప్రారంభిస్తుంది.
ఇలాటి వారందరి సహజీవనాలను గురించి ఆలోచిస్తూ కథానాయిక సుధ ఇలా అనుకుంటుంది: ఈ మనుషులెవరి మధ్యా ‘ప్రేమ బంధం’ లేదు, అసలు ఇవన్నీ వొట్టి వివాహ బంధాలు. కట్నాల చదువుల్లాగా, పెళ్లి సంగీతాల్లాగా, సాంప్రదాయాల వుచ్చులు.
పూర్వం ఎంత చదివితే అంత కట్నం పలుకుతుందని మగపిల్లవాడికి చదువు చెప్పించేవారు. కొంచెం పాడగలమంటే ‘మంచి’ సంబంధాలు వస్తాయని ఆడపిల్లకు సంగీతం నేర్పించేవారు. అలాటి చదువులూ, సంగీతాల్లాగా… లోకం ఆమోదించే ఈ రకమైన పెళ్ళిళ్ళకు దంపతుల సుఖశాంతులు ఏమాత్రం లక్ష్యం కాదన్న సంగతి మనం చూస్తునే ఉన్నాం.
కానీ సుధ తల్లిదండ్రులు ప్రేమించుకుని, పెద్దవారిని ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నవారే. మరి వారు కూడా అందరిలా ఉండడమేమిటని ఆమె మధన పడుతుంది.
ప్రేమను కోల్పోయిన మనుషుల సంసారాలు ఎలా ఉంటాయో మనకు గుర్తుచేస్తున్నట్టూ సుధ తల్లిదండ్రుల గురించి ఇలా ఉంటుంది: ఎవరేపని ఎందుకు చేసారో శాంతంగా అలోచించుకోరు. ఒకరు చెప్పే కారణాలు మరొకరు నమ్మరు. అసలు ఒకరి ప్రవర్తన మీద వొకరికి గౌరవం ఉండదు. కత్తులో, శూలాలో విసిరినట్టు మాటలు విసురుకుంటారు. రెండోవాళ్ళు విలవిల్లాడేటట్టు. ఒక్కోసారి ఇద్దరూ బద్ధ శత్రువుల్లాగ.
తన తల్లిదండ్రులు పెళ్ళైన కొత్తలో తీయించుకున్న ఫోటోలలో వారి మొహాల్లో- ఆ కళ్ళల్లో ఎంత మెరుపు! ఎంత కాంతి! ఎంత ఆనందం! అని సుధ తల్చుకుంటుంది. ఈ ఫోటోలన్నీ ‘మీ పెళ్లి రోజులలో తీయించుకున్నవేగా? తర్వాతవేం లేవేం?’ అనే ప్రశ్నకు ‘ఏమిటోనండీ, శ్రద్ధ పోయింది‘ అన్న జవాబు వినవస్తుంది. దాన్ని విని విని ఉన్న సుధ ‘ఏమిటోనండీ, ప్రేమ పోయింది’ అనేయ్యరాదా అనుకుంటుంది. అందుకే ఆమెకు ప్రేమలో నమ్మకం ఉండదు, మనుషుల సంస్కారం మీదనే గురి.
ఆమె ఇంటికి తలవని తలంపుగా చంద్రశేఖర్ అనే కుర్రవాడు ఉద్యోగప్రయత్నాలు చేసుకుంటూ రావడం, అతని సంస్కారమూ, భావజాలమూ ఆమెకు అమితంగా నచ్చడమూ జరుగుతాయి. అతనికి ప్రేమ మీద నమ్మకమే. ప్రేమ దేవతాపుష్పం వంటిదనీ, దానిని పొందడానికి గొప్ప అర్హత కావాలనీ నమ్ముతాడు. వారిద్దరి మధ్య ప్రేమ అంకురిస్తుంది.
దేవదాసు, పార్వతి కథని గురించి వారిద్దరూ చేసుకునే చర్చల్లో అటువంటి అపురూపమైన ప్రేమను జీవితాంతం నిలిపి ఉంచుకునేదేలా? అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది: ఇద్దరు మనుషుల్లో పుట్టిన ప్రేమ స్థిరంగా నిలబడాలంటే, ఆ ఇద్దరూ ముందు సంఘ ప్రభావాల్నిఒదిలించుకోవాలి. దాంట్లో ములిగి తేలుతున్నంత కాలం ప్రేమజీవితంలో చాలా అవాంతరాలొస్తాయి. సాధారణంగా అవే నెగ్గి ప్రేమ ఓడిపోతుంది, చచ్చిపోతుంది.
ప్రేమంటే ఒక బ్రహ్మపదార్థం వంటిదనీ, అది ఎందుకు ఎప్పుడు పుడుతుందో, ఎందుకు పోతుందో తెలియదని చెప్పే అనేకానేక ప్రణయకథల కంటే, ఈ కథలో ప్రేమ గురించి చేసిన ప్రతిపాదనా, సాగించిన నిరూపణా చాలా ఉపయోగకరంగా నాకు కనిపించాయి.
అంతటి అమూల్యమైన ప్రేమ సైతం మనకు తెలియకుండానే మన జీవితాల్లోంచి తొలిగిపోయే ప్రమాదం ఉందనీ, దానిని గుర్తించి జాగ్రత్త పడమని మనల్ని హెచ్చరించేవిధం గా నాకు 1999 లో వచ్చిన కథ ‘మురళి వాళ్ళ అమ్మ’ కనిపిస్తుంది.
మురళి వాళ్ళ అమ్మ
మురళి తండ్రి వేరే ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు. తల్లి రుక్మిణికి ఒకనాడు ఆ విషయం తెలుస్తుంది. ఆమె నిలదీస్తే ‘నీకేం లోటు చేసాను?’ అంటూ విదిలించుకుంటాడు.
ఆ రాత్రి తల్లీ, కొడుకూ నిస్సహాయంగా చాలాసేపు కూర్చుంటారు. అప్పుడు మురళి వయస్సు కేవలం పదమూడేళ్ళే . హఠాత్తుగా “అమ్మా ఏం చేద్దాం?” అని అడుగుతాడు. ఆ మాట తో ఆమెకు ఒక చీకటి తెర తొలిగినట్టౌతుంది. ఇద్దరూ తండ్రిని వదిలి బయటకు వచ్చేస్తారు. తల్లి కుట్టుపనులు చేసుకుని ఇల్లు గడుపుతుంది. మురళి తండ్రి దగ్గర నుండి డబ్బుసహాయం కూడా తీసుకోడు. వారిరువురి వ్యక్తిత్వాల గురించీ ఇలా ఉంటుంది. ఎన్ని లోట్లు ఉన్నా, ఎన్ని అవసరాలు ఉన్నా, ఎక్కడికక్కడ సరిపెట్టుకోవడమే ఆనందం గా రెండో ఆలోచన లేకుండా కాలం గడిపారు. తమ బతుకు తాము బతకడమే తమ లక్ష్యం అయినట్టు, తమ లక్ష్యమే తమ జీవితం అయినట్టు, అన్ని ఇబ్బందులనీ ఓర్చుకుంటూ కాలం గడిపారు.
పెద్దవాడయ్యాక మురళి రజనీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. క్రమేణా అతను చేసే ఉన్నతోద్యోగమే అతని జీవితంగా మారిపోతుంది. అతని ప్రవర్తనలో మార్పుల్ని తీసుకొస్తుంది.
అతని ప్రతి సంతోషమూ కంపెనీకే! పుస్తకాలు చదువుకునే కాలమూ కంపెనీకే! కబుర్లు చెప్పుకునే కాలమూ కంపెనీకే! కలిసి అన్నాలు తినే కాలం కూడా కంపెనీకే! మొత్తం జీవితమే కంపెనీకి!
ఊళ్ళో ఉన్నప్పుడైతే అర్ధరాత్రైనా ఇంటికొస్తాడు. పోరుగూళ్ళు పొతే ఇరవైనాలుగ్గంటలూ కంపెనీ కోసమే!
ఇదంతా చూస్తూ తల్లి రుక్మిణి, “మొగవాళ్ళు ఇల్లు పట్టకుండా తిరుగుతోంటే ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చూసి చూసి మనసు విరిగి కాస్త తీరిగ్గా మాట్లాడే మొగాళ్ళ మీద మనసు పెట్టుకుంటారు. ఒక రోజున ఇంట్లోంచి బయటకు పోతారు” అని మురళిని మందలిస్తుంది.
రజని తన మనసును కష్టపెట్టుకుంటుందేమోనని రుక్మిణికి ఒకటే దిగులు! ఆ అమ్మాయికి, ఏం జరుగుతోన్నా కోపం తెచ్చుకోడమే తెలీనట్టు ఉంటుంది. ఈ చిరాకులన్నీ ఒక ఎత్తైతే, మురళీ ఆఫీసులో పనిచేసే శ్రీలత అనే అమ్మాయితో అతనికి పెరుగుతున్న సాన్నిహిత్యం మరో ఎత్తై రుక్మిణిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
అతనికి రజనీ అంటే ‘లక్ష్యం లేకపోడం’, శ్రీలత మీద ‘ఆసక్తి ఉండడం’ రుక్మిణి కనిపెడుతూ ఉంటుంది. పెళ్ళైన మొదట్లో ప్రతీరోజూ రాత్రిపూట కలిసి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తినేవారు.
రజని ఏదైనా నవల చదువుతోంటే తను పడుకుని సంతోషంగా వినేవాడు. తను కలెక్టు చేసిన పాటలన్నీ వేసి కాస్సేపు వినిపించేవాడు. రజనితో మాట్లాడడానికి తహతహ లాడుతున్నట్టు ఉండేవాడు. ఎలా మారాడో… ఎప్పుడు మారాడో…
ఆఫీసు పని మీద శ్రీలతతో మురళి వేరే ఊరు వెళ్తాడు. అతని వద్ద నుండి ఫోన్ వచ్చాక, వ్యవహారం శృతి మించుతోందనిపించి ‘నువ్వేమన్నావూ’ అని రుక్మిణి కోడలిని అడుగుతుంది. ‘ఏమన్నాఅంటే, మురళి గురించి నేనేదో అనుమానపడుతున్నానని అనుకుంటా’డని రజనీకి భయం! అది చూసి రుక్మిణి విసుక్కుంటుంది.
ఇటువంటి సంక్లిష్ట సమయంలో ముసుగులో గుద్దులాట లేకుండా మురళీ వాళ్ళమ్మ చెప్పిన మాటలు – ‘ప్రేమ’ అనేది కేవలం ఒక భావం కాదనీ, మనం నిరంతరం ఇష్టంతో నిర్వహించవలసిన బాధ్యత అనీ మనకు గుర్తు చేస్తాయి. అప్పుడే ఆ ప్రేమ మనని వెన్నంటి ఉండే ఆత్మీయుడైన స్నేహితుడిగానూ, సూక్ష్మస్థాయి లో మన ప్రవర్తనను చక్కదిద్దే ఒక గురువు గానూ మన జీవితాలను వెలిగించగలదు అని నాకు అనిపించింది.
దంపతులు వారి మధ్య ప్రేమ లేదనే కారణంతో విడిపోవడం వారి స్వవిషయం కావచ్చు. కానీ వాటికి దారి తీసే పరిస్థితులను ముందుగానే గుర్తించి, వారు తప్పు తోవలో ఉన్నారనుకుంటే, నిష్కర్షగా నిజాన్ని చెప్పడం పెద్దవారి బాధ్యత సుమా అని ఈ కథ గుర్తు చేస్తుంది.
రుక్మిణి తన ఔచిత్యానికి భంగం వాటిల్లని పద్ధతిలో ఇలా అంటుంది: మురళీ! ఆ అమ్మాయితో నీకు ఏం ఉందో ఏం లేదో ఈ మాటలు నువ్వు తల్లితో మాట్లాడవలసిన మాటలు కావు. మీ నాన్న లాంటి వాడికి, వేరే కాపరం పెట్టినా తప్పేం లేదు. నీకు కొంచెం సరదాగా తిరిగితే తప్పేం లేదు! ఈ తప్పొప్పులు మీరే నిర్ణయించుకుంటే కాదు. ఆ కష్టం కట్టుకున్నవాళ్ళకి తెలుస్తుంది.
ఈ మాటలు మన ఆధునిక సమాజంలో ‘వ్యక్తివాదం’ రేపుతున్న ఎన్నో ప్రశ్నలకి సమాధానం గా నిలుస్తాయి అని నాకనిపిస్తోంది. జీవిత సహచరులతో సాన్నిహిత్యం పెంపొందించుకునేందుకు చేయవలసిన పనులు చేయకుండా, తప్పొప్పుల విచక్షణకు తావీయకుండా ‘ప్రేమలు ఎలా పుడతాయో, ఎందుకు గిడతాయో చెప్పలేమంటూ మెట్ట వేదాంతం చెప్పడం ఎంత వరకు సమంజసం? పోనీ, ఒకసారి తప్పు ఎంపిక చేసుకున్నామనుకున్నా మరోసారికైనా తమ ప్రేమ పట్ల తమ విధి తాము నిర్వర్తించకుంటే సంసారాలు నరకప్రాయమే కదా! ఈ విషయమై ఎంత చర్చించుకున్నా తక్కువేననిపిస్తుంది.
కథ విషయానికొస్తే మురళీ తన తల్లి మాటలకు ప్రభావితుడైనట్టూ, పశ్చాత్తాపం చెందినట్టే ఉంటుంది. కానీ మురళి అసలు తప్పు చేసేడా లేదా, చేస్తే ఏమిటా తప్పు అనేది అంత ముఖ్యమైన ప్రశ్నగా నాకు తోచలేదు. అతను రజనితో కలిసి కోల్పోతున్న ఆ క్షణాలన్నీ, వారి జీవితాల్లో ప్రేమరాహిత్యానికి చోటు కల్పిస్తున్నాయి అని రచయిత్రి చూపించారనిపించింది.






ప్రేమ కన్నా మధురమైనది
ఈ నవలిక 1995 ప్రాంతంలో వచ్చింది. ‘పల్లవి లేని పాట’ లో ప్రస్తావించిన, జీవితాలను వెలిగించే ప్రేమానుభవం పొందిన ఒక స్త్రీ రమ. తన భర్త రమణదీ తనదీ దేహాలు మాత్రమే వేరు, ఆత్మ ఒకటే అనేటంతగా తమ ప్రేమను నమ్ముతూ ఉంటుంది. అలాటి ఆమె నమ్మకం వమ్ము చేసి, ఆమె ప్రాణ మిత్రురాలితో రమణ తప్పుగా ప్రవర్తిస్తాడు. విషయం తెలిసిన రమ కుప్పకూలిపోతుంది. రమ ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని ఆ స్నేహితురాలు చాలా భయపడుతుంది.
కానీ రమణ తప్పు ఒప్పుకోకుండా బుకాయించబోవడం చూసి రమకు గుండె రాయి అయిపోతుంది. అది అతను క్షణికావేశం లో చేసిన తప్పు కాదనీ, అతను తన ప్రేమకు అర్హుడే కాడనీ ఆమెకు రూఢిగా తెలుస్తుంది.
రమణ చేసిన ద్రోహాన్ని తట్టుకుని, తన జీవితం తన ప్రేమ కంటే కూడా విలువైనది అని రమ గ్రహించడమే కథాంశం.
***
రంగనాయకమ్మ గారి కథలను ఆధారం చేసుకుని స్త్రీ పురుషుల మధ్య ప్రేమకు సంబంధించిన అనేక పార్శ్వాలతో పరిచయం చేసుకున్నాక అన్నిటినీ కలుపుకుని, సహజీవన సంబంధాలపై ఆమె అభిప్రాయాలు క్లుప్తంగా ఇవీ అని ముక్తాయించుకోవచ్చు ననుకుంటున్నాను.
స్త్రీ పురుషులకు ప్రేమానుభవం కలగడమనేది ప్రకృతి అందించిన అపురూపమైన వరం. ప్రేమ వారికి సమాజం కల్పించే ఆటంకాలను ఎదుర్కోవడం నేర్పుతుంది. అది వారికి ఎన్నో సాహసాలు చేసే శక్తిని కలిగిస్తుంది. వారి జీవితాలను అర్థవంతం చేస్తుంది. అదే వారి సహజీవనానికి ప్రాతిపదిక కావాలి.
ప్రేమ ఎవరి మీద కలుగుతుందనే విషయం మనం ఊహించలేనిదే అయినా, సమాన స్థాయి కల సంస్కారవంతుల మధ్య ప్రేమ స్థిరపడే అవకాశాలే ఎక్కువ అని మాత్రం చెప్పుకోవచ్చు. ఆ ప్రేమకు సమాజ ప్రభావాల వల్ల ఇబ్బందులు ఎదురౌతాయి. నిరంతరం తమని తాము సంస్కరించుకుంటూ ఆ ప్రేమను కాపాడుకునే బాధ్యత స్త్రీ పురుషులిద్దరిదీ.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కో సారి మన ప్రేమకు అర్హులు కానివారు మన జీవితాల్లోకి వస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఆ ప్రేమకంటే కూడా మన ఆత్మగౌరవాన్ని ప్రాణప్రదమైన విలువగా భావించి దానిని నిలుపుకోవడమే సరైన పని. 
**** (*) ****
______________________________________________________


6 comments:

  1. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కో సారి మన ప్రేమకు అర్హులు కానివారు మన జీవితాల్లోకి వస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఆ ప్రేమ కంటే కూడా మన ఆత్మగౌరవాన్ని ప్రాణప్రదమైన విలువగా భావించి దానిని నిలుపుకోవడమే సరైన పని

    మన ప్రేమకి అర్హులు కానివారు మన అనుమతిలేకుండా రావడం జరుగదు.అటువంటి సందర్భాల్లో ఆత్మగౌరవం కంటే ....మన ప్రేమని మనం కాపాడుకోగలిగితే ప్రేమదే జయం ! నూటికి 99 మంది ప్రేమని వదిలేసి వ్యక్తులని పట్టుకుని సాధించాలని చూస్తారు.

    ReplyDelete
  2. Thank you Niharika for writing in!

    ReplyDelete
  3. నాకు తెలిసిన ఒక జంటలో భార్యది క్రిమినల్ బ్రెయిన్, భర్త మూర్ఖుడు. వాళ్ళిద్దరి సంస్కారం సమానం కాదు కానీ వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు.

    ReplyDelete
  4. సంస్కారం సమానం కాని వాళ్ళందరూ విడిపోతారని RN గారి రచనల్లో నేను చదివినట్టు జ్ఞాపకం లేదు.
    కాకపొతే, ప్రేమవివాహాలు చేసుకునే వారు, సమాన స్థాయి సంస్కారం కల వారు కూడా అయితే - వారి ప్రేమ స్థిరం గా నిలబడుతుంది.ఈ అర్ధం వచ్చెట్టుగా ఆమె రాసారు అనుకుంటున్నా.

    ReplyDelete
  5. @ Marxist Hegilian,
    గబ్బర్ సింగ్ కూడా చేతిలో గన్ను పెట్టుకుని తిరుగుతున్నాడు అలాగని అతనిది క్రిమినల్ బ్రెయిన్ అని అనగలమా ? ముగ్గురుపెళ్ళాలను చేసుకున్నాక ఆ మాత్రం సేఫ్టీ చూసుకోవద్దా ? మీతో వాదించలేనివాళ్ళు మిమ్మల్ని కూడా మూర్ఖులని అంటారు. మీరు పెళ్ళికి పనికిరారా ? స్త్రీవాది అన్ని చెప్పుకున్నాక స్త్రీలను క్రిమినల్ బ్రెయిన్ అనకూడదు. తెలివిగలది అనాలి. కాస్తంత తెలివిగా మాట్లాడితే క్రిమినల్ బ్రెయిన్ అనీ కాస్త అమాయకంగా మాట్లాడితే తింగరి బుచ్చి అనీ స్త్రీలనే ఎందుకు టార్గెట్ చేస్తారు ?

    ReplyDelete
  6. Even over smart (ati telivi) are not criminals.

    ReplyDelete